శ్రీ రామకృష్ణ సూక్తిముక్తావళి/25వ అధ్యాయము

25వ అధ్యాయము.

భక్తి లేక ఈశ్వరానురక్తి

496. అనురక్తియొక్క పూర్ణసిద్ధావస్థ లేక పరాభక్తి అనగా ఎట్టిది?

అనురాగసిద్ధావస్థయందు, అర్చకుడు భగవంతుని గూర్చి తనప్రియతమునిగానో, అత్యంతసన్నిహిత బంధువునిగనో, మననముచేయును. అదిగోపికలు శ్రీకృష్ణునియెడ చూపిన అనురాగమును బోలియుండును. వానిని వారుజగన్నాధునిగగాక సదాగోపీనాధునిగనే పాటించి అటులనే పిలుచుచువచ్చిరి.

497. నున్ననిఅద్దముపైని దేనినిగాని ముద్రింపవీలులేదు. దానికితగిన లేపనముల రాసినపిమ్మట రూపగ్రాహి (పోటో) యందువలె, చిత్రరూపములనుదానిపైని ముద్రింపవీలగును. అటులనే నరునిహృదయమునకు భక్తియనురసాయనిక లేపన మను కల్పించినయెడల భగవంతుని ఆకృతినే అందుస్థిరముగ ముద్రింప వసతిగల్గును.

498. చెఱువులోని చేపలు ఎంతదూరముగ నున్నను మధురమై నోరూరించగల ఎఱను నీట జల్లినయెడల అవి తక్షణమే నలుదిశలనుండి పర్విడివచ్చును. అదేతీరున, భక్తునిహృదయమున భక్తి విశ్వాసము అను ఎఱను వెదజల్లినచో చచ్చఱ భగవంతుడు యచ్చటికివచ్చిచేరును. 499. హరినామోచ్చారణము చెవులకు సోకగానె నేత్రములు బాష్పపూరితములగు దశ ప్రాప్తించునంతదాక భక్తిసాధనలు అవసరములు. భగవన్నామము సూచితమగు వెంటనే ఆనందబాష్పములు వెల్లివిఱియ, హృదయముప్పొంగునతనికి భక్తిసాధనలు ఇంక నగత్యములేదు.

500. భగవంతుడు పంచదారకొండవంటివాడు. చిన్న చీమపోయి ఒకచిన్న నలుసును తెచ్చికొనును; పెద్దచీమ పోయి ఒకపెద్ద పలుకును తెచ్చికొనును; కాని ఆకొండ ఎప్పటివలెనే యుండును; తఱగదు. భగవద్భక్తులు యిటులనే యున్నారు. భగవంతుని విభూతులలో అత్యల్పమగుదానిని గాంచియే వారు పరవశులయిపోవుదురు. వాని మహిమలను, విభూతులను, అపరోక్షముగ జూచుటకు ఏవాడును భరింపనోపడు.

501. కొందఱికి గుక్కెడుసారా త్రాగినంతనే తలతిరిగిపోవును. మరికొందఱికి రెండుమూడుసీసాలు త్రాగినగాని కైపురాదు; వీరును వారును కైపువలని ఆనందమును సమముగనే పొందుదురు. అదేవిధముగ కొందఱు భక్తులకు భగవద్విభూతియొక్క ఒక్కకిరణముంజూచిన మాత్రాన పరవశత కల్గును; మఱికొందఱు భక్తులకు జగన్నాధుని ప్రత్యక్షముగ దర్శించినప్పుడే పారవశ్యము చేకూరును; వీరును వారును గూడ దివ్యానందభరితులేయై సమముగ ధన్యులగుదురు.

502. బ్రహ్మజ్ఞానము పురుషునిబోలునది; భక్తియో స్త్రీ వంటిది; జ్ఞానమునకు భగవంతుని అతిధిశాలవఱకే ప్రవే శము లభించును; భక్తికో భగవంతుని అంతఃపురమును జొచ్చు వసతి యబ్బగలదు.

503. భగవద్భక్తిసాగరమున లోతుగ మునుంగుము. భీతి వలదు, అయ్యది అమృతసాగరముసుమీ! నేను నరేంద్రునితోడ ఒకప్పుడిట్లుపలికితిని:- "భగబంతుడుమధురసాగరము. ఆసముద్రమున లోతుగనీవు మునుగకోరుకొనవా? వెడల్పు మూతిగల పాత్రలోచక్కెరపానకము పోసిరనుకొనుము. దానిని త్రాగవాంఛించుఈగవు, నీవు అనుకొనుము.

