సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అంతర్గుహాకములు
అంతర్గుహాకములు:- (Celenterata) అంతర్గుహాకములు, సీలెంటరేటా (Celenterata) లేక 'కొనిడేరియా' అనునవి నిర్దిష్టమగు (సీలెంటరేటా) కణజాలమును కలిగిన హీనాతిహీనమగు ఒక తరగతి జంతువులు. (ఇది గ్రీకుభాషనుండి వచ్చినది. (Koilos = Hollow) గుల్లగా నుండు (Enteron = Intestine) ప్రేగు, ఆంత్రము.) ఈ వర్గమునందలి అతి సామాన్యమగు రూపములు అతి సామాన్యమైన స్పాంజీలకన్న ఎక్కువ తరగతిలో నుండవు. అయినప్పటికిని ఈ తరగతికి చెందిన జాతులు ఎక్కువ అభివృద్ధిలో నున్నవి. ఈ జాతియందలి పెక్కు జీవులు సుస్పష్టమైన ధాతుమండలము (Tissue) యొక్కయు, అంగముల యొక్కయు, ప్రారంభదశను వ్యక్తము చేయును. అంతర్గుహాకజాతిలో అనేక రకముల అంగవర్తులత్వ సౌష్ఠవము (Radial symmetry) కన్పించును. మరికొన్ని పార్శ్వ (Lateral part) సౌష్ఠవో పేతములై యుండును. పెక్కు అంతర్గుహాక ములు ఉత్పత్తికి తోడ్పడునవి; అట్లేర్పడిన చిన్న చిన్న గుంపులు అన్యోన్య సహకారమునకును, శ్రమవిభాగమునకును చక్కని ఉదాహరణములు.
అంతర్గుహాకములందు పరిచిత్రములు, సుందరములును అయిన రూపములు అధిక సంఖ్యాకముగా నున్నవి.సముద్రపు పోటు పాటు గల ప్రదేశములలోను, వాటికి దూరముగా ఉండు ప్రదేశములలోను ముత్యపుచిప్పలను, రాళ్ళను జాలరు కట్టునట్లుగా కటు 'జూ ఫైట్సు' అనబడు అందమైన కణజీవులును; గుంటలలో తేలుచు, పారదర్శకములైన (Transparent) చిరుగంటల వంటి జీవులును. రాళ్ళసందులలో గుంపులు కటు 'సముద్రపు అనిమోన్సు' అనబడు గాలిపువ్వులును; అలలపై అతిచురుకుగా ఈదగల జెల్లిచేపలును; అంతర్గుహాక జాతికి చెందిన అలస స్వభావము కల పోలీపాయ్ డ్ (పుర్వగకములు) లకును, చురుకైన స్వభావముగల మెడుసాయ్ డ్ (ఛత్రికలు) లకును కొన్ని నిదర్శనములు, టినోఫోరా ప్రత్యేక జాతికి చెందినటువంటి 'గ్లోబ్సు' అను జీవులు మృదువులును, చిత్రవర్ణములు కలవియు అయి, మిక్కిలి చురుకుగా ఉండును.
అంతర్గుహాకములలో హైడ్రావంటి మూడు నాలుగు రకములే మంచినీటిలో నుండునవి; మిగిలినవన్నియు సముద్ర వాసులు. లోతులేని వెచ్చని సముద్రములలో అంతర్గుహాకములు అన్ని విధములయిన సుందరాకారములను సాధారణముగా ప్రదర్శించవు. ఎత్తుగా పెరిగిన పుర్వగకముల ('పాలిప్సు, Polypes) గుంపులు, గట్లవలే దట్టముగా పెరిగిన పగడపు గుట్టలు సముద్రపు టడుగు భాగమున నుండును. వీటి ప్రభావము వెన్నెముక లేని ఇతర జంతువుల పైనను, చేపలపైనను కూడ ఉండును.
సామాన్య లక్షణములు:- చాలవరకు అంతర్గుహాకములు ఎల్లప్పుడును, అంగవర్తులవు సౌష్ఠవముగల జంతువులు. జీర్ణకోశ కుహరము, దాని శాఖలు తప్ప వేరొక శరీర కుహరము వాటికి లేదు. సామాన్యమైన రూపములలో ఈ కుహరము యొక్క ప్రధానద్వారము ఎదిగిన జీవులలో నోరుగామారును. కొన్ని ప్రత్యేక రూపములలో శరీరపు పై భాగమునకు చెందినదియో లేక ముఖసంబంధ మయినదియో అగు కోశము ఉండును. ఇదియే గొంతు గొట్టముగా ఏర్పడును.
