శ్రీవేంకటాచలమాహాత్మ్యము/ద్వితీయాశ్వాసము

శ్రీరస్తు

శ్రీవేంకటాచలమాహాత్మ్యము

ద్వితీయాశ్వాసము

క.

వ్యాసమునీశ్వరహృదయని
వాస చిదుల్లాస దుగ్ధవారిధిశయనా
వాసవవందితపదయుగ
భాసుర తఱికుండనృహరి భవదురితారీ.

1


ఆ.

విశ్వచర్య లెల్ల విశదంబుగా నీవు
తెలిసినావు మాకుఁ దెలుపఁ గలవు
గాన విష్ణుకథలు క్రమముగ ముదమునఁ
దెలుపు సూత విమలధీసమేత.

2


క.

మాయావి యగుచు విష్ణుం
డాయాస్థలముల వసించి యతివర్యులకున్
బాయక దాఁ గనిపించుచు
నాయెడఁ గనుపింప కుండు నంటివి సూతా.

3


సీ.

అంజనాద్రిసమానుఁ డైన శ్రీస్వామినం
        దెవ్వరు నిల్పినా రిరవు చేసి
యెవ్వరు ప్రార్థింప నీశ్వరుఁ డచ్చోట
        నిలుకడగా నిల్చె నిత్యుఁ డగుచు

నారీతిఁ దెల్పు నీవని మును లడుగఁగా
        నాసూతుఁ డనియె నావ్యాసమౌని
చెప్పినకథ మీకుఁ జెప్పెద నెట్లన్న
        సనకాదియోగుల శాప మంటి


తే.

జయుఁడు విజయుండు దితియందు జనన మొంది
కనకలోచనుఁడును హేమకశిపుఁ డనఁగ
ధరణిపైఁ బుట్టి సాధు బాధల నొనర్ప
సరగఁ గిటియై హిరణ్యలోచనుని ద్రుంచి.

4


ఆ.

అపుడు స్వర్ణకశిపుఁ డాగ్రహంబును మించి
సాధు భక్తులకును బాధ చేసె
నందుచే నృసింహుడై చక్రి యాదైత్యుఁ
గడుపుఁ జించి చంపెఁ బుడమిఁ బడఁగ.

5


సీ.

పరమభక్తుం డైన ప్రహ్లాదు రక్షించె
        నటు లేగి కనకాక్షుఁ డాహిరణ్య
కశిపుఁడు మఱి కొంతకాలంబునకుఁ గుంభ
        కర్ణ రావణు లనఁగా జనించి
రామచంద్రునిచేత భూమిపైఁ బడుదాక
        బాధించుచుండిరి సాధువులను
గావున శక్రుఁడు దేవర్షు లెల్లరు
        నా రావణునిదుర్గుణాళి హరికి


తే.

మనవి చేసెదమని పోయి ఘనసుధాబ్ధి
తీరమును జేరి పలికి రో దేవదేవ
రావణునిబాధ తప్పించి నీవు మమ్ము
బాలనము సేయు నోమహాపరమపురుష.

6

వ.

అని యనేకవిధంబుల నాక్షీరాబ్ధికి నుత్తరభాగంబున నిలిచి
వేదాంతరహస్యోక్తుల వినుతించి యిట్లనిరి.

7


ఉ.

దేవ సుధాబ్ధివాస హరి దీనదయాపర చిత్తగింపుమా
రావణనామధేయుఁ డగు రాక్షసుఁ డెప్పుడు క్రూరచిత్తుఁడై
భూవలయంబునందుఁ గృతపుణ్యుల నేచుచునుండు వాని నీ
వేవిధిఁగాని ద్రుంచుము మఱెద్దియుపాయము లేదు మాధవా.

8


వ.

అని వేడుటం జేసి విష్ణుదూత యొకండు మరుత్పథంబున.

9


ఆ.

వచ్చి యిట్టులనియె వనజాక్షుఁ డిందు లేఁ
డవనిమీఁదఁ బర్వతాగ్రమునను
మెలఁగుచుండు నటకు నెలమిగఁ జనుఁ డిందుఁ
గలకలంబు సేయవలదు పొండు.

10


క.

అని వాడు పలికి పోయిన
విని మౌనులు సురలు దేవవిభుఁ డాశ్చర్యం
బును బొందుచు నందుండక
చని చని శోధించి రిలను శైలము లెల్లన్.

