సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/కోషీ, ఏ. ఎల్.

కోషీ - ఏ. ఎల్. :

కోషీ ఆగస్టిన్ లూయీ (1789–1857) ప్రఖ్యాతు లయిన ఫ్రెంచి గణితశాస్త్రజ్ఞులలో నొకడు. ఇతడు ప్యారిస్ నగరములో 1789 సం. ఆగష్టు 21 తేదీయందు పుట్టి, సియాక్సునగరము(సీన్)లో 1857 వ సం. మే నెల 23 వ తేదీయందు మరణించెను. ఇతడు స్థాపత్య శాస్త్రము (Engineering) ను అభ్యసించెను. కొంతకాలము ఇంజనీరుగాగూడ పనిచేసెను. 1813 లో ఇతని ఆరోగ్యము చెడిపోయెను. అప్పటినుండి శాస్త్రాధ్యయన వ్యగ్రుడయ్యెను. 1816 నుండి ప్యారిస్ నగరమున మూడు శాస్త్రములలో ఆచార్యస్థాన మలంకరించెను. కాని 1830 సం . రమున ఘటిల్లిన ఫ్రెంచి విప్లవసందర్భమున లూయీ ఫిలిప్పీయెడ రాజభక్తి ప్రమాణము చేయ నిరాకరించినందున ఇతడు తన ఆచార్య పదవులను కోల్పోయెను. అంతట ఇతడు ఇటలీయందలి ట్యూరిన్ విశ్వవిద్యాలయమునకు వెళ్ళెను. అచ్చట ఇతని కొరకు గణిత - భౌతికశాస్త్ర (Mathematical physics) విషయమున ప్రత్యేకమైన ఆచార్యపదవి కల్పింపబడెను. 1838 వ సంవత్సరములో ఫ్రాన్సుకు తిరిగివచ్చి ఇతడు కొన్ని క్రైస్తవపాఠశాలలలో అధ్యాపకుడుగా నుండెను. ఇతనికి 1843 వ సంవత్సరములో గణిత - ఖగోళశాస్త్ర (Mathematical Astronomy) మున ఆచార్య పదవి లభించెను.

ఉన్నత బీజగణితము (Higher Algebra), చలన సమీక రణములు (Deferential Equations) సంభవ నీయతా సిద్ధాంతము (the theory of Probability), గణిత - భౌతికశాస్త్రము (Mathematical physics), ఖగోళశాస్త్రము (Astronomy), వైశేషిక కలనము (calculas of variations), నిర్ణాయక కనిష్ఠఫలములు (determinants), గణితశాస్త్ర మూలములు (the foundations of Mathematics), ప్రమేయ సిద్ధాంతము (the theory of Functions) మున్నగు వివిధ గణితశాస్త్ర శాఖలయందు ఇతడు నిర్విరామముగా కృషి యొనర్చెను. గణితశాస్త్రమునం దితడు ఖచ్చితమును, విస్పష్టమునైన పద్ధతులను ప్రవేశపెట్టెను. అవధుల (limits) యొక్కయు, అవిచ్ఛిన్నత (continuity) యొక్కయు సహాయమున విస్తృతమొనర్చుచు ఇతడు కలన సిద్ధాంతములను (principles of calculas) స్పష్టీకరించెను టెయిలరు (Taylor) యొక్క సుప్రసిద్ధమయిన శేషపద్ధతిని (form of remainder) ఖచ్చితముగా స్థాపించుచు, ఆతని (Taylor's) సిద్ధాంతమును రుజువుచేసిన వారలలో ఇతడు ప్రథముడు. స్థితిస్థాపకత్వము (Elasticity)న పీడనసిద్ధాంతము (theory of stress)ను ఇతడు కని పెట్టెను. కాంతిశాస్త్రమున (optics) తరంగ సిద్ధాంతమును విపులీకరించెను. ఇతని పేరు సామాన్యమైన శ్లేషణసూత్రము (dispersion formula) తో ముడివడి యున్నది. మొత్తముమీద ఇతడు గణితశాస్త్రముయొక్క వివిధశాఖలలో దాదాపు 800 ముఖ్య చరిత్రాంశముల (Memoirs) ను ప్రచురించెను. ఇతని సంకలితరచనలు 27 సంపుటములుగా ప్రచురింపబడినవి.

కోషీ జీవితమునందు ఉపేక్షింపరాని లోటొకటి ఏర్పడినది. అది అహంభావము. బాల్యమునందలి శిక్షణ క్రమమో, శాస్త్రరంగమున మహత్తరమైన విజయములను గాంచి, అత్యంత కీర్తిమంతుడుగా పేరొందుటయో ఈ అహంభావమునకు కారణ మయి యుండును. ఈ అహంభావము కారణముగా ఇతడు రాజకీయాధికారుల యొక్కయు, శాస్త్రజ్ఞుల యొక్క యు అనిష్టమునకు గురి యయ్యెను.

జి. ల.