సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అంటువ్యాధులు (ఆయుర్వేదము)

అంటువ్యాధులు (ఆయుర్వేదము)—— ఒక రినొకరు కలిసికొని తిరుగుటచే ఒకరినుండి మరియొకరికి కలుగు వ్యాధులకు "అంటువ్యాధులు” అని లోకమున వ్యవహారము. వ్యాధికలవారితో కలిసిమెలిసి తిరుగుటచే మంచివారి కా వ్యాధులు అంటుకొనును గనుక "అంటుడు వ్యాధులు" అని పిలువబడుచు ఆనాటనా నాట "డు" అను నక్షరము లోపించి "అంటుడు వ్యాధులు" అను పదము "అంటువ్యాధులు” గామాత్రమే వాడుకయందు నిలిచినది.

ఈ అంటువ్యాధులకు సంస్కృతమున “సాంక్రామిక వ్యాధులు” అని వాడుక. ఇట్లు అంటు వ్యాధులుగా చెప్పబడినట్టియు, చెప్పతగినట్టియు రోగములెట్టివి? అట్టివ్యాధు లంటుకొనుటకు గల కారణము లేమి? అనుటలో భారతీయ ఆరోగ్య తత్వ దర్శనమగు ఆయుర్వేదమున ప్రాధాన్యముగల శస్త్రచికిత్సా గ్రంథమందు రాజర్షియగు సుశ్రుకు డిట్లు వర్ణించెను :

ప్రసజ్ఫా ర్గాత్ర సంస్పర్శా
        న్నిశ్వాసా త్సహ భోజనాత్
సహ శయ్యాసనాచ్చా౽ పి
        వస్త్రమాల్యానులేపనాత్
కుష్ఠం జ్వర శ్చ శోష శ్చ
        నేత్రాభిష్యంద ఏవ చ
ఔపసర్గికరోగా శ్చ.
        సంక్రామంతి నరా న్నరమ్.

సు. ని. అ 5- 38

రోగ గ్రస్తులగువారితో అతిగా కలిసియుండుటచేతను, పదేపదే రోగుల శరీరమును ముట్టుకొనుచుండుట చేతను,రోగులతో కలిసి భుజియించుటచేతను, రోగులతో కూడి పండుకొనుట చేతను, రోగులకడ కూర్చుండుట చేతను, రోగులు కట్టుకొను బట్టలను, రోగులు ధరించిన పూవులను, రోగులు వాడి మిగిల్చిన చందనాది అనులేపనములను ఉపయోగించుటచేతను, వ్యాధిగ్రస్తులనుండి ఆరోగ్యవంతులగువారికి ఆవ్యాధులు సంభవించును. అట్లు కలుగునట్లుగా నిర్దేశింపబడిన వ్యాధు లివి :

1. కుష్ఠము, 2. జ్వరము, 8. క్షయ, 4. నేత్రరోగములు 5. స్త్రీ పురుషుల సంయోగమువలన కలుగు “బట్టంటు” “కొరుకు” మొదలగు జననేంద్రియ సంబంధము లైన రోగములు.

ఇది అంటువ్యాధులకును, అంటువ్యాధులు కలుగుటకును గల సామాన్య వివరణము. ఏ విషయము నైనను ఆయుర్వేద శాస్త్రమునందు మొదలు సంగ్రహముగా చెప్పి తిరిగి దానిని మిక్కిలి విపులముగను, తేలికగను, నిస్సంశయముగను, అర్థమగునట్లు చెప్పుట సంప్రదాయమై యున్నది. ఇందువలన రోగములను నిర్ణయించుట యందును, చికిత్స చేయుటయందును సులభత యేర్పడుట జరుగును.

ఇట్లొకరినుండి మరియొకరికి సంక్రమించునట్లు చెప్పబడిన యీ యైదు విధములగు వ్యాధులును, ఈ వ్యాధులు కలుగుటకు కారణములుగా చెప్పబడిన తొమ్మిది విధములగు మార్గములును, సవిమర్శనముగ, సూక్ష్మాతి సూక్ష్మములుగా విభజింపబడి రోగములును, కారణములును, వేరువేర రెండువందలతొమ్మిది మార్గములు కలవిగ పరికల్పన చేయబడినవి. ఈ పరికల్పనకంతకును వాత పిత్త కఫములను త్రిదోషములును, త్వగ్రక్తమాంసాదు లను, సప్తధాతువులును ఆధారముగ చేయబడును. సప్తధాతువులలో అంశాంశకల్పనయందు రసమును విడిచి చర్మమును గ్రహింపవలసి యుండుట శాస్త్ర నిర్దేశ్యము. ఇవిగాక యీ విభజనయందు చేర్పతగిన మరికొన్ని అంటు వ్యాధులు “జనపదోర్ధ్వంసక ములు” అను పేర నాలుగు తెగలుగను, పదుమూడు విభాగములుగను బ్రహ్మర్షి యగు చరకుని మతమును అనుసరించి ప్రత్యేకముగ కలవు. (మనుష్యులు నివసించుపల్లెలు, పట్టణములు పాడగునట్లు చేయు రోగము లకు జనపదోద్ధ్వంసకములని వాడుక.) చరకుని మతమున ప్రత్యేకింపబడిన నాలుగు విధములగు ఈ వ్యాధులు కలుగుటకును గలకారణము గాలియు, నీరును దూషితములగుట. సకల జీవ జీవం జీవనము లగు జలవాయువులు దూషితము లగుటకు ప్రజలయందు అధర్మవర్తనమును, ప్రభుత్వస్థాయియందుగల ప్రజారోగ్యశాఖాధికారుల అధి కార దుర్వినియోగవర్తనమును కారణములు. ఈ జన పదోర్ధ్వంసక ములగు పదుమూడురోగములను పైసంఖ్య యందు చేర్చిన మొత్తము అంటువ్యాధులు రెండువందల యిరువది రెండుగా లెక్కకు తేలును. ఈ వ్యాధుల యొక్కయు కారణముల యొక్కయు వివరము లిట్లు తెలియనగును:

మొద లీ యంటు వ్యాధులు కలుగుటకు చెప్పబడిన కారణములు తొమ్మిదియు, పదునెనిమిది భాగములుగా విభజింపబడును. ఆ వివర మివిధముగ తెలియగలదు:

(1) ప్రసఙ్గము: విశేషముగ కలిసియుండుట. ఈకలిసి యుండుట యనునది మూడువిధములు.

1. కౌగిలించుకొనుట.
2. మిథునధర్మమున రమించుట.
3. క్రీడించుట. (వనవిహారము, ఆటలాడుట,జలక్రీడ. ) (ప్రసఙ్గమాలింగన రతిజలక్రీడాదీని.)

స్మరదీపనము, ప్ర-3-ను 12.

(2) 'గాత్రసంస్పర్శనము: పదేపదే శరీరమును తాకు చుండుట. ఇది మూడు విధములు.

1. ముద్దులాడుట.
2. ఒకరినొకరు కలిసికొని తిరుగులాడుట.
3. మాటిమాటికి రహస్యావయవములను ముట్టు కొనుచుండుట. దీనివలన రక్తమునందు ఉష్ణతయు, శుక్రశోణితముల :యందు త్తేజనతయు, అవయవములయందు ఉద్రేకతయుకలుగును.

(3) నిశ్వాసము : రోగినోటితో విడుచు గాలిని పీల్చుట.(నిశ్వాసమనగా పనివలన శ్రమచెందిగాని, లేక వ్యాధివలన అలసట చెందిగానీ నోటి వెంట విడుచు శ్వాసమునకు పేరు.)

(4) సహభోజనము : కలిసి భుజించుట, ఇది నాలుగు విధములు.

1. రోగితో కలిసి ఒకేపాత్రయందు భుజించుట.
2. రోగి తిని విడిచిన ఆహారమును భుజియించుట.
3. రోగి చే పెట్టబడిన ఆహారమును భుజియించుట.
4. రోగితో సరసన పంక్తియందు భుజించుట.

(5) 'సహశయ్యా : ఒకేపడక నుపయోగించుట. ఇది రెండు విధములు.

1. రోగి పండుకొనుచున్న పక్క యందు పండు కొనుట.
2. రోగితో కలిసి పండుకొనుట

(6) 'సహాసనమూ : ఒకే వేదిక నుపయోగించుట. రెండువిధములు.

1. రోగి కూర్చుండుట కుపయోగింపబడుచు పీట, చాప, అరుగు వీటిపై కూర్చుండుట
2. రోగితో కలిసి ఒకేయాసనమున కూర్చుండు

(7) 'వస్త్రమూ : రోగి ఉపయోగించిన బట్టలను ఉపయోగించుట. (8) 'మాల్యమూ : రోగి ధరించిన పూవులను, మాలలను ధరియించుట.

(9) అనులేపనము : రోగి ఉపయోగింపగా మిగిలిన గంధము, సున్నిపిండి మొదలగు మైపూతలను వాడుక చేయుట.

ఈ పదు నెనిమిది కారణములను ఆధారముగా చేసికొని శరీరమున గల వాతపిత్తకఫము లనబడు త్రిదోషము ఎగుడు దిగుడులై పెడత్రోవలను బట్టి, అనులోమ విలోమగతులచే (అనులోమగతి-వాతాదిదోషము లొక దానియ దొకటి కలిసి లీనమై పుష్టినొందించుకొనుచు తిరుగు విలో మగతి—ఒక దానినొకటి రెచ్చగొట్టి ఉన్మార్గగాము సంబంధములేక చరించుట. దోషములకు అనులోమ, యనునది ఆరోగ్యమునకు కారణము, విలోమ గతి య నది అనారోగ్యమునకు కారణము.) త్వగ్రక్తమా మేదోస్థిమజ్జా శుక్రము లను సప్తధాతువులను చెడగొ రెండు వందల తొమ్మిది గతులు గలవిగా అంటురోగమ వ్యాప్తికి వాహకము లగును. వీటి విభజన మిట్లు గల 'దీనికి అంశాంశ కల్పన మని పేరు.

