సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/చిరుధాన్యములు (Millets)

చిరుధాన్యములు (Millets) :

ప్రపంచమందలి జనాభా కంతకు కావలసిన ముఖ్య మైన ఆహారము తృణధాన్యములనుండి లభించుచున్నది. ఈ తృణధాన్యములలో వరి, గోధుమ, మొక్కజొన్న, బార్లి, ఓట్లు, రై ముఖ్యములయినవి. ఈ ధాన్యపు గింజల పరిమాణముతో పోల్చిచూచినచో, మరికొన్ని తృణధాన్యముల గింజలు చాల చిన్నవిగ నుండును. వీనిని 'చిరుధాన్యములు' అందురు. జొన్న, గంటె, చోడి, కొర్ర, ఆరిక, చామ, వరిగ, ఊద, దిసక మొదలగునవి చిరుధాన్యములు. గొలుగు గింజలు, వెదురు బియ్యము కూడ ఈ జాతిలోనివే. జొన్నలను సామాన్యముగా పెద్ద చిరుధాన్యములని వ్యవహరించుచుందురు.

చిరుధాన్యముల మొక్కలు సాధారణముగ చిన్నవిగ నుండును. వాటికి ఆకులు ఎక్కువగ నుండును. ప్రపంచమందలి ఉష్ణమండలములలోను, సమశీతోష్ణమండలములలోను చిరుధాన్యములు పైరులు విస్తారముగా సాగులోనున్నవి. అవి చాల తక్కువ కాలమున పంటకు వచ్చును. వాణిజ్యదృష్టిచే విశేష ప్రాముఖ్యము కలవి కాకున్నను, ఉష్ణమండల తృణధాన్యములలో చిరుధాన్యములు చాల ముఖ్యమైనవి. ఉష్ణమండలమున పొడిగానున్న ప్రదేశములలోని సవన్నాగడ్డి మైదానములలో పెరుగు కొన్ని ఆటవిక తృణజాతులనుండి నేటి చిరుధాన్యములలో కొన్ని ఉద్భవించినట్లు తెలియుచున్నది. వీటి ఆటవిక రూపములు ముఖ్యముగ మధ్య ఆఫ్రికాలో ఉష్ణమండలములలో నున్న గడ్డిమైదానములందు అగపడుచున్నవి. కరవు సమయములలో వీటిలో కొన్ని చక్కగా ఉపయోగపడు చున్నవి. ప్రజలు సాధారణముగా వీటి ధాన్యములను సేకరించి నిలవచేయుచుందురు. ఉష్ణమండలమున తడిగానున్న ప్రదేశములలో చోడి ముఖ్యమైన చిరుధాన్యము. ఇది మధ్య ఆఫ్రికాలోను, భారతదేశములోను మిగుల సాగులో నున్నది.

చిరుధాన్యములన్నియు పిండి, రొట్టె, అంబలి మున్నగు రూపములలో ప్రజలకు ఆహారముగా ఉపయోగపడుచుండును. మత్తు కలుగజేయు పానీయములు తయారుచేయుటకును, కోళ్ళకు ఆహారముగను ఈ చిరుధాన్యములన్నియు ఉపయోగపడును. గడ్డి పశువులకు మంచి ఆహారముగ ఉపయోగపడును. గంటె, చోడి, ఊద మొదలగు చిరుధాన్యపు సస్యములను కొన్నిచోట్ల ప్రత్యేకముగ పశుగ్రాసమునకై సాగుచేయుచుందురు. చిరుధాన్యము లను చాలకాలము నిలవచేయుటకు వీలగును. వాటికి పురుగుపట్టుట చాల తక్కువ.

వివిధములైన చిరుధాన్య సస్యముల ముఖ్యలక్షణములును, వాటిని గూర్చిన కొన్ని ముఖ్యవిషయములును ఈ దిగువ క్లుప్తముగ వివరింపబడినవి : 1. జొన్న : జొన్న వన్యస్థితియందున్న కొండ చీపురు జాతినుండి పుట్టినదని కొందరి యూహ. దక్షిణభారత దేశమున ఈ సస్యము సుమారు వేయి వత్సరములు

