శ్రీ సుందరకాండ (రాయప్రోలు సుబ్బారావు)/సర్గ 27

శ్రీ

సుందరకాండ

సర్గ 27

                    1
ఇట్లు జానకి అనిష్టములాడగ,
ఆలకించి క్రోధావేశంబున
క్రూర రాక్షసులు కొందఱు వెళ్ళిరి
రావణునకు వార్త నివేదింపగ.

                    2
తిరిగివచ్చి చెచ్చెర రక్షిక లు
ద్రేకముతో మైథిలిని చుట్టుకొని
చెప్పిన సోదెనె చెప్పగ సాగి ర
నర్థార్థకముల నపరాధోక్తులు,
                     3
సీతా! పాతక భూత, వనార్యవు,
సాహసించితివి ద్రోహకర్మకిటు,
రాక్షసులము మేమీ క్షణంబుననె
భక్షింతుము నీ పచ్చి మాంసమును.
                    4
జానకినటు తర్జన భర్జనలన్
దైత్య సేవిక లుదాసీనింపగ,
త్రిజటపేరి కులవృద్ధురా లొకతె
మేల్కొని తత్క్షణమే యిటుల పల్కెను.

సుందరకాండ


                    5
తినబోకుడు సీతను,క్రూరులు మీ
రనుగు బిడ్డ యిది జనక మహర్షి కి,
రాజేంద్రుడు దశరథునకు కోడలు;
భక్షింపుడు మీ కుక్షినిండ నను.
                    6
కలగంటిని నే గడచిన రాతిరి,
ఒడలెల్ల గగురుపొడిచెను దిగ్గన,
కనుగొంటిని రాక్షసుల నాశనము,
జానకీ విభుని జయ మహోత్సవము.
                    7
అట్లు త్రిజట వెఱుగంద వచింపగ
ఉలికి రాక్షసులు ఉత్క్రోశముతో
తడబడు చామెను అడిగి, రేమి చూ
చితి నిశి కలలో చెప్పుము మాకని.
                    8
సేవిక లందఱు వావిడి అడిగిన
నాలకించి, ఆమూలాగ్రముగా
విప్పి చెప్పెనా వృద్ధ, త్రిజట, తన
ప్రాతఃకాల స్వప్న కథ నిటుల.
                    9-10
గజ దంతముతో కట్టిన పల్లకి
హంసలు మోయ విహాయస వీధిని;
వచ్చె రాముడు ధవళదుకూల మా.
ల్యములను తాలిచి లక్ష్మణ సహితము.
                    11
సాగర జలములు రేగి చుట్టు శ్వే
తాద్రిమీద కననయ్యె సీత, శు
క్లాంబరధారిణియై రామునితో ;
భాస్కరు పజ్జ ప్రభాదేవతవలె.

సర్గ 27


            12
ఆదెస నొక కొండంత యెత్తయిన
నాలుగుకోరల నాగమెక్కి, ల
క్ష్మణునితోడ రాఘవు డొరసి ప్రకా
శించుచుండ చూచితిని స్వప్నమున.
            13
స్వీయదీప్తి రాజిల్ల , శూరశా
ర్దూలము లిద్దరు తోడుతోడ తె
ల్లని చీరెలు మాలలు ధరించి, యే
తెంచిరంత వైదేహి దాపునకు.
            14
రాజకుమారులు రామలక్ష్మణులు
ఎక్కివచ్చిన గజేంద్రము దరియగ,
జానకి ఆకాశ నగాగ్రము దిగి
ఎక్కెను తెల్లని యేనుగు వెన్నున.
           15
అగుపించెను నాకపు డొక అద్భుత
దర్శనంబు , సితాసితలోచన
విభుని అంకమును విడిచి సూర్యచం
ద్రులను కరంబుల దువ్వుచున్నటుల.
           16
కలలో పిమ్మట కానుపించెను కు
మార వీరసింహము లిద్దరు వై
దేహితోడ నధిష్ఠించిన వె
ల్లేనుగు లంకపయిన్ చనుదేఱుగ.
          17
ఎనిమిదికాం డ్లెనయించిన రథమును
తెల్లని యెద్దులు తిన్నగ లాగగ,
కాకుత్థ్సాన్వయ రాకాచంద్రులు
సీతతోడ విచ్చేసి రీదెసకు.


