సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/గ్రీన్‌లాండ్
గ్రీన్‌లాండ్ :
విమానములో ప్రయాణించి గ్రీన్‌లాండ్ భూభాగముపై దిగ నుద్యమించు బాటసారికి, తాను మరియొక గ్రహముపై దిగుచున్నట్లు గోచరించును. పై నుండి ఆతనికి యుగముల తరబడిగా నిరంతరము పడి పేరుకొనిన మంచుచే కప్పబడి, నిర్జనమై, విశాలమైన మైదానము తప్ప మరొకటి కనిపించదు. ఈ కారణమును బట్టియే ప్రారంభ పరిశోధకులలో ఒకడగు డేవిస్ అను నతడు మొట్టమొదట గ్రీన్‌లాండునకు “నిర్జన భూమి” అని పేరిడెను.
గ్రీన్‌లాండ్ నేటి డెన్మార్క్ రాజ్యము యొక్క ఏకైక వలసప్రాంతముగా నున్నది. ఆస్ట్రేలియా తరువాత, ఖండాంతర్గత ద్వీపములలో గ్రీన్‌లాండ్, వైశాల్యమున రెండవదిగా నున్నది. దీని వైశాల్యము దాదాపు 8,40,000 చదరపు మైళ్లు. దీని విస్తీర్ణము దాదాపు మెక్సికో వైశాల్యముతో సమానము కాగలదు. గ్రీన్‌లాండ్ మొత్తము వైశాల్యములో 46,740 చదరపు మైళ్ళ ప్రదేశము మాత్రమే ప్రజలు నివసించుటకు వీలగుచున్నది. ఇంతవరకు తెలిసికొనబడిన ద్వీపములలో ఈ దేశమే మిక్కిలి ఉత్తరముగా నున్నది. ఇందు వలసలు ఏర్పరచుకొనిన జనులే ప్రపంచములో నెల్ల అత్యంతము ఉత్తర దిశయందు నివసించుచున్నారు. మంచుతో కప్పబడి, మానవులకు నివాసయోగ్యముగా నున్న ప్రాంతము ఇదొక్కటే.
ఉత్తరమున 59°45 అక్షాంశ రేఖమీద నున్న 'కేవ్‌ఫేర్వెల్' నుండి దక్షిణమున 83°35 అక్షాంశ రేఖమీద నున్న 'కేవ్ జెసవ్ ' వరకు దీని దూరము 1600 మైళ్లకు మించి యున్నది; తూర్పునుండి పశ్చిమమునకు 78 వ సమాంతరమునకు (78th parallel) సమీపముగా ఈ దేశముయొక్క వెడల్పు సుమారు 900 మైళ్లు.
చితము - 138
పటము - 1
గ్రీన్‌లాండ్ యొక్క నైసర్గిక లక్షణము లీ క్రింది విధముగా నున్నవి. ఇది ఒక ఎత్తైన పీఠభూమి. దీని ఎత్తు 2,000 అడుగుల నుండి 6,000 అడుగుల వరకు ఉండును. కేంద్ర ప్రాంతమునందు గల కొన్ని ఉన్నత భాగములు 5,000 నుండి 9,000 అడుగుల ఎత్తు వరకు మారు చుండును. దేశముచుట్టు నున్న సముద్రము యొక్క సమీపగత తీర ప్రదేశముల యందు తప్ప తక్కిన భూభాగ మంతయు 'దేశపుమంచు' అనబడు హిమానీనదమునకు సంబంధించిన అవిచ్ఛిన్నమైన మంచు పొరతో కప్పబడి యున్నది. సగటున ఈ మంచు యొక్క మందము 1000 అడుగులు. ఈ మంచు పొరయొక్క వైశాల్యము 7,00,000 చదరపుమైళ్ళు. ప్రపంచమునందలి హిమానీనదములలో ఇది రెండవదిగా పరిగణింప బడుచున్నది. అక్కడక్కడ ఈ మంచుగడ్డను చీల్చుకొని పైకి వచ్చిన ఎ త్తైన కొండల గుట్టలు కలవు. ఈ కొండలను ఎస్కిమో భాషలో 'నూనటక్స్' అందురు. వీటిలో అత్యున్నతములైన శిఖరములు మూడు. అవి 'టినిన్‌గెర్‌టక్ ', 'పీటర్ మన్', 'పోరెల్' అనునవి. కేవ్ ఫేర్వెల్ వద్ద 'టినిన్ గెర్ టక్' శిఖరముయొక్క ఎత్తు 7340 అడుగులు. ఫ్రాన్జ్ జోసెఫ్ ఫియోర్డ్ సమీపమున పీటర్ మన్ యొక్క ఎత్తు 8,500 అడుగులు. దక్షిణగ్రీన్‌లాండ్ మధ్యప్రాంతమున ఫోరెల్‌యొక్క ఎత్తు 9,050 అడుగులు.
గ్రీన్‌లాండ్ దేశముయొక్క తీరప్రాంతమంతయు ఇరుకుమూతి సముద్రశాఖలచే (fiords) లోతుగా కోయబడి యున్నది. పెద్దపెద్ద మంచుకాలువలు దేశాంతర్భాగమునుండి ఈ ఇరుకైన సముద్రశాఖలగుండా ప్రక్కన గల సముద్రములోనికి ప్రవహించును. ఇట్టివాటిలో ఆగ్నేయతీరమందున్న ఫ్రాన్జ్ జోసెఫ్, కింగ్ ఆస్కార్ అనునవి, నైరృతిదిశయందలి గాడ్ తాబ్ అనునది, వాయవ్యదిశయందు ఆర్కిటిక్ మహాసముద్రమునకు అభిముఖముగానున్న పీటర్ మాన్ అనునది ముఖ్యము లైనవి.
