శ్రీ సుందరకాండ (రాయప్రోలు సుబ్బారావు)/సర్గ 35

శ్రీ

సుందరకాండ

సర్గ 35


                   1
వానరోత్తము డనూనముగా రా
ముని చరితంబును వినిపింపగ సతి,
అభిముఖియై సౌమ్యముగా ఇట్లనె
తిన్నని ఎలుగున తీయని మాటల.
                   2
కలిసికొంటి వెట్టుల రాముని ? నీ
వెఱిగితి లక్ష్మణు నే చందంబున ?
నరులకు మీ వానరులకును సమా
గమ మెట్టుల గహనమున ఘటిల్లెను ?
                   3
చెప్పుము వానరశేఖర ! రాముని
లక్షణంబు లేలాటివో ? లక్ష్మణు
చిహ్నము లెట్టివొ శీఘ్రమె; నా హృది
శోకక్షుభితము కాక పూర్వమే.
                   4
రాముని ఆకారప్రభ లెట్టివి ?
అవయవ శుభవిన్యాసం బెట్టిది ?
చేతుల తొడల విశేషము లేమి ? వి
లక్షణుడాయెను లక్ష్మణు డెందుకు ?


                  5
జానకి అట్లు ప్రసన్నముగా, త
న్నడిగి యూరకొన; హనుమయు తోడనె
అభివర్ణింపగ ఆరంభించెను
రాఘవుని యథార్థ స్వరూపమును.
                  6
ఎంత యదృష్టమొ ! ఎఱిగియుండియును
నన్నడిగితి నీ నాథుని కలరూ
పును, లక్ష్మణురూపును, కమలాక్షీ  !
ప్రతిపన్నుడనేవారి కిద్దరికి.
                  7
అవధరింపు మసితాయతలోచన !
రాజకుమారుల రామలక్ష్మణుల
ఇరువురలోపల నే గుఱుతించిన
రూపురేఖలు నిరూపించెద నిక.
                 8
సర్వభూత రంజకుడు, పద్మప
త్రములువోలె నేత్రములు హసించును,
పుట్టుకతోడనె పెట్టని నగలై
దై వారె దయాదాక్షిణ్యంబులు.
                 9
తేజంబున ఆదిత్యుని, తాల్మిని
భూదేవతను, సుబుద్ధిచే బృహ
స్పతిని, కీర్తిచే స్వర్గపాలకుని,
సాటివచ్చు ఇక్ష్వాకు కులాగ్రణి.
                 10
రక్షించు స్వధర్మము, రక్షించు స్వ
జనమును, రక్షించును సచరాచర
జీవసంతతి నశేషము, రక్షిం
చును ధర్మప్రతిష్ఠను, పరంతపుడు.


                  11
నేలమీదగల నాలుగు కులములు
పాలించును నిష్పక్షపాతమతి,
లోకాచారములు సవరించు, తా,
నడచు, ఇతరులను నడిపించు నియతి.
                  12
తేజోవిభవాధికుడు, పూజితుడు,
పాలించు సదా బ్రహ్మచర్యమును,
ఉత్తమజనులకు ఉపచారములును,
కర్మపరుల కుపకారములు సలుపు.
                  13
అఖిల రాజవిద్యల సుశిక్షితుడు,
అనయము బ్రాహ్మణుల నుపాసించును,
జనవాక్యము నెఱిగినవాడు, సుశీలుడు,
సంపన్నుడు, రిపుశమనుడు రాముడు.
                  14
యాజుషధర్మ నియామ వినీతుడు
అభ్యసించె వేదాంగములు, యజు
ర్వేదమును ధనుర్వేదమ్మును ; పూ
జింత్రు శ్రోత్రియులు శిష్టులు నిష్ఠులు.
                   15
కంఠమొప్పు శంఖమువలె, కండలు
పొసగిన చక్కని మూపులు, దీర్ఘ భు
జములు, మంగళాస్యము, ఎఱ్ఱని క
న్ను లని చెప్పుకొందురు జను లాతని.
                   16
దుందుభిస్వనము చిందు కంఠమున,
నునుపు మెఱయు మేనున, శూరుని ధృతి,
సుమవిభక్త సుభగములగు అంగము,
లొప్పియున్నవి రఘూత్తమునకు సతి !



