సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/కౌటిల్యుడు (రాజనీతిశాస్త్రము)

కౌటిల్యుడు (రాజనీతిశాస్త్రము) :

చాణక్యుడు, విష్ణుగుప్తుడు, ద్రమిళుడు అనునవి కౌటిల్యునకు నామాంతరములు. ఇతడు అర్థశాస్త్రము అను బృహద్గ్రంథమును రచించిన వాడుగను, క్రీ.పూ. 324 సం. నుండి క్రీ. పూ. 299 వరకు మౌర్యసామ్రాజ్య మును పాలించిన చంద్రగుప్త చక్రవర్తికి సామ్రాజ్య సంస్థాపన, పరిపాలనములందు ఆచార్యుడుగను, ప్రధానా మాత్యుడుగను ప్రఖ్యాతిగాంచిన బ్రాహ్మణో త్తముడు.

ఇతని జీవితమునుగురించి సత్యములని నిశ్చయముగ జెప్పదగిన వివరములేవియు తెలియవచ్చుటలేదు. ఇతని జన్మస్థానము తక్షశిల యని కొందరును, ద్రవిడ దేశ మని కొందరును, ఆంధ్రదేశమని కొందరును చెప్పుచున్నారు. జన్మస్థాన మేది యైనను ఇతడు తక్షశిలలో విద్యాభ్యాసము గావించి, సమస్త వేదశాస్త్రములందు ఉత్తీర్ణుడై, మగధ సామ్రాజ్యమునకు రాజధానియైన పాటలీపుత్రమున పండిత సత్కారమునకై ప్రభువులచే స్థాపింపబడిన విద్యా పీఠమునకు అధికారి యయ్యెను. కానీ ఏ కారణము చేతనో, చక్రవర్తి యగు ధననందుడు ఇతనిని ఆ పదవినుండి తొలగించి ఇతని క్రోధమునకు గురియయ్యెను. ఇదిగాక కౌటిల్యుడు క్రుద్ధుడగుటకు మరియొక కారణము కూడ నుండెను. ధననందుడు ప్రజలను పీడించి ధనమును సమ కూర్చు చుండుటకు తోడుగ అవైదికమగు జై నమతము ననుసరించి యుండెను. ఇది కౌటిల్యున కెంతమాత్రము గిట్టినది కాదు. అందుచేత ఇతడు ధననందుని రాజ్యభ్రష్టుని గావించుటకును, నందవంశమును నిర్మూలించుటకును, ప్రతిజ్ఞ బూని దానిని కొనసాగింప కృతనిశ్చయుడ య్యెను.

ఈ ప్రయత్నములో ఇతడు చంద్రగుప్తుని చూచుట సంభవించెను. చంద్రగుప్తుడు మౌర్యవంశమునకు చెందిన క్షత్రియుడు. ధననందుని బంధువర్గములోని వాడనికూడ చెప్పవచ్చును. కాని శైశవముననే అతడు నందునిచే త్యజింపబడి ఒక గ్రామమున ఒక గొల్లవాని ఇంటనో లేక వేటకాని ఇంటనో పెరుగుచుండెను. దేశసంచారము చేయుచు కౌటిల్యుడు ఒకప్పుడు ఆ గ్రామమును జేరి, చంద్రగుప్తుడు గ్రామములోని బాలుర ననేకులను జేర్చు కొని వారికి నాయకుడై వారితో ఆటలాడుచుండుట జూచెను. అతనియందు క్షత్రియలక్షణము లుండుటను కౌటిల్యుడు గ్రహించి, వేయిపణముల నతని పెంపుడు తండ్రికిచ్చి, అతనిని తనవెంట బెట్టుకొని తక్షశిలకు వెడ లెను. అచ్చట క్షత్రియోచితములగు విద్యల నన్నిటిని అతనికి నేర్పెను. దానిఫలితముగ చంద్రగుప్తుడు యోధా గ్రేసరు డయ్యెను.