ఉత్తరధ్రువమండలమునకు సంబంధించిన ప్రాంతముల నుండి భూభాగము వెంబడి ఉత్తరధ్రువప్రవాహము మంచుగడ్డల సముదాయమును నైరృతిదిశగా తోడ్కొని వచ్చుచు ఈ ప్రాంతమునకు పూర్తిగా ఆర్కిటిక్ శీతోష్ణస్థితిని కల్పించుటచేత, గ్రీన్‌లాండ్ తూర్పుతీరమునం దెల్లను విస్తారముగా హిమానీనదములు ఏర్పడియున్నవి. దేశాంతర్భాగములో కొన్ని ప్రాంతములయందు ఈ హిమానీనదములు (glaciers) సముద్రతీరమునకు సమీప ప్రాంతమువరకును, మరికొన్ని ప్రాంతములయందు లోతట్టు ప్రదేశమువరకును వ్యాపించియుండును. మంచు మయమైన సముద్రతీరప్రాంతము దేశములోనికి దూరముగా వ్యాపించిన ఇరుకైన సముద్రశాఖలచే కోయబడి యున్నది. అక్కడక్కడ పెద్దపెద్ద హిమానీనదములు (glaciers) కాలువలను అడ్డగించి హిమశిలలను (icebergs) వానిలో బడవైచును. ఉదా: “స్కోర్స్‌బీసౌండ్" అనెడిశాఖ యొక్క నిడివి, తీరప్రాంతమునుండి హిమానీనదములు (glaciers) అడ్డగించు ప్రాంతమువరకు 180 మైళ్లు కలదు. “ఫ్రాన్జ్ జోసెఫ్" అనెడి శాఖకూడా ఇట్టిదే. ఈ సముద్ర శాఖలు చాలా లోతైనవి. "స్కోర్స్‌బీసౌండ్" అనెడి శాఖయొక్క లోతు 300 బారలు అని రైడర్ (Ryder) కనుగొనెను. ఈ ఇరుకు సముద్రశాఖలయందు జలాంతర్గాములు ప్రయాణింపవచ్చునని తీరప్రాంతములయందు చేసిన పరిశోధనల మూలమున నిరూపింపబడినది. కోతకోయబడిన ఫలితముగా, లోయలు సముద్రశాఖలుగా రూపముదాల్చి, సముద్రపు నీటిలో మునిగిపోయినవి. పశ్చిమతీరమున గూడా అనేక గొప్ప ఇరుకు సముద్ర శాఖలు కలవు. వీటిలో ఆదికాలమునుండియు పేరెన్నిక కన్న "గ్రేట్ గాడ్ తాబ్" అనునది ఒకటి.
తూర్పు సముద్ర తీరమున అనేక వేల హిమశిలలు (icebergs) ప్రతిసంవత్సరము ఏర్పడుచున్నవి. ఇవన్నియు “స్పిట్జ్ బెర్గెన్” ప్రవాహముల మూలమున స్థానికముగనే నిలిచిపోవుచున్నవి. ఇతరములగు హిమశిలలు ఈ బలమైన ప్రవాహములచే (currents) 'కేవ్ ఫేర్వెల్ ' చుట్టునున్న ప్రాంతములకును, అక్కడినుండి 'మెల్ విల్లి అఖాతము' లోనికిని తీసికొని పోబడుచున్నవి. చివరకు అవి అట్లాంటిక్ మహాసముద్రమున హిమక్షేత్రము (icefields) లేర్పడుటకు తోడ్పడుచున్నవి.
గ్రీన్‌లాండునందలి మంచుపొర బహిర్ముఖమైన ఒత్తిడి కలిగియుండి తీరప్రదేశము వైపునకే మ్రొగ్గియుండును. దేశాంతర్గతమైన నిలువు ఒత్తిడివలన మంచుపొరలు నిదానముగా సముద్రతీర ప్రాంతమునకు ప్రవహించును. ఈ మంచురేకుల యొక్క గతివేగమును కనిపెట్టుటకు ప్రయత్నము చేయబడినది. ఉత్తరమున 73° లో నున్న "ఉపర్నీవిక్" అను హిమానీ నదమును బట్టి రైడర్ (Ryder) అను నాతనిచే అన్ని హిమానీ నదములయొక్క అత్యుత్కటమైన గతివేగము కొలువబడినది. 24 గంటల కాలములో 125 అడుగుల గతివేగమును, అనేకదినముల వరకు సగటున 102 అడుగుల గతివేగమును అతడు కనుగొనెను. మరియు చలికాలమందును, వేసవికాలమందును హిమానీనదముల గతివేగములో గొప్పభేదము ఉన్నట్లు అతడు కనుగొనెను.
భూగర్భలక్షణములు, నిర్మాణము : గ్రీన్‌లాండ్ యొక్క ఉపరితల నిర్మాణము ఎక్కువగా 'ఆర్కియన్ వెనె ప్లెయిన్' లక్షణములు కలదై యున్నది. మరియు, ఇది 'కేంబ్రియన్ కెనెడియన్ షల్ట్' పూర్వభాగము యొక్క విస్తరణమై ఉన్నది. "ఆర్కెయన్ ఏరియా"లో విస్తార భూభాగము 'నీస్ ' (Gniss) అను ఒకవిధమగు రాయిచే నిండియున్నది. కాని ఇచ్చట 'నల్లరాయి' (Granite) చట్టులుగూడా విరివిగా లభింపగలవు. మిక్కిలి ఉత్తర ప్రాంతమంతయు 'పాలియో జోయిక్ ఇసుకరాయి' (Paleozoic sand stone) తోను, సున్నపురాయితోను ఏర్పడియున్నది. దక్షిణ ప్రాంతమున 'సిలూరియన్ సున్నపురాయి' (Silurian Lime Stones) మండలము లున్నవి.
