సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/గుణాఢ్యుడు

గుణాఢ్యుడు :

గుణాఢ్యుడు అత్యంత ప్రాచీన కాలములో ప్రకాశించిన ప్రతిభాశాలి; పండిత గ్రామణి; కవివతంసుడు; కథావాఙ్మయ నిర్మాత; ఆంధ్రుడు. గుణాఢ్యుని దేశ కాలాదులనుగూర్చి పరిశోధకుల దృష్టిలో అభిప్రాయ భేదములు గన్పట్టుచున్నవి. కాశ్మీర మందును, నేపాలు నందును ఇతనినిగూర్చిన కథలు కొన్ని వ్యాపించియున్నవి. కాశ్మీరమందలి కథలకు జయద్రథ (క్రీ. శ. 1140) రచితమైన 'హరచరిత చింతామణి' యను శైవగ్రంథమును, సోమదేవ (1029 - 1064) రచితమగు 'కథా సరిత్సాగరము'ను ప్రసిద్ధ మూలములు.

ఒకప్పుడు శివుడు పార్వతికి కొన్ని యపూర్వ విచిత్ర కథలను చెప్పుచుండగా, వారి భక్తుడగు పుష్పదంతుడను సేవకుడు కీటకరూపధారియై ఆ కథలను రహస్యముగా విని ఇంటికేగి తన ప్రేయసియగు జయ అను నామెకు వాటిని వినిపించెను. పార్వతి యొకప్పుడు తన చెలికత్తెల కీకథలను క్రొత్తగాచెప్పదొడగెను. కాని జయకు అవి శ్రుత పూర్వములేయగుటను గ్రహించి, పార్వతి పుష్పదంతు డొనర్చిన అపచారమునకు గినిసి, అతడు మర్త్యుడై పుట్టునట్లు శపించెను. ఈ సందర్భముననే అతని మిత్రుడగు మాల్యవంతునిగూడ అట్లేశపించెను. అంత జయ, పార్వతి, పాదములపై బడి వారి శాపవిముక్తిని వేడుకొనెను. అంత పార్వతి “కుబేర శాపహతుడగు సుప్రతీకు డనువాడు (యక్షుడు) కాణభూతి యనుపేర వింధ్యాటవిలో చరించు చుండును వానికి నీ ప్రియుడు ఈ కథలను చెప్పుచో శాపవిముక్తుడగును. కాణభూతి మరల మాల్యవంతునికి ఈ కథలను వినిపించుచో వా రుభయులుగూడ శాప విముక్తి నొందగలరు" అని అనుగ్రహించెను. పుష్పదంతుడు ఈ శాపమువలన భూలోకములో జనించి, వరరుచి యనుపేర నందరాజునకు మంత్రి అయ్యెను. తరువాత కాణభూతికి ఆ కథలు వినిపించి వరరుచి శాపవిముక్తు డయ్యెను.

ఇంక మాల్యవంతుని వృత్తాంతము; ఈశ్వరుని నిరంతరము మాలావిభూషితునిజేసి యా దేవుని యనుగ్రహమున మాల్యవంతుడను సార్థకనాముడై రుద్రగణములో నొకడుగా పుష్పదంతునివలె ఈశ్వరుని సన్నిహిత భృత్యవర్గములో ఉండెను. కథాశ్రవణ సందర్భమున పుష్పదంతుని సమర్థించుటకు కడంగి మాల్యవంతుడుకూడ పార్వతీశాపమునకు గురియయ్యెను. మాల్యవంతుడు భూలోకములో జన్మించి గుణాఢ్యుడుగా ప్రసిద్ధిచెందెను. గుణాఢ్యుని జన్మకథ క్రిందివిధముగా నున్నది:

ప్రతిష్ఠానమను నగరమందు సోమశర్మ యను విప్రుడు కలడు. అతనికి వత్సుడు, గుల్మకుడు అను ఇరువురు పుత్రులు, శ్రుతార్థయను కన్యయు గలరు. కాలవశమున ఆ బ్రాహ్మణుడును, అతని భార్యయు కాలధర్మమునొందగా ఆ సోదరులిరువురు తమ సోదరిని కాపాడుచు కాలము గడుపుచుండిరి. కొంతకాలమునకు శ్రుతార్థ గర్భవతి యయ్యెను అన్నదమ్ములీ విపరీతమును జూచి ఒకరినొకరు అనుమానింపదొడగిరి. శ్రుతార్థ వీరి వైఖరిని కనిపెట్టి, “నాగాధిపతియగు వాసుకియొక్క సోదరుని పుత్రుడగు కీర్తి సేనుడనురాజు కలడు. నేనొకప్పుడు గోదావరికి స్నానార్థ మేగుచుండగా అతడు కామోపహతుడై నన్ను గాంధర్వమున వివాహమాడెను. కనుక మీరు కలహింప బనిలేదు" అని చెప్పెను. కాని వారీమాటలను విశ్వసించ లేకపోవుటచే ఆమె ఆ నాగరాజును స్మరించెను. అంత ఆ నాగరాజు ఆ సోదరుల నిద్దరినిగూర్చి “నేనీమెను వివాహమాడినది సత్యమే. మీరు ముగ్గురును దేవతలే ; ఈమె అప్సరస. శాపోపహతులై యిట్లు మీరు జన్మించితిరి. ఈమెకు కుమారు డుద్భవింపగలడు. అంత మీకు శాప విముక్తి యగు" నని చెప్పి యంతర్థానమయ్యెను. కొంత కాలమునకు శ్రుతార్థ ఒక పుత్రుని గనెను. అపుడు ఆకాశవాణి "రుద్రగణములోని ఒకడిట్లు జన్మించెను. ఇతడు గుణాఢ్యుడని ప్రసిద్ధినొందును" అని పలికెను. త్వరలోనే తల్లియు, మేనమామ లిద్దరును మరణింపగా, ఆ బాలుడు ధైర్యమును వీడక దక్షిణమున కేగి గురుకులములందు సకలవిద్యల నభ్యసించి స్వదేశమునకు వచ్చెను. తరువాత ప్రతిష్ఠాన పురాధీశ్వరుడగు శాతవాహనుని మంత్రియగు శర్వవర్మ సహాయమున గుణాఢ్యునికికూడ ఆ రాజాశ్రయము లభించెను. ఆ యాస్థానమం దతనిని బహు శాస్త్రజ్ఞునిగను, మంత్రిగను గౌరవించుచుండిరి. శాతవాహనునకు మొదట సంస్కృతజ్ఞానము లేకుండెను. అతని పట్టమహిషియగు మలయవతి సంస్కృత పాండిత్యము గలిగి రసజ్ఞురాలై యుండెను. ఒక నాడా రేడు మలయవతితో జలక్రీడలాడుచుండగా, క్రీడావశమున సంభవించు జలతాడనమును ఆమె సహింపజాలక రాజుతో “మోదకైస్తాడయ” (మా, ఉదకైః, తాడయ = నీటితో కొట్ట వలదు) అనెను. సంస్కృతజ్ఞానములేని ఆరాజు మోదకైః తాడయ ( మోదకములతో కొట్టుము) అని అర్థముచేసికొని మోదకములు (లడ్లు) తెమ్మని పరిచారికల నాజ్ఞాపించెను. అంత మలయవతి సమధిక పాండిత్య గర్వము చేత, “రాజా! నీళ్ళలో మోదకముల (లడ్ల) కేమి సంబంధము? ఇంతమాత్రము వ్యాకరణ జ్ఞానము మీకు లేదా?" యని పకపకనవ్వెను. శాతవాహనుడు తన అజ్ఞానమునకు చాల సిగ్గుపడి సభాముఖమును చూడక, పాండిత్యములేని జీవితము రాజ్యమున్నను నిరర్థకమని పరితపించు చుండెను. పరిచారికలవలన ఈ యుదంతమును కనిపెట్టి శర్వవర్మ, గుణాఢ్యుడు రాజసన్నిధి కేగి పరితాప కారణమును అడిగిరి. అంత రాజు తనకు సంస్కృత వ్యాకరణమును త్వరలో నేర్పవలె నని గుణాఢ్యుని కోరెను. ఇతరులకు పండ్రెండు సంవత్సరములలో గాని సాధ్యపడని వ్యాకరణ శాస్త్రమును రాజునకు ఆరు సంవత్సరములలోనే నేర్పగలనని యతడు ప్రత్యుత్తర మొసగెను. అంత శర్వవర్మ, మహారాజు అంత దీర్ఘకాలము శాస్త్ర మభ్యసింప జాలడనియు, తాను ఆరు మాసములలోనే వ్యాకరణమం దాతనికి పరిపూర్ణ జ్ఞాన మేర్పడునట్లు చేయగలననియు చెప్పెను. అట్లొనర్చుట అసాధ్యమనియు, శర్వవర్మ అట్లు చేయగలిగినచో తాను సంస్కృత, ప్రాకృత, దేశభాషలను మూడింటిని సర్వాత్మనా విడిచిపుచ్చి, ఎన్నడు వాటిని ఉచ్చరింపనని ప్రతిన బూనెను. గోదావరీ ప్రాంతమునం దపుడు ఎట్టి దేశభాష యుండి యుండెనో ! శర్వవర్మ తాను ఆరు మాసములలో అట్లు చేయజాలనిచో గుణాఢ్యుని పాదుకలను పండ్రెండేండ్లు శిరస్సుపై వహించెదనని చెప్పి వెడలిపోయెను. ఇట్లు పట్టుదలబూని శర్వవర్మ కార్తికేయుని ఉపాసించి, ఆ దేవుని యనుగ్రహమున 'కాతంత్ర వ్యాకరణము ' లేక 'కాలాప వ్యాకరణము'ను బడసి రాజునకు ఆరు నెలలలో సంస్కృత వ్యాకరణమందు పరిపూర్ణ జ్ఞానము కలుగునట్లు చేసెను. అంత గుణాఢ్యుడు 'ప్రతిజ్ఞా సమయము ననుసరించి, భాషాత్రయముతోపాటు ప్రతిష్ఠానపురమును గూడ విడచి, వింధ్యాటవికిపోయి మౌనముతో తిరుగాడు చుండెను. అచట అతనికి పిశాచజాతితో స్నేహ మేర్పడి ఆ భాషయందు పరిజ్ఞానము కలుగుటచే నతడు మౌనము విడిచి ఆనాలవ భాషయందు మాటాడుటకు, లిఖించుటకు పూనెను.

