సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/కెనడా (భూగోళము)

కెనడా (భూగోళము) :

కెనడాదేశము ఉత్తర అమెరికాలో నున్నది. ఇది బ్రిటిషువారి అధినివేశ రాజ్యముగా 1867వ సంవత్సరమున “ఉత్తర అమెరికా బ్రిటిషు ఫెడరేషను" అను నామమున పదిరాష్ట్రముల కలయికతో ఏర్పడినది. నోవస్కోషియా, న్యూబ్రన్‌స్విక్, ప్రిన్సు ఎడ్వర్డుదీవి, క్విబెక్, అంటారియో, మానిటోబా, సాస్కచివాన్, ఆల్బర్టా, బ్రిటిషు కొలంబియా, న్యూఫౌండ్ లాండ్ అనునవి ఆ పది రాష్ట్రములు. కెనడా వైశాల్యము 36,19,616 చ. మైళ్లు.

ఈ దేశమున కుత్తరమున ఆర్కిటిక్ మహాసముద్రము, దక్షిణమున అమెరికా సంయుక్తరాష్ట్రములు, తూర్పున అట్లాంటిక్ మహాసముద్రము, పడమట పసిఫిక్ మహాసముద్రమును కలవు. ఇంచుమించుగా పశ్చిమదిశయందు 140° ప. రేఖాంశము అలాస్కా, కెనడాలకు మధ్య సరిహద్దుగాను, దక్షిణదిశయందు 49° ఉ. అక్షాంశము కెనడా, సంయుక్తరాష్ట్రములకు మధ్య సరిహద్దుగాను ఉన్నవి.

నైసర్గిక స్థితినిబట్టి కెనడాను మూడు సహజభాగములుగా విభజించవచ్చును, అవి (i) గుట్టలతోను, అడవుల తోను నిండిన తూర్పుప్రాంతము, (ii) రాకీ పర్వతములతో నిండిన పశ్చిమప్రాంతము, (iii) ఈ రెంటికిని మధ్యగానున్న పెయిరీభూమి.

తూర్పుదిశయందుగల ముఖ్య పర్వతశ్రేణులు సెంటు లారెన్సు నదికి సమానాంతరముగా నున్నవి. ఇందు ఉత్తరమున నున్న లారెన్సు శ్రేణియు, దక్షిణముననున్న షిక్‌షాక్ శ్రేణియు ముఖ్యమైనవి. ఇవి సుమారు 4000 అ. ఎత్తుకలవి, పశ్చిమముననున్న రాకీ పర్వతములు రెండు వరుసలుగా నున్నవి. సముద్రతీరముననున్న శ్రేణిని కోస్టు రేంజి అనియు, లోతట్టు శ్రేణిని ఎండికట్ శ్రేణి యనియు అందురు. ఈ పర్వతములలో రాబ్సన్ (13,700 అ. ఎత్తు), మౌంటు ఇలియస్ (18,000 అ. ఎత్తు) అను శిఖరములు ముఖ్యమైనవి. పెయిరీప్రాంతము చాలభాగము మైదానముగ నున్నది. ఇందు అనేకములగు గుట్టలు కలవు. ఇవి అడవులతో నిండియున్నవి.

కెనడాలో అనేకనదులు, సరస్సులు కలవు. కొన్ని సరస్సులు వందమైళ్ళకు మించిన పొడవుకలవిగా ఉన్నవి; 35 సరస్సులు 50 మైళ్ళకు మించినపొడవుకలవిగా ఉన్నవి.

కెనడా నదులలో నెల్సన్, ఆల్బనీ, చర్చిల్ మొదలయిన నదులు హడ్సన్ అఖాతములోను, మెకంజి, కాపర్ మైన్ మొదలయినవి ఆర్కిటిక్ మహాసముద్రములోను, ఫ్రేజర్, స్కీనా మున్నగునవి పసిఫిక్ సముద్రములోను కలియు చున్నవి. కెనడా నదులలోకెల్ల ముఖ్యమైనది సెంటు లారెన్సు అను పేరుగలది. ఇది అట్లాంటిక్ సముద్రములో కలియుచున్నది. లేక్ సుపీరియర్, మిచిగన్, హురాన్.

చిత్రము 1.
ఈరి, అంటారియో, అను బ్రహ్మాండమైన మంచినీటి సరస్సులలోని నీరు ఈ నదిగుండా ప్రవహించుచుండును. ఈ

సరస్సులు ఒకదానితో నొకటి కాలువల ద్వారమున కలుపబడిఉన్నవి. సెంటులా రెన్సునదీ ముఖద్వారమునుండి నౌకలు ఈ సరస్సుల ద్వారమున చాలదూరమునుచేర గలవు. ఈ నదిశీతకాలమున ఘనీభవించును. సస్కచివాన్, మెకంజి నదులుకూడా మిక్కిలి యెన్నతగినవి. సస్కచివాన్ నది విన్ని పెగ్ సరస్సులోను, మెకంజినది ఆర్కిటిక్ సముద్రములోను కలియుచున్నవి. కెనడాతీరము, ప్రాక్పశ్చిమ ఉత్తర దిశలయందు మిక్కిలి చీలి ఉన్నది.

