సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/గానము

గానము :

ఏ కళకైనను, ఏ విద్యకయినను శాస్త్ర మత్యంత ప్రధానమైనది. కార్యాకార్యవ్యవస్థితి యందు నిర్దుష్టమైన, నిష్కర్షయైన విచక్షణాజ్ఞానమును కల్గించుటేగాక, ధర్మసమ్మతముగ నాయా విద్యలకును, ఆయా కళలకును ప్రమాణత్వమును కల్గించుటకు శాస్త్రములే సమర్థములు. సమస్త విజ్ఞానానుభవములచే పరిపక్వమైన మేధస్సంపద గలవారును, తత్ప్రకటన దక్షులును ఐన మహాయోగులును, వీతస్పృహులును, స్వార్థరహితులునై, ఆచార్య పరంపరకు చెందిన ఆధికారిక పురుషులు లోకకళ్యాణము నాశించి రచించిన శాస్త్రములు మానవ సంఘమున కత్యంత ఉపాధేయము లనుటలో సందేహ మేమియును లేదు. "శాస్త్రం యత్ప్రమాణం కురుతే తదనువర్త నీయం" అను వాక్యమువలన పై యంశము స్పష్టపడుచున్నది. అనిష్టమును, అరిష్టమును, అమంగళమును పరిహరింపగల సమర్థతకూడ శాస్త్రమునకే కలదను నంశము కూడ “శాసనాత్ శాస్త్రమ్" అను వాక్యముచే తెలియబడుచున్నది. శాస్త్రకారులయిన మహా ఋషులు బహురూపమగు లక్ష్యప్రపంచమును మనమునం దుంచుకొని, ఆయా లక్ష్యములలో ఉత్తమములయిన వాటికి ప్రమాణత్వమును కల్పించుటకై శాస్త్రములను నిర్మించిరి. అట్టి శాస్త్రజ్ఞానముచే చిత్తసంస్కారమను ఉత్తమ ప్రయోజనము తప్పక సిద్ధించును.

శ్రావ్యము, చిత్తాకర్షకము, నాదాత్మకము, రంజక గుణప్రధానము, ఆకృతివహించు మధ్యమవాక్కునుండి జనించినదియునైన గానకళకు శాస్త్రమువలన నెట్టి ప్రయోజనము సిద్ధించుచున్నదో తెలిసికొందము.

విద్యాధిష్ఠాత్రియగు సరస్వతికి మిక్కిలి ప్రీతిపాత్రములైన సంగీత, సాహిత్యములలో సంగీతము ఆపాతమధుర మగుటకు కారణము అది నాదాత్మకమును, రంజకగుణ ప్రధానము నగుటయే.

