సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/గిబ్బను, ఎడ్వర్డు (1737-1794)

గిబ్బను, ఎడ్వర్డు (1737-1794) :

ఎడ్వర్డు గిబ్బను మహాశయుడు ప్రసిద్ధ ఆంగ్ల చరిత్రకారుడు. ఇతడు రచియించిన రోమను సామ్రాజ్య పతన చరిత్ర (The History of the Decline and fall of the Roman Empire) వలన, ఈతని కీర్తి ఐరోపా ఖండమందు మాత్రమేగాక, యావత్ప్రపంచము నందును వ్యాపించినది.

గిబ్బను లండను నగరమునకు సమీపమున గల 'పుట్ని' అను గ్రామమున 27 ఏప్రియలు 1737 వ సంవత్సరములో 'ఎడ్వర్డు గిబ్బన్ ' మరియు 'జూడెత్ పోర్టెన్' అను దంపతులకు ప్రథమ సంతానముగా జన్మించెను. ఇతని తరువాత ఆ దంపతులు కార్గురు జన్మించిరి గాని, వారందరు బాల్యముననే మరణించిరి.

గిబ్బను బాల్యమున మిక్కిలి అనారోగ్యవంతుడుగా నుండి నరములకు సంబంధించిన వ్యాధితో మిక్కిలి బాధపడెను. బాల్యమున తల్లి చనిపోవుటవలన ఇతనిని పినతల్లి పెంచినది. ఆమెయందీతని కపారమైన ప్రేమయు, భక్తియు గలదు.

గిబ్బను తొమ్మిది, పదకొండు సంవత్సరముల మధ్యవయస్సులో తన స్వగ్రామములోని ఒక బోర్డింగుస్కూలులో కాయకష్టముతో మిక్కిలి దుర్భరమైన జీవితమును గడపి 'లాటిన్' భాషయందలి వ్యాకరణ లక్షణమును నేర్చుకొనెను. 1749-1750 సంవత్సరముల మధ్యకాలములో 'వెస్టు మిన్‌స్టరు' నందు మూడవ ఫారమువరకు అతి కష్టముమీద చదివెను. ఆ తరువాత మూడు సంవత్సరముల కాలము, నిలకడలేని జీవితముతో అనేక బాధల ననుభవించుచు, నేనెన్నియో చారిత్రక గ్రంథములను పఠించెను.

గిబ్బను తండ్రి 3 వ ఏప్రియలు 1752 సంవత్సరమున గిబ్బనును 'ఆక్సుఫర్డు' విశ్వవిద్యాలయములోని "మేక్ డోలెన్ " కాలేజియందు చేర్పించెను. అచ్చట పదునాలుగు మాసములు మాత్ర మీతడు విద్య నభ్యసించెను. కాని ఆ విద్యవలన అతని కేమాత్రమును లాభము కలుగలేదు. అందువలననే గిబ్బను తన జీవిత చరిత్రలో ఆనాటి విద్యా విధానమును గురించి వివరించుచు ఆక్సుఫర్డు విశ్వవిద్యాలయములోని విద్యావిధానము మిక్కిలి క్షీణదశలో నుండి, ఆ విశ్వవిద్యాలయపు చరిత్రకే కళంకము తెచ్చునదిగా నున్నదనియు, ఉపాధ్యాయులు విలాసవంతమగు జీవితము గడపుచు, తమ యిచ్చవచ్చినట్లు ప్రవర్తించు చుండెడి వారనియు, గనుకనే తానా విశ్వవిద్యాలయమున ఏ మాత్రపు లాభమును పొందజాలక పోతిననియు, తన జీవితములో అంత ఎక్కువకాలము వ్యర్థముగా గడపిన సందర్భము మరియొకటి లేదనియు ఆతడు వ్రాసెను.