'పాలియో జోయిక్ ' (Paleozoic Period) యుగాంతమున గ్రీన్‌లాండు ప్రాంతములో అగ్నిపర్వతములు బ్రద్దలయ్యెను. 'డిస్కా' దీవి యందలి పర్వతములందు పుష్కలముగా లభించు ఫాస్సిల్స్ (శిలాఖచితములు) ఆ ప్రాంతమందు 'టెర్టియారీ' (Tertiary) కాలమువరకును సమశీతోష్ణవాతావరణమే అంటిపెట్టుకొని యుండెనని రుజువు చేయుచున్నవి. 'టెర్టియరీ' అను అగ్నిపర్వత ద్రవములు, భూమి ఉపరితలముపై ప్రవహించినను, లేక భూగర్భములో అణగియుండినను అవి ఆ కాలమునాటి పర్వతములకు సంబంధించినట్టిదే. ఏది ఎట్లయినను, గ్రీన్‌లాండు యావద్భాగమును 'లారెన్షియన్ షీల్డ్ ఆఫ్ కెనడా' (Laurentian Shield of Canada) కు చెందిన ఒక భాగమనియే చెప్పవలయును.
ఖనిజములు : డిస్కా ద్వీపమునందును, కేవ్ యార్క్ వద్దను ఉల్కా (meteoric) మూలకమగు ఇనుము కనుగొనబడినది. ఈ ముడిఇనుమునుండి ఎస్కిమో జాతీయులు వారికి అవసరమైన ఆయుధములు తయారుచేసి కొనిరి. ముఖ్యముగా ఉపర్నీవిక్ సమీపమునందు నల్ల సీసపురాయి (graphite) పుష్కలముగా లభించును. 'ఇవిగ్‌టట్' వద్దనే ప్రత్యేకముగా క్రియొలైట్ (cry-olite) అను ఖనిజము దొరకును. అనేక ప్రాంతము లందు రాగిగూడా లభ్యము కాగలదు. తక్కువ తరగతికి చెందిన బొగ్గు డిస్కా అఖాతమునకు సమీపముగా నున్న మండలములందు దొరకును. అక్కడి అనాదిజాతివారు దీపపుబుడ్లు, పాత్రలు తయారుచేసికొనుటకై చాలా కాలము వరకును 'స్టియటైట్' (steatite) లేక 'సోప్‌స్టోన్' (soapstone) అను ఖనిజపదార్థమును ఉపయోగించెడివారు.
శీతోష్ణస్థితి : గ్రీన్‌లాండు నందలి మంచువలన ఉత్తరార్ధ గోళముయొక్క శీతోష్ణస్థితిపై కలుగు ప్రభావమును గూర్చి జరిగిన వాదోపవాదములు అనేక విధములుగా ఉన్నవి. మంచుకప్పుతో కూడిన గ్రీన్‌లాండు నందలి శీతోష్ణ పరిస్థితికి సంబంధించిన లక్షణములలో మిక్కిలి కలవరపరచునది అందులో అధోముఖముగా వీచు వాయు పరంపరయే. (Downward Pressure of winds) పెక్కుమంది యాత్రికులు ఈ దృగ్విషయమును (phenomenon) ధ్రువపరచిరి. పియరీ అనునతడు ఈ సంఘటనమును ఎత్తు ప్రదేశమునుండి నిమ్న ప్రదేశమునకు ప్రవహించెడి నీటి ప్రవాహముతో పోల్చెను. అంతరిక్ష పరిశోధనశాలలనుండి జరుపబడిన పరిశోధనలవలన ఇటీవల ఈవిషయము ధ్రువపడెను. ఈ గాలులలో కొన్ని క్రిందినుండి ఎగువభాగమునకు గూడా వీచునని పరిశోధనలవలన నిరూపింపబడినది. పైని వివరింపబడిన అధోముఖ పవనములను (Downward slope winds) పరిశీలించియే ప్రొఫెసర్ డబ్లియు. హెచ్. హాబ్స్ అనునతడు గ్లేషియర్ ఆంటి సైక్లోన్ (Glacial Anti - Cyclone Theory) అను సిద్ధాంతమును ప్రతిపాదించెను. ఈ సిద్ధాంత విషయమున పలువురు శాస్త్రవేత్తలు మిక్కిలి శ్రద్ధాసక్తులను ప్రకటించిరి. ఈ పరిశోధనముల మూలముననే గ్రీన్‌లాండు 'ఉత్తరార్ధగోళముయొక్క శీతల ధ్రువము' (Cold pole of Northern Hemisphere) అను భావము ఉత్పన్నమైనది.
గ్రీన్‌లాండు యొక్క శీతోష్ణపరిస్థితి అనిశ్చితమైనది. ఉన్నట్లుండి శీతోష్ణ వాతావరణ పరిస్థితులు మారును. దివ్యమైన సూర్యకాంతి ఆకస్మికముగా అదృశ్యమగును. దట్టమగు పొగమంచు ఏర్పడును. లేదా, మంచు కురియును. మిక్కిలి శీతలములైన వాయువులు వీచును. ఉదా : ఫిబ్రవరి నెలలో ఉపర్నీవిక్ యందలి వాతావరణము ఒకప్పుడు 60.8°F ఉన్నట్లును, మరల అదే నెలలో 44.1° ఉన్నట్లును, గ్రీన్‌లాండు సముద్ర తీరప్రాంతమందు కనీసపు శీతోష్ణస్థితి ఉన్నట్లును లెక్కకట్టబడినది. నిమ్నోన్నతమైన స్థలరచన చేతను, లోతైన ఇరుకుమూతి సముద్రపుశాఖలు కారణముగాను, స్థానిక పరిస్థితుల ప్రబల ప్రభావము గ్రీన్‌లాండు నందలి ప్రతిస్థలమునందలి శీతోష్ణస్థితులపైనను ప్రసరించుచున్నది.
