సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/కొలనుపాక
కొలనుపాక :
ఒకనాడు దక్షిణాపథములో రాజకీయముగను, మత విషయకముగను గొప్ప కేంద్రస్థానములుగానుండి స్వీయ పూర్వ ప్రాభవమును కోల్పోయిన పట్టణములలో ఈ కొలనుపాక అను గ్రామము ఒకటి.
కొలనుపాక అను గ్రామము శాసనములయందు, కొలిపాక, కుల్పాక, కొట్టియపాక, కొళ్ళియపాక, కొట్టిపాక, కొల్లిహకే మొదలగు నామములతో నొప్పినది. ఇది స్థలపురాణాదులయందు బింబావతీపురి, వ్యాఖ్యనగరము, సరోవర కుటీరము, సోమశేఖరపురము, కుదటిపురి, కుళుదపురము మొదలగు నామములతో వ్యవహరింపబడినది. ఇది శైవమత కేంద్రస్థానముగా నుండి “దక్షిణకాశి" యను గౌరవనామము పొందియుండెను.
కొలనుపాక సిద్దిపేట రోడ్డుపై భువనగిరికి 20 మైళ్ళ దూరములో నున్నది. ఇది నల్లగొండ జిల్లాలోనున్నది. ఈ గ్రామమునందు దాదాపు 50 శాసనములు దొరకినవి.
కల్యాణి రాజధానిగా పరిపాలించిన పశ్చిమచాళుక్య చక్రవర్తుల పాలనములో ఈ కొలనుపాక నూరు సంవత్సరములు ఉండినట్లు శాసనములవలన తెలియుచున్నది. క్రీ. శ. 1042 నుండి 1143 వరకు పశ్చిమచాళుక్యుల ప్రతినిధుల పరిపాలనలో నున్నది.
మొదటి జగదేకమల్లుడు క్రీ. శ. 1042 నాటికే ఉండెను. క్రీ. శ. 1067 లో ఈ కొలనుపాక గ్రామము త్రైలోక్యమల్ల బిరుదముగల ప్రథమ సోమేశ్వర చక్రవర్తి పాలనలో నుండినట్లు తెలుపు శాసనమొకటి కలదు. క్రీ. శ. 1076 నుండి 1126 వరకు ఆరవ విక్రమాదిత్యుడు పాలించినకాలము. ఇతడు పరిపాలించు కాలములో కందూరు తాండయ్య, వ్యాళమహారాజు, బిత్తరపాలుడు, త్రిభువనమల్లుడు, అనంతపాలయ్య అను వారలు కొలనుపాకలో రాజప్రతినిధులుగా వరలిరి.
శ్రీమన్మహామండలేశ్వర శ్రీ సోమేశ్వరదేవభూతి కొలిపాకలో రాజ్యము చేయుచుండినట్లు క్రీ. శ. 1110, 1126 సం. ల నాటి శాసనములు తెలుపుచున్నవి. గురిజాల శాసనమును బట్టి క్రీ. శ. 1143 నాటికి కూడ కొలనుపాక పశ్చిమచాళుక్య చక్రవర్తుల పరిపాలనములో నున్నట్లు తెలియుచున్నది. చాళుక్యుల అనంతరము కొలనుపాకపురము కాకతీయ సామ్రాజ్యమున నొకభాగమయ్యెను. ఇచ్చట దొరికిన శాసనమొకటి, ఓరుగల్లును క్రీ. శ. 1260 మొ. 1294 వరకు పాలించిన మహారాణి శ్రీ రుద్రమదేవి శ్రీ గణపతిదేవుని కూతురనియు, ఈమెభర్త వీరభద్రుడనియు తెలుపుచున్నది.
పూర్వము కొలనుపాక రాజ్యము 7000 గ్రామముల సీమగా నుండెను. ఈ నగరము పంచక్రోశ పరిమితమై, ఆలేరు అను అంతర్వాహినినుండి బయల్వెడలిన యూట కాలువలచే సస్యశ్యామలములును, ఫలవంతములును అయిన పరిసరభూములతో ఒప్పుచుండెను.
'కాశీబుగ్గ' అను నడబావి యొకటి కలదు. దీని ప్రక్కనే ఒక చిన్న శివాలయము కలదు. ఈ బావిలోని నీరు అపర గంగోదకముగాను, ఈ దేవాలయములోని లింగము అపరకాశీవిశ్వేశ్వరలింగముగాను పరిగణింపబడుటచే, కొలనుపాకకు “దక్షిణకాశి" యను గౌరవము లభించినది. శైవమతముతోపాటు జైనమతముకూడ ఇచ్చట సమరస భావముతో అభివృద్ధికాంచినట్లు తెలియుచున్నది. శిథిలావస్థలోనున్న ఇచ్చటి కీర్తి స్తంభములు, సాలంకములు, నందులు, లింగములు, సప్తమాతల విగ్రహములు ఆనాడు ఉండిన దేవాలయముల సంఖ్యను, ఘనతను చాటుచున్నవి.
