శ్రీ రామకృష్ణ సూక్తిముక్తావళి/26వ అధ్యాయము
26వ అధ్యాయము.
ఈశ్వరానుగ్రహము
535. మలయమారుతము వీచునప్పుడు, చేవగలచెట్లన్నియు శ్రీగంధపుచెట్లుగ మారునందురు. చేవలేనిబొప్పాయి, వెదురు, త్రాటిచెట్టు మార్పుచెందక, ఉన్నట్లేయుండునట; అదేలాగున ఈశ్వరానుగ్రహము మానవకోటిపై కలిగినప్పుడు భక్తి సౌజన్యములుగలవారు పవిత్రఋషివరులై దైవమహిమతోనిండుదురు. ప్రాపంచికులగు క్షుధ్రజనులు ఎప్పటివలెనే యుందురు.
536. చెదఱి చంచలమైపాఱుచున్న నీరు చంద్రబింబమును విచ్ఛిన్నశకలములుగ (ముక్కలు ముక్కలుగ) తప్ప పూర్ణస్వరూపమును ప్రతిఫలింపజాలనిరీతిని ప్రాపంచకవాసనలతోడను వాంఛలతోడను కలతబారిన మనస్సులు భగవంతునితేజమును పూర్తిగ ప్రతిఫలింపజాలవు.
537. మౌనముగ భగవన్నామస్మరణచేయుచు ఒకపుణ్య పురుషుడు జపమాలత్రిప్పుచుండెడివాడు. భగవానుడు వానితోనిట్లనెను "నీవేల ఒక్కస్థలమును అంటిపట్టుకొనియుందువు? ముందునకుసాగిపొమ్ము."
"భగవదనుగ్రహము లేక అటులజరుగజాలదు." అని ఆపుణ్యపురుషుడు ప్రత్యుత్తరమిడెను. భగవానుడిటుల పలికెను. "భగవదనుగ్రహమనుగాలి నీతలమీదుగా రేయింబవళ్లు వీచుచునే యున్నది. సంసార సాగరమును వేవేగమే దాటిపోగోరుదువేని (మనస్సును) నీ పడవయొక్క తెఱచాపను విప్పుము.
538. ఈశ్వరానుగ్రహమనుగాలి సతతమును వీచుచునే యుండును. సోమరులై సంసారసాగరమున నెమ్మదిగ బోవు వారలు దాని లాభమును పొందరు. చుఱుకుదనమును బలమును గలవారలు తమ మనస్సులను విప్పారజేసికొని హితకరమౌ ఆగాలిని పట్టుకొని త్వరలో తాము గమ్యస్థానమును చేరుదురు.
539. గాలి వీవనంతకాలము వేడిమి తగ్గుకొఱకై వీవనతో విసరుకొనుచుందుము; ధనికులనక, దరిద్రులనక అందఱికిని ఉపకరించు వాయువువీచునప్పుడు మనము విసరుకొనుట మానుదుము. పైనుండి చేయూత రానంతకాలము, మన పరమావధిని చేరుకొఱకు మనము తీవ్రముగ పాటుపడ వలసియుండును. అదృష్టవశమున ఆసహాయము లభ్యమైనప్పుడు మనమింకను శ్రమపడి పట్టుదలతో సాధనలుసాగించ నగత్యముండదు. అంతవఱకుమాత్రము పాటుపడవలశినదే సుమీ!
540. గాలియే వీచునప్పుడు విసనకఱ్ఱలు నిరుపయోగము. ఈశ్వరానుగ్రహము లభించినప్పుడు ప్రార్ధనలు, తపస్సులు విడువనగును. 541. కొన్నిచేపలకు చాల ఎముకల గూడులుండును. కొన్నింటికి ఒకే ఎముకల గూడుండును. కాని చేపలనుపట్టి తినువారు ఒక ఎముకలగూడుయున్నను హెచ్చుగనున్నను, ఎముకలను అన్నింటిని తొలగించివేతురు. అదేతీరున కొందఱి పాపములు విశేషముగనుండును, కొందఱిపాపములు కొలదిగ నుండును. కాని ఈశ్వరానుగ్రహము లభించెనా అవిఅన్నియు తొలగింపబడి, వారు పవిత్రులుగ చేయబడుదురు.