శరీర కుడ్యపు అంతశ్చర్మమునకును బహిశ్చర్మమునకు నడుమ వాటిని బలపరచుచు, తేగుడువంటి పొర యొకటి ఉండును. 'టినోఫోరా' జాతిలో జీవి పెరుగుదల యొక్క ప్రాథమిక దశయందే స్పష్టమగు మధ్యచర్మ మేర్పడును. ఈ జీవులలో అధిక భాగమునందు గుచ్చుకొనునట్టి కణము లున్నను, టినోఫోరాలో వాటి స్థానమున అతుకుకొనునట్టి కణము లుండును. అంతర్గుహాక ములలో 'పుర్వగక,' 'ఛత్రిక' అను నిర్మాణాత్మక ములగు రెండు వర్గములు కలవు. ఒకే ప్రాణియొక్క జీవ చరిత్రయందీ రెండు వర్గ లక్షణములును ఒక్కొక్కప్పుడు కన్పించును. ప్రాణులలో ఒక తరము విడిచి, మరొక తరము నందు కొన్ని లక్షణములు కన్పటు దృశ్యమునకిది నిదర్శనము. ఒక్కొక్క తరమునందు లింగ సహితోత్పత్తి, మరొక తరమున లింగరహితోత్పత్తి కలుగు దృశ్యమునకు కూడ ఇది నిదర్శనము. పుర్వగకములచే ఏర్పడు ఖటిక పంజరము పగడముల ఉత్పత్తికి దారి తీయును. 'మొగ్గల' మూలమున సంఖ్యాభివృద్ధి సామాన్యముగా అవి గుంపులుగా ఏర్పడి, వాటియందు శ్రమ విభాగము చేసికొనుట చూపట్టు చుండును.
జీవిత చరిత్ర :-అంతర్గుహాకములలో వ్యతిరేకములైన రెండు జీవితవిధానము లుండుటచే అవి దృష్టి నాకర్షించునవి. పుర్వగకము, ఛత్రిక అనునవి ఆ రెండు విధములకు సంబంధించినవి. పుర్వగకము కదలక స్థిరముగా నుండును. ఛత్రిక శారీరకమగు పెరుగుదలను విస్తారమగు కార్యక్రమమును, నిర్మాణమును, గనబరచుచు ఒక ప్రదేశమునుండి వేరొక ప్రదేశమునకు పోవుట యందు మిక్కిలి చురుకుగా నుండును. పెక్కు అంతర్గుహాకములలో 'పుర్వగక జాతి' మాత్రమే కనిపించును. తక్కిన వాటిలో రెండు రకములు ఒకే జీవియందు గాని, ఆ జీవులతో నేర్పడిన సమూహమునందుగాని కనబడును.
ఛత్రిక స్వేచ్ఛగా జీవించుచు, వెడల్పు గల శరీరమును కలిగియుండును. ప్రధానమగు జఠర కుహరము ఏర్పడి, ఆ జఠర కుహరమునుండి వ్యాపించు నాళికా మండలము దగ్గర అంతశ్చర్మ వలయము ఏర్పడును.
పుర్వగకము యొక్క ఆదిమమైన మీసములను వహించు ఈ అంచు నోటినుండి వేరుచేయబడి ఘంటాకారముగా క్రిందివైపునకు వంగియుండును. తరచుగా మూతిపై మీనముల యొక్క రెండవజత (Manubrium)అథోభాగము పై పెరుగును. పుర్వగకమునందున్న అంగ వర్తుల సౌష్ఠవము ఛత్రికలో వ్యాసార్ధగామిగా అభివృద్ధి చెందిన నాశి కామండలముద్వారా మరింత అధికముగా స్ఫుటము చేయబడుచున్నది.