చిత్రము - 194 జొన్న పెన్ను. పటము • 1

క్రితమే సాగులో నున్నదనుటకు నిదర్శనము లగుపడు చున్నవి. ఈ జాతి పైరునకు దక్షిణ ఇండియా గాని, ఆఫ్రికాఖండమున ఉష్ణ భాగములుగాని, ఆదిమస్థానములై యుండవచ్చును. ఇది దక్షిణ ఆసియా, ఆఫ్రికా, ఐరోపా, అమెరికా, ఆస్ట్రేలియా మున్నగు తావులలో కొంత సేద్యములో నున్నది. జొన్న సాధారణముగా పిలకలను పెట్టదు. జొన్న గడ 4 అడుగులు మొదలు 10-12 అడుగుల యెత్తువరకు పెరుగును. కొన్ని రకములు 20 అడుగుల యెత్తువరకు కూడ నెదుగును. బాగుగా నెదిగిన జొన్న మొక్క కాండము 14 అంగుళముల లావును, సుమారు 10 కణుపుల పొడవును కలిగి యుండును. కాండము పై కఠినమగు చర్మమును, దాని లోపల బెండును ఉండును. జొన్న ఆకు సామాన్యముగ 2-8 అంగుళముల వెడల్పును, 24-30 అంగుళముల పొడవును కలిగియుండును. జొన్న వెన్ను ముద్దకంకిగా గాని, జల్లి కంకిగ గాని ఆయా రకపు స్వభావమునుబట్టి కనిపించును. సాధారణముగ జొన్నకంకి సుమారు 6-9 అంగుళముల పొడవును, 3-5 అంగుళములు లావును కలిగియుండును. గింజలపై నుండు పొట్టు, గింజల రంగు, వెన్ను వైఖరి, సాగుచేయు సమయము, ఫలించుటకు పట్టు కాలము మొద లగు లక్షణములను బట్టి జొన్న రకములు కొన్ని తరగతులు గను, ఉపతరగతులుగను విభజింపబడినవి. కృష్ణ రేగడ నేల లందును, ఎర్ర నేలలందును జొన్న విస్తారముగ సాగుచేయ బడును. ఇది చాలతక్కువ తేమతో పెరుగును. అందుచే సాధారణముగ దీనిని మెట్ట సస్యముగనే సాగుచేయు చుందురు.

ఇంగ్లీషు భాషలో జొన్న గ్రేట్ మిల్లెట్ (great millet) అనియు, లాటిన్ భాషలో 'ఆండ్రోపోగన్' (Andropogon) అనియు, సంస్కృతములో 'యావనాల', లేక 'వృత్తతండుల' అనియు వ్యవహరింపబడుచున్నది. జొన్న గింజలు వెగటుగ నుండును. కఫమును, పైత్యమును హరించును. వీర్యవృద్ధిని, బలమును కలుగజేసి, కామప్రకోపము కల్గించును.

2. గంటె : గంటెలను సజ్జలు అనికూడ వ్యవహరిం చుట కలదు. ఈ సస్యమునకు ఆదిమస్థానము ఆఫ్రికాఖండమని ఊహింప బడుచున్నది. సుమారు 300 సంవత్సరముల క్రిందట గంటెధాన్యము భారతదేశమున ప్రవేశ పెట్టబడి యుండవచ్చును, భారత, అరేబియా, ఈజిప్టు దేశములందు గంటె విస్తారముగ సాగులోనున్నది. దక్షిణ యూరపు లోను, అమెరికాలోగూడ ఈ సస్యము పండుచున్నది. గంటె మొక్కజొన్నకండె వలెనే యుండి, అంతకంటె సన్నముగనుండును. అది సుమారు 5-6 అడుగుల పొడవు పెరుగును. గంటె పిలకలను పెట్టి దుబ్బు కట్టును. ఒక్కొక్క దుబ్బులో సగటున 3-5 వరకు వెన్నువేయు పిలకలుండును. కాండము ½ మొదలు ¾ అంగుళము మందముండును. దీనిలో నుండు బెండు కొంచెము కఠినముగ నుండును. దీని కాండమునకు కూడ కనుపు లుండును. గంటె ఆకులలో కోటాకు క్రింది ఆకు తక్కిన వాటికంటే పెద్దదిగ నుండును. దాని తొడిమ 4-6 అంగుళముల పొడవును, రేకు 1½ మొదలు 2 అడుగుల పొడవును, సుమారు 1 అంగుళము వెడల్పును కలిగియుండును. గంటె వెన్ను 6 మొ. 12 అంగుళముల పొడవుండును. అది 'జమ్ము' కండెవలె నుండును. గంటె గింజలు జొన్నల కంటె చిన్నవి. గంటలో పెక్కురకములు సాగులో నున్నవి. గంటె ఉష్ణప్రదేశములలో తక్కువ తేమతో పెరుగును. దీనికి ఇసుక గరుములు అనుకూలమైన నేలలు. జొన్నలను వలెనే గంటెలను కూడ అన్నముగ వండి తినవచ్చును.

