సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/ఘటికాస్థానములు
ఘటికాస్థానములు :
ఘటిక, ఘటికాస్థానము అను పదములు శిలాతామ్ర శాసనములలో మాత్రమే కానవచ్చును. అందువలన ఘటిక యన్ననేమో, ఎట్టిదో తెలిసికొనుటకు ఈ పదము వచ్చు శాసనములను, ఆ సందర్భమున చెప్పబడిన విషయములను తెలిసికొనవలసి యుండును.
మొదటిమారు పరిశోధకుల దృష్టి నాకర్షించుటకు హేతువైన ఘటికా పదాన్విత లేఖ్యము కదంబ కులజుడైన కాకుత్థ్సవర్మ తాలగుండ శిలాస్తంభశాసనము. ఇది మైసూరురాష్ట్రము లోనిది. కదంబులు బ్రాహ్మణులు. కదంబ వంశజుడైన మయూరశర్మ వేదాధ్యయనమును సంపూర్తి చేసికొనగోరి పల్లవ పృథ్వీపతులకు రాజధాని యైన కాంచీపురమున కరిగి అచ్చటి ఘటికలో ప్రవేశించెను. కాంచీపురమున నుండగా అతనికి పల్లవ రాజాశ్వికునితో వైరము సంభవించినది. అది కారణముగా మయూరశర్మ జీవితమే మారిపోయినది. అతడు పల్లవ భూవల్లభులపై పగ పాటించి, బ్రాహ్మమును పరిత్యజించి, క్షాత్రధర్మమును చేపట్టి, తుదకు కదంబ రాజ్యస్థాపకు డయ్యెను. నాటినుండి కదంబులు బ్రహ్మక్షత్రియులై వర్మోపపదాంచితులైరి. మయూరశర్మ సంతతివా డైన కాకుత్థ్సవర్మ చెక్కించినదే తాలగుండ శాసనము. ఈ శాసనమున తేదీ లేదు. అందువలన లిపి స్వరూపము ననుసరించియే ఈ శాసనకాలము నిర్ణయింపవలసి యుండును. అట్లగుటజేసి ఏతత్కాల నిర్ణయమున చరిత్ర పరిశోధకులలో భేదాభిప్రాయములు కలవు. ఈ శాసనము అయిదవ శతాబ్దము నాటిదని, మరికొందరు అభిప్రాయ పడిరి. కాకుత్థ్సవర్మకును, మయూరశర్మకును మధ్య ఎన్నో తరములు లేవు. కాకుత్సవర్మ అయిదవ, ఆరవ శతాబ్దమువా డైనచో మయూరశర్మ అంత కింకను పూర్వుడు కావలెను. 'కదంబకుల' చరిత్రకారుని అభిప్రాయము ప్రకారము మయూరశర్మ క్రీ. శ. 345-370 ప్రాంతము అనగా క్రీస్తుశకము నాలుగవ శతాబ్ద మధ్యమునం దుండినవాడు. అందువలన కాంచీపురములోని ఘటికాశాల క్రీస్తుశకము నాలుగవ శతాబ్దమునాటికే యుండియుండ వలెను. తాలగుండ శాసనములో ఘటికా ప్రస్తావ మీ క్రింది శ్లోకములో నిట్లున్నది.