ధాతువికల్పము

1. కేవల వాతాంతర్జనిత ములు
2. కేవల పిత్తాంతర్జనితములు
3. కేవల కఫాంతర్జనితములు
4. సప్త ధాతుపరిణామాంతర్జనితములు
5. దేశ భేదాంతర్జనితములు

వ్యాధివికల్పము

1. కుష్ఠములు
వ్యాధివికల్పము
1. కుష్ఠములు
మహాకుష్ఠములు-7
శుద్రకుష్ఠములు-11 18
2. జ్వరములు 8
3. క్షయలు 20
4. నేత్ర వ్యాధులు 96
5. ఔవసర్గిక ములు 67
మొత్తము 209

ఈ సంఖ్యయందుగల ఔపసర్గికరోగముల వివరము కొంత విపులముగ తెలిసికొనవలసి యున్నది. స్త్రీపురుష సంసర్గముల వలన కలుగు సంతానమార్గిక ములగు వ్యాధులకు ఔపసర్గికము లని శాస్త్రపరిభాషయందు వాడుక.ఇవి సుఖసంకటములని తెలుగునాట ప్రసిద్ధ ములు. కొరుకు, సవాయి, (శ్వవాయువనునది సవాయిగామారి యీ నాడు వాడుక కలిగినది. ఈ వ్యాధి కుక్కల సంసర్గత వలన వ్యాప్తికి వచ్చినది. దీన ఈ పేరు కలిగినది.) బట్టంటు అనునవి ఇవియే. ఈశులము నందు అ నేక భేదములతో చిలవలు పలవలుగా ప్రాకిపోవు స్వభావముగల వ్యాధులు నానా నామరూపభేదములతో బహుముఖములుగ గలవు. ఇదివరకు అరువది యేడుగా చెప్పబడిన యీ వ్యాధుల పరికల్పన మిట్లు చికిత్సా సౌకర్యమునకై చేయనైనది.

ఔపసర్గిక వ్యాధులు

ఔపసర్గిక వ్యాధులు
1. శుక్రదోషమువలన కలుగునవి. 8
2. రజోదోషమువలన కలుగునవి. 8
3. యోని వ్యాపత్తులవలన కలుగునవి. 20
4. అయోనిసంపర్కమువలన (నోరు, గుదము,హస్తము, మంచము) కలుగు వ్యాధులు. 5
5. విజాతియోని (ఆవు, గేదె, గుఱ్ఱము, గాడిద, మేక,కుక్క) సంపర్కము వలన కలుగువ్యాధులు. 5
6. దుష్టయోని సంపర్కమువలన కలుగు వ్యాధులు. 21
మొత్తము 67

సాధారణముగ నీ యంటు వ్యాధులన్నియు భయంకర పరిణతి చెందునవియే. ఇవి యన్నియు విరూపంకరణములును, బాధాకరములును, కాలాంతర ప్రాణహరములును, వంశక్షయకరములును అయియున్నవి. అనగా ఈ వ్యాధులు తమ కాశ్రయ మొసంగినవారిని విడువక ఆ జీవితమును బాధించుచు కొన్ని తరములవరకును వారి కుటుంబములయందు నిలిచి అల్పాయుష్కము, దుర్బలేంద్రియము, ఆజన్మ రోగపీడితము, విరూపము, కుడాపమును అగు సంతానమును కలిగించుచు తుదకు వంశ నిర్మూలన మొనరించి యంతరించును. కావుననే శుక్రమును చెడగొట్టుకొనరాదని ఆయుర్వేదమున హితము ఉపదేశింపబడి యున్నది.

"న వా సంజాయతే గర్భః పతతి ప్రస్రవ త్యపి
శుక్రం హి దుష్టం సాపత్యం సదారం బాదఠే నరం"

“గర్భమే కాక పోవచ్చును. గర్భము నిలిచినచో స్రావ మగుటగాని లేక పిండము జారిపోవుటగాని సంభవించును. అందువలన చెడునడతలచే శుక్రము చెడగొట్టుకొనిన పురుషుడు స్వయముగ రోగపీడితు డగుటయేకాక భార్యను సంతానమునుగూడ సదారోగపీడితులనుగా చేయును" అని భారతీయఆరోగ్యశాస్త్రము సిద్ధాంతముగూడ చేసెను. ఇందుకనియే స్త్రీపురుష సంయోగములందు వయసు, కాలము, ఆహారము, వంశశుద్ధి (ఇచట వంశశుద్ధి యనగ వివాహమునకుముందు వధూవరుల కుటుంబములయందు తల్లిపక్షమున అయిదుతరములనుండియు తండ్రి పక్షమున అయిదు తరములనుండియు ఏవిధమగు చెడు వ్యాధులును లేకుండునట్లు చూచుకొనవలయుననుట. ఇట్లయిన మాతృ పితృపక్షములుకలిసి దశ పురుషాంతరములగును. ఇది వంశ శుద్ధియనబడును. వివాహ నిర్ణయము నందు మను, వామదేవ, గౌతమ, వసిష్ఠ, అగస్త్య, పులస్త్యాదులగు పదు నెనమండుగురు ఈ సిద్ధాంతమును జేసిరి. ఈ విషయములను శౌనక సూత్రములందును నృసింహ పారిజాత ప్రయోగమునందును చూడనగును.) మొదలగు విధి నిషేధము లనేకములు చెప్పి నీరోగము, వీర్యవంతము, తేజోవంతము, మేధావంతమును అగు సత్సంతానముతో విశుద్ధమగు జాతిని నిర్మించుటకై భారతధర్మర శాధికారులగు పరిపాలకులు మంచి కట్టుదిట్టములు చేసిరి. మచ్చున కీప్రమాణములు చూడనగును.