నీవు ఎక్కడవ్రాలి దానిని త్రాగెదవు?

తాను దానిఅంచుననుండి త్రాగుదుననియు, లేక తాను దానిలోపడుట తటస్థించినయెడల దానిలోనేమునిగి చావవలసి వచ్చుననియు, నరేంద్రుడు బదులుపలికినాడు. అంతట నేనిట్లు చెప్పితిని.

"అబ్బీ! నీవు ఆదివ్యసాగరమున లోతుగచొచ్చునప్పుడు అపాయముకల్గుననిగాని చావుమూడుననిగాని భయపడనవసరములేదనుటను మఱచినావు. ఆసచ్చిదానందసాగరము అమృతసముద్రము; నిత్యజీవనముతో నిండియుండునది; నెడగుమానసులవలె; నీవు భగవదనురాగమున "హద్దుమీరి పోదునేమో! యని భయపడకుము."

504. ప్రేమ కొలదిమందికి మాత్రమేలభ్యముకాగలదు. వారసాధారణప్రజ్ఞావంతులుగనుండి, భగవదావేశ కలితులై యుందురు. అట్టివారు భగవన్మ హిమలకును అధికారములకును వారసులైప్రత్యేక వర్గముగ నేర్పడియుందురు. చైతన్య దేవునివంటి ఈశ్వరావతారములును, ఈశ్వరాంశులగు వీరి పరమభక్తులును, ఈవర్గమునకు చెందినవారే.

505. ప్రేమకు విశిష్టలక్షణములు రెండుగలవు: ఒకటి బాహ్యప్రపంచ విస్ఫురణము; రెండవది, శరీరము యొక్క మై మఱపు:-

506. ఒకనికి సూటియైన మార్గము తెలియకున్నను, భగవద్భక్తియు, భగవంతుని తెలిసి కొనవలయునను తీవ్రవాంఛయు నుండవచ్చును. అట్టివాడు తనభక్తియొక్క ప్రభావము వలననే భగవంతుని చేరజాలును. ఒక మహాభక్తుడు జగన్నాధమును దర్శింప పయనమైనాడు. పూరీ జగన్నాధమునకు త్రోవ నెరుంగక ఆవైపునకు పోవుటకుమారుగా వేరుత్రోవను నడువసాగెను; కాని మిగుల నాతురపాటుతో తనకు త్రోవలో కనుపించిన వారినెల్ల అడుగుచు పోయెను. వారందఱును "ఇదిత్రోవకాదు. అల్లదిగో త్రోవ అట్లున్నది" అని చెప్పసాగిరి. ఎట్టకేలకు ఆభక్తుడు పూరి నగరముజేరి కృతార్థుడయ్యెను. అటులనే ఒకనికి యిచ్చయుండి, మార్గము తెలియకున్నను తొందరలేదు. వానికి ఎవరోత్రోవ జూపువారు దొఱుకుదురు: ప్రధమములో ఒకడుపొరబడినను, తుదకెవరేని వానికి సరియైన మార్గము చూపకపోరు.

507. భక్తి చంద్రుడు, జ్ఞానము సూర్యుడు, యనదగును. ఉత్తరపు కొనయందును, దక్షిణపు కొనయందును సముద్రములు కలవని చెప్పగా వింటిని. అచ్చట మిగుల శీతలముగ నుండును; సముద్రములు కొంతకొంతగా గడ్డకట్టిపోయి పెద్ద పెద్ద మంచుగడ్డ లేర్పడును; వానిలో ఓడలు చిక్కుకొని కదలక నిలిచిపోవును:- (అటులనే భక్తిమార్గమున కొంతదూరముపోగా నరులును చిక్కుకొని పోదురా?)

అవును; నిజమే. అయినను సేగిలేదు. వీరినిచిక్కబట్టుమంచు సచ్చిదానంద సాగరపుజలము ఘనీభవించగా ఏర్పడినది! బ్రహ్మసత్యము; జగత్తు మిధ్యఅను తర్కమును పూనుదు రేని ఆజ్ఞానసూర్యతాపముచేత ఆమంచుకఱగును.

తరువాత ఏమిమిగులును?