అప్పటికి (క్రీ. పూ. 327 - 325 నాటికి) గ్రీకులకు రాజై న అలెగ్జాండరు భరతఖండముపై దండెత్తి, అందు లోని వాయవ్య భాగమును జయించి, దానిని పాలించు టకు తన ప్రతినిధులను కొందరిని నియమించి, వెనుకకు వెడలిపోయెను. మాతృదేశము విదేశీయుల పరిపాలనకు లోబడియుండుట కౌటిల్యుడును, చంద్రగుప్తుడును సహించినవారు కారు. “వై రాజ్యమున (విదేశీయుల పరిపాలనమునకు లోబడిన రాజ్యమున), ప్రభువు రాజ్యము తన స్వభూమి కాదని తలచుచు కర్మనాపవాహనము లొనర్చును; లేక రాజ్యమును పణ్యముగ జేసి లాభ మొందుటకు యత్నించును" అని అర్థశాస్త్రమందు కౌటిల్యుడు చెప్పి యేయున్నాడు. ఇవి గ్రీకుల పరిపాల నానుభవము నాధారముగ జేసికొని చెప్పినమాటలని తోచుచున్నది. విదేశీయపరిపాలన మూలమున కలిగిన ప్రమాదములనుండి ప్రజలను రక్షించి దేశమునకు స్వాతం త్ర్యమును సంపాదించుటకై కౌటిల్య, చంద్రగుప్తులు తీర్మానించుకొనిరి. అందుకై వారు శస్త్రోపజీవు లగు వారితో కూడినట్టియు, హిమాచల ప్రాంతములోని పార్వ తీయులతో కూడినట్టియు, సైన్యమును సమకూర్చుకొని గ్రీకులను, వారి ప్రతినిధులను యుద్ధమందు ఓడించి, ఇప్పటి పంజాబు, సింధు రాష్ట్రములను వశపరచుకొనిరి. కౌటిల్యుని బుద్ధిబలమును, చంద్రగుప్తుని భుజబలమును కలిసి సాధించిన విజయములలో ఇది మొదటిది.

అటుతర్వాత వారిద్దరు గొప్ప సైన్యములతో నంద రాజ్యముపై దండెత్తి, నందుని ఓడించి, సామ్రాజ్య మును వశపరచుకొనిరి. చంద్రగుప్తుడు సామ్రాజ్యమున కెల్ల పట్టాభిషిక్తు డయ్యెను. కౌటిల్యుడతనికి ప్రధానా మాత్యుడై అర్థశాస్త్ర సిద్ధాంతానుసారముగను, ప్రాచీన ధర్మానుసారముగను, రాజ్యపరిపాలనము నడపించి కాల ధర్మ మొందెను. తాను చంద్రగుప్తునికి తోడ్పడిన విధ మును స్మరించుచు, కౌటిల్యుడు అర్థశాస్త్రమందు,

“యేన శాస్త్రంచ శస్త్రంచ నంద రాజగతాచ భూః
అమరేణోద్ధృతాన్యాకు తేన శాస్త్రమిదం కృతం.

అని వ్రాసియున్నాడు.

కౌటిల్యుని ప్రఖ్యాతికి అతడు రచించిన అర్థశాస్త్రము కూడ దోహద మొసగుచున్నది.

అతనికి పూర్వమును, అతని యనంతరమును అనేకులు అర్థశాస్త్రములను రచించిరిగాని, అన్నిటిలో ఆతనిదే ఉత్తమోత్తమ మైనదని చెప్పదగియున్నది. రాజ్య సంపాదన, పరిపాలనమునకు సంబంధించిన వివిధ విషయ ములను ఆతనివలె విపులముగ వివరించిన వారెవ్వరు లేరు. ఇదిగాక, కౌటిల్యుడు పండితుడుమాత్రమే కాక లౌకిక వ్యవహారములందును అత్యంతానుభవము సంపాదించిన వాడు. అందుచేత అతడు వివరించిన పరిపాలనవిధానము ప్రయోగాధారమై, ఆచరణయోగ్యముగ నున్నది.

