సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అంతర్విద్యుత్ప్రతిష్ఠ

అంతర్విద్యుత్ప్రతిష్ఠ— విద్యుత్ప్రవాహము (Electric current) యొక్క సంపూర్ణ మార్గమును విద్యుద్వలయమని (Electric Circuit) యందురు. ముఖ్యముగా విద్యుద్వలయము మూడు భాగము లు కలిగియుండును.

1. విద్యుద్వలయమునకు శక్తిని (energy) అందించు విద్యుత్ప్రభవము(Source of Electricity):- అంతర్వి ద్యుత్ప్రతిష్ఠాపనములకు సాధారణముగా ఈ క్రింది జాతులు పనికివచ్చును. (అ) ఏకముఖ వికల్ప విద్యుత్ప్రవాహము (Single phase A.C.), అనగా ద్వితంత్రీ ప్రేషణము(2 wire supply) (ఆ) త్రిముఖ వికల్ప విద్యుత్ప్రవాహము (Three phase AC.) అనగా త్రి తంత్రీ ప్రేషణము(3 wire supply). ఏ రెండు దశల మధ్యనై నను వోల్టేజి (Voltage) సమానము. (ఇ) త్రిదశా వికల్ప విద్యుత్ప్రవాహము (Three phase A.C.), అనగా చతుస్తంత్రీ ప్రేషణము(4 wire supply) దశ (Phase) కును తటస్థ మునకును (neutral) మధ్యనున్న వోల్టేజి, ఏ రెండు దశల మధ్యనున్న వోల్టేజి కైనను I రెట్లుండును.

(ఈ) ఋజు విద్యుత్ప్రవాహ ద్వితంత్రీ వేషణము (two wire D.C. Supply) (ఉ) ఋజు విద్యుత్ప్రవాహ త్రిత౦త్రీ ప్రేషణము(Three wire D. C. Supply) - బహిర్గత అంతముల (outers) మధ్యనున్న వోల్టేజి బహిర్గత మధ్యమముల మధ్యనున్న వోల్టేజికి రెండు రెట్లుండును.

2. విద్యుచ్ఛక్తిని (Electrical energy) వాంఛిత రూపములుగా మార్చు వినియోగ సాధనములు (consuming devices) [దీపములు (lamps), బ ల్బు లు, పంకాలు, గంటలు, ఇస్త్రీ పెట్టెలు, ఉష్ణోత్పాదకములు (Heaters), రిఫ్రెజిరేటర్లు (Refrigerators)మున్నగునవి.]

3. జనకము (Generator) నుండి వినియోగ సాధనములకు అవసరానుగుణముగా శక్తి నందిచ్చు తంత్రులు, మరియు వశీకరణ యంత్రసాధనము (control gear).ఈ భాగము నే విద్యుత్ప్రతిష్ఠాపకులు (Electricians)విద్యుద్వలయ (Electric circuit) మని సాధారణముగా చెప్పుదురు.

సరళ విద్యుద్వలయము:- (Simple circuit) (చూ,ప. 1 మరియు ప. 2) మూడు తంత్రులను కలిగి యుండును. వాటిలో ఒక తంత్రి జనకమును దీపముతో గాని, గంటతోగాని కలుపునది. రెండవ తంత్రి జనకము యొక్క ఇంకొక ముఖమును స్విచ్చితో కలుపునది. మూడవది స్విచ్చిని దీపముతో కలుపునది.

అన్ని అంతర్విద్యుద్వలయములను ఈ సరళ విద్యుద్వలయము నాధారముగా గైకొని నిర్మింప వచ్చును.

వివిధ విద్యుద్వలయములను నిర్మింపవలసి వచ్చినపుడు, వలయములు సమాంతర (Parallel) పద్ధతిలో (చూ.ప.3) జనకముతో కలుప బడును.

అనగా స్విచ్చితంత్రుల నన్నిటిని ఒక కేంద్రమునకు (main), దీపపు తంత్రుల నన్నిటిని ఇంకొక కేంద్రమునకు కలుపుట. ఈ విధముగా విద్యుత్ప్రేషణము యొక్క సంపూర్ణ పీడనము (Pressure) ప్రతి వలయమునకు ఇతర వలయములచే వినియోగింపబడు బలము (Power) విషయమున సంబంధము లేకయే పంపిణీ చేయబడును. ఈ వలయముల ప్రేషణ అగ్రములను (Supply ends) భవనము నందలి ఒకానొక అనుకూల ప్రదేశమునకు తెచ్చి సమాం తరవిధానమున (Parallel) పంపిణీ పెట్టెపై (distributing board) కలుపవలెను. ప్రతి వలయమునందలి తంత్రు లును ఫ్యూజు తీగలచే (Fuse wires) సంరక్షింపబడవలెను. పెద్ద విద్యుత్ప్రతిష్ఠాపనము కలిగిన (large electrical installation) ఒకానొక భవనమునందలి వేరువేరు అంత స్తులకును, భాగములకును సరఫరా చేయుటకై వివిధ పంపిణీ పెట్టెలుండును. అంతర్విద్యుత్ప్రతిష్ఠాపన కవసరపడు విద్యుత్ప్రవాహమును గ్రహింప సమర్థములగు రెండు ప్రధాన తంత్రులు (cables) పంపిణీ పెట్టెకు ప్రేషణ చేయును.