శీతోష్ణస్థితి : కెనడా చాలవరకు సమ శీతోష్ణమండలమున నున్నది. కాని ఇది చాలవిశాలమైన దేశమగుటచే, అత్యధిక శీతోష్ణస్థితులే ఇందు విశేషముగా కానవచ్చును. శీతకాలమున ఉత్తర శీతలపవనములు వీచుటచే చలి విశేషముగా నుండును. నదులలోను, సరస్సులలోను, నీరు గడ్డకట్టును. లాబ్రడార్ శీతలజల ప్రవాహము తూర్పు తీరమును అతిశీతలముగా చేయును. కాని పసిఫిక్ తీరము మాత్రము కవోష్ణమగు ఉత్తర పసిఫిక్ ప్రవాహము యొక్కయు, నైరృతి ప్రతివ్యాపార పవనముల యొక్కయు ప్రభావముచే సమశీతోష్ణముగ నుండును. ఈ కారణముచేతనే తూర్పు తీరమునగల హాలిఫాక్స్ రేవు శీతకాలమున ఘనీభవించి నౌకాయానమునకు ఉపయోగింపకున్నను, పశ్చిమతీరమునగల వాంకోవరు రేవునందు మంచుగడ్డ లేర్పడకపోవుటచే అదిసంవత్సరము పొడవునను నౌకాయానమున కుపయోగించును. వేసవిలో మెక్సికో సింధుశాఖనుండి వీచు వెచ్చని వేడిగాడ్పులు, మధ్య మైదానముపై వీచుటచేతను, ఉష్ణ సింధుశాఖ - వేడిగల్పుస్ట్రీము తూర్పు ప్రక్కనుండి పారుటచేతను దేశమంతయు 60° ఫా. కంటెను అధికోష్ణము కలిగి యుండును. పశ్చిమ తీరమునను, తూర్పు తీరమునను సంవత్సరము పొడవున వర్షము కురియును. రాకీ పర్వత పంక్తులకు మధ్యనున్న ప్రాంతము వర్ష ఛ్ఛాయలో నుండుటచే పొడిగా నుండును. మధ్య మైదానములో వేసవిలో మాత్రమే వాన కురియును. జనవరిలో ఉష్ణోగ్రత 32° ఫా. వరకు పోవును.

ప్రకృతిసిద్ధ మండలములు : కెనడాను మూడు ప్రకృతి సిద్ధ మండలములుగా విభజించవచ్చును. అవి 1. తూర్పు కెనడా 2. మధ్య కెనడా 3. పడమటి కెనడా అనునవి.

1. తూర్పు కెనడా: కెనడాలో నుండెడి జనులలో నాలుగింట మూడుభాగములు తూర్పు కెనడాలో నున్నారు. ఇది గొప్ప వ్యవసాయ ప్రాంతము. ఇచ్చట గోధుమ, ఓట్సు, బార్లీ, రై, బంగాళాదుంపలు అధికముగా పండును. కోనిఫర్ వృక్షములును, ఆకురాలు వృక్షములును, ఈ ప్రాంతమున పెరుగును. పరిశ్రమలు కూడా అతి త్వరగా వృద్ధిచెందుచున్నవి. కెనడాకు ముఖ్య పట్టణమైన అట్టావా ఇందే కలదు. అచ్చట కొయ్య గుజ్జుతో కాగితముచేయు కర్మాగారములున్నవి. క్విబెక్ నందు ప్రత్తి పరిశ్రమ, చర్మపు పరిశ్రమ కలవు. ఇనుము, ఉక్కు పరిశ్రమలకు టారంటో ప్రసిద్ధము. ఈరి, అంటారియో సరస్సులకు మధ్య 'నయాగరా' జలపాతమున్నది. ఈజలపాతము చాల రమణీయమైన దృశ్యము. 167 అడుగుల ఎత్తునుండి ఇదిపడుచున్నది. దీనివలన తయారుచేయబడు జల విద్యుచ్ఛక్తి కెనడా సంయుక్త రాష్ట్రములకు అంద జేయబడును. తూర్పు కెనడాయందలి పరిశ్రమలు అభివృద్ధినొందుట కిదియొక ముఖ్యకారణము.

కెనడాకు ఉత్తరభాగమున నున్న టండ్రా భూములలో ఎస్కిమోలు నివసింతురు. ఉత్తరముననున్న ద్వీపములు చాలవరకు నిర్మానుష్యముగా నుండును. టండ్రాలకు దక్షిణమున 'కోనిఫర్’ వనములున్నవి. అందు డగ్లస్ ఫర్, రెడ్‌సీడర్, వైటు పైను అను వృక్షము లధికముగ నుండును. అందుచే అచటి జనులకు కలపపరిశ్రమ ప్రధాన వృత్తియైనది.