తీవ్రముగ ఎండలుకాయు మాసములయందును ‘ఇవిగ్‌టట్' అను ప్రదేశమున తప్ప, తక్కినతావులం దెల్లను శరీరము గడ్డకట్టుకొని పోవునట్టి శీతలవాయువులు వీచునట్లుగా శాస్త్రజ్ఞులు లెక్కకట్టిరి. జులై నెలలో 'ఇవిగ్‌టట్' లో కనిష్ఠశీతోష్ణస్థితి 32.5F గాను ఉన్నట్లు వ్రాసి పెట్టబడినది.
హిమపతనము : గ్రీన్‌లాండులో సంవత్సరమునకు ఈ క్రింది సరాసరి లెక్కలప్రకారము మంచు కురియు చున్నది. 'ఉపర్నివిక్' (Upernivik) లో 9 అంగుళములు ; 'జాకబ్‌షేవెన్' లో (Jakobshaven) 8.5 అంగుళములు ; 'గాడ్‌తాబ్' లో (Godthaab) 26 అంగుళములు ; 'ఇవిగ్‌టట్' లో (Ivigtut) 46 అంగుళములు ; 'ఆంగో మాగ్ సాలిక్' లో (Angomagsolik) 37 అంగుళములు ; 'డామర్క్‌షాన్' లో (Damarkshon) 6 అంగుళములు .
జంతుసంపద : గ్రీన్‌లాండునందలి సన్తనజాతి జంతువులు (mamalia) ప్రకృతిలక్షణ విషయమున ఐరోపా సన్తనజాతి జంతువులకంటె ఎక్కువగా అమెరికా సన్తన జాతి జంతువులను పోలియున్నవి. కస్తూరివృషభము (nuskox); లెమింగ్ పోలార్‌తోడేలు; ఎస్కిమోకుక్క, రెయిన్‌డీర్ అను జంతువులన్నియు అమెరికానుండి వలస వచ్చినవే. జలచరములగు సీల్స్, తిమింగలములు, చేపలు కూడా అమెరికా జలచరజాతికి చెందినవే. రెయిన్‌డీర్లు, తెల్లకుందేళ్ళు, ఆర్కిటిక్ గుంటనక్కలు. పోలార్ ఎలుగుబంట్లు అన్ని ప్రాంతములయందును కనిపించును. తోడేళ్లు, కస్తూరి వృషభములు అడపదడప ఉత్తరగ్రీన్‌లాండ్ ప్రాంతమందు కనిపించును. ఆదియందు రెయిన్‌డీర్లు అసంఖ్యాకములుగా నుండెడివి. కాని వేట కారణముగా వాటి సంఖ్య క్రమముగా క్షీణించినది. మంచుతోలేని విశాలప్రదేశములయందు ఈ రెయిన్‌డీర్లు విశేషముగా గోచరించును. 'మే' అగ్రము (cape may) నుండి 'స్కోర్సుబీసౌండ్' వరకును - ఈ మధ్యప్రాంతమున కస్తూరి వృషభజాతి జంతువులు చిన్నచిన్న మందలుగా తిరుగుచుండును. పోలార్ ఎలుగు బంట్లు గ్రీన్‌లాండ్ సముద్రతీరము నందు ఎల్లెడల లభ్యమగును.
'సీల్' అను జలచర జంతువులలో అనేక రకములు గలవు. ఉదా : హుడెడ్‌సీల్ (తల, భుజము కప్పివేయ బడినట్టిది); గ్రీన్‌లాండ్‌సీల్; రింగ్డ్ సీల్ (ringed seal); హార్బర్ సీల్; గడ్డపు సీల్ (bearded seal); వాల్రస్, సముద్ర జలచరములలో పెక్కు రకములు కానరావు. కాని ఏకైకజంతువుయొక్క సంఖ్య అధికముగా నున్నది.
తిమింగలములలో అనేక జాతులు కలవు. వేటమూలమున ఇవి చాలవరకు సంఖ్యలో తగ్గిపోయినవి. గ్రీన్‌లాండు తిమింగలము లేక 'బౌహెడ్' అను తిమింగలము ఉత్తరసముద్ర జలములకు చెందిన 'రైట్' అను తిమింగల జాతికి చెందినది. ఇది దక్షిణతీర జలములలో గల 'రైట్ ' అను తిమింగలముల జాతికంటె స్పష్టముగా భిన్నమైనది. దీని పొడవు 70 అడుగులు. ఇది నల్లగా నుండును. దీనికి అడుగునమాత్రము తెల్లని మచ్చ ఒకటి యుండును. ఈ తిమింగలమువలన 275 పీపాల నూనెయు, 3,000 పౌనుల ఎముకలును లభింపవచ్చును. ఈ తిమింగలములు నిరంతరము జరుగు వేటకారణముగా పూర్వముకన్న అపురూపమైనవి.