ప్రధాన స్విచ్చి (main switch), మరియు ఫ్యూజుతీగల ద్వారా ప్రధాన తంత్రులు పంపిణీ పెట్టెకు కలుపబడును. దీని సహాయమున అంతర్విద్యుత్ప్రతిష్ఠాపనము నంతను నిర్జీవముగ ('dead') చేయవచ్చును.

తంత్రులను సమాంతర విధానములో నమర్చుటలోగల ముఖ్య ప్రయోజనములు:— 1. విద్యుత్ప్రతిష్ఠాపనములో నొక భాగములో నేదేని మరమ్మతు చేయవలసి వచ్చినప్పుడుగాని, మార్పులను చేయవలసి వచ్చినప్పుడుగాని, ఇతర భాగములతో సంబంధము లేకయే ప్రతి ప్రమాణమును (each unit) ప్రత్యేకింపబడును (isolated).

2. మొత్తము విద్యుద్భారము (Load) వివిధ వలయములలోనికిని సర్దుబాటు చేయవచ్చును. దీనివలన ప్రతి వలయములో ఏకరీతియైన పీడన యొక్క పతనము (Pressure drop) సాధ్యపడును.

ప్రేషకపు వోల్టేజి (Supply voltage) వినియోగ సాధనముల కవసరమగు వోల్టేజికంటె అధికమగుచో, మరి రెండు కాని, అంతకంటె అధికముగ కాని వినియోగ సాధనములను శ్రేణి విధానమున (In series) సమర్ప వచ్చును. (చూ.ప. 4)

శ్రేణీ విధానమున ఒకే విద్యుత్ప్రవాహము ప్రతిదీపములోనికి ప్రవహించును కనుక వలయము నందలి ప్రతిదీపమును ఒకే బలమును (Power) కలిగియుండవలెను. కాని ఈ శ్రేణీ విధానమున ఒక అననుకూలత ఉన్నది. అది ఏమన, ఏదేని ఒక దీపము చెడిపోయినచో వలయము ఖండింపబడి, అన్ని దీపములును నిష్ప్రయోజకము లగును. మరియు మనకు ఇచ్చవచ్చిన దీపము నొక దానినే వాడుట కవకాశ ముండదు.

విద్యుత్ప్రతిష్ఠాపనములందు తండ్రులకు రంగుల నుపయోగించుట యొకా నొక సాంకేతిక పద్ధతి. ఇట్లు చేయుటవలన ప్రతిష్ఠాపన సమయమున పొరపాట్లకు (స్థాలిత్యములకు) తావుండదు. సులభతరమునుగూడ అగును. సాధారణముగ, వినియోగ ప్రేషక మార్గములకు నలుపురంగును, స్విచ్చి ప్రేషకమార్గములకు ఎరుపు రంగును ఉపయోగింతురు. స్విచ్చిని దీపముతో కలుపు తంత్రులు ఎరుపు రంగుతోగాని, కొన్ని ప్రత్యేక పరిస్థితులలో నారింజ (orange) రంగుతోగాని గుర్తింప బడును.(చూ.ప. 5)

పంపిణీ పెట్టెనుండి సరఫరా చేయబడి ఏకధృవ స్విచ్చి (Single pole switch) చే వశీకరింపబడిన వలయము:- దీపపు పాయింటు (Point) నిర్జీవముగ (Dead) నుండ వలెను. అనగా స్విచ్చి తెరువబడినప్పుడు ' (When switch is open) పాయింటుకు ప్రధాన తంత్రుల భూసంబంధము వైపు (Earthed side) కలుపవలెను. ఇట్లు చేయుటవలన ప్రధానతంత్రులకు విద్యుదాయాస ముండదు (Electrical strain)మరియు దీపములను మార్చునప్పుడు విద్యుత్తు యొక్క పెనుతాకుడు వలని (Electric shock) అపాయముండదు. వలయాత్మక పటములు (Wiring Diagrams);—ఇట్టి పటములను చిత్రించునపుడు సామాన్య వలయము నందలి ధాతువులను (Elements) ఈక్రింది పద్ధతిలో సాంకేతింపవలెను.

'ట్రీ' మరియు 'లూస్' తంత్రీవిధానములు:- ('Tree'and ‘Loop' system of wiring) క్రింది పటములను పరీక్షింపగా ఈ విషయములు వ్యక్తమగును :-

'ట్రీ' విధానమందు అతుకులు (Joints) దాగి ఉండును. ఒక్కొక్కప్పుడు వాటిని గుర్తించుటకూడ కష్టము.