"యః ప్రయాయ పల్లవేంద్రపురీం గురుణా సమం
వీర శర్మణా అధిజిగాంసుః ప్రవచనం నిఖిలం
ఘటికాం వివేశాశు తార్కుకః"
దీనికి పూర్వ శ్లోకముతో నన్వయము. యః అనగా పూర్వ శ్లోకము నందు చెప్పబడిన “శ్రుతశీల శాచాద్యలంకృతు” డైన మయూరశర్మ. అతడు తన గురువైన వీరశర్మతో గలసి 'నిఖిల ప్రవచనము'ను పరిపూర్తి చేసి కొను తలంపుతో పల్లవేంద్ర రాజధానియైన కాంచీపురము నందలి ఘటికలో తార్కుకుడుగ ప్రవేశించెను. తార్కుక శబ్దమును హేమచంద్రుడు తన అభిధాన చింతామణిలో యాచక పర్యాయ పదముగా నిచ్చి యున్నాడు. దీని ననుసరించి శ్రీ యస్. వి. వేంకటేశ్వర పండితుడు 'ఇండియన్ కల్చర్ త్రూ ది ఏజెస్ ' అను గ్రంథములో మయూరశర్మ విజ్ఞాన భిక్షువై కాంచీ ఘటికాశాలయందు ప్రవేశించెనని చెప్పుచు దీని కుపబలకముగ బౌధాయన ధర్మ సూత్రమునందలి 'పిండతార్కుక' పదమును ఉదాహరణముగ నిచ్చియున్నాడు, 'నిఖిల ప్రవచన' మనుట వలన ఘటిక యనునది వేద విద్యా సంస్థయని తేలుచున్నది. నాగాయి శాసనములీ విషయమును ధ్రువపరచుచున్నవి. పశ్చిమ చాళుక్య చక్రవర్తియైన త్రైలోక్యమల్ల, ఆహవమల్ల సో మేశ్వరుని కొలువుకాడు. వానసవంశ సంజాతుడును, వసిష్ఠసగోత్రుడును, దండనాథ త్రినేత్ర బిరుదాంచితుడును, కర్ణాట సంధి విగ్రహాధిపతియు నైన మధుసూదనుడు 'పరమేశ్వర దత్తి'గా తామ్రశాసనము వ్రాయించి నాగవావి (ఇప్పటి నాగాయి) అగ్రహారములోని, చతుర్వేద పారగులైన నన్నూర్వురు విప్రోత్తముల భరణము నిమిత్తము త్రైలోక్య మల్ల మహీపతి వలనను, హైహయ కులజుడైన అయ్యపరసు వలనను కొంత భూమిని మాన్యముగా బడసి ఆ యగ్రహారమున కటక కమలార్కుడను పేరు త్రైపురుషదేవర కొక యాలయమును, తనపేర మధుసూదన దేవుని కొక యాలయమును, రామేశ్వరుని కొక యాలయమును, వేదాధ్యేత విన్నూర్వరి కొరకును, శాస్త్రాధ్యేత కేబది యిర్వుర కొరకును, నిజ ధర్మకారితాధికార పదవీ విద్యాపకులు మూవురను, శాస్త్రోపాధ్యాయులు మూవురను, భట్టదర్శన, న్యాస, ప్రభాకర వ్యాఖ్యాతలను మూవురను, శాలలోని సరస్వతీ భండాగారికుల నార్వురను నియమించి మొత్తము 267 (శాసనములో పొరపాటున 257 అని యీయబడినది) గురి అశన, ఆచ్ఛాదనాదుల నిమిత్తము వృత్తు లేర్పాటు చేసెను. ఈ శాసనము క్రీ. శ. 1058 నాటిది. సింహాచలములోని యొక శాసనమునందు ఇతర నిబంధములతో పాటు 'కాండవ తై త్తిరీయ శాఖలు చదివించ్చెటి ఘడి శాసులైన బ్రాహ్మణుల కిద్దఱకు' కూడ నిబంధములు చేయబడినవి. సింహాచల దేవాలయమున ఘటిక యుండె ననియు అచ్చటి ఘడి శాసులకును నిబంధములు (వర్షాశనములు మొదలైనవి) చేయబడెననియు ఈ శాసన ములవలన దెలియుచున్నది. ఈ శాసనములవలన ఘటికాస్థాన మన్నది వేద విద్యాసంస్థయని, నిస్సంశయముగ తేలిపోయినది. ప్రాచీన కాలమునాటి ఘటికా స్థానములలో గొప్ప సరస్వతీ భండారము లుండెడి వని ఈ శాసనమే రుజువుచేయుచున్నది. సరస్వతీ భండారమన్నది నేటి గ్రంథాలయమునకు ప్రాచీన నామము. నాగవావి ఘటికాస్థానమందలి సరస్వతీ భండార మెంతటి గొప్పదో! దానిలో నారుగురు సరస్వతీ భండారికు లుండెడివారట!
