సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అథర్వవేదము

అథర్వవేదము  :- వేదము లోకమునకు ధర్మాధర్మములను బోధించునది. వేదములు నాలుగు. అవి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వ వేదము అనునవి. ఈ నాలుగు వేదములలో 'త్రయీ' అను పేర బరగు మొదటి మూడును అథర్వవేదముకంటె పురాతనము లనియు, ఆ మూడే యజ్ఞములందు మొదట ఉపయోగమును గాంచుచుండెననియు, అథర్వవేదము తై త్తిరీ యారణ్యకాదులయందు ప్రశంసింపబడి యజ్ఞోప యోగియైన పిదప నాలుగవ వేదముగ పరిగణింపబడినదనియు చరిత్రకారుల ఆశయమై యున్నది. ఈ వాదమును ప్రాచీన పండితులు అంగీకరింపరు. శేషించిన మూడు వేదములతో బాటు అథర్వవేదము కూడ అనాదియే యని వారి యభిప్రాయము. అథర్వ భాష్య పీఠిక యందు ఈ వేదముయొక్క పురాతనత్వమును సాయణా చార్యులు స్థాపించియున్నారు.

అథర్వ సంహిత ఋగ్యజుస్సామ సంహితలకంటె అర్యాచీనమని భావింపబడుచున్నది. తైత్తిరీయారణ్యకము నందును, శతపథ బ్రాహ్మణము నందును, ఛాందో గ్యోపనిషత్తు నందును అథర్వవేదము పేర్కొనబడి యున్నది. ఋగ్వేద బ్రాహ్మణములలో ఈ సంహితా ప్రశంస కానవచ్చుట లేదు. తిలకు మహాశయుని వేద కాల పరిగణనమును బట్టి కృత్తికాయుగము (క్రీ. పూ. 3000-1400 వరకు యున్నది. అందు తైత్తిరీయ సంహితయు సామవేదమును, బ్రాహ్మణ గ్రంథములును క్రమముగా వెలసినవి. ఈ యంశములను సమన్వయించి చూడగా, అథర్వవేదము తైత్తిరీయ బ్రాహ్మణాదులకు సమకాలికముగ ఈ యుగమునందు సంహితాత్వము నొందెనని ఊహింపదగియున్నది. ఈ వేదము నందలి 19, 20 కాండలు మాత్రము ఇంకను అర్వాచీనముగ పరిగణింపబడుచున్నవి. ఈ వేదమునకుగల అధర్వవేదము, అధర్వాంగిరో వేదము, భృగ్వంగిరో వేదము, బ్రహ్మవేదము అను నాలుగు నామములలో మొదటి మూడు సంజ్ఞ లును ఆయా ఋషులు ప్రవర్తకులగుటను బట్టియు, కడపటిది యాగములందు ఈ వేదము బ్రహ్మ అను ఋత్విక్కు పఠింపదగిన దగుటనుబట్టియు వచ్చినవి. అథర్వవేదోత్పత్తినిగూర్చి గోపథ బ్రాహ్మణము, విష్ణు పురాణము మున్నగునవి వచించు కథలయందలి ముఖ్యాశయమును బట్టి విచారించినచో, భృగు మహర్షియు నధర్వ మహర్షియు అభిన్ను లనియు, అథర్వాంగిరో మహర్షులును వారి వంశీయులును ప్రధానులుగా ఈ వేద మావిర్భవించె ననియు తెలియవచ్చును. అయినను అథర్వ మహర్షి యు అతని సంతతివారును దర్శించిన సూక్తము లిందు అధిక సంఖ్యాకము లుండుటచే దీనికి అథర్వవేద మను సంజ్ఞ లోకమున విశేషముగ ప్రసిద్ధి నొందినది.

అథర్వ వేదము ఇతర వేదములవలెనే సంహిత బ్రాహ్మణము అను రెండు భాగములు కలిగియున్నది.'చరణ వ్యూహము' నుబట్టి అథర్వ వేదమునందు 12,300 మంత్రములు (ఋక్కులు) ఉన్నట్లు విదితమగుచున్నను, ఇప్పుడు కానవచ్చు శౌనకసంహితననుసరించి, దీనియందు 1739 సూక్తములును దాదాపు 6018 మంత్రములును మాత్రము గలవని తెలియుచున్నది.