'లూవ్' విధానమందు విస్తారముగా రాగితో చేయబడిన తంత్రులను వాడుటవలన అతుకులు ఉండవు. మరియు 'ప్రతిష్ఠాపనములో పొరపాట్లను సవరించుట కూడ సులభము,

ఈ క్రింది 'లూవ్' విధానపు వలయాత్మక పటములు అంత ర్విద్యుత్ప్రతిష్ఠాపనములలో సాధారణముగా ఉపయోగింపబడును,

వీధిలోనున్న తంత్రులనుండి మాపకమునకు చేరు తంత్రులు మాపకము వద్దనున్న రెండు కంపెనీవారి ఫ్యూజుతీగలచే సంరక్షింపబడును. ఈ ఫ్యూజుతీగలు "మీటరు” (లేక మాపకము) అమర్పబడిన పెట్టెకే అమర్పబడును. రెండు ఫీడర్లు పంపిణీ పెట్టెను పోషించుచుండును. ఇవి ఒక ద్విధ్రువ ప్రధాన న్విచ్చిచేతను, ఫ్యూజుచేతను సంరక్షింపబడుచు ఆధీనములో నుంపబడు చుండును,

3వ సంఖ్యగల విద్యుద్వలయపు తంత్రీవిధానము సంపూర్ణముగా నున్నది. పంపిణీ పెట్టె రెండు కేబుల్సు ద్వార పోషింపబడు చున్నది. ఇవి ప్రధానస్విచ్చి (ప. 9) తో కలుపబడి యున్నవి. ఈ స్విచ్చి పెట్టెకు కలుపబడిన తంత్రీవిధానము సంతను ఆధీనములో నుంచుచున్నది.

'అ' వద్దగాని, 'ఆ' వద్దగాని స్విచ్చిని ఉప యోగించి దీపమును ఉపయు క్తముగను, అనుపయు క్తముగను చేయవచ్చును.ద్విమార్గపు స్విచ్ యొక్క ఏకాంతర స్థానములు చుక్కలతో చూపబడి యున్నవి.

పటమున చూపబడిన వలయమును 'అ' వద్ద 'ఆ' వద్ద, 'ఇ' వద్దనున్న ఏదేని ఒక స్విచ్చిచే వశీకరింప వచ్చును. కొన స్థానము అందున్న ఆ, ఇ అవద్ద ద్విమార్గపు స్విచ్చులు ఉపయోగింపబడుచున్నవి. మధ్యనున్న వశీకరణ స్థానమువద్ద ఒక మధ్య స్విచ్చి అమర్చబడినది. స్విచ్ ఏకాంతర స్థానములు చుక్కలతో చూపబడి యున్నవి.

రెండు ఘటముల (Call) చే ప్రేపింపబడి, 3 వేరు వేరు నొక్కుడు స్విచ్చించే వశీకరింప బడిన గంటయు, సూచకమును

గల వలయము,

ప. 14 చతుస్తంత్రీ - త్రిదశా వికల్ప విద్యుత్ప్రవాహము ప్రతిష్ఠాపనమునందు కాంతి థారము (Lighting load) మరియు శ క్తి భారము (Power load) నున్నవి. కాంతిభారము మూడు భాగములుగా విడగొట్ట బడినది. ప్రతి భాగమును తటస్థ. తంత్రికిని (Neutral), జీవన తంత్రులలో నొకదానికిని ( Live wire) కలుపబడి వాటిచే పోషింపబడినది. శక్తిభారము మూడు జీవన తంత్రులచే పోషింపబడినది. చతుర్ ధ్రువస్విచ్చిచే ప్రతిష్టాపన మంతయు వశీకరింపబడినది. 1, 2, 3 జీవన తంత్రులు ప్రత్యేకముగా ఫ్యూజుతీగలచే సంరక్షింపబడి, ప్రతి స్థాపనమున కంతకును రక్షణ నిచ్చుచున్నవి.

ప. 15 ద్విమార్గపు గంటవలయము గంట నెం. 1 గంట నెం. 2 ఈ రెండును ద్వి మార్గపు స్విచ్చికి వలయములో కలుపబడినవి. నొక్కుడు స్విచ్చిని, ద్విమార్గపు స్విచ్చిని ఆధారము గా జేసికొని మనకు కావలసినగంటలను ఉపయోగములోనికి తెచ్చుకొన వచ్చును. వ గృహాంతర్విద్యుత్ప్రతిష్ఠాపనములలో, తంత్రుల ప్రతి స్థాపనా పద్ధతులు (House wiring systems) ప్రధానముగా మూడు రీతులుగ నున్నవి.

