సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/ఛాయా సోమనాథాలయము

ఛాయాసోమనాథాలయము - పానుగల్లు :

ఛాయాసోమనాథాలయము నల్లగొండ జిల్లాలో నల్లగొండ నగరమునకు మూడు మైళ్ళ దూరములో నున్న పానుగల్లు గ్రామములోని దేవాలయములలో నొక్కటి. పానుగల్లు తెలుగు చోడ వంశీయులకు రాజధానిగా నుండెను.

ఛాయాసోమనాథాలయమునకు శాసనములలో అభినవ సోమనాథాలయ మని పేరు కలదు. అనగా, దీనికి పూర్వము ఒక సోమనాథుని ఆలయము వెలసి యున్నదన్నమాట. ఇది త్రికూటాలయ మగుట ఒక విశేషము. నిరాడంబరములయిన మెట్ల శిఖరములతో నొప్పు ఆలయ మగుట మరియొక విశేషము. ఆ ప్రాంతపు జైనులు తమ తీర్థంకరుల కొరకు విమాన రూపములో నిర్మించిన ఆలయ శిఖరాలంకారములను క్రమముగా తగ్గించి, వాటిని మెట్ల శిఖరములతో నొప్పు మూడు ఆలయములుగా రూపొందించినారు. ఈ అభినవ సోమనాథాలయము మెట్ల శిఖరములతో నొప్పు మూడు ఆలయములతో త్రికూటముగా నిర్మింపబడినది,

మూడు ఆలయములు పొయ్యి గడ్డలవలె ఒక మండపమునకు మూడు ప్రక్కల నిర్మింపబడి యున్నవి. నాల్గవ ప్రక్కన ప్రవేశ మండపమును, దానికి మెట్లును కలవు. ప్రతి ఆలయమునకు గర్భాలయమును, దాని ముందు శుకనాసి వంటి చిన్న గదియును గలవు. శుకనాసికి వెలుపలి ప్రక్క ద్వారములు లేవు. మూడు ఆలయములకు రెండేసి స్తంభములు మాత్రము శుకనాసి ద్వారబంధములవలె నిలచి యున్నవి. ఈ స్తంభములను దాటి వెళ్ళినచో, మూడు ఆలయములకును ఒకే మండపముగా నేర్పడిన చతురస్రాకార మండపము గలదు. దీని అంచున మూడడుగుల ఎత్తును, రెండడుగుల దళసరియు గల పిట్టగోడ యొకటి మండపమును ప్రత్యేకించుచున్నది. ఈ గోడపై నొక రాతిపరపు గలదు. దీనిమీద కూర్చుండి, మండప మధ్యమున జరుగు నృత్యములను, ఉత్సవములను చేరగిలబడి తిలకించ వచ్చును. ఈ అరుగు వెలుపలి అంచు చుట్టును నిలువురాతి దిమ్మలు గలవు. ఆలయము వెలుపలి భాగమునుండి కనుపించు విధముగా, ఈ దిమ్మల వెలుపలి పార్శ్వముపైన ఏనుగుల వరుసలు గలవు ; ఈ వరుసలపై స్తంభముల శ్రేణియు గలదు. ఒక స్తంభమునకును మరియొక స్తంభమునకును నడుమ వీరుల విగ్రహములు అర్ధశిల్పములుగా చెక్కబడి యున్నవి. మండపమునకు మూడు ప్రక్కల మూడు ఆలయములును, నాలుగు కొసలవద్ద నాలుగు స్తంభములును గలవు. మండపము నడుమ నిలబడి నాలుగు మూలలు చూచినచో, మూలస్తంభములకు ఇటు అటు గల కాళీలలో నుండి ఆకాశము కాన్పించును. ఈ కాశీల నుండి మండపములోనికి గాలి వచ్చును. ఇవి దేవునియొక్క అలంకరణముల భద్రతకే గాక, మండపమునం దుండు భక్తులు వేసవికాలమందు ఉక్కపోత వలన బాధ పడకుండుటకును, మండప స్తంభములపై నున్న శిల్పముల నావరించియుండు చీకటి ముసుగును తొలగించుటకును సహాయపడగలవు. ఇచ్చట మండపము యొక్క అంచులు తెరచి యుండును.