చిత్రము - 195

గంటె వెన్ను.

పటము - 2

గంటెను ఇంగ్లీషు భాషలో 'స్పైకెల్' (spikel) లేక 'పెరల్ మిల్లెట్' (pearl millet) అనియు, లాటిను భాషలో 'పెన్నిసెటమ్ టైఫాయిడెస్' (Pennisetum typhoides) అనియు వ్యవహరింతురు. దీని అన్నము స్వాదుగనుండి దేహమునకు పుష్టి నిచ్చును. హృద్రోగములకు పనిచేయును; ఆకలిని పుట్టించి పైత్యము నడచును.

3. చోడి : చోడిని 'రాగి' యనియు, 'తమిద' యనియు కూడ అనుచుందురు. చోడికి బహుళముగ భారతదేశమే ఆదిమస్థానమై యుండవచ్చును. చోడి పైరు భారత దేశములోను, ఆఫ్రికాలో తూర్పు, మధ్య, దక్షిణ భాగముల యందును విస్తారముగ సాగులో నున్నది.

చిత్రము - 196

చోడి వెన్ను.

పటము - 3

చోడి మొక్క గంటెమొక్కవలెనే దుబ్బుకట్టును. సామాన్యముగ ఇది 24 అడుగుల ఎత్తు పెరుగును. దీని కాండము కొంచెము బల్లపరుపుగను, మృదువుగను ఉండును. చోడి కాండము బోలుగ నుండును. దీని కనుపుల నుండి పిలకలు బయలు దేరును. చోడి ఆకులు దళసరిగ నుండును. ఆకునకు గల తొడిమ సుమారు 4-6 అంగుళముల పొడవుగను, రేకు 12-20 అంగుళముల పొడవుగను ఉండును. చోడి కంకికి సాధారణముగ 4-6 రెల్ల లుండును. వీటిలో నొకటి విడిగా క్రిందుగా నుండును. దీనిని 'బొటనవ్రేలు' అనియు, తక్కినవాటిని 'వ్రేళ్లు' అనియు సామాన్యముగ పిలుతురు. ఈ వ్రేళ్ల పొడవు ముద్దరకములలో 1½ మొ. 4 అంగుళములును, రెల్ల రకములలో 3 మొ. 6 అంగుళములును, ఉండవచ్చును. కొన్ని చోడి రకములలో మొక్క యొక్క కొన్ని భాగములందు ఊదారంగు బయలుదేరును. చోడి గింజలు చాల చిన్నవిగా నుండును. వెన్ను యొక్క తీరును పట్టి ముద్దచోడి యనియు, రెల్ల చోడి యనియు, గింజల రంగును బట్టి, ఎర్ర, నల్లమబ్బు, తెల్ల చోళ్ళనియు చోడిరకము లుండును. చోడి మెట్టపైరుగ సాగు చేయబడును. ఇది నీరుకట్టియు గూడ సేద్యము చేయబడుచుండును. మెట్ట చోళ్లు, ఊడ్పు చోళ్లు, తొలకరి చోళ్లు, పెద్దచోళ్లు అని వ్యవసాయదారులు చోడి రకములను తరచుగ పేర్కొనుచుందురు. చోడి ఉష్ణమండలములోను, సుమారు 5000 అడుగుల ఉన్నతప్రదేశము లందును పెరుగును. దీనికి తేమ హెచ్చుగానుండు ప్రదేశము కావలెను. చోడి అన్ని విధములయిన నేలలయందును పెరుగును. అయినను గరపనేలలు, ఇసుక గరువులు ఎక్కువ అనుకూలములుగా నుండును.