1. క్లీటు పద్ధతి (Cleat system)
2. దారు పేటికా విధానము (Wood casing system)
3. సీసపు తొడుగు పద్ధతి (Lead covered system)
4. సి. టి. యస్. పద్ధతి (C T. S. system)
5. నాళ విధానము (Conduit system)

విద్యుత్ప్రతిష్ఠావనము యొక్క ప్రకృతి (Nature), రక్షణ (Protection), ఖర్చుల (Expenditure) ననుసరించి, ఈ పైనుదహరింపబడిన పద్ధతులలో నేదో ఒక దానిని ఉపయోగింప వచ్చును.

క్లీటు పద్ధతి :- (Cleat system) ఈ పద్ధతిలో, రెండు పోర్సిలీను క్లిటు (బిళ్ళ) లుండును (Porcelain cleats). ఈ రెండు క్లీటుల నడుమ వి.ఐ. ఆర్. తంత్రులు

(Volcanised India Rubber) పోవుటకు వీలుండును. రెండు క్లీటులును స్క్రూతో కఱ్ఱదూలమునకు (Wooden beam)గానీ, క ఱ్ఱబద్దీలకుగాని బిగింపబడును. కాంక్రీటుతో గాని, ఇటుకతోగాని చేయబడిన గోడలకు ఈ పోర్సిలీను క్లీటులను స్క్రూతో బిగింపలేము. అందుచే గోడలోనికి ముందుగ క ఱ్ఱబిళ్ళలన (Wooden plugs)దింపి, సి మెంటుతో వాటిని గోడలో నతికి, ఆ కఱ్ఱబిళ్ళలకు పై పోర్సిలీను క్లిటులను బిగింతురు. (చూ.ప. 16).

తంత్రులు తేమకుగాని, రసాయనిక ధూమములకు (Chemical fumes) గాని, తదితర విధ్వంసక శక్తులకు గాని గురికాకూడదు. గోడలలో నుండిగాని, ఇంటి కప్పులో నుండిగాని తంత్రులు పోవలసి వచ్చినప్పుడు, వాటిని పోర్సిలీను గొట్టముల ద్వారాగాని (Porcelain tubes), దిట్టమైన లోహపు నాళముల (Metallic conduit) ద్వారాగాని గొంపోవలెను.

క్లీటు పద్ధతి ననుసరించిన ప్రతిష్ఠాపనము చాల సుళువు. మరియు మార్పులనుగాని, వ్యాప్తిని (Extensions) గాని చాల సులభతరముగ చేయవచ్చును. కాని ప్రస్తుత కాలమున ఈ పద్ధతి ననుసరించిన ప్రతిష్ఠాపనము వాడుకలో లేదు. ఇది శీఘ్ర కాలములో విధ్వంసక శక్తులకు గురియై చెడిపోవునుగాన తాత్కాలికమైన (Temporary)ప్రతి స్థాపనములకు మాత్రము ఈ పద్ధతి ననుసరింతురు.

దారు పేటికా విధానము (Wood casing system):- వి. ఐ. ఆర్. తంత్రులు, గాడీలుగల పేటిక గుండా గొంపోబడును. దీనికి కఱ్ఱ బద్దీ కప్పు (లేక మూత) ఉండును. ఈ ఏర్పాటువలన, తంత్రులకు విధ్వంసక శక్తులవలన అపాయము ఉండదు. పేటికను (Casing) సమాన దూరములలో స్థాపింపబడిన పోర్సిలీను బిళ్ళల సహాయమున గాని, లేక క్లీటు పద్ధతియందుదాహరింపబడిన కఱ్ఱబిళ్ళల సహాయమునగాని, గోడకుగాని, సీలింగుకుగాని స్క్రూ సహాయముతో బిగింపవచ్చును. (చూ.ప. 17)

పేటికయును, పైకప్పును రెండు మారులు షెల్లాక్ వార్నీష్ తొ పూతపూయబడవలెను. లోపలను, వెనుక భాగమునను ఒక మారును; ప్రతిష్ఠాపన తరువాత రెండవమారు బయట నుండియును ఈ వార్నీషు వేయవలెను. బయటి వార్నీషుకు బదులు రంగు వేయవచ్చును. (ఈ

వార్నీషు స్వచ్ఛమైన షెల్లాకును స్పిరిట్లో కలుపుట వలన తయారు చేయవచ్చును.)

పాళ్ళు:- 3 పౌన్ల షెల్లాకునకు ఒక గాలన్ స్పిరిట్ కలుపవలెను.

విజాతి ధ్రువత్వముగల (Opposite polarity) తంత్రులు వేరు వేరు గాడీల గుండా (Separate grooves) గొంపో బడవలెను. మరియు తంత్రులపైనున్న విద్యుద్బంధనము (Insulation) న కపాయము కలుగకుండ అతుకుల వద్దనున్న వాడియైన కొనలను సరిగా (సావుగ) చేయవలెను.

ఈ ఏర్పాటునంతను తేమ ప్రదేశములందు గాని, అగ్నివలసి అపాయమున్న ప్రదేశములందుగాని ఉపయోగింపరాదు. ఈ విధానములోని సదుపాయ మేమన- గదిలోని లేకభవనములోని అలంకారమునకిది తగియుండును.