ప్రస్తుతము ప్రచారములో నుండు కౌటిల్య అర్థ శాస్త్రము అతడు విరచించినది కాదనియు, అతని సంప్ర దాయము ననుసరించిన పండితులు కొందరు అతనికి తర్వాత మూడునాలుగువందల సంవత్సరములకు దానిని రచించిరనియు, ఒక వాదము కలదుగాని, అది సమర్థ నీయమగు వాదము కాదు. గ్రంథమందలి

“సుఖగ్రహణ విజ్ఞేయం, తత్త్వార్థ పదనిశ్చితం కౌటిల్యేన కృతం శాస్త్రం, విముక్త గ్రంథవిస్తరం." “సర్వ శాస్త్రాణ్యను క్రమ్య ప్రయోగ ముపలభ్యచ కౌటిల్యేన నరేంద్రార్ధే శాసనస్య విధిః కృతః." ఇట్టి శ్లోకములు అతని కర్తృత్వమును స్థిరపరచు చున్నవి. కౌటిల్యుడు తన గ్రంథమునకు అర్థశాస్త్రము అను పేరు పెట్టియున్నను, అందు వివరింపబడిన విషయములు ఎక్కువగ రాజనీతికిని, దండనీతికిని సంబంధించియున్నవి. ప్రస్తుతకాలపు అర్థశాస్త్రములకును దానికిని ఇదియే భేదము. అది ఈ కాలపు రాజ్యాంగ శాస్త్రగ్రంథములతో పోల్చదగియున్నది. ఆర్థిక, సాంఘిక వ్యవస్థలను రక్షిం చుట రాజధర్మమగుటచే, ఈ వ్యవస్థలను గురించిన వివ రములు కూడ అందు చేర్పబడియున్నవి. A కౌటిల్యుని అర్థశాస్త్రమున పదునైదు అధికరణము లును, నూట ఎనుబది ప్రకరణములును కలవు. ఇందు సూత్రములు, వాటిపై భాష్యము - ఈ రెండును కలిసి యున్నవి. ఇది ఇందలి విశేషములలో ఒకటి. సూత్రము | లను రచించినవారే స్వయముగ వాటిపై భాష్యములను రచించుట మంచిదని కౌటిల్యుని అభిప్రాయము. దీనిని దృష్ట్వా విప్రతిపత్తిం, బహుధా శా స్త్రేషు భాష్యకారాణాం స్వయమేవ విష్ణుగుప్త శ్చకారసూత్రంచ భాష్యంచ. అను శ్లోకములో స్పష్టపరచియున్నాడు. రాజ్యమునకు రాజుయొక్క దండనాధి కారము ప్రధాన లక్షణమనియు, దండనము లేనియెడల మాత్స్య న్యాయము పుట్టుననియు, దండధరుడు లేనిచో, బల వంతుడు దుర్బలుని భక్షించుననియు, దండధరునిచే రక్షింప బడి దుర్బలుడు బాగుపడుచున్నాడనియు, ఈ కారణ ములచేత దండమునకు ఆవశ్యకము కలుగుచున్నదనియు కౌటిల్యుడు ప్రతిపాదించెను. సంగ్రహ ఆంధ్ర అవై దిక మతములను అభిమానించిన నంద చక్రవర్తిని తొలగించిన కౌటిల్యుడు, రాజులు దండసాధనమున వైదిక ధర్మమును నిలబెట్టవలెనని చెప్పుటలో ఆశ్చర్యము లేదు. అందుచేతనే అతడర్థశాస్త్రమందు వేదములకును చతుర్వర్ణములకును, చతురాశ్రమములకును సహజమగు ప్రాధాన్యమును కల్పించియున్నాడు. చతుర్వర్ణ చతురా శ్రమములు కలదియే లోకమనియు, రాజు వర్ణాశ్రమ స్థితికి కర్తయనియు, లోకము వేదముచేత రక్షితమై యున్నదనియు, రాజపుత్రుడు నేర్చుకొనవలసిన విద్యలలో వేద చతుష్టయ మొక్కటియనియు, స్వధర్మ పరిపాలకు డును, ఆర్య మర్యాదా వ్యవస్థాపకుడును, వర్ణాశ్రమస్థితి కర్తయునగు రాజు ఇహపర సౌఖ్యముల బొందుచున్నా డనియు, కౌటిల్యుడు చెప్పియున్నాడు. బహుస్వామ్యము లగు రాజ్యములు కొన్ని అచ్చటచ్చట ఉండియున్నను, ఏక స్వామిక రాజ్యములే వాంఛనీయము లని కౌటిల్యుని అభిప్రాయము. ఇంతేగాక, హిమవంతము మొదలు సముద్రము వరకును గల భూభాగమంతయు, చక్రవర్తి క్షేత్రమనియు, అందుచేత దాని నెల్ల ఒక చక్ర వర్తియే పాలించుట సమంజసమనియు అతడు చెప్పి యున్నాడు. చంద్రగుప్తుడిట్టి ఆశయసిద్ధికే పాటుప డెను. రాజ్యమును పాలించు సర్వాధికారము రాజ హ స్త గతమై యుండెను. ఈ అధికారము దుర్వినియోగము కాకుండుటకై రాజులు తమ పుత్రులను వినీతుల నొనర్చి సింహాసనార్హులను జేయుచుండిరి. అధార్మికుడగు రాజును ప్రజలు బలవంతముగ తొలగింపవచ్చునని అర్థశాస్త్రము చెప్పుచున్నది. కార్యాలోచనమందు రాజునకు, మంత్రులకు తోడుగ మంత్రి పరిషత్తు సహాయముగ నుండెను. మంత్రులంద రిలో అమాత్యుడు ప్రధానుడు. కార్యనిర్వహణమందు రాజ సమక్షమమునందుండి, రాజ్యముపై నెల్ల అధికార మును వహించినవారు కొందరు, రాజ్యములోని ఒక్కొక రాష్ట్రముపై అధికారము వహించుచుండిన వారు కొందరు, గ్రామముల మీదను, గ్రామ సముదాయముల మీదను, నగరములమీదను అధికారము వహించినవారు మరికొందరు ఉండిరి. మొదటి తరగతిలో, మంత్రి, యువ రాజు, పురోహితుడు, సేనాపతి, దౌవారికుడు, అంత 122 విజ్ఞానకోశము = 3
కౌటిల్యుడు (రాజనీతిశాస్త్రము)