సచ్చిదానందసాగరజలము మాత్రమే, ఆకారశూన్య మగునది మిగులును.

508. జ్ఞానప్రాప్తి పిమ్మట సయితము నారదుడు మొదలుగాగల ఆచార్య వర్గము లోకసంగ్రహణార్థము (లోకజనులకుఉపాకారము చేయునిమిత్తము) భక్తిమార్గమును అవలంభించిరి.

509. ఎందువలననో తెలియకుండనే భగవంతునియందు అనురాగముపూనుటకలదు. ఇదిప్రాప్తించెనా యింకవాంఛింపదగినదేమియుండదు. అట్టిభక్తిగల్గినవాడిటులనును.

"ఓదేవా! నాకు సంపదలువలదు. ఖ్యాతివలదు, ఆరోగ్యమువలదు, సుఖమువలదు. ఇట్టిదేమియు వలదు. నీపాదారవిందములందు నిర్మల భక్తిని మాత్రము ప్రసాదించుము."

510. నైధి భక్తినాబడు ఒకరీతి భక్తికలదు (ఇది శాస్త్రపద్ధతిని విధింపబడిన భక్తి). ఇన్నిపర్యాయములు భగవన్నామ స్మరణచేయుట, కొన్ని సమయములందు ఉపవాసముచేయుట, కొన్ని ప్రత్యేకపూజాద్రవ్యములతో అర్చనలుచేయుట, కొన్ని తీర్థయాత్రలుచేయుట, ఇత్యాది విధులు వైధికభక్తికి లక్షణములు. ఇట్లు చాలాకాలము సాధన జరిపినయడల పై తరగతిదగు "రాగభక్తి" అలవడును. అనురక్తి యిందు ప్రధానముగ కావలసినది. సాంసారికభావములు పూర్తిగ పోవలయును. మనస్సు భగవంతునిపైననే పూర్ణముగ స్థిరపడవలయును. అప్పుడుగాని వానిని చేరుట సాధ్యముకాదు. రాగభక్తిలేక భగవంతుని ఎవడును చేరలేడు.

511. స్వాభావికముగనే ఈరాగభక్తికలవారు కొందఱుందురు. ప్రాయికముగా వారికది పసితనమునుండియే అలవడనగును. అట్టివారు ప్రహ్లాదునివలె శశైవమునుండియు భగవంతునికొఱకైపరితపించుచు రోదనములుచేయుదురు. వారు నిత్యసిద్ధుల తరగతిలో చేరినవారు. సిద్ధాత్ములై జనించినవారు.

512. ప్రశ్న:- భగవంతునికొఱకై భక్తుడు సర్వమును త్యాగముచేయుటెందులకు?

జవాబు:- శలభము దీపమును చూచినతోడనేచీకటి నుండి పర్విడును. చీమ పానకములోపడి ప్రాణమైన విడుచునుగాని, తొలగి చనదు; అదేతీరున భక్తుడు నిరంతరము భగవంతుని కౌగిటజేరి సమస్తమును విడుచును.

513. భగవద్భక్తి రెండు రకములు:(1) శాస్త్రనియతమైన భక్తియొక్కటి. నిర్ణీతవిధిగాపూజచేయవలయును. భగవన్నామము యిన్నితడవలు స్మరించవలయును. యిట్టి నీమములు కలవు. ఇదంతయు వైధికభక్తిచర్య. శాస్త్రప్రకారము ఏర్పడినది. దీనివలనసమాధి యందు అవ్యయబ్రహ్మము నెఱుంగు బ్రహ్మజ్ఞానము ప్రాప్తింపవచ్చును. జీవాత్మపరమాత్మయందు లీనమై తిరిగి విడి రాకపోవచ్చును. సామాన్యభక్తుల చర్యయిట్టిది.

