సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/గతితార్కిక భౌతికవాదము

గతితార్కిక భౌతికవాదము :

కారల్ మార్క్స్, ఫ్రెడెరిక్ ఎంగెల్స్ అనువారు సుప్రసిద్ధమైన తమ ఆర్థిక శాస్త్ర గ్రంథములలో వివరించిన రాజకీయ తత్త్వ సిద్దాంతమునకు గతితార్కిక భౌతిక వాదమని పేరు. 1917 వ సంవత్సరమున రష్యాదేశ మందు కమ్యూనిస్టు వ్యవస్థ నెలకొనినప్పటినుండి, ఆ దేశ మందును, ప్రపంచమందలి ఇతర సామ్యవాద దేశము లందును ఈ గతితార్కికవాదము అధికారిక సిద్ధాంతమైనది.

గతితార్కిక భౌతికవాద మనగా నేమి ? భౌతిక వాద మొక శాస్త్రీయమైన తాత్త్విక సిద్ధాంతము. భౌతికవాదము బహుభంగుల నిర్వచింపబడి వివరింపబడి ఉన్నది. అన్ని దృక్పథములందును ఒక అంశము సర్వసాధారణ మైనది (common) గా నున్నది. ఈ విశ్వమున మనస్సునకు స్వతంత్రమైన, ఐచ్ఛికమైన ప్రవృత్తిలేదు. దాని ప్రవృత్తి మానసేతర విషయముల యొక్క (non-mental entity) చలనముచే తుదకు నిర్ణయింపబడును. ఆ చలనములను మనస్సు తనయం దిముడ్చుకొని పర్యాలోచన చేయును. ఇట్టి మానసేతర విషయము సామాన్యముగా భౌతిక పదార్థమని భావింపబడుచున్నది. కొందరు భౌతికవాదులు మనస్సు యొక్క అస్తిత్వమును పూర్తిగా నిరాకరింతురు. కాని స్వతంత్రమైన చొరవ (Initiative) మనస్సునకు లేదను విషయమున మాత్రము భౌతికవాదు లందరును ఏకీభావము ప్రకటించెదరు. కారల్ మార్క్స్ రెండవ బృందమునకు చెందినవాడు. ప్రాచీన, ఆధునిక తత్త్వశాస్త్రములను మార్క్స్ రెండు తరగతులుగా వర్గీకరించెను : (1) పదార్థము (Matter) మనస్సుకంటె తార్కికముగను (logical), కాలక్రమాను గతముగను (chronological), ముందరిదే (prior) నని విశ్వసించెడి భౌతికవాదులు. (2) మనస్సు పదార్థము కంటె తార్కికముగను, కాలక్రమానుగతముగను పూర్వపుదే నని భావించెడి ఆత్మవాదులు. వీరిలో మార్క్స్ మొదటి తరగతికి చెందినవాడు. కాని 18, 19 వ శతాబ్దుల నాటి భౌతికవాదులకంటె మార్క్స్ భిన్నాభిప్రాయము గలవాడు. ఈ శతాబ్దులనాటి భౌతికవాదులు ప్రతిపాదించిన సిద్ధాంతము ప్రకారము మనస్సు మైనము వంటి పదార్థమని తెలియుచున్నది. బాహ్య ప్రపంచమునుండి ఈ పదార్థముపై ఇంద్రియ గ్రహణముల (sensations) వలె భావముద్రలు (impressions) ప్రసరించును. ఇట్టి భౌతిక వాద సిద్ధాంతము నెడల మార్క్స్ తన ఆక్షేపణము ప్రకటించెను. కారణమేమన, బాహ్య ప్రపంచమునుగూర్చి 'తెలియుట' (Knowing = మననము లేక ధ్యానము చేయుట) అను భావము లేదనియే అతడు వాదించును. తద్విరుద్ధముగా, బాహ్యప్రపంచము నుండి బయలువెడలు భావ పరంపరల నుండియు, సంఘటనల నుండియు కలుగు మానసిక పరివర్తనలచేతనే మానవుడు ఏ ఆలోచననైనను, కార్యమునైనను చేయనారంభించునని మార్క్స్ అభిప్రాయము. బాహ్య ప్రపంచమును తెలిసికొనుటయే గాక, దానిని పరివర్తనము చేయుట మానవ ప్రవృత్తిలో గల సార్థక్యము. బాహ్య ప్రపంచమును గూర్చి తెలిసికొనుట వలననే మనము తృప్తిపడుట లేదన్న అంశమును కాదనలేము. కాని బాహ్యప్రపంచమును తెలిసికొనుట మాత్రమే మానవుని ధ్యేయము కాగూడదు. ఏదేని యొక కార్య మాచరించుటకే మన మొక విషయమును తెలిసికొందుము. ఆచరణకు అన్వయింపబడని ఎట్టి జ్ఞానమైనను స్వతంత్రముగ మానవునకు సంక్రమింపజాలదు . సిద్ధించిన జ్ఞానముతో తెలిసికొనిన పదార్థమును మార్చుట వలననే, అట్టి జ్ఞానము సార్థకమగును. కార్యాచరణము వలననే పరిసరముల ప్రభావము మారును. ఆ కార్యాచరణము వలననే కర్తగూడ మారగలడు. ఈ విధముగ మానవ ప్రకృతి గాని, లేక విశ్వము గాని, చలనరహితముగ నుండదని మార్క్స్ యొక్క విశ్వాసము. మానవుడును, ఆతని ప్రకృతియు నిరంతరముగ పరివర్తనము చెందుచు, అతనితో పాటు నిర్విరామముగ మారెడు విశ్వమును గూర్చి జ్ఞాన మార్జించుచు, తనకు సిద్ధించిన జ్ఞానముచే ఇతోధికముగ మార్పును కలుగజేయుటకై ఆతడు ఉత్సాహముతో ఉద్యమించును.