542. నడిసముద్రమునపోవు ఓడకంబము మీద ఒకపక్షి మూర్చుండెను. అచ్చట చాలసేపు కూర్చుండుటకు విసుగు కొని క్రొత్తచోటవ్రాలుటకై ఎగిరిపోయినది. కాని వాలుటకు తగినతావుగానక అలసిపోయినదై తిరిగి మొదట ఓడ కంబమునేచేరెను. అటులనె సామాన్యసాధకుడు తనక్షేమము కోరునట్టియు అనుభవశాలియుఅగు గురువుచూపిన శిక్షణయు సాధనలును చిరకాలము సాగించుటకు విసుగుచెందును; నిరాశుడగును; గురువునందు లక్ష్యము విడుచును: స్వంతముగ ప్రయత్నించి భగవంతునికనుగొందుగాక యను ధైర్యముతో లోకమున జొఱబాఱును. ఇటుల చాలకాలము వ్యర్ధపుత్రోవలబోయి గతిగానక పూర్వపు గురుని కృపను ఆశ్వీర్వాదమునుపొందుట కొరకై తిరిగి వచ్చును.
543. ఆకస్మికముగ ఏమియుసంభవించదా?
జవాబు:- లేదు. సాధారణముగా దీర్ఘ సాధనలు సాగించక ఎవడును సిద్ధత్వమును పొందడు. ద్వారకనాధమిత్రగారు ఒక్కదినములో ఉన్నతన్యాయాధికారి కాలేదు. ఆయన ఉత్తమన్యాయస్థానమున అధికారపీఠమున గూర్చుండుటకు పూర్వము సంవత్సరములకొలదిగ కష్టపడి పనిచేయవలసిన వాడయ్యెను. అటులశ్రమకోర్చి పాటుపడనిష్టములేని న్యాయవాదులు నిరుద్యోగులై తమను గోరుకొను కక్షిదారులులేక ఊరకనుండవలసినదే. కానిహఠాత్తుగ దైవకృపచే అభ్యుదయము కలుగుటయు ఎన్నడోతటస్థించవచ్చును. కాళిదాసునకు అటుల లభించినది. కేవలము పామరదశనుండి సరస్వతీదేవి అనుగ్రహమువలన ఆకస్మికముగభారతకవివరులందఱిలో మేటియనిపించుకొను స్థితికివచ్చినాడు.
544. ప్రశ్న:- భక్తుడు ఎన్నడైన భగవంతునితోడి సంపూర్ణైక్యస్థితిని పొందగలడా? అగుచొఎటులు?
జవాబు:- యజమాని యొకడు, తనవృద్ధసేవకుని వినయసంపత్తికిని, సత్యశీలమునకును, ఉత్తమసేవకును మెచ్చి, వానిని తన అధికారపీఠముచెంతకు దీసికొనిపోయి బలాత్కారముగా వానిని అందు కూర్చుండబెట్టవచ్చును. సేవకుడు నమ్రతచేత వలదన్నను విడువడు. అదేతీరున ఈ విశ్వాధిపతియు తన ప్రియసేవకునియొక్క చిరకాల భక్తినిష్ఠకును, విమలత్యాగమునకును ప్రీతుడై, వానిని తన సంహాసనమున జేర్చి బలాత్కారముగా తన దివ్యవిభూతిని వానికి ప్రసాదించగలడు. అయినను ఈశ్వరసేవకుడు తన సేవక భావము త్యజించి యజమానుని విభూతిని పాల్గొన నిచ్చగింపక పోనగును. 545. మనకు ఆహారమును ప్రసాదించును కావున భగవంతుడు కృపాళుడు అనజాలము; ప్రతితండ్రియు తన బిడ్డలకు తిండిపెట్టవలశిన వాడే అగుచున్నాడుకాని, మనము వక్రగతుల నడచు సమయములందు, ఆయన మనలను దుష్టప్రేరణలనుండికాపాడును. కావున నిజముగాకృపాళుడు అనదగును.