ఇట్లు సంహితాభాగము కాక అథర్వ వేదమునకు అనుబంధరూపమున విశేషముగ వాఙ్మయము కలదు. అందులో బ్రాహ్మణములు, ఉపనిషత్తులు, సూత్రములు, సర్పవేదము, పిశాచవేదము, అసురవేదము, ఇతిహాస వేదము, పురాణవేదము అను అయిదు ఉపవేదములును, అనుక్రమణికలును వ్యాకరణ జ్యోతిష గ్రంథములును పేర్కొన దగినవి. అథర్వవేదమున కొక్క గోపథబ్రాహ్మణమే వాడుకలోనున్నది. ముండక, మాండూక్యాదు లగు ఉపనిషత్తులు 29 మాత్రమే కనబడును. ఉపవర్షాచార్యుడు అథర్వవేదకల్పములు అయిదు అని వచించెనని శ్రీ విద్యారణ్య యతీంద్రుడు తన భాష్యమున నుదాహరించెను. పంచపటలిక, సర్వానుక్రమణిక అను రెండు అనుక్రమణికలు ఈ వేదమునకు గలవు. వీటిలో రెండవ అనుక్రమణికకు బృహదనుక్రమణిక అనునది నామాంతరము. అథర్వవేద పరిశిష్టములు 22 వరకును గలవు. అథర్వవేదమునకు సంబంధించిన వ్యాకరణ గ్రంథములలో 'శౌనకీయ చతురధ్యాయిక' అను గ్రంథమొకటి కానవచ్చుచున్నది. దీనికి అధర్వణ ప్రాతిశాఖ్య మని పేరు. అథర్వణ జ్యోతిష గ్రంథ మొకటి కలదు. - అథర్వణ వేదశాఖలు తొమ్మి దనియు, తచ్చాఖా ప్రవర్తకులు తొమ్మిదిమంది అనియు చెప్పు పాఠము సార్థకము. తొమ్మిది శాఖలలో ముద్రిత- అముద్రిత -సంహితా పుస్తకరూపమున గనబడుచున్నవి. శౌనక పైప్పలాదక శాఖలు రెండే. ఈ శౌనక పైప్పలాదక శాఖలు – రెండింటియందలి చందోబద్ధములైన మంత్రములకు ఉదాత్తానుదాత్తాది స్వర నియమము కలదు. ఈ రెండింటిలో శౌనక శాఖకే భాష్య మేర్పడినది. శౌనక సంహితయందు 20 కాండములు కలవు. అందు ప్రతి కాండము కొన్ని ప్రపాఠకములుగాను, ప్రతి ప్రపాఠకము కొన్ని అనువాకములుగాను, ప్రత్యనువాకము కొన్ని సూక్తములుగాను విభజింపబడినది.

ఋగ్వేదమువలె ఈ వేదము కేవలము ఛందోమయము కాక గద్య పద్యాత్మకముగా నున్నది. 15, 16 కాండములు ఐతరేయాది బ్రాహ్మణముల గద్యమును పోలు గద్యముతో నిండియున్నవి. 16 వ కాండమునగల కొన్ని గద్య సూక్తములలో కొంతభాగము ఛందో మయమైనది కూడ కలదు. ఋగ్వేదమునందలి ఛందస్సులే కాక పురస్తా దృృహస్పతి, ప్రస్తారపంక్తి, బార్హత గర్భ త్రిష్టుప్పు, విరాడతి జగతి మున్నగు నూతన ఛందస్సులు కూడ కానవచ్చును.

అథర్వ సంహితయందు ప్రతిపాదింపబడిన విషయములు అనంతములు. ఇందు కొన్ని మంత్రములు జ్వరాదులు, గ్రహాదులు, వ్రణములు, కత్తిపోట్లు మున్నగు వాటివలన నేర్పడిన బాధలను తొలగింప సమర్థము లైనవి. కొన్ని మంత్రములు ఆయుస్సు, వర్చస్సు, యశస్సు మున్నగువాటి నభివృద్ధి నొనర్చునవి. కొన్ని మంత్రములు స్త్రీ పురుషు లొండొరులను వశపరచు కొనుట కుద్దేశింప బడినవి. కొన్ని కృషి కర్మాభివృద్ధికి ఉపకారకములై యున్నవి. వైవాహిక సంప్రదాయములను, గృహ్య సంస్కారములను, అంత్య సంస్కారము లను, పంచభూతములను, ఇంద్రియ నిగ్రహ విధిని, జీవాత్మ పరమాత్మల స్వరూపమును వర్ణించు మంత్రములును కొన్ని కలవు. ఋగ్వేదమునందు వలెనే అగ్ని, ఇంద్రుడు, ద్యావాభూములు, సవిత, వరుణుడు, ఉషస్సు మున్నగు దేవతలు ఈ వేదమునందును స్తోత్రములను బడసియున్నారు. వీరిని వేరువేరు దేవతలుగా పొగడుటయేకాక సర్వ ప్రపంచమునకును ఏకకర్త ఉన్నట్లైంచబడి, అయ్యాదిమతత్త్వము ఒకప్పుడు సూర్యరూపముగను, (13 వ కాండము) ఒకప్పుడు కాలరూపముగను, (16, 53, 54) ఒకప్పుడు బ్రహ్మచారి రూపముగను, ఇట్లు వేర్వేరు రూపములతో స్తుతింపబడి యున్నది. సృష్టియందలి స్వభావసిద్ధమైన శోభలను వర్ణించు సూక్తములు కొన్ని ఇందు ఉన్నతమైన కవిత్వ స్ఫూర్తికి నిదర్శనములుగా నున్నవి. ఇట్టి వాటిలో పృథ్వీ సూక్త మనునది మిక్కిలి కొనియాడదగినది. ఇందు సర్వాధార భూతమైన పృథ్వి 63 ఋక్కులు గల పెద్ద సూక్తముచే స్తుతింపబడినది. ఆభిచారిక విద్యయే ఈ వేదము యొక్క ముఖ్యలక్షణము. అందుచే నిందు శత్రువుల ఆయురారోగ్యాదులను హరించుటకును, వారిని నాశ మొనర్చుటకును, విరోధికృతములయిన ప్రయోగములను త్రిప్పుటకును, విరోధికృతమైన అపకారమునకు ప్రతీకార మొనర్చుటకును, విధింపబడిన మంత్రములు పెక్కులుకలవు. మొత్తముమీద ఇందు సర్వత్ర స్వీయ క్షేమారోగ్యములను, విరోధిజనుల అనారోగ్య నాశనములను కాంక్షించుచు, చేయు ప్రార్థనలే కాననగును.