ఇట్టి భౌతికవాదరూపమునకు 'గతితార్కికము' అను విశేషణపదమును చేర్చుటచే, సామాజిక పరిణామమునకు గతితార్కిక సిద్ధాంతములను అన్వయముచేయు పునాది ఏర్పడుచున్నది. గ్రీసుదేశములో ప్రప్రథమముగా 'గతితార్కికము' అను పదము ప్రయోగింపబడెను. ప్రత్యర్థుల నడుమ చర్చలమూలమున వాస్తవవిషయమును తెలిసి కొనుటయే 'గతితార్కికము' అను పదమున కర్ణము . హెగెల్ అభిప్రాయమును బట్టి, మానవజీవితానుభవముల యొక్కయు, చారిత్రకానుభవముల యొక్కయు సంఘర్షణమే గతితార్కికవాదమున కర్థము. భావములు, అనుభవములు, సంఘటనలు సంఘర్షించి ఒకదానిపై మరొకటి ఆధిపత్యము వహించు క్రమవిధానములో నొక సంయోగీకరణము (Synthesis) ఉద్భవించును. సంఘర్షించు ఇరుపక్షములందలి కొన్ని సత్యములు సంయోగీకరణమందు ప్రవేశము కల్పించుకొనును. ఇట్లు సాధింపబడిన సంయోగీకరణము మరల నొక నూతన సంయోగీకరణ మగును. ఇట్లీ విధానము నిర్విరామముగను, చర్వితచర్వణముగను కొనసాగుచు, ఒక సంయోగీకరణము కంటె, దాని తరువాతి సంయోగీకరణము నిర్మలమైనదిగను, ఉన్నతమైనదిగను రూపొందును. తార్కిక చర్చలను ప్రతిబింబింపజేయు ఈ విధానమునకు మార్క్స్ 'గతితార్కిక ' మని పేరిడెను. ఈ విధాన క్రమమును క్రమపద్ధతిలో కొనసాగించినచో, తుట్టతుదకు, సచ్చిదానందమయ మగు సత్యమును గ్రహింపనగును. కాని మార్క్స్, ఎంగెల్సులు ఈ భావమును నిరాకరించిరి. మానవ మేధస్సును ప్రతిబింబించుచు, విభిన్నములయిన భావనారీతులలో పరివర్తన నొందు ఆదర్శవంతమైన విశ్వము తప్ప, మార్క్, ఎంగెల్స్ ఇద్దరును మరొక విషయము భావన చేయలేదు.