గానమునకు జన్మస్థానమగు నాదము స్పందనాత్మకము. ఉచ్చరింపబడు శబ్దముయొక్క బలమునుబట్టియు, స్వభావమునుబట్టియు, తీవ్రము, కోమలము, మృదులము, తీక్ష్ణము, మధురము, వికృతమునైన ధర్మములను కలిగి యుండు నాదము శిరఃప్రభృతిపాద పర్యంతము కలనాడులను, ధమనులను, రక్తనాళాదులను స్పందింప చేయును. దానివలన యావద్దేహపర్యంతము భావోద్రేకోద్దీపనములతో కూడిన వలనములతో రక్తావర్తములు కల్గును. అంతట నవి ఆక్షేప విక్షేపాదులకును, సంక్షోభ విక్షోభములకును ఆకరమగు చైతన్యమువలన కలుగును. ఈ చైతన్యము వ్యక్తిగత స్వభావమును బట్టియు సన్ని వేశమును బట్టియు, తత్తద్రాగరస భావ ప్రకర్ణస్థితినిబట్టియు, మంద్ర, మధ్యమ, తారస్థాయిలును కూడినదై తత్త దుచితఫల ప్రయోజనములను కల్గించుచుండును. అట్టి మహాశక్తిగల నాదము ప్రధాన ధర్మముగాగల సంగీతము సృష్టియందలి సదసత్ప్రవృత్తులతో నిండియున్న యావజ్జీవరాశిని ఆకర్షించి ఆయా విభిన్న ప్రవృత్తులపై తన ప్రభావముద్రను శ్రవణాపాతముతోడనే ముద్రించి, లోగొని, సదసత్ప్రయోజనములను కల్గించుటలో సందేహము లేదుకదా ! "శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తిగాన రసం ఫణిః" అను వాక్యము ఈ యంశమునే సుస్పష్ట మొనర్చుచున్నది. పూర్వప్రపూర్వములగు ఏ యనుభవములనో, ఏ స్మృతులనో రేపుచు, క్షోభమునో చైతన్యమునో కల్గించుట రమణీయదృశ్యములకు, మధుర శబ్దములకును సహజమని మహాకవి కాళిదాసు ధీరనాయకుడైన దుష్యంతునినోట "రమ్యాణివీక్ష్య మధురాంశ్చనిశమ్య శబ్దాన్, పర్యుత్సుకోభవతి యత్సుఖితోపిజంతుః" అని అనిపించినాడు. అనేకవిధముల ఆధికారికసంపద కల్గిన దుష్యంతాది మహానాయకులకే గానాకర్ణనమున చిత్తవికారము దుస్సహమగునెడ సామాన్య ప్రకృతులలో కల్గు చిత్తవికారము మరింత దుస్సహమగునను నంశమున సందియముండబోదు. కావుననే గానకళకు శాస్త్ర మవశ్యంభావియగు చున్నది. అందునను, నిత్యజీవిత వ్యవహారమునకు మూలములగు అర్థకామములను కళాధర్మముతో మేళవింప జేసికొని, ధర్మపురస్కృతముగ మధుర మార్గమున విషయములను అనుభవించుచు, మోక్షమును లక్ష్యముగ జేసికొని జీవించుటయే, భారతీయుల సంస్కృతి యందలి విశిష్టత. ఇట్టి భారతీయుని నిత్యజీవిత తరంగముతో మధుర నాదాత్మకమగు గానకళ అవినాభావ సంబంధ మేర్పరచుకొని యుండుట అబ్బురముకాదు. గానమునకు ప్రవేశములేని జీవితము ఏభారతీయ సంస్కృతి యందును కానరాదు. భారతీయుని ప్రవృత్తికిని, ప్రవర్తనమునకును ఆచార్యత్వము వహించి, ఆదర్శము దిద్దిన వేదచతుష్టయమునందు నాదస్వర ప్రధానమైన సామవేద మొకటిగానుండుట, గాంధర్వవేద ముపవేదమై భారతీయుని విజ్ఞానమునకు మకుటాయమానముగ నుండుటయు భారతీయుల గానకళాభిరతికి ఉపబలకములు. గానకళకును మానవజీవితమునకును ఇంత యవినాభావసంబంధ ముండుటచేతనే, రంజకగుణప్రధానమై, చిత్తవిభ్రాంతిని కల్గించుట కవకాశము గల గానకళవలన లోకభద్రతకు భంగము వాటిల్లి ఉపద్రవము లుప్పతిల్లుట కవకాశము లుండుటవలన, అన్నిటికంటెను గానకళకు శాస్త్రావశ్యకము హెచ్చుగా కన్పించుచున్నది. నట, విటులతో కలిపి గాయకులను కూడ పంక్తిబాహ్యులుగ నిషేధించుటయు, 'గాయతే బ్రహ్మచారిణే న దేయమ్' అని నిషేధించుటయు పైన సూచించిన విప్లవోత్పాతములను నివారించుట కొరకేనని తెలియుచున్నది. ఈ సందర్భముననే సుప్రసిద్ధ గ్రీకు తత్త్వవేత్తయగు ప్లేటో మహాశయుడు "పవిత్ర సృష్టిసంకల్పమగు కల్యాణపంథనుండి ఈశ్వరపుత్రులను సులభముగ వంచితులను జేయు నాట్యాదులను మానవులకు నేర్పుట కూడనిపని. ఆత్మశక్తిని వికసింపజేయు సంగీతమునే మానవులకు నేర్పవలసి యున్నది." అని పేర్కొని యుండుట కూడ గమనింపదగినది.