అంతర్గుహాకములలో కనుపించు ఉత్పాదక జీవ కణములు జంతుకోటియందు అంతటను సామాన్యముగా అగపడును. అండములు, శుక్రాణువులు వేరు వేరు జీవులచేగాని లేక సమూహములచేగాని వహింపబడును. ఫలదీకరణము నొందిన అండము సమానముగా విభజనము నొంది మొదటి పొర అయిన బహిశ్చర్మము ఒక ఏక బత్తిక (Blastulla) అను ఒక మధ్య కుహరమును చుట్టుకొని ఉండును. ఈ కుహరము . అంతశ్చర్మకణసంహతిచే నిండియుండును. బహిశ్చర్మమునకు నూగు ఏర్పడును. ఇట్టి డింభమును "చికిటకము” (Planula) అందురు. అది ప్రవాహముతో కదలుచుండును. "అఫ్లైటిస్" (Aplitis) అను బహిశ్చర్మమును, జీర్ణాశయబిలమును తరువాత కనుపించును. ఆ డింభము నీటి అడుగుభాగమునకు మునిగి ఒక కొనతో అంటుకొనియుండును. ఇంకొక చివర నోరు, మీసములు ఏర్పడి ఆ జీవి "పుర్వగకము"గా మారును. పై రీతిగా గాక అండము నేరుగా మెడూసాగా పెరుగగల జీవులును కొన్ని గలవు.
ఉదా:- జలీయకము (Hydra); ఒబిలియా (Obelia);మోనోసొసిస్ట్ (Monosocyst),
పునరుత్పత్తి:- వీటిలో పునరుత్పత్తి రెండు రకములుగా జరుగును. ఒక జీవి యొక్క ఒక జీవియొక్క దేహ కుడ్యముపై తొలుత పార్శ్వములయందు మొటిమలవంటి 'మొగ్గలు' బయలుదేరును. ఈ మొటిమలవంటి మొగ్గ తనకు కారణభూతమైన తల్లి జీవివంటి రూపమును పొందువరకు పెరుగుదల నొందును. దానిచుట్టును మూలమందు ఒక విధమగు నొక్కు ఏర్పడిన తర్వాత ఈ క్రొత్తజీవి, స్వతంత్రముగా జీవించుటకు తల్లినుండి వేరుపడుటగాని, లేక ఆ జీవ సమూహ నిర్మాణమున రెండవజీవిగా కలిసి వుండుట గాని జరుగును. ఇదేవిధముగా ఆ సంఘమునందలి మిగిలిన జీవులు ఉత్పత్తి అగుచుండును. చాలరకముల అంతర్గుహాకములలో లైంగిక పునరుత్పత్తి మరియొక విధానము. ఈ విధానమున స్త్రీబీజములు (Ovum), శుక్ల బీజములు ఉత్పత్తియగును. శుక్లకణ మొకటి స్త్రీ బీజముతో కలియుటవలన పిండము తయారగును.పిండము మొదట క్రిమిగా ఏర్పడి తరువాత క్రొత్త జీవిగా రూపొందును. కొన్ని రకములలో కణవిభజనము లేక నిలువున విభజనము నొందుట సంభవించును. కొన్ని రూపములలో పునరుత్పత్తి (ఖండిలనము) (Strobilation) అడ్డముగ విభజనము నొందుటచే జరుగును.
వికల్ప ఉత్పత్తి విధానము (Alternation of Generation):= అంతర్గుహాకములలో వికల్ప ఉత్పత్తివిధానము ఒక విశేషలక్షణము. మొగ్గల రూపమున పునరుత్పత్తి జరుగు లింగరహితదశయును, ఫలదీకరణమును చెందిన అండముద్వారా పునరుత్పత్తి జరుగు లింగసహిత దశయును, ఒకటి విడిచి ఇంకొకటి సంభవించుచుండును. లింగరహితదశ హైడ్రా (మంచినీటి పుర్వగకముల) వలెను, లింగసహితదశ మెడూసా (ఛత్రిక) వలెను ఉండుటచే ఈ మార్పు ఇంకను క్లిష్టముగా నుండును. ఈ జీవులలో ఒకదానినుండి మరి యొకదానికి ఒక చక్కని క్రమము కనిపెట్టబడినది. 'మొదట హైడ్రా అను ప్రాణియు, దాని నుండి సెర్టులేరియా వంటి రూపములద్వారా 'ఓబీలియా' ప్రాణులకును, ఎరియోప్ వంటి ప్రాణులకును, జెరియోనియా రూపములకును ఈ క్రమము వ్యాపించుచున్నది. హైడ్రా (జలీయకము) ప్రాణియందు 'ఛత్రిక' కానబడదు. సెర్టులేరియా యందు ఛత్రికరూపము తక్కువగను, అప్రధానముగను కనబడును. ఓబీలియాలో జలీయకము, ఛత్రిక సమప్రాధాన్యములో నుండును. జిరియోప్ నందు జలీయకరూపము తగ్గుదలనొంది ఉండును. జెరియోనియాలో జలీయక రూపము మృగ్యమై యుండును.
