శ్రీ రామకృష్ణ సూక్తిముక్తావళి/15వ అధ్యాయము
15వ అధ్యాయము.
సంసార విరక్తి.
329. లోకములో నివసించుడు, కాని లోకమునకు అంటుకొనకుడు. "కప్పను పాముముందు, గంతులు వేయించుడు. కాని పాము దానిని మ్రింగకుండ చూడుడు." అనుసామెత కలదు.
330. పడవనీళ్ళలో యుండవచ్చును; కాని నీళ్లుపడవలో వుండతగదు. సాధకుడు సంసారములో నుండవచ్చును; కాని సంసారము వానిలో యుండరాదు.
331. నీసంసారపుజోలి నీదికాదని సదా భావనచేయుము. అది భగవంతునిది. నీవు వానిసేవకుడవు; వాని ఉత్తర్వులను పాలించుటకే నీవు యిక్కడికి వచ్చియున్నావు. ఈభావము సుస్థిరమయ్యెనా, నరుడు తనదియని చెప్పుకొనుటకు యేమియు మిగిలియుండదు.
332. యజమానుని యింటినిగూర్చి "ఇదిమాయిల్లు"యని దాసీది పలుకుచుండును. కాని తనయిల్లు అదికాదనియు, తన యిల్లుదూరముగ ఎక్కడనో ఒక పల్లెటూరిలో యున్నదనియు దానికి సదా తెలిసియే యుండును; దాని యాశలు అన్నియు తన గ్రామముపైననే యుండును. తనచేతిలోనున్న యజమానుని బిడ్డనుగూర్చి "మాహరి! కొంటెవాడైపోవుచున్నాడు" అనియో లేక "మాహరికి, యిదియిష్టము, అదియిష్టము." అనియో పలుకుచుండును. కాని ఆహరి తన బిడ్డకాదని దానికి తెలిసియే యున్నది. ఈదాసివలె మమకారము లేనివారై మెలగుడని నాకడకు వచ్చినవారితో నెల్ల చెప్పుచుందును. లోకములో నిష్కాములైజీవింపుమందును. సంసారములో నుండవచ్చును, కాని సంసారమునందు అనురాగము పూనరాదు. సతతము తమ హృదయమును భగవంతునివైపు త్రిప్పుడనియు, తాము విడిచివచ్చిన స్వర్గధామమును సంస్మరింపుచు భక్తికొఱకై భగవంతునివేడుకొండనియు చెప్పుచుందును.
333. నీరుకాకినీళ్లలో బాగుగమునుగును; కానిదానిరెక్కలు నీటిచేత తడిసిపోవు. అటులనే ముక్తపురుషులు ప్రపంచములోవసింతురు; ప్రపంచమువారిని అంటదు.
334. సంసారమునందుండియు దానియందు రాగములేక ముక్తుడై యుండువాని లక్షణములెట్టివి? అతడు నీటిలోనితామరాకువలెను, లేక బురదలోని మట్టిగుడిశెయను చేప వలెను యుండును. ఆవరణలువీనిని అంటవు. నీరుతామరాకును తడుపజాలదు; బురద మట్టిగుడిశెయొక్క నిగనిగలాడు శరీరమును మలినపఱచజాలదు.
335. అన్నముతినిపాఱవేసిన ఆకువలె యిందువసింపుము. అదిగాడ్పులకరుణకు లోనైయుండును. ఒక్కొక్కప్పుడది గదిలోను మఱొకప్పుడు పెంటకుప్పలలోను యెగురునటుల చేయబడును. అట్లేయిప్పుడీస్థితిలోనుంచబడితివి; మంచిదియిట్లే యుండుము. యిందుండితీసివేసి ఉన్నతదశయందుంచుననుకొనుము. "తథాస్తు" అప్పుడు పూర్ణవిరాగముతోడనుండుము. ఏదెటులనడచిన అటుల నడచుగాక.