సీసపు తొడుగు పద్దతి (Lead Covered System);- రబ్బరుగాని, కాగితముగాని కప్పుగాగల విద్యుద్వాహకముల పై (Conductors) అతుకులేని సీసపు తొడుగు వలన వాహకములకు తేమనుండియు, వాతావరణము నందలి తిని వేయు స్వభావముగల (Corrosive) విధ్వంసక శక్తుల నుండియు రక్షణ సమకూరును. క్లిప్పులచే సమాన దూరములలో కఱ్ఱదూలములకుగాని,కఱ్ఱబ్యాటను లకుగాని (Battens), తంత్రులు కాంక్రీటు, ఇటుక గోడల పై నమర్చుటకు ముందుగా బిగింప బడును. కఱ్ఱబ్యాటనులు గోడలకు స్క్రూలు లేక రాల్ ప్లగ్గుల (Rawl plugs) చే బిగింప బడును. (చూ•ప. 18).


ఈ పద్ధతిని లఘుప్రతి స్థాపనములకు ఉపయోగింతురు. ఈ పద్ధతి ఎడతెగని బంధమును (Continuous bond), శ్రేష్ఠమైన భూసంబంధమును (Efficient earthing) కలిగియుండ వలెను.

సి. టి. యస్. పద్ధతి (Cab tyre sheathed system):- ఈ పద్ధతిలో వి. ఐ. ఆర్. తంత్రులకు పైన దృఢమైన రబ్బరు తొడుగుండును. ఈ రబ్బరు తొడుగు క్యాబ్ టైర్ల కుపయోగించు రబ్బరుతో తయారు చేయబడినది. ఈ రబ్బరు తొడుగు తేమనుండియు, తదితర రసాయనిక ధూమ ములనుండియు, పూత(Paint) నుండియు రక్షణ నీయగలదు.


తంత్రులు కఱ్ఱ దూలములకుగాని, కఱ్ఱ బ్యాటనులకుగాని క్లిప్పులచే బిగింపబడును. బ్యాటన్లు ప్లగ్గులతో గోడలలో బిగింపబడును. (చూ.ప. 16.)

ఈ పద్ధతి ననుసరించిన ప్రతిష్ఠాపనము ఇతర పద్ధతుల ననుసరించు దానికన్న చవుక. ఇట్టి ప్రతిష్ఠాపనమును అతి త్వరితముగను, సులభతరముగను ఏర్పాటు చేయవచ్చును. అందుచే ఈ పద్ధతి విస్తృతముగా వాడుకలో నున్నది. కాని ఇట్టి ప్రతిష్ఠాపనమును తంత్రులకు సూర్యరశ్మి సోకుచోట్ల ఉపయోగించరాదు.

నాళ విధానము (Conduit system)-;ఇందు వి. ఐ. ఆర్. తంత్రులు ఉక్కుతోగాని, ఇనుముతోగాని చేయబడిన గొట్టములగుండా గొనిపోబడును. ఈ గొట్టములు దృఢముగ నుండుటవలన, అగ్ని ప్రమాదముల వలనగాని, యాంత్రిక సంబంధమైన దెబ్బల వలనగాని (Mechanical injury) గొట్టములోనున్న తంత్రులకు (చూ.ప. 20) రక్షణ కలుగు చున్నది.

కాన్ డ్యూట్లు ( నాళములు) రెండు రకములు: 1. సూడానాళము (Screwed conduit). 2. చీలికతో కూడిన కాస్ట్యూట్ (Solid conduit)

1. స్ట్రూడ్ నాళ విధానము :- స్క్రూ తో గూడిన కాండ్యూట్ లు మధ్యరకపు పీడనము (medium pressures ) గల (250–600 వోల్టులు) విద్యుద్వలయముల కుపయోగింతురు. విద్యుద్వలయములను తేమ నుండియు,ఇతర ఆఘాతముల నుండియు సంరక్షించుటకు ఈ కాండ్యూట్లను వాడుదురు. కాండ్యూట్ల కొనలను ప్రత్యేక మైన చుట్లువాడి (Threads) ప్రతిష్ఠాపనములలో బిగింతురు.(చూ.ప. 21.)

