శ్రీ సుందరకాండ (రాయప్రోలు సుబ్బారావు)/సర్గ 62

శ్రీ

సుందరకాండ

సర్గ 62

              1
అంతన హనుమ దయామతి, వానర
వీరులతో ననె, బెదరక చెదరక
త్రాగుడు మనసారగ మధుసారము
నే వారింతును మీ విరోధులను.
                2
హనువద్వచనము లాలకించి, మం
చి దనుచు హరికులశేఖరు డంగదు,
డఖిల సహచరుల కనుమతి నిచ్చెను:
కడుపునిండ త్రాగుడు మధువంచును.
                3
కృతకృత్యుండయి యేతెంచిన హను
మంతుని పలుకు ప్రమాణంబు మనకు,
ఆతని అభిమత మాదరణీయ, మ
కార్యంబైనను కరణీయంబగు.
                4-6
అంగదు డాడిన అభిమతోక్తులకు,
వానరు లందఱు బాగు బాగనుచు
భూషించుచు వనమును చొచ్చి రపుడు
వఱద పొర్లిన ప్రవాహవేగమున.

                 7-8
సీతజాడ తెలిసినదను పొంగున,
అంగదు మాటల ఆదరువున, వన
పాలకుల నడచి, పండ్లు తినిరి, తే
నెలు త్రాగిరి, మత్తిలగ వానరులు.
                9
బారులు తీరిచి కూరుచుండి, ఆ
కుల దొప్పలు చేతులను పట్టుకొని,
తేనె పోసికొని పానము చేసిరి,
చించి పార వేసిరి తుద కన్నియు.
               10
తేనె తిక్క యెత్తిన కపులొక కొం
దఱు కయ్యాలకు తారసిలిరి; కొం
దఱు తేనె పెఱలు విఱిచి కొట్టుకొన
సాగిరి తెగబడి త్రాగిన మత్తున .
               11
కొందఱు మ్రాకుల క్రింద పాదులను,
కొందఱు కొమ్మల సందుల, కొందఱు
రాలిన ఆకుల రాసులపై , ఒడ
లెఱుగక వ్రాలి శయించిరి తూగుచు.
               12
కుత్తుక బంటిగ క్రోలి మధువు, ఉ
న్మత్తు లగుచు కై పెత్తి కాఱుకూ
తలకు దిగిరి, మాటలు మితిమీఱగ,
కొట్టుకొనిరి ఒక్కొకరు కలియబడి.
                 13
సింహనాదములు చేసిరి కొందఱు,
అఱచిరి కొందఱు ఆపరాని తమి,
మధువు త్రాగి మైమఱచిన కొందఱు,
నేలమీదబడి నిద్దురపోయిరి.

                14
ఒక డొకపని చేయుచు నవ్వగ, వే
ఱొకడు మఱొకదానికి తలపడు వెస; .
చేసిన కార్యము చెప్పుచుండగా,
ఒక్క డడ్డపడు వెక్కసి చేష్టల.
               15
మధురక్షకులగు దధిముఖు భృత్యుల
నతిభీమముగా అడచి కపులు ప్రహ
రించిన, వారును అంచెలంచెల ప
లాయితులైరి యథాయథ లగుచును.
                 16
కొంద, ఱొఱగి పడ కొట్టి, పొడిచి మో
కాళ్ళ దేవమార్గమునకు త్రిప్పిరి,
కావలికాం డ్రది కని వెఱచిపఱచి
దధిముఖుతో కొందలమున పలికిరి.
                  17
హనుమ యొసంగిన అభయబలంబున
ఉద్యానవనము ఉత్సాదించిరి,
వానరు; లదలింపగ మము పడమొ
త్తి ముడిచి చూపిరి దేవమార్గమును.
                 18
మధువన విధ్వంసమునకు దధిముఖు
డలిగి, కపుల దూఱాడి, సేవకుల
నోదార్చుచు, ఇదె, పోద మందఱము
దండింతము ఆ త్రాగుపోతులను.
                  19
రం డిటు, మధువన రక్షకు లందఱు,
మనము పోయి దుర్మదులయి తేనెలు
త్రాగుచున్న కపితండములను వా
రింతము, పొగ రడగింతము బలిమిని.