స్త్రీసంబంధే దశై తాని
        సుతరాం పరివర్జయేత్
హీనక్రయం నిష్పురుషం
        నిశ్చందో రోమశా ర్శనం

క్షయామయా వ్యవస్మారి
        శ్విత్రి కుష్ఠి కులాని చ
చతుర్దశకులా నీమా
        న్యపి బాహ్యాని నిర్ది శేత్
అత్యుచ్చక మతిహ్రస్వం
        అతివర్ణం చ వర్జయేత్
హీనాంగ మతిరిక్తాంగ
        మామయాని కులాని చ
సదా కామకులం వర్జ్యం
        రోమశానాం చ యత్కులం
అపస్మారకులం యచ్చ
        పాండురోగకులం భవేత్.

"కులానురూపాః ప్రజాః సంభవంతీతి హారితవచనాత్ హీనక్రియం విహితక్రియారహితం నిష్పురుషం,స్త్రీ మాత్రపరి శేషం, నిశ్ఛందః, విద్యాహీనం, రోమశం, సర్వావయవసంరూఢరోమకం, ఆర్శసమ్, అర్శొరోగపీడితం" అని ధర్మనిర్ణయాధికారి యగు యముడు కూడ ఇట్లే చెప్పెను. ఇట్టి ప్రమాదభరితము లగు కొన్ని వ్యాధులుగల స్త్రీ పురుషులకు మరణదండన సయితము విధించి తుదకీ వ్యాధుల యొక్క వ్యాప్తి దేశమునం దరికట్టవలసినదిగా ప్రభుత్వస్థాయియందు దండనాధి కారముగా శాసించిరి. ఈ అంటువ్యాధులను గురించి యింతవరకు జరిగిన చర్చ యంతయు సుశ్రుతుని మతము ననుసరించి చేయబడినది.

ఇక బ్రహ్మర్షి యగు చరకుని మతము ననుసరించి అంటువ్యాధులుగా, జనపదోద్ధ్వంసకములుగా వాడుక కలిగి తీవ్ర వేదనాత్మకములును, సద్యః ప్రాణహరములునగు విషూచి, మశూచి, వినర్పి, విస్ఫోటము లను నాలుగు విధములగు వ్యాధులను అంశాంశ కల్పనమున పదు మూడు భేదములుగా విస్తరించి సద్యః ఫలప్రదములగు చికిత్సా సహితముగ తెలియచేయబడును. ఆ కల్పనవిధ మిది :

1. విషూచి : ఇది ఒకేవిధముకలదు. త్రిదోషజనితము .(కలరా యని వాడుకయందు ప్రసిద్ధి కలదు.) 2. మశూచి : ఇది రెండు విధములు. (1) శీతల : ఇది మందకఫము, క్షీణవాతముగల పిత్తాధిక్యతచే జనించును. శరీరము నిండుగా ఎఱ్ఱని, సన్నని పొక్కులు కలుగును. వేపపూత, ఆటలమ్మ, చిన్నమ్మవారు తెలుగునాట వాడుక కలదు. (2) మహాశీతల : ఇది క్షీణపిత్తము, కఫోల్బణ గల వాతాధిక్యతచే జనించును. తీవ్రవేదత్మకము, సెనగలవలె బొబ్బలు పెద్ద లేచును. సద్యఃప్రాణహరముగా గాని, విరకురూపములను కలుగ జేయునదిగా పరిణమించును. దీనిని పెద్దమ్మ వారందురు. 3. 'విసర్పము : ప్రాకి వ్యాపించు స్వభావము కల "సర్పి” యని వాడుక. మహా తీవ్ర వేదన కలిగించును. స్థాన భేదముల చే సద్యః ప్రాణ హరము. ఇది ఏడు విధములు -

(1) 'కాలవిసర్పమూ: కేవల వాత జనితము, చంక కణతలు, గజ్జలు, రొమ్ము, వీపు, మో మడతలు, వీటియందు పళ్ళికలవలె కాలి చిన్న చిన్న బొబ్బలు లేచును. రసి కారుటఁ లేకుండుటయు కలుగును.

(2) రక్తవిసర్పము  : పై వాతజమువలెనే తకి లక్షణములు కలిగి బొబ్బలు ఎరుపుర కలిగియుండును.

(3) జలవిసర్పము  : కేవల కఫజనితము. పిత్తజములవలెనే తక్కిన లక్షణములు క బొబ్బలు తెలుపుగను, నీరు నిండియున్న నిగారింపుగను కనుపడుచుండును. පු రసియు తేలిక గా నీరువలె నుండును.

(4) విషవిసర్పము : త్రిదోష జనితము. పైలక్షణ లన్నియు నుండును. కందిన కంచర కలిగియుండు బొబ్బలు కలుగును.

(5) అగ్ని విసర్పము  : వాతపిత్తజము.ములు పూర్వోక్తములే. బొబ్బలు మికి మంటలు కలిగియుండును.

(6) గ్రంథివిసర్పము  : వాతకఫజనితము. సం యందు మాత్రమే గ్రంథులు కలుగును. ష్యుని ధనువువలె ముందునకు వంచి వేయ (7) కర్దమవిసర్పము  : కఫపి త్తజనితము. నోటి యందును అంగుటినుండి గొంతునందును కలుగును, దీనిని "డి ఫ్తీరియా” యని పాశ్చాత్యు లనిరి. ఇది గొంతునుండి పెద్ద పేగు ద్వారా హృదయము, ఆమాశయమువరకు వ్యాపిం చుటయు ప్రత్యేకముగ ఆమాశయమునందే జనించి గొంతు మూసికొనిపోవుటయు, ఆమాశయమునందును, గొంతునందును తీవ్రవేదన కలిగించుటయు గలదు. మహా భయంకరమగు వ్యాధి.

