సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అనపోతారెడ్డి

అనపోతారెడ్డి : – (క్రీ. శ. 1350-1362) ప్రోలయ వేమా రెడ్డి అనంతరము అతని జ్యేష్ఠ కుమారుడు పోతారెడ్డి అద్దంకి సింహాసనమును అధిష్ఠించెను. "వీ రాన్న పోతనృపతి" అను బిరుదమును వహించిన ఈతడు తన తండ్రి కాలముననే యువరాజుగనుండి, రాజనీతియందు అసమానమైన ప్రావీణ్యముగల మహామంత్రుల చేతను- యుద్ధనీతి విశారదుడైన పినతండ్రి మల్లా రెడ్డి చేతను సుశిక్షితుడై యుండెను.

పట్టాభిషిక్తుడగుటకు పూర్వమే సంపూర్ణ పరిపాలనా పాటవమును ఆర్జించిన ఈతడు తాను ప్రభువై "పటుః పాలన కర్మణి" అను బిరుదము సార్థకమగునట్లు ప్రభుత్వమును నెరపెను. సప్తవిధ రాజ్యాంగములలో అతిముఖ్యమయిన దుర్గరచనా ప్రాముఖ్యము నెరిగిన ఈతని నీతి కౌశలమునకు పితృక్రమాగతమయిన అద్దంకి అను రాజధానిని కొండవీటికి మార్చుటయే ప్రబల నిదర్శనము. ఉత్సాహవంతుడై కృష్ణా గోదావరీ నదీద్వయ మధ్యస్థమయిన దేశమును జయించుటకు ఉవ్విళ్ళూరుచున్న అన పోతా రెడ్డికి శత్రుదుర్భేద్యమగు దుర్గమొకటి ఆవశ్యకమై యుండెను. కాని అద్దంకి చిన్న నగరమగుట చేతను, అందు బలమైన దుర్గములు లేకుండుటచేతను, తూర్పు పడమరలందు సంగమ వంశీయులు, కాపయనాయకాదులు బలవంతులై యుండుట చేతను, అనపోతా రెడ్డి కొండవీటి దుర్గమును యంత్రసనాథముగ జేసి, సౌందర్య యుతమును, నివాసయోగ్యమును అగు నొక నగర నిర్మాణము గావించి తన రాజధానిని అచ్చటకు మార్చెను. తాను సింహాసనారూఢుడైన మూడు నాలుగు సంవత్సరములలోనే అనపోతా రెడ్డి బహుళ సైన్యములను కూర్చుకొని కృష్ణను దాటి విజయయాత్రకై బయలు దేరెను. రాజ్యధురంధరుడైన అనపోతా రెడ్డికి తన బంధువుల సహాయ సహకారములు అధికముగ లభించెను. దండయాత్రా సందర్భములందు ఇతనికి తన తోబుట్టువుల భర్తలును, సేనాపతులును అయిన నల్ల నూకయ రెడ్డియు, విధేయుడును, ప్రచండ సేనానియునగు అనవేమా రెడ్డియు మిక్కిలి తోడ్పడిరి.

క్రీ.శ. 1355వ సంవత్సరమునాటి ద్రాక్షారామ శాసనమొకటి ఇతని విజయములను ప్రశంసించుచున్నది. అందు ఇతడు 'ద్వీప జేత' గా పేర్కొనబడెను. వైరివీరమద భంజనుడను ప్రశస్తిని గడించిన ఇతనిరాజ్యము సర్వదా శత్రుకంటకమై, సాటివీరులకు కబళింపవలయునను కుతూహలమును గలిగించుటచేత, దక్షిణము నుండి కర్ణాటకులును పశ్చిమము నుండి పద్మనాయకులును ఈ రాజ్యము నాక్రమింపవలయునని ప్రబల ప్రయత్నములు సలుపుచుండిరి. ఈ రేచర్ల పద్మనాయకులు కాపయనాయకుని సామంతులు. వీరి నాయకరములు, ఆధిపత్యములు తెలంగాణాలోని కైలాసకోట, ఇందూరు, మెదకు ప్రాంతముల యందుండెను. ఈ రేచర్ల నాయకులగు అనపోతా నాయకునితోను,మాదానాయకునితోను అనపోతారెడ్డికి పోరు సంప్రాప్తమైనప్పుడు అనపోతారెడ్డి యొక్క గజ, హయ,రఖాది సాధనములన్నియు హతము కాగా, అతడు ప్రాణ రక్షణమునకై పారిపోయెనని వెలుగోటివారి వంశావళి పేర్కొ నుచున్నది.. కాని తదితరాధారములవల్ల ధాన్య వాటి పురము యొక్క ముట్టిడి సందర్భములో అనపోతా రెడ్డి ప్రచండ విక్రమార్కుడై భూరిసైన్యములతో వారల నెదుర్కొని ఘోర సంగ్రామమును నిలిపి శత్రువులను కృష్ణానది కావలిప్రక్కకు తరిమి పరాభవించెనని తెలియుచున్నది. ఈ సందర్భమునందు విజేత లెవ్వరైనను, రేచర్ల పద్మనాయకులకు మాత్రము ఆ రాజ్యము లభింపలేదనుట నిశ్చయము.