తాలగుండ శాసనమును ప్రకటించి పరిష్కరించిన ప్రొఫెసర్. యఫ్. కీల్ హారన్ పండితుడు ఘటికయనునది బ్రహ్మపురి వంటి దాని నుడివియున్నాడు. బ్రహ్మపురి యనగా, వేదవిదులైన బ్రాహ్మణులవాడ యని మైసూరు రాష్ట్రములోని శాసనములు తెలుపుచున్నవి. కడప జిల్లాలోని నిరందనూరు (ఇప్పటి నందలూరు) బ్రహ్మపురియని యచ్చటి శాసనములలో పేర్కొనబడినది. ఘటిక బ్రహ్మపురి వంటిదే! బ్రహ్మపురి మాత్రము ఘటిక కాదు. వేలూరి పాళయము శాసనమున పల్లవ మహీపతియైన రాజసింహావరనామధేయుడు, రెండవ నరసింహవర్మ
“పునర్వ్యధాద్యో ఘటికాం ద్విజానాం
శిలామయం వేశ్మ శశాంకమౌ లేః
కైలాస కల్పంచ మహేంద్రకల్పః"
ద్విజులకు ఘటికను, కైలాసకల్పమైన శిలామయ వేశ్మమును, శివునికిని (కాంచీ కై లాసనాధాలయము) నిర్మించెనని కీర్తింపబడినాడు. ఈ నరసింహవర్మనుగూర్చి కాశాకుడి శాసనముకూడ ఇట్లు చెప్పుచున్నది —
"దేవబ్రాహ్మణ సత్కృతాత్మవిభవో
యః క్షత్రచూడామణిః
చాతుర్వేద్యమ వీవృధత్ స్వఘటికాం
భూదేవతాం భక్తితః"
నందివర్మ పల్లవ మల్లుని కాశాకుడి శాసనము బహుదోష భూయిష్ఠము. ఘటికనుగూర్చి విశేష పరిశోధన చేసిన కుమారి మీనాక్షిగారు సవరించి ఇచ్చిన దీ పైశ్లోక పాఠము. ఇదియే సరియైన పాఠము కాదగును. పై నుదా హృతములయిన శ్లోక పాఠముల వలన గూడ ఘటికా-ఘటికాస్థానము -ద్విజసంస్థ- బ్రాహ్మణసంస్థ యనియు నది చాతుర్వేద విద్యాబోధనశాల యనియు విదితమగును.
ఒక్కొక్క వేదమును చదివించుటకు ప్రత్యేక ఘటికాస్థానము లుండెడివేమో! క్రీస్తుశకము పదునైదవ శతాబ్దము నాటి యొక కర్ణాటదేశ శాసనము ఉత్తంకుడు చెప్పినట్లు సామవేద ఘటికాశ్రమము నిర్మితమైన దాని నుడువుచున్నది. ("ఉత్తం కోక్త్యా సామవేద వ్యధత్తం ఘటికాశ్రమమ్") ఈ శాసనము ననుసరించి ఘటికాశ్రమములు క్రీస్తుశకము పదునైదవ శతాబ్దము వరకు అనగా నిప్పటి కయిదువందల సంవత్సరములకు పూర్వము వరకు వేదవిద్య బోధించుచుండెనని తెలియుచున్నది.
