సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అఫనాశీ నికితిన్
అఫనాశీ నికితిన్ :- రష్యా దేశములోని క్వెర్ నగరనివాసియైన అఫనాశీ నికితిన్ అను వర్తకుడు, హిందూ దేశమునకు యాత్ర కావించిన ఐరోపీయులలో నొకడు. హిందూ దేశమును గూర్చియు, ఇచ్చటి జనులను గూర్చియు ఆ కాలములోని రష్యా ప్రజలలో చిత్ర విచిత్రమైన అభిప్రాయములు వ్యాపించి ఉండెడివి. అనేక నదులను దాటి, సముద్రములను తరించి, పర్వతములను అధిగమించి, ఎన్నో కష్టముల కోర్చి హిందూ దేశమునకు అఫనాశీ వచ్చెను. ఇచ్చట తాను కనులార గాంచిన వింతలను విశేషములను అతడొక గ్రంథముగ వ్రాసెను. ఆతని దినచర్యాత్మకమైన ఆ గ్రంథము పేరు "మూడు సముద్రములు దాటి నేను కావించిన యాత్రలు " అనునది.
అఫనాశీ 1469 మొదలు 1472 వరకు హిందూదేశములో ఉండెను. ఆనాలు గేండ్లలో ఆతడు తాను గాంచిన విశేషములను వ్రాసియుంచిన దినచర్యగ్రంథము చరిత్రకారులకు అత్యంతోపయుక్తమైనది. ఆకాలమునాటి ఐరోపీయు లెందరో వ్రాసిన విషయములకంటె అఫనాశీ వ్రాసిన యంశము లెంతో సానుభూతిని, సూక్ష్మ గ్రహణ శక్తిని, వివేచనను వ్యక్తీకరించుచున్నవి.
రష్యను చారణులు, అనాడు తమ దేశములో వ్యాపారాదులు కావించు విదేశీయులందరి పేర్లు, ఊర్లు, కీర్తి ఉగ్గడించుచు, పాటలు వ్రాసి, గానము చేయుచుండెడి వారు. వాటిలో అనేక హిందూ వర్తకుల పేర్లు కనబడు చున్నవి.
వోల్గానదిమీద పడవ ప్రయాణముచేసి, కాస్పియను సముద్రము చేరుకొని, అచ్చటినుండి డెర్మెంట్, బకూ రేవులమీదుగా పర్షియా దేశమునకును, అచ్చటినుండి హిందూదేశమునకును అఫనాశీ ప్రయాణము చేసెను.హిందూ దేశములో పర్యటన కావించుచు నాలు గేండ్లుండి, తిరుగు ప్రయాణములో త్రివిజోంద్ మీదుగ,నల్ల సముద్ర తీరముననున్న జెనోవా వర్తకస్థావరములకును, అచ్చటినుండి త్వెర్ నగరమునకును అతడు పోదలచెను. కాని తన జన్మస్థానము చేరకుండగనే, మార్గమద్యములో అఫనాశీ మృత్యువుపాల బడెను.
అఫనాశీ పారసీక దేశములో గుఱ్ఱములనుకొని వాటిని హిందూదేశమునకు తీసికొని వచ్చెను. వాటి కిచట మంచి గిరాకీ కలదని యాతడు తెలిసికొనెను. హిందూదేశము నుండి రంగు దినుసులను, సుగంధద్రవ్యములను తీసికొని పోవలెనని ఆతని ఉద్దేశము. కాని స్థలమార్గమున ప్రయాణముచేసిన యెడల త్రోవపొడుగునను పన్నులు చెల్లింపవలసి వచ్చుననియు, సముద్రమార్గమున పోయిన యెడల పన్నుల బాధ లేకున్నను ఓడదొంగల చేతులలో పడి సర్వ నాశనమగుట తప్పదనియుతాను ఆకుల పడియున్నట్లు అఫనాశీ తన దినచర్యాగ్రంథములో వ్రాసికొనెను.
తన దీర్ఘమగు యాత్రా సందర్భములో ఆశ్చర్యకరములయిన విషయముల నన్నిటిని అతడు వ్రాసి యుంచెను. హిందూదేశములోని జంతువులు, పక్షులు, జనులు, దేవాలయములు, రాజభవనములు, ఆచార వ్యవహారములు, వాతావరణము మున్నగు విషయముల నన్నిటినిగూర్చి అఫనాశీ తన దినచర్యలో వ్రాసియుంచెను.