(2) కాని భగవదవతారముల యొక్కయు, ఈశ్వరునికి ఆప్తులైనవారియొక్కయు విషయమువేఱు. భగవంతునిపై వారికిగలప్రేమశాస్త్రవిధులచే కలుగునదికాదు. అది అంతరంగమునుండి ఆవిర్భవించును! ఆత్మలోనుండి వెల్లివిరియును. (చైతన్యునిబోలు) భగవదవతారులును, వారిఅంతరంగ కోటిలోనివారలును, సమాధిదశయందు ప్రాప్తించు అఖండజ్ఞానమునుపడసినవారే; అటులయ్యును భగవంతునితల్లీ, తండ్రీ, అనిభక్తిసలుపుచు, తమ పరమోన్నతపదవినుండి దిగివత్తురు. మఱియు "నేతి, నేతి." ఇదిగాదు ఇదిగాదు అనుచు మెట్టుపిమ్మట మెట్టుగా విడిచివేసి శిఖరమునకు చేరుదురు. అచ్చటికి చేరి "తత్వమసి" అది యిదియే అందురు. కాని తాముఎక్కివచ్చిన మెట్లవరుసయు, తామప్పుడు చేరిన శిఖరమువలెనే ఒకేతీరు సున్నము, యిటుక, ఇటుకపొడి చేర్చి కూర్చబడినవే అని వెనువెంటనే గ్రహింతురు. కాబట్టి వారు ఒకప్పుడు శిఖరముపైని నిలుచుచు, మఱొకప్పుడు మెట్లపైని ప్రచారముచేయుచు, పైకిని క్రిందికిని ఎక్కుచు దిగుచు నుందురు. శిఖరమనగా సమాధియందు అఖండబ్రహ్మభావన అమరి, జీవాత్మ బాహ్యప్రపంచానుభవములచే చలింపనిస్థితి. మెట్లవరుసయన భౌతికప్రపంచము; మానవదృష్టికి ప్రదర్శితమగు అవ్యయబ్రహ్మముయొక్క నామరూపాత్మకమయిన స్వరూపాంతరమేయని శిఖరముంజేరునప్పుడు విదితమగును!

514. ప్రశ్న:- కండ్లకు గంతలుకట్టనిది సాధికలేని క్రొత్తగుఱ్ఱములు ఒక్క అడుగైన పెట్టవుగదా. నరుని చిత్తవృత్తులు అదిమిపట్టనిది బ్రహ్మదర్శనమగుట సాధ్యమా?

జవాబు:- బ్రహ్మమునుచేరుటకై నిత్యానిత్యవివేక పథానువర్తియై నడచు జ్ఞానయోగివిషయమున ఆమాట సత్యమే. జ్ఞాని యిట్లువచించును:- "ప్రత్యక్షముగ బ్రహ్మమును జూడగోరునతడు నిష్కల్మషుడు కావలయును. తన చిత్తవృత్తులన్నింటిని దహనము చేయవలయును. మొదటఆత్మ శిక్షణము; పిమ్మట బ్రహ్మజ్ఞానము!"

భగవంతుని, జేర్చు మరొకత్రోవకలదు. అదిభక్తి యోగము. ఒక్కసారి భగవద్భక్తి నరుని అంతరంగమున చొచ్చెనా - వాని పావననామగానముచే ఒక్కతడవభక్తుడానందముతో పులకాంకురముగలవాడయ్యెనా అహో! చిత్తనిరోధసాధనలు యింకేల? అట్టినిరోధము దానంతట అదియే చేకూరును సుమీ!

తీవ్రదుఃఖవేదనగల మానవుడు కయ్యములకు దిగుటకుగాని, విందులుగుడుచుటకుగాని, ఇతరములగు యింద్రియభోగము లనుభవించుటకుగాని, శక్తుడగునా? అటులనే భగవ ద్భక్తిలో నిమగ్నమైనయతడు యింద్రియబోగములగూర్చి తలంపనైనంజాలడు సుమీ !

515. ఒక్కసారి దీపమును చూచినయనంతరముశలభము చీకటిని ఆశ్రయించునా?

అహో! ఎన్నడును ఒల్లదు; అది ఆజ్యోతిలోపడి నాశముపొందును!

అయినను భగవద్భక్తునివిషయమున యిది సత్యమనరాదు. ఆతనిని ఆకర్షించివేయు దివ్యజ్యోతి తగులపెట్టదు; చంపనుచంపదు. అది మాణిక్యపు కాంతివంటిది; దీప్తిమంతమయ్యును మార్ధవముగను, శీతముగను, శ్రమోసహారిగను నుండును. అది దగ్ధముచేయదు; హృదయమునకు శాంతిని ఆనందమును కూర్చును.