అప్పటికే వరరుచివలన కాణభూతి ఈశ్వర ప్రోక్తములగు కథల నన్నింటిని విని తాను తిరిగి చెప్పుటకై యెవరు దొరుకునా యని నిరీక్షించుచుండెను. గుణాఢ్యుడు కనిపించినందులకు కాణభూతి సంతసించి, తాను వరరుచివల్ల వినిన కథల నన్నిటిని అతనిని తన పిశాచ భాషయందు వినిపించెను. గుణాఢ్యుడు వాటిని సాకల్యముగా విని, భూర్జపత్రములపై తన రక్తముతో పిశాచ భాషలో ఏడు లక్షల గ్రంథముగా లిఖించెనట. దానికి 'బృహత్కథ' యను పేరిడి శాతవాహనునికి వినిపించ వలసినదిగా తన శిష్యుల కిచ్చి పంపెను. ఆ రాజు ఈ గ్రంథమును సాదరముతో స్వీకరించు నని గుణాఢ్యు డాశపడెను. కాని రక్తముతో పిశాచభాషలో వ్రాయబడి, ఏడు లక్షల పరిమితిగల ఈ బృహత్కథను శాతవాహనుడు ఈసడింపుతో తిరస్కరించెను. అంత గుణాఢ్యుడు విరక్తుడై, ఒక్కొక్క పత్రమును చదివి పశుపక్ష్యాదులకు వినిపించుచు అగ్నిలో వేయదొడగెను. ఇంతలో రాజునకు అనారోగ్యము వలన బలహీనత ఏర్పడగా, వైద్యులు పరీక్షించి, అతడు భుజించుమాంసాహారము నీరసమై యుండుటయే దీనికి కారణమనితెలిపిరి. ఆ మాంసమును తెచ్చు వేటగాండ్రను విచారింపగా, వారు అడవిలోని పశుపక్ష్యాదు లన్నియు ఆహారమును గూడ మాని, గుణాఢ్యునికథలను వినుచున్నవి గనుక, వాటి మాంసము కడు నీరసించి యుండవచ్చునని చెప్పిరి. అంత తాను తిరస్కరించిన గుణాఢ్యుని కథయొక్క మహి మను గుర్తించినవాడై, స్వయముగా తానే ఆతని ఆశ్రమము కడకు జని, తనను మన్నించి ఆ గ్రంథమును కాల్చ వలదని వేడుకొనెను. కాని అప్పటికే ఆరులక్షల గ్రంథము దహింపబడెను. మిగిలిన ఒక లక్షగ్రంథము మాత్రమే శాతవాహనునికి దక్కెను. దాని నతడు గుణాఢ్యుని శిష్యుల సహాయమున తిరుగవ్రాసి భద్రపరచెనట ఇదియే మన మనుకొను బృహత్కథాశేషము. గుణాఢ్యు డనబడు మాల్యవంతుడు శాప విముక్తినొంది ఈశ్వర సన్నిధి కేగెను.