ఇచ్చట విద్య నభ్యసించుచున్న రోజులలో గిబ్బనునకు శరీరారోగ్యము బాగుపడి, క్రమముగా మేధాశక్తియు విద్యాతృష్ణయు అధికము కాజొచ్చెను. ఇతనికి బాల్యము నుండియు మతవిషయకమైన చర్చలయందును, తత్సంబంధములైన గ్రంథములను పఠించుటయందును అభిలాష మెండు. అందువలననే యీతడు తన 17 సంవత్సరముల వయస్సునందే రోమన్ కేథలిక్ మతమునందు ప్రవేశించెను. అందువలన నీతనిని ఆక్సుఫర్డు విశ్వవిద్యాలయము బహిష్కరించినది. అంతట తండ్రి యీతనిని కవియు వేదాంతియునగు, మాలెట్ నొద్ద ప్రవేశ పెట్టెను. కాని విద్యాతృష్ణ గల యీతనికి అచ్చట అంత ప్రయోజనము కలుగలేదు. అందువలన తండ్రి యీతనిని 'లాసినా' కు పంపెను . అచ్చట 'పెవిలియార్డు' అను విద్వాంసునియొద్ద నివసింప సాగెను. పెవిలియార్డు చాల బీదవాడైనను గొప్ప విద్యావేత్త. మంచి తెలివితేటలు గలవాడు. దానికితోడు గొప్ప అభివృద్ధికరమైన భావములు గలవాడు. ఇతడు తన శక్తినంతను ఉపయోగించి గిబ్బనును మరల ప్రొటెస్టెంటు మతములోనికి చేరునట్లు చేయుటమాత్రమే గాక, అతని విజ్ఞానతృష్ణకు తగినవిధముగా, మంచి మంచి గ్రంథములనుజూపి, వానిని చదువుటకు ప్రోత్సహించెను. ఈమహాశయుని ప్రభావమువలన గిబ్బను అనవసర మతసంబంధమైన చర్చలను మానివేసి, నిజమైన విజ్ఞానము నార్జించుటకు కృషి ప్రారంభించెను. దానికితోడు అచ్చటి వాతావరణముగూడ, అతని భావములకును, ఆశయములకును తగినట్లుగా మిక్కిలి ఉన్నతముగానుండి ప్రోత్సాహకరముగా నుండెను. అందువలన నిచ్చట 'ఫ్రెంచి' భాషా వాఙ్మయమునంతను కూలంకషముగా పఠించి 'లాటిన్’ భాషనుగూడ నేర్చుకొని ఆ రెండు భాషలయందును అసమానమైన పాండిత్యమును సంపాదించెను. 1753 వ సంవ త్సరమునుండి 1758 వ సంవత్సరమువరకు అతడక్కడనే యుండెను. ఆ తరువాత తండ్రియొద్దకు వచ్చెమ. తండ్రి కుమారుని తప్పులను క్షమించి సగౌరవముగా ఆదరించెను. మారుతల్లి సయితము గిబ్బనును కన్న కుమారునివలె ప్రేమించి ఆదరించినది.

1758 - 62 నడుమ గిబ్బను ఫ్రెంచి, ఆంగ్లభాషలలో అనేక ఉత్తమగ్రంథములను జదివి, రెండుభాషలలోకూడ చక్కని శైలి నలవరచుకొనెను.

తరువాత గిబ్బను పారిస్, ఫ్లారెన్సు, నేపిల్సు మొదలైన ప్రాంతములన్నియు కొంతకాలము తిరిగి 1764 సంవత్సరము అక్టోబరు 15 వ తేదీన రోం నగరముచేరి, ఆ సాయంకాల మాతడు పురాతన కాలపు రోమను పట్టణ శిథిలములను చూచుటకువెళ్ళెను. ఆదృశ్యములను చూచుటతోడనే అతనికి క్రమముగా పతనముచెందిన రోమనుసామ్రాజ్య చరిత్ర యంతయు ఒక్కసారి కన్నులకు కట్టగా, ఆలోచనా నిమగ్నుడై యున్న అతనికి కొందరు సన్యాసులు అక్కడ నున్న జ్యూపిటరు దేవాలయములో సాయంకాలపు ప్రార్థనలు జరుపుచున్నట్లు ఒక దృశ్యము మనోగోచరముకాగా, ఉద్రిక్తుడయ్యెను. అంత అతనికి మొట్టమొదట 'రోమనుపట్టణ పతన చరిత్ర'ను వ్రాయవలయునని బుద్ధిపుట్టినది గాని, ఆ తరువాత అనేకగ్రంథములను చదువుటవలన ఆ అభిప్రాయమును మార్చుకొని “రోమను సామ్రాజ్య పతన చరిత్ర"ను గురించి వ్రాయుటకు సంకల్పించుకొనెను.

ప్రతిభావంతుడైన గిబ్బను, తండ్రి నుండి సంక్రమించిన గ్రంథములతో తృప్తిచెందక, అనేక క్రైస్తవమత గ్రంథములను, మహమ్మదీయ మత గ్రంథములను, రోమను దేశమునకు సంబంధించిన అనేక చారిత్రక, న్యాయశాస్త్ర గ్రంథములను సేకరించుటయే గాక, ఇంకను నెన్ని యో ఆర్థిక, సాంఘిక, రాజకీయ శాస్త్రములకు సంబంధించిన గ్రంథములను కూడ సంపాదించి వానిని ఆమూలాగ్రముగ చదివెను. ఈవిస్తృత గ్రంథపఠనము, ఆతడు సాధింపదలచిన ఘనకార్యమునకు చాలా తోడ్పడినది.