                    20
అనుచు స్వామి పలికిన పలుకులు విని
మధురక్షకులును 'మంచి' దను చపుడు,
మళ్ళిరి తోటకు కేళ్ళుఱుకుచు, అం
దఱు నేకంబుగ దధిముఖు వెంబడి.
                   21
దారి మధ్యమున దధిముఖు డొక వృ
క్షము పెకలించి, బుజాన పెట్టుకొని
బిర బిర పరుగిడె, భృత్యు లందఱును
అట్లె చేసి వెనకాడక నడచిరి.
                    22-23
మఱికొందఱు సంభ్రమమున మధ్యే
మార్గమం, దలవిమాలిన తాళ్ళను
ఱాళ్ళ నీడ్చుకొని త్రుళ్ళుచు పెల్లుగ
పరుగులెత్తి రురవడి బరవసమున.
                   24
వేలకొలది వనపాలకు లట్టుల
నేగి తోటలో అలసి నేలపయి
పడియున్న కపుల పై బడి తడయక
బిట్టుగ కొట్టిరి పెడమోఱకమున .
                   25
అది గని, దధిముఖు డాగ్రహించి వ
చ్చెనని మేలుకొని, హనుమత్ప్రముఖులు
పటువేగంబున పరుగిడి చేరిరి
వనరక్షకులను వాలాయింపగ.
                 26
పూజ్యుడైన దధిముఖుడు క్రుద్ధుడై
చేవ చెట్టొకటి చేతపట్టుకొని
వచ్చుచుండగని, వాలిసుతుడు ప్రహ
రించె నతని తన రెండు చేతులను.

               27
మధుపానంబున మ త్తిలి అంధుం
డయిన అంగదుడు, ఆర్యకు డతడను
తెలివి రాక , మర్దించి మెత్తగా
నలిపి నేలపయినన్ పడత్రోసెను.
                28-31
గాటపు దెబ్బలు గాయములై నె
త్తురు చిప్పిల్లగ, తొడలు సడల, చే
తులును బుజాలును తునుకలై విఱుగ,
స్మృతి తప్పి, తలతిరిగి, నేలం బడె.
                  ?
వానర విభునకు మేనమామయగు
దధిముఖు డెటులో త్రాణగొలుప, స్పృహ
వచ్చి, పిలిచి సేవకుల నందఱిని,
ఏకాంతంబున వాకొనె మెల్లన.
                 ?
ఈ త్రాగిన కపు లిచటనె గుట్టలు
పడియుండగనిండొడలెఱుగక; మన
మేగి సైనికుల ఆగడములు సు
గ్రీవ రాఘవులకే యెఱిగింతము.
                   32
తప్పిదమంతయు ఇప్పు డంగదుని
దనుచు నివేదింతును హరీంద్రునకు,
ఆగ్రహశీలుడు సుగ్రీవుడు శి
క్షించును మదమెక్కిన ధిక్కారుల.
                  33
ఈ మధువనమును ప్రేమించు మహా
త్ముడు సుగ్రీవు డెపుడును, పితృపితా
మహు లార్జించిన మాన్యము, దేవత
లకు నలభ్య మీ లలితా రామము.

                 34
మధువుమీది దుర్మమత కవశులై
ఆయుష్యము కోల్పోయి రీకపులు,
సుగ్రీవుడు నిష్ఠురముగ దండిం
చును మదాంధులను సుహృదుల తోడుత.
                  35
రాజాజ్ఞ లను తిరస్కరించిన దు
రాత్ము లెవరయిన హంతవ్యులు, వీ
రస్తమించిన కృతార్థమగును మన
క్రోధభూతమగు రోషజాతమును.
                 36
అట్లు దధిముఖుడు అనునయోక్తులను
ఓదారిచి, ఇక పోదము రండని,
తోటకాపరులతో శీఘ్రముగ ఎ
గిరిపోయెను సుగ్రీవు సన్నిధికి.
                  37
అటు లందఱు చద లంటుచుపోయి, ని
మేషములోన సమీపించి దిగిరి,
సూర్యసుతుండగు సుగ్రీవుండు వ
సించు వనాలయ సీమాంచలమున.
                 38
రముకులీనులగు రామలక్ష్మణులు,
సుగ్రీవునితో సుఖమున్న సమం
చిత భూమిని వీక్షించి, ఆకసము
నుండి దిగె దధిముఖుండు బలగమును.
                  39
ప్రథిత బలాఢ్యుడు, వనరక్షకులకు
అధిపతియు నయిన దధిముఖు డంతట,
వానర పరమేశ్వరుని అంతికము
చేరవచ్చె పరివార సమేతము.

                  40
శిరమున చేతులు చేర్చి, ఆత డట
దీనముఖముతో వానరదేవుని
శుభచరణంబులు సోకగ వ్రాలెను,
రాజలోకమర్యాదల క్రమమున.

7-9-1967