4. విస్ఫోటము  : ఇది మూడు విధములు. (1) కాలస్ఫోటము: వాతోత్తరముగా కలది. శరీరమంతయు వేద నాత్మక ముగ ఉసిరిక కాయల వలె పెద్ద బొబ్బలు లేచును. (2) గళస్ఫోటము : వాతకఫోద్భవము. పైలక్షణములు కలిగి కంఠమునందు మాత్రమే బహిఃప్రదేశమున కలుగును, (3) విషస్ఫోటము: త్రిదోషజనితము. వీపునందును, వక్షస్థలము నందును కలుగును. దుశ్చికిత్సితము.

ఇట్లీ మొ త్తము...13
పూర్వోక్తములు....209
ఉభయము ఏకరాశిగా ధ్రువాంకము 222

ఇట్లు రెండువందల ఇరవై రెండుగా పరిగణనకు తేలిన ఈ అంటువ్యాధులలో రెండువందల తొమ్మిది వ్యాధులు తీవ్ర వేదనాత్మకములుగాని, సద్యః ప్రాణహరములుగాని కావు. ఇవి తెలియని బాధలను కలిగించుచు కాలాంతర ప్రాణహరణములుగా నుండును. జనవదోద్వంసకములగు పదుమూడు వ్యాధులును ఆశుచికిత్సావశ్యకత కలవి, తీవ్ర వేదనాత్మకములును, సద్యః ప్రాణహరణములును అయి యున్నవి. ఈ వ్యాధులకు "క్షుద్ర వ్యాధు "లనియు వాడుక. ఇందొక "మశూచికము” తప్ప మిగిలిన “విస్ఫోట, విషూచి, విసర్పములు” మహాత్వరితముగ ప్రాణములు తీయును. "మశూచికము” కొలది దినములు బాధించి చంపుటగాని, మనుజుని సౌందర్యహీనునిగా చేయుటగాని, చేయి, కాలు, కన్ను, ముక్కు, చెవి మొదలగు అవయవములయం దేదేని చెడగొట్టుటగాని చేసి విడుచును.

మిగిలిన విస్ఫోట, విసర్పములు, నాలుగైదు దినముల నుండి ఒక వారము వరకు మనుష్యుని చంపుటకు గడువిచ్చును. “విషూచి” మాత్ర మీ చంపుటయందు నిర్దాక్షిణ్యముగ కొన్ని గంటలకన్న ఎక్కువకాల మవకాశమీయదు. భయంకరములగు ఈ వ్యాధుల నిదాన చికిత్సలన్నియు చరక, సుశ్రుత, వాగ్భట, బృందమాధవ, మాధవనిదాన, బసవరాజీయ, యోగరత్నాకరములందును, దైవవ్యపాశ్రయ చికిత్సాధారముగ కర్మవిపాకమునందును చూడనగును.

జనపదోద్ధ్వంసక ములగు ఈ వ్యాధులు పుష్యమాసాంతము వరకుగల వర్షాశరద్ధేమంత కాలములయందు తరుచు కలుగుచుండుటయు, ప్రతిపల్లెపట్టులను, విశేషముగా పట్టణములను, సంగులసమరమువలె అల్లకల్లోలముగ చేయుటయు జరుగుచుండును. ఫాల్గున చైత్రము లాదిగా గల శిశిర వసంత గ్రీష్మములందు విషూచి మహాభయంకరముగ వ్యాపించి తాండవ మాడుచుండును. శీఘ్రముగ బలమగు చికిత్స లభించనిచో ఈ విషూచి నూటికి నూర్గురను చంపియే తీరును.

శాక్తేయు లీజనపదోర్ధ్వంసక ములగు వ్యాధులు దేవతా మహత్వము కారణముగా కలుగు నని దేవీతంత్రముల యందు వర్ణించిరి.

దేవీభాగవత, త్రిపురా సిద్ధాన్తశేఖర, బిన్దులక్షణము లిందుకు ప్రమాణము. అందీవ్యాధులకు గ్రామదేవతారాధనము, జంతుబలి, జపహోమాదికములు, శాంతికరములుగా చెప్పబడినవి. కొలుపులనియు, జాతరలనియు ఈ విశ్వాసమున జనబాహుళ్యమునం దీనాడును వాడుకగ జరుపబడుచునే యున్నవి. అందుచేత వ్యాధులు దేశవ్యాప్తములు గాకుండుటయు, శాంతిచెందుచుండుటయు చూడబడుచున్నది సత్య మేదైనను దేవతారాధనమును, ఈ జపహోమాది శాంతికర్మముల నాచరించుటయు ఆయుర్వేద మంగీకరించినది. ఇందు చరక ప్రమాణ మిట్లు కలదు. విమానస్థానము, 3 వ అధ్యాయము, పదుమూడవ శ్లోకమునుండి 214 శ్లోకము వరకునుగల అభిప్రాయమిచట సూచింపబడినది.ప్రమాణమును కాంక్షించు వారు మూలమును చూడనగును. ఆ అభిప్రాయమిది:

వికృతిచెందిన వాయు, జల, దేశ, కాలములు స్వభావముగ ఒక దానికంటే నొకటి బలమైనవిగా నుండును. గాలి కన్న జలము, జలముకన్న దేశము, దేశముకన్న కాలము ఎక్కువ శక్తిమంతము అని నిశ్చయింపబడినది. గాలి, నీళ్లు, దేశము, కాలము, దూషితమైన యపుడు అందుకు తగిన యౌషధములను జాగ్రత్తచేసి వాడుకొనిన యెడల అందు కనుబంధము లగు వ్యాధులు సోక నేరవు సోకినను బాధింప నేరవు.