.
అతడు పరబ్రహ్మము, పరతత్వము,
పరమబీజ, మిహపరమార్థము,
పరమజ్ఞానము, పరమక్షేత్రము,
కారణకారణ కల్పము రాముడు.
.
ప్రథిత శంఖచక్రగదాధరణుడు,
హసిత పుండరీకాయ తేక్షణుడు,
నిత్య శ్రీవరణీయు, డజేయుడు,
శ్రీవత్సాంక మహావక్షు డతడు.
           18
ప్రజ్వలించు పుష్పకము నెక్కి, ల
క్ష్మణునితోడ రాఘవు డేతెంచెను,
తెల్లని మడుపులు దీపింపగ, తె
ల్లని పువ్వులదండలు వ్రేలాడగ.
         19-20
సూర్యకిరణములు చూఱబోవు పు
ష్పకము నెక్కి రఘువరు డేతెంచి, ఉ
దీచికి తిరిగెను, త్రిభువనములు సచ
రాచరముగ బ్రహ్మాండము కదిలెను.
          21
ఇంకను కలలో ఇట్టు లగపడెను,
భార్య సీతయును, భ్రాత లక్ష్మణుడు
వెంటనుండ దీపించుచుండె, రఘు
రాముడు విష్ణుపరాక్రమధాముడు.
          22
సురులేనియును అసురులేనియు, రా
క్షసులేనియు తేజస్వి రాఘవుని
ముందునిలిచి జయమందు టశక్యము;
పాపులు స్వర్గము పడయలేనిగతి.


         23
రావణేశు నారసితి వేఱొకట,
నూనె పూసుకొని మేనంతయు, ఎ
ఱ్ఱని గుడ్డలు ఎఱ్ఱని దండలు ధరి
యించి, త్రాగి, ఒడ లెఱుగక యుండెను. .
        24
పడద్రోయగ పుష్పకమునుండి నే - .
ల బడిన రావణు, లాగి యీడ్చుకొని
పోవుచుండె నొక బోడితలది, న
ల్లనిది, నల్లకోకను ధరించినది.
        25
రక్తచేలములు రక్తమాల్యములు
క్రాలగ, తైలము త్రాగుచు, నవ్వుచు
ఆడుచు గాడిదె లీడుచు బండిని,
మతిపోయిన దిమ్మరివలె నుండెను.
        26
దక్షిణ దిక్కుకు తరలిపోవుచున్
గాడిదె త్రోయ దిగంబడి, తలక్రిం
దుగ దొర్లుచు, భీతునివలె, వేఱొక
యెడ రావణు డగపడె దీనునివలె.
        27
అటు, పడిలేచి దశాస్యుడు, మదవి
హ్వలుడై , భయవిభ్రాంతులు పెనగొన
వగపెగయ, దిగంబరుడై వాగుచు,
ఉన్మత్తునివలె ఉక్కఱి, దిక్కఱె.
        28
చిమ్మచీకటిని చెడువాసనతో
నరకమువలె దుర్భరమై మురిగెడి
మలపంకము లోపల తూలి తలకి
పడెను దశగ్రీవుడు తలమున్కగ.


                  29
ఆ మలపంక హ్రదమందు దశా
స్యుని కంఠంబుల కురివేసి బిగిచి,
లాగుచుండె నల్లనిదొక్కతె, మెయి
బురద జాఱ, కావులు - జీఱాడగ:
                 30
గోచరించిరట, కుంభకర్ణుడును,
దశముఖు సుతులును తలలు బోడిగా,
నూనె పూసుకొని మేనుల నిండను;
స్వప్నమందు విస్పష్టముగా నిశి. - :
                 31
పందినెక్కె రావణుడు, ఇంద్రజితు
పాదుకొనె మొసలి మీద, కుంభక
ర్ణుండొంటెపయిని నూల్కొనె, నందఱు
దక్షిణంబుగా తరలిరి దిరదిర.
                 32
తెల్లని గొడుగుల చల్లని చాయలు
క్రందుకొనగ, శ్రీచందనము నలది,
శ్వేతాంబరములు, సితసుమసరములు
విలసిలనుండె విభీషణు డొకయెడ.
                 33-34
నృత్తగీతములు, నెగడ, శంఖ దుం
దుభి వాద్యంబులతో నుండెను; మే
ఘునివలె మొరయుచు, కొండబోని నా
లుగు కోరల యేనుగుపై నాతడు. :
                 35
నలుగురు మంత్రులు కొలిచి వెంటరాన్
తూర్యనాదములతో, విభీషణుడు,
వచ్చె విమానము వద్దకు; చూచితి
సరసజనసమాజ ప్రకరమునట.