కాడ్ (cod), కాప్లిన్ (coplin), రెడ్ ఫిష్ (red fish), నెపిసాక్ (nepisak) అను చేపల పరిశ్రమలు కలవు. షార్క్ (shark) అను చేపయొక్క కారిజము (liver) నుండి చమురు తీయబడును. తెల్లని నక్కల నుండియు, నీలివన్నె నక్కలనుండియు, పోలార్ ఎలుగుబంట్ల నుండియు విలువైన ఉన్ని లభ్యమగుచున్నది. ఉత్తరప్రాంతనుం దున్న 'ఆర్‌పిక్' (orpik) వరకును, స్కోర్స్ బీసౌండ్ వద్దను, కొన్నిచోట్ల పొదలును, కొన్నిచోట్ల చిన్నచిన్నవృక్షములును కన్పించును. 'జూలియెన్‌హాబ్ (Julianhab) మండలములో కొండరావిచెట్లు (birches) 20 అడుగుల ఎత్తువరకు పెరుగును విల్లో, ఆల్డర్, మౌంటెన్ ఆష్ అను వృక్షజాతులు విరివిగా పెరుగును. డిస్కోద్వీపమునందు కొండరావివంటి మరుగుజ్జు చెట్లు సాధారణముగా కనిపించును. అవి 3 అడుగుల ఎత్తుండును. రకరకములైన నాచులు, రుచికరము లైన మొక్కలు, పెరుగుదలకు అనువయిన స్థలముల యందు కాననగును. గ్రీన్ లాండులో నైరృతి దిక్కున పశువులకు మంచి గడ్డి లభించగలదు.
వ్యవసాయము, పరిశ్రమలు: గ్రీన్‌లాండులో వేసవికాలపు పరిమితి స్వల్పమగుటచేతను, శీతోష్ణస్థితి (climate) అత్యంత శీతలమగుటచేతను, క్యారటు, లెట్యూస్, టర్నివ్స్‌వంటి కూరగాయలు తప్ప ఇతర వ్యవసాయపు పంటలు పండించుట కష్టము. నైరృతిదిశలోనున్న ఇరుకుమూతి సముద్రశాఖల పరిసరములయందున్న పచ్చిక బయళ్ల యందు పశువులను, గొఱ్ఱెలను జయప్రదముగా సాకవచ్చును. జంతువుల చర్మములను పదును చేయుటయు, సముద్రపు జంతువులనుండి నూనె తీయుటయు ఈ దేశమునందలి ముఖ్యములైన పరిశ్రమలు.
ఇవిగ్‌టట్ వద్ద వర్తకమునకు ఉపయోగించు 'క్రియొ లైట్' (cryolite) అను ఖనిజపదార్థము లభించు గని యొక్కటి కలదు. తక్కువరకమునకుచెందిన బొగ్గు అనేక స్థలములలో లభింపగలదు. కాని పిట్ అను పదార్థము బొగ్గు కన్న ఎక్కువ మితవ్యయమునకు తోడ్పడుటవలన, బొగ్గు చాలా తక్కువగా వాడబడును.
వర్తకము, వాణిజ్యము : దిగుమతులన్నియు గ్రీన్‌లాండ్ ప్రభుత్వము యొక్క అదుపులోనుండును. ఈ దిగుమతులు 'అవసర పదార్థములు', 'భోగపదార్థములు' అని రెండు తరగతులుగా విభజింపబడినవి. అవసరవస్తువులను స్వదేశీయులకు సాధ్యమైనంత తక్కువధరలకు - ఒక్కొక్కప్పుడు నష్టమునకు లోబడికూడా - అమ్ముదురు. కాఫీ, పంచదార, పొగాకువంటి భోగపదార్థముల ఖరీదు ఎక్కువగా నుండును.
గ్రీన్‌లాండునుండి ఎగుమతి చేయబడు వస్తువులలో,– ఉప్పులో ఊరవేసిన చేపలు, డబ్బాలలో నిలువ చేసిన చేపలు, మంచులో పెట్టబడిన చేపలు, ఎండుచేపలు ; 'షార్క్ ' చేపలయొక్కయు, తదితరములైన చేపల యొక్కయు కారిజమునుండి తీయబడిన నూనెలు; క్రియొలైట్ అను ఖనిజములు; నల్లసీసపురాయి ; గొఱ్ఱెల మాంసము, చర్మములు, ఉన్ని, పోలార్ ఎలుగుబంట్ల చర్మములు, నీలపురంగు, తెలుపురంగు గల నక్కల చర్మములు, వాల్‌రస్ చర్మములు, తెల్ల తిమింగలముల చర్మములు, షార్క్ మొదలగు జలచరములు చర్మములు, సముద్రపు బాతుల రగ్గులు, సముద్రపు బాతుల ఈకలు, పక్షుల ఈకలు, వాల్ రస్ దంతములు పేర్కొన దగినవి. డిస్కో, నుగ్ స్సాక్‌ల చుట్టుపట్టులలో బొగ్గు సేకరింపబడియుండును. కాని రవాణా సౌకర్యములు తక్కువ యగుటవలన ఈ బొగ్గు ఎగుమతి అగుటలేదు.
జనాభా : 1950వ సంవత్సరపు జనాభా లెక్కలనుబట్టి గ్రీన్‌లాండ్ జనాభా షుమారు 23,000 వీరిలో వేయి మంది ఐరోపియనులున్నారు. (ఎక్కువమంది డెన్మార్క్ వారు) పశ్చిమ సముద్రతీరమున జనాభా కేంద్రీకరించి యున్నది. అచ్చటి ఆదిమవాసులను నేడు ఎస్కిమోలనుట కంటె గ్రీసులాండు దేశీయు లనుటయే ఉచితము. కారణ మేమన, పరంపరాగతులైన ఎస్కిమోలకంటె గ్రీన్‌లాండు దేశీయులు మిక్కిలి అధికతరమైన సంస్కృతి కలవారై యున్నారు. 'ధూల్'కు పరిసర ప్రాంతముల యందు నివసించుచున్న కొలదివందల ఎస్కిమోలుతప్ప ఎక్కువమంది జనులు పురాతనపు 'నార్సీ' వలసప్రజల సంతతికి చెందుటవలనను, ఐరోపియనులతో ముఖ్యముగా డేనులతో గడచిన కొన్ని తరములనుండి అంతర్వివాహ సంబంధములు కలిగియుండుట వలనను, ఐరోపియను రక్తస్పర్శయే వారిలో కలదని చెప్పవలసి యున్నది. 'స్కోర్స్ బీసౌండ్' అను వలసప్రాంతము ఇటీవల అనగా 1925 సం: లో నూతనముగా ఏర్పడ్డది.
