శ్రీ సుందరకాండ (రాయప్రోలు సుబ్బారావు)/సర్గ 10
శ్రీ
సుందరకాండ
సర్గ 10
1
అంత, నా మహాయతనమందు కపి
అల్లనల్ల కలయన్ పరికించుచు
చూచె నొక్క యెడ సుందరరత్న
స్ఫటికమయంబగు శయనాసనమును.
2
పసిడిపట్టెలును, వైడూర్యమణి
స్థగితాసనములు, దంతపు కోళ్లును
వెలకందని పాన్పులును, దిండ్లు, దు
ప్పట్లు నందు శోభనముగ నుండెను.
3
ఆ పర్యంకము దాపున పూదం
డలు వ్రేలగ, వెన్నెలలను చిమ్ముచు
పున్నమచంద్రుని బోలిన భూరి
చ్ఛత్రం బగపడె నేత్రోత్సవముగ.
4
చిత్రభానురోచిస్సు లొలయ, బం
గారపు పసిమి నిగారముల్ పొలయ,
లల దశోకపల్ల వ తోరణముల
మెఱయుచుండె నొక మేలిమి మంచము .
5
పరిమళంబులు గుబాళించ, వివిధ
ధూపగంధములు పై పయి సుడియగ,
వింజామరములు విసరుచునుండిరి,
రాజముఖులు రవగాజులు మొరయగ.
6
నునుపారగ ఊనిన మెత్తని పొ
ట్టేలు చర్మములు వాలుగ పఱచిరి,
కై సేసిరి నానాసుగంధ బం
ధుర సుమమాలలతోడ నంతటను.
7
ఆ పానుపున మహాబాహువు, తె
ల్ల ని వస్త్రము, లెఱ్ఱనికన్నులు, ను
జ్జ్వల కుండలములు విలసిల నుండెను.
నిగనిగలాడెడి నీరదంబువలె.
8
శ్రీగంధంబు పరీమళించ, నవ
రక్తచందనము రంజిల మేనున,
వఱలె రావణుడు మెఱుపుల మేఘము
సంధ్యాంబర మాసాదించినగతి.
9
అందమయిన అసురాధిపు రూపము
ఆభరణోజ్జ్వలమై భాసిల్లెను,
కుసుమ నికుంజ విలసితంబై నిదు
రించు మందరగిరి ప్రతిమంబలె.
10
కామరూపి, రాక్షసకుల కన్యా
కామీనుడు, మణికనకాభరణా
లంకృతుండు రేలంతయును రతో
పరత క్రీడల పొరలి బడలికల.
11
తనివితీరగా త్రాగి, కామ లీ
లాలోలుడయి, అలసత సొలసి, విర
మించి, శయించగ మేలిమి సెజ్జను,
వీక్షించెను కపివీరుడు రావణు.
12
బుసలుకొట్టు గిరిభుజగమువలె, ప్రభ
లెగయు పాన్పున శయించియున్న రా
క్షస నాథుని దగ్గరి, చెదరి, చకితు
డయినట్టుల వెనుకంజ యిడెను హరి.
13
వెంటనె, దరినొక వేదిక చాటున
నిలిచి మహాకపి తిలకించె తడవు,
బలిసిన బెబ్బులి భంగిని మాంసల
కాయుడయిన రాక్షసరాజేశ్వరు.
14
రాక్షసేంద్రుడు నిరాకులంబుగా
పవళించిన తల్పము తలపించెను,
మదగంధిలమగు మాతంగము ఆ
సాదించిన ప్రస్రవణగిరింబలె.
15
బంగరు మువ్వల బాజుబందులు ని
గారించగ, ఇరుగడలను చాచిన
రావణేశ్వరుని రాజ బాహువులు
చర్శించెను ఇంద్రధ్వజముల వలె.
16
కనబడె నచ్చట కాయలుకాచి సు
దర్శన చక్రవిదారణములు, వ
జ్రాయుధ మడచిన గాయము, లైరా
వత, మని పొడిచిన వాతలు నిగనిగ.
17
మలచినట్టుల సమముగ బలిసిన
భుజములు, చక్కని బొటనవ్రేళ్ళు, నఖ
ములు, నఱచేతులు, పుణ్య సులక్షణ
చిహ్నములయి భాసిలె నదోషముగ.