516. ఈ (సంసారలంపటపు) బేరగాండ్రు (క్షుద్రభోగములను) పుచ్చుపప్పునకై దేవులాడు చున్నారు. సంసార కల్మషమంటని అమలజీవులకు మాత్రమే భగవద్భక్తి దొఱకగలదు. వారికి ఒకేదృష్టి; స్వామి పాదారవిందములపై నిశ్చలముగ మదిని నిలుపుటే ఏకైకవాంఛ!

517. భగవంతునిగూర్చిన విజ్ఞానము విశ్వాసముతోపాటువర్ధిలుచుండును. విశ్వాసము కొఱవడుతావున అధిక విజ్ఞానమునకైచూచుట వెఱ్ఱిపని.

518. భోగవిషయవాంఛ తగ్గినకొలదిని భగవద్భక్తి పెంపొందుచుండును. 519. పావనగంగ జ్ఞాని హృదయమున సమస్థితిని పాఱుచుండును. వానికీసంసారమంతయు కలయై తోచును. ఆతడు సదా తనఆత్మలోనె నిమగ్నుడై యుండును. భక్తుని విషయ మటులుండదు. వానియందు పాటుపోటు కాన్పించుచుండును. వేర్వేఱు చిద్భావములతో అతడు నవ్వుచు, ఏడ్చుచు, ఆటలాడుచు, పాటలుపాడుచు నుండును. భక్తుడగువాడు భగవంతునియందు నిలయ మేర్పఱచుకొని, వాని సమక్షమున ఆనందము ననుభవించుచుండును. ఆదివ్యానంద సాగరమున పడి, ఈదులాడుచు నీటిలోని మంచుగడ్డ క్రిందికి పైకి మునుగుచు తేలుచు నుండురీతిని మునుకలు వేయుచు తేలియాడుచు నుండును.

520. హృదయమున భగవద్భక్తి వెల్లివిఱియగనే కర్మత్యాగము తానంతనదియే వచ్చును. ఎవరినిభగవంతుడు కర్మలచేయ సృష్టిచేసినాడో వారుకర్మలచేయుచుంద్రుగాక. కాలపరిపాకము వాటిల్లినప్పుడు నరుడు సమస్తమును త్యజించి, "రమ్ము! ఓమనసా! హృదయపీఠమున అధిష్ఠించియున్న దైవముకడ మనము ఇరువురమును జాగరణము చేయుదుముగాక!" అని పలుకగలడు.

భగవంతుని శరణుజొచ్చుము; లజ్జాభయములను విడనాడుము. నేభగవన్నామస్మరణ చేయుచు నృత్యముచేయు నెడల ఎవరేమనుకొందురో అను నిట్టిశంకలనన్నిటిని పాఱద్రోలుము.

521. ఈ భగవద్భక్తి కడునరుదగువస్తువు! పతివ్రతయగు స్త్రీకి తన పతిపైనుండునంతటి హృదయపూర్వకమగునట్టి అనురాగము భగవంతునియెడ కలిగినప్పుడేభక్తిలభ్యపడును. నిష్కళంకభక్తిఅలవడుట మహాదుర్లభము. భక్తియందుమనస్సును ఆత్మయు భగవంతునియందే లయముగాంచవలయును ఆపిమ్మట (పరమోత్తమభక్తియగు) భావభక్తిఅలవడగలదు. "భావము" నందునరునకువాగ్బంధన మగును. శ్వాసయునిలిచి పోవును. కుంభకము తనంతనదియే అమరును. లక్ష్యమున గురుపెట్టి బాణమువేయువాని వాక్కును శ్వాసయు స్తంభించి పోవునటులనే అగును.

522. గోపికలనుగూర్చి ముచ్చటించుచుశ్రీపరమహంసులవారు "మ" అను శిష్యునితో యిట్లనిరి:-

"వారల అనురాగము ఎంతచిత్రమైనదో! తమాల వృక్షమును చూచినంతనే వారలకు ప్రేమోన్మాదము పట్టెడిది. (తమాలవృక్షదర్శన మాత్రాననే రాధకు శ్రీకృష్ణుని నీలవర్ణము జ్ఞప్తికి వచ్చెడిది)

"మ":- గౌరాంగదేవునికిని యిట్లే! ఎదుట అడవి కాంపించగానె ఆయన దానిని బృందావనమని భావించినాడు.

పరమహంస:- ఓ! అట్టిప్రేమావేశమున ఒక్క లేశము ప్రసాదముగ లభించెనా! ఎంతటి భక్తి అది! అటువంటి శ్రేష్ఠభక్తి వారియందునిండి పొర్లిప్రవహించినదిగదా!