మార్క్స్, గతితార్కిక భౌతికవాద సూత్రమును చారిత్రక, సామాజికగతులయొక్క వివరణపరముగా అన్వయించెను. దీని ఫలితముగా, మార్క్సిస్టు తత్త్వశాస్త్రమనునది పరిణామ మొందెను. ఎంగెల్స్ ఈ తత్త్వశాస్త్రమును గూర్చి ఇట్లు వ్యాఖ్యానించెను. “మానవ జీవితాధారములైన పదార్థముల ఉత్పత్తి, ఉత్పత్తియయిన పరార్థముల వినిమయము (exchange) మాత్రమే సామాజిక నిర్మాణమునకు పునాది యగును. ఈ ప్రతిపాదనము నుండియే చరిత్రయొక్క భౌతికవాదభావన ప్రారంభమగును. మానవచరిత్రలో గత సామాజికవ్యవస్థలయందు ధనము పంపకము జరిగిన విధానము, సమాజము వర్గములుగా విభజింపబడిన తీరు - ఈ రెండును ఉత్పత్తియైన పదార్థములపైనను, ఉత్పత్తివిధానము మీదను, సరకులు వినిమయ మయ్యెడి క్రమముపైనను ఆధారపడి యుండెను. ఈ దృక్పథము ననుసరించి, సాంఘిక పరివర్తనములకును, రాజకీయ విప్లవములకును గల కారణములు మానవుల మనస్సులయందును, బాహిరములైన సత్యములందును, న్యాయములందును గాక, ఉత్పత్తి, వినిమయ విధానములందు మాత్రమే కాననగును. అనగా, ఆ కారణములు తత్త్వశాస్త్రమందుగాక, ఆయా ప్రత్యేక సామాజిక వ్యవస్థలయొక్క ఆర్థికవిధానములందు మాత్రమే గోచరించును. ఈనాటి సాంఘికసంస్థలు అక్రమమైనవనియు, అన్యాయమైనవనియు, న్యాయము అన్యాయముగను, ధర్మము అధర్మముగను పరిణమించిన స్థితి కలవనియును స్పష్టమగుచున్నది. ఉత్పత్తి, వినిమయ విధానములలో పరివర్తనములు శాంతముగను, సౌమ్యముగను జరుగుటవలననే పైని పేర్కొన్న సత్యము ధ్రువపడుచున్నది. ప్రాచీనపరిస్థితులతో ముడివడిన సాంఘికవ్యవస్థ ఆథునిక పరిస్థితులకు సరిపడదు. ఆకాలపు వ్యవస్థలయందు పొడసూపిన అసంబద్ధములే అనంతర కాలములో మారిన ఉత్పత్తివిధానములందును మరొక రూపములో ప్రత్యక్షమైనవని పై అంశములవలన తేటపడుచున్నది."

కారల్‌మార్క్స్, ఎంగెల్స్‌లచే ప్రతిపాదింపబడిన సిద్ధాంతముయొక్క వివరణమునుబట్టి ముఖ్యమైన రెండు విషయములు ఉత్పన్న మగుచున్నవి. (1) సంఘర్షణములచే సమాజములో పరివర్తనము లేర్పడును. ఈ సంఘర్షణములు ఏ మానవుని మనస్సునుండి బయలుదేరునవి కావు. అవి మానవుని వాంఛలయందుగాని, లేక భావముల యందుగాని పొడచూపవు. కాగా, ఆ సంఘర్షణములు ఉత్పత్తిక్రమములందే ఉద్భవించును. ఈ ఉత్పత్తి విధానములందే సామాజిక పరివర్తన క్రమము గూడ గోచరమగును. (2) సాంస్కృతిక జీవితమునకు రూపము కల్పించు వివిధ విషయములు నైతిక, మత, న్యాయ, కళాత్మక సంస్థలన్నియు ప్రాథమిక ఆర్థిక నిర్మాణము యొక్క ఉపఫలములు (Bye-Products).

ఈ సిద్ధాంతమునే ఇంకను విపులీకరించినచో ఈ క్రింది అంశములు విదితములగును.

మానవులకు, పదార్థములకు ఎల్లపుడును పరస్పర సంబంధము కలదు ఈ సంబంధము కారణముగా మాన వులకు మానవులకు నడుమ అన్యోన్య సంబంధము లేర్పడుచున్నవి. దీని ఫలితముగా కార్మికలోకములో పని విభజనము (Division), శ్రామికులలో ప్రత్యేక నైపుణ్యము (Specialization of Labour), కార్మికుల హక్కులు, వారిని పీడించుట (Exploit) కు తోడ్పడు చట్టములు, అదేసమయములో శ్రామికులపీడను (Exploitation) నివారించుటకై కొన్ని ఉత్తరువులు తయారగును. ఇట్టి పరిణామములన్నియు మానవునకు మానవునకు నడుమ పరస్పర సంబంధములుగా మారును.