11


వ.

అనంతర మెందుం గానక వైకుంఠమార్గంబున నిర్గమించి పోవు
చున్నసమయంబున.

12


సీ.

శరదభ్రశుభ్రభాస్వరశరీరమునందు
        శ్వేతప్రకాశవిభూతి మెఱయ
ధవళసంపూర్ణచంద్రకకళంక మనంగ
        నైల్యవత్కృష్ణాజినంబు వెలుఁగ
సురుచిరారుణజటాజూటంబు శిరమునఁ
        దపనబింబంబుచందమునఁ దోఁప

ననిశంబు నారాయణాష్టాక్షరిం దగఁ
        బలికించు వీణియఁ బట్టి భుజము


తే.

మీఁద హత్తించి శ్రీహరి మెచ్చునట్టి
గాననైపుణ్యమును జూపు చూని నడచు
నారదులు రాఁగఁ జూచి యానంద మొంది
యిట్లు వినయంబు నడిగె నం దింద్రుఁ డపుడు.

13


క.

ఓ నారద త్రిభువనముల
మానక చరియింతు వీవు మర్మంబులు నీ
ధ్యానమునకుఁ గన్పట్టును
గాన మహాత్ముఁడవు నీవు ఘనమునిచంద్రా.

14


సీ.

శ్రీశైలభూములఁ జేరి రావణుఁ డతి
        క్రూరుఁ డై సాధులఁ గొట్టువాఁడు
గావున వాని నేగతినైన శ్రీరమా
        పతియ దండింపఁ గా వలయు నడఁగ
విష్ణుదేవుని మేము వెదకుచు క్షీరాబ్ధిఁ
        జేరి యెంతయు నుతిసేయ మాకుఁ
బ్రత్యక్షమును లేక పల్కక యుండఁ గా
        హరి దూత యొక్కరుం డంతరిక్ష


తే.

మునకు వచ్చి మముంజూచి ఘనుఁడు చక్రి
భూతలంబున నొకపెద్దభూధరమున
నున్నవాఁ డట కేగుఁ డం చొరిమఁ జెప్పి
పోయినాఁడంత మేమెల్లఁ బాయకుండ.

15


వ.

ఈభూలోకంబున గాఢారణ్యంబులును భూరిభూధరశృంగం

బులను వెదకి వేసటనొందితి మింత కా హరి యుండునెడ నెఱుంగక యీమార్గంబున.

16


క.

చనుదెంచితి మాదేవుం
డనుపమవైకుంఠపురమునం దుండును గా
వున రావణవృత్తాంతము
వినిపించెద మచట హరికి విస్మయపడఁగన్.

17


చ.

అన విని నారదుం డనియె నయ్య వికుంఠమునందు విష్ణుదే
వుని గని రాను నేను బహుళోత్కలికం జను నొక్క పార్షదుం
డనియె వికుంఠము న్విడచి యాహరి భూతలమందు లక్ష్మితో
నొనరఁగ నొక్క కొండపయి నుండును పొమ్మనె వింటి నంతయున్.

18


క.

కావున నచటికి మీరిఁకఁ
బోవలసిన దేల చక్రిపుత్రునికడకుం
బోవుద మా జలజాసనుఁ
డే వివరము దెల్పు ననుచు నెదురుగ గనుచున్.

19


ఆ.

దేవమౌని వల్కె దేవేంద్రసురముని
ముఖులు సత్యలోకమునకుఁ బోయి
ఘనచతుర్ముఖములు కరచతుష్టయములు
గలిగి యొప్పుచున్న కమలభవుని.

20


సీ.

కాంచి రచ్చటఁ దప్తకనకాభదేహుండు
        లోకవందితుఁ డష్టలోచనుండు
మహనీయదండకమండలహస్తుడు
        బాలభానుప్రభాభాసితుండు

నతిశయదివ్యపద్మాసనాసీనుండు
        బ్రథితతాపసజనపరివృతుండు
నిర్మలసత్కర్మనిష్ఠాగరిష్ఠుండు
        పరమామృతధ్యానపరవశుండు


తే.

నగుచు నామ్నాయగోప్యశాస్త్రాదులందు
వింతవింతగ మూర్తీభవించి మెలఁగఁ
జేరి సావిత్రి గాయత్రి భారతియును
గొలువఁగాఁ గొల్వునం దున్న జలజభవుఁడు.