మండపము నడుమ విశేషాలంకృతములయిన నాలుగు స్తంభములు రంగమండపమును ప్రత్యేకించు చున్నవి. ఈ మండపములో నిలబడి పైకి చూచినచో, స్తంభముల మీది దూలముల నడుమ అమర్చిన చతురస్రమును, దీని భుజముల నడుమ నున్న బిందువులను కలిపెడు మరియొక చతురస్రమును, దాని మధ్య మధ్య గల బిందువులను కలిపెడు మరియొక చతురస్రమును, రాతిపలకల పేర్పు వలన ఒకదాని కంటె మరియొకటి ఎత్తుగా నున్న మూడు చతురస్రములును కాన్పించును. వీటిలో నడిమి చతురస్రము యొక్క లోపలి అంచున, ఒక్కొక్క అంచు పొడవున ముగ్గురు చొప్పున దిక్పాలకు లున్నారు. ఏ అంచును చూచినను, నిలువుగా నిలచియున్న ఇద్దరు దిక్పాలకులు కాన్పించెదరు. ఎడమ మూలనున్న దిక్పాలకుడు, ఎడమప్రక్క నున్న అంచువైపు మనము తిరిగినప్పుడు మాత్రమే నిలచి యున్నట్లును, ఈ అంచును మాత్రమే చూచినచో పడుకొన్నట్లును కాన్పించును. ఈ పేర్పు పద్ధతి పశ్చిమ చాళుక్యుల విధానమని తెలియుచున్నది. ఈ మూడు ఆలయములలోను, తూర్పు ప్రక్కన గల ఆలయము సూర్యదేవుని ఆలయ మని పిలువబడుచున్నది. ఈ ఆలయమునకు చెందిన గర్భాలయము నందలి పానవట్టము మీద అనూరుని యొక్కయు, ఏడశ్వముల యొక్కయు విగ్రహములు చెక్కబడి యున్నవి. పశ్చిమమున నున్న ఆలయము పేరు సోమేశ్వరాలయము. ఈ ఆలయములోని లింగము మీద, దాని పొడవునా లేనీడ కాన్పించును. ఈ లేనీడ ఉదయమునుండి సాయంత్రము వరకును, ఉత్తర దక్షిణ అయనములలోను మారక, అదే స్థానములో నుండును. ఈ ఛాయను బట్టియే అభినవ సోమనాథునికి 'ఛాయా సోమేశ్వరుడు' అన్న పేరు గల్గినది. ఈ నీడను గూర్చిన రహస్య విషయ మిది : ఈ గర్భాలయ ద్వారము కడ నిలబడి మండపములోనికి చూచినచో, ఎదురుగా సూర్యదేవర ఆలయమును, దాని కిరుప్రక్కల మండపపు అంచుననే నిర్మింపబడిన లో అరుగును, ఆ అరుగు యొక్క అంచుల సరసగా నిలబెట్ట బడిన రాతి దిమ్మలును, వాటి అంచులును కానవచ్చును. ఈ అంచులు సూర్యదేవర ఆలయ ప్రవేశమునకు ఒకటి దక్షిణమునను, మరియొకటి ఉత్తరమునను కనబడును. ఈ అంచునకును, మండపము యొక్క చూరునకును నడుమగా ఆకాశము కాన్పించును. సోమనాథాలయము యొక్క గర్భాలయము లోనికి ఈ కాళీ ప్రదేశముల ద్వారా వెలుతురు ప్రసరించును. ఈ కాంతి పుంజము గర్భాలయమును దాటి లింగమునకు గల రెండు నిలువు టంచులను మాత్రమే స్పృశించుచు గర్భాలయముయొక్క గోడ మీద పడును. ఈ రీతిగా నడిమి భాగము కంటె అంచులు ప్రకాశవంతముగా నుండును. అందుచే మధ్య భాగములో 'నీడ' పడినట్లు కానవచ్చును. ఈ 'నీడ', సూర్యుని వెలుతురుపై కాక, ఆకాశపు వెలుతురుపై ఆధార పడును గనుక, దానిచోటు మారదు. గర్భాలయ ద్వారము యొక్క నిలువు కమ్మీల పైన చేతిని పైకి జరుపుచు చూచిన యెడల, నీడయొక్క అంచుపై చేతి జాడ పైపైకి జరుగుచున్నట్లు కాన్పించును.

మూడవ ఆలయము ఏ దేవరదో తెలియుట లేదు. ఈ ఆలయములో చెదరిపడియున్న దేవ దేవర, బ్రహ్మ, విఘ్నేశ్వర విగ్రహములు తెచ్చియుంచినవే గాని స్వతస్సిద్ధముగా ఈ ఆలయము లోనివి కావు. ఇచ్చటి నంది కొన్ని అంశములలో రామప్పదేవాలయపు నందిని పోలియున్నది. పీఠమునకు నలుమూలల మైలారు వీర భటులు నృత్యము చేయుచున్న ట్లున్నారు. ఇదియు తరువాతి కాలము నాటిదే. సోమేశ్వరాలయ ద్వారపాలురు డమరుక, బాణ, గద, అభయహస్తులు. హనుమకొండ రుద్రేశ్వరాలయమునకు వలెనే దీనికిని ప్రవేశము దక్షిణము నుండియే కలదు. ప్రాకారము, దక్షిణపు ప్రక్క ప్రాకారములో ప్రవేశ మండపము ఉన్నట్లు చిహ్నములు గలవు. ప్రధానాలయమునకును, ప్రాకారమునకును నడుమ పశ్చిమమున మూడును, దక్షిణమున ఒకటియు, తూర్పున రెండును శిఖరములులేని రెండు చిన్న ఆలయములు కలవు. ఆలయమునకు తూర్పున పుష్కరిణియు, దాని యొడ్డున నాలుగు స్తంభముల మండపమునుగలవు.

ఈ మండపశిఖరమును, ఆలయశిఖరములు మూడును 'మెట్లశిఖరములే' యనబడుచున్నవి. మెట్లకు కొంచెముగా అలంకారము కూడ కలదు. శుకనాసికి ఇది శిఖరమా అనునట్లు, శిఖరముయొక్క ముందువైపున మూడు శిఖరములకును అర్ధశిఖరము గలదు. పానుగల్లు, వర్ధమాన నగరము, బహుశః అలంపురపు పాపనాశన క్షేత్రములలోని ఈ మెట్ల శిఖరాలయములు కందూరు చోడులచే నిర్మితములైనవే.

పానుగల్లులో జైన విగ్రహము లెవ్వియును కానరావు. అయితే బయటినుండి తెచ్చి నిలిపిన శిల్పము తప్ప అభినవ సోమనాధాలయములో శైవ శిల్పము కానరాదు. ఇది తొలుత జైనాలయమై యుండి యుండు ననుటకు అవకాశము కలదు.

శ్రీ. గో


★★★★★