సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/గారడి విద్య

గారడి విద్య (Jugglery) :

గారడి (త) అను పదము "గారడము” (గారడము+ఇ) నుండియు, గారడము “గరుడ” శబ్దము నుండియు ఉత్పన్నమైనట్లు కనిపించుచున్నది. "గారడము" అనగా 'విషమంత్రము లేక మాయ.' గరుడుడు పాములకు శత్రువు. పాములవాడు కూడ పాములకు శత్రువు. కనుక పాములవానిని, వానిమంత్రములను, మాయలను గారడి అని మొదట వ్యవహరించెడి వారు. కాని క్రమముగ పాములవాళ్ళు ఉదరపోషణార్థము, ఊరూరను తిరుగుచు పాములకు సంబంధించిన పనులే కాక మాయలు అనగా గారడి విద్యాప్రదర్శనలు కూడ చూపించుచు వచ్చిరి. అందువలన ఆ మాయా ప్రదర్శనలు, గారడివిద్యగా పేర్కొనబడు చున్నవి. ఇవి ఇట్లు పేర్కొనబడుటకు కన్నడపదమైన "గాడిగార” (మాయ చేయువాడు) యొక్క ప్రభావము కూడ కొంత ఉండి యుండవచ్చును.

గారడివిద్య హస్తలాఘవము మీద ఎక్కువగా ఆధారపడిన “మాయల” ప్రదర్శనము. ఇదియొక తంత్రము నందు చెప్పబడి యున్నది. ఇంద్రజాలము, మహేంద్రజాలము, టక్కు, టమారు, గజకర్ణవిద్య, గోకర్ణవిద్య, కనుకట్టు అనునవి గారడివిద్యజాతికి సంబంధించినవే. కాని దానికంటె ప్రదర్శన సందర్భమున ఇంకను ఎక్కువ శక్తి సామర్థ్యములు అవసరము కలిగినవి.

ఇంద్రజాలమును గురించి గుణాఢ్యుని బృహత్కథలో పేర్కొనబడినది. గారడికంటె కష్టతరమైన ఇంద్రజాలము గుణాఢ్యుని కాలమునాటికి ప్రచారములో నున్నయెడల అంతకుమునుపే మనదేశములో గారడి విద్య బాగుగా అభివృద్ధి చెందియుండవలెనని తోచు చున్నది. శ్రీ హర్షుని “రత్నావళి"లో కూడ ఈ విద్యను గురించి వ్రాయబడి యున్నది. మనదేశపు త్రాడుతో చేయు మాయ (The Indian Rope Trick) ఖండాంతర ఖ్యాతి గడించినది.

జహంగీరు చక్రవర్తి స్వీయచరిత్రకు సంబంధించిన వృత్తాంతములలో (Autobiographical Memoirs) ఆయన చూచిన అపూర్వమైన గారడి విద్యా ప్రదర్శనలను వర్ణించినాడు. అందు, భూమిలో విత్తునాటిన వెంటనే, పండ్లతో, ఆకులమధ్య పక్షులతోసహా కోరినచెట్టు మొలిపించుట; నాలుక, పెదిమలు కదుపకుండగనే ఏడుగురు వ్యక్తులు ఎక్కడను అపస్వరము లేక ఒకేమాదిరి ధ్వనులు చేయుట (ఇప్పుడు దీనినే “ventriloquism" అందురు); ఒక మనిషియొక్క కాళ్ళు, చేతులు, తల, మొండెము, వేరుచేసి, దూరదూరముగ పడవేసిన తర్వాత వానిమీద ఒక దుప్పటి కప్పియుంచిన కొద్ది సమయమునకే మామూలు మనిషి (అవయవము లన్నియు కలిగిన మొదటి మనిషి) దుప్పటి క్రిందినుండి బయటికి వచ్చుట మొదలగు అపూర్వమగు వింతలను వర్ణించినాడు.

గారడివిద్యాప్రదర్శనము కావించువానికి హస్తలాఘవము, తగిన పరికరములతో పాటు మానవ మనస్తత్వము కూడ తెలిసియుండవలయును. హస్తలాఘవము చూపు సందర్భమున, ప్రదర్శనలోని ప్రతివిషయము అపూర్వ మైనదిగ తోచునట్లు చేయుటకు, ప్రేక్షకుల దృష్టి అసలు విషయముపై కాక వేరు విషయముపై వాక్చమత్కృతి ద్వారా మరల్చుట గారడిచేయువాని ముఖ్యలక్షణములు. అటువంటివానికి సభాభీతి ఎంతమాత్రము ఉండరాదు.