సోమదేవుని కథా సరిత్సాగరమందు గుణాఢ్యుని గూర్చిన కథ పై విధముగా నున్నది. జయద్రథుని హర చరిత చింతామణియందు కూడ ఇంచుమించుగా నిట్లే యున్నది. ఈ రెండును కాశ్మీర సంప్రదాయమునకు చెందినవి.

ఇంక, నేపాల మాహాత్మ్యము నందలి కథ ఇట్లుండును: ఈశ్వరుడు పార్వతికి ఈ కథలను చెప్పుచుండగా భృంగి యను ప్రమథుడు ఒక తుమ్మెద రూపముదాల్చి రహస్యముగా ఆ కథలను విని, తన భార్యయగు విజయకు చెప్పెను. శివుడు భృంగిని శపించెను. అంత భృంగి ఆశాపము యొక్క విముక్తిని వేడుకొనెను. 90,00,000 శ్లోకముల గ్రంథముగా ఆ కథను వ్రాయుచో శాపవిముక్తియగు నని శివు డాదేశించెను. మరియు ఆ గ్రంథము శృంగార కావ్యముగను, నాటకమున కనువగు కథాసన్నివేశములు కలదిగను, రససమన్వితముగను ఉండవలెనని నిర్దేశించెను. భృంగియే మధురలో గుణాఢ్యు డను పేర జన్మించి, ఉజ్జయినికిపోయి మదనుడను రాజుయొక్క ఆశ్రయము పొందెను. ఆ రాజుభార్య లీలావతి. శర్వవర్మయను పండితుడుగూడ ఇదివరకే యచట చేరియుండెను. శేషించిన కథ శాతవాహనుని కథయందువలెనే పూర్తియగును.

