శ్రీ రామకృష్ణ సూక్తిముక్తావళి/14వ అధ్యాయము

14వ అధ్యాయము.

ఈశ్వరార్పణము.

320. వఱపిడిరాతిమీద గీయుటచేత బంగారమును యిత్తడిని కనుగొనుటకు వీలగురీతిని దూషణతిరస్కారములను వఱపిడిరాతితో పరీక్షించుటచేత సత్యమగుసాధువులెవరో మోసపుసాధువులెవరో తెలియవచ్చును.

321. ఈప్రపంచములోనికి వచ్చినందులకు నీవేమిచేయవలయునో తెలియునా? సర్వమును ఈశ్వరార్పణముచేయుము. ఈశ్వరునిగూర్చి స్వార్పణము చేసికొనుము. ఇక నీ కేలాటి బాధయునుండదు. సమస్తమును వానియిచ్చననుసరించి జరుగుచుండునని నీకు అప్పుడు తెలిసిపోవును.

322. పొలములో ఆరుబయటనున్న చిన్నగుంటయందలి నీరు, యెవరు వాడుకొని హరించకున్నను త్వరలోనె యెండిపోవును. అటులనే ఈశ్వరునిగూర్చి సర్వార్పణముకావించుకొని వానికరుణను కృపను ఆనన్యగతికముగా నమ్ముకొనుట చేతనే పాపములు హరించును.

323. పూర్ణార్పణమును మించినసులభమును, సురక్షితమును అగుమార్గములేదు. పూర్ణార్పణము అనగా ఈశ్వరేచ్ఛకు తానుపూర్ణముగ లోబడిపోయి, ఏదిగాని నాదిఅను భావములేకుండ మెలగుటే.

324. సర్వార్పణమునకు లక్షణమేమి? దినమంతయు కష్టపడిపనిచేసి అలసియున్నవాడు దిండువేసుకొని పరుండి, తీరుబాటుగా చుట్ట త్రాగునప్పుడు అనుభవించు విశ్రాంతిసౌఖ్యము దాని లక్షణము. సమస్తములగు విచారములు ఆంధోళనములు విడిచిపోవును.

325. గాలిలో యిటుఅటు ఎగురు యెండుటాకులు తమ నిర్ణయము అనునదిలేక, ఏవిధమగు స్వకీయ ప్రయత్నములేక మెలగుచందమున, భగవంతునిపైన ఆధారపడువారు వాని యిచ్ఛానుసారము వర్తింతురు. తమ యిచ్ఛ అనునది యుండదు. తమ ప్రయత్నము అనునది యుండదు.

326. ఈప్రపంచములో వుండుటో, దీనిని విడిచి పోవుటో ఈశ్వరసంకల్పము ననుసరించి జరుగును. కావున సర్వమును ఆయనకు విడిచివేసి, నీవు పనిని మాత్రము చేయుచుండుము. నీవింతకన్న చేయగలదేమి?

327. క్రోతితిరుగులాడుచుండ, దానికూన దానిని గట్టిగ పట్టుకొనివ్రేలాడుచుండును. పిల్లికూన అటుల తల్లినిపట్టుకొనక జాలిపుట్టునటుల కూయును. తల్లియే దానినిమెడపట్టుకొని తీసికొనిపోవును. క్రోతిపిల్ల తల్లిఆధారమునువిడచెనా క్రిందపడిపోయి హానినందును. ఎందుచేతననగా అదితనబలమునే నమ్ముకొనుచున్నది. పిల్లిపిల్లకు అటువంటిభయములేదు. ఒకచోటనుండి మఱొకచోటునకు తల్లియేదానిని తీసుకొనిపోవును. స్వావలంబనమునకును, ఈశ్వరేచ్ఛకును అర్పణముచేసి కొనుటకును గల భేదము యిటువంటిదిగ నుండును. 328. వేయిచిల్లులుగల కడవతోనీళ్లుతెచ్చి, తననిష్కళంక వర్తనమును, ఋజువుచేసికొనవలసినప్పుడు, శ్రీమతిరాధాదేవి ఒక్కనీటిబొట్టైనను క్రిందబడకుండ తెచ్చినది. అందఱును చేతులుచఱచి ఆమెనుపొగడిరి. అట్టినిర్మలచరితయెన్నడునుండి యుండలేదనిరి. ఎన్నడును యుండబోదనిరి; అప్పుడు రాధ "నన్నేలస్తుతించెదరు? ఆమహిమయంతయు, శ్రీకృష్ణునిదే; వానినేస్తోత్రముచేయుడు. నేను కేవలము ఆయనసేవకురాలిని." అని బోధచేసెను.