సంగ్రహో క్తి చే – అథర్వవేదము, అనంతరకాలమున వెడలిన మంత్రశాస్త్రము, వైద్యశాస్త్రము, జ్యోతిశ్ళాస్త్రము మున్నగువాటికి మార్గదర్శకము. విశేషముగానిది ఐహిక సుఖములయు, స్వల్పముగా ఆముష్మిక సుఖములయు బోధకముగా వెలసినదనవచ్చును. ఇందు ఆనాటి వివిధ సాంఘికాచారములు, ముఖ్యముగా బ్రాహ్మణుల శ్రేష్ఠత, వై శిష్ట్యము, ఆనాటిజనులకు మంత్రము మున్నగు వాటిపై గల గొప్ప విశ్వానము ప్రత్యక్షమగుచున్నవి. ఆనాటి రాజులు సమగ్రముగ అథర్వవేద మంత్రప్రభావమును గుర్తించినవారై తమ ఆస్థానములందు అథర్వవేద పారుగులను గౌరవముతో పోషించుచు, అథర్వవేద మంత్రముల యొక్కయు తద్విదుల యొక్కయు సాయమున విరోధివర్గము యొక్క నాశనాదిక మును సాధించు చుండిరని తెలియుచున్నది.

"ప్రత్య క్షేణానుమిత్యావా !
     యస్తూపాయో న బుధ్యతే
ఏతం విదంతి వేదేన
     తస్మా ద్వేదస్య వేదతా"

అనుదానిని బట్టి ప్రత్యణాది ప్రమాణములచే తెలిసికొనుటకు శక్యముగాని అర్ధమును బోధించు అక్షరరాశి వేద మనబడు చున్నది. తాపనీయోపనిషత్తునందలి "ఋగ్యజు స్సామాథర్వాణ శ్చత్వారోవేదాః” (నృ. పూ. తా. 1); ముండకోపనిషత్తు నందలి “తత్రావరా ఋగ్వేదో యజుర్వేద స్సామవేదో ఒథర్వవేదః ;" ఇత్యాది వాక్యములచే వేదము ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదము అను నామములచే నాలుగు విధములుగ విభజింపబడుచున్నది. ఇట్టి వేదములకు అపౌరుషేయత్వమును పూర్వమీమాంసకులు సిద్ధాంతీకరించిరి. వీటి యందు పఠింపబడు మంత్రములు ఋక్కులు, సామములు, యజస్సులు అను భేదముచే మూడు విధములు.

పూర్వమీమాంసాశాస్త్రమునందలి

“తచ్చోద కేషు మంత్రాభ్యా" (జై - సూ-2-1-32)
"శేషామృక్ యత్రార్థవశేన పాదవ్యవస్థా"(జై సూ. 2.1.35)
"గీతిషు సామాఖ్యా"(జై సూ. 2.1.36)
"శేషే యజుశ్శబ్దః"(జై సూ. 2.1.37)

ఇత్యాది సూత్రములచే పాదబద్ధములగు మంత్రములు ఋఙ్మంత్రములనియు, గానయుక్తములగు మంత్రములు సామమంత్రములనియు, ఈ రెండింటికంటె భిన్నములగు మంత్రములు యజుర్మంత్రములనియు తత్తద్వేద లక్షణ ములు చెప్పబడినవి. శ్రీ విద్యారణ్య యతీంద్రులు పూర్వమీమాంసా జై మినీయన్యాయమాల అను గ్రంథము నందు--

"యాజ్ఞి కానాం సమాఖ్యానం లక్షణం దోషవర్జితం"(ఆ. 2.1) అను శ్లోక పాదముచే లోకములో యాజ్ఞికులు ఏమంత్రములను ఋఙ్మంత్రములనియు, వేటిని సామమంత్రము లనియు, వేటిని యజుర్మంత్రము లనియు వ్యవహరించుచుండిరో అట్లే వ్యవహరించినచో లక్షణము నిర్దుష్టముగ నుండునని వాక్రుచ్చిరి.