కేవల మీ కథలయొక్క ప్రచారమునే ఆధారముగా గైకొని గుణాఢ్యుడు కాశ్మీరము వాడనియు, నేపాలములోని హిమవత్ప్రాంతము వాడనియు, కథాసన్ని వేశములనుబట్టి వింధ్యపర్వత ప్రాంతము వాడనియు, ఉజ్జయిని వాడనియు అనేక అభిప్రాయములను విమర్శకులు వెలిబుచ్చుచుండిరి. గుణాఢ్యుని ఒక దైవాంశ సంభూతునిగా అభివర్ణించు ఈ కథలు చరిత్ర కెంతవరకు ఉపకరించునో నిర్ణయింపజాలము. ఇది యిట్లుండగా గాథాసప్తశతి యొక్క ప్రతులలో నొకదానియొక్క సప్తమ శతక సమాప్తియందు “ఇతి శ్రీమత్కుంతల జనపదేశ్వర ప్రతిష్ఠాన పత్తనాధీశ, శతకర్ణోపనామక, ద్వీపి (ప) కర్ణాత్మజ. మలయవతీ ప్రాణప్రియ, కాలాపప్రవర్తక శర్వవర్మధీసఖ, మలయవత్యుపదేశ పండితీభూత, త్యక్తభాషాత్రయ, స్వీకృతపైశాచిక, పండితరాజ గుణాఢ్య నిర్మిత, భస్మీభవద్బృహత్కథావశిష్ట, సప్తమాంశావలోకన ప్రాకృతాది వాక్పంచక ప్రీత, కవివత్సల హాలాద్యుపనామక. శ్రీసాతవాహనరేంద్ర నిర్మితా, వివిధాన్యోక్తిమయ ప్రాకృత గీర్గుంఫితా, శుచిరసప్రధానా, కావ్యోత్తమా, సప్తశత్యవసాన మగాత్" అను గద్యము కానవచ్చుటనుబట్టి బృహత్కథా ప్రణేతయగు గుణాఢ్యుడు ప్రతిష్ఠాన పురాధీశ్వరుడగు హాల శాతవాహన రాజాస్థానములో కాతంత్ర వ్యాకరణ నిర్మాతయగు శర్వవర్మతోబాటు ఉండియున్నట్లు స్పష్టముగా తెలియుచున్నది. కథా సరిత్సాగరములోని కథయు పూర్తిగా దీనినే సమర్థించుచున్నది. ప్రాచీనాంధ్ర రాజవంశమునకు చెందిన అరిష్ట శాతకర్ణి పుత్రుడు హాలుడను నామాంతరము గల సాతవాహనుడు క్రీ. పూ. 490 ప్రాంతమందలివాడని కొందరుచరిత్రకారుల అభిప్రాయమైయున్నది. కాని గుణాఢ్యునినాటి శాతవాహనుడు వేరనియు, అతడే శకకర్తయై శాలివాహనుడను పేర క్రీ.శ 78 నుండి రాజ్యమేలెననియు మరికొందరి మతము. ఇట్లు శాతవాహనుని కాలమునుబట్టి గాని, గుణాఢ్యునికాలము నిర్ణయింప వీలుగాకున్నది. శాతవాహన నామము వంశనామముగా, అనేక రాజులకు చెల్లియున్నట్లు నిదర్శనము లుండుటచేత, గుణాఢ్యుడు క్రీ. పూ. 400 నుండి క్రీ.శ. మొదటి శతాబ్దమువరకుగల కాలములో ఎప్పటివాడో నిర్ణయింప శక్యముగాకున్నది. అయినను క్రీ. పూ. 200-150 సంవత్సరముల ప్రాంతములో ఇతడు ఉండియుండునని పలువురు నిర్ణయించుచుండిరి. బృహత్కథయొక్క సంస్కృతానువాదములగు క్షేమేంద్రుని బృహత్కథామంజరిని బట్టియు, సోమదేవుని కథా సరిత్సాగరమును బట్టియు, గోదావరీతీరమందలి సుప్రతిష్ఠిత నగరమే ఈతని జన్మస్థానమని తెలియుచున్నది. (నేటి ఔరంగాబాదు జిల్లాలోని 'పైఠన్' ఇదియే). బృహత్కథా ప్రాశస్త్యమునుగూర్చి యొకింత తెలిసికొందము. ఈ గ్రంథము పైశాచీ ప్రాకృతమందు రచింపబడెను. అపూర్వ విచిత్ర కథా కావ్యసృష్టి కలదగుటచే పలువురు ప్రాచీన సంస్కృతకవులచే అనేకవిధములుగా శ్లాఘింపబడెను, భట్టబాణుడు,


“సముద్దీపిత కందర్పా కృతగౌరీ ప్రసాదనా
 హరవీలేవ నో కస్య, విస్మయాయ బృహత్కథా."

అని ఆ గాథాసంపుటిని పరమేశ్వరుని లీలాత్మకముగా వర్ణించెను. దండిమహాకవిచే "భూత భాషామయీం ప్రాహురద్భుతార్థం బృహత్కథాం" అని అద్భుత కథార్థములు కలదిగా కొనియాడబడెను. గోవర్ధనాచార్యుడు ఆర్యాసప్తశతియందు,


"అతిదీర్ఘ జీవి దోషాద్వ్యాసేన యశోపహారితమ్,
 కైర్నోచ్యేత గుణాఢ్యస్స ఏవ జన్మాన్తరాపన్నః"

అని గుణాఢ్యుని వ్యాసునియొక్క అవరమూర్తిగా కీర్తించెను. కాళిదాసు మేఘ సందేశములో ఉదయనుని క థాప్రసంగమున బృహత్కథా ప్రశస్తిని ఇట్లుస్మరించెను. "ప్రాప్యావన్తీ ముదయన కథాకోవిద గ్రామవృద్ధాన్.” సుబంధుడు వాసవదత్తలో “బృహత్కథాలమ్బైరివ సాలభంజికానివహైః" అని ప్రశంసించెను. త్రివిక్ర మభట్టు నల చంపువులో,


"శశ్వద్బాణ ద్వితీయేన నమదాకారధారిణా
 ధనుషేవగుణాఢ్యేన నిశ్శేషోరంజితో జనః"

అని పొగడెను. బాణ ద్వితీయుడగు గుణాఢ్యునిచే అశేష జనము ముగ్ధమగునట.