క్రీ శ. 1358 వ సం. నాటికే అనపోతా రెడ్డి దివిసీమను, గుడివాడ విషయమును, ప్రస్తుతపు బందరు తాలూకా ప్రదేశములను ఆక్రమించుకొని పాలించుచుండె ననుటకు నిదర్శనములు గలవు. శాలివాహన శకము 1280 వ సంవత్సరమున అనపోతారెడ్డి 'కొల్లూరు' గ్రామమును " అనపోతాపురము ” అను "పేరుతో బ్రాహ్మణులకు సర్వాగ్రహారముగ దాన మొసగెను. ఈ విధముగ కృష్ణా గోదావరి మధ్యస్థ దేశమును జయించుటకు సైన్యముల నడిపిన వీరాన్న పోతన్న పతికి కొన్ని దేశములు స్వాధీనపడియు, కొన్ని కొంతవరకే చేజిక్కియు, కొన్ని అధికతర నిరోధమును కల్పించియు చేజిక్కినవి. అట్లు స్వాధీనపడిన దేశాధిపతులలో భక్తి రాజులు, ఏరవచోడులు,కోన హైహయులు, మానవ్యస గోత్రీకులగు చాళుక్యులు, ఉండీశులు ముఖ్యులు. కొన్ని శాసనములలో అనపోతా రెడ్డి “కృష్ణాతటము నుండి 'గౌతమీ తీరమువరకును రాజ్యమును పాలించినటుల" కానవచ్చుచున్నది.

శ్లో॥ జిత్వా శ్రీ అనపోతభూతలవతి ర్వీరా నరాతీన్ బలా
దాకృష్ణాతటినీతటా ద్భువ మవ త్యాగౌతమీస్రోతసః॥
ఆవింధ్యా దితి యత్క వీంద్ర వచనం తస్యావధానస్తుతౌ।
ప్రత్యబ్దం ప్రతిపక్ష దేశజయిన స్త త్పూర్వపక్షాయ తే ॥

చారిత్రకాధారములవల్ల పై విషయము నిరూపితము కాకపోయినను అనపోతారెడ్డి ప్రత్యబ్దము ప్రతిపక్ష, దేశమును జయించుటకు దాడిసల్పుచుండుట మాత్రము నిశ్చయముగ కానవచ్చును.

అనపోతా రెడ్డి కాలములో జరిగిన గొప్ప విషయ మొకటికలదు. అది మోటుపల్లి రేవు సంస్కరణము. అది ఆతని పరిపాలనా కౌశలమును చాటును. అతని శాసనములలో " ముకుళాహ్వయ" పురమనియు, ముకుళ పురమనియు; కాకతీయుల కాలములో వేలానగర మనియు, " ధేన్సూయక్కండ " పట్టణమనియు పిలువబడి మార్కోపోలోచే ' మొటఫిలి' అని ప్రశంసింపబడిన రేవు పట్టణమే ఈ మోటుపల్లి. ఇది పురాతనకాలమునుండియు వర్తకస్థానమై మీదుమిక్కిలి నౌకావ్యాపారమునకు ప్రధానస్థానముగ నుండి, మహాప్రసిద్ధి కెక్కిన రేవుపట్టణము. వివిధ ద్వీపాంతములనుండి వ్యాపారము ఈ రేవు ద్వారమున జరుగుచుండెను. కాని కాకతీయ సామ్రాజ్యము తరువాత అస్తమించిన మోటుపల్లినుండి వర్తకులు పరస్థలముల కేగుటయు, వ్యాపారము తగ్గుటయు తటస్థించెను. ఈ రేవు పట్టణమును వృద్ధికి తీసుకొని రావలయునని సంకల్పించిన అన పోతారెడ్డి మోటుపల్లి రేవునకు విజయము చేసి యాత్రికుల (ఓడవ ర్తకుల) బాధలు విచారించి ధర్మశాసన స్తంభ మొకదానిని నెత్తించెను. ఇతని ఆజ్ఞ ప్రకార మితని మంత్రులలో నొకడగు సోమయామాత్యుడు వర్తకులందరికిని అభయప్రదానము గావించెను. ముకుళపురమునకు ఏ వర్తకులు వచ్చి నివసింప గోరినను, వారిని గౌరవించి, వారలకు భూములను, నివేశన స్థలములను ఇప్పింతుమనియు, పన్నులకై వారి సరకులను సంగ్రహింపమనియు, వారు మరియొక స్థలమునకు పోదలచుకొన్నపుడు, వారిని నిర్బంధ పెట్టి నిలువక స్వేచ్ఛగా పోవిడుతుమనియు శాసనము వ్రాయించి ప్రకటించెను. కొన్ని వస్తువులపై సుంకముల తీసి వేసియు, మరికొన్నిటిపై సుంకములను కొంతవరకు తగ్గించియు మరికొన్నిటిపై పూర్వపు మర్యాదలను పాటించియు, బంగారునకు సుంకము తీసివేసియు వర్తకులకు అతడు ప్రోత్సాహము నిచ్చెను.