523. రాధయు కృష్ణుడును దివ్యావతారములని నమ్మినను లేకున్నను విశేషమేమియులేదు. (హిందువులు క్రైస్తవులు నమ్మునటుల) దేవుడు అవతారము పొందివచ్చునని ఒకడు నమ్మవచ్చును. (ఈకాలపుబ్రహ్మసమాజమువారివలె) దేవుడు మానవ రూపము తాల్చునని నమ్మకపోవచ్చును. కాని భగ వంతునియెడల తీవ్రభక్తికలుగవలయునని అందఱునుపరితపించినచాలును. సాంద్రభక్తియొక్కటియే ముఖ్యావసరము!

524. పసిబిడ్డయొక్క అమాయికత్వము యెంతమధురమైనది! ప్రపంచమునందలి ధనసంపదల నన్నింటికంటెను ఒక్కబొమ్మయందెంతయో మక్కువచూపునుగదా! విశ్వాసపూర్ణుడగు భక్తుడట్టులుండును. ఇంకెవ్వడును ప్రపంచమందలి ధనములను గౌరవములను విడిచివేసి, భగవంతునితోడిదే లోకమని కూర్చుండబోరు!

525. ఒక్క నిప్పురవ్వ తాకినంతనే కొండంత దూదియైనను దగ్ధమై రూపుమాయుతీరున, భక్తిపూర్వకముగా పావనమౌ భగవన్నామమును గానముచేసినమాత్రాన నీపాపరాసులన్నియు అదృశ్యము కాగలవు!

526. నరకలోకములోని అగ్ని మొదలగువానికి జడిసి పూజలుచేయుట ప్రారంభదశలోనివారికి తగును. పాపమనెడు భావము కలిగి యుండుటతోడనే మతధర్మము పూర్తియగుచున్నదని కొందఱిభావము. అది కేవలము క్షుద్రమగు ప్రారంభదశయనుటను వారు మఱచుచున్నారు. అంతకన్నను ఉత్తమమగు ఆధ్యత్మికదశయున్నది; భగవంతుని మన తండ్రియనియు, మన తల్లియనియుభావించి భక్తిచేయ వలయును.

527. "భావ" భక్తిపూనుదశ పచ్చిమామిడికాయను పోలును; "ప్రేమ" భక్తిదశ మామిడిపండును పోలునది! 528. సచ్చిదానందమయుడగు భగవంతును తనతో చేర్చి బంధించుకొనుటకై భక్తుడు చేతబూను త్రాడువంటిది ప్రేమ. దాని సాయమున భక్తుడుభగవంతుని తనస్వాధీనమున నుంచుకొనును అనవచ్చును. అతడు పిలుచునప్పుడెల్ల భగవంతుడు వానికడకు వచ్చును.

529. పారశీకపు గ్రంధములలో నిట్లువర్ణింపబడియున్నది. మాంసములోపల ఎముకలున్నవి. ఎముకలలోపల మజ్జా యుండును. వాని అన్నింటిలోపలను ప్రేమయుండును.

530. శ్రీకృష్ణునకు త్రిభంగనామముకలదు; అనగామూడువంపులుతిరిగినవాడని అర్ధము. మెత్తని వస్తువుమాత్రమే వంచినప్పుడిట్లు వంగగలదు. కావున శ్రీకృష్ణుని యీరూపము ఆయన యేకారణముచేతనో మెత్తబడియుండునని తెలుపుచున్నది. ఈ మెత్తపాటునకు ప్రేమయే కారణమందురు.

531. శ్రీరామకృష్ణ పరమహంసులవారు కేశవచంద్రసేనులవారితోనిట్లనిరి:- మీబ్రహ్మసమాజమువారు భగవంతునిచైదములను అంతగాస్తోత్రములు గావించుటేల? "ఓదేవా! నీవు సూర్యుని సృష్టించినావు; చంద్రునిచేసినావు; నక్షత్రములను నిర్మించినావు!" ఇట్లేమేమొ అనుచుందురు! పూలతోటయొక్క అందమును - అందున్న చక్కని పూలను, కమ్మని వాసనలను చూచిమెచ్చుకొనేవారు చాలమందియుందురు; కాని తోటయజమానిని విచారించువారు చాలకొలదిమందియే! ఇందు ఘనతరగణ్యత యెవరిది? తోటదా? భగవంతునిదా? మననడుమ మృత్యువు నాట్యము సాగునంత కాలము తోట మూడునాళ్లబూటకమే! కాని తోటయజమానియొక్కడే నిత్యసత్యమూర్తి!