ఇదియుగాక ఉపద్రవకరములగు అట్టివ్యాధులు సంభవించు సమయములందు సత్యము, భూతదయ, త్యాగము బలి, దేవతారాధనము, మంచినడవడిక (శుచిత్వము) ఇతరులకు మేలు చేయుట పుణ్యకర్మలనుచే యుట, బ్రహ్మ చర్యనియతి, బ్రహ్మణ్యులు, జితేంద్రియులు నగు మహర్షుల యొక్ష ధర్మబోధనలను వినుట, జ్ఞానవయోవృద్ధులను సేవించుటచే ధార్మికమైన నడవడికయు, సాత్విక మైన మనఃప్రవృత్తియు అలవడిన వారితో కలిసియుండుట ఆయుష్యరక్షణకు చికిత్సగా చెప్పబడియున్నది.

ఈ వ్యాధులనుండి రక్షింపబడుటకు శీఘ్రఫలప్రదములు సకల జనోపయోగములు నగు ఒకటి, రెండు, మూడు యోగము లిట ఉదాహరింపబడును. అందు 'విషూచి' యందీయోగము వాడుకొనవలయును.

ప్రాణప్రదఐటి :-

1. బాలింతబోలు తు. 3
2. మృద్దారు శృంగి తు. 1
3. ఇంగిలీకము తు. 1
4. రససిందూరము తు. 1.

కల్పన: ఈ ద్రవ్యములు శుద్ధి అక్కరలేక యే ఒక్కచో కలిపి, కల్వమున బాగా మంచినీటితో నూరి, గురి గింజలంత మాత్రలుచేసి యుంచుకొనవలయును.

ప్రయోగవిధి :-ఒక మాత్రను ఇచ్చి, ఒక గిద్దెడు పులి చల్లను త్రాగించవలయును. ఇట్లు ఆరారు గంటల కొక పర్యాయము వ్యాధిపూర్తిగా నిలిచిపోవువరకు ఒక్కొక్క మాత్రను ఇచ్చి తగినట్లు చల్ల త్రాగించుచుండవలయును. విషూచి(కలరా) దీనివలన నిలిచిపోయి రోగి బాగుపడును.

ఒక వేళ వ్యాధి ఉద్ధృతముగా మన్న యెడల వ్యాధి నిలచి నెమ్మదించువరకు గంట కొక మాత్ర ఇచ్చుచు, నాలుగైదు తులములు సుమారు మజ్జిగ త్రాగించుచుండ వలయును. ఇది వ్యర్థముకాని ఔషధము. ఈ వ్యాధి చుట్టు పక్కల వ్యాపించియున్నపుడు ఈదిగువ యె మును సేవించినచో విషూచి వారిదరికి చేరదు.\

యోగము :- 1. పాలు 2. నీళ్లు 8. నల్లని జీడిగింజ తు. 10 తు. 5 1 జీడిగింజను క త్తిరించి పాలలో వేసి నీళ్ళు ఇగురువ సన్నని మంటపై కాచి ఆ పాలలోని జీడిగింజను తీ పాలకు తగినట్లు పంచదార కలిపి, ఉదయము వరగఁ ననే త్రాగవలయును. ఒక తులమున ఇది ఒక మనుష్యునకు కావలసిన ప్రమాణము. కాచినపాలు పిల్లల వయసునుబట్టి హెచ్చించుచు, తగ్గించుచు త్రాగించవలయును. ఇది రోజు తీసికొనిన చాలును. ఆ కారున కావ్యాధి తగు అనగా ఆరుమాసముల కీ యౌపధబలము శరీర నిలిచియుండి యీ వ్యాధిని దరికి జేరనీయదు. ఇం పథ్యపాన నియమములు అనుసరింప పనిలేదు. మశూచి, విసర్పి, విస్ఫోటముల విషయములో ణ్యముగల చికిత్సకులు వెంటనంటి చికిత్స నీయ యుండును. ఈ వ్యాధు లన్నియు అసలు బాధింపకు నట్లు ఎవరికివారు వసంతారంభమగు చైత్రమాసమున గాని, వైశాఖ మాసమునందుగాని ప్రతి సంవత్స ఈ దిగువ కల్పమును సేవించుచుండవలయును. ఆ త్సరమంతయు, ఎట్టి దుష్ట వ్యాధులును వారిని బా జాలవు. నింబకల్పము :- 1. వేప ఈ నెలు 2. జీల క ర్ర 8. పటిక బెల్లపుపొడి తు. 5 తు. తు, 1 (దీనిని కలకండ, మిశ్రా, నాబోతు అని వాడుదురు.) తు. 67 కల్పన: వేప యీ నెలు పచ్చివి రోటిలో గాని, ములో గాని బాగా దంచి తగినట్టుగా నీళ్ళుపోసి తే నీళ్ళు పిండుకొనవలయును. వడియబోసికొనవలయు ఈ కల్కము 64 తులాల కన్న ఎక్కువ ఉండఁ జీలకర్ర వేయించి పొడుము చేయవలయును, మామూలుగా వంటలయందు ఉపయోగించు జీలకర్రనే ఉపయోగించవలయును. జీలకర్ర చూర్ణమును, పటిక బెల్లపు పొడియు, ఈ కల్కమునందు కలిపి త్రాగవలయును. ఇది ఉదయము పరగడుపున నే సేవించవలసి యున్నది. ఇట్లు మూడు దివసములు, మూడు ఉదయ కాలములయందు త్రాగవలయును.