ఇట్టి సంబంధములు మానవ చరిత్ర మొదలైననాటి నుండి నేటివరకు కొనసాగుచునే ఉన్నవి. వివిధ సామాజిక వ్యవస్థల చారిత్రక పరిణామ దశలలో శ్రామికుల పీడన విధానము పెక్కు రూపములు ధరించెను. బానిస సమాజము, ఫ్యూడల్ (జమీందారీ) సమాజము, పెట్టుబడిదారీ సమాజము పరిణామముచెందిన దశ లన్నిటిలో ఒక వర్గము మరియొక వర్గమును పీడించినట్లు మనకు బోధ పడగలదు.

మానవుల పరస్పర సంబంధములలో కలుగు మార్పుల వలన, సాంకేతిక విధానములలో సంభవించు పరిణామముల వలన, శాస్త్ర పరిశోధనల వలన, నూతనావిష్కరణముల వలన మానవుని విజ్ఞానము, నైపుణ్యము అభివృద్ధి కాగలవు. వాని మూలమున ఉత్పత్తిస్థానములను నిర్మించు నూతన మార్గములను అవలంబించుటకు అవకాశమేర్పడుచున్నది. ఈ నూతన నిర్మాణములు, నూతన ఆర్థికనిర్మాణ రూపములను నిర్ణయించును. ఈ నూతన ఆర్థిక నిర్మాణములు మరల సమాజమును ఒక దశ నుండి మరొకదశకు అభివృద్ధిపరచుటకు మార్గమును సుకరముచేయును.

సమాజము యొక్క ఏ అభివృద్ధి దశయందైనను, ఆ సమాజము యొక్క నైతిక, న్యాయజీవిత విధానము, దాని యొక్క మౌలిక ఆర్థిక నిర్మాణము ప్రతిబింబించును. ఉదాహరణమునకు బానిసదశ యందు ఆనాటి సమాజము నైతికముగను, న్యాయశాస్త్ర ప్రకారముగను బానిస వ్యవస్థనే సమర్థించెను. అందుచే రాజకీయ విధానములు, ప్రభుత్వ చట్టములు, మతము, కళలు, నైతిక నియమములు ఆ యా కాలములనాటి ఆర్థిక నిర్మాణమును నిర్థరించును.

వివిధసామాజికవ్యవస్థల యొక్క గర్భాశయములందే ఆ వ్యవస్థలు అంతరించెడి బీజములు ఇమిడియున్నవని మార్క్స్, ఎంగెల్స్‌లు సిద్ధాంతీకరించిరి. ఈ కారణము వలననే సమాజము ఒకదశ నుండి వేరొకదశకు మారుచు అభివృద్ధినొందుచున్నది. ఈ మార్పులు శాంతముగను, నెమ్మదిగను, క్రమానుగతముగను కాక. వేగముగను, ఉగ్రముగను జరుగుచున్నవి. దీనికి కారణములు గలవు. ఆర్థిక నిర్మాణ ప్రాతిపదికపై పెరిగి, పెంపొందు రాజకీయ, న్యాయ, నైతిక సంస్థలు వాటికి అనువగు జీవిత విధానమును సృష్టించుకొనును. ఆర్థిక విధానము తలక్రిందై విచ్ఛిన్న మగుచున్నను, ఈ సంస్థలు జలగల వలె తమ స్థానములను అంటిపెట్టుకొని చిరకాలము బ్రతుకుటకు ప్రయత్నించును. ఇట్లే స్వప్రయోజనములను పరిరక్షించుకొనుటకై పాలకవర్గము (Governing Class) గూడ తన ప్రత్యేక హక్కులను (privileges) వదలక పట్టుకొని వ్రేలాడును. ఇట్టి పాలకవర్గము సంఘర్షణము, పోరాటము లేకయే తన అధికారమును పరిత్యజింపదు. శాస్త్రీయ పరిశోధనముల వలన, ఉత్పత్తి రంగములో, నూతనమైన సాంకేతిక ఆవిష్కరణముల వలన జరుగు పరివర్తనములు క్రమానుగతము లగుచుండగా, రాజకీయ జీవిత విధానములో జరుగు మార్పులు ఉద్రేకపూరితము లగుచున్నవి.