ఘటికాస్థానములు పూర్వ మొక కాంచీపురములోనే కాక తమిళ, కర్ణాటాంధ్ర దేశములలో పెక్కుచోట్ల నుండినట్లు దక్షిణ హిందూదేశము నందలి ప్రాచీన శాసనముల వలన తెలియుచున్నది. సాధారణముగా ఘటికాస్థానమును పూర్వము మన దేశమును పరిపాలించుచు వచ్చిన మహీధవులు స్థాపించుచు వచ్చిరనుట కనేక శాసన ప్రమాణములు గలవు. పూర్వము ఘటికా స్థాన నిర్మాణము పుణ్యప్రదములైన కార్యములలో నొకటి. ప్రాచీన కాలమున ఆంధ్రదేశమును ధర్మోత్తరముగ పరిపాలించిన విష్ణుకుండి వసుమతీపతులలో నొకడైన రెండవ విక్రమేంద్ర వర్మ ('యథావిధి వినిర్యాపిత ఘటికా వాప్త పుణ్యసంచయు'డట - 'యథావిధి వినిర్యాపిత ఘటిక ' యనుట వలన ఘటికా నిర్మాణమున-మన కిపుడు తెలియరాకపోయినను - శాస్త్రోక్త పద్ధతి యొకటుండవలె నని తోచుచున్నది. భారతీయ సంస్కృతికి, ఆధ్యాత్మిక జీవనవల్లికి మూలకందమైన వేదవిద్య యవిచ్ఛిన్నముగ సాగుటకు సంకల్పించి ఘటికలు స్థాపించిన జగతీపతులు పుణ్యశ్లోకులైరి. వేంగీచాళుక్య భూమీశుడైన మొదటి జయసింహవల్లభుని కాలమున అసనపురమున (వేంగీ దేశములోనిదే కాని ఇదెక్కడిదో తెలియదు) ఒక ఘటిక యుండెడిది.
ఘటికా స్థానమున వేద అధ్యాపకులైన నేమి, అధ్యేతలైన నేమి ఎందరుండెడివారో తెలియదు. వారి సంఖ్య ఎక్కువే అన్న సంగతి నాగాయి శాసనముల వలననే తెలియుచున్నది. కడపటి పల్లవులలో మొదటివాడయిన నందివర్మ పల్లవమల్లుని తిరువల్లరి శాసనమునందు ఘటికకు చెందిన ఏడువేల మంది (ఘటికై ఏళాయరవర్) ప్రస్తావము కలదు. ఈ విధముగానే కన్నడదేశ శాసనములలో ఘటికకు చెందిన బ్రాహ్మణులపేర్ల ముందు 'ఘటికా సాహస్ర' పదము కానవచ్చును. దీనినిబట్టి ఒక వేళ ఘటిక యందు వేయిమంది (అధ్యాపకులు, అధ్యతలు కలసి) ఉండెడివారేమో అనిపించును. పశ్చిమ గాంగభూపతి శివమారుని హెలిగెరె తామ్రశాసనములో హరితసగోత్రుడైన మాధవశర్మ ( 'ఘటికా సాహస్రాయ హరితస గోత్రాయ మాధవశర్మణే') ఘటికా సాహస్ర మాధవశర్మ యని పేర్కొనబడినాడు. ఇట్టి శాసనము లింకను గలవు. చాళుక్య వంశజుడైన మొదటి జయసింహవల్లభుని నిడమర్రు శాసనమునందలి ప్రతి గ్రహీతయైన 'కాటిశర్మ పితామహుడు'ను, 'సపదక్రమానుక్రమాధీత వేదద్వయుడు'ను, 'సకల్పోపనిషత్పురాణేతిహాసానేక ధర్మశాస్త్రవిదు'డును అయిన మండశర్మ అసనపురస్థాన నివాసియు, ఘటికా సామాన్యుడు నట! అనగా అసనపురమందలి ఘటికకు చెందినవాడు. ఘటికకు చెందిన విప్రోత్తములను, ఘటికా సామాన్యులని వ్యవహరించుచుండి రేమో - పూర్వము వారికి మహాజనులనియు వ్యవహార ముండెను.
మహారాజ ప్రతిష్ఠాపితములు, పోషితములు అగుటచేత కర్ణాటదేశ శాసనమొకటి కుంతలదేశమును "ధర్మక్కె నెర్మముం భోగక్కాగరము మాద ఘటికాస్థానముం" అని ధర్మమునకు సహకారకములును, భోగముల కాకరములు నగు ఘటికాస్థానములకు నెలవని వర్ణించుచున్నది.