బృహత్కథకంటె ప్రాచీనమగు కథాసంపుటి మరి యొకటి లేదని చెప్పియుంటిమి. కథావస్తువుతోబాటు రసపోషణాదికము కూడ దీనియందు చక్కగా నిర్వహింపబడెను. పూర్తి గ్రంథమందు సప్త విద్యాధర చక్రవర్తులకు సంబంధించిన కథలు అభివర్ణింపబడియుండును. కాని ఒకప్పుడు ఉపలబ్ధమానమైన ఈ సప్తమాంశమందు ఉదయన మహారాజుయొక్క కుమారుడగు నరవాహన దత్తుడు నాయకుడు. అతడు తన మిత్రుడగు గోముఖుని సహాయమున మదనమంజూష యను ప్రేయసిని పాణిగ్రహణ మొనర్చి విద్యాధర సామ్రాజ్యమునకు అధిపతి యగును. ఈ నరవాహనదత్తుడు ఇంకను అనేక దివ్య మానుషాంగనలను వివాహమాడును. ఈ కథావస్తువునకు అనుబంధముగా ప్రాసంగిక గాథలు చిన్నవి, పెద్దవి అనేకములు కూర్చబడెను. అవి ఆయా సందర్భములకు తగినవియై, పాఠకులకు, శ్రోతలకు ఎంతయో అభిరుచిని పెంపొందించుటయే ఈ గ్రంథము యొక్క విశిష్టత కనుక, ప్రధాన కథ అతి మందముగా నడచుచు, అవాంతర కథలే మిక్కిలి మనోహరములై యుండును. అనవసర వర్ణనములు గాని, అసందర్భత్వము గాని కథల యందు కాన్పించదు. రామాయణ, మహాభారతముల వలె, అంతటి ఉత్కృష్టమగు ప్రధాన కథావస్తువు లేకున్నను, బృహత్కథ యొక్క ప్రభావము తరువాతి కథా సాహిత్యము నందు విశేషముగా కాన్పించును. క్రీ. పూ. 2 వ శతాబ్దిలోని భానమహాకవి కృతములగు ప్రతిజ్ఞా యౌగంధ రాయణము, చారుదత్తము, స్వప్నవాసవ దత్తము అను రూపకము లందలి కథావస్తువు బృహత్కథ లోనిదియే. బృహత్కథలోని గోముఖుడు యౌగంధరాయణుడుగాను, మదనమంజూష వసంతసేనగాను. రూపొందించబడినది. అట్లే శ్రీహర్షుడు కూడ తన నాటకముల కవసరమగు ఇతి వృత్తమును ఇందుండియే గ్రహించెను. ముద్రారాక్షసము బృహత్కథామూలకమని ధనికుడు స్పష్టముగా వ్యాఖ్యానించెను. ఇంతేగాక పంచతంత్రము, హితోపదేశము, దశకుమార చరిత్రము, భేతాళ పంచవింశతి విక్రమార్క చరిత్రము, శుకసప్తతి మున్నగు కథారచనల యందు ఆయా కృతికర్తలకు బృహత్కథయే మార్గదర్శకమనుట అతిశయోక్తి కాజాలదు. భట్టబాణుని కాదంబరికి బృహత్కథయే మూలమని స్పష్టముగా తెలియుచున్నది.

బృహత్కథ యొక్క పైశాచీ మూలగ్రంథము నేడు అదృశ్యమైపోయినను క్రీ. శ. 12 వ శతాబ్ది వరకు అది యథాతథముగా ఉండియుండవచ్చునని ధనంజయాదుల ప్రశంసా వాక్యములను బట్టి ఊహింప వీలగుచున్నది. ప్రస్తుతము ఈ మహా గ్రంథము యొక్క సంస్కృతాను వాదములు మాత్రము మూడు లభ్యమగుచున్నవి :

1. నేపాలుదేశీయుడగు బుధస్వామి కృతమగు 'బృహత్కథా శ్లోక సంగ్రహము'. ఈగ్రంథకర్త క్రీ. శ. 8 లేక 9 వ శతాబ్దికి చెందినవాడు. ఇదియే మిగిలిన అనువాదములు రెండింటి కన్న ప్రాచీనమైనది. దీనికి నేపాలు దేశ మందు ప్రచారములో నున్న బృహత్కథ మూలమై యుండవచ్చును. ఈ మొత్తము గ్రంథము యొక్క 28 సర్గలలో 6 మాత్రమే ప్రస్తుతము లభించుచున్నవి.