ఇక శాస్త్రమువలన గానకళకు కలుగు ప్రధాన ప్రయోజనములను వరుసగ చూచుకొందము. నాదము, స్వరము, రాగము, తాళము, సాహిత్యము, సాహిత్యభావము మున్నగు గానకళాప్రధానాంగముల ఉత్పత్తిని, పరిణామమును, ఆయా సందర్భములలో వాటి ప్రామాణ్యాప్రామాణ్యములను, ప్రాధాన్యాప్రాధాన్యములను తెలిసికొనుట, శాస్త్రజ్ఞానమువలన కలుగు చిత్తసంస్కారముతో లోకకల్యాణముకొరకు మాత్రమే, నిష్కామ ప్రవృత్తితో గానకళను ప్రచలింపజేయుట, నిర్దిష్టపద్ధతితో నిర్దుష్టమైన సంగీత కళాసృష్టి నొనర్పగలుగుట, శాస్త్ర సంస్కారమువలన కల్గిన- తెలిసికొనబడిన బహువిధరూప లక్ష్య ప్రపంచజ్ఞానముచే దేశవ్యాప్తము స్థిరమైన ఉత్తమ ప్రమాణములతో నూత్న వినూత్న ప్రబంధ నిర్మాణ మొనర్చి తద్వారా సత్ఫలితములను సాధించుట, గాన కళచే సంవర్ధితములగు నాట్యాది ఇతర కళలను కూడ నిర్దుష్టముగ సంపుష్ట మొనర్చుట, లోకుల అభీష్టము ననుసరించి ఎప్పటికప్పుడు పెరిగిపోవుచున్న బహువిధములగు లక్ష్యప్రబంధములలో గల లోపములను, దోషములను ఎప్పటికప్పుడు సంస్కరించుచు, సత్పరిణామములకు గతి కల్పించుచు లోకమంగళస్థితిని సంరక్షించుట, వాగ్గేయకారులకుమార్గదర్శకమై ఆయాగాయకుల చిత్తప్రవృత్తుల యందలి మాలిన్యమును తొలగించి ఉత్తమ గాన కళావిర్భావమునకు తగినట్లు వారి మానసిక ప్రవృత్తులను సంస్కార మొనర్చుట అనునవి శాస్త్రమువలన గానకళకు కలుగు ప్రయోజనములై యున్నవి.

గానకళయం దొక ప్రధానాంశమైన 'ఆర్చిక, గాథిక, సామిక, సర్వాంతర, ఔడవ, షాడవ' పద్ధతులలో నడచిన రాగముల చరిత్ర ముఖ్యముగ గానకళకు శాస్త్రము వలన కలుగు ప్రయోజనమును ఉటంకించుటకు ఉపకరించు చున్నది. చరిత్ర కందని ప్రాచీనకాలము నందును, ఋగ్వేద కాలము నందును, వేదమును ఉదాత్త అను దాత్తాది స్వరభేదము లేకుండ ఒకే స్వరములో ఉచ్చరించెడువారు. దీనినే ఏకస్వర గాయన పద్ధతి యనియు, ఆర్చికపద్దతి - అనగా అర్చా= పూజాపద్దతి - యనియు నందురు. తరువాత గాథలను గానము చేయవలసి వచ్చినపుడు రెండు స్వరముల నుపయోగించెడువారు. దీనినే గాధికమందురు. తరువాత ఉదాత్తానుదాత్త, స్వరితరూపములగు త్రిస్వరములతో వేదమును గాన మొనర్చిన పద్ధతినే త్రిస్వరగాయన పద్దతి యనియు, సామవేద కాలమునాటికి ఆచార వ్యవహారసిద్ధమై యుండుటచే సామికమనియు వ్యవహరించిరి. తరువాత క్రమముగ సర్వాంతర అనగా నాలుగు స్వరములతో గానపద్దతి ఔడవ-షాడవ అయిదు, ఆరు స్వరములతో గీతపద్ధతి - వాడుకలోనికి వచ్చినది. ఇంకను కాలము జరిగిన కొలది, సామవేద కాలమునాటికే సప్తస్వరములతో కూడిన గానపద్ధతి ప్రచారములోనికి వచ్చుటయు, సామవేదము ఆ స్వరములను ఉత్కృష్ట, ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థ, మంద్ర, స్వరితనామములతో వ్యవహరించుటయు గానశాస్త్రజ్ఞులకు బాగుగ తెలిసిన యంశమే. తరువాత ఈ సప్తస్వరములే శ్రుతిభేదములతో శతాధికముగ ప్రస్తరింపబడుటయు సువిదితము. ఈ స్వరపరిణామ చరిత్రమును, భరతుడు మొదలు సుబ్బరామ దీక్షితుల వరకు గల సంగీత శాస్త్రజ్ఞు లెల్లరు గుర్తించుచు ఆయా స్వరములకు ప్రమాణత్వమును కల్పించుచునే వచ్చిరి.