నేటికిని సోమేశ్వరాలయము. వీరనారాయణగుడి పూజాపురస్కారములు కలిగియున్నవి. సోమేశ్వరాలయము కుమార సోమేశ్వరుని కాలములో దాదాపు 800 ల. సం॥ రముల క్రిందట నిర్మింపబడినట్లు ఊహింపబడుచున్నది. ఈ దేవమందిరము బ్రహ్మాండమైనది. ఇందలి విశేషభాగము శిథిలమై, ప్రవేశించువారికి భయంకరముగ నుండును. వీరనారాయణ గుడి మొదట “జగద్దేవ నారాయణ గుడి" యను పేరును కలిగియుండెనట !
ఇచట 22 మఠములు కలవు. ఇవి వేర్వేరు కులముల వారికి ప్రత్యేకముగ నేర్పడియున్నవి. ఈ మఠాలయములు పురాతన దేవాలయముల అవశేషములతో నిర్మితములై యున్నవి. వీటియందలి పనితనము అద్భుతమును కొల్పుచున్నది. సోమేశ్వరాలయములో దక్షిణ భాగమున నున్న చండికాలయములోని దేవీ విగ్రహము ఎంతయు సుందరముగా చెక్కబడి యున్నది.
నైఋతి దిశలోనుండు ఒక చిన్న దేవాలయము నందలి లింగము విచిత్రమయినది. దీనిని కోటిలింగమందురు. ఈ లింగము 1 అడుగు 41/2 అంగుళముల ఎత్తును, 3 అడుగుల 11 అంగుళముల కైవారమును కలిగియున్నది. దీని చుట్టును గొలుసులవలె సమాన పరిమాణము గలిగిన దాదాపు వేయి చిన్నలింగములున్నవి. ఇది ఒక ప్రత్యేక విశేషము. దీనిచే కోటిలింగము లొకప్పుడు ప్రతిష్ఠింప బడెనను విషయము సూచింపబడుచున్నది.
సోమేశ్వరుని గుడికి ఉత్తర దిశలో 'ప్రతాపరుద్ర’ గుడి కలదు. ఇది అనుమకొండలోని ఆలయ శిల్పమును పోలియున్నది. వీరనారాయణగుడి గ్రామ మధ్యమున నున్నది. సామాన్యముగ విష్ణ్వాలయములు తూర్పు ద్వారములు గలిగియుండును. కాని ఈ ఆలయము పశ్చిమ ముఖముగానుండి వింత గొల్పుచున్నది.
ఈ గ్రామములో నొక దిబ్బపై 18 - 20 అడుగుల పెద్ద ద్వార మొకటి కలదు. ఇచటనే 5, 6 అడుగుల నిడివిగల మూడుపాదములు ఒక బండపై నున్నవి. దీనిచే ఇదియొక బ్రహ్మాండమగు విగ్రహముయొక్క భిన్నమైన పాదభాగ మని తెలియుచున్నది.
జైన మందిరములోనున్న మూడుగుళ్లును ప్రాఙ్ముఖముగ నున్నవి. మధ్యనుండు ముఖ్యమైన గుడి, గోపురముతోను, శిఖరములతోను, చిత్రాలంకారములతోను ఒప్పుచున్నది. కొలనుపాక జైనుల యొక్క ముఖ్యమైన పవిత్ర క్షేత్రము.
హిందూ దేవాలయ శిల్పము చాళుక్యశిల్పమును పోలి యున్నది. ఇందు ఉపయోగింపబడిన ఇటుకలు 151/2 అంగుళముల పొడవు, 81/2 అంగుళముల వెడల్పు, 2 అంగుళముల మందము కలిగియున్నవి. ఇవి మౌర్యుల కాలములోని ఇటుకలను, గుప్తులకాలములోని ఇటుకలను పోలియుండుటచే, బహు పురాతనమైనవిగా ఊహింపబడుచున్నవి.
కాకతీయుల పరిపాలనానంతరము పెక్కు శతాబ్దములవరకు ఈ పట్టణపు చరిత్ర మరుగుపడిపోయినది. షా ఆలం ఢిల్లీ చక్రవర్తి అయిన రెండవ సంవత్సరములో ఈ పట్టణ మొక సేనానికి శిబిరస్థానమై, పరగణాగా ముచ్చటింపబడినది. అపుడు సర్వాయిపాప డను నొక సాహసికుడు కొలనుపాకపైబడి దోచుకొనెను.
కా. సీ.