చోళ్లను లాటిన్ భాషలో 'ఎలెన్‌సైన్ కొరకేన్' (Elencine coracane) అనియు, సంస్కృతములో 'రాజక' అనియు పిలచెదరు. దీని జావ పుష్టినిచ్చి, సమశీతలము చేయును; పైత్యమును హరించి, రక్తస్రావము నాపును.

4. కొర్ర : కొర్ర భారతదేశమున ప్రాచీనకాలము నుండియు సాగులోనున్న తృణధాన్యము, యజుర్వేదమున ఉదాహరింపబడిన సప్తగ్రామ్యములలోను, బృహదారణ్యకోపనిషత్తున పేర్కొనబడిన దశధాన్యములలోను కొర్ర యొకటియై యున్నది. అందుచే భారతదేశమే ఈ సస్యమునకు ఆదిమస్థానమని కొందరి నమ్మకము. భారతదేశమునకంటె ప్రాచీన కాలమున చైనా దేశమున కొర్ర సాగులో నుండెనని మరికొంద రూహించుచున్నారు. భారతదేశము, ఇటలీ, చైనా, జపాను, ఉత్తర ఆఫ్రికా, కెనడా, అమెరికా సంయుక్త రాష్ట్రములు మున్నగు దేశములలో కొర్ర ఎక్కువగా సాగుచేయబడుచున్నది. కొర్ర మొక్క సాధారణముగ 3-5 అడుగులు పెరుగు. కొర్ర కూడ దుబ్బు కట్టును. దీని కాండము, ఆకులు గంటేకంటే సన్నముగ నుండును. ఆకుల కొనలు సన్నని మొనదేలియుండును. ఆకు తొడిమ సుమారు 4-5 అంగుళముల పొడవుండును. రేకు 12-18 అంగుళముల పొడవు, ½ మొ. 1¼ అంగుళము వెడల్పు కలిగియుండును. కొర్ర వెన్ను 5-8 అంగుళముల పొడవుండును. దానియందు నూగు ఉండును. చోడికి వలెనే కొర్ర మొక్కకు కూడ

చిత్రము - 197

కొర్ర వెన్ను.

పటము 4

కొన్ని భాగములు ఊదారంగు కలిగిఉండును. గింజల రంగు, వెన్ను యొక్క వైఖరి, దానియందున్న నూగు స్వభావమునుబట్టి కొర్రలో కొన్ని ముఖ్యమగు రకములు గలవు. కొర్ర గణములో చేరిన 'నక్కకొర్ర' యను మరియొక ప్రత్యేక జాతి సస్యము కూడ కొన్ని తావు లందు సాగులో నున్నది. కొర్ర వేడిమిని, చలిని గూడ ఓర్చుకొని పెరుగు సస్యము. ఇది మెట్టపైరుగను, పల్లపు పైరుగను సాగుచేయబడును. దీనికి జిగురు నేలలు అనుకూలము.

ఇంగ్లీషు భాషలో దీనిని 'ఇటాలియన్ మిల్లెట్' (Italian Millet) అనియు, లాటిన్ భాషలో 'సెటేరియా ఇటాలికా' (Setaria Italica) అనియు పిలిచెదరు. దీనిని నూరి కీళ్ళ నొప్పులకు పట్లు వేయుదురు; మూత్రవృద్ధి అగును; దీన్ని అన్నము వేడి చేయును; తేలుకాటునకు దీనితో వైద్యము చేయుదురు; కొంచెము మత్తు కల్గించును; జ్వరమును, కఫమును హరించును. జఠరదీప్తి నిచ్చి రక్తవృద్ధి కలుగజేయు. కాని వాతమును కల్గించును. దోషములకు నెయ్యి, పంచదార, సికింజిబీను విరుగుళ్ళుగా పనిచేయును.