ఇట్లే రాగముల విషయమున గూడ జరిగిన పరిణామమును ఆయా శాస్త్రవేత్తలు శాస్త్రసమ్మత మొనర్చి యుండిరి. బృహద్దేశి యను గానశాస్త్రమునకు కర్తయగు మతంగుని కాలము నాటికి వ్యవహారమునందున్న. టక్క, బోట్ట, సౌరాష్ట్ర, ఘూర్జరి, ఆంధ్రి, మాలవి, షాడ్జోదీచ్య, గాంధారి, సౌవీర, ఆభీరి, హిందోలక, అను స్వల్పసంఖ్యా పరిమితరాగములతో చాలవరకు ఆయా దేశముల పేర్లే రాగముల పేరులుగా నున్నట్లు తెలియ గలదు. మరి ఇప్పుడో, ప్రస్తారపద్ధతి వలనను, జన్యజనక పద్ధతి వలనను అన్యదేశ గానపద్ధతి సంసర్గము వలనను రాగములు అనంతములుగా నుప్పతిల్లినవి. భిన్నభిన్న దేశములయందలి, విశిష్ట సౌందర్య స్ఫూర్తితో అభిరుచుల కనుగుణముగ క్రొత్తక్రొత్తరుచులను సంతరించు కొనుచు బలసిపోయిన రాగ ప్రపంచమున రంజకత్వధర్మము మిక్కిలి హెచ్చుగా కన్పట్టు చుండుట చేతనే, అంతకుపూర్వము భరతాచార్యుడు చెప్పిన “రజ్యతేయేనయః కశ్చిత్ సరాగః" అను రాగ లక్షణమును జనసామాన్యమంతకును వర్తించునట్లుగా మార్చి, రాగముల యందలి ముఖ్యపరిణామ మగు రంజక ధర్మమును గుర్తించి “రంజకో జన చిత్తానాం సరాగ ఉదాహృతః" అని తీర్చిదిద్దినాడు. తరువాత ఇంకొక ముఖ్య విశేష మేమన: స్వరములు సప్తస్వర పద్ధతికి వివృద్ధము చేయబడినప్పుడు 'మ, గ, రి, స, ని, ద, ప, ' అను రీతిగా సప్తస్వరము లుండెడివి. ఈ స్థాయీ స్వరపద్ధతి కనిపెట్టిన విధానమే చాలా ముఖ్య మైనదియు, అప్పటినుండియే సంగీతకళ యథార్థముగా ప్రారంభమై అనంతములైన రాగములను సృష్టించుటకు అనువుపడినదనియు, భారతీయ సంగీతశాస్త్రజ్ఞులు వ్రాసియుండిరి. అట్టియెడ ఆధునిక గానప్రపంచమున 'సరిగమపదని, సనిదపమగరి' అను విధముగ షడ్జమముతో ఆరోహణ అవ రోహణ విధానము సప్తస్వరములు ప్రవర్తింపజేయబడు చుండుట గమనింపదగినది. ఈ పరిణామమును గూడ ఆధునిక శాస్త్రజ్ఞులు గుర్తించి ఈ పద్ధతికి గూడ శాస్త్రప్రమాణమును కల్పించిరి. ఈ సందర్భముననే నారదుని రాగవిభాగ పద్ధతి, మతంగ, పార్శ్వదేవుల రాగవిభాగ పద్ధతి. రామామాత్యుని రాగవిభాగ పద్ధతి, వాటి యందుండు భేదములు, పార్శ్వ దేవుని రాగపద్ధతి క్రమముగ నాచారమునుండి తొలగుటయు, శౌర్య, వీర్య, శృంగారాది రస భావ గుణ వ్యంజకత్వము స్ఫుటముగగల్గి గంభీరమగు గమనపద్ధతి కల్గిన అయిదు ప్రధాన రాగములను ఘనరాగ పంచకమని నిర్దేశించుటయు, ఆరాగములలో ప్రత్యేకించి వాగ్గేయకార చక్రవర్తియగు త్యాగబ్రహ్మ ధాతు మాతువుల గంభీరత స్పష్టపడునట్లుగా అయిదు కృతులను రచించుటయు. గమనించినచో, రాగ ప్రపంచమున కలిగిన మార్పులును, వాటికి శాస్త్రకారులు ప్రామాణికత్వమును కల్పించి, వాగ్గేయకారులకు నూత్న మార్గములను చూపి దోహద మొసంగుటయు మనకు ద్యోతకము కాగలదు. ఇట్లే గ్రామముల సందర్భమునను శాస్త్రకారులు విభిన్న మతములను, ఆయా కాలములనాటి ప్రాధాన్యమునుబట్టి ప్రమాణములు మారుటయు మనము తెలిసికొనగలము. షడ్జ, మధ్యమ, గాంధార గ్రామములలో గాంధార గ్రామము సప్తస్వరములు కలదియై గానయోగ్యముగ నున్నదని ప్రాచీన లక్షణకర్తయైన రామామాత్యుడు చెప్పియుండెను. అన్ని దేశీయరాగములు నీషడ్జ గ్రామమునకు చెందినవే యని కూడా ఆతడు పేర్కొనెను. పంచమమునకు ఒక శ్రుతి మాత్రము తక్కువగా నుండి, సప్తస్వరములుకల మధ్యమ గ్రామముకూడా గానయోగ్యమైనదనియే శాస్త్రకారు లభిప్రాయ పడిరి. ఇక మూడవదగు గాంధార గ్రామము సప్తస్వరములు కలదైనను, మానవప్రాణికి గానయోగ్యము కాని వికృతస్వరములతోకూడి యుండుటచే, ప్రాచీనలక్షణ కారులే ఊరక శాస్త్రమున ఈగాంధార గ్రామమున్నదను విషయమును చెప్పుటయేకాని, వ్యవహారమునుండి దానిని తొలగించిరి. నాట్యశాస్త్రముకూడ దీనినిగూర్చి ప్రస్తావింపకపోవుటకూడ దీనికి ఉపబలక ము. ఇట్టి యెడ వాగ్గేయ కారులకును, గాయకులకును, శాస్త్రజ్ఞానమువలన కలుగు ప్రయోజనమును గూర్చి చెప్ప నవసరములేదు.

