శ్రీ సుందరకాండ (రాయప్రోలు సుబ్బారావు)/సర్గ 67

శ్రీ

సుందరకాండ

సర్గ : 67

                1-2
అట్లు రాముడు మహాత్ముడు కోరిన;
ఆరంభించెను హనుమయు; రఘువర!
సీత నీకిటుల చెప్పుమన్న దొక
జరిగిన కార్యము జ్ఞాపకార్థముగ.
                 3
చిత్రకూటమున చేరియున్న తఱి,
ఇద్దరు సుఖముగ నిద్దురపోతిరి,
సీత ముందు లేచెను, కాకి యొకటి
ఆయమ వక్షము నంటి గీఱెనట!
                 4
దేవి అంకమున నీవు శయించితి,
వంత, పాపవాయసమును వదలక
తిరిగివచ్చి బాధించెను దేవి స్త
నాంతరమును గాయములుగా పొడిచి.
                5-6
మఱలమఱల నటు మాఱుమసలి, కా
కము వేధింపగ, కారుచున్న నె
త్తురుతో నిను నిద్దురలేెపెను సతి,
కాకపీడనకు గాసిలి వేసరి.

                  7
నెత్తురు జొత్తిలు నెలత వక్షమును
చూచి, ఆగ్రహ క్షుభితుడ వగుచును
త్రాచుపామువలె లేచి, జానకిని
అడిగితి వట అప్పుడె భరతాగ్రజ!
                 8
భయశాలిని! నీ వక్షస్తలమును
గిచ్చి గోళ్ళతో గీఱి చీల్చె నెవ?
డక్కసు క్రక్కెడి అయిదు తలల నా
గినితో వెఱవక క్రీడలకు దిగెను?
                 9
ఇటు నటు కలయ పరీక్షించితి; వగ
పడె నది పొంతనె, వాడి గోళ్ళ నె
త్తురు తడియాఱ, కెదురు చూచుచు అ
చ్చలమున నున్న పిశాచిని కాకిని.
                10
తెలి సె నీ కతీంద్రియ దృష్టి, నపుడు
గాడుపు వడితో మూడు లోకములు
చరియింపగల వర మందిన ఆ
దుష్టకాక, మింద్రునికి సుతుండని,
                11
అంతట నీవు మహాబాహూ! కో
పాకుల నేత్రుడవయి, కాకమునెడ
హింసాహింసల ఎడమడువు లరసి,
జాలిమాలి కాకోలము చంపగ.
                12
నిశ్చితమతివై నీ వపు డచ్చట
పఱచియున్న దర్భలలో నొక పో
చనుగొని బ్రహ్మాస్త్రముగా అభిమం
త్రించితి, వది తీండ్రించెను కరకరి.

                13
కాలాగ్నింబలె జ్వాలలు చిమ్మెడి
బ్రహ్మాస్త్రముగొని వాయసంబు పయి
విడిచితి, వది వెంబడిపడి వేటా
డెను కాకోలంబును ప్రళయంబుగ.
               14
కాతరమతి కాకము త్రిలోకములు
తిరిగెను రక్షణకొఱకై; తండ్రి మ
హేంద్రుడు పొమ్మన, ఋషులును కాదన,
దేవగణంబులు కావలే మనగ.
               15
రక్షణ దొరకక, పక్షియు క్రమ్మరి,
ప్రాణభీతి నీపాలికి వచ్చి, శ
రణని సాగిపడ, రక్షించితి వీ
వనుకంపను వధ్యనుసైత మపుడు.
             16-17
బ్రహ్మాస్త్రమ్ము మరల్పరాని దన,
కాకము తన కుడికంటిని బలియిడి,
నీకును నీ తండ్రికిని మ్రొక్కి, సెల
వీయ వనాంతము చాయన పోయెను.
               18
అగ్రగణ్యుడు మహాస్త్రధరులలో,
సత్యసంధుడు, యశస్వి, సుశీలుడు,
రాముడస్త్ర శస్త్రములనేల ఈ
రాక్షసకుల మారణమున కెత్తడు?
               19
నాగు లేని, గంధర్వు లేని, సుర
లేని, మరుద్గణ మేని, రాఘవుని
కదనముఖంబున కాలూది నిలిచి,
ఎదిరింపగ లే, రది జగ మెఱుగును.

                   20
రాముం డెద నను ప్రేమించిన, నా
కట్టిడి చెఱ విని కరగిన, తన కో
దండము నెక్కిడి దారుణ శరముల
చంపుగాక రాక్షసులను శీఘ్రమె.
                   21
అరికులాంతకుం డయిన లక్ష్మణుడు,
అన్న అనుజ్ఞల నడిగి, ఏల ? తా
నైన రోషమున దానవులను చం
ప కుపేక్షించెడి? మా సెనె మగటిమి!
                   22
పురుష శార్ధూలములు, పవన హుతా
శన సమతేజులు, చండ విక్రములు,
దేవతలును సాధింపలేని రఘు
వీర సోదరు లుపేక్షింతురె యిటు?
                   23
నా దుష్కృతఫల మేదో బలముగ
కలదు నిశ్చయము; కాదేని యిటుల
ఏమఱి యుందురె రామలక్ష్మణులు
నాయెడ, శత్రువినాశ సమర్థులు.
                   24
దీనముగా వై దేహి కనుల బా
ష్పములు పొరలగా పలికిన, కరగెను
నా హృదయము కొందలమున, జానకి
తో నిట్లంటిని దుఃఖ మడచుకొని.
                   25
దేవీ! రాముడు నీ వియోగ దు
ర్వ్యధతో విముఖుండాయె నన్నిటను,
లక్ష్మణు డార్తి విలాపించును, నే
నొట్టు తిందు నిది గట్టి, సత్యమని.