21


ఆ.

దేవతలను మునులఁ దిలకించి వేడ్కమైఁ
జెంత రం డటంచుఁ జేర్చి వారి
కార్యములను దెలియఁగా నడ్గ వారెల్ల
నుడివి రిట్లు మ్రొక్కి నుతు లొనర్చి.

22


వ.

పితామహుఁడా! రావణాసురునివలన మేము పడు బాధ
లెంతని చెప్పఁగలము. తద్రావణుండు నశింపక యుండిన సాధు
జనబృందంబులకు బాధలు మాన వదియునుం గాక.

23


సీ.

వరసుధాంబుధియందు వైకుంఠపురియందుఁ
        ద్రిభువనంబుల మేము దిరిగి వెదకి
వచ్చితి మం దెందు వాసుదేవుఁడు లేడు
        కావున మేము మీకడకు వచ్చి
శరణు వేఁడితిమి శ్రీహరియుండు తా వెందుఁ
        గలదొ యెఱింగింపవలయు మీరు
చక్రి సంచారంబు సర్వం బెఱింగిన
        వారు గావున వేఁడువారు మేము

తే.

చెలఁగి తపముల విఘ్నము ల్సేసి మాకు
నమితబాధలు గల్గించునట్టి దనుజు
నడఁపఁదగుశక్తి యాహరి కలరియుండుఁ
గానఁ గరుణింపవే యని పూని యడుగ.

24


క.

విని యావిరించి వారిం
గని యిట్లనె రావణుండు కాలము రా కె
వ్వనిచేతఁ దెగఁడు వాఁ డొక
మనుజునిచేఁ జచ్చుం దుదకు మహిపై మఱియున్.

25


క.

దేవతలుచేత నితరుల
చే వధ్యుఁడు గాఁడు తాను జీవించుటకై
చేవం గొనె వరమును దగఁ
గావించి తపంబుఁ గెల్వఁగా దెవ్వరికిన్.

26


సీ.

దాని కుపాయంబు దగఁ జెప్పెదను మీకు
        శ్రీవేంకటాద్రిపైఁ జేరియున్న
హరిపాదములఁ బడి శరణు వేఁడుఁడు ప్రేమ
        నార్తి నివారించి యతఁడు జగతి
మానవరూపంబుఁ బూని యా దశకంఠుఁ
        దునిమి రక్షించు మిమ్మును ముదమునఁ
జింతింప నేటికి శ్రీవేంకటాద్రికి
        నేగుఁడు మీతోడ నేను వత్తు


తే.

ననుచు నిట్లనె యాతండు మనసు హాయిఁ
జెంద శ్రీదేవితోఁ గూడి చెట్ల పొదల
బరఁగు మృగములఁ బక్షుల బట్టు చెట్టి
క్రీడ నున్నాఁడొ దెలియదా శ్రీకి నెఱుక.

27

వ.

అయిన నొక్కవిశేషంబు గల దది యెట్లన్న నయోధ్యాధి
పతియగు దశరథుడు పుత్రార్థి యై స్వామిపుష్కరిణీ
తటంబునఁ దపంబు సేయువాఁడు ఆరాజేంద్రునకు హరి
ప్రత్యక్షం బగు వాఁడు. మన మెల్ల నచ్చట నిలిచి యుండి
ప్రత్యక్ష మగు హరికి మ్రొక్కులిడి ప్రార్థింత మని యా
యజుండు దేవతలం దోడ్కొని వేంకటాద్రికి నుత్తరభాగం
బునఁ దిరుగుచుండ నద్భుతంబగు నొకపర్వతంబు నందు.

28


సీ.

సంతానమందారచంపకవకుళవి
        ఖ్యాతద్రుపరివృత మైనదాని
దిక్కులను స్వాదు పిక్కటిల్లఁగఁ జేయు
        ఫలపుష్పవితతిచేఁ బ్రబలుదాని
శుకపికప్రముఖపక్షులు వినోదంబుగా
        నుప్పొంగి పల్కఁగా నొప్పుదాని
ఘనగండభేరుండకంఠీరవాది మ
        హామృగధ్వనులు మిన్నందుదాని


తే.

గరుడ గంధర్వ యక్ష కిన్నరగణంబు
లెలమిఁ దిరిగెడు సానువు లలరుదాని
నదులు కమలాకరములు నానాముఖముల
నతిశయింపఁగ విస్తీర్ణ మైన గిరిని.