ఇక తాళ విషయమునకూడ శ్యామశాస్త్రిచే కనిపెట్టబడిన 'శరభానంద తాళము', రఘునాథనాయకునిచే కనిపెట్టబడిన 'రామానంద తాళము' మున్నగువాటిని గూర్చి పరిశీలించినచో, సమర్థుడగు వాగ్గేయకారుడు సృష్టియొనర్చుచో నూతనతాళాదులు కూడ స్వీకార యోగ్యములే యను నంశము స్పష్టపడి ఆధునిక వాగ్గేయకారులకు శాస్త్రము ప్రోత్సాహము కల్గింపజాలుచున్నది. లక్ష్యలక్షణ గీతములు రచించిన వెంకటమఖి, పురందరదాసు మున్నగు శాస్త్రకారులచే గానప్రపంచమునకు కలిగిన మేలు అనూహ్యము. ఈ సందర్భమున మతంగుడు 49 దేశీప్రబంధములను పేర్కొని యుండుటయు, శార్జదేవుడు 75 ఇతర ప్రబంధములను పేర్కొనియుండుటయు, ప్రాచీనములగు, ఠాయాదిప్రబంధములకు, సూళాదులకు గల తారతమ్యములను గుర్తించి ఆయా లక్షణ భేదములను శాస్త్రప్రమాణ పూర్వకముగ శాస్త్రజ్ఞులు ప్రజల కర్పించుటయును గమనింపదగినది.