                        17
మూడు స్థిరంబులు, మూడు దీర్ఘములు,
మూడు సమంబులు, మూ డున్నతములు,
మూడు లోతు, లెఱుపులును మూడు, మె
త్తనివి మూడు; రాముని అంగంబులు.
                        18
ముడుతలు వంపులు మూడుమూడు, మూ
డు తలసుడులు, నాలుగు అంగములును,
కళలు నాల్గు, రేఖలు నాలుగు, నా
ల్గు సమంబులు, కిష్కువులును నాలుగు.
                        19
నాల్గు గతులు, దంతంబులు నాలుగు,
పెద్దవి కణతలు, పెదవులు, ముక్కులు,
పదునాల్గు జతలు, చదరము లెనిమిది
యెముక లయిదు స్నిగ్ధము లవయవములు.
                       20
పది పద్మంబుల వంటివి, పది యె
త్తయినవి, విఖ్యాతములు మూడు, శు
ద్ధములు. రెం, డున్నతము లారును, తొ
మ్మిది సన్ననివి, అమేయుడు మూడిట.
                      21
ధర్మసత్య పరతంత్రు, డనుగ్రహ
సంగ్రహ క్రియాశాలి, దేశ కా
ల విభాగవిదుడు , లక్మీపూర్ణుడు,
సకల లోకంబులకును ప్రియు డతడు.
                     22
ఇద్దరు తల్లుల ముద్దుబిడ్డడు, సు
మిత్రాసుతు; డుపమింపగ నొప్పును,
అన్న రాముతో, అనురాగమున, సు
రూపమున, గుణకలాపమున సతీ !


                   23
పులిపిల్లలవలె భూపకుమారులు
నాలుగుమూలల నేలను నీకయి
వెతకుచు తిరుగుచు విపినంబులలో
కలిసిరి మాతో తలవనితలపుగ.
                   24-25
అపహరింప రాజ్యంబు నగ్రజుడు,
వెఱచి పఱచి, బహువృత సాంద్రమగు,
ఋశ్యమూకగిరి పృష్ఠ భాగమున
చూచిరి ప్లవగేశుని సుగ్రీవుని.
                   26
అన్న రాజ్యమును ఆచుకొనంగా
ఆవలపోయిన ఆ సుగ్రీవ
స్వామి సన్నిధిని పరిచర్యల కే
ముంటిమి, అడవుల నంటిపట్టుకొని,
                   27-28
నారచీరలను నడుములను బిగిచి,
ధనువులు చేతుల తాలిచి వచ్చిన,
వారిని గని భయవశుడై దూకెను
వానరపతి పర్వతముపైకి వెస.
                   29
వానరేశ్వరుడు తాను పర్వతము
నెత్తమునందే నిలిచి శీఘ్రముగ,
నన్ను పంపెను వనాటుల వారల
చూచి విచారించుము నీ వనుచును.
                   30
అటు సుగ్రీవుడు ఆనతి యిచ్చిన
ప్రభువు పలుకులను పాలింపగ అతి
రూపలక్షణ సురుచిరులయిన నృప
శార్దూలంబుల సన్నిధి కేగితి.


                  31
వచ్చిన కార్యవివరము లన్నియును
వారల కెఱిగింపగ, ప్రీతులగుచు,
ఇరువురు కూర్చుండిరి నా వీపున
చేర్చితి కపికులశేఖరు చెంతకు.
                  32-33
అచట హరీశ్వరు డాదరమున భూ
వరసుతులను విశ్వాసముతో గొనె;
చెప్పుకొనిరి గడచిన తమ కథలను,
ఊరడిల్లి రొండొరులు ప్రీతులయి.
                  34
స్త్రీ మూలముగా జ్యేష్ఠ సోదరుడు,
అపహరించెను సమస్త రాజ్యమని,
శోచనీయమగు సుగ్రీవునికథ
విని ఓదార్చెను వెంటనె రాముడు.
                  35
చెప్పగ లక్మణు డప్పుడు రావణు
డపహరించె నిన్నడవిలో ననుచు,
సుగ్రీవుడు విని శోకించె, నిరప
రాధి రాముని దురంత విపత్తికి.
                  36
వానరపతి రామానుజుండు చె
ప్పిన దంతయు విని, వెలవెలబోవుచు,
నిస్తేజుండయి నిలిచెను; గ్రహణ
గ్రస్తుడయిన భాస్కరుని చందమున.
                  37
రాక్షసు డటు నిను గ్రక్కదల్చి, విను
వంక హుటాహుటి పఱచు సమయమున,
కోపతాపములనోప, కీ వొలిచి
తీసి క్రిందపడవేసిన సొమ్ములు.