5. ఆరిక : ఆరికకు కూడ భారత దేశమే ఆదిమస్థానమై యుండవచ్చును. ఇది మద్రాసు, బొంబాయి, రాష్ట్రములలో కొన్ని ప్రదేశము లయందు విస్తారముగా సాగగుచున్నది. ఆరిక మొక్క సుమారు 1½ మొ. 2½ అడుగుల ఎత్తున పెరుగు దుబ్బు. ఒక్కొక్క దుబ్సునకు 3-8 కర్ర లుండును. ఆరిక ఆకులు సన్నముగ, సుమారు 12-18 అంగుళముల పొడవుండును. వెన్నులు సాధారణముగా కాండమునకు తుది గల రెండు కనుపులయందును బయలుదేరును. వెన్నులో సామాన్యముగ మూడేసి రెల్ల లుండును. రెల్లల పొడవు 1-3 అంగుళము లుండును. ఆరిక మొక్కలకు కూడ కొన్ని భాగముల యందు ఊదారంగు ఏర్పడును. ఆరిక గింజలు లేత గోధుమరంగు కలిగి, కొర్ర, గంటె గింజల కంటె పెద్దవిగ నుండును. ఆరికలో పెద్ద ఆరిక, చిన్న ఆరిక యను రెండు ముఖ్యమగు రకములు కలవు. ఆరిక ఉష్ణమండలములలో చక్కగా పెరుగు మెట్ట పైరు.

చిత్రము - 198

ఆరిక వెన్ను.

పటము - 5

ఈ ధాన్యమును ఇంగ్లీషు భాషలో 'కాడో మిల్లెట్' (Kado Millet) అనియు, లాటిను భాషలో 'పెస్పలమ్ స్క్రోబిక్యులేటమ్' (Pespalam Scrobiculatum) అనియు పిలతురు. దీని అన్నము వెగటుగా, స్వాదుగా నుండును. విరేచన బద్ధముచేయును. రక్త పైత్యమును, సంగ్రహణిని కఫమును పోగొట్టును. తేలు కాటుకు వీనితో చికిత్స చేయుదురు. కొంచెము మత్తు కలిగించును.

6. చామ : చామసస్యము ప్రాచీన కాలము నుండియు భారత దేశమున సాగులో నున్నట్లు తెలియుచున్నది. ఇది ఈజిప్టు దేశము నుండి ఇండియాకు వచ్చియుండవచ్చునని కొందరి అభిప్రాయము. ఇది ఇండియాలోను, సింహళ ద్వీపములోను కొంత సాగులో నున్నది. చామమొక్క 2 మొదలు 3 అడుగుల యెత్తున దుబ్బుగా పెరుగును. ఒక్కొక్క దుబ్బునకు సాధారణముగా 3 మొ. 6 పిలక లుండును.

చిత్రము - 199

చామ వెన్ను.

పటము - 6

చామ ఆకు చిన్నదిగ 2-4 అంగుళముల పొడవు గల తొడిమతో, 12-20 అంగుళముల పొడవుతో, i-1 అంగుళము వెడల్పుతో నొప్పారు రేకు కలిగి యుండును. చామ వెన్నునకు చాల రెల్ల లుండును. అది 6-12 అంగుళముల పొడ వుండి, వరి వెన్నువలెనే వ్రాలు చుండును. చామగింజలు కొర్రల కంటే కొంచెము చిన్నవిగను కోలగను ఉండి, మొనదేలి యుండును. చామలలో కూడ కొన్ని రకములు గుర్తింపబడుచున్నవి. కొన్ని రకములకు ఊదారంగు ఉండును. చామపైరునకు తేమ హెచ్చుగా నుండవలెను. ఇది ఇసుక కొడి నేలలందును, ఎర్రనేల లందును సాగుచేయబడును. ఇది మెట్ట పైరు. ఇంగ్లీషు భాషలో ఈ ధాన్యము 'లిటిల్ మిల్లెట్' అనియు, లాటిన్ భాషలో 'పానికమ్ మిలియేర్' (panicum miliare) అనియు పిలవబడుచున్నది. దీనికి 'గంగచామ' అనియు నామాంతరము కలదు. ఇది శరీరమునకు పుష్టిని, నరములకు ఉద్రేకమును ఇచ్చును.

7. వరిగ : ఇది చామగణములో చేరినది. వరిగ కూడ భారతదేశమున చాల పురాతన సస్యముగ నెంచబడు

చిత్రము - 200

వరిగ వెన్ను.