546. ఒకగదిలో అనేక శతాబ్దములనుండి యున్న చీకటి యైనను, దీపము వెలిగించినంతనే మటుమాయమగుచున్నది. అట్లే అనేక జన్మాంతరములనుండి పెరిగివచ్చిన పాపరాశియైనను భగవంతుని కటాక్షవీక్షణము ఒక్కటి ప్రసరించిన మాత్రాన ఎగిరిపోగలదు.
547. గృహస్థుడగు నొకభక్తుడు:- దేవా! మీరు భగవంతుని చూచితిరి అని వింటిమి. కావున మేమును భగవంతుని చూచునటుల చేయుము. ఆదేవదేవునితో మేము సఖ్యము చేసుకొనుట ఎట్లు?
పరమహంసులవారు:- సర్వమును ఈశ్వరేచ్ఛ ననుసరించి నడుచును. భగవద్దర్శనమగుటకు కర్మమిగుల నావశ్యకము. నీవు చెఱువుగట్టున కూర్చుండి, "చెఱువులో చాలచేపలున్నవి" అని ఊరక అరచుచుండినచో నీకేమైన దొఱకునా? చేపలను పట్టుటకు ఆవశ్యకములగు పరికరములను తెచ్చుకొనుము. గాలపుచువ్వ, దారము, ఎఱ తెచ్చి, నీళ్ళలో నూకలు చల్లుము. అంతట ఎంతలోతుననున్నచేపలో పైకివచ్చును. నీవప్పుడు వానిని చూచి పట్టుకొనవచ్చును. మీరు వూరకకూర్చుండి, ఏమియు ప్రయత్నమేసేయక భగవంతుని చూపుమని మీరు నన్నడుగుచున్నారా; పెరుగు తోడుపెట్టి, వెన్న చిలికి, మీనోటికి అందియ్యవలయునా! చేపను పట్టుకొని మీచేతిలో పెట్టవలయునా! మీకోరిక ఎంత విపరీతముగ నున్నదో చూచితిరా!
548. ఒకడు రాజనగరులోనికి పోయి రాజును చూడవలె ననిన, అతడు నగరును సమీపించవలెను; ద్వారములను అన్నిటిని దాటవలెను. అటులగాక వెలుపలి గుమ్మము దాటగానె "రాజక్కెడ? అనినచో వానికిరాజు కానరాడు. అతడు సప్తద్వారములను దాటినగాని రాజును చూడలేడు.
549. ప్రశ్న - ఎట్టికర్మనుచేసి భగవంతుని చేరవచ్చును?
జవాబు:- కర్మలందు బేధములేదు. ఈకర్మచేసిన భగవంతుని చేరవచ్చును, ఆకర్మచేసినభగవంతుని చేరలేము అని తలంచరాదు.
సర్వమును భగవంతుని అనుగ్రహముపై నాధారపడి యుండును. వాని అనుగ్రహము కావలెనా, నిష్కపటమైన తీవ్రవాంఛతో నీకర్మను నీవు నిర్వహించుము. భగవదనుగ్రహమువలన నీపరిస్థితులు అనుకూలములు కాగలవు. వాని దర్శనమగుటకు వలయుమార్గములు చక్కబడగలవు. నీవు సన్యసించకోరి, ఒక వేళ నీమీద నొకసంసారము ఆధారపడి యున్నయెడల నీతమ్ముడు ఆభారమును వహించగలడు. బహుశా నీభార్యయు నీకడ్డమురాక, నీపారమార్ధిక సాధనలందు నీకుసాయపడగలదు. అటులగాక నీవు వివాహమేచేసికొనకపోవచ్చును. నీకు సంసారపుచిక్కులే లేకపోవచ్చును. అంతయు దైవకృప!