సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అన వేమారెడ్డి
అన వేమారెడ్డి :
"తన బ్రతుకు భూమిసురులకుఁ
దనబిరుదులు పంటవంశ ధరణీశులకున్
తననయము భూమిప్రజలకు
నన వేమన యిచ్చెఁ గీర్తి నధికుం డగుచున్ "
అని కీర్తింపబడిన మహాధార్మికుడు, ధర్మవేమన యని ప్రసిద్ధివహించిన అనవేమారెడ్డి. అతడు ప్రోలయ వేమా రెడ్డి కుమారుడు. కొండవీటిరాజగు అనపోతా రెడ్డితమ్ముడు. అనపోతా రెడ్డి అనంతరము అతనికుమారుడు కుమారగిరి రెడ్డి బాలుడగుటచే గాబోలు అనవేమారెడ్డి పైతృకమగు కొండవీటి సింహాసనమును అధిష్ఠించెను. కొండవీటి రెడ్డి ప్రభువులలో ఉత్తముడగు నీతడు వారసత్వపుటధికారము కంటె రాజ్యక్షేమమే ప్రధానమని భావించెను. శాసనములలో నితడు “ మహనీయాంధ్రదేశ పట్టాభిషేక సంవృత మహాభాగ్యు " డని వర్ణింపబడినాడు.
" సోయం భ్రాతురనంతరమ్ నిజమహీభారమ్ వహన్ పైతృకమ్
రాజ్య శ్రీరమణీ స్వయంవరపతిః శ్రీ అన్న వేమప్రభుః "
అనియు "రాజ్యరమారమణీ స్వయంవరలబ్ద నాయక సౌభాగ్యు " డనియు, శాసనగత శ్లోకములచే కీర్తింపబడిన ఈ అన వేమనృపతి, రాజ్యలక్ష్మి స్వయముగా కోరి వరించిన పతి యని భావింపవచ్చును.
శూరాగ్రగణ్యుడయిన అన వేమా రెడ్డి " క్షురికా సహాయు " డనియు, "కరవాలవైనతేయు " డనియు, "విక్రమపంజర నిగృహీత రిపురాజసింహు " డనియు కీర్తింపబడినాడు. పై బిరుదు లన్నియు బాహుబలశాలియైన ఈతని విజయప్రస్థాన గౌరవ చిహ్నములు కావచ్చును.
రాజ్యారంభమున మొదటి రెండుసంవత్సరములు ఈ వేమనృపతి తనరాజ్యమును సుస్థిరము గావించుట యందు గడిపి, పెక్కు సైన్యములను కూర్చుకొని శా. శ. 1294లో తన సీమావధులను దాటి, తన అన్న అనపోతనృపతికి స్వాధీనముకాని గోదావరి పర్యంత దేశమునందలి స్వతంత్రులగు మండలేశ్వరులను అణచి తద్దేశములను స్వాధీనము చేసికొనుటకై బయలు దేరెను. అనపోతా రెడ్డి బాహుబల దర్పముచే జయించిన "దివిసీమ" ను పద్మనాయకులు విజృంభించి స్వాధీనపరచుకొనిరి. ఆవిధముగ పరాయత్త మయిన "దివిసీమ" ను ఈతడు మున్ముందే జయించి “దివిదుర్గ విభాల" అను బిరుదు నొందెను. తరువాత శూరవరపట్టణము రాజధానిగ నేలిన ఉండిరాజులను, కామవరము రాజధానిగ నేలిన భక్తి రాజును ఇతడు జయించెను. పిమ్మట ఇతనిదృష్టి నిరవద్యప్రోలు వైపు మరలెను. నేటి పశ్చిమగోదావరి జిల్లాయందలి నిడదవోలుపురమే నాటి "నిరవద్యప్రోలు". తురుష్కక్రమణకు పూర్వము కాకతీయ చక్రవర్తుల బలవత్తరమగు కోటలలో ఇది యొకటిగా నుండెను. తరువాత అన్న దేవచోడున కిది ప్రధానదుర్గముగా నుండెను. అన్న దేవచోడునకును అన వేమా రెడ్డికిని జరిగిన యుద్ధమునందు అనవేమునకు ఈదుర్గము స్వాధీన మయ్యెను. ఈదుర్గవిజయముతో అన వేమునకు అన్న దేవునిరాజ్యము స్వాధీనమగుటయేగాక, గోదావరియొక్క ముఖ్యశాఖలగు వాసిష్ఠ, గౌతమి అను నదుల మధ్యస్థమగు సారవంతమైన ప్రదేశము లీతనివశ మయ్యెను. క్రీ. శ. 1374 నాటి వాదపుర శాసనమువలనను, ద్రాక్షారామశాసనమువలనను, వానపల్లి తామ్రశాసనముమూలమునను, గౌతమీనదీ సాగరసంగమ స్థానమున నున్న కోనసీమ, పానారుసీమ (నేటి రాజోలు తాలూకా) అన వేమునకు వశపడినట్లు గ్రహింపవచ్చును తనవశమయిన కోనసీమయందలి "నడుపూరు" గ్రామమును వేమవరమను పేరుతో చంద్రగ్రహణ సమయమున తనచెల్లెలు వేమసానికి పుణ్యము చేకూరుటకుగాను బ్రాహ్మణులకు దానము చేసి, ఈ ప్రభువు శాసనము వేయించెను. విజయవంతములగు పై దండయాత్రలయందు ఇతనికి సహాయపడినవారు రెండవ కాటయరెడ్డి, రెండవ మారయరెడ్డి, దొడ్డారెడ్డి, దువ్వూరి వంశస్థులు మున్నగువారు.