సాధారణముగా ఘటికాస్థానము లెక్కడ నుండెడివను విషయము విచారణీయము. నాగవావిలోని శాసనములు తదగ్రహారములో ఘటికాస్థానము స్థాపితమైనదని చెప్పుటవలన అగ్రహారమును, ఘటికయు విద్యాస్థానములే యైనను అగ్రహారము వేరు, ఘటిక వేరు; అగ్రహారము ఘటికకాదు. ఘటిక అగ్రహారముకాదు. ప్రాయికముగా ఘటిక దేవాలయమున నుండెడి దని తోచుచున్నది. ఇందుకు నాగాయి శాసనములే ప్రమాణము. "హెంజర పట్టణద, మహాఘటికా స్థానద శ్రీనోణం బేశ్వర దేవర సన్నిధానదల్లి " అని యొక కన్నడ శాసనములో నున్న విషయము కూడ పైని చేసిన యూహకు ఉపబలకముగ నున్నది. రాజసింహ నామాంతరమునం బరగు పల్లవ రెండవ నరసింహవర్మ 'పునర్వ్యధాద్యో ఘటికాం ద్విజానా' మన్న ఘటిక కూడ అతడు శశాంక మౌళికి కైలాస సదృశముగ నిర్మించిన శిలామయ వేశ్మము - కైలాసనాథాలయముననే యుండియుండవచ్చును.
తెలుగు కవులలో కేతన యింటిపేరు మూలఘటిక వారు. మూలస్థానేశ్వరుని యాలయమునందలి ఘటికకు 'మూలఘటిక ' యనుపేరు వచ్చెనో, దేవాలయ ప్రకరములో నుండిన వేరువేరు ఘటికలలో ప్రధానమైనదానికి మూలఘటిక యని పేరు వచ్చెనో తెలియదు. పూర్వము ప్రాముఖ్యముగల ప్రతి పురమున మూలస్థానేశ్వరాలయ ముండెడిది. అదియునుగాక త్రికూట మనుపేర ఒకటే చోట మూడేసి ఆలయములను నిర్మించు సంప్రదాయము కూడ పూర్వ ముండెడిది. ఇందుకు తెలంగాణా శాసనములే ప్రమాణము. ఎట్లయినను మూలఘటికకు సంబంధించినవా రగుటచేతనే కేతనకవి పూర్వులకు, మూల ఘటిక వారని ఇంటిపేరు కలిగినది.
వింధ్యకు దక్షిణమున నున్న దక్షిణహిందూ దేశమున ఘటికాస్థానము లెన్ని యెక్కడెక్కడ నుండెడివో తెలియదు. కాని పంచశత వీరశాసనుల మనియు, అయ్యావళీ పురవరాధీశ్వరుల మనియు చెప్పుకొన్న వీరబలంజవర్తక శ్రేణివారు తాము ముప్పదిరెండు హేలానగరము (కర పట్టణము) ల తోను, అష్టాదశనగరములతోను, అరువది నాలుగు యోగపీఠములతోను, అరువదినాలుగు ఘటికా స్థానములతోను, వర్తకవ్యాపారము సాగించుచు వచ్చినట్లు తమ శాసనములలో చెప్పుకొనియున్నారు. అందువలన దక్షిణదేశమున సంప్రదాయసిద్ధముగ వచ్చు ప్రఖ్యాత ఘటికాస్థానము లరువదినాలుగు ఉండినట్లు తెలియుచున్నది. ఇచట ఘటికాస్థానము లన్నది ప్రసిద్ధ పుణ్య క్షేత్రములందలి దేవాలయములకు పర్యాయపదముగ వాడబడేనేమో యని తోచుచున్నది.
దేవాలయములలో నుండెడు వేదవిద్యాపీఠములు, ఘటికాశాలలు, ఘటికాస్థానములు, ఘటికలు అని నిశ్చ యింప దగియున్నను వానికి ఘటిక యను పే రెట్లు వచ్చిన దను విషయము విచారింపవలసి యున్నది. “టు స్ట్రైవ్‌ఫర్” అను నర్థ మిచ్చు ఘట్ ధాతువునుండి ఘటికయను శబ్ద మేర్పడినదనియు, ఘటిక యన్న విద్యార్జనమునకై ప్రయత్నించు, కృషిచేయు శాల యనియు అర్థము చెప్పు చున్నారు. కాని అది సమంజసముగ గన్పట్టదు.