సారాయంగడికడ ఒకటిరెండు గ్రుక్కలు త్రాగినపిమ్మట, ఆఅంగడిలో ఎన్నిపీపాలలో ఎంతసారాయి అమ్మకమునకున్నదో అను విచారణ ఎవనికి పట్టగలదు? ఒక్కొక్కనికి ఒక్క సీసా ఎక్కువ! నరేంద్రుడు (వివేకానందస్వామి) కంటపడగానే నేను ఆనందపరవశమున మైమఱతును. మీ నాయన ఎవరనిగాని మీకెన్ని గృహములున్నవనిగాని ఎన్నడునువానిని అడుగనేలేదు.

532. నరులు, తమ సంపదలను అమితముగ గణనచేయుదురు. డబ్బు, యిండ్లు, సామానులు చాలవిలువగలవానిగా చూచుకొందురు. కాబట్టి భగవంతుడును అటులనే తనసృష్టిని గూడ, సూర్యుని, చంద్రుని, నక్షత్రములను చూచుకొనునని వారు తలంతురు. కావున నరులు ఆయనచైదములనుగూర్చి పొగడ్తలు పలికినప్పుడు భగవంతుడు సంతోషమున ఉబ్బు ననుకొందురు.

533. హఠభక్తిస్వరూపమెట్టిది (Violent from of devotion) "జైకాళీ!" అనుచు సతతము భీకరముగ అఱచు చుండుటయో, లేక "హరీబోలో!" అను గానముతో చేతులెత్తి నృత్యముచేయుటో, పనిగాబూని పిచ్చివారైపోవుటే! ఈకలియుగములో శాంతిరూపములగు ధ్యానాదులకంటె శీఘ్రతరముగ ఫలించునది హఠభక్తియే. దానిసహాయమున భగవంతునికోట సత్వరము స్వాధీనమై పోగలదు. 534. లోకవృత్తములు సత్వరజస్తమో గుణమయములై యుండునటులనే భక్తియందును గుణభేదములుగలవు. నమ్రత గలిగి సాత్వీకరూపమును, ఆడంబరముతో రాజసరూపమును, పశువృత్తితో తామసరూపమును తాల్చుభక్తిరూపములు గలవు. సాత్వికభక్తుడు రహస్యముగ ధ్యానములు సాగించును. అతడు తన పడకపైన దోమతెఱచాటున ధ్యానమును సాగించుటచేత, ప్రొద్దుట ఆలస్యముగ నిద్రలేచును. వానికి తిన్ననినిద్ర లేకుండుట, అందుకుకారణమని వానిమిత్రు లనుకొందురు. మఱియు కొంచెము అన్నము కూరయున్నవాని సంపాదనతో వాని దేహరక్షణ, వ్యాపారమును ముగియును. తిండిలోగాని బట్టలలోగాని భోగసూచన యుండదు; వాని యింటిలో అలంకారాది ఆడంబరవస్తు సముదాయముండదు. స్తోత్రపాఠముల నాశ్రయించి ప్రపంచములో ఉన్నతిని యతడు సాధించబోడు.

రాజసభక్తుడు దేహమునందు నామాలును, మెడనిండతులసిపూసలును, ఒక్కొకప్పడు బంగారులింగకాయలను ధరించును. దేవతార్చనవేళలందు పట్టుపీతాంబరముల గట్టుటలోను, తాళమేళములతో ఆడంబరముగపూజల సలుపుటలోను మిగుల పట్టుదల చూపును.

తామసభక్తునికి అగ్గివంటి విశ్వాసముండును. బందిపోటువాడు బలముచూపి ద్రోపుడులు చేయునటుల, ఇతడు భగవంతునిపైని పశుబలప్రయోగము చేయజూచును. "ఏమీ! నేను స్వామి నామోచ్ఛారణ చేసియుకూడ యింకను నేను పాపినా? నేను దేవినిబిడ్డను! వానిసర్వస్వమునకు హక్కుగల వారసుడను నేను!":- వాని తీవ్రవాదన లిటులుండును.