సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/కెకులే (1829 - 1896)
కెకులే (1829 - 1896):
ఈతని పూర్తి పేరు ఫ్రెడ్రిక్ అగస్ట్ కెకులే. కెకులే జర్మను దేశీయుడు. రసాయన శాస్త్రవేత్త. అతడు డార్మ్ స్టాట్ అనుచోట క్రీ. శ. 1829 వ సంవత్సరమున సెప్టెంబరు 7 వ తేదీన జన్మించెను. కెకులే మొదట 'గీసెన్' అను ప్రదేశమున శిల్పశాస్త్రము నభ్యసించి, లీజిగ్ అను ప్రఖ్యాత రసాయన శాస్త్రవేత్తయొక్క ప్రభావబలముచే రసాయనశాస్త్ర మభ్యసించుట ప్రారంభించెను. అతడు గీసెన్ నుండి పారిస్కు వెళ్ళి, పిమ్మట ఇంగ్లండునకుగూడ పోయి, అచ్చటనున్న ప్రఖ్యాత రసాయనశాస్త్రజ్ఞులతో కొంతకాలము సహవాసము చేసెను. జర్మనీదేశమునకు తిరిగివచ్చి, హీడెల్ బర్గులో కొలది సాధన సామగ్రితో నొక చిన్న రసాయన పరిశోధనాలయమును నెలకొల్పి, అచట ముఖ్యమగు పరిశోధనము లెన్నియో చేసెను. 1856 వ సంవత్సరమున హీడెల్ బర్గులో కెకులే రసాయన శాస్త్రమున అసిస్టెంటు ప్రొఫెసరై 1858 లో ఘెంట్ అనుచోట ప్రొఫెసరయ్యెను. 1865వ సంవత్సరములో ఇతడు 'బాన్' నగరమునకు ప్రొఫెసరుగా ఆహ్వానింప బడెను. జీవితాంతమువరకు అతడాపదవియందే (సుమారు 31 సంవత్సరములు) పనిచేసెను. రసాయనశాస్త్ర సిద్ధాంతమునకు, ముఖ్యముగా కర్బనసంయోగ పదార్థముల నిర్మాణమును గూర్చి కెకులే చేసిన శాస్త్రవిజ్ఞానసేవ చాల ముఖ్యమైనది. 1858వ సంవత్సరమున కర్బనము చతుశ్శక్తికము (tetravolent), అనగా దానిసంయోగ సామర్థ్యము 4 రెట్లగుటకు కారణములను నిరూపించుచు, కెకులే అతని ప్రసిద్ధసిద్ధాంతమగు 'పరమాణువుల లంకె' (Doctrine of linking of atoms) అను దానికి ముఖ్యలక్షణములను వెలిబుచ్చుచు నొక పరిశోధనా పత్రమును ప్రకటించెను. 1865 వ సంవత్సరమున సేంద్రియ రాసాయనిక పదార్థములలో నొక శాఖకు మూలాధారమగు ' బెన్జీన్' అను పదార్థనిర్మాణమును గూర్చి 'సంవృత బంధము' లేక 'వలయము' (closed chain or ring) అను సిద్ధాంతమును కెకులే సూత్రీకరించెను. సేంద్రియ రసాయనశాస్త్ర మంతటిలో ఆ సిద్ధాంతము మహోజ్జ్వలమైనదని శాస్త్రజ్ఞు లామోదించిరి. ఆ సిద్ధాంతమువలన సువాసన నిచ్చెడి సేంద్రియ సంయోగ పదార్థముల నిర్మాణము స్పష్టమగుటకు అవకాశము కలిగినది. కెకులే 1896 వ సంవత్సరమున జూన్ 13వ తేదీన కాలధర్మము నొందెను.
1898 వ సంవత్సరములో ప్రొఫెసర్ ఎఫ్. ఆర్. జాష్ అనునతడు కెకులే స్మారకోపన్యాసము నిచ్చుచు, ఆధునిక సేంద్రియ రసాయనశాస్త్రములో ముప్పాతికవంతు సూటిగనో, వక్రముగనో కెకులేయొక్క బెన్జీన్ సిద్ధాంతమునుండి బయలుదేరినదే నని వక్కాణించెను. కెకులే రసాయనశాస్త్ర పత్రిక నొక దానికి సంపాదకత్వము నిర్వహించెను.