పరిశ్రమలలోను, వివిధ ప్రజాసంబంధకములలోను చీలిక కాండ్యూట్లు (Split conduits) అత్యంతోపయోగకరములుగా నుండును. తేమగానుండు స్థలములలోను వాతావరణ విధ్వంసక శక్తులకు గురియగు చోట్లలోను ఈ చీలిక కాన్ డ్యూట్ల నుపయోగింపరాదు. రాపిడీపై నాధారపడు జారుడు బంధములను (Friction type slip fittings) కాండ్యూట్ల కొనలను కలుపుట కుపయోగింతురు. కాండ్యూట్లను గోడలపై మోపుల (Saddles) సహాయమున బిగింతురు. మోపులను గోడలలో నతుక బడిన కఱ్ఱబిళ్ళలపై బిగింతురు. తేమగానుండు స్థలములలో, ఈ కాండ్యూట్లను తే మను రక్షించుటకై గోడకును, నాళమునకును మధ్యకఱ్ఱ దిమ్మలు సరియైన విరామముతో స్థాపింతురు. కాండ్యూట్లు ముందుగ ప్రతిష్ఠింతురు. పిమ్మట తంత్రులను వాటిలోనికి లాగుదురు. కావున చాల జాగరూకతతో కాండ్యూట్లు ముందుగ ప్రతిష్ఠాపింప వలెను. మధ్య మధ్య కొన్ని పరీక్షార్థపు బిగింపుల (Inspection fittings) నుంచుట వలన నాళ విధానము ననుసరించిన ప్రతిష్ఠాపనమును సుప్రతిష్ఠితముగ చేయవచ్చును. తీగలతో పేనిన వాహకములను (Stranded conductors) కాండ్యూట్ గుండా 'లాగుదురు. తంత్రులు సులభముగ నాళము లోనికి జారుటకొఱకు ఫ్రెంచి సుద్ద (French-Chalk) నుపయోగింతురు.

మంచి బంధము నేర్పరచుట (Proper bonding) వలనను, శ్రేష్ఠమైన భూసంబంధమును కల్పించుట (efficient earthing) వలనను, కాండ్యూట్ నంతను భూపీడనము (earth potential) నం దుంచుదురు.

బంధము నేర్పరచుట మరియు భూసంబంధమును కల్పించుట (Bonding and earthing):- విద్యుత్ప్రవా హము స్ఖలనము (Leakage) నొందినపుడు, తంత్రులపై నున్న లోహపు తొడుగులు కూడ విద్యుద్వాహకములుగ పనిచేసి, తీవ్రమైన అపాయములకు హేతువులగును. కాని తొడుగు అతుకులవద్ద (Joints) శక్తిమంతమైన బంధనము నేర్పరచి స్ఖలనమువలన కాండ్యూట్ లోని విద్యుత్ప్రవాహమును త్రెంపులేనిదిగా చేసి, ఏదో ఒక స్థలమునుండి భూసంబంధమును కల్పింపవలెను. దీనివలన లోహపు తొడుగు భూపీడనమునం దుంచబడి (Earth potential) విద్యుత్తు యొక్క ఘాతమునుండి (Electric shock) రక్షణ సమకూరును. లోహపు తొడుగునకు లేక కాండ్యూటునకు విద్యుత్ప్రేషకము యొక్క ఉత్పాదన స్థానమువద్ద (Entry of the supply) భూసంబంధమును కల్పింతురు. ఒక కొనకు రాగి వాహకముతో బిగింపబడిన భూసంబంధమును కల్పించు క్లిప్పును (Earthing clip) (చూ.1.22)

మరి యొక కొనకు జలవాహకమును (Water supply mains)గాని, భూమినిగాని భూసంబంధమును కల్పించు పళ్ళెమును గాని (Earthing plate) కలిపి, భూసంబంధమును కల్పింతురు. భూసంబంధమును కల్పించు వాహకముయొక్క ఛేదన విస్తృతి (Cross sectional area) 0.0045 చ. అం (7/0.029 లేక 14 యస్. డబ్ల్యు. జి. లకు తక్కువ కాకుండ లేక రక్షణమును పొందు వాహకముల మందములో సగము మందమునకు తక్కువ కాకుండ గాని యుండవలెను. భూసంబంధమును కల్పించు పళ్ళెము యొక్క వైశాల్యము 1 నుండి 2 చ. అంగుళముల వరకును ఉండవలెను. ఇది కనీసము భూమిలో 6 అడుగుల లోతున తడియైన లేసుతో (Damp lace) బంధింప బడవలెను. విస్తృత ప్రతిష్ఠాపనము లలో ఒకటికన్న ఎక్కువగ భూసంబంధమును కల్పించు పళ్ళెములు ఉపయోగింపబడును. మఱల ఈపళ్ళెముల నన్నిటిని అంతర సంబంధులుగ చేసెదరు.

నియమముల ననుసరించి లోహపుతొడుగు లేక కాండ్యూట్ యొక్క నిరోధమును; భూమియొక్క విద్యుద్వారము (Earth electrode) తో సంబంధ ప్రదేశము నుండి సంపూర్ణమైన ప్రతిష్ఠాపనలోని ఏ స్థలమునకుగాని మధ్యగల భూసంబంధమును కల్పించు సీసపు ప్రమాణము యొక్క నిరోధమునుకలిపి ఒక ఓము కంటె మించరాదు.