29

బ్రహ్మేంద్రాదులు వేంకటాద్రికి వచ్చుట

చ.

కనుఁగొని బ్రహ్మముఖ్యు లతికౌతుక మొప్పఁగ నాగిరీంద్రమం
దనువుగఁ జేరి భక్తి యెసలారఁగఁ దీర్థములందుఁగ్రుంకుచున్
వనఫలపుష్పముల్గొనుచు వారిజనాభుని పూజ సేయుచున్
వినమితభక్తి నచ్యుతుని వేచిరి యాతనిరాకకందఱున్.

30

వ.

ఇవ్విధం బుండఁ గొన్నాళ్లకు నయోధ్యాపురీశుండు.

31


సీ.

దశరథుం డర్థిమైఁ దనకుఁ బుత్త్రులు లేమి
        పరితాపపడి నిజగురుని జేరి
మ్రొక్కి యిట్లనియె నో మునినాథ తమవంటి
        గురువుండఁగాఁ బుత్త్రవరము నాకు
నేల యీఁగూడదు మేలొంద ననఁగ న
        మ్ముని యిట్టులనియె నో మనుజనాథ
తొలికర్మ మొక్కింత గలది దానం జేసి
        సుతులు లేరైరి యప్పతితమడఁగ


తే.

వేంకటాద్రికి నేఁగి సద్వృత్తి మెఱయఁ
బుష్కరిణియందుఁ గ్రుంకి యాభూమియందుఁ
దానవారిని నిరతంబుఁ దప మొనర్తు
వేని పాపంబు తలఁగి నీయిష్టము గను.

32


క.

ఇనవంశోద్ధారకు లగు
తనయులు పుట్టెదరు నీకు దైత్యారిదయం
జను మిప్పుడ వేంకటగిరి
కని ముదమున ననఁగ మౌని కారా జనియెన్.

33


క.

ఆవేంకటగిరి యెక్కడ
పావనమునివర్య! యటకుఁ బయనపులగ్నం
బేవాసరమున్నది నా
కావారము దెల్పు పోయెదని యడుగంగన్.

34


సీ.

అపు డావసిష్ఠుఁ డిట్లనియె గంగానది
        కటు దక్షిణంబుగ నా సువర్ణ

ముఖరికి నుత్తరంబుగ నొక్కక్రోశదూ
        రముగ గంగకు దక్షిణముగ ద్విశత
యోజనంబుల దవ్వు నుండు వేంకటగిరి
        యందు గంగానది కతిశయంబు
లగు పుణ్యతీర్థంబు లలరియుండును మఱి
        స్వామిపుష్కరిణియు వరలుచుండు


తే.

నందుఁ బరిమళపుష్పచయాదిలతలు
మధురఫలవృక్షములచేత మహితశక్రు
వనమునకు మించి ఫలపుష్పవార మవ్వ
సంతకాలంబు వోలె నజస్ర మొప్పు.

35


వ.

మఱియును.

36


సీ.

మేరుసమానము తేరు శృంగారించి
        నట్టుల శ్రీవేంకటాద్రి యొప్పు
రమణీయ మగు చైత్రరథముచందంబుగఁ
        గన్నులపండువై గానవచ్చుఁ
గిన్నర గంధర్వ గీర్వాణ వనితల
        గాననృత్తములందుఁ గలిగియుండు
ఘనకులాచలముల ఘనతఁ జూడని హేమ
        శిఖరాళిచేఁ బ్రకాశించుచుండుఁ


తే.

బ్రాకృతులు చూడ పాషాణపర్వతంబు
కరణిఁ గన్పట్టు నాగిరిగౌరవంబుఁ
జెప్పనొప్పునె యేరికి శేషుఁ డైనఁ
బొగడఁజాలఁడు వింటివె భూపతీంద్ర.

37

వ.

మఱియు నీ కీదినంబున నభిజిల్లగ్నంబునందుఁ బ్రయాణంబు
నకు శుభంబుగ నున్నయది యనిన నవ్వసిష్ఠుని నాశీర్వచ
నంబు నొంది ప్రయాణంబై, గోదావరీకృష్ణాఘహారీప్రముఖ
నదులందుం గ్రుంకుచు వచ్చుచు ముందట శ్రీ వేంకటా
చలంబుం గని మ్రొక్కి యారోహించి తద్గిరిగహ్వర