చరిత్ర ; నూతన స్థలాన్వేషణ : పదవ శతాబ్దారంభము నందు 'గున్‌లిజార్న్' (gunalijorn) అను ఒక నార్వే దేశీయుడు ఐస్‌లాండునకు పశ్చిమదిశగా కొన్ని ద్వీపములను కనుగొనెనని చెప్పుదురు. బహుళముగా అతడు గ్రీన్‌లాండుయొక్క ఆగ్నేయ సముద్రతీర ప్రాంతమును చూచియుండవచ్చును. 982 వ సంవత్సరములో 'ఎరిక్ ది రెడ్ ' (Eric the Red) అను మరియొక నార్వే జాతీయుడు ఐస్‌లాండునుండి బయలుదేరి 'గున్‌లిజార్న్' చూచిన భూభాగమును కనుగొనుటకై మూడు సంవత్సరముల కాలము అన్వేషణ కావించెను. ఆతడు 985 వ సంవత్సరములో ఐస్‌లాండ్‌కు తిరిగివచ్చెను. ప్రజలకు ఆ దేశమునకు పోవుటకు ఎక్కువగా ఇష్టమును కలిగించుటకై దానికి గ్రీన్‌లాండు అని నామకరణ మొనర్చెను. మరల ఆతడు 986 వ సంవత్సరములో 25 ఓడలను వెంట నిడుకొని గ్రీన్‌లాండునకు బయలుదేరెను. వాటిలో 14 ఓడలు మాత్రము గ్రీన్‌లాండ్ చేరుకొనెను. ఆతడు నైరృతి సముద్ర తీరమునందు ఒక వలసను స్థాపించెను.
ఆధునిక యుగమున ప్రప్రథమముగా గ్రీన్‌లాండ్‌ను గూర్చి 1721 మేనెల 12 వ తేదీన అన్వేషణ ప్రారంభమైనది. హాన్స్ ఈగేడ్ అనునతడు తన భార్యతో, బిడ్డలతో డెన్మార్క్‌నుండి బయలుదేరి గ్రీన్‌లాండ్ పశ్చిమతీరమున నున్న గాడ్ తాబ్ అను ప్రదేశమునకు చేరుకొనెను. ఆతడక్కడ 1736 వ. సంవత్సరము వరకు నివసించి, ఆ ద్వీపమును గూర్చి విశేషాంశములను సేకరించెను. ఇతడే గ్రీన్‌లాండునందు ఆధునిక మైన వలసను (colonization) ప్రవేశపెట్టెను. పశ్చిమతీరమునందు ఆ శతాబ్దాంతమున పది వలసలు ఏర్పడినవి. 19 వ శతాబ్దములో రాస్ అనునతడు 1818 వ సంవత్సరము నాటి 'బఫిన్' అఖాతపు భాగములనుగూర్చి తెలిసికొనెను. 'స్మిత్‌సౌండ్' సమీపమున 600 మైళ్ళ పొడవు గల తీరప్రాంతమునకు ఇంగిల్ ఫీల్డ్ అనునతడు సర్వేపటమును తయారుచేసెను. 'కౌన్' అను వ్యక్తి తన సర్వే పథకమును హంబోల్ట్ మంచుకొండ వరకును విస్తృతపరచెను. హాల్ అనునతడు అక్షాంశరేఖయొక్క 82°07′N డిగ్రీ వద్దకు 1871 లో చేరుకొనెను. 1876 వ సంవత్సరములో 'నారెస్స్' అన్వేషణ సంఘమువారు జరిపిన పరిశోధన ఫలితముగా 'రిపల్స్ హార్బర్ ' కు వెనుకగా నున్న తీరప్రాంతము కనుగొనబడెను. తూర్పుతీరమునందు 'స్కోర్స్‌బీ' అనునతడు 64° - 75° ఉత్తర అక్షాంశరేఖల మధ్య గల భూభాగమును 1822 వ సంవత్సరములో పటముగా చిత్రించెను. 1853 మొదలు 15 సంవత్సరముల కాలము డాక్టర్ హెచ్. రెంట్ అనునతడు దక్షిణ గ్రీన్‌లాండ్ ప్రాంతము నందు జరిపిన సుదీర్ఘమైన సంచారము ఫలితముగా ఒక మార్పు వచ్చెను. 1883 వ సంవత్సరములో నార్డెన్ స్కియోల్డ్ అనునతడు 'ఆలాట్ సిర్క్' అను ఇరుకు మూతి సముద్రశాఖనుండి దేశాంతర్భాగములో 75 మైళ్ళ దూరమువరకు చేరగలిగెను. 1886 వ సంవత్సరములో పియరీ అనునతడు పశ్చిమతీరమునుండి లోతట్టు 120 మైళ్ల దూరమునకు 69°30′N అక్షాంశరేఖ వరకు చొచ్చుకుని పోగల్గెను. ఆరు సంవత్సరముల తరువాత అతడు మరియొకసారి ప్రయాణ మొనర్చి 'ఇంగిల్ ఫీల్డ్' సింధుశాఖను పరిశోధించి దానిని ఈశాన్యదిశగా దాటి 'ఇండిపెండెన్స్ ఫియోర్డ్' కు చేరెను. ఆతని తర్వాత 1905 వ సంవత్సరములో డ్యూక్ ఆఫ్ ఆర్లియన్స్, 1912-13 లో జె. పి. కోచ్ అనువారు పరిశోధనలు జరిపిరి. 1926 వ సంవత్సరములో కేంబ్రిడ్జ్ పరిశోధన సంఘమువారు తూర్పు గ్రీన్‌లాండునకు ప్రయాణము చేసి, కొన్ని పరిశోధనలు జరిపిరి. ఇవిచాల ముఖ్యమైనవి. 1930వ సంవత్సరములో ప్రొఫెసర్ వెగ్నర్ నాయకత్వమున అంతరిక్ష పరిశోధనలకొరకు జరుపబడిన సంచార కార్యక్రమము పేర్కొనదగినది. మౌంట్ ఫోరెల్, స్కోర్స్ బీసౌండ్ లకు మధ్యగల పర్వతమయప్రాంతమును పూర్తిగా పరిశోధించుటకు లెప్టినెంట్ యం. లిండ్సే అనునతడు 1934 వ సంవత్సరములో మరల గ్రీన్‌లాండునకు వచ్చెను. పశ్చిమ దిశనుండి ఈ ప్రాంతమును చేరుటకు మిక్కిలి అనుకూలముగా నుండెను. తన పరిశోధన పరివారముతో ఇతడు జాకబ్‌షాన్ నుండి దుర్గమమైన మంచు ప్రాంతమును సునాయాసముగా దాటగల్గెను.