ఋఙ్మంత్రములు బహుళముగనున్న వేద భాగమునకు ఋగ్వేదమనియు, యజుర్మంత్ర బాహుల్యముగల వేద భాగమునకు యజుర్వేదమనియు, గానయుక్త మంత్ర బహుళమగు వేద భాగమునకు సామవేదమనియు, నీవిధముగ తత్తన్మంత్ర బాహుళ్యముచే మూడు వేదములకు పైనామము లేర్పడెను.

యజ్ఞములయందు హోత, అధ్వర్యుడు, ఉద్గాత, బ్రహ్మ అనువారు నలుగురు ప్రధాన ఋత్విక్కులు కలరు. వారిలో హోత చేయవలసిన కర్మభాగము ఋగ్వేదమంత్రములచేతను, అధ్వర్యుడు చేయవలసిన కర్మభాగము యజుర్మంత్రములచేతను, ఉద్గాత చేయ వలసిన కర్మభాగము సామవేద మంత్రములచేతను, బ్రహ్మకృత్య మంతయు అథర్వవేద మంత్రములచేతను నిర్వహింపబడ వలయును. ప్రజాపతి సోమయాగము చేయ నుద్యుక్తుడై వేదములను గూర్చి “ఓవేద పురుషులారా ! మీలో ఏవేదమును చదివిన వానిని యజ్ఞము నందలి నలుగురు ప్రధానులయిన ఋత్విక్కులలో ఏ ఋత్విక్కుగ వరింపవలయు"నని అడిగెను. ఆ ప్రశ్నమునకు "మాలో ఋగ్వేద విదుని హోతగను, యజుర్వేద విదుని అధ్వర్యునిగను, సామవేద విదుని ఉద్గాతగను, ఆథర్వాంగిరో విదుని బ్రహ్మగను వరింపు"మని వేదములు ప్రజాపతికి బదులు చెప్పెను——— అని గోపథ బ్రాహ్మణము యొక్క పూర్వభాగమునందలి ! “అథహ ప్రజాపతి స్సోమేన యక్ష్యమాణో దేవాను వాచ ! కంవో హోతారం వృణీయాం । క మధ్వర్యుం క ముద్గాతారం। కం బ్రహ్మాణం | ఇతి" త ఊచుః | ఋగ్విద మేషహోతారం వృణీష్వః యజుర్విద మధ్వర్యుం | సామవిద ముద్గాతారం ! అథర్వాంగిరో విదం బ్రహ్మాణం ! తథా హాస్య యజ్ఞ శ్చతుష్పాత్ప్రతి తిష్ఠతి" అను ప్రశ్నోత్తరములచే విదితమగు చున్నది. దీనిచే అథర్వ వేదవిదునకే యజ్ఞమునందు బ్రహ్మత్వ మొనర్చు నధికారము సిద్ధించు చున్నది. విష్ణుపురాణము, మత్స్యపురాణము, మార్కండేయపురాణము, మున్నగు పురాణములందు పౌరోహిత్యమునకు గూడ అథర్వవేదవేత్తయే అర్హుడని చెప్పబడినది.

పైరీతిగా యజ్ఞమునందు బ్రహ్మగా నుండవలసిన వాడు అధర్వ వేదజ్ఞుడుగ నుండవలయునను నియమము పుట్టిన తరువాత అథర్వవేదమునకు " బ్రహ్మ వేదము" అను నామమేర్పడెను. “చత్వారోవా ఇమేవేదా బుగ్వేదో యజుర్వేద స్సామవేదో బ్రహ్మ వేదః" (గో. బ్రా, 2.16 ) అను శ్రుతి అథర్వవేదమును “బ్రహ్మ వేద” మనుట యందు ప్రమాణమగుచున్నది. ఈ వేదమునకు సాధారణముగ అథర్వవేదమని పేరు గలిగియున్నను మొదట దీనికి అథ ర్వాంగిరసమను నామముండెను.

