సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/క్లార్కు జాన్ బేట్సు

క్లార్కు జాన్ బేట్సు (Clark J. B. ):

క్లార్కు జాన్ బేట్సు అను నతడు అమెరికన్ అర్థశాస్త్రవేత్తలలో అగ్రేసరుడు. ఇతడు 1847 సం. జూన్, 26 వ తేదీయందు న్యూయార్కు నందలి ప్రావిడెన్సు ప్రాంతములో జన్మించెను. అంహర్ట్స్ కళాశాలయందును, హెడెల్ బెర్గు. జూరిచ్ విద్యాలయము లందును ఇతడు విద్య నభ్యసించెను. 1872 లో అంహర్ట్స్ కళాశాల నుండియే ఇతడు పట్టభద్రుడయ్యెను. ఇతడు జర్మనీలో నుండగా జర్మన్ చారిత్రక ఆర్థిక వేత్తల (Historical school) చేతను ప్రభావితుడయ్యెను.

జాన్ బేట్సు అమెరికాకు తిరిగివచ్చిన తర్వాత 1877 సం. లో కార్లటన్ కళాశాలలోను, 1882 సం. లో స్మిత్ కళాశాలలోను, 1892 లో జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయములోను, 1893 లో అంహర్ట్స్ కళాశాలలోను అధ్యాపకుడుగా నుండెను. పిదప 1893 - 1895 సం. ల మధ్య అమెరికన్ ఆర్థిక మండలికి అధ్యక్షుడుగను, 1895-1923 సం.ల మధ్య కొలంబియా విశ్వవిద్యాలయము నందు ఆచార్యుడుగను ఇతడు పనిచేసెను. 1911 లో కార్లీజ్ ధర్మకర్తృత్వ నిధియొక్క ఆర్థిక శాఖకు ప్రధానాధికారిగా నియమింపబడెను. అనంతరము స్వీడిష్ శాస్త్రకళాపరిషత్తు (Swedish Royal Academy of Arts and Sciences) లో ఇతడు సభ్యుడయ్యెను. అంహర్ట్స్, ప్రిన్స్‌టన్ మొదలగు విశ్వవిద్యాలయములు ఇతనిని గౌరవ డాక్టర్ పట్టములతో సన్మానించెను.

1. ఇతడు సంపద, దాని తత్వము (Philosophy of wealth, 1895), 2. పెట్టుబడి, దానిపై లాభములు (Capital and its earnings 1888), 3. వేతనములు (Wages 1889), 4. సంపద, దాని పంపకము (The distribution of wealth 1901). 5. ట్రస్టులు - వాటిపై కట్టుబాటు (The Control of Trusts 1901) 6. గుత్తవ్యాపార సమస్య (The Problem of monopoly 1904), 7. ఆర్థిక సిద్ధాంతములలోని ప్రధానాంశములు (Essentials of Economic Theory) అను గ్రంథములను రచించెను.

క్లార్కు జాన్‌ బేట్సు తొలి రచనలలో జర్మన్ చారిత్రకుల యొక్కయు, అర్థశాస్త్రవేత్తల యొక్కయు ప్రాబల్యము గోచరించును. 'పంపకములో న్యాయమునకు పోటీ అవసరము' అను సూత్రమును ఇతడు ఖండించెను. ఉత్పత్తికి కారణములుగ పూర్వ రచయితలచే పేర్కొనబడిన వర్గములుకూడ ఇతని ఖండనమునకు గురియయ్యెను. అందుచే ఇతడు ఇతర అర్థశాస్త్రవేత్తల విమర్శనమునకు గురికావలసి వచ్చెను. ఎట్లైనను అమెరికను ఆర్థికసిద్ధాంత రంగములో ఇతని సూత్రములు ఒక తరముపాటు మిక్కిలి పలుకుబడితో విలసిల్లెను. ఆర్థికరంగములో సచేతనములును, అచేతనములును అగు శక్తుల మధ్యగల వ్యత్యాసములను ఇతడు తెలిపెను. గుత్తవ్యాపారములో గల అనర్థమును నివారించుటకు స్వతంత్రయోచనతో కూడి ఆచరణీయములైన ప్రతిపాదనలు ఇతడు చేసెను. ఇవి ఆర్థిక శాస్త్రవేత్తగా ఇతడు సాధించిన ప్రధాన విషయములు. ఇతడు 1939 సం. మార్చి. 21 వ తేదీన మరణించెను.

ఆర్. ఎన్. ఎస్.


క్ష