ఈ పట్టున గమనింపదగిన ఇంకొక ముఖ్యాంశము కలదు. పదకవితాపితామహుడని ప్రసిద్ధినొందిన తాళ్ళపాక అన్నమాచార్యులు గానశాస్త్రమున తనకు పూర్వము వ్యవహారమునందున్న సంగీత రచనలకు పదము, గేయము అను పేర్లు కలవనియు, తాను సృజించిన ఒకానొక సంగీత రచనను 'సంకీర్తన'మని వాడ దగుననియు సూచించెను. సంకీర్తనమను సంగీతరచనకు సంస్కృతమున “హరేర్వా, ప్రభోర్వా, కీర్తనమ్ సంకీర్తనమ్" అను నిర్వచనము కన్పడుచున్నది. ఈ సంకీర్తనమే' కీర్తనమై గాయక త్రిమూర్తులలో నొకడు త్యాగబ్రహ్మరచనాకాలము నాటికి 'కృతీనామ సౌభాగ్యము' వడసినది. 'కృతి'యను పదమున నిపుణుడగు వాగ్గేయకారుని రచనాచాతుర్యమే ప్రధానముగ ధ్వనించుచున్నది. ఈ పరిణామములన్నియు ఆ యాకాలపు శాస్త్రకారుల ఆమోదముద్రను పొందుచునే వచ్చినవి. దీనికిగల మూలకారణమేమన ప్రసిద్ధులగు ఏ వాగ్గేయకారులు కాని, తమతమ రచనలకు పరమేశ్వర లీలాసంకీర్తనమును ఆదర్శముగ తీసికొనుటను నిరాకరింపక యే అమేయము, అపారమునగు స్వకీయప్రజ్ఞలను ప్రదర్శించి గానకళను అత్యున్నతస్థితికి తీసికొనివచ్చుటయే. కావుననే, సుప్రసిద్ధ వాగ్గేయకారకుడైన క్షేత్రయ్య మధురభావ భక్తిపూర్వకముగ శృంగార పదరచనము నొనర్చి, అతని రచనమునకు ఆలంబనముగ గోపాలదేవు నాశ్రయించుటయు కల్గినది. సంగీత కళయందు రసికత పెచ్చు పెరిగి కేవల శృంగారమునకు దారితీసినను విశ్వ శ్రేయోపాదనమే ప్రధాన కర్తవ్యముగ శిరసావహించిన 'మాబ్రహ్మనిరాకరణమస్తు'అను శ్రుతివాక్యమును ఏ మరజాలక పోయిరను నంశము తెల్లమగుటయేకాక “కం - పరమాత్మానం -లాతి గృహ్ణాతీతి" (పరమాత్ముని గ్రహించునదియే కళ) అను కళాశబ్దముయొక్క నిర్వచనమునకు భంగము రాకుండ 'హరిసంకీర్తనమును కాని, ప్రభుసంకీర్తనమును కాని చేయునది'యే కీర్తనమని-కీర్తన లక్షణమును శాసించి యుండిరనిన, 'గానకళ' లౌకిక ప్రయోజనములకు కాక, ఆధ్యాత్మిక ప్రయోజనములకే నిర్దేశింపబడవలయునని శాస్త్రజ్ఞులు సంకల్పించియుండిరని తెలియుచునే యున్నది. కావుననే "సంగీతవిజ్ఞానమే కంహి సాక్షాన్మోక్షప్రదాయకమ్" అనికూడ నొక్కి చెప్పుటయు సంభవించినది.