18
ఇనుప గుదియలకు ఎనయై, యేనుగు
వాలుతొండములబోలి, పాన్పుపై
చాచియున్న హస్తమ్ములు తోచెను,
అయిదుతలల కాలాహిరూపమున,
19
పునుగుపిల్లి చల్లని మదంబుతో
కలిపి, అపూర్వ సుగంధచూర్ణములు
నూఱిన లేపము లాఱగపూసిన,
సాలంకృతమగు హస్తము లొ ప్పెను.
20
ఉత్తమకాంతలు మెత్తగ నూఱగ
పరిమళమెత్తిన పచ్చిగందములు
అలదిన రావణుహస్తము, లురగుల
సురగంధర్వుల వెఱ నేడ్పించెను.
21
పసిడిమంచమున పట్టుపఱుపుపయి
చాచియున్న రాక్షసపతి భుజములు,
మందరపర్వత కందరమున పగ
బట్టి తూగు పెనుబాములపోలెను.
22
చియ్యబట్టి పిచ్చిల లావణ్యము
తొణకు హస్తములతో దశకంఠుడు
నిస్తుల విశ్రాంతిని కనుపించెను;
జంట శిఖరముల శైలము చాడ్పున-
23
మామిడిపండ్ల సుమాళము, పున్నా
గ సుగంధంబు , పొగడపూలవలపు,
మధుపాయస పరిమళము లేకమయి
గుప్పించె దశముఖుని ముఖంబుల.
24
మెత్తని సెజ్జను మేనువాల్చి ని
ద్రించుచున్న రాత్రించర నాథుని
నిట్టూర్పులతో నిగిడి సువాసన
లాముకొనెను నిండార సౌధమున.
25
మణులును, ముక్తామణులును పొదిగిన
హేమకిరీట మొకయింత ఓరగా
జాఱ, కుండలోజ్జ్వలమగు రావణు
నెమ్మొగంబు రమణించె నందముగ.
26
అరుణచందనము నలది, ముత్యముల
దండలతో ధగధగలాడుచు, రా
క్షసవల్లభు వక్షస్తలంబు శో
భిల్లుచు నుండెను పీనాయతమై.
27
కనుల రక్త రేఖలు మెఱుగారగ,
కాసెబోసి కై సేసి బిగించిన
పసుపు పట్టుదోవతితో, తెల్లని
ఒల్లెవాటుతో నొప్పి రావణుడు.
28
చల్లని గంగాసైకత తటమున
పవళించిన గజవల్లభు కైవడి,
బుసలుకొట్టు పామువలె, నుండె దను
జేశుడు; మినుముల రాశినిపోలుచు.
29
నాల్గువైపులను వెల్గుచుండ , అప
రంజి సెమ్మెలను రత్నదీపములు,
దనుజేశ్వరు డొప్పెను, క్రొమ్మెఱుగులు
నివ్వాళించెడి నీలిమబ్బువలె.
30
దారాప్రియుడగు దశకంఠుడు మన
సోత్సాహముతో నుండగ, ఆతని
పాదమూలముల బడి సేవించుచు
బింబాధర లగుపించిరి కొందఱు.
31
చంద్రుని బోని ప్రసన్న శుభాస్యలు,
రవ్వలకమ్మల పువ్వుంబోణులు,
నలగని విరిదండల యలివేణులు
కొందఱు కనబడి రందు మారుతికి.
32
నృత్తవాద్యముల నేర్పుక త్తెలుం
డిరి దశముఖు నంతికమున కొందఱు,
కట్టిన కోకలు పెట్టిన సొమ్ములు
పళపళమన కనబడి రిక కొందఱు.
33
వైడూర్యములు రువాణించ నడుమ
మేలి వజ్రములిమిడ్చి బిగించిన
కమ్మలూగ, బంగారు సంది దం
డలు తాల్చిరి కొందఱు నెఱజాణలు.
34
వదన చంద్రబింబంబులతో, రవ
మెఱుగుల కర్ణాభరణంబులతో,
పడకటిల్లు విభ్రాజితమాయెను;
తారలు మెఱయు నభోరంగమువలె.
35
త్రాగి మత్తిలి సరాగ క్రీడల
వసివాడిన రావణుని కామినులు
ఓపిక లెడలగ ఒండొరు లొరయుచు
సందుదొరక అందందు శయించిరి.
36
అవయవముల సౌష్ఠవ సౌందర్యము
లత్తుకొన్న ఒక ఆటకత్తె, అభి
నయభంగీ విన్యాసము తీర్చుచు
ఉన్నదున్నటులె ఒరిగి శయించెను.