పటము - 7

చున్నది. దీనికి చీనాదేశము ఆదిమస్థాన మనియు, ఈజిప్టు నుండి గాని, అరేబియానుండి గాని భారతదేశమునకు వచ్చి యుండవచ్చుననియు కొందరు శాస్త్రజ్ఞుల అభిప్రాయము. భారతదేశమందును ఆఫ్రికాలో మధ్యధరా సముద్ర ప్రాంతములందును, యూరపులో కొన్ని భాగములందును, రష్యా, చైనా, ఉత్తర అమెరికా, జపానులయందును వరిగ సాగుచేయబడుచున్నది. వరిగ మొక్క చామ మొక్కను పోలి యుండును. ఇది సుమారు 2-3 అడుగుల ఎత్తు పెరుగును. దీని కాండము చామకాండముకంటే సన్నముగను ఉండును. ఈ మొక్కకు పెక్కు భాగముల యందు నూగు కనిపించును. దీని ఆకు వెడల్పు ¼ - ¾ అంగుళము; పొడవు సామాన్యముగ 6 మొ. 15 అంగుళము లుండును. ఆకుతొడిమ కాండముయొక్క ఖండమును పూర్తిగ కప్పియుంచును. వరిగ వెన్ను సుమారు 6 మొ. 10 అంగుళముల పొడవుండును. చామ వెన్నులో కంటె వరిగ వెన్నులో రెల్లలు ఎక్కువగ నుండును. వరిగ గింజలు కొంచెము పెద్దవిగ నుండును. మొక్కకు కొన్ని భాగములయందు ఊదారంగు ఉండును. ఊదారంగు భేదమును బట్టియు, నూగుయొక్క సాంద్రతను బట్టియు, గింజరంగును బట్టియు, శాస్త్రజ్ఞులు వరిగలో రకముల భేదములను గుర్తించుచుందురు. వరిగ సామాన్యముగ శీతకాలపు పైరుగ నెన్న బడుచున్నది. కొన్ని చోట్ల దీనిని మెటట్ట సస్యముగను, మరికొన్నిచోట్ల పల్లపు సస్యముగను సాగుచేయబడుచున్నది.

ఇంగ్లీషు భాషలో దీనిని 'కామన్ మిల్లెట్' (Common millet) అనియు, లాటిను భాషలో 'పానికమ్ మిలియక్కమ్' (Panicum miliaccum) అనియు పిలుచుచున్నారు. 'బరిగ' అనియు తెలుగులో దీనికి నామాంతరము కలదు. గనేరియా వ్యాధులకు ఇది బాగుగా పనిచేయును.

8. ఊద : 'ఊద' వరిచేలలో కలుపుగా పెరుగు గడ్డిజాతి లోనిది. ఇది భారతదేశమున చాల పురాతనకాలము నుండియు సాగులోనున్నట్లు శాస్త్రవేత్తల అభిప్రాయము. చైనాలోను, జపానులోను, కొంతవరకు ఆఫ్రికాలోను ఈ పైరు ప్రస్తుతము సాగులో నున్నది. ఊద మొక్క దుబ్బుగా సుమారు 2 మొ. 3½ అడుగుల ఎత్తువరకు పెరుగును. దీనికాండము కొంచెము బల్ల పరుపుగను, లావుగను ఉండును. ఒక్కొక్క మొక్కలో 2-5 పిలక లుండును. దీని ఆకులు సన్నముగ నుండును. తొడిమ పొడవు సుమారు 3-4½ అంగుళములును, రేకుపొడవు 9-15 అంగుళములును ఉండును. ఊద వెన్ను సాధారణముగ 4.6 అంగుళముల పొడవుండును. అది ఇంచుమించు గుర్రపుతోకవలె నుండును. ఊదగింజలు చాల తేలికగా నుండును. ఊద కొంచెము తేమగా నుండు నేలలో త్వరగా నెదుగును. దీనిని మెట్ట సస్యముగను, నీరు పెట్టియు గూడ సాగుచేయవచ్చును.

చిత్రము - 201

ఊద దుబ్బు.

పటము - 8

ఇంగ్లీషు భాషలో ఈ సస్యము 'సాన్వా మిల్లెట్' (Sanwa millet) లాటిను భాషలో 'ఎచినోక్లోవా కొలోనా' (Echinocloa colona) అనియు పిలువబడు చున్నది. ఈ ఆహారము రక్తస్రావము నాపును; ప్లీహ వ్యాధులకు పనిచేయును; విరేచన బద్ధము తొలగించును.