2. క్షేమేంద్ర రచితమగు బృహత్కథా మంజరి. ఈకవి కాశ్మీరదేశపు రాజగు అనంతుని ఆశ్రితుడు. ఇతడు 11 వ శతాబ్దిలోనివాడు. ఇతని గ్రంథమందు 7500 శ్లోకములు మంచి కవిత్వపటిమను కలిగియుండును. కవిత్వమున కెక్కుడు ప్రాధాన్యము నిచ్చియుండుటచే ఇతడు మూలము నెంతగా అనుసరించెనో చెప్పుట కష్టము.

3. సోమదేవునిచే రచింపబడిన కథాసరిత్సాగరము. ఈ కవి గూడ కాశ్మీరాధిపతియగు అనంతుని (1029-1081) ఆశ్రితుడు. క్షేమేంద్రుని సమకాలికుడు. అనంతుని భార్య యగు సూర్యమతీదేవి యొక్క ప్రోత్సాహమున సోమదేవభట్టు పైశాచిభాషలోని బృహత్కథను కథాసరిత్సాగరమను పేరుతో సంస్కృతభాషలోనికి అనువదించెను. ఈతని యనువాదమే మిగిలిన రెండింటికన్న సంపూర్ణ మైనదై బహుళప్రచారము నొందియున్నది. దీనియందు 24,000 శ్లోకములు కలవు. ఈ కవి తన అనువాద రచనను గూర్చి,


"యథా మూలం తథైవైతన్నమనాగ ప్యతిక్రమః
 ఔచిత్యాన్వయ రణా చ యథాశక్తి విధీయతే
 కథారసా విఘాతేన కావ్యాంశ స్వచయోజనా
 వైదగ్ధ్యఖ్యాతి లాభాయ మమనై వాయ ముద్యమః
 కింతు నానాకథాజాల స్మృతిసౌకర్య సిద్ధయే”

“మూలమును ఏమాత్రము అతిక్రమించకుండ యథా తథముగను, ఔచిత్యాన్వయములను చెడగొట్టకుండగను, కథయొక్క రసభంగము జరుగకుండునట్లుగను, కావ్యాంశమును పాటించునట్లుగను, ఈ యనువాదమును చేయుచుంటిని ; స్వప్రతిభను చాటుటకుగాని, కవిత్వాడంబరము కొరకుగాని, నా యీ ప్రయత్నము యొక్క ఉద్దేశము కాదు. నానావిధములగు కథలను సులభముగా తెలుపుటయే, దీని ప్రయోజనము" అని సవినయముగా చెప్పుకొని యుండుటనుబట్టి ఈతని యనువాదము యథా మూలముగనే యుండునని ఊహింపవచ్చును. కావున బృహత్కథను గూర్చి ఏమి చెప్పదలచినను సోమదేవుని కథాసరిత్సాగరమును అనుసరించియే యుండును.

కథాసరిత్సాగరములోని విషయము 18 భాగములు, 124 తరంగముల క్రింద విభజింపబడెను. క్షేమేంద్రుని బృహత్కథామంజరి యందుకూడ 18 భాగములే యున్నవి. కనుక మూలము కూడ అంతే గ్రంథమయి యుండును. కథాభాగములు హైందవనాగరికతా సంస్కృతులతో, అనగా పాపపుణ్యములందలి నమ్మకము, లోకాంతర ప్రాప్తి, జన్మాంతర సంభవము, దైవరాక్షసభూతపిశాచాదుల సంబంధము, యౌగికశక్తులు, మున్నగు సన్నివేశములతో కూడినవై, అప్పటి సాంఘికస్థితి యొక్క ప్రత్యేకతను ప్రతిబింబింపజేయుచుండును. గుణాఢ్యుని కీర్తిని ఈ మాత్రమైనను నిలబెట్టినది, సంస్కృత కథా సరిత్సాగర మనక తప్పదు. దీని యనుకరణములు, అనువాదములు భారతదేశ భాషలందును పాశ్చాత్యభాష లందును అనేకములు వెలసినవి. మహామహోపాధ్యాయ వేదం వేంకటరాయశాస్త్రిగారు ఆంధ్రభాషలోనికి దీనిని చక్కగ అనువదించి యున్నారు.

పు. ప. శా.