ప్రథమ సంగ్రామములందు విజయలక్ష్మిని చేపట్టిన రెడ్డి సేనలు అధికతర జయోత్సాహముతో గోదావరిని దాటి ముమ్మడి నాయకుని రాజ్యసౌధమునకు మూలస్తంభము వంటి రాజమహేంద్రవరదుర్గమును ముట్టడించెను. ఈ యుద్ధ ఫలితముగా రాజమహేంద్రవరదుర్గము అన వేమారెడ్డికి వశమయ్యెను. మంచికొండదొరలు ఆతనికి సామంతులైరి.
రాజమహేంద్రవర విజయముతో నిరాటంకముగా అనవేమారెడ్డి తన సైన్యములను దక్షిణ కళింగమునందలి సింహాచల పర్యంతము నడపెను. దుర్గమారణ్య పర్వత పరిరక్షితమయిన ఈ ప్రదేశమును అనాగరకజాతులకు నాయకులయి వీరసామంతులని పిలువబడు మన్నెదొరలను వశపరచుకొని అన వేమా రెడ్డి తన కాలము నాటి వీరులలో మేటిగా గణన కెక్కెను.
గౌతమీతీరమునుండి ఉత్తరమున కళింగమువరకు వ్యాపించిన ఆంధ్రఖండమండలము అను భాగమునకు దొరలయి వీరసామంతులనబడిన కొప్పుల నాయకులను అన వేమారెడ్డి జయించెను. శారదానదీతీరమందలి వడ్డాది రాజధానిగ సింహాచల ప్రాంత దేశమును పాలించుచున్న మత్స్యవంశస్థుడగు వీరార్జున దేవునికూడ ఇతడు జయించెను. వారలచే కప్పములను గొనెను. అనవేమా రెడ్డి గొప్ప విజేత. ఇతడు "సింహాచలాది వింధ్యపాద ప్రతిష్ఠిత కీర్తి స్తంభు" డని పొగడబడెను. కాని ఇతడు బ్రతికియున్నంత కాలము రాచకొండ, దేవరకొండ దుర్గముల కధిపతులయి, రాచకొండ రాజ్యమును పరిపాలన చేయుచుండెడి అనపోత మాధవనాయకు లొకవంకను, విజయనగర ప్రభువు లొకవంకను ప్రబల విరోధులయి ఇతని రాజ్య మాక్రమించుకొనవలయు నని ప్రయత్నములు సతతము గావించుచునే యుండిరి. ఇతడు ప్రజాపరిచిత చతుర్విధోపాయుడు. కందుకూరు మొదలుకొని విశాఖ పట్టణమండలములోని సింహాచలపర్యంత దేశమును జయించి, ఈతడు పరిపాలన చేసినట్లు ఊహింపవచ్చును. శ్రీ శైలాది శాసనములందు కానవచ్చు బిరుదములలో కొన్ని వంశపారంపర్యముగా ఇతనికి సంక్రమించినవియే అయినను " రాజమహేంద్ర, నిరవద్యనగరాది బహువిధ స్థలదుర్గ వర్గ విదళన బలరామ". "సాగర గౌతమీ సలిల సంగమ సకల జలదుర్గ సాధన రఘురామ ' అనునవిమాత్రము ఇతని ప్రత్యేక బలప్రాభవములకు నిదర్శనములయి ఇకడు సాగించిన విజయ ప్రస్థానముల జయగౌరవచిహ్నములయి ఒప్పుచున్నవి.