బహురూపత (Polymorphism): బహురూపతతో కూడిన సమూహరూపముల అభివృద్ధి అంతర్గుహాక జాతి యొక్క చక్కని లక్షణము. కొన్నిటిలో సమూహము ఒకేపోలికగల జలీయక రూపములను కలిగియుండును. ఛత్రికలు ఫలదీకరణము నొందిన అండములను తయారుచేయును. ఈ అండములనుండి తగిన పరిసరములో ఒక్కొక్కటి ఒక క్రొత్త సమూహ రూపముగా రూపొందగల క్రిములు ఏర్పడును. కొన్ని సమూహరూపములలో ఆహారమును పట్టుకొనుటకు కొన్నియు, ఆహారమును జీర్ణించుకొనుటకు కొన్నియు వ్యక్తులు ఏర్పడియుండును. అత్యుత్త మమగు బహురూపత గొట్టములవలె నుండు జెల్లి చేపలలో (సై ఫోనోఫోరో) ఏర్పడును. ఒక సమూహమున కొన్ని వ్యక్తులు చలనమునకును, కొన్ని నీటిలో తేలి యుండుటకును, కొన్ని ఆహారమును జీర్ణించుకొనుటకును, కొన్ని బలముగా గ్రుచ్చుకొను పొడుగైన దారములతో కూడిన మీసములవంటి అవయవములుగా ఏర్పడుటకును. ప్రత్యేకింపబడి యుండును. ఇవి ఆ సమూహమును రక్షిం చుటకును, శత్రువును బలహీన పరచుటకును ఉపయోగింపబడుచుండును. కొన్ని పొలసులవంటి రక్షణాంగములను గలిగి సమూహమందున్న కడుసున్నితమగు జీవులను కప్పియుండును. కొన్ని ప్రాణులు సమూహము యొక్క పునరుత్పత్తి కొరకు లింగసంబంధమగు కణములను మాత్రమే ఉత్పత్తి చేయును. పునఃసృష్టి (Regeneration):- అంతర్గుహాకములలో పునరుత్పత్తిచేయు శక్తి గమనించ దగినది. లోపించిన భాగములను తిరిగి సృష్టించుకొనుటలోను, ఆ జీవి యొక్క ఒకానొక శరీరభాగము సంపూర్ణమైన జీవిగా పెరుగుటయును గూడ, వానికిగల పునరుత్పాదక శక్తిచే జరుగుచుండును. ఉదా॥ జలీయకము యొక్క మీసములలో నొకటి తెగిపోయినచో, దానిస్థానమున క్రొత్త మీస మొకటి బయలుదేరును. లేక జలీయకము కొన్ని ముక్కలుగా తెగిపోయినచో ప్రతిముక్కయును సంపూర్ణమైన క్రొ త్తజీవిగా వృద్ధిజెందును.
పగడము:- సమూహములుగా జీవించు అంతర్గుహాకములయొక్క ఖటిక (కాల్షియ) పంజరమే పగడము. పగడములు ఒకప్పుడు మొక్కలవలె శాఖోపశాఖలుగను,మరి యొకప్పుడు పక్షి ఈకవలెను, ఇంకొకప్పుడు మెదడు వలె గట్టి ఉపరితలములు గలిగిన అర్ధగోళము లేక పూర్ణ గోళము వలెను, వివిధరూపములతో నుండును. పగడములు అందమైన రంగులతోనుండును. ప్రత్యేకముగా విలువగల పగడములు అనబడునవి సామాన్యముగా కొంత ఎరుపురంగును కలిగి యుండును. అవి ఆభరణములలో ఎక్కువగా ఉపయోగింపబడుచున్నవి. ఎక్కువ విలువైన పగడపు రాళ్ళు, మధ్యధరా సముద్రము నుండి లభించు చున్నవి.