37
ఒక తె తన విపంచిక కౌగిటనిడి
నిద్దురపోయెను; నిండువరదలో
కదలిన తామరకాడ తగులుకొని
పడవపొత్తు నెడబాయని భంగిని.
38
కాటుక కన్నుల కలికి యొకర్తుక ,
వాయించిన తన వాద్య మడ్డుకము,
పజ్జనుంచుకొని పవళించెను; పసి
పాపను పాయని బాలెంతపగిది.
39
అఖిలాంగ మనోహరి ఒక సుస్తని
పీడించిన తప్పెట నెడబాయగ
లేక శయించెను; రాక రాక వ
చ్చిన ప్రియు నక్కున చిక్కబట్టుగతి.
40
కామేక్షణ యొక్క తె తన వేణువు
విడిచిపెట్టలే కొడినిపెట్టుకొని,
శయనించె, మనః ప్రియుని బట్టి కో
రిక తీర్చుకొను మురిపములు తో పగ .
41
నృత్తకుశల యొక మత్తకాశిని వి
పంచిని విడనోపక నిదురించెను,
కామించిన వలకానితో చనువు
తీయమింత యెడబాయలే నటుల.
42
మాంసలమై కోమలమగు మేను ని
గారింపగ, బంగారు వన్నె లొక
తీవబోణి మద్దెల వాయించుచు
పారవశ్యమున పవళించె నటులె.
43
సన్నని నడుము పిసాళించు మఱొక
భ్రమరాలక తన పార్శ్వతలంబున
రతమృదంగ జంత్రము పడియుండగ,
తూగి శయించెను త్రాగిన మత్తున.
44
తన డిండిమవాద్యము విడనోపక
ప్రక్క నుంచుకొని పవళించె నొక తె;
తరుణవత్సమును తక్కనొత్తుకొని
నిదురపోయె తరుణీమణి మఱొకతె.
45
ఆడంబర వాద్యము నిరుకేలను
ఐయించిన ఒక భామ సొమ్మసిలి,
మధువు త్రాగి కడుమత్తున నొత్తిలి,
ఒడలెఱుంగ కటు లొరగి శయించెను.
46
మదవతి యొక్కతె మద్యకుండికను
ఎత్తివైచి మధు వెగసి చిందిపడ,
పవ్వళించి కనబడె, వసంతమున
తడిసినపువ్వుల దండ చందమున.
47
బంగరు కుండలవంటి స్తనములను
సుస్తిమితముగా హస్తతలం బుల
నుంచి, పాన్పున శయించెనొకర్తుక;
నిద్రావేశము నిలుపగనోపక .
48
పూర్ణ చంద్రముఖ ఫుల్లపద్మ ప
త్రాక్షి, యొకతె మధువానిన మత్తున,
తోడి చెలియ పిరుదులు కౌగిటనిడి,
ఆదమఱచి తడయక నిదురించెను.
49
చెలువలు కొందఱు చిత్ర జంత్రములు
మురిపెముగా ఱొమ్ముల నొత్తుకొనుచు
శయనించిరి సెజ్జలను; కామినీ
కాముకుల సరాగము లొప్పారగ.
50
వారలలో లావణ్యము చిమ్ముచు
హేమశయ్యపయి ఏకాంతమ్మున
స్తిమితముగా నిద్రించుచున్న ఒక
రూపవతిని మారుతి లక్షించెను.
51
ఆణిముత్యముల హారంబులు, ర
త్నంబుల ఆభరణంబులు తాల్చి, ప్ర
సన్న దీప్తమగు సౌందర్యమున అ
లంకరించె గృహలక్ష్మి నా గరిత.
52
పసుపుపచ్చని సువర్ణ చ్ఛాయల
సుందరి - ఆయమ మండోదరి - శు
ద్దాంతఃపురనాయకి - రావణుని మ
నోభీష్టార్థము - శోభనరూపిణి.
53
రూపయౌవన సురుచిరప్రతిమను
ఆ మంగళముఖి నారసి మారుతి
తర్కించెను సీతా దేవియనుచు,
హర్షించెను కార్యము ఫలించెనని.
54
ఆపజాలని మహానందంబున,
ఆడించును, ముద్దాడును తోకను,
ఇగిలించును, దిగు' నెక్కు న్తంభంబులు
జాతి గుణవిశేషములు బయల్పడ.