తూర్పు తీరమునకు సమీపమున గల న్యూపౌండ్ లాండ్ దీవి బ్రిటిష్‌వారి అధికారమున నున్నది. సెంటు జాన్ దీని రాజధాని. ఈ ద్వీపమున ఇనుము దొరకు గనులున్నవి. చేపలను పట్టుట అచ్చటి జనులయొక్క ముఖ్యవృత్తి.

2. మధ్య కెనడా: కెనడా మధ్యభాగమున త్రిభుజాకారముగా నుండు ప్రెయిరీ భూములు కలవు. అందు ఖండాంతర శీతోష్ణస్థితి కలదు. చాలినంత వర్షముగల తూర్పు ప్రాంతములలో గోధుమలను పండించెదరు. ఎడ్మాన్‌టన్, రెజినా, సాస్కటూన్ పట్టణములు ధాన్యమును సేక రించు కేంద్రములు. వర్షము తక్కువగాగల ప్రదేశములు పశువుల పెంపకమునకు పనికివచ్చుచున్నవి.

3. పడమటి కెనడా: బ్రిటిష్ కొలంబియా, యూకన్ పీఠభూమి, వాంకూవరుదీవి ఇందు కలవు.. ఇది పర్వత ప్రాంతము. కొలంబియాలో రాగి, బంగారు, నికెలు, వెండి, ఇనుము దొరకును. తీరము 'సామను' జాతి చేపలుపట్టు కేంద్రముగా ప్రసిద్ధిగాంచినది.

ముఖ్య పట్టణములు : కెనడా దేశమునకు అట్టావా రాజధాని. దీని జనాభా 2,02,045 మంది. మాంట్రియల్ జనాభా 10,21 520 ; వాంకోవరు జనాభా 3,44,833 ; క్విబెక్ జనాభా 1,64,016; హాలిఫాక్స్ జనాభా 1,62,217; ఇవి కెనడా దేశములోని ముఖ్య రేవు పట్టణములు. టారెంటో, విన్ని పెగ్, హామిల్టన్, ఎడ్‌మంటన్ పట్టణములు ముఖ్య పారిశ్రామిక కేంద్రములు.

వృత్తులు : కెనడాదేశమందు వ్యవసాయమే ముఖ్యవృత్తి. ఉద్యాన కృషి, పశువుల పెంపకము, కోళ్ళ పెంపకము మున్నగునవికూడా ఇందు చేరిఉన్నవి. దేశముయొక్క మొత్తపు (36,19,616 చ.మై) వైశాల్యములో 15.2 శాతము సేద్యపుభూమియైయున్నది. ప్రపంచములో గోధుమ ఎక్కువగా ఎగుమతిచేయు దేశములలో కెనడా ఒకటి. ఓట్సు, బార్లి కూడా ఇచటి ముఖ్య సస్యములు. ఆపిల్ పండ్లు చెరకు, పొగాకు, తేనె మొదలగునవి కూడా ఈ దేశమందలి ముఖ్యమగు ఉత్పత్తులు.

కెనడాలో గనులు, ఉక్కు, కలప, రబ్బరు మున్నగు పరిశ్రమలు ఇతర వృత్తులు. ముడిసరకులు బ్రిటిష్‌ దీవుల కెగుమతి చేయబడును. పారిశ్రామిక వస్తువులు కూడా ఇతరదేశముల కెగుమతి చేయబడును. దేశమందు అనేక రైలుమార్గములును, జలమార్గములును, వాయుమార్గములును కలవు. భాగ్యవంతమగు దేశములలో కెనడా ఒకటి. ఈ దేశమున జల విద్యుచ్ఛక్తి అత్యధికముగా నుండుటచే అది పారిశ్రామికవృద్ధికి ఎంతయు తోడ్పడుచున్నది. గోధుమలు, ఇతర ధాన్యములు, అచ్చుకాగితము (న్యూస్ ప్రింటు), యంత్రసామగ్రి, కఱ్ఱగుజ్జు, కలప ఈ దేశమునందలి ప్రధానమయిన ఎగుమతులు. యంత్ర శకటములు, పెట్రోలియము, ఇనుము, ఉక్కు యంత్రములు ఇచటికి దిగుమతి చేయబడుచున్నవి.

జనులు: 1952 వ సం. లో ఈ దేశమునందలి జనాభా 1,44,30,000 మంది. వీరిలో బ్రిటిషువారు 48%; ఫ్రెంచి వారు, 31%.జర్మనులు, యుక్రేనియనులు కూడా కొలదిమంది కలరు. మొత్తము జనులలో 43% రోమను కాథలికులు ; 20% యునై టెడ్ చర్చికి చెందినవారు ; మిగిలినవారు ఇతర మతస్థులు.

విద్య : ఇచట 14 సం. ల లోపుగా పిల్లలకు ఉచితముగా నిర్బంధవిద్యయొసగబడును. దేశమందు 6 ప్రభుత్వ విశ్వవిద్యాలయములును, 12 ప్రభుత్వేతర స్వతంత్ర విశ్వవిద్యాలయములును కలవు. వాటిలో టారెంటోలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయము, మాంట్రియల్ లోని స్వతంత్ర విశ్వవిద్యాలయము ప్రధానమైనవి.

ఎం. వి. రా.