తండ్రి మరణానంతరము రెండు సంవత్సరముల తరువాత అన్ని విధములైన చిక్కుల నుండి విముక్తి పొంది తన ముప్పది అయిదవఏట లండను నగరమునకు వచ్చి, అచ్చట స్థిరనివాస మేర్పరచుకొని అంతకుముందు తాను కూడబెట్టుకొనిన మహావిజ్ఞాన సంపద సహాయముతో తాను సాధింపదలచిన మహత్కార్య నిర్వహణమునకు పూను కొనెను.

లండనులో స్థిరపడిన తరువాత, గిబ్బను అయిదారు సంవత్సరములు నిరంతరము కృషిచేసి 1776 వ సంవత్సరములో తన రోమను సామ్రాజ్య పతన చరిత్ర ప్రథమ సంపుటమును ప్రకటించెను. దీనిని ప్రజ లత్యుత్సాహముతో ఆదరించిరి గాని, ఆతడు ప్రాథమిక క్రైస్తవ మతముపట్ల చూపిన భావములకు కారణముగా, నిరంతర వాగ్వివాదములకును, పెక్కు జగడములకును, ఆక్షేపణలకును గురికావలసి వచ్చినది. అయినను దీనివలన ప్రజలలో అతనికి కొంత పలుకుబడికూడ లభించినది.

1774 వ సంవత్సరమున 'లార్డు ఇలియట్' సహాయముతో గిబ్బను పార్లమెంటున కెన్నుకోబడెను. కాని యీత డెన్నడును పార్లమెంటు సమావేశములలో మాట్లాడలేదు. పార్టీ ఆజ్ఞానుసారము తన ఓటింగు హక్కును మాత్రము వినియోగించుకొనెను.

1781 వ సంవత్సరమున గిబ్బను రోమను సామ్రాజ్య పతన చరిత్రయొక్క రెండవ, మూడవ సంపుటములను ప్రకటించెను. వీటిపై యెక్కువ తర్జనభర్జనలు జరుగ లేదు. ప్రజలు మిక్కిలి ఉత్సాహముతో వాటిని పఠించిరి.

లండను మహానగరములో తనకువచ్చు స్వల్ప ఆదాయముతో జీవించుట కష్టమని తలచి గిబ్బను 'లాసినా'లోని తన మిత్రుని ఆహ్వానము ననుసరించి అక్కడికిపోయి తన స్వగృహమునందు మిగిలిన భాగములను ప్రశాంతముగా పూర్తిచేయదలచి సెప్టెంబరు 1783 వ సంవత్సరములో అక్కడకు పోయెను.

లండను నగరములో నుండగానే రోమను చరిత్ర నాలుగవ సంపుటమును చాలవరకు పూర్తిచేసెను గాని, 'లాసినా' చేరిన తరువాతనే దానిని ప్రకటించెను. గిబ్బను యిక్కడ తన అపూర్వమైన గ్రంథాలయములోని ఆరువేల గ్రంథములమధ్య మిక్కిలి ప్రశాంతముగా మిగిలిన రెండు భాగములను పూర్తిచేసి నాలుగు సంవత్సరములలో ముగించెను. ఈమధ్య కాలములో నాతడు 'లాసినా' నగరమును విడచి ఎటుపోకుండ మిక్కిలి పట్టు దలతోను, ఉత్సాహముతోను తాను ప్రారంభించిన చరిత్ర రచనను విజయవంతముగా సాగించెను.

గిబ్బను మహాశయుడు తన గ్రంథమును ముగించిన నాటి పరిస్థితి నిట్లు తన జీవిత చరిత్రలో వ్రాసెను.