ప్రతిష్ఠాపనములను పరీక్షించుట (Testing electrical Installations).. నియమముల ననుసరించి ప్రతిష్టాపనమును పరీక్షించుట అత్యవసరము. ప్రతిష్ఠాపన యొక్క సామాన్య స్థితిని తెలిసికొనుట కొఱకు విద్యుద్బంధనము యొక్క నిరోధమును (Insulation resistance), భూసంబంధము యొక్క వాహకత్వమును (conductance), విద్యుద్వాహకము స్విచ్చిల సంబంధములను పరీక్షించుట అవసరము. దీనికై ఈక్రింది పరీక్షలు చేయబడుచుండును:

భూనిక్షిప్త విద్యుద్భంధనము యొక్క నిరోధము :--మెగ్గర్ (Megger) అను సాధనముతో ఈ పరీక్షను కొనసాగింతురు. విద్యుద్వలయములందు సాధారణముగా నుండు వోల్టేజికి సుమారు రెండు రెట్లున్న ఋజువిద్యుత్ప్రవాహపు వోల్టేజి (D.C. Voltage) పరీక్షకుపయోగింతురు. (త్రిదశా వికల్ప విద్యుత్ప్రవాహము వాడినట్లయినచో ఆర్. యమ్. యస్. (వికల్ప) విలువకు రెండు రెట్లు అవసరము). ఈ పరీక్షను ప్రతిష్ఠాపనమున కంతటకును కంపెనీవారి ప్రధాన ప్రేషక తంత్రులను కలుపు ద్విధ్రువ స్విచ్చి వద్ద కొనసాగింపవలెను. 'మెగ్గరు' యొక్క భూసంధి కొన (Earth terminal) జలవాహకమునకో లేక మంచి భూసంబంధమునకో కలువవలెను. 'మెగ్గరు' యొక్క విద్యుద్వాహిని యొక్క కొనను (Line terminal) ప్రధాన తంత్రులలో (Main leads) నేదో నొకదానికి కలుపవలెను. ఈ పరీక్ష నొనరించునపుడు ప్రతిష్ఠాపనమునందలి స్విచ్చిల నన్నిటిని మూసి వేయవలెను. ఫ్యూజు తీగలు వాటి వాటి స్థలములలో నుండవలెను. దీపములన్నియు వాటి వాటి స్థలములలో నుండవలెను. ఇట్టి స్థితిలో విద్యుద్బంధనము యొక్క నిరోధము (50/పాయింట్ల సంఖ్య) మెగోముల (Megohms) కన్న తక్కువగ నుండరాదు. కాని ప్రతిష్ఠాపనమున కంతకును నిరోధము మెగోము కన్న అధికముగ నుండరాదు.(చూ. 5. 23)

విద్యుద్వాహకముల మధ్య విద్యుద్భంధనము యొక్క నిరోధము (Insulation resistance between conductors):-- వాహకములను సరఫరాచేయు కంపెనీవారు వాహకముల నిరోధము విషయమున పట్టుదల వహింపరు. కాన ఈ పరీక్ష సాధ్యపడినచో మాత్రమే చేయవచ్చును.

ఈ పరీక్షలో, బిగింపుల (Fittings) యొక్క రెండు విద్యుద్వాహకముల మధ్య విద్యుద్బంధనపు నిరోధమును కనుగొన వచ్చును. ఈ పరీక్షను కొనసాగించు నపుడు ప్రతిష్ఠాపనమునందలి ఫ్యూజు తీగలు వాటి వాటి స్థానములలో నుండవలెను. స్విచ్చిలు తెరచియుంచవలెను (On). దీపములను తీసి వేయవలెను (Out). (చూ.ప.24.)

విద్యుద్బంధనము యొక్క నిరోదము(50/పాయింట్ల సంఖ్య) (Megohms) మెగోముల కంటే తక్కువగ ఉండరాదు.

విద్యుద్భంధనము యొక్క అత్యల్ప (Minimum) నిరోధమును "అత్యధిక (Maximum) స్థలనపు విద్యుత్తు (Leakage current) విద్యుద్వలయములోని విద్యుత్తులో 1/5000 కంటె అధికముగ నుండరాదు" అను సూత్రమును బట్టి కూడ కనుగొనవచ్చును.

ఒక ధ్రువముతోకూడిన స్విచ్చిల వద్దనుండు తంత్రుల కలయికను పరీక్షించుట:- ప్రతిష్ఠావనమునకు సాధారణముగా రెండు వాహకము లుండును. ఒక వాహకము భూపీడనమం దుంచబడవలెను. ఇంకొకటి ప్రేషణము(Supply) యొక్క నిర్ణీతమయిన వోల్టేజి (Rated Voltage) వద్ద ఉంచబడవలెను. విద్యుత్ప్రవాహమును ఆపునపుడెల్ల ఎలక్ట్రిక్ ఫాన్ (Electric fan), ఇస్త్రీ పెట్టె (Electric iron), మొదలగు విద్యుత్పరికరములను నిర్జీవముగా (అనగా విద్యుత్ జీవతంత్రినుండి విడిపడుట)చేయుట భద్రత కొరకు అవసరము. ఈ పరీక్షను చేయునప్పుడు స్విచ్చి యొక్క ఏదేని ఒక కొనను భూమితో (ఉ౹౹ నీటి గొట్టముతో) కలుపుచు, ఒక పరీక్షా దీపమునుంచి స్విచ్చిని తెరచినట్లయిన స్విచ్చి వద్ద కలియు తంత్రులు సరియైన విధానమున స్థాపించినచో దీపము వెలుగును, లేనిచో వెలుగదు.