ఉత్తర హిందూస్థానములోని ఒక స్థానిక ప్రభువును గూర్చి ఆతడిట్లు వ్రాసెను : “ఈ రోజు భవనమున కేడు ద్వారము లున్నవి. ఒక్కొక్క ద్వారముకడ నూర్గురు భటులు కావలియుందురు. రాజభవనము అద్భుతముగను,మహా వైభవోపేతముగను ఉన్నది. భవనపు లోపలి భాగమంతయు బంగారునీటి మలామా చేయబడి యున్నది. కుడ్యముల నిండ చిత్రములు కలవు. శిలలపై నగిషీ పని కలిగిన బంగారు రేకులు పొదిగి యున్నారు. రాజు లోభికాడు. ఆయన కెందరో భార్యలు కలరు ఆతని సైన్యములో పదివేలమంది ఆశ్వికులు, ఏబది వేల కాల్బలము బంగారు అలంకారములు గల ఇన్నూరు ఏనుగులు కలవు. రాజు ఏనుగు పై ఊరేగుచున్నప్పుడు ఆయన ముందు నూర్గురు కాహళముల నూదువారు, రెండు వందలమంది నాట్యక త్తెలు, బంగారు జీనులుకల గుఱ్ఱములపై నెక్కిన మున్నూర్గురు ఆశ్వికులు, నూరు వానరములు, ఇతర పరివారమును నడచుచుండుట కాననగును.
అన్నిటిని మించి ఒక పవిత్ర క్షేత్రములోని బుద్ధ దేవుని మహా దేవాలయము ఈ విదేశీయ యాత్రికుని ముగ్ధుని చేసెను. "బుద్ధ దేవాలయము చాల పెద్దది. విశాలమైనది. ఆ దేవాలయము రష్యా దేశములోని త్వెర్ నగరమంత విశాలమైనది. ఆ దేవళము శిలా నిర్మితమైనది. ఆ శిలలపై బుద్ధదేవుని పవిత్ర కథలన్నియు చెక్కబడి యున్నవి. ఆ మహాత్ముడు ఎన్ని జన్మ లెత్తెనో, ఏయే అవతారములను దాల్చెనో, ఎన్నేన్ని అద్భుత మాహాత్మ్యములను కావించెనో, ఆ వివరము లన్నియు శిలలపై చిత్రించబడినవి. ఒకప్పుడు మానవా కారముతోను, ఇంకొకప్పుడు గజాననాకారముతోను, మరొకప్పుడు వానరాకారముతోను, మరికొన్ని సందర్భములలో భయంకరమైన మృగ శిరస్సుతోను, ఏడడుగుల వాలముతోడను— ట్లె ఎన్నెన్నో రూపములతో ఆ దేవుడు ఈ శిలా శిల్పములలో కన్పించును. బుద్ధ దేవుని అద్భుత జన్మవిశేషములను సందర్శించుటకు, హిందూదేశ మంతటినుండియు అసంఖ్యాక జనులు ఈ దేవాలయమునకు వత్తురు. రాతిలో చెక్కబడిన ఒక మహోన్నతమైన బుద్ధ విగ్రహ మిచ్చట కలదు. ఆ శిలామూర్తి చేయియెత్తి నిలచియుండును. ఆయన తోక శరీరమును చుట్టబెట్టుకొని యున్నది. ఆయన ముఖము వానర ముఖమువలె నున్నది. బుద్ధుని ఎదుట నల్లరాతిలో మలచిన మహోన్నత మగు వృషథమొకటి కలదు. ఈ వృషభముపై బంగారు నీటితో చక్కని అలంకారములు చిత్రింపబడి యున్నవి. ఎందరెందరోవచ్చి, ఈ వృషభ రాజము యొక్క కాలి గిట్టను ముద్దిడుకొని, దానిని, బుద్ధుని పుష్పములతో పూజించి, పోపుదురు.”
ఈ విదేశీయుడు హనుమంతుని విగ్రహమునుచూచి బుద్ధ విగ్రహమని పొరబడియుండును. హిందూదేశములోని వివిధ దేవతా విగ్రహములను గుర్తించుటలో విదేశీయులు పలువురు ఇళ్లే తికమకలు పడుచుందురు. ఏది యెట్లున్నను అఫనాశీ నికితిన్ యొక్క దినచర్య గ్రంథము నేటికి అయిదు శతాబ్దములనాటి భారతీయ దృశ్యములను మనముందుంచి ఎంతయో చారిత్రక ప్రాముఖ్యమును వహించుచున్నదనుటలో సందేహము లేదు.
మ. జ. రా.
[[వర్గం:]]