సేవనవిధి:- ఈ కల్కము త్రాగిన వెంటనే దిగువు చెప్పబడిన విధి ప్రకారము సిద్ధము చేయబడిన "సిరా”ను అయిదు నుండి పదునైదు తులముల వరకు తినవలయును. ఆ దినమంతయు ఉప్పు, కారము, పులుపు గల పదార్థములను తినరాదు. పాలు, పంచదారలతోగాని, తియ్యని చల్లతోగాని వరియన్నము భుజింపవచ్చును. పెనముపై వేపి, పండునిప్పులపై కాల్చిన గోధుమ రొట్టెలను ఈ "సిరాతోగాని పాలు పంచదారలతోగాని యథేచ్ఛగా తృప్తి యగువరకు భుజించవచ్చును. మధుర పదార్థమే యెక్కువగా తీసికొనుట మంచిది. ఈ ఔషధ సేవా కాలమున ఆహారవిధి యిట్లే యుండవలయును. నాలుగవ దినము మొదలు పులుపు, ఉప్పు, కారములను కొంచెము కొంచెముగా వాడుకొనుచు నేయి, పాలు, పంచదారలను తృప్తిగా తీసికొనుచు ఏడు దివసముల వరకు క్రమాభివృద్ధితో ఈ విధి ననుసరించవలయును.

ఏడు దివసముల పిమ్మట స్వేచ్ఛాహార విహారములతో మెలగవచ్చును. ఆ ఏడు దివసములయందును పులుపు ఎంత తక్కువగ వాడిన అంత మంచిది. అట్లీ ఔషధ సేవ వలన ఆ సంవత్సర మంతయు ఎట్టి భయంకరమైన వ్యాధు లును దరిజేరవు. మరియొక విశేషము. ఈ ఔషధ సేవనము వలన శరీరమునగల ఔపసర్గిక రోగములన్నియు పోవును. బలము, వర్చస్సు కలుగును. ఆరోగ్యము సరిగానుండును. శుక్రరజో దోషములు పోయి సంతానము కలుగును. గర్భిణీస్త్రీలకు మూడవమాసమునందును, ఏడవమాసము నందును ఇచ్చు ఆచారము గలదు. దీనివలన సంతానమున కెట్టి మేహవ్యాధులును కలుగవు. తల్లి దండ్రులకుగల యే యితర వ్యాధులైనను సరే గర్భస్థ శిశువునకు అంటజాలవు.

సిరా చేయు విధానము:-

1. గోధుమరవ తు. 20
2. నేయి తు. 10
3. పంచదార తు. 30

కల్పన :- గోధుమ రవను ఈ నేతియందు దోరగా వేయించి యుంచుకొన వలయును. పంచదారకు తగినట్లు పాకమునకు నీళ్ళుపోసి ఉడికించి, లేతపాకములోనే ఈ పాకును వడియగట్టి అందీ రవ కలిపి మందాగ్నియందు తిరిగి పక్వము చేయవలయును. ఇక్కడి కిసిర సిద్ధమైనది. ఈ పరికల్పనచే భాగములను పెంచుకొని, యెంత ఎక్కువగానైనను సిద్ధము చేసికొనవచ్చును. దీని యందు వచ్చి కర్పూరము (ముద్దకర్పూరము), కుంకుమపువ్వు, ఏలకులు, జాజికాయ, జాపత్రి చేర్చిన సుగంధముగను, పౌష్టికముగను ఉండును. ఇందు సీమబాదము పప్పు చేర్చవచ్చును గాని అది యీ చెప్పిన భాగము ననుసరించి గోధుమ రవలో నాలుగవ భాగము చేర్చవలయును. అట్లు చేర్చు నెడల బాదము పలుకులను తగినంత నేతితో దోరగా వేయించి, మెత్తగానూరి పై పాకమునందు బాగుగా కలియునట్లు పొయి మీదనే వేసి దింప వలయును. మిగతా చెప్పబడిన సుగంధ ద్రవ్యము లన్నియు పొయి మీద నుంచి దించిన పిమ్మట వేసి, కలిపి, మూత మూయవలయును. ఇది యే దినమున కాదినము చేసికొనిన మంచిది. అది రుచ్యము, బలవర్ధనము అగుటయే గాక ఔషధ సేవనానంతరము వెంటనే తీసికొనుటవలన పైత్యోద్రేకమును కలుగ నీయదు. పై ఒకటి, రెండు, మూడు యోగములును మచ్చున కీయబడినవి.