భూసంబంధి యొక్క అవిచ్ఛిన్నతను (Continuity) పరీక్షించుట:- తంత్రి చుట్టునున్న లోహపు తొడుగు పైని ఏ చోటికైనను భూమితో సంబంధమును కల్పించు విద్యుత్ ద్వారమునకును (earth electrode) మధ్య నున్న విద్యున్నిరోధమును కనుగొనుట కీ పరీక్ష చేయవలెను.

తంత్రుల పైనున్న లోహపు తొడుగును, ఎమ్మిటరు (Ammeter) ను మార్పదగు విద్యున్ని రోధకముసు (Adjustable Resistance) సుమారు ఆరు (6) వోల్టుల విద్యుద్ఘాటమును శ్రేణీవిధానమున అమర్చుట వలన పీడనము యొక్క పతనమును (Drop in the potential) కనుగొన వచ్చును.

ప్రధాన స్విచ్చినుండి తంత్రుల కొట్టకొసనున్న దీపమునకుగల వోల్టేజి పతనమును కనుగొనుట:- నియమమును బట్టి, ప్రేషక విద్యుత్తులో సుమారు మూడు (3) శాతమునకు మించి వోల్టేజి పతనముండరాదు. అనగా 230 వోల్టుల ప్రేషక విద్యుత్తునకు దాదాపు 8 వోల్టులకన్న అధికముగ వోల్టేజి పతన ముండరాదు.ఈ పరీక్షను చేయుటకు ప్రేషకము వద్ద వోలు మీటరుతో వోల్టేజి కనుగొనవలెను. తరువాత ప్రధాన స్విచ్చినుండి అతి దూరముననున్న దీపము వద్ద వోల్టేజి కనుగొనవలెను. ఈ రెండు విలువల తేడా పై జెప్పబడిన నియమమును మించి యుండరాదు. ఈ పరీక్షను చేయునపుడు అన్ని దీపములు, తదితర విద్యుత్పరికములు పనిచేయు చుండవలెను ('On')

ఒక్కొక్కప్పుడు పై జెప్పబడిన నియమములను శాస్త్ర ప్రకారము పాటించుట కవకాశముండదు. వ్యక్తుల యిండ్లలోను, దుకాణములలోను మనము ప్రతిష్ఠాపనమును చేయుటకగు ఖర్చును తగ్గించుట కొఱకు కొంత వస్తుగుణ ప్రమాణమును (Quality) త్యాగము చేయవలసి యుండును.

ప్రతిష్ఠాపనమును ఏర్పాటు చేయుటకు ముందు ఈ దిగువ అంశములను మొదట నిర్ధారణ చేయవలెను.

1. వినియోగింపబడు వస్తువుల (Material) రకమును,నాణ్యమును (Quality). 2. తంత్రుల ప్రతిష్ఠాపనా విధానము. 3. ప్రతిష్ఠాపన పని సాగుచుండగా, నియమముల నుద్దేశించుట. 4. వివిధ అంగముల యొక్క (మీటరు, ప్రధానమగు స్విచ్ఛి మొదలగు వాటి) స్థాననిర్దేశము, వివిధ అంగములను, పాయింట్లను చూపుపటము (Plan), కావలసిన పరికరములు, వస్తువుల జాబితా. 5. అవసరమైన విద్యుద్వలయముల సంఖ్య. అయిదు (5) ఏంపియర్లకు మించని శక్తితోగూడిన ఒక ఉపవిద్యు ద్వలయము 40 వాట్లు, 220 వోల్టులు, ప్రమాణము గల 20 పాయింట్లకు సరఫరా చేయగలదు. 6. భూసంబంధమును కలుగజేయుట. 7. ప్రతిష్ఠాపనములను పరీక్షించుట. ఎంత జాగరూకతతో ప్రతిష్ఠాపనమును ఏర్పరచినను కొన్ని ప్రమాదములకు దారి దీయగల పొరపాట్లు సంభవించు చుండును. ప్రతిష్ఠాపనములో విద్యుత్తు ప్రవహింపజేయుటకు ముందు (Switch on) విరిగిన తంత్రులు, తప్పుడు కలయికలును లేకుండ సరిచూచినచో, ఇట్లు ప్రమాదముల బారినుండి రక్షణలు పొందవచ్చును.

అ.హు