పగడములు, మహాసముద్రములలో వెచ్చని భాగములయందు పగడపు దీవులుగా నేర్పడును. ఉదా॥ బహమియా దీవులు, ఫిజీదీవులు, బెర్ముడా, ఆస్ట్రేలియా,క్యూబా, హావాయి, ఫ్లోరీడా, యుకటాను మొదలగునవి ఇట్టివి. నీటిముంపులో నుండు గట్టులపై పగడపు దీవులు నిర్మిత మగును. అవి భూమిదగ్గర సన్నని రాతి గట్టువలె ఏర్పడును. పగడపు గట్టులు చేపలు, ఎండ్రకాయలు మొదలగు సముద్రపు జీవులు దాగి యుండుటకు అనుకూలముగా నుండును.
కంకతినములు (టెనోఫోరా) :- టెనోఫోరాను, అప్పుడప్పుడు అంతర్గుహాకములలో ఒక తరగతిగా పరిగణింతురు. కాని కొన్ని ప్రధానమగు వ్యత్యాసములను చూపుచుండుట వలన ఇది మరియొక ప్రసృష్టిగా వ్యవహరింప బడుచున్నది. కంకతినములకు (టెనోఫోరా) శరీరముపై దువ్వెనలవంటి పలకలను కలిగియుండుట వలన దువ్వెన ఛత్రికలు అనియు (Jelleys), నిడివి వైపున కట్లు కట్లుగా నుండుటవలన సముద్ర అక్షొటములు (Sea walnuts) అనియు అందురు. ఛత్రికలు సున్నితమైన శరీరము కలిగి పారదర్శకములై యుండును. వాటి శరీరములు కొన్నిటిలో స్తంభాకారముగాను, కొన్నిటిలో గోళాకారముగాను, కొన్నిటిలో రిబ్బనువలె చదునుగాను ఉండును. వీటిలో కొన్ని రకములు అధిక సంఖ్యలలో మహాసముద్రములయందు నివసించుచు, తరుచుగా అందమైన వర్ణములను కలిగియుండును. వీటి శరీరమున ఒక చివర నోటిని, రెండవ చివర జ్ఞానప్రదమైన స్థితికోష్ఠము(Statocyst) అను దానిని కలిగియుండు రెండు కొన లగ పడును. కొన్ని కంకతినములు లోనికి ముడుచుకొనిపోవు రెండు మీసములను కలిగియుండును. ఈ మీసములు 'లాసో' కణములతో కప్పబడి యుండును. లాసోకణము లందలి దారమువంటి పదార్థము ఆహార కీటకములను పట్టుకొని బంధించుటకు ఉపయోగపడును. వీటి శరీరముపై నూగుతో ఏర్పడిన ఎనిమిది కట్లు తలనుండి తోకవరకును (Meridional) వ్యాపించియుండును. అవి చలనమునకు ఉపయోగించును. కంకతినములకు సంబంధించిన కొన్ని సామాన్య ఉదాహరణములు :- 'సముద్రపు గోళీ'అనబడు పూరోబ్రేహియా:- దీని శరీరము సున్నితమై, పారదర్శకమై యుండును. దేహవర్ణము గులాబిరంగు.దీనికి నూగు కలిగిన పొడవైన రెండు మీసము లుండును ఇది గోళీకాయ పరిమాణములో నుండును. ఇవి న్యూఇంగ్లాండు సముద్ర తీరము పొడుగునను విస్తారముగా నుండును.
సముద్ర అక్షోటములు (Sea-walnuts):- అనబడు బొలినాప్సిస్, నెమియాప్సిస్:- వీటికి మీసము లుండవు. ఇవి స్తంభాకారముగాగాని, శంఖాకారముగా గాని ఉండును. ఇవి పారదర్శకమైన శరీరముగల జీవులు. అవి అధిక సంఖ్యలలో గుంపులు గుంపులుగా నుండును. వానిలో కొన్ని రకములు రాత్రులయందు భాస్వరపు కాంతులను ప్రసరించుచు వింతగా ప్రవర్తించుచుండును.'సెస్టస్ వెనెరిస్' (Cestus veneris) అను జీవులు ఒకటి రెండు అంగుళముల వెడల్పుతో పొడుగైన చదునైన టేపువలెనుండు జీవులు. శరీరము ప్రకాశవంతమగు వర్ణములతో పారదర్శక ముగా నుండును.