ఇది గాక ఆయా ఋతువులందుగల కాలదోషముచే వాతోదకములు దూషితములై వ్యాపింపగల దుష్టములైన క్షుద్ర వ్యాధు లంకురింప కుండునట్లు నిరోధించుటకై ఆయుర్వేద చికిత్సా సిద్ధాంతమునందు సంగ్రహింపబడిన అనేక దివ్యౌషధీ కల్పములు, సిద యోగములు కలవు. నీటిని, వాయువును శుభ్రముచేయుటకు అనేక ఉపాయములు చెప్పబడినవి. నీటిని బావులందుగాని, చెరువులందు గానీ శుభ్రముచేయవలయునన్న కొన్ని ప్రక్షేప ద్రవ్యములను అందు వేయవలసి యున్నది. వాయువును శుభ్రము చేయుటకై ధూపములు, అగద భేరీ నినాదములు, ఔషధ లేపములతో కూడిన ధ్వజపతాకారోహణములు కలవు. అవి చరక సుశ్రుతములందును, అగ్ని, గరుడ పురాణము లందును, వరాహ సంహిత, మానసోల్లాసము, అభిలషితార్థ చింతామణి, కౌటిల్య అర్థశాస్త్రములందును చూడవలయును.

కాలధర్మము ననుసరించి షడ్రుతువు లందును భిన్న భిన్నములగు ఆయా వ్యాధులు కలుగుచున్నను, విశేషముగ విసర్గ ఆదాన కాలములయందు మధ్య ఋతువులగు శరద్వసంతములు మిగుల భయంకరములగు వ్యాధుల కునికిపట్టు లని వర్ణింపబడినవి. విసర్గకాలము వర్షా శర ద్ధేమంత ఋతువులు. ఈ ఋతువులందు సూర్యుడు తన కిరణ ప్రసారమున భూమికిని, అందలి పదార్థములకును బలమొసంగును. ఆదానకాలము శిశిర, వసంత, గ్రీష్మ ఋతువులు. ఈ ఋతువు లందు సూర్యుడు తీవ్రమగు తన కిరణ ప్రసారముచే భూమి నుండియు, అందలి పదార్థములనుండియు సారవంతమగు బలమును లాగుకొనును. ఇది ఆయుర్వేద సిద్ధాంత పరిచయము.

దీని నిట్లుంచి విజ్ఞాన విషయ విశేషాత్మకములగు పురాణేతిహాసములయందు సహితము ఆయా ధర్మములుపదేశించు సందర్భములలో శరద్వసంతములు వ్యాధులకు ఆకరము అని చెప్పబడినది. కొమ్మనామాత్య పుత్రుడగు సోమయాజి తిక్కనామాత్యుడు తన ఆంధ్రీకృత మహాభారతమునం దిట్లు వర్ణించెను:-

అరయన్ సర్వజ నౌఘ నాశనములై
        యత్యంత ఘోరమ్ములై
పరమవ్యాధి కరమ్ములయ్యు గడు శొ
        భా స్ఫూర్తి నొప్పారి శాం
కరికిం బ్రీతి కరమ్ములై మిగుల వే
        డ్కల్ జేయు లోకాళి కీ
శరథారంభ వసంతముల్ శమన దం
        ష్ట్రా ప్రాయముల్ భూవరా!

ఇందు శరద్వసంతములు యముని కోరలవలె మహా అపాయకరము లని బోధింపబడినది. శరద్ధేమంతఋతువు అందలి కార్తీక మార్గశీర్ష కృష్ణ శుక్ల పక్షములు యమదంష్ట్రలుగా వర్ణించి "స్వల్ప భుక్తోహి జీవతి" కొద్దిగా ఆహారము చేయువాడే సుఖముగ జీవించునని ఆయుర్వేదమున చెప్పబడెను. అందుకనియే ఏ ఋతువులం దైనను సరే ఏ రోగములచేతను చిక్కకుండునట్లు మంచి నడవడిక కలిగియుండ వలయునని ఆయుర్వేద మాదేశించినది.

నరో హితాహార విహార సేవీ
       సమీక్ష్య కారీ విషయే ష్వసక్తః
దాతా సమః సత్యపరః క్షమావాన్
       ఆప్తోపసేవీ చ భవ త్యరోగః

చ. శా. 2-46

దేశ కాలములకును, శరీరమునకును హితములగ ఆహారవిహారముల నుపయోగించుటయు, మంచి చెడుల నాలోచించి పనుల జేయుటయు, ఇంద్రియ నిగ్రహము త్యాగ శీలతయు, సమత్వబుద్ధి, సత్యనిష్ఠ, ఓరుపు కలిగి జ్ఞానానుభవములు గల వారిని సేవించు నాతడు రోగముల పాల్పడక సుఖముగా నుండును.

మతి ర్వచః కర్మసుభానుబంధం
        సత్వం విధేయం విశదా చ బుద్ధిః
జ్ఞానం తపః తత్పరతాచ యోగే
        యన్యా స్తి తం నానుతపన్తి రోగాః

చ. శా. 2-47

భవిష్యద్భాగ్యోదయమును గోరు మనోవాక్కర్మములు కలిగి సాత్వికత, వినయము, వినిర్మల బుద్ధి, ఆత్మ వివేకము, తపోభిరతి, యోగతత్పరత ఎవరికి కలిగి యుండునో అట్టివారిని క్రూరములగు రోగములు వేధింపజాలవు.

మానవ ధర్మతత్వ బోధన మగు ఈ ఆయుర్వేద సిద్ధాంతాదేశమును అనుసరించి నడచినచో భయంకరము లగు అంటు రోగముల పాల్పడక వంశవర్ధనులై, శతాయుష్మంతులై, వీర్యవంతము, మేధాయుష్మంతమునగు సత్సంతాన సౌభాగ్య సంపదలు కలిగి, మనుజులు మనుజులుగా మనుష్యానందము సంపూర్ణముగా ననుభవించి దేవతాత్ము లగుదురు.

వే. తి. వెం. రా. స్వా.