శ్రీ సుందరకాండ (రాయప్రోలు సుబ్బారావు)/సర్గ 64
శ్రీ
సుందరకాండ
సర్గ 64
1-2
సుగ్రీవుని ప్రియసూక్తుల కలరుచు
దధిముఖు డంతట, దాశరథులకును,
ప్రభువునకును అభివాదములు సలిపి,
చదలంట నెగసె సపరివారముగ.
3
వచ్చిన త్రోవనే చెచ్చెర నాతడు
తన బలగముతో తారాపథమున
పోయి, దిగె యథాపూర్వముగా ఆ
కాశమునుండి ఎకాయకి భూమికి.
4
అచ్చట వానరు లతిపానముచే
తలకెక్కిన మాంద్యము దిగజాఱగ,
ఒడలు విఱుచుచు, మధూదక మూత్రము
విడుచుచుండి రెక్కడివా రక్కడ.
5
అపుడు దధిముఖుడు హర్ష ముఖుండయి
వారిని దగ్గరి, బద్ధాంజలియై
భాషించెను మృదుఫణితి అంగద కు
మారునితో నిమ్మళముగ నిట్టుల.
6
పాన పిపాసను వచ్చిన వీరుల
నడ్డగించిరని ఆగ్రహింపకుము,
సౌమ్యుడ ! మధురక్షకు లజ్ఞానులు,
తెలియక మిమ్ము అధిక్షేపించిరి.
7
బలశాలివి, హరివాల్లభ్యమునకు
యువరాజువు, సౌమ్యుడ ! వనపాలకు
లజ్ఞానులు, మౌడ్యమునన్ చేసిన
తప్పు క్షమింపన్ తగు ఉదారముగ.
8
వానర చక్రము పాలించెను నీ
తండ్రి వాలి మును, దానికి తగుదురు
నీ పినతండ్రియు నీవును, రాజకు
మార ! సమర్థులు లేరిపు డితరులు.
9
పోయి నీ పితృవ్యునకు చెప్పితిని
ఇచ్చట మీరలు వచ్చి విడిసిరని,
విని, సంతోషించెను కినియక, ర
మ్మని పిలిచెను మిమ్మందఱి నచటికి.
10-11
మీ రాకకు సంప్రీతి చెంది, తన
కధిక ప్రియమగు మధువనంబులో
విచ్చల విడిగా చొచ్చి, త్రాగి, మ
ల్లాడి రన్న విని ఆనందించెను.
12
దధిముఖు డటు సాంత్వనముగ తెలిపిన
ప్రభువు ప్రియామంత్రణమును విని, అం
గదు డుల్లాసము పొదల, వానరుల
యందఱితో ఇట్లనె వినీతముగ,
13
పని ముగిసిన తరువాత తోటలో
తారాడుట ఉచితంబుకాదు, వా
నర వరులార ! మనకు; శంకింతును
రాఘవుండు మన రాకను వినెనని.
14
మనసారగ త్రాగిన కపి వీరులు,
సొమ్మలు పాయ సుఖమ్ముగ లేచిరి,
వానర పరమేశ్వరుడగు సుగ్రీ
వుని సన్నిధి కిక పోవలె శీఘ్రమె.
15
హరికుల నాయకు లందఱు మీరలు
చెప్పినట్లు నడచెద జవదాటక,
నిర్వాహకులే నిర్ణాయకులని
నమ్ముదు నేను మనః ప్రమాణముగ.
16
రఘురాముని కార్యము సాధించిన
యోధవరుల నే యువరాజు ననుచు
ఆజ్ఞ లు పెట్టుట అపచార, మయు క్తము
మీ యెడ నట్టుల మెలగ నెన్నడును.
17
అటు, లంగదు డిష్టార్థము తెలుపగ ,
విని, వానరకుల వీరులందఱును,
మానసములు సమ్మదమున పొంగగ
బాగుబాగనుచు పలికి రొక్కసుతి.
18
రాజకుమారక ! ప్రభువువయ్యు, ఇటు
వాకొ నె నీవలె పాలకు డెవ్వడు ?
సర్వము నేనని సందడింత్రు నృపు
లైశ్వర్య మదం బావేశింపగ.
19
నీ విపు డాడిన నిజ ఋజువాక్యము
తగియున్నది తథ్యము నీ కొకనికె,
రానున్న శుభార్థమున కీ వొకడ
వర్హుడవని వినయము రూపించెను.
20
మే మందఱమును నీ మాటనె పా
లింతుము, హరీకులీన కోటికి ప్ర
భువయిన సుగ్రీవుని పాలికి తత్
క్షణమె యేగ సిద్ధముగా నుంటిమి.
21
నీ యానతి లేనిది మే మెవ్వర
మడుగు దీసి ముందడుగు పెట్ట మిక ,
ముమ్మాటికి సత్యమ్మని నమ్ముము,
తిరుగు లేని వానరుల శపథ మిది.
22-23
ఆ మాటల కపు డంగదు డీకొని,
ఇపుడె పోదమని యెగ సెను మింటికి,
ఆతని వెంటనె హరిగణ మెగసెను,
యంత్రము చిమ్మిన అచలము రీతిని.
24
అధికవేగ వారిధులవలె కపుల
సంఘము లప్పుడు సందడించె, సుడి
గాలి కొట్టగా కంపించి ఘనా
ఘనములు గర్జించిన చందంబున.
25
ఇంకను రాడాయెను యువరాజని
వేగిరించు రఘు వీరుని తహ తహ
పోలిచి, సుగ్రీవుం డతని మన
స్తాపమాఱ నోదార్చె తానిటుల.
26
ఊరడిల్లుము రఘూత్తమ ! శుభమగు,
సీత దర్శనము సిద్ధించిన, దటు
కాకున్న, గడువు గడచి నా కడకు,
రాజాలరు వారలు తథ్యం బిది.
27
బాహు విక్రమ ప్రథితుడు, యువ రా
జంగదుడు కపికులాగ్రణి, కార్యము
విఫలమైనచో విచ్చేయడు సుమి,
నా యెదటికి ఎన్నండును రఘువర !
28
చేపట్టిన పని చెడిపోయినచో
వారలిట్లు మధుపానమునకు తల
పడరు; దీనులయి వాడిన ముఖముల,
ముందు వెనకలై మందటిల్లుదురు.
29
తరతరముల తాతలు తండ్రులును, ప్ర
తిష్ఠించి, మనసుతీర పెంచి, యి
చ్చిన మా మధువనమును యువరా జిటు
చొచ్చి చూఱగొని శూన్యము చేయడు.
30
కాఱియపడకుము కౌసల్యాసుత !
ఊరడిల్లుము, విచారము మానుము,
సీతను దర్శించెను హనుమంతుడు,
సందేహము లేదిందుకు సువ్రత !
31
హనుమ యొకడె కార్యము సాధింపగ
లా, డితరులకు అలవికానిది యిది;
దక్షతయును, సాధన సంపత్తులు
కల, వాతని కొక్కనికె సమృద్ధిగ.
32
కృషియు, ధృతియు, శక్తియుగల హనుమయు,
అంగద జాంబవదాదులు అధినే
తలయి నడిపిన జతనములు, విఘ్నము
లగుటెట్లు? రఘుకులాన్వయ రత్నమ !
33-34
చింతింపకు రఘుశేఖర ! వినబడు
హనుమజ్జయ దర్వాతిశయంబున
ఈ తలమ్రోతల నేగుదెంచు కపి
కులవీరుల కిలకిల మన కింతనె.
35
కార్యసిద్ధి సంగతులు తెలుప కి
ష్కింధకు వచ్చెడి కింకిర సంకుల
మంతలోన విని, అలరి హరీశుడు,
లోళించెను తన వాలాభరణము.
36-37
హర్షముతో హృదయములు తొణక , కపు
లందఱును హనుమ ముందుండగ, అం
గదునితోడ, రాఘవ దర్శన కు
తుక మొరయ, హరీంద్రుని పొంత దిగిరి.
38
తోడనె, హనుమంతుడు, మహాభుజుడు,
వినయ వినీతుడు వేడుకతో, తల
వాల్చి మ్రొక్కి, రఘువరుతో ననె, ఉ
న్నది, దేవి నియతి నక్షతయై అట.
39
సుగ్రీవుండును సుస్తిమితుండా
యెను, సాధించెను హనుమంతుడె కా
ర్యంబని; లక్ష్మణు డాత్మప్రీతి, క
టాక్షించె బహుమతాక్షుల హనుమను.
40
శత్రుసూదనస్వామి రాఘవుడు
పరమప్రీతిని పొరలి సుఖించుచు,
హనుమంతుని ప్రేమాదర మసృణా
లోకనముల అభిషేకించె నపుడు.
14-9-1967