తురుష్కా క్రాంతమై, విప్లవ యుతమైన ఆంధ్రదేశము నందు నశించిన కర్షకకృషిని, పతనమొందిన వణిజుల వాణిజ్యమును ఈ విధముగ పునరుజ్జీవింప జేయుట చేత అనపోతారెడ్డి పరిపాలనము సర్వజన రంజకమై శ్లాఘా పాత్రమైనది.

తండ్రివలె ధర్మమార్గానుయాయియైన అనపోతారెడ్డి "రాజ్యం ప్రాజ్యం సుహృద్భాజ్యం యఃకురుతేఽర్థినాం” అని శాసనములందు ఉల్లేఖింపబడినట్లుగ తన రాజ్యము నందలి ముఖ్య పదవులలో బంధువులను, స్నేహితులను నిలిపి రాజ్యతంత్రము నడిపెను.

వైదిక ధర్మ సంస్థాపనమే ఆశయముగాగల ఈ అనపోత మహీపతి ఆర్యధర్మములను అత్యంతాభిమానముతో పోషించెను. యవనులచే అపహరింపపడిన అగ్రహారములను పునరుద్ధరించుటయేకాక, వేదాధ్యయన సంపన్నులైన బ్రాహ్మణో త్తములకు తాను అనేక అగ్రహారములను దానమొనర్చెను. పూర్వ నృపాలురచే చిర కాలము క్రింద అపహరింపబడిన కృష్ణాజిల్లాయందలి గుడివాడ తాలూకాలోని ఉప్పుగల్లు తిరిగి పూర్వపు టగ్రహారికులకు చెందునట్లు చేసెను. వినుకొండ సీమలోని నాగళ్ళ అను గ్రామమును శా. శ. 1278 లో అనపోతయ రెడ్డిగారు "కొండు శాస్త్రులంగారికి అలవణం, అకరంగా సర్వాగ్రహారంగా ధారాగృహితం చేసెను” కోడితాడిపఱ్ఱు అను గ్రామమును శా. శ. 1246 లో జమ్మలమడక పురుషోత్తమ సోమయాజికి దానమిచ్చెను. ఈవిధముగ ధార్మికుడగు ఈ అనపోతా రెడ్డి హేమాద్రి దానఖండమున చెప్పిన ప్రకారము దానముల చేసియు; వైదిక, స్మార్త, జ్యోతిష, ఆయుర్వేదాది విద్యలకు ప్రోత్సాహమిచ్చియు కీర్తనీయ చరితుడయ్యెను.

సర్వజన ప్రియుడగు అనపోతారెడ్డికి కులక్రమాగతులును, రాజనీతిజ్ఞులును అగు మంత్రుల యొక్క సహాయసహకారములు అధికముగ నొడగూడినవి. ఇతడు రాజ్యమునకువచ్చిన ఒకటి రెండు సంవత్సరముల వరకు మల్లనయు, మల్లన స్వర్గస్థుడయిన తరువాత అతని పిన తమ్ముడును మంత్రులుగ నియుక్తులైరి. సోమయమంత్రి మోటుపల్లిని వృద్ధికి తెచ్చినవాడు. తరువాతివాడు కేశయ మల్లినాథ వేమన. ఇతడు కులక్రమాగతముగ మంత్రిత్వమును సేనాపతిత్వమును వహించెను. అనపోత మహీళ్వరునకు కుడిభుజమైయుండి, అతని పెక్కు విజయప్రస్థానములందు తోడుపడినవాడు ఇతడే. ఇతడే శా. శ. 1283, ప్లవ సం॥ శ్రావణ బహుళ పంచమీ గురువారమునాడు ధాన్యవాటిపురమునందు అనపోతయరెడ్డిగారికి ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి కొరకును, ధనకనకవస్తు వాహన సమృద్ధికొరకును, పుత్రపౌత్రాభి వృద్ధికొరకును అమరేశ్వరదేవుని పునఃప్రతిష్ఠించేను.

అనపోతా రెడ్డి యొక్క అస్థానము కవులతోను, జ్యోతిషికులతోను, ధర్మశాస్త్రవేత్తలతోను, వేదపండితులతోను నిండి యుండెను. ఇతని ఆస్థాన విద్వాంసుడు బాలసరస్వతి. అనపోతా రెడ్డి యొక్క శాసన కావ్యములను (శ్లోకములను) పెక్కింటిని కాలసరస్వతియే రచించెను. శాసనముల చివర "అనపోతనరేంద్రస్య బాలసరస్వతిః అకరోత్ నిర్మలం ధర్మశాసనం" అని ఇతడు లిఖించెడివాడు.

ఈ విధముగ అనపోతారెడ్డి వీరుడై, విజేతయై, ధార్మికుడై, ప్రభువై, ప్రజారంజకుడై ప్రసిద్ధిచెందెను.

పి.య.రె.