ఇటీవలి సిద్దాంతములు: కొలంబియా విశ్వవిద్యాలయమునకు చెందిన లేమాంట్ భూగర్భ పరిశోధనశాలకు అధిపతియైన డాక్టర్ మారిస్ యూరింగ్ చేసిన పరిశోధన వలన ఆర్కిటిక్ మంచు క్రమముగా కుంచించుకుని పోవుచున్నట్లు తేలుచున్నది. 15 సంవత్సరముల క్రిందట వ్యాపించిన ప్రాంతముకంటె, ఈనాడు నూటికి 12 వంతులు తక్కువప్రాంతమును ఇది ఆవరించియున్నది. ఇది మందమునందుకూడా ఆనాటికంటె ఈనాడు నూటికి 40 వంతులవరకు తగ్గినది. ఒకసారి ఈ మంచు విచ్ఛిన్న మగుట ప్రారంభించినయెడల, మనము ఊహించినదాని కన్న తక్కువ సమయములో ఎక్కువ వేగముగా అది కరగిపోవుట సంభవించును. కొందరు నిపుణులు తయారు చేసిన లెక్కలనుబట్టి, ప్రపంచములో భూఖండగతమైన మంచంతయు కరగినచో, ముఖ్యముగా అంటార్కిటికా, గ్రీన్‌లాండ్ దేశములలో 2 మైళ్లు మందముగల మంచు పొరలు సహితము కరగినయెడల, సముద్రజలముల పరిమాణము 100 మొదలు 200 అడుగుల ఎత్తువరకు పై కుబికి, న్యూయార్క్ నే ముంచివేయునంత నీరు ఏర్పడగలదు.
డాక్టర్ మారిస్ యూరింగ్, డాక్టర్ విలియం యల్ . డాన్ అను ప్రఖ్యాత అమెరికా భూభౌతిక శాస్త్రవేత్తలు ఇటీవల “హిమయుగముల"ను (Ice Ages) గూర్చి సంభావ్యమైన ఒక నూతనసిద్ధాంతమును ప్రచురించిరి. ఆర్కిటిక్ తీరమునందు స్థానికమైన భౌగోళిక పరివర్తనము జరుగుచున్నదని వీరు ప్రకటించిరి. గణితశాస్త్ర సంబంధమగు లెక్కలతోడను,భూగర్భశాస్త్ర సంబంధమగు సిద్ధాంతముల యొక్క ఆధారములతోడను వీరు తమ సిద్ధాంతమును బలపరచుకొనిరి. భూపరివేష్టితమైన (Land - locked) ఆర్కిటిక్ సముద్రమునకును, ఉత్తర అట్లాంటిక్ సముద్రమునుండి వచ్చెడి ఉష్ణపవనములకును నడుమ లోతులేని మార్గము లుండుటవలన ఈ భౌగోళిక పరివర్తనము జరుగుచున్నదని ఈ శాస్త్రజ్ఞులు అభిప్రాయపడిరి. అది యునుకాక, ఒకప్రక్క గ్రీన్‌లాండునకును కెనడాకును మధ్యనున్న ద్వీపములును, మరొకప్రక్క నార్వేదేశమును ఈ క్లిష్టసంఘటనమునకు దోహదమొసగినవనిగూడా వీరు ప్రకటించిరి. మరికొందరు శాస్త్రవేత్తల సిద్ధాంతము ప్రకారము పై నుదహరించిన మార్గములు, ప్రపంచపు వాతావరణము మానవజీవితమునకు అనువుగా నుండు నట్లుగా ఉపకరించుచున్నవని వీరు నుడివిరి. అనగా భూమి అత్యుష్ణముగా నున్నప్పుడు దానిని చల్లబరుచుటకును, అతి శీతలముగా నున్నప్పుడు ఉష్ణము కలిగించుటకును ఈ మార్గములు ఉపయుక్త మగుచున్నవని అర్థము. ఈ పరిణామము వలననే మన శీతోష్ణ వాతావరణ స్థితుల యందు మార్పులు కలుగు చున్నవి.