ఆహారము :- జెల్లి చేపలును, సముద్రపు 'అనిమోన్సు'అనబడు గాలిపువ్వులవంటి పెద్ద జీవులును పెద్ద పరిమాణము గల ఎరను మ్రింగి వేయగల శక్తిని కలిగియున్నవి. చురుకుగా నుండు టెనిఫోరాలు ఒకదానితో మరియొకటిగాని, చిన్న జంతువులకు గాని కణ సహాయముచే అతుకుకొనియుండి మాంసాహారులుగా నుండును. అంతర్గుహాకములలో ఎక్కువ రకములు అతి సూక్ష్మజీవులను ఆహారముగా చేసికొనును. అవి వాని ఎరను పట్టుకొనుటకును, చంపుటకును 'దంశఘటములు'(Cnidobcosts) అను (కుట్టుటచే నొప్పి కలుగ జేయు) కణములను, మీసములను ఉపయోగించు కొనును. సూచ్యంగములు (Endoblasts) అనబడు గ్రుచ్చుకొను కణములను కలిగియుండుట అంతర్గుహాక జాతి యొక్క సహజ లక్షణము. కంకతినముల (టినోఫోరా) తరగతియందు తప్ప మిగిలిన అన్ని జాతులకును సూచ్యంగములు కలవు. ప్రతి దంశ ఘటమునకును సూచ్యంగము అనబడు నొక గుల్ల యుండును. ఆ గుల్లలో విషసంబంధమగు జిగురు పదార్థముండును. ఆ పదార్థమున సున్నితమై బోలుగా నుండు సూత్రమొక్కటి చుట్టలుగా నుండును. ఈ సూచ్యంగము కణము నందలి ఎక్కువభాగమును ఆక్రమించును. ఈ కణము యొక్క చివర (Cnidocil) అను మీటగాని, ముతకగా నుండు వెండ్రుకల కుచ్చుగాని యుండును. దంశఘటము ముడుచుకొనుట వలన కలిగిన ఒత్తిడిచే సూచ్యంగము బ్రద్దలగును. దారము రాసాయనికముగను, యంత్రమువలెను పనిచేయును. ఈ కటారులు ఆహార కీటకము యొక్క శరీరమునందు నాటబడి, అప్పుడు వెడలు స్రావము గాయమును విషపూరితముగా చేయును. ఈ విధముగా చిన్నచిన్న జంతువులు కదలకుండ చేయబడి చంపబడును. అప్పుడప్పుడు ఆ స్రావము కరిగించు ద్రావకము (Solvent) గా కూడా పనిచేయును. ఏది ఎట్లున్నను, 'సూచ్యంగములను' (నిమాటోసిస్టు Nematocysts) ఆయుధములనుటకన్న పట్టుకొనుటకు తగిన పాఠములు వల వలె వ్యాపించి యుండు నాడీ మండలము శరీరమం దంతటను సరిసమానముగా వ్యాపించి యుండును అనుట ఎక్కువ తగియుండును.
నాడీమండలము :- అంతర్గుహాకముల నాడీమండలము అతిప్రాచీన దశకు చెందినది. కేంద్ర నాడీమండలము వానికి లేదు. మేధస్సుకూడా లేదు. ఎట్లాఅయనను త్వరీతముగ ప్రేరణములను నిర్ణీతమైన దిక్కునకు తీసికొనిపోవు నాడీ మార్గము వీనిలో కలదు. అది ఉన్నత జీవులందు స్థానికముగాను, స్థిరముగను ఉండు నాడీ పద్ధతిని సూచించును.