ఈజిప్టుదేశములోను, పాశ్చాత్యదేశములలోని, గ్రీకు, రోమను పూజారులు ప్రప్రథమమున ప్రజలను దైవసంబంధమైన విషయములలో నమ్మించుటకు గారడికి సంబంధించిన మాయలుచేసెడివారు. కాని, తరువాత ఈ గారడివిద్యా ప్రవీణులు ప్రభువులవద్దను, సంతలలోను తమ విద్యాప్రదర్శనలు జరిపెడివారు. విరిగిన బంతులు, పాత్రలు(cups and balls), కఱ్ఱలు, పళ్ళెములు (sticks and saucers), సరిచూపుట కత్తిరింపబడిన త్రాడు తెగిపోకుండ పూర్తిగా నుండునట్లు చేయుట; మానవునకు అపాయము కలుగకుండ వాని దేహములోనికి కత్తులు విసరుట మొదలగు కొన్ని మాయలు అన్ని దేశములలోను ఆదికాలమునుండియు ప్రయోగింపబడుచున్నవి.

మధ్యయుగమువరకు పాశ్చాత్యదేశములలో సామాన్యులు ఎవరైనను ఈ మాయలను చూపినచో వారు దయ్యములతో సంబంధము కలవారుగా పరిగణింపబడి కాల్చబడుచుండెడివారు. రెజినాల్డు స్కాట్ అను నతడు. వ్రాసిన “మంత్రవిద్య" ("Discovery of witch Craft", 1584) అను గ్రంథము అట్టి పుస్తకములలో మొదటిది. దయ్యములతో సంబంధమున్నదని ప్రజలు తమ నెక్కడ బాధింతురో యను భీతిచే 1614 లో స్కాట్, సామ్యుయల్ రిడ్ అనువారలు గారడి విద్యను (The art of Jugglery -1614) గూర్చి వ్రాసిన గ్రంథముల యందు తమ కర్తృత్వమును వెల్లడిచేయ లేదు. ఐనను, మూఢనమ్మకములు గల ప్రజలు స్కాట్ పుస్తకమును కాల్చి వేసిరి.

తరువాత తరువాత, గారడివాళ్ళు ఊరూరను తిరుగుచు తమ ప్రదర్శనముల నిచ్చెడివారు. 18 వ శతాబ్దమున పాశ్చాత్యులు స్టేజిపై ప్రదర్శన లిచ్చుటకు ప్రారంభించినారు. రాబర్టు హౌడిని (1805 - 71) అను ఫ్రెంచి దేశీయుడు ఆధునిక గారడి విద్యకు పిత (Father of Modern Conjuring) అని చాల ప్రసిద్ధి చెందినాడు. ఇతని “The Floating Boy" అను ప్రదర్శనము చాల పేరుపొందినది. ఇట్టి గారడి ప్రదర్శనములను పెక్కు సంవత్సరములనుండి భారతదేశములో చేసెడివారని చూపుటకు తగు ఆధారములు కలవు.

ఇంకను “Wizard of the North" అని ప్రసిద్ధి చెందిన జాన్ హెన్రి ఆండర్ సన్ (1812-74) అను మంత్ర గాడు, హెర్మన్ దిగ్రేట్' అని ప్రసిద్ధిపొందిన అలెగ్జాండర్ హెర్‌మన్ (1843 -1896), జాన్ నెవిల్ మాస్కెలిన్ (1839-1917), హారీ కెల్లర్ (1849 - 1922), చైనా దేశస్థుడైన 'చీలింగ్ క్వా' (1854-1918) చాల ప్రసిద్ధి చెందిన విదేశీ గారడీ ప్రదర్శకులలో కొందరు. మన దేశమున పి. సి. సర్కార్, గోగియా పాషా మొదలగువారు ఈ విద్యలో ప్రపంచఖ్యాతి నార్జించిన కొందరు వ్యక్తులు. ప్రదర్శన లిచ్చువారు ఆ ప్రదర్శనలోని మూల రహస్యమును ఎవరికిని తెలియకుండ కాపాడుకొనుట పైననే ప్రదర్శనయొక్క జయము ఆధారపడి యున్నది. కనుకనే సాధారణముగ గారడీ విద్యాప్రవీణుల మాయలు మిగిలినవారికి తెలియుట కష్టము. ఐనను 19 వ శతాబ్దము నుండి ప్రపంచములోని గారడి విద్యాప్రవీణు లందరు సాధ్యమైనంతవరకు ఒకరిని గురించి మరియొకరు తెలిసి కొనుటయు, వారివారి విద్యలను పోల్చుకొని అన్యోన్యముగ అందలి మర్మములను తెలిసికొని సహకారము నెరపుకొని తమ విద్యను అభివృద్ధి చేసికొనుటయు జరుగుచున్నది. దీనికై 'అంతర్జాతీయ ఐంద్రజాలికుల సంఘము (International Magicians Circle) అను సంస్థయు కూడ నెలకొల్పబడినది.

హెచ్. పి. సుర.