                 26
కనబడి తీ వతి కష్టముమీదను,
ఇది దుఃఖించుట కదను కాదుసుమి,
నీ కష్టములన్నియు గట్టెక్కును.
నిమిషములోన అనింద్యయశస్విని!
                 27
రాజపుత్రులు పరంతపు, లిరువురు,
ఉత్సాహముతో ఉన్నారలు, నిను
చూడగ వత్తురు, తోడనె లంకను
వాడి శరంబుల బూడిదె చేతురు.
                 28
రణ రంగంబున రౌద్రాత్మకుడగు
రావణుని, సుమిత్ర సుపుత్రముగ వ
ధించి అయోధ్యకు దేవీ! నిను గొని
పోవును రఘురాముం డిది తథ్యము.
                 29
అనుచును వై దేహిని యాచిం చితి;
దేనిని తా గుర్తించును రాముడు,
ఏది చూడ సమ్మోదం బొదవును,
అట్టి స్వీయ చిహ్నము నా కిమ్మని.
                50
అంతట దేవి దిగంతము లరయుచు,
జడనిడుకొను పచ్చల పతకము నీ
సిగమాణిక్యము చీర ముడి విడిచి
నా కిచ్చెను నీ నమ్మకమున కయి.
                31
అట్లు, శిరోమణి నంది పుచ్చుకొని,
తిరిగివచ్చు తొందరలో, దేవికి
తలవాలిచి వందనముచేసి; ఇటు
బయలుదేఱితిని పార్థివస త్తమ!

                    32
మఱలివచ్చు సంభ్రమమున కాయము
పెంచుచున్న ననుకాంచి, తా మఱల
పలుకసాగె వరవర్ణిని జానకి,
తేటమొగము కన్నీటను తడియగ.
                    33
కంఠము పెకలక గదగదమనుచున్‌
శ్రుతులు సన్నగిల శోకాహతయై
ఎగసిపోవు నన్నీక్షించుచు వి
భ్రాంతిని పొరలుచు పలికెను నాతో.
                    34
సింహ సంహను లజేయులు నగు శ్రీ
రామలక్ష్మణుల, ప్రాణమిత్రుడగు
సుగ్రీవుని, సచివాగ్రణు లందఱ,
క్షేమము నేనడిగితి నని చెప్పుము.
                   35-36
నీ భాగ్యము మంచిది మహాకపీ!
సేవింతువు రాజీవాక్షుని నా
విభుని రాఘవుని, విక్రమశాలిని
మరది లక్ష్మణ కుమారుని నిత్యము.
                   37-38
అంతనె నే నిట్లంటిని దేవీ!
నా బుజముల పయినన్‌ వేంచేయము,
చూపెద నిప్పుడె సుగ్రీవుని, ల
క్ష్మణ కుమారు, నీ స్వామిని రాముని.
                     39
నా మాటలు విని రామచంద్ర! బదు
లాడెను దేవి “మహాకపి! ధర్మము
కానేరదు, స్వాధీననై యిపుడు
నీ వీపునబడి నేను గమించుట.”

                 40
మున్ను రావణుడు నన్ను పట్టుకొ
న్నపుడు నాకు గత్యంతర మొదవమి,
కాలదుర్గతికి కట్టుబడితి; రా
క్షసగాత్ర స్పర్శనము పాలయితి.
                 41
పొమ్ము నీవిక సుఖమ్ముగ, నృప సుతు
లున్నవాడ కనుచున్‌, నను గని, క్ర
మ్మఱ జానకి సంభాషింపదొడగె,
తన సందేహార్థములు తెల్లముగ,
                 42
బాహా బలధూర్వహుడు రాఘవుడు
ఏగతి గట్టెక్కించునో, ఆ
సన్నాహంబులు సాగింపు మచట;
నీ వొక్కండవె నేర్తు వందులకు.
                 43
రాక్షస భయతర్ణనల సొమ్మగొన,
సుళ్ళుపెట్టు నా శోకయాతనలు,
చెప్పు మీవు చూచినది రామునకు,
వెళ్ళిరమ్ము హరివీర! శుభంబగు.
                 44
నృపకంఠీరవ! నీ ప్రియపత్ని వి
షాదభాషితము సర్వము చెప్పితి,
చెప్పిన మాటలు చిత్తగించి, న
మ్ముము జానకి కుశలముగా ఉన్నది.

16 - 9 - 1967