ర్వంశికుడు, ప్రశాస్త, సమాహర్త, సన్నిధాత, ప్రదేష్ట, నాయకుడు, పౌర వ్యావహారికుడు, కార్మాంతికుడు, మంత్రి పరిషదధ్యక్షుడు, దండపాలుడు, దుర్గపాలుడు, అంతపాలుడు, ఆటవికుడు అను పదునెనుమండ్రు చేరియుండిరి. వీరికి లోబడి తక్కిన ఉద్యోగస్థులందరు వారి వారి కార్యములను నిర్వహించుచుండిరి. ఉద్యోగస్థుల నెన్నటికిని నమ్మరాదనియు, వారు రాజ ద్రవ్యమును స్వల్పముగ నయినను అపహరింపకుండుట అసంభవ మనియు అందుచేత రాజు గూఢచారుల సహాయమున వారి నెల్లప్పుడు పరీక్షించు చుండవలెననియు కౌటిల్యుడు అభిప్రాయపడెను: కౌటిల్యుడు ఊహించిన రాజ్యము శ్రేయోరాజ్యమని చెప్పదగియున్నది. అతని ఆదర్శము —

ప్రజాసుఖేసుఖం రాజ్ఞ. ప్రజానాంచ హితే హితం
నాత్మప్రియంహితం రాజ్ఞ ః ప్రజానాంతుప్రియం హితం.

అను శ్లోకముచే స్పష్టమగుచున్నది. దీని ననుసరించి రాజులు నడుపవలసిన వ్యవహారములు ఒకటి రెండుగాక, బహు సంఖ్యాక ములుగ నుండెను. వ్యవహారముల నన్ని టిని రాజులు అనేక శాఖలుగ విభజించి, ఒక్కొక శాఖను ఒక అధ్యక్షుని వశమందుంచుట ఉత్తమ మార్గమని కౌటి ల్యుని అభిప్రాయము. ఈ శాఖలలో కోష్ఠాగారము, పణ్యము, కుప్యము, ఆయుధాగారము, తులామానము, దేశకాలమానము, శుల్కము, సూత్రము, సీత, సుర, సూనము, గణకవృత్తి, గోసంపద, ముద్ర మొదలై నవి చేరియుం డెను. ప్రజల సౌఖ్యమునకు ప్రధాన సాధనము లైన వ్యవసాయము, గోసంపద, అటవీ సంపద, వర్తక వ్యాపారములు, మొదలయినవి వీటిలో చేరియుండుట గమనింపదగిన విషయము. పంచవర్ష ప్రణాళిక ల మూలమునను, జాతీయసాధనములు మూలమునను ఆర్థిక సాంఘిక రంగములకు సంబంధించిన పను లనేకములు చేయుట కౌటిల్యునికి సమ్మతమై యుండెను.