"1787 వ సంవత్సరము జూన్ 27 వ తేదీ రాత్రి పదకొండు పన్నెండు గంటలమధ్య నా తోటలోని వేసవి గృహములో, నా రోమను సామ్రాజ్య పతన చరిత్ర చివరపుటలోని, చివర వాక్యమును ముగించి, కలమును క్రిందబెట్టి, తోటలోగల చెట్లమధ్యలో ఎన్నో పర్యాయములు పచారు చేసితిని. అచటి నిర్మానుష్యమైన సుందర ప్రకృతి, నిర్మలాకాశములోని చంద్రుడు, చుక్కలు, కొండలు, గుట్టలు, చెట్లు ఆ సమయములో సరస్సులో ప్రతిబింబించుచుండెను. ఆ పవిత్ర సమయములో నేను చిరకాలమునుండి, పడిన శ్రమకు ఫలితముగా లభించిన విశ్రాంతిని గురించిగాని, లేదా నాకు రాబోవు ఘనకీర్తిని గురించిగాని, నేను పొందిన ప్రథమానందమును వర్ణింపనుగాని, నేను నా చిరకాలమిత్రమైన గ్రంథము నుండి శాశ్వతముగా వీడిపోవుచున్నందుకు కలిగిన దుఃఖభావమును, విచారమును వినమ్ర హృదయముతో ప్రకటింపక తప్పదు. కారణ మేమనగా, భావికాలమున 'ఆ చరిత్ర గ్రంథమునకు సరియైన గౌరవాదరములు లభించునా, లభింపవా ?' అని నా కేమాత్రము విచారము లేదు. ఎందువల్లననగా 'చరిత్రకారునియొక్క జీవితము మిక్కిలి చిన్నదిగానుండి అనేక అపాయములతోను, బాధలతోను నిండియుండును' అని నాకు తెలియును.”

గిబ్బను అంత్య జీవితము చాల విషాదముగా గడచినది. చివరదినములలో అనేకమంది స్నేహితులు, ఆప్తబంధువులు చనిపోవుటవలన అనేక విచారములకు గురియై 1793 వ సంవత్సరపు వేసంగిలో 'ససెక్సు' అను గ్రామములోని తన స్నేహితుడయిన 'షెఫీల్డు' అనువానితో గడపుటకు వెళ్లెను. కాని దురదృష్టవశాత్తు ఆతని జీవిత అంతిమాధ్యాయము క్రమముగా సమీపించుటచే లండను నగరమునకుపోయి, జలోదర రోగముతో సెంటు జేమ్సు స్ట్రీటునందు 1794 వ సంవత్సరము 16 జనవరినాడు శాశ్వతముగా కన్నుమూసెను.

గిబ్బను తాను రచియింప దలచిన రోమను సామ్రాజ్య పతన చరిత్రను 98 A.D. లో రోమను సామ్రాజ్యమును పరిపాలించిన 'టిటస్ ' చక్రవర్తితో ప్రారంభించి 1453 వ సంవత్సరమున 'టర్కీ' వారు 'కాన్‌స్టాంటి నోపిలు' పట్టణమును స్వాధీనము చేసికొనినంతవరకును రచించెను. ఆతడు అతిపురాతన కాలమునుండి నేటి నవీన నాగరికత వరకును సంభవించిన అనేక మార్పులను గ్రహించి, చిందరవందరగా నున్న అనేక చరిత్రాంశములను, ఒక దానితో నింకొకదానికిగల సన్నిహిత సంబంధమును క్రమపద్ధతిపై నేర్పరచి, పదునాలుగు శతాబ్దముల మధ్యకాలమున నున్న సువిశాలమయిన రోమను సామ్రాజ్య చరిత్రను సుస్థిరమైన పునాదులపై నిర్మించి చరిత్ర రచనయందు చక్కని రాచబాటను ఏర్పాటుచేసి, ఆ చరిత్రకును, ప్రపంచమునకును మహోపకారము చేసెను.

గిబ్బను ఈ చరిత్ర రచనయందు కొన్ని లోపములు చేసెను. అతడు మతమునకు సంబంధించిన సరియైన పరిజ్ఞానము లేకుండగనే నిర్దయతో ఆవిషయములను గురించి చర్చించుటయేగాక పూర్తి క్రైస్తవ మతమునకు సంబంధించిన అనేక విషయములను అనవసరముగా నుదాహరించుచు, లేనిపోని వాదములను లేవతీసెను. అందువలన ఆతని చరిత్ర గ్రంథముపై వాదప్రతివాదములు బయలు దేరినవి.

గిబ్బను తన చరిత్ర గ్రంథమును శిల్పరీత్యా సర్వాంగ సుందరముగా తీర్చిదిద్దుటలో ప్రతిభావంతుడైన స్వతంత్ర కళాకారునివలె ప్రవర్తించెనేగాని, అనవసరముగా ఇతరులను అనుకరించుట కేమాత్రమును ప్రయత్నించలేదు.

గిబ్బను కావించిన ఉత్తమ చారిత్రక రచనవలన, చరిత్రకు ఒక విశిష్టత లభించినది. ఈనాడు చరిత్ర సారస్వతము నందొక ముఖ్య భాగముగ పరిగణింపబడుటకు గిబ్బను మహాశయునివంటి ఉత్తమ చారిత్రకుల కృషి యే మూలము.

పు. వేం.