                  36
రక్తవస్త్రములు రక్తహారములు
తాల్చి, పొరింబొరి త్రాగిరి దైత్యులు,
కుంజ హయరథ గోపుర తోరణ
ములతో లంక సముద్రమున మునిగె.
                  37
రావణేశ్వరుడు రాజధానిగా
రాత్రిం దివములు రక్షించిన యీ
లంకను, రాముని లెంక వానరుడు
కాల్చుచుండగా కాంచితి కలలో,
                  38
నూనెలు త్రాగుచు దానవకాంతలు
శివమెత్తినగతి చిందులు త్రొక్కుచు,
అఱచుచు నవ్వుచు అదవద చొచ్చిరి
బూడిదయై పొలిబోయిన లంకను.
                   39
కుంభకర్ణుతో కూడ, దీటయిన
రాక్షస వీరధురంధరు లందఱు,
రక్తవస్త్రములు గ్రహియించి ప్రవే
శించిరి గోమయసిక్త తటాకము.
                   40
కావున నిక రాక్షసు లందఱు, వై
తొలగిపొండు, పోదురు నాశనమయి,
సీతను కలిసెను శ్రీ రఘురాముడు
రాక్షసకుల మారణ మొనరించును.
                   41
రామవునకు ప్రియురాలు, వనంబుల
విడనాడక సేవించెను, మన్నన
చేయు నతండును, సీతను తర్జిం
చిన మిము భర్జించును సహియింపడు.




                   42
శాపనార్థములు చాలింపుడు, సాం
త్వన భాషల సీతను యాచింపుడు;
ఇదె మనకందఱ కిపు, డగత్యమని
చింతించెద నా చిత్తము లోపల.
                   43
ఈ స్వప్నార్థము ఎవరి విషయమో
ఆ దుఃఖితయగు వైదేహి చెఱల్
తీఱిపోవు,సిద్ధించు నా సతి అ
భీష్టార్థములు ఇచటనె శీఘ్రము.
                   44
బాధించితి మీవఱ కాసతి నని
అరమర తడయక యాచింపుడు, రా
క్షసకుల భయ మాసన్నంబయినది;
రాముని శస్త్రాస్త్ర ప్రహరణముల.
                   45
జాలిగుండెగల జానకి దేవత
వంటిది, రాక్షస భామినులను కా
పాడ చాలినది; ప్రాంజలికి అధీ
నులు కారె మహాత్ములు లోకంబున.
                   46
అసిత విశాలములయిన కనులతో
శోభిలు జానకి శుభాంగములను
పరికింపగ కనబడ వనార్య ల
క్షణము లేమియును సంశయింపకుడు.
                   47
దేవి విమానము క్రేవల చేరిన
యపు డగపడె, ఆయమ మేని పసిమి
వన్నెమాత్ర మొకవాసి తఱిగె, దుః
ఖము లోర్వగలది కాని కతంబున.


                    48
తలతు నేను మైథిలి, మనోరధం
బింతలోనె యీడేర నున్నదని;
రాక్షసేంద్రుని పరాసనమును, రఘు :
రాముని జయసంరంభము చూడగ.
                    49
ఎదియొ మహత్ప్రియ మీమె పొందునని
కనబడు శుభసూచన లించించుక;
చెంపలు తాకెడి సితకటాక్ష మదె
కదలుచు నున్నది కమలదళమువలె.
                    50
అన్యుల మనసుల ననునయించు ఈ
సీత పరమ దాక్షిణ్య దయాకరి,
ఆమె యెడమచెయి అదరుచున్న దొ
క్కటి పులకించి అకారణంబుగా.
                    51
ఏనుగు తొండముబోని జనకసుత
వామోరువు గరుపారిన తీరున
కదలుచు నున్నది కాంతుడు రాముడు
ముంగల అంతికమున నున్నట్టుల.
                    52
ఎట్టయెదుట ఫలవృక్షము కొమ్మను
ఉన్న శకుంతము ఉత్సాహముతో
పలుకుచు నున్నది స్వాగతవచనము;
చుట్టము రాకకు సూచకంబుగా.
                    53
విభుని జయము విని వేడుకపడి హ్రీ
మతియై బాలామణి, అంత దయన్
ఈ కల నిజమగునేని ధ్రువంబుగ
అభయమిత్తు మీ కందఱకే ననె.