ఇంతకంటె గానశాస్త్రమువలన గానకళకు సిద్ధించు పరమప్రయోజనము ఇంకొకటి యేమికలదు? ఇంత కంటెను సూక్ష్మముగ శాస్త్రమును పరిశీలించినచో బయల్పడు నొక మహారహస్యము గమనింపుడు. వాగ్గేయకార లక్షణముల నిచ్చుచు 'రోషద్వేషపరిత్యాగమును, సార్ద్రత్వమును, ఉచితజ్ఞత్వమును' వాగ్గేయకారునకు విధిగా నుండదగు గుణములుగా శాస్త్రకారులు నిబంధించి యుండిరి. రోషద్వేషములవలన అనాలోచితముగ ప్రబంధములయందు సంధింపబడు కటువాక్యరచనాదులను ఎంత సూక్ష్మదృష్టితో శాస్త్రకారులు నిషేధించిరో, గానకళవలన లోకమున కెట్టి భద్రస్థితిని వారు ఆమంత్రించి యుండిరో ఊహింపనగును.

భరతముని కాలమునుండి వ్యవహారమునందున్న 'ఆంధ్రి' యను రాగపుపేరునుబట్టి ఆంధ్రదేశమునందలి సంగీతాభిమానమునేకాక, ఆనాడే ఆంధ్రులొక ప్రత్యేక సంగీతశాఖను వెలయింపగలిగిన ప్రజ్ఞావంతులుగ నుండిరను నంశము స్పష్టపడుచున్నది. అంతియేకాక దేశీయ, విదేశీయ, అంతరరాష్ట్ర గానపద్ధతులలోకల భేదములను, ఆయాపద్ధతుల సమ్మేళనమువలన కలుగు నూతన సృష్టిని గుర్తింపగల్గుట శాస్త్రాధారమువలననే. ఉదాహరణమునకు హిందూస్థానీ కర్ణాటక సంగీతములను తీసికొనవచ్చును.

ఇక ఒక్కొక్క నిషిద్ధస్వర వర్ణసమ్మేళనముతోకూడిన విరుద్దరాగముల మేళనమువలన కలుగు ఉత్పాతములను తెలియజేయునది శాస్త్రమే. అట్లే అనుకూల రాగ, స్వర, వర్ణసమ్మేళనము నెరుకపరచుటకును శాస్త్రమే సమర్థమైనది. తత్తత్కాలాలాపనోచిత రాగజ్ఞానము కల్గించుటకును శాస్త్రమే ఆధారము. దీపకాది రాగములచే కల్గు విదాహకత్వమును పరిహరించుటకు మేఘరంజన్యాది రాగములు సమర్థములను విషయపరిజ్ఞానము శాస్త్రము మూలమునగాక ఎట్లు లభ్యపడును? అద్భుతశక్తి, మహత్తర ప్రజ్ఞయు కల గానకళచే అధిక సస్యోత్పత్తి సాధించుట, తలంచినపుడు వర్షములు కురిపింప జేయగల్గుట, పశువులకు అధికక్షీరోత్పత్తి కలిగించుట, అసాధ్య రోగనిదానము కలిగించుట మున్నగు అద్భుత సంఘటనలు, అద్భుత పరిణామములును కల్గించుటకు వలసిన స్వర, రాగ, వర్ణ సమ్మేళనమును గూర్చి తెలుపునదియు శాస్త్రమే.

గానశాస్త్రమువలన గానకళకు కలుగు ప్రయోజనములు అనంతములు. ముఖ్యముగ కళను విశ్లేషించి కళాస్వరూపము తెలియజేయుటకును, కళను అవినింద్యముగ అభివృద్ధి యొనర్చుటకును, లోకకళ్యాణమునకై కళను ఆవర్తింప జేయుటకును శాస్త్రము చక్కగ తోడ్పడును.

ఊ. ల.

[[వర్గం::సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము-వ్యాసాలు]]