జ్యోతిషగ్రంథముల ననుసరించి ఘటిక యన నొక గడియకాలము. ఆహో రాత్రములతో గూడిన దినము పరిమాణము అరువది గడియలు-పగలు ముప్పది, రాత్రి ముప్పది. రెండు గడియ లొక ముహూర్తము (48 నిమిషములు). పగలు పదునైదు ముహూర్తములు. ఇట్లే మన పూర్వులు, దివారాత్రములను యామము (జాము) లుగ కూడ విభజించియున్నారు. ఒక్కొక్క యామమున కొక్కొక్క పేరు కలదు. యామ మనగా ఏడున్నర గడియలు (మూడు గంటలు). దేవాలయములలో నిర్ణీతకాలములందు జరుపవలసిన అంగభోగ, రంగ భోగాద్యనేకాగమోక్త విధులు కలవు. ఇట్లే నీతిశాస్త్రములు పగటిని, రాత్రిని అర్ధయామములుగ విభజించి ఒక్కొక్క యర్దయామమునందు నరపతి నిర్వర్తింప వలసిన కార్యకలాపమును నిర్ణయించుచున్నవి. ఇందు నిమిత్తము ప్రొద్దు తెలిసికొనుట యవసరమై, కాలమాన జ్ఞాపికా సాధనములు కావలసివచ్చినవి. ఇట్టి సాధనములు పూర్వకాలమునందు వివిధములైన వనేకములు. ఇవి శాస్త్రవేత్తల, ముఖ్యముగా జ్యోతిష్కుల పర్యవేక్షణయం దుండెడివి. ఇట్టివానిలో మన దేశమున వేదకాలము నుండియు ననుస్యూతముగ వచ్చుచున్న సాధనము, అడుగున సన్నని బెజ్జముగల తామ్రఘటికా పాత్రతో ప్రొద్దు తెలిసికొనుట యొకటి. ఘటికాపాత్రకు తెలుగున గడియ కుడుక యని పేరు. ఋగ్వేదాంతర్గత వేదాంగ జ్యోతిషము నందును, ఇతర జ్యోతిషగ్రంథము లందును, తామ్రపాత్ర ఘటికానిర్మాణ ప్రకార మభివర్ణితమైనది. ఈ కాలమాన జ్ఞాపిక సాధనమునకు ఘటికా యంత్రమని పేరు. ఈ యంత్రము సుప్రఖ్యాతములైన గొప్పదేవాలయములం దుండెడిదని యూహింపవచ్చును. ఘటికాయంత్ర ముండిన యగారమునకు ఘటికాగార మని, ఘటికాశాల యని పేరు. గడియార మన్నది ఘటికాగార వికృతి. దేవాలయములో ఘటికాయంత్ర ముండు శాలయే వేదవిద్యా స్థానముగ ఉండుటచేత కావచ్చును. దేవాలయము నందలి వేదవిద్యా పీఠమునకు గూడ, ఘటికాశాల, ఘటికా స్థానము, ఘటిక యను పేరు వచ్చియుండును.
అడుగున గల సన్నని బెజ్జముగుండ తామ్రఘటికా పాత్రలోని నీరు కారిపోయి యది జలరహిత మగుటకు కాని, ఆ పాత్రను నీటిమీద నుంచినపుడు బెజ్జముగుండ దానిలోనికి నీరు చొచ్చుకొనిపోయి యది, సంపూర్ణ జలభరిత మగుటకు కాని, సరిగా నొక గడియ పట్టునట్లాపాత్రను నిర్మించువారు. కావుననే దానికి ఘటికా పాత్రయని పేరు కల్గినది.