ప్రభుత్వము, పరిపాలనా విధానము: 1917 వ సంవత్సరములో గ్రీన్‌లాండ్‌లోని అన్నిప్రాంతముల మీదను అమెరికా సంయుక్తరాష్ట్రముల ప్రభుత్వము తన హక్కులను విసర్జించెను. తత్ఫలితముగా ఆ దేశముపైని డేనిష్ ప్రభుత్వముయొక్క ఆధిపత్యము సంపూర్ణమయ్యెను. ఉత్తర, దక్షిణ 'ఇన్స్ పెక్టరేట్స్' అని పిలువబడు రెండు ప్రాంతముల పరిపాలనకై డెన్మార్క్ రాజుచేత స్వయముగా ఒక్కొక్క ప్రాంతమునకు ఒక్కొక్క రాయల్ ఇన్‌స్పెక్టరు నియమితుడై నాడు,
డెన్మార్క్ అంతరంగిక శాఖామంత్రిచేత అమలు జరుపబడిన చట్ట నిబంధనలను బట్టి ఎస్కిమో జాతీయులు, స్థానిక మునిసిపల్ సంస్థల రూపములో స్థానిక స్వపరిపాలనమును అనుభవించుచుండిరి. 120 మంది స్వదేశీయులకు ఒక్కొకరు చొప్పున మతగురువు మునిసిపల్ సంఘ సమావేశములలో ప్రాతినిధ్యము వహించును. నైపుణ్యము గల వేటకాండ్రనుండి (providers) ఎస్కిమో సభ్యులు ఎన్నుకొన బడుదురు. వారు స్వల్పనేరములను విచారించి తమ తీర్పుల నిచ్చుచు, బాధితులకు, వయోవృద్ధులకు 'గ్రీన్‌లాండ్ ఫండు' (Greenland fund) నుండి ధనసాహాయ్యమిచ్చుచు తమ బాధ్యతను నెరవేర్తురు. డిస్కా ద్వీపముపైనున్న 'గాడ్ హావెన్' అను నగరము ఉత్తర గ్రీన్‌లాండు 'ఇన్‌స్పెక్టరేట్'నకు రాజధానియై యున్నది. దక్షిణ 'ఇన్స్‌స్పెక్టరేట్'నకు గాడ్‌తాబ్ యనునది రాజధానియై యున్నది.
గ్రీన్‌లాండ్ దేశీయులు ప్రప్రథమముగా 1861 వ సంవత్సరములో తమ వార్తాపత్రికను ప్రచురించుకొనిరి. అనేకములగు డేనిష్ గ్రంథములు ఇప్పుడు గ్రీన్‌లాండ్ భాషలోనికి అనువదింపబడి యున్నవి. ప్రస్తుతము పెక్కురు గ్రీన్‌లాండ్ దేశీయులు డేనిష్ భాషను చదువగలరు; వ్రాయగలరు. డెన్మార్క్ విశ్వవిద్యాలయములలో అనేకులు పట్టభద్రులు గూడ నయిరి.
గ్రీన్‌లాండ్ దేశము కేవలము ఒక్క గ్రీన్‌లాండ్ దేశీయులకొరకే ఉద్దేశింపబడలేదనియు, గ్రీన్‌లాండ్ వలస ప్రాంతమును అభివృద్ధిపరచుటకై డెన్మార్క్ దేశీయులు గూడ అచట నివాసమును ఏర్పరచుకొనుట అవసర మనియు డేనిష్ ప్రధానమంత్రి 1946 వ సంవత్సరములో ప్రకటించెను. ఈ సందర్భమున గ్రీన్‌లాండు అభివృద్ధి కొరకు ఒక ఆర్థిక విధానమును ఆతడు రూపొందించెను. ఈ విధానములోని ప్రధానాంశములు క్రింద పేర్కొన బడినవి.
(1) ప్రభుత్వమే వ్యాపారమును కొనసాగించు 'గుత్త' విధానమును ( monopoly system) విసర్జించుట. (2) గ్రీన్‌లాండు సముద్రతీరమునందు డెన్మార్క్ ప్రజలు చేపలు పట్టుకొనుటకు అనుమతి నిచ్చుట. (3) ఖనిజసంపదను, జలవిద్యుచ్ఛ క్తిని, వ్యవసాయమును అభివృద్ధి జరుపుటకు శాస్త్రపరిశోధనలు జరుపుట. (4) డేనిష్ భాషను విరివిగా బోధించి, వ్యాపింపజేయుట; గ్రంథాలయములను అభివృద్ధిచేసి, సాంస్కృతిక కార్యసంచలనమును విస్తృతపరచుట. (5) ఆరోగ్య విద్యావిషయక కార్యక్రమములను పెంపొందింప జేయుట. (6) డేనిష్ పార్లమెంటులో గ్రీన్‌లాండ్ నకు ప్రాతినిధ్యమును కల్పించుట.
1953 జూన్ మాసములో గ్రీన్‌లాండ్‌దేశము డెన్మార్క్ రాజ్యములో అంతర్భాగముగ చేయబడెను. డేనిష్ పార్లమెంటులో ఇద్దరు గ్రీన్‌లాండు సభ్యులకు ప్రాతినిధ్యము ఇయ్యబడెను.
ధ. ప్ర.
గ్రీసుదేశము (చరిత్రము) :
ప్రాచీనయుగ చరిత్ర : గ్రీసు చరిత్ర నవశిలాయుగమున (క్రీ. పూ. 4000) ప్రారంభమగుచున్నది. ఈ కాలమునాటి నాగరికత 'మైసీన్ ' నాగరికత యని పేరుగాంచినది. దీని