9. దిసక: దిసక కొన్ని చోటులయందు కలుపుమొక్కగా పెరుగు గడ్డి జాతికి చెందినది. ఆంధ్రరాష్ట్ర మందును, మైసూరురాష్ట్రము నందును కొన్ని తావులలో గింజల కొరకు దిసక సాగులో నున్నది. దిసక మొక్క ఆటవిక స్థితిలో గరిక వలె బయలు దేరి పెరుగు బహువార్షికము. విత్తులు చల్లి దీనిని సాగుచేయుచుందురు.

చిత్రము - 202

దిసక వెన్ను.

పటము - 9

దిసక దుబ్బు 1.3 అడుగుల ఎత్తు వరకు ఎదుగును. దీని ఆకు తొడిమ 2-3 అంగుళముల పొడవుండును. రేకు 5-6 అంగుళముల పొడవును, శ్రీ అంగుళము వరకు వెడల్పును కలిగి యుండును. బాగుగా ఎదిగిన దినిక వెన్ను 6 అంగుళముల పొడవును, చాల రెల్లలును కలిగియుండును. దిసక మెట్టపంటగా, ఇసుక, ఎర్ర, గరప నేలలలో సాగుచేయబడును. లాటిను భాషలో ఇది 'బ్రాచియారియా రామోసా' (Brachiaria ramosa) అని పిలువబడుచున్నది. తెలుగులో 'ఈదురు గడ్డి' యని నామాంతరము గలదు.

10. గొలుగు : గొలుగు వరిచేలలో కలుపు మొక్కలుగా పెరుగుచుండును. ఈ మొక్కల గింజలు కొన్ని చోట్ల బీద వారికి ఆహారముగా ఉపయోగపడును. ఈ సస్యమునకు భారతదేశమే ఆదిమ స్థానముగ భావింపబడుచున్నది. బర్మా, చైనా, జపాను, ఫిలిప్పైన్ దీవులు మొదలగు దేశములలో కూడ గొలుగు కాననగును.

గొలుగు మొక్క సుమారు 3 మొ. 8 అడుగుల ఎత్తువరకు పెరుగు. దీనికి కూడ 4-5 పిలకలు సాధారణముగా బయలుదేరును. పై భాగమందలి కనుపులనుండి శాఖలు, ఉపశాఖలు బయలు దేరును. గొలుగు కాండము గుండ్రముగ నుండి, లోపల బెండు కలిగియుండును. దీని ఆకులు వరి ఆకుల కంటె వెడల్పయినవి. దీని కాయ పెంకుకట్టి నిగ నిగ చుండును. గొలుగు ఉష్ణప్రదేశములందును, శీతల ప్రదేశము లందు గూడ పెరుగును. దీనికి వండలి నేలలు అనుకూలములుగా నుండును. గొలుగు గింజలను దండలుగ గ్రుచ్చి కంఠాభరణముగ ఉపయోగించుదురు.

చిత్రము - 203

గొలుగు వెన్ను.

పటము - 10

దీనిని ఇంగ్లీషు భాషలో 'జాబ్స్ టియర్స్' (Job's tears) అనియు, లాటిను భాషలో 'కాయిక్స్‌ జిగాంటీ ' (Coix gigantea) అనియు పిలుతురు. తెలుగులో దీనికి 'గొలివె' అని నామాంతరమున్నది. ఇది పుష్టినిచ్చును. గింజలు మూత్రవృద్ధిచేయును. వేరు ఋతుదోషములను సరిచేయును.

11 వెదురు బియ్యము: వెదురు పొదలు అడవులలో ఏడాది కొకసారి వెన్నులు వేసి, ఆహారముగ నుపయోగించు ధాన్యమునిచ్చును. అడవిజాతులవా రీ ధాన్యము లభించినపుడు ఆహారముగ ఉపయోగించుకొనుచుందురు. వెదురుగింజలు గోధుమలను పోలియుండును.

చిత్రము - 204

వెదురువెన్ను

పటము - 11

ఇది ఇంగ్లీషుభాషలో 'బాంబూ' (Bamboo) అనియు లాటిను భాషలో 'బాంబూసా ఆర్మొనేసియా' (Bambusa armonacea) అనియు పిలువబడుచున్నది. ఇవి గుఱ్ఱములకు జలుబు, దగ్గు వచ్చినపుడు ఉపయోగింపబడును.

బి. వి. ర.