వేదకాలమునందు మొదటి విధము వాడుకలో నుండెను. మధ్యయుగమునం దనగా క్రీ. శ. 1000 మొదలు క్రీ. శ. 1500 ల వరకు గల నడిమికాలమున మన తెలుగు దేశమున వాడుకలోనికి వచ్చినది రెండవ విధము. ఒక పెద్ద పాత్రను నీటితో నింపి ఆ నీటిమీద ఘటికాపాత్ర నుంచినప్పటినుండి యది నీటిలో మునుగువరకు నగు కాల మొక గడియ. శుభకార్యావసరముల యందు శుభ ముహూర్త మాసన్నమయిన దనగనే “జలమునందు మునుగు ఘటికాపాత్ర నిరీక్షించి... యక్షతలు" చల్లెడివారట. ప్రాచీనాంధ్ర కవులు "గడియకుడుకభంగి గ్రహరాజు జలధిలో వ్రాలె" నని అస్తంగత సూర్యుని వర్ణించి యున్నారు. గడియకుడుకను నిరీక్షించి యప్పటప్పటి కయిన ప్రొద్దును శంఖధ్వానములవలన గాని, జేగంటల రవమువలన గాని తెలుపుచుండువారు. (ఉదా : "మును గడియారంబునఁ గట్టిన పెను జేగంట రవము ఠే యను నెడ.")
ఇట్టి గడియారములు దేవాలయములలోనేగాక మహారాజుల మోసాలలోను నుండెడివనుటకు
'ఉడువీథిన్ శిఖరావలంబియగు నంధ్రోర్వీశు మోసాల పై
గడియారంబున మ్రోసె రెండెనిమిదుల్ ఘంటా ఘణాత్కారముల్
సడలెన్ భానుఁడు పశ్చిమంబున'
అన్న క్రీడాభిరామమందలి పద్యమే తార్కాణము.
ఘటికాస్థానీయునికి ఘడియశాసి, ఘటశాసి, ఘళిశాసి, ఘైసాసి అను గౌరవబిరుదు వాచకములు కూడ శాసనములయందు గానబడుచున్నవి. ఇవి యన్నియు సమానార్థకములు. ఘడియశాసి, ఘటశాసి యన్నవి. ఘటికాశాసి యను పదము రూపాంతరములే. వికృతులే. ఘళిసాసి, ఘైసాసి యన్నవియు భ్రష్టరూపములే. క్రీ. శ. 1290 నాటి యొక తెలుగుదేశపు తామ్ర శాసనమునందు వివిధగోత్రములకు చెందిన ఘటశాసులైన వృత్తిమంతు లనేకులు (వామదేవ ఘటశాసి, కంచి ఘటశాసి, పోతె ఘటశాసి, సూరే ఘటశాసి మున్నగువారు) పేర్కొనబడియున్నారు. శాసి యన అపదేష్ట, శాసించువాడు గురువు అని యర్థము చెప్పుకొనవచ్చును. ఘళిశాసి, మైసాసి శబ్దములలోని 'సాసి' యన్నది ఒక వేళ 'శాసి' పదమునకు తప్పుగ వ్రాయబడినదేమో తెలియదు. 'సాసి' యన్నది కన్నడములోని 'సాసిర్ ' పదమునకు రూపాంతరమైనను కావచ్చును.
కన్నడదేశ శాసనములలో వ్యక్తుల పేర్లముందు 'ఘటికాసాహస్ర' గౌరవబిరుదు వాచకముండుట మనకు దెలిసినవిషయమే. 'ఘళిసాసి' 'ఘైసాసి' అనునవి 'ఘటికా సాహస్ర' పదభ్రష్టరూపము లగునేమో విచారింపవలసి యున్నది.
మ. సో.
ఘనాదేశము :
స్థానము, వి స్తీర్ణము : ఆఫ్రికా ఖండములో గినియా తీరముననున్న దేశములలో ఘనా అనునది దాదాపు మధ్య గతముగ నున్నది. ఈ దేశమునకు తూర్పుగా ఫ్రెంచి టోగోలెండు (French Togoland) కలదు. దానికావల ఫ్రెంచి దహోమీ (French Dahomey) విస్తృతమైన నైగీరియా సమాఖ్యయు (Federation of Nigeria) కలవు. పశ్చిమముగా ఫ్రెంచి ఐవరీ కోస్టు (French Ivory Coast), లైబీరియా రిపబ్లిక్ (Liberia Republic), బ్రిటిష్ సైర్రాలియోన్ (British SierraLeone), ఫ్రెంచి గినియా, (French Guinea) అను దేశములు కలవు.