రాజ్యమందు జనపదము, నగర మను రెండు భాగము లుండవలె నని కౌటిల్యుని అభిప్రాయము. గ్రామము లతో గూడిన భాగము జనపదము. పట్టణములతో గూడి నది నగరము. ఉత్తము గ్రామములలో నూరింటికి తక్కువ గాక, ఐదువందలకు మించక, శూద్రకర్షకుల ఇండ్లుండ వలెననియు, పరిపాలనము గ్రామికుని యొక్కయు, గ్రామవృద్ధుల యొక్కయు వశమం దుండవలె ననియు, గ్రామము లై దింటిపై గోపుడను అధికారి ఉండవలె ననియు, గోపుడు క్షేత్రములకు సంబంధించినట్టియు, ప్రజల ఆదాయ వ్యయములకు సంబంధించినట్టియు లెక్కలను, జనాభా లెక్కలను తయారుచేయవలె ననియు, కౌటి ల్యుడు నిర్ణయించియున్నాడు. ప్రతినగరము ఒక పద్ధతిని అనుసరించి నిర్మింపబడవలె ననియు, అందు విశాలములగు బాటలు, సమృద్ధములగు జలాధారములు, వృత్తి, జాతి, కులములనుబట్టి ఏర్పరచబడిన నివాసప్రదేశములు ఉండ వలెననియు, నగరమును పాలించు నాగరికుడను అధికారి నగరవాసులు క్షేమసంపాదనమునకును, ఆరోగ్యసంపాదన మునకును, కావలసిన కార్యములను చేయవలయుననియు కౌటిల్యుడు విధించియున్నాడు.

శూన్యప్రదేశములందు గ్రామములను నిర్మించుట, క్రొత్తగా జయించిన రాజ్యమును పరిపాలించుట, సామంత రాజులను వశపరచుకొనుట, రాజుల యొక్క ఆదాయమును వృద్ధి చేయుట, ఉద్యోగస్థులు అవినీతి పరులు కాకుండుట, సౌష్ఠవమగు సైన్యములను సమ కూర్చుట, ఇతర రాజ్యములకు దూతలను పంపుట, యుద్ధ యాత్రలను జేయుట, జయముసంపాదించుటకై ఆయుధ ములతోపాటు మంత్ర తంత్రములను ఉపయోగించుట, వ్యాధిదుర్భివాది పీడలనుండి ప్రజలను రక్షించుట మొద లగునవి మరికొన్ని విధులు.

ఒక పరిపాలన విధానమును గురించియేగాక,ప్రజలుస్వపోషణమునకై స్వీకరింపవలసిన వృత్తులు, చిన్న దేశములతో వేర్వేరు సరకుల నుద్దేశించి వ్యాపారము చేయు విధానము, కూలివాండ్రను, దాసులను ఆదరించు పద్ధతి, దేశమందు వృద్ధిగావింపదగిన కళలు - ఇట్టి పెక్టు విషయ ములు అర్థశాస్త్రమందు వివరింపబడియున్నవి. గ్రంథము లోని ధర్మస్తేయకంటక శోధనాది అధికరణములలో సాంఘికాచారములు, వివాహధర్మములు, దాయ విభా గము మొదలగువాటిని గురించిన వివరణము కలదు. కౌటిల్యుని అర్థశాస్త్రము ఒక విధమైన విజ్ఞానకోశమని చెప్పుట అతిశ యోక్తి కాజాలదు. ఇట్టి అమూల్యమయిన గ్రంథమును రచించిన కౌటిల్యుడు భారతీయులందరికి చిరస్మరణీయుడు.

మా. వెం. రం.