సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అద్వైతానంద తీర్థులు

అద్వైతానంద తీర్థులు :- వీరి పూర్వాశ్రమ నామము కురుగంటి సుబ్రహ్మణ్య చైనులు గుంటూరు మండలము నందలి తెనాలి తాలూకా వేమూరు వీరి స్వగ్రామము. వీరిది విద్వత్కుటుంబము, వీరి జననము క్రీ. శ. 1841 వ సంవత్సరము. తండ్రి పేరు మాధవ శాస్త్రి. తల్లి పేరు మహాలక్ష్మి. ఈయన హైదరాబాదులో నిజాంప్రభుత్వమునందలి ఆబ్కారీశాఖలో శిరస్తాదారుగా పనిచేసెను. ' ఇతడు సికింద్రాబాదులో ఉద్యోగిగా నున్న కాలముననే అగ్న్యాధానము, జ్యోతిష్టోమము, గరుడ చయనము అను వైదిక క్రతువుల నొనర్చి సుబ్రహ్మణ్య చైనులను పేరు వడసెను. ఈతడు గొప్ప విద్వాంసుడు, వేదాంత శాస్త్రవేత్త. క్రీ. శ. 1917 సంవత్సరమున ఆశ్రమ స్వీకార మొనర్చెను. ఈయన “అద్వైతానంద లహరి" అను పురుష సూక్త భాష్యము భగవద్గీతా తాత్పర్య దీపిక, బ్రహ్మసూత్ర తాత్పర్య దీపిక, ఛాందోగ్యోప నిషద్భాష్యము, పంచోపనిషత్తాత్పర్య దీపిక, బ్రహ్మసూత్ర భాష్యము అను గ్రంథములను రచించి యుండెను. ఈయన తన 85 వ యేట క్రీ. శ. 1926వ సంవత్సరము ఫిబ్రవరి నెలలో శివరాత్రి దినమున సిద్ధి పొందెను. కురుగంటి సీతారామయ్య ఈయన కుమారుడు.

కు. సీ.

అథర్వవేదము  :- వేదము లోకమునకు ధర్మాధర్మములను బోధించునది. వేదములు నాలుగు. అవి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వ వేదము అనునవి. ఈ నాలుగు వేదములలో 'త్రయీ' అను పేర బరగు మొదటి మూడును అథర్వవేదముకంటె పురాతనము లనియు, ఆ మూడే యజ్ఞములందు మొదట ఉపయోగమును గాంచుచుండెననియు, అథర్వవేదము తై త్తిరీ యారణ్యకాదులయందు ప్రశంసింపబడి యజ్ఞోప యోగియైన పిదప నాలుగవ వేదముగ పరిగణింపబడినదనియు చరిత్రకారుల ఆశయమై యున్నది. ఈ వాదమును ప్రాచీన పండితులు అంగీకరింపరు. శేషించిన మూడు వేదములతో బాటు అథర్వవేదము కూడ అనాదియే యని వారి యభిప్రాయము. అథర్వ భాష్య పీఠిక యందు ఈ వేదముయొక్క పురాతనత్వమును సాయణా చార్యులు స్థాపించియున్నారు.

అథర్వ సంహిత ఋగ్యజుస్సామ సంహితలకంటె అర్యాచీనమని భావింపబడుచున్నది. తైత్తిరీయారణ్యకము నందును, శతపథ బ్రాహ్మణము నందును, ఛాందో గ్యోపనిషత్తు నందును అథర్వవేదము పేర్కొనబడి యున్నది. ఋగ్వేద బ్రాహ్మణములలో ఈ సంహితా ప్రశంస కానవచ్చుట లేదు. తిలకు మహాశయుని వేద కాల పరిగణనమును బట్టి కృత్తికాయుగము (క్రీ. పూ. 3000-1400 వరకు యున్నది. అందు తైత్తిరీయ సంహితయు సామవేదమును, బ్రాహ్మణ గ్రంథములును క్రమముగా వెలసినవి. ఈ యంశములను సమన్వయించి చూడగా, అథర్వవేదము తైత్తిరీయ బ్రాహ్మణాదులకు సమకాలికముగ ఈ యుగమునందు సంహితాత్వము నొందెనని ఊహింపదగియున్నది. ఈ వేదము నందలి 19, 20 కాండలు మాత్రము ఇంకను అర్వాచీనముగ పరిగణింపబడుచున్నవి.

[[వర్గం:]] [[వర్గం:]]