ఈ రాజ్యములన్నియు సముద్ర తీరమువరకు విస్తరించి యున్నవి. కాని వాటి లోతట్టు ప్రదేశపు (inland) సరిహద్దులపై సామూహికముగా ఫ్రెంచి పశ్చిమ ఆఫ్రికా అనబడు విశాల ప్రాంతమునకు చెందిన ఇతర రాజ్యము లున్నవి. ఈ లోతట్టు ప్రదేశములలో నొకటియైన 'ఫ్రెంచి అప్పర్ వోల్టా' (French upper volta) 'ఘనా' అను దేశముయొక్క ఉత్తరపు సరిహద్దు వెంబడిగా నున్నది.
సముద్ర తీరమునుండి లోగర్త ప్రదేశములో ఉత్తర మున అక్షాంశము 11° వరకును 'ఘనా' దేశము వ్యాపించి యున్నది. ఇట్లది దక్షిణమునుండి ఉత్తరమునకు సుమారు 420 మైళ్ళ దూరము ఆక్రమించియున్నది. ఈ విశాలతమమైన భాగమున కడ్డముగా తూర్పునుండి పశ్చిమమునకు గల దూరము స్వల్పము. అనగా రేఖాంశ వృత్తము 11/2° తూర్పునకును, రేఖాంశవృత్తము 31/2° పశ్చిమమునకును నడుమగల దూరము సుమారు 334 మైళ్లు మాత్రమే. బ్రిటిష్ సామ్రాజ్యకూటము (British Commonwealth) లో 'ఘనా' అను నొక్కదేశము మాత్రమే స్వతంత్రమైన పశ్చిమ ఆఫ్రికను దేశమై యున్నది. ఈ దేశముయొక్క మొత్తము వైశాల్యము 91,843 చ. మైళ్లు. 1948 సంవత్సరములో జరిగిన జనాభా లెక్కలనుబట్టి అందలి జనాభా 4,118,450 మంది.
గినియాతీరమునందలి ఇతర భాగములకువలెనే ఘనా యొక్క దక్షిణతీర వైశాల్యమునకు ప్రబలమైన సముద్రపు పోటు తగులుచున్నది. ఓడలు సురక్షితముగా లంగరు వేసికొనగల సహజ నౌకాశ్రయములు లేని సముద్రపు ఒడ్డుకు ఎడ తెగని ఈ సముద్రపు పోటువలన దెబ్బ తగులు తున్నది. కావున ఎక్కువ ధన వ్యయముతో కృత్రిమము లైన (artificial) నౌకాశ్రయ నిర్మాణములుగల టాకోరడీ (Takoradi), టెమ (Tema) అను తావులందు తప్ప, సముద్ర ప్రయాణముచేయు ఓడలు సముద్రతీరమునకు సమీపముగా అరమైలు దూరమున లంగరువేసికొన వలసివచ్చుచున్నది. చిన్నసైజు సర్ఫ్ బోట్లు (surf boats) మాత్రమే ఒడ్డునకును, గర్జించుచున్న అలలకు అవల నున్న లోతైన, ప్రశాంతమయిన నీటికిని నడుమ ప్రమాదభరితమైన ప్రయాణము చేయగలుగు చున్నవి.
రాజకీయ పరిణామము : ఈ దేశము 1957 వ సంవత్సరము మార్చి 6 వ తేదీన స్వాతంత్ర్యమును పొంది 'ఘనా’ అను ప్రాచీననామము ధరించినది. దీనికి 'గోల్డు కోస్టు' అని ఇంగ్లీషుపాలకులు పేరుపెట్టి యుండిరి.
బహుకాలమువరకు 'గోల్డు కోస్టు' అను పదము, స్థానిక ప్రజలు అందజేయు బంగారముతో యూరపియనులు వర్తకముచేయుసముద్రతీర ప్రదేశమునకుమాత్రమే వర్తించెను. 'గోల్డు కోస్టు' అను పదము మిక్కిలి సముచితముగ నున్నది. ఎందుకనగా, బానిస వర్తకము తదితర