                     38
నీ యంగము లెడబాయక మెఱసిన
వాటి నన్నిటిని వానరులు వెతకి,
తెచ్చి రాఘవున కిచ్చిరి; వారికి
తెలియదాయె నిను తెచ్చిన మార్గము.
                     39
మింటినుండి భూమిని పడవేయగ,
మ్రోయుచు రాలిన నీ యాభరణము
లేనె తెచ్చితిని; వానిని చూచుచు
రాము డగలి మూర్ఛావశు డాయెను.
                    40
ఆ నగలను కని ఆదరంబుతో,
అక్కున నిడుకొని ఆవురుమని యే
డ్చెను భరియింపగ లేక, దేవ వ
ర్చస్కు డయిన రఘురాముడు పొరిపొరి.
                    41
మాటిమాటికిని వాటిని చూచుచు
పొరలి తెరలు వగపున వాపోయెను,
నిన్నెడ బాసిన నెవ్వగ పొగయుచు
నగలు చూడగనె రగిలి మండనగు.
                    42
అట్లు దుఃఖమున అవశుడైన రా
ఘవుని నేనె అతికష్టంబున, ఉప
చారవాక్యముల చాలసే పనున
యించి, తేర్చితిని యెట్లో దేవీ !
                   43
మఱమఱి తాకుచు మంగల్యములగు
సొమ్ముల నాదట చూచిచూచి, త
మ్మునికి చూపి, యిచ్చెను సుగ్రీవున,
కశ్రులు నిండగ ఆయతాక్షులను.


                  44
నీవు కనబడని నిష్ఠురశోకము
వేపగ కుమిలి, తపించు, నెల్లపుడు
రాఘవు; డంగారములో లోపల
కాలుచున్న ఇంగలపు కొండవలె.
                 45
నీ కారణమున శోకమగ్నుడయి,
నిదుర రాక చింతించుచు, దుస్తా
పమున చలించును పార్థివ పుత్రుడు,
అగ్నులు కాల్చెడి అగ్నిగృహమువలె.
                 46
నిను చూచెడి పున్నెము దూరముకాన్
శోకాకులుడై సుడివడె రాముడు,
భూకంపముచే మొదలు కదలి అ
ల్లాడుచున్న హేమాచల మట్టుల.
                 47
నీవు పజ్జలేని మనోవ్యధలో
ఇంపుగావు రాజేంద్ర పుత్రునకు,
పచ్చనితోటల పడకలేని, చ
ల్లని సెలయేళ్ళ కెలంకు లేనియును.
                 48
రిపువృషభములకు నృపశార్దూలము
రఘురాముం; డచిరమె యీ లంకను
లంఘించి, సమూలముగా రావణు
పుత్రమిత్ర బలముల హతమార్చును.
                  49
నిన్ను వెతకుటకు నిశ్చయించు నెడ
చేసిన రాముని బాస ప్రకారము,
సోదరు లిద్దరు సుగ్రీవునితో
బయలు దేరి రట వాలిని కూల్ఫగ.


                  50
తరువాత, హరీశ్వరుడును, రాజ కు
మారు లిద్దరును చేరగవచ్చిరి
కిష్కింధకు వేగిరమె, యుద్ధమున
వాలిని బహుబలశాలిని కూల్పగ.
                  51
అవల, రాము డాహవమున వాలిని
పరిమార్చి, సకలవానర నర చ
క్రంబున కధిపతిగా సుగ్రీవుని
అభిషేకించెను శుభముహూర్తమున.
                  52
దేవి ! రామసుగ్రీవుల కట్టుల
అన్యోన్య స్నేహము సిద్ధించెను;
వారి దూతనయి వచ్చితి నిచటికి,
హనుమంతుడ, విఖ్యాత నామకుడ .
                  53
పోయిన రాజ్యము పొంది మఱల, సు
గ్రీవుడు సకల హరిప్రవరుల పిలి
పించి పంపె నిను వెతకుటకయి, పది
దిక్కులకు బలాధికులగు వారిని.
                  54
ఉగ్రశాసనుడు సుగ్రీవు డతని
శాసనమును శిరసావహించి నడ
కొండలు పోలిన గండు వానరులు
పోయిరి నీ అడపొడ గుర్తింపగ.
                  55
స్వామి వాక్యమును జవదాటని వా
నరుల మేము, తండములుగా బయలు
దేరినాము ధాత్రీచక్రంబును
గాలించుటకయి నాలుగు మూలల.