పారస్ధిక విషయములు:- ఇంచుమించు అంతర్గుహాకము లన్నియు సముద్రజీవులు. సామాన్యమగు జలీయకము (హైడ్రా) మీసములేని సూక్ష్మాతిసూక్ష్మమైన జలీయకము (మైక్రోహైడ్రా) ప్రారంభదశయందు మత్స్య అందములపై పరాన్న భుక్కుగా నుండిన 'పాలిపోడియం',(Poly Podium) సంయోగ జీవులుగా నుండు 'కార్డిలోఫోరా' (Cardylophora) మంచి నీటి యందుండు ఛత్రికలు మొదలగునవి, మంచినీటి అంతర్గుహాకములకు ఉదాహరణములు. వీటిలో మిక్కిలి చురుకుగా ఈదు పెక్కుజీవులు లోతులేని నీటిలో నుండును. కొన్ని లోతైన నీటిలో కూడ కనబడును. చాలరకముల పుర్వగకములు ఇతరజంతువుల శరీరపు చిప్పలను ఆధారము చేసి కొని పెరుగుచుండును. అప్పుడప్పుడు అవి ఆ చిప్పలనుపూర్తిగా కప్పి వేయుచుండును. 'మునీశ్వరపీత'కును, సముద్ర 'కుసుమాభముల'కును ఎడ తెగని భాగస్వామ్యము అంతర్గుహాకములయందు విచిత్రమైనదృశ్యము. మునీశ్వరపీతసముద్ర కుసుమాభముచే కప్పబడి, దాని గ్రుచ్చుశక్తి చే రక్షింపబడు చుండును. సముద్ర కుసుమాభమును మునీశ్వరపీత మోసికొని తిరుగుచుండును. ఇట్టి పరస్పర లాభకరమగు బాహ్య భాగస్వామ్యమునే 'సహభోజనము' (Commensalism)అందురు. 'సహజీవనము' (Synbiosis) అను శారీరక భాగస్వామ్యము చాలరకములగు 'కుసుమాభము'ల యందును, 'ఆల్సి యొ నేరియన్సు' (Alcyonarians)యందును కలదు. అతిసూక్ష్మమైన ఏకకణ శైవలములు ఈ జంతువుల యొక్క శరీరకణములలో నివసించును.అంతర్గుహకముల ప్రసృష్టిలో దాదాపు 9,000 జాతులు గలవు. వాటిని మూడు తరగతులుగా విభజించిరి.
1. జలీయకవర్గము ( హైడ్రోజోవా Hydrozoa):-మంచినీటియందుండు పుర్వగకములు చాలా చిన్నవిగా నుండు జెళ్లి చేపలు, రాతివంటి కొన్ని పగడములు తరగతిలో చేరును. వీటికి అన్నకోశము ప్రత్యేకముగ లేదు. జీర్ణాశయ బిలము నందు విభాగములును, సూచ్యంగములును లేవు. మెడూసా సామాన్యముగా సన్నని పొరతో చిన్నదిగా నుండును. ఇవి ముఖ్యముగా లోతు లేని ఉప్పునీటిలో గుంపులుగాగాని, లేక ఒంటరిగాగాని, జీవించును.
2. ఛత్రికవర్గము ( స్కైఫోజోవా Scyphozoa ) :- పెద్ద జెల్లి చేపలు ముఖ్యముగా చతుర్భాగ అంగవర్తు లత్వ సౌష్ఠవము గలిగి, ఘంటా కారముగనో,ఛత్రా కారముగనో ఉండి స్వేచ్ఛగా ఈదగల ఛత్రికలు ఈజాతిలో చేరును. వీటిలో ప్రత్యేకమగు అన్నకోశము లేదు. బఠరసంబంధమగు మీసము లుండును లింగసంబంధమగు పుర్వగకములు ఉత్పత్తిచేయు ఛత్రికలు అన్ని సముద్రం జీవరూపములను ఉత్పత్తిచేయుచున్నవి.
3. పుష్పజీవములు (ఆంథోజోవా Antho Zoa):- ఈ తరగతిలో పగడములు, కుసుమాభములు మొదలగునవి గలవు. అన్నియు పుర్వగకములు మాత్రమే. ఛత్రికలు ఉండవు. ఏదై న ఆధారమును అంటి పెట్టుకొని యుందును. గుల్లగా నుండు మీసములతో మౌఖిక వలయము చదునుగా నుండును. జీర్ణాశయబిలము అరలుగా నుండును. సూచ్యంగములు ఉండును. ఈ జీవులు ఒంటరిగను, సమూహములుగను ఉండును. ఇవి అన్నియు సముద్ర జీవులు,
డా. డి. బా. రె.
[[వర్గం:]]