ఇట్లు దిగ్విజయాలంకృతుడయి, ప్రజాహిత కారియై
"భూమీశే చిర మన్న వేమనృపతౌ భూయో లభంతే జనాః
మృగ్వన్నం మృదులాంబరం మృగమదం చామీకరం చానురమ్ ”
అను పొగడ్తకు పాత్రుడయి అన వేముడు ప్రజాపరిపాలన మొనర్చెను.
ఇతడు ఆగమశైవాచార పరాయణుడు. షట్కాలము అందు శివపూజ చేయు భక్తుడు. అనవేముని రాజ్యము శాంతి యుతమయి పాడిపంటలతో, ధనకనక వస్తు వాహనములతో తులదూగుచుండెను. ఇతడు గొప్పరసికుడు. కస్తూరీ, కుంకుమ, ఘనసార, సంకుమద, హిమాంబు, కాలాగరు, గంధసారములతో కవి, వాంశిక, వైతాళి కాదులకు ఉత్సాహ మధికమగునట్లుగా వసంతోత్సవము (మదనోత్సవము)లను జరిపి వసంతరాయడని పిలువబడెను.
అన వేమభూపాలుడు విద్యాభిమాని అనియు, పండిత పక్షపాతి అనియు, కవుల పాలిటి కల్పతరు వనియు అనేకములగు చాటుశ్లొక ములవలనను, పద్యములవలనను తెలియుచున్నది. ఇతనికాలమున బాలసరస్వతి విద్యాధి కారిగ నుండెను. తరువాత త్రిలోచనాచార్యుడు అను కవీశ్వరుడు శాసనాచార్యుడుగ కానవచ్చును. ఉప్పుగల్లు తామ్రశాసనమునకు బాలసరస్వతి కర్త. ఇమ్మడిలంక, వానపల్లి తామ్రశాసనములకు త్రిలోచనాచార్యుడు కర్త. ప్రకాశ భారతయోగి అను మరియొక ఆంధ్రకవీశ్వరుడు ఈ మహీపాలుని ఆస్థానమునందున్నట్లు తెలియుచున్నది. ఇతడు తన దాయాదుల చేతగూడ పొగడబడెను. కుమారగిరి పరపతిశాసనములో ధర్మతత్పరుడనియు, కాటయ వేమారెడ్డి శాసనములో సుజనుడనియు, కోమటి వేమారెడ్డి శాసనములో "విశ్వోత్తరుం”డనియు అన వేముడు పేర్కొనబడెను.
అన వేమారెడ్డి గొప్ప వితరణశీలుడు. తన తండ్రియగు ప్రోలయ వేమభూపాలునివలెనే బ్రాహ్మణ వృత్తులను, ధర్మములను కాపాడుటయేగాక, శ్రోతస్మార్త విద్యలను ప్రోత్సహించుటకై బ్రాహ్మణులకు అగ్రహారములు భూములు దానముచేసిన మహాదాతఇతడు. ఈ విషయమున అనేకశాసనములు ప్రమాణములు. “బహు సహస్రసువర్ణ దానసంతోషితమహాకవీశ్వరు" డనియు "బ్రహ్మాండదాన, కల్పతరుదాన, గోసహస్రదానవరు" డనియు ఈతనిని ప్రజలు విస్తారముగ కీర్తించియున్నారు. శ్రీశైలకుమారాచల పంచారామములందు తనగోత్రనామములతో నిత్యనై వేద్యములకు ఇతడు ఏర్పాట్లుచేసెను. "కాశిలో శ్రీ విశ్వేశ్వరునకును, సింహాచలమునందు విష్ణువునకును కైంకర్యార్థమై తుల్యభక్తితో ఇతడు భూదానాదికములను కావించెను.
వీరాన్న వేమనృపతి అని పేరుగాంచిన ఇతడు కులక్రమాగతులయి రాజనీతినిపుణులైన మంత్రి దండనాథుల సహాయముతో క్రీ. శ. 1364 నుండి 1386 వరకు అఖండ వైభవముతో రాజ్యమేలి యుద్ధమునందు వీరస్వర్గము నలంకరించెను.
పి. య. రె.