                    56
సంపన్నుడు, బలశాలి, వాలి సుతు
డంగదుండు నాయకుడయి, మా ము
క్కోటి బలగమును కూడగట్టి, ప్ర
స్థానము కట్టెను సన్నాహముతో
                   57
వింధ్యపర్వతపు భీకరాటవుల
బడి, దిమ్మతిరిగి, బాటతప్పితిమి,
గడచిపోయెను పగళ్ళును ఱేలును,
తత్తరించితిమి తడబడి సుడిబడి.
                   58
అంత మేము కార్యము చెడెనంచు ని
రాశను, సుగ్రీవాజ్ఞ కు భయపడి,
అలజడి కర్తవ్యము తోచక , ప్రా
యోపవేశమున కుద్యమించితిమి.
                   59
అడుగుపెట్ట సం దిడని యడవులను,
ఘూర్ణితంబులగు కొండవాగులను,
వెతకివెతకి దేవీ ! నీ అడపొడ
తెలియక, తుది, కడతేఱ తలచితిమి.
                   60
అందఱమును మే మా గిరిపయి ప్రా
ణపరిత్యాగమునకు సిద్ధమయితి;
మదిగని అంగదు డార్తి వార్థిలో
మునిగి వివశుడయి బోరని యేడ్చెను.
                   61
నీ యపహరణానిష్టము, వాలివ
ధాయత వ్యధ, జటాయువు వధ, మా
ప్రాణత్యాగ విపర్యాసభయము,
పిచ్చలించి యేడ్పించె నంగదుని.


            62
అప్పుడు, స్వామికార్యము చెడెనంచు ని
రాశచెంది తెగటాఱనున్న మము,
వారించుటకై వచ్చిన పగిదిని,
పక్షిరాజొకడు వ్రాలెను మా కడ.
          63
అతడు జటాయువు నగ్రసోదరుడు,
సంపాతి ఖగస్వామి, బలిష్టుడు,
అనుజుని మృతివిని, ఆగ్రహోగ్రుడై
మండిపడుచు మార్మసిలి యిట్లనెను.
          64
ఎవ్వ డెచట వధియించె నా యనుజు?
పడె నెట్టుల తమ్ముడు పోరితమున?
ఎఆిగింపుడు వానర కులోత్తములు,
వినగోరెద నా వృత్తాంతంబును.
          65
అంతట అంగదు డంతయు చెప్పె, జ
నస్థాన భయానక వధమును, ఆ
వల నీకయి రావణు నడ్డగ జరి
గిన రణమున కూలిన జటాయుకథ.
          66
అరుణుని పుత్రుండగు సంపాతియు
తమ్ముడు పడిన విధానంబును విని
శోకతప్తుడయి, మాకు చెప్పె నీ
విచట రావణుని యింట నుంటివని.
           67
(పీతికొలుపు సంపాతి మాటలను
విని సంతోషము పెనగ, వానరుల
మందఱమును మే మంగదుండు నా
యకుడై నడప ప్రయాణం బైతిమి

275


                   68
వింధ్యాప్రాంతము విడిచి లేచి, సా
గరతీరము నొక్కబిగి చేరితిమి,
నిను దర్శించి, తనిసి, సుఖింతమను
ఉత్సాహము మ మ్ముద్వేగింపగ.
                   69
కాని మహాసాగర తీరంబును
దరిసి చూచి జంకిరి వానరు లం
గదసహితముగ, భగవతీ ! నిను కను
వేడుకలెంతగ వేగిరించినను.
                   70
పారములేని పయోరాశిని కని
అలజడినందిన హరిపుంగవుల భ
యంబు తీర్చి, నూఱామడల కడలి
గడచి, ఒక్కడనె గట్టెక్కితి నిట.
                   71
రక్కసి మందలు క్రిక్కిఱిసిన లం
కను చొచ్చితి చీకటిలో తడయక,
చూచితిని దశాస్యుని; నిన్నిపుడు
చూచుచుంటి నిట క్షోభిలుచుండగ.
                   72
దేవీ ! ఇది వర్తిల్లిన గత వృ
త్తాంతము, చెప్పితినంతయు దాచక ,
నమ్ముము రఘునందను దూతను, భా
షింపుము నాతో స్వేచ్ఛగ తడయక .
                   73
రఘురాముని కార్యము నెఱువేర్పగ
నీ నిమిత్తమయి నే నిటువచ్చితి,
దేవీ ! నే సుగ్రీవుని సచివుడ,
వాయుసుతుడ ఇది వాస్తవమెఱుగుము.


