శ్రీ సుందరకాండ (రాయప్రోలు సుబ్బారావు)/సర్గ 39
శ్రీ
సుందరకాండ
సర్గ39
1
చేతి కిచ్చి మణి, సీత యిట్లనియె,
వానరవర ! ఈ యానవాలు నే
నంపినదని తడయక నమ్మును ప్రా
ణేశుడు, రాఘవు డెఱుగు దీనికథ.
2
ఈ చూడామణి చూచినయంతనె
స్మరియించును మువ్వురను రాఘపుడు,
జననిని కౌసల్యను, నన్నును, జన
కుని దశరథ నృపతిని, విఖ్యాతుని.
3
ఎటు మొద లిడదగు నీ కార్యంబును,
పిదప నేమి కావింపవలయు, అది
ఉత్సాహముతో యోచింపుము, దా
నికి సమర్థుడవు, నీవె మనీషీ !
4
నా కష్టము లంత మగుట కెయ్యది
ఆవశ్యకమో భావింపుము మది,
అది సాధింపగ యత్నింపుము హరి!
కడముట్టింపుము కట్టిడి దుఃఖము.
సుందరకాండ
5
సీత యట్లు యాచించి యూరకొన,
వల్లె యనుచు పావని, మహాబలుడు,
ప్రతినచేసి, తలవాల్చి వినతి,సీ
తకు ప్రణమిల్లి , కదలె ప్రయాణమై .
6
తిరుగు పయనమున తఱలిపోవు హను
మను చూచి మఱల మైథిలి యిట్లనె,
కనుల నశ్రు లుత్కటమై కంఠము
బంధింపగ రాల్పడిన యెలుంగున.
7
అడిగితి క్షేమంబని చెప్పుము, హరి !
కూడియున్న రఘుకుల నందనులకు,
సుగ్రీవునకును, సుహృదులకు, సచివ
వృద్ధుల, కఖల కపిప్రవరులకును.
8-9
ప్రాణము లుండగ పత్ని నుద్ధరిం
చెను ధర్మాత్ముడు శ్రీరాముండను
కీర్తి వెలయగా వర్తింపు మనుము;
నా దుఃఖము మాన్పగ నీవె తగుదు.
10-11
నిత్యము వదలక నీ వుత్సాహము
తొలక చెప్పు పలుకులు విని రాముని
మనసు నా వయిపు మఱలి, పౌరుషము
చూప నుత్సహించును నను పొందగ.
12
నీవు నాదు సందేశము చెప్పిన
రాఘవుడు విని పరాక్రమించి, త
ప్పక వీరవిధాయక తత్పరుడగు,
చక్కపడు సమస్తమును మహాకపి !
సర్గ 39
13
సీత వాక్యములు చెవియొగ్గి వినిన
అనిలనందనుడు హనుమంతుండును,
శిరసున చేతులు చేర్చి వినయముగ
బదులు పలికె బరవసము దీటుకొన.
14
రాగల డిచటికి రాముడు శీఘ్రమె,
వానర భల్లుకసేనలు మునుకొన,
సమరంబున రాక్షసుల చంపి, నీ
శోకము చల్లార్చును శుభగాత్రీ !
15
రాముని బాణపరంపర కురియగ
త్రాణలు తప్పక రణరంగంబున
నిలబడగల యోధులు కనిపింపరు
నరులలో సురాసురులలో నయిన .
16
ఆని మొనయందున, అందును నీ కో
సము వచ్చిన యుద్ధమున, రాఘవుడు,
ఇంద్రునేని, దివసేంద్రునేని, యము
నేని, తుదకు సహియింప కెదుర్చును.
17
రత్నాకర సూత్రము మొలనూలగు,
క్షితిచక్రము శాసింపగలడు రా
ముం, డా విజయాభ్యుదయము సిద్ధిం
చును నీ మూలంబున తపస్వినీ !
18
అట్లు విహితముగ హనుమంతుడు ప
ల్కిన సుభాషితములను మెచ్చుకొనుచు,
జానకి క్రమ్మఱ సంభాషించెను
మనసులోని అలమట లురియాడగ.
సుందరకాండ
19
పయనము కట్టిన పావని వైపున
తిరితిరిగి వావిరి వీక్షింపుచు,
భర్తృస్నేహము, పల్లవింప మె
త్తని యెలుగున ఇట్లనెను జనకసుత.
20
ఇంచుక తడయగ ఇష్టమున్న నీ
వీ నికటంబున కానరాని కడ,
ఒక్కదినము శ్రమతక్క నిలిచి పో
వచ్చు, లేచి వఱువాతనె మారుతి !
21
చేసిన యేకించి దదృష్టమున నొ
తావక సాన్నిధ్యసుఖం బబ్బెను,
ఇంచుకంత లభియించె తెఱపి నా
తీవ్రదుఃఖ దుర్ధినముల నడుమను.
22
పోయిరమ్ము హరిపుంగవ ! క్రమ్మఱ;
నా ప్రాణము లందాక బొందిలో
ఉండునో లేదో ఊహింపగ లే
నది; దినగండము బ్రదుకీ చెఱలో,
23
నెమ్మి నెఱపి యిటు నీ వేగిన నిను
చూడని దుఃఖము పీడించును నను,
దుఃఖము విడిచినతోడనె పొడిచిన
దుఃఖము మిక్కిలి దుస్సహం బగును.
24
ఒక్క సంశయము కక్కసించు నను
కపికుంజర ! అక్కడ మీ బల మంతయు
కపులును భల్లూకము లంతియెగద,
సాయము రణమున చేయజాలినవి.
సర్గ 39
25
వానర భల్లుకబలము కాని, రా
ఘవ సోదరులే కాని, తమంతట
దుష్పారంబగు తోయధి నెట్టుల
దాటివత్తు రీ యేటిగడ్డపయి.
26
వాయు సుపర్ణులు, పావని వీవును,
మువ్వురు మాత్రమె భూతకోటిలో
కలరు, మహాసాగరమును దాటగ
చాలిన లాఘవ జవసాహసికులు.
27
కనబడుచున్నది కండ్ల కట్టెదుట,
దాటరాని దీ యాటంకము, ఎటు
పరిహరింతు వీ వరసిన చెప్పుము,
కార్యదక్షుడవు కపివీరాగ్రణి !
28
ఈ కార్యము ఫలసాకల్యముగా
నిర్వహించుటకు నీవు సమర్థుడ
వరిమర్దన ! నీ యశము లోకముల
స్వీయబలోపార్జిత మూర్జితమగు.
29
నా కొఱకయి సైన్యములు కూర్చుకొని,
సత్యసమరమున దైత్యునోర్చి, విజ
యుండయి నాధు డయోధ్య కేగుట, య
శస్కరమగు నీ చరితకు నాకును.
30
ఈడులేని విలుకాడు రాఘవుడు,
బాణధార జడివాన కురిసి, లం
కను నీటగలిపి, ననుకొని పోవుట
అనుగుణమ్మగును అతని ఖ్యాతికి.
31
అరికులాంతకుడు, ఆహవశూరుడు
రాఘవు డను క్షాత్రప్రఖ్యాతికి,
అనువుగ వీరవిహారము జరిగెడి
సమరవ్యూహము సమకూర్చుము హరి !
32
హితకరములును సహేతుకములు నగు
జనకజ వాక్యములను గమనించి,ని
దానించి సమాధానముగా, ఇటు
పలికె నామెతో పవననందమడు.
33
దేవి ! ప్రభువు సుగ్రీవుడు తన భ
ల్లూక వానర చమూకోటిని అం
కితము చేసె నీకై రాఘవునకు,
సర్వసత్వ బలసంపూర్ణు డతడు.
34
వేలుకోట్లు కపివీరాగ్రేసరు,
లొక్క యుద్ధవిడి యుద్ధకాంక్షతో,
రాక్షసకుల మారణదీక్షను సు
గ్రీవువెంట దూకెదరు లంకలో.
35
విక్రమ సాహస భీమబలాఢ్యులు,
మనసుతోనె రయమున వాలగలరు;
వానరభల్లుక సేనలు పతులును,
వత్తురు సుగ్రీవప్రభు నాజ్ఞను.
36
మిఱ్ఱుపల్లములు, మెలికలు, తిరుగు,
ళ్ళడ్డగలే పా గడ్డు వానరుల,
అలవికాని కార్యములకు జంకరు,
అతి తేజోమయు లని మొన వారలు.
37
ఏడుసముద్రము, లెనిమిది పర్వత
ములతో శోభిలు భూచక్రమును, ప్ర
దక్షిణించి రుత్సాహముతో పలు
మారులు మున్ను సమీర మార్గమున.
38
నాకంటెను మిన్నలును సమానులు,
కల రెందఱొ మా కుల విఖ్యాతులు
సుగ్రీవునికడ, సుముఖీ ! నాకం
టెను కనీయు డొకడును లేడచ్చట.
39
అధికుల నంపరు అన్నిపనులకు, క
నిష్ఠుడని నను పనిచి రీపనికయి,
కడలిదాటి నీ కడకు నేనె రా
గలిగితి, ఇక పెద్దల తలపెందుకు ?
40
విలపింపకు దేవీ ! నీ శోక త
పనలు శమించును, వానరసేనలు
ముమ్మరముగ దిగి మొగరించును లం
కావాసులు దిక్కా మొగములుగాన్ .
41
జోడుసింహముల పోడిమి మెఱసెడి
రామలక్ష్మణులు నా మూపురముల
మీదనె వచ్చి సమీపింతురు నిను;
పొడుచుచున్న సూర్యుడు చంద్రుడువలె.
42
నరవరేణ్యులు, రణభయంకరులగు,
రఘుకులవీరులు రామలక్మణులు,
కలిసివచ్చి లంకను పట్టి, వివిధ
సాయకముల నాశనము చేయుదురు.
43
రావణేశ్వరుని రాక్షసగణముల
నాహవమున హతమార్చి సమూలము,
నిను కొనిపోవును నిజపురంబునకు,
శీఘ్రమె రఘుకుల శేఖరు డార్యా !
44
ఊఱటచెందుము, యోగకాలమును
కాంక్షింపుము, మంగళమగు, మైథిలి !
ఇంతలోనె వీక్షింతువు నీ విభు,
జ్వాలాభరణ కృశాను సమానుని.
45
ఈ దశకంఠుడు సోదర మిత్ర క
ళత్ర బాంధవ బలంబులతో తెగ,
కూడదు రామునితోడ నీవు, రో
హిణి చంద్రుని కూడిన కైవడి నిట.
46
కళ్యాణీ ! వేగమె నీ వీ ఖర
కష్టసముద్రము గట్టెక్కద, వతి
శీఘ్రముగనె చూచెదవు రామశర
కాండంబుల దశకంఠుడు తెగిపడ.
47
ఇటుల వైదేహిని ఓదాఱిచి
తిరిగిపోవు బుద్ధిని తమకించుచు
మారుతి, క్రమ్మఱ మైథిలి వైపున
చూచు చనియె నౌత్సుక్యముతో నిటు.
48
ఆత్మవిదుడు, రిపుహంత రాఘవుని,
చాపధరుని లక్మణకుమారునిన్ ,
లంకవాకిటి కెలంకుల చూతువు
అతిశీఘ్రముగా శతపత్రేక్షణ !
49
సింహంబుల వాసిని, బెబ్బులుల బ
లిమిని, మదగజేంద్రముల బీరమున,
విక్రమింత్రు కపివీరులు గోళ్ళును
కోరలు శరముల తీఱున క్రాలగ.
50
కొండలుబోలిన గండువానరులు,
మేఘంబులవలె మిఱుమిట్లొఱయగ,
గర్జించుచు, లంకా మలయాచల
సానువుల తిరుగుసందడి విందువు.
51
తల్లీ ! అతను నిదాఘపీడలను
సుఖమెఱుగక , ఉస్సురనుచు వేగును,
రాఘవు డంతర్ధాహ వేగమున ;
కేసరి బరి చిక్కిన మదకరివలె.
52
ఇక, శోకంబున నేడ్వ కనదవలె,
మనసున అప్రియమును శంకింపకు,
నీవును నాథునితో విహరింతువు,
దేవేంద్రునితో దేవి శచి పగిది.
53
రామునికన్న పరమ విశిష్టు డిల
కలడె ? ఎవరు లక్మణు సరివత్తురు ?
పవనపావక ప్రాయులు నీ కా
శ్రయులై యొప్పెడి రాజసోదరులు.
54
రాక్షస హింసా రౌద్రభూమియగు
లుకనుండ వీ వింక దీర్ఘముగ,
వచ్చు నీ విభుడు వైళమె, సైపుము,
పోయివత్తు కమలాయతలోచన.