మార్క్స్, ఎంగెల్స్‌లు ప్రతిపాదించిన ఈ గతితార్ధిక సిద్ధాంతము కొందరిచే తీవ్రముగా విమర్శింపబడెను. వీటిలో వేదాంతశాస్త్రము నెడల భక్తిప్రపత్తులు ప్రకటించని సిద్ధాంతము ప్రధానమైనది. పెక్కు సామాజిక సంఘటనలను మనము చరిత్ర యని పిలిచెదము. ఈ చారిత్రక సంఘటనలను వ్యక్తీకరించుటలో వేదాంతమునకు కొంత స్థానము కలదు. మార్క్స్ ఈ విషయమును ఊహించెను. కాని తత్త్వమీమాంసకు వాస్తవ విషయములతో గల సంబంధము నిస్సారమైన వ్యాసంగమని ఆతని అభిప్రాయము. సిద్ధాంతమునకును, దాని ఆచరణమునకును నడుమగల సమైక్యముయొక్క ఆవశ్యకమును గూర్చి మార్క్స్ నొక్కి చెప్పెను. ఆలోచన (భావన) మానవుని కార్యవాదిగా చేయును. కార్యము లేనిదే ఆలోచన నిష్ప్రయోజన మగును. ఈ రెండింటికిని అవినాభావ సంబంధము కలదు. ఒకటి లేనిదే మరొకటి ఉండదు. ఈ కారణముచే, మార్క్స్ తన గతితార్కిక భౌతిక వాద సిద్ధాంతమును ఇతరములైన తాత్వికభావములతో మిళితము చేయలేదు. వేదాంత విషయములకును, వాస్తఒక విషయములకును ఎట్టి సంబంధము లేదని గూడ ఆతడు వాదించెను. ప్రపంచమన నెట్టిదో తెలిసికొనుటకై వేదాంతము సంప్రదాయముగ ఒక సాధనముగ మాత్రమే ఉపయోగపడుచున్నదని ఆత డెరుగును. కాగా, వాస్తవమును తెలిసికొనుట యనగా, విధిగా దానిని పరివర్తనము చేయుటగూడయని మార్క్స్ సిద్ధాంతము బోధించును.

మార్క్స్ సిద్ధాంతములకు వ్యతిరేకముగా మరికొన్ని విమర్శనములు బయలుదేరినవి. చారిత్రక పరిణామదశలో విభిన్నాంశములు ఇమిడియున్నవి. మార్క్స్ నుడివినట్లు, ఆర్థిక కారణములచే బ్రహ్మాండమైన శక్తులు ఉద్భవమగునను విషయమును అంగీకరించినను, బెర్ట్రాండ్ రస్సెల్ చెప్పినట్లు, అవన్నియు ఒక్కొక్కప్పుడు దురదృష్టకరములైన స్వల్పసంఘటనలమీద ఆధారపడియుండును. ఈ సంఘటనలే చారిత్రకసంఘటనలను నిర్ధరించును. ఒక సంఘటన జరుగుటకు పెక్కు పరిస్థితులు కారణభూతములగును. మానవుడు అవన్నియు తెలిసికొనజాలడు. అందుచే ఆర్థికకారణములు మాత్రమే బ్రహ్మాండమైన శక్తులను సృష్టింపగలవని చెప్పుట సరియైనది కాదు.

ఇదియేగాక, లిఖితపూర్వక మైన చారిత్రకాంశములకు ఒక్కొక్క సమయములో గతితార్కిక సిద్ధాంతము అన్వయమగునట్లు కన్పింపదు. పెట్టుబడిదారీ విధానమునకు కమ్యూనిస్టు విధానము ప్రత్యర్థియని గతితార్కిక వాదము ఒక వంక సిద్ధాంతీకరించుచునే, మరొకవంక పెట్టుబడిదారీ విధానములో గల సద్విషయములను కమ్యూనిస్టు విధానము తనలో ఇముడ్చుకొనగలదని వాదించును. కాగా, ఉదాహరణమునకు, అంతర్జాతీయ ఉద్రిక్తత యుద్ధమునకు త్రోవతీసి, నాగరికతయంతయు నశింపగా, ఆ తర్వాత కమ్యూనిజముకాక, అనాగరికత మాత్రమే విలయతాండవము చేయగలదుకదా ! అణు, ఉదజనిబాంబులు ఈనాడు కలిగింపగల వినాశమును మార్క్స్ తన కాలములో ఊహింపలేదు. అందుచే అతడు ప్రతిపాదించిన గతితార్కిక భౌతిక వాదము అన్నివిధముల అప్రామాణ్యమైనది.

శ్రీ. శ్రీ.