                   74
శస్త్రధరులను ప్రశస్తుడయిన ఇ
క్ష్వాకున కచట కుశలము, గురులను
ఆరాధించు కుమారలక్ష్మణుడు
గుణవిలక్షణుడు కుశలము మైథిలి !
                   75
వీరుండగు నీ విభునకు హితముగ
సహకరించు నిశ్చయముతోడ, సు
గ్రీవుడు చెప్పగ దేవి ! వచ్చితిని
ఇందుల, కొకడనె సందేహింపకు.
                   76
నిను కొనివచ్చిన నీడలు జాడలు
కనిపెట్టుటకయి కామరూపమున,
అసహాయముగా అంతలంతలన్
తిరిగి, దక్షిణపు దిక్కు పట్టితిని.
                   77
నిను వెతకుచు కన్పించ, కలసి, వి
షణ్ణులయిన వనచరవర్గములకు
'నినుచూచితినే' నని చెప్పి, వెతల్
తీర్చు భాగ్యమునుకూర్చె నాకు విధి.
                   78
దేవీ! ఎంతయదృష్టమొ నాకిది,
వారిధి దాటుట వ్యర్థముకాలే
దిక, నీ దర్శన సుకృతఫలితముగ
మొలుచు కీర్తియును నిలుచు లోకముల.
                   79
రాక్షసాధిపుని రావణు నిచటనె
మిత్రబాంధవ సమేతము బలిగొని
పొంది నిన్ను కొనిపోగలడు, మహా
బాహువు రాము డవశ్యము శీఘ్రమె.


                    80
గిరులలో మహత్తరమగు క్షేత్రము
మాల్యవంత, మా మలనుండి మహా
వానరు డొక పర్వంబున వెళ్లెను
గోకర్ణంబునకున్ యాత్రార్థము.
                    81
ఆ మహాకపియె మామక జనకుడు,
అతడు బ్రహ్మఋషు లా దేశింపగ
శంబుండను రాక్షసుని నృశంసుని
చంపెను, సాగర సంగ తీర్థమున.
                   82
హరిణ క్షేత్రమునం దచ్చట నే
వాయుదేవుని ప్రభావ బలంబున
జనియించితి, జాతిని వానరుడను,
ఖ్యాతి కెక్కితి జగముల హనుమ యని.
                   83
నిను నమ్మింపగ నిశ్చయించి నీ
విభుని గుణగణము లభివర్ణించితి,
దేవీ ! ఇక సందేహము వలవదు,
రాముడు నిను శీఘ్రమె కొనిపోవును.
                   84
ఈగతి హనుమ సహేతుకముగ భా
షించి, తెలుప పరిచితగతార్థములు,
విశ్వసించెను కపిని దూతయని, వి
పన్నయై చివుకుచున్న జానకియు.
                   85
అప్పుడు సీతకు అంతులేని ఆ
నంద మెడందను కందళించె, వం
గిన ఱెప్ప కురుల కనుల నశ్రువులు
గిరగిర తిరుగుచు పొరలె ధారలయి.


                    86
ఎఱ్ఱని జీఱల నింపయి, తెలి తా
మర పువ్వులవలె మెరయు కనులతో,
తేటలారె మైథిలి ముఖబింబము;
గ్రహణము విడిచిన తుహినాంశునివలె.
                    87
ఎదుటనున్న వా డితరుడు కాడని,
వానరు డగు హనుమానుం డతడని,
తెలిసికొన్న మైథిలి ముఖ వైఖరి
నాకళించి మాటాడసాగె హరి.
                    88
చెప్పితి జరిగిన చెయిదము నంతయు,
ఊరడిల్లుము పయోజదళాక్షీ !
ఏమి చేయదగు నే నిక చెప్పుము,
ఎట్లు తోచె నీ కట్లు మెలగెదను.
                    89
నాడు మహర్షులు వేడుకొన్న నా
జనకుడు కేసరి చంపెను శంబుని,
అయ్యెడ పుట్టితి అనిలు నంశ, వా
నరుడ, ప్రభావమున అతనికి సముడ.