పూర్వము ప్రజాపతి సృష్టికొరకు తపస్సు చేయుచుండగా అతని రోమకూపములలో నుండి చెమట పుట్టెను. ఆ స్వేదోదకము నందు తన ప్రతిబింబమును చూచుచున్న ఆ ప్రజాపతికి రేతస్సు చలించెను. అట్టి రేతస్సుతో గూడిన జలములు రెండు భాగము లయ్యెను. ఒక భాగమునుండి భృగు మహర్షి పుట్టెను. అతడు ప్రజాపతిని జూడగోరు చుండగా, ఆకాశవాణి "అథార్వా గేనం ఏతాస్వే వాప్స్వ నిచ్ఛ” (గో. బ్రా. 1_4) —“నీకు ఉత్పాదకుడగు ప్రజాపతిని ఈ ఉదకములందే అభిముఖముగ అన్వేషింపుము"——అని పలికెను. ఇట్టి అశరీరవాక్కు యొక్క ఆదియందు ‘అథార్వాక్ ' అని యుండుటచే, ఈ భృగువునకు 'అథర్వా' అను రెండవ పేరుకూడ - లభించెను. ఇక రేతస్సుతోగూడిన రెండవభాగములో నున్న జలముచే ఆవృతు డగుటచే (ఆవృతత్వాత్ వరుణః) వరుణ శబ్ద వాచ్యుడై తపస్సు చేయ దొడగిన బ్రహ్మ యొక్క సర్వాంగముల నుండియు రసము స్రవించెను. అట్టి అంగరసము నుండి అంగిరశ్శబ్దవాచ్యు డగు మహర్షి పుట్టెను. ఇట్లు తనచే సృజింపబడిన అథర్వ - అంగిరో మహర్షుల కభి ముఖముగ ప్రజాపతి తపస్సు చేయగా అతని తపః ప్రభావముచే ఏకర్చుడు ద్వ్యర్చుడు మున్నగు మంత్ర ద్రష్టలగు మహర్షులు ఇరువదిమంది ఉత్పన్నులైరి.. పిదప ఈ ఇరువదిమంది తపస్సు చేయుచుండగా వారివలన నిస్సృతములై బ్రహ్మచే చూడబడిన మంత్రముల యొక్క సంఘమే అథర్వాంగిరళ్ళబ్దవాచ్య మగు అథర్వవేద మయ్యెను. అనగా బ్రహ్మ చూచుచుండగా ఘోర తపోనిష్ఠలోనున్న ఇరువదిమంది అథర్వాంగిరో మహర్షులనుండి వెలువడిన మంత్రసంఘమునకే అథర్వవేద మనియు, అథర్వాంగిరస్సు లనియు రెండు నానుములచే వ్యవహార మేర్పడెను. ఇట్లు ఇరువదిమంది మహర్షులవలన నిస్సృతమగుటచే అథర్వ వేదము ఇరువది కాండలు కలదయ్యెను. కావుననే ఈ వేదము సర్వశ్రేష్ఠమయ్యెను అని సాయణ భాష్య పీఠికవలన విదితమగుచున్నది. మరియు, “ఏ తద్వై భూయిష్ఠం బ్రహ్మయద్భృగ్వంగిరసః। యేంగిరసస్సరసః॥ యే౽ థర్వాణస్త ద్భేషజం | యద్భేషజం తదమృతం। యదమృతం తద్భహ్మ" (గో. బ్రా. 3. 4.) అనగా బ్రహ్మజ్ఞులగు మహర్షుల తపోమహిమవలన వారి హృదయములందు సంభూతమయిన దగుటచే ఈ అథర్వవేదము అన్ని వేదములకంటె శ్రేష్ఠమైనది. దీనియందు అంగీరళ్శబ్దవాచ్యమగు భాగము నారము. అథర్వవాచ్యమగు భాగము భేషజము (చికిత్సకము). ఏది భేషజమో అది అమృతము (అమృతత్వ ప్రాపకము).ఏది అమృతమో అది 'బ్రహ్మ స్వరూపము' అను నీ గోపథ బ్రాహ్మణము నందలి వాక్యములవలన అథర్వవేదమునకు అథర్వాంగిరస మను పేరుగాక భృగ్వంగిరస మను పేరు కూడ నున్నట్లు కానవచ్చుచున్నది.

ఇట్టి అథర్వవేదమునకు అంగములుగ సర్ప వేదము, పిశాచవేదము, అసుర వేదము, ఇతిహాసవేదము, పురాణవేదము అనునయిదు ఉపవేదములను బ్రహ్మ సృజించి నట్లు “పంచవేదా న్నిరమిత సర్పవేదం, పిశాచవేదం, అసురవేదం ఇతిహాస వేదం పురాణవేదం" అను గోపథ బ్రాహ్మణమునందలి (గో. బ్రా. 1-10) శ్రుతి వాక్యము నుడువుచున్నది.

అథర్వవేదమునకు పూర్వము పైప్పలాద, తైద, మౌద, శౌనకీయ, జాజల, జలద, బ్రహ్మవద, దేవదర్శ, చారణవైద్య——అను తొమ్మిదిశాఖ లున్నట్లు చరణ వ్యూహాది గ్రంథములవలన తెలియుచున్నది. వీటిలో శౌనకీయాది నాలుగు శాఖలలో గల అనువాకములకు, సూక్తములకు, ఋగాదులకు, గోపథ బ్రాహ్మణానుసారముగ అయిదు సూత్రములచే వినియోగము చెప్పబడినది. ఈ విషయమునే ఉపవర్గాచార్యుల వారు కల్ప సూత్రాధికరణములో నిట్లు చెప్పియుండిరి.

నక్షత్ర కల్పో వై తాన స్తృతీయ స్సంహితా విధిః |
తుర్య అంగిరసః కల్ప శ్శాంతి కల్పస్తు పంచమ॥॥

సంహితామంత్రములన్నిటికిని సంపూర్ణముగ శాంతిక, శాష్టిక కర్మలందు వినియోగము చెప్పబడుటచే 'సంహితా విధి' అను పదమునకు కౌశిక సూత్రము అని అర్థము. ఇదియే గృహ్యసూత్రము. దీని నవష్టంభముగా చేసికొనియే ఇతర సూత్రములన్నియు నుండుటచే ఈ సూత్రము ప్రధానమైనది.

అథర్వవేదమున ప్రతిపాదితములయిన విషయములలో మీద పేర్కొనబడిన సూత్రములలో కౌశిక సూత్రము నందు, గ్రామ, నగర, దుర్గ, రాష్ట్రాది లాభ సంపాదకము లయిన కర్మలును; పుత్ర, పశు, ధన, ధాన్య, ప్రజా, స్త్రీ - కరి - తురగ - రథ- ఆందోళికాది సర్వసంపత్తులను పొందుటకు సాధనములయిన కర్మలును; జను లైకమత్యమును సంపాదించుకొనుటకు ఉపకరించు కర్మలును; రాజ సంబంధమగు కర్మలును; శాంతిక, పౌష్టిక కర్మలును; గో సమృద్ధి - వృషభ సమృద్ధి సంపాదకములైన కర్మలును; వృషోత్సర్జనాది కర్మలును పేర్కొనబడినవి.

వై తానస సూత్రమునందు వేదత్రయ విహితములగు దర్శపూర్ణమా సేష్టి ప్రభృతి యజ్ఞములు, చయనములు, సత్రయాగములు మున్నగు సమస్త క్రతువులందు బ్రహ్మ, బ్రాహ్మణాచ్ఛంసి, ఆగ్నీధ్రుడు, హోత అను నలుగురు ఋత్విక్కుల చే పఠింపదగిన శస్త్రమంత్రములును, (శస్త్రములన యజ్ఞములో ఆరాధింపబడు దేవతలను స్తుతించు మంత్రములు) ప్రవచింపబడినవి. అందుచే ఈ శ్రౌతసూత్రమునందలి మంత్రములు కేవలము యజ్ఞాదుల యందే ఉపయోగపడును. - నక్షత్రకల్పమునందు మొదట కృత్తికానక్షత్ర పూజా-హోమాదికము, పిదప అమృతాద్యభయాంతములగు ముప్పది మహాశాంతులు, అనంతరము భయార్తులుకును, రోగగృహీతులకును, బ్రహ్మ వర్చస కాములకును, ప్రజా పశ్వన్న సంపత్ప్రభృతులను కాంక్షించువారికిని - సర్వకామావాప్తికై సాధనములయిన శాంతులు చెప్పబడినవి. ఆంగిరసకల్పములో అభిచార (ప్రయోగ) సంబంధమగు అనగా శత్రువధార్థమై ఉపయోగించు కర్మలు మాత్ర మేవివరింపబడినవి. శాంతి కల్పమునందు వై నాయక శాంతి మొదలుకొని ఆదిత్యాది నవగ్రహ శాంత్యాదికములు చెప్పబడినవి. మరియు అథర్వవేద పరిశిష్టములలో కొన్నింటిలో రాజప్రథమాభిషేకము, పురోహితకర్మలు, మహారాజులు ప్రత్యహము చేయదగిన సువర్ణ- ధేను-తిల భూదానాదులు కోటిహొమము, లక్షహోమము, అయుత హోమము, గ్రహయుద్ధము, రాహుచార- కేతుచారములు, తటాక ప్రతిష్ఠ, పాశుపరవ్రతము మున్నగు ననేక విషయములు ప్రతిపాదింపబడినవి.

అథర్వవేదగతములగు కొన్ని విషయములు : ఉదా:-(1) వర్షాగమనమునకును కప్పలరచుటకును గల సంబంధము. (అ. వే. 4వ కాం.4-15)

లోకమునందు బోదురు కప్పలు నీటియందుండి అరచు నప్పుడు "బోదురుకప్పల రచుచున్నవి కావున వర్షము కురియు "ననెడి వాడుకకు అథర్వవేదము మూలము.

ఖ ణ్వ ఖా 3 ఇ ఖై మ ఖా 3 ఇ మధ్యేతదురి"—(అ. వే. 4 కాం-4.15.) అను శ్రుతియందలి 'ఖణ్వభా, ఖై మఖా, తదురి' అను మూడుపదములు మండూకములలో నొక జాతికి చెందిన ఆడకప్పలకు నామములు. ఆ నామములచే వాటిని సంబోధించి, "ఓ మండూక విశేషములారా! మీ ఘోషము చేత వర్షమును కలుగ జేయుడు. వృష్టి ద్వారమున పోషించు నో మండూకములారా ! మీ ఘోషముచేత వృష్టికి అభిముఖములగు మరుద్గణముల యొక్క మనస్సును స్వాధీనముచేసికొనుడు.” అను నర్ధమును ఈ శ్రుతి బోధించుచున్నది. దీనిచేత మండూక ఘోషము వృష్టికి కారణమని తెలియుచున్నది. ఇట్టి శ్రుతిసిద్ధమైన పెక్కు విషయములు లోకాచారమున గన్పడుచున్నవి.

(2) ‘అను సూర్యముదయ తాం' (అ. వే. 1 కాం.6-1) అను మంత్రముచేత ఉదకము నభిమంత్రించి, యెఱ్ఱ గోవు యొక్క రోమములతో మిశ్రితములగు నా జలమును త్రాగినచో హృద్రోగము తగ్గునని చెప్పబడినది.

(3) సభాజయమును కోరినవాడిట్లు పఠింపవలయును : 7వ కాండము 12 వ సూక్తము అనువాదము.)

(i) ప్రజాపతికి కూతులైన సభయు (విదుషుల సమాజము) సమితియు (సంగ్రామీణసభ) నేక మనస్కలై నన్ను రక్షించుదురుగాత. నాకు కానవచ్చిన వాడెల్ల నా కనుకూలుడగుగాక – ఓ తండ్రులారా ! సభలో నేను చారు వచనములను పలికెదను,

(ii) ఓ సభా ! నీ పేరు 'నరిష్టా' (అలంఘనీయ) యని ఎరుగుదును. ఈ సభలోని సభాసదులందరును నామాట నేకీభవింతురుగాక.

(iii) ఇందలిసభాసదులయొక్క వర్చస్సును, విజ్ఞానమును నేను తీసికొనుచున్నాను. ఈ సభయందలి యందరిలోను ఇంద్రా! నన్ను భాగ్యవంతుని (జయశీలుని) చేయుము.

(iv) ఓ సభాసదులారా! మీ మనస్సు ఇతరత్ర ఆసక్తమై యున్నను ఇచ్చటచ్చట బద్ధమైయున్నను నా వైపునకు త్రిప్పెదను. అది నాయందు రమించుగాత.

(4) శత్రుసేనకు మోహమును కలిగించుటకు__(3 కాం—1 వ సూక్తము. అనువాదము)

(i) విద్వాంసుడైన అగ్ని మా శత్రువులమీదికి ఎత్తి పోవునుగాక ; ఎక్కువ హింసకుడయిన శత్రువును కాల్చు గాక. సర్వజ్ఞుడైన అగ్ని మా శత్రువులను చేతులు లేని వారిగ చేయునుగాక.

(ii) ఓ మఘవన్ ! వృత్రహంతకా !ఇంద్రా ! అగ్నీ ! శత్రు సేనలను మీరు కాల్పుడు.

(5) పాపపరిహారార్థమై ప్రాయశ్చిత్తము : (6 వకాం -113 వ. సూ క్తము)

(i) దేవత లీపాపమును త్రిత (దేవతా విశేషము) మీద కడిగిరి. త్రిత ఆపాపమును మానవునిమీద పారవై చికడుగు కొనెను. కావున నన్ను గ్రాహి (పాప దేవత) ఆశించెను. మంత్రములతో దేవరలు దానిని పోగొట్టుదురు గాక.

(ii) ఓ పాపమా ! కిరణములందు ప్రవేశింపుము. ధూమములోనికి పొమ్ము. మేఘమునందు చొరబడుము మంచులో చేరుము. నదులమీది నురుగులో కలిసిపొమ్ము. ఓ పూష౯| భ్రూణహత్య చేసిన వాని దోషము పోగొట్టుము.

(iii) త్రితచే అపమృష్టమైన మానవుని పాపము పండ్రెండుచోట్ల పెట్టబడినది. కావున నిన్ను గ్రాహి పట్టుకొన్న యెడల ఈ దేవతలు మంత్రములతో దానిని పోగొట్టుదురుగాత. . (6) భర్త లభించుటకు స్త్రీ పఠింపదగిన మంత్రము 6 వ. కాండము. 60వ సూక్తము)

(i) ఈ కన్యకకు పతినిగోరి, ఈ బ్రహ్మచారికి భార్యను కోరి అర్యమ (ఆదిత్యుడు) విహితస్తవుడై పురోభాగమునకు వచ్చుచున్నాడు. (ii) అర్యమ ! ఈ పడుచు ఇతర స్త్రీల వివాహోత్సవములకు పోయి విసివినది. ఇక తప్పక ఇతర స్త్రీలు ఈమె వివాహోత్సవమునకు పోయెదరు.

(iii) ధార ఈ భూమిని, ఆకాశమును, సూర్యుని ధరించెను. (స్వస్వస్థానములయందు నిలిపెను.) ధాత ఈ కన్యకకు ఆమె కోరిన వరుని ఇచ్చుగాక.

(7) భార్య లభించుటకు మంత్రము: (6 వ కాండము; 82 వ సూక్తము) ఇచ్చటికి వచ్చువాని, వచ్చినవాని,వచ్చుచున్న వాని పేరు స్మరించెదను. ఇంద్రుని, వృత్రఘ్నుని, వాసవుని, శతక్రతువును, యాచించెదను. భార్యను కోరుచున్న నాకు ఓ యింద్రుడా! శచీపతీ! నీ యొక్క హిరణ్మయమును, ధనమిచ్చునదియు నగు నీ అంకుశముచే నాకు భార్యనిమ్ము.

(8) కారుచున్న రక్తము నాపుటకు (అనువాదము)

(i) ప్రవహించుచున్నవియు, రక్తమునకు నివాస భూతములగునవియు నగు ఈ రక్త నాళములు తోడబుట్టిన వాండ్రులేని చెల్లెండ్రవలె హతవర్చసలై ఆగిపోవుగాక.

(ii) ఓ అధోభాగవర్తినియైన రక్తనాళమా! ఆగిపో; ఊర్ధ్వనాళమా! ఆగిపో; అన్నిటికంటే చిన్న నాళమా ఆగిపో; అన్నిటికంటే పెద్ద నాళమా! ఆగిపో.

(iii) నూరు ధమనులలో వేయి సిరలలో ఈ నడుమ నున్నవి ఆగిపోయినవి. మిగిలిన నాళము లన్నియు నాగి పోయినవి.

ఇట్లే జ్వరము, వరుసజ్వరము, పసరికలు, అజీర్ణము, జలోదరము, కుష్ఠు, గాయములు, క్రిములు పడుట, పశు రోగములు విషప్రయోగము మున్నగువాటిని నివారించుటకు పఠింపదగిన పెక్కు మంత్రము లిందు కలవు.

శ్రేష్ఠహీ వేద స్తపసోధిజాతో, బ్రహ్మజ్ఞానాంహృదయే సంబభూవ. (గో. బ్రా. 1-6). అనురితి గోపథ బ్రాహ్మణమున ఈ వేదము యొక్క మహిమ వర్ణిత మైనది.

“యస్యరాజ్ఞో జనపదే అథర్వా శాంతిపారగః |
నివసత్యపి తద్రాష్ట్రం వర్ధతే నిరుపద్రవం
తస్మాద్రాజా విశేషేణ అథర్యాణం జితేంద్రియం |
దాన సమ్మాన సత్కారై నిత్యం సమభిపోషయేత్"

ఏ రాజు యొక్క జనవదమందు సంపూర్ణముగా శాంతి విధుల నెరిగిన అథర్వవేద పండితుడు నివసించునో, ఆ రాష్ట్రము రోగదారిద్య్రములు మున్నగు నుపద్రవములు లేకుండ వృద్ధినొందును. అందుచేత రాజు విశేష యత్నముచే యోగ్యుడగు నథర్వవేద పండితుని పురోహితునిగ చేసికొని యాతనిని దాన సమ్మానములచే సంతుష్టుని చేయవలయునని అథర్వవేద పరిశిష్టమున చెప్పబడినది. నీతిశాస్త్రమునందలి

"త్రయ్యాంచ దండనీత్యాం చ
     కుశలస్స్యా త్పురోహితః |
అథర్వ విహితం కర్మ
     కుర్యా చ్ఛాంతికపౌష్టికం"

అను శ్లోకము వలన రాజునొద్ద నున్న పురోహితుడు వేదత్రయమందును, దండనీతియందును కుశలుడై యుండి, రాజ్యమున సంగ్రామాదుల ప్రసక్తి కలిగినప్పుడు, శత్రు పరాభవమును స్వప్రభువు యొక్క విజయాదులును ఘటిల్లు నిమిత్తమై, శాంతిక పౌష్టిక కర్మల నాచరించి రాజ్యరక్షణ మొనర్పవలయునని వచింపబడినది. శ్రీ విద్యారణ్య యతీంద్రులు తన పూర్వాశ్రమమున విజయనగర చక్రవర్తులకడ అమాత్యుడుగను ధర్మోపదేష్టగను ప్రవర్తిల్లుచు నాలుగు వేదములకును రాజనీతి ననుసరించి భాష్యరచన చేసియున్నారు.

ఉ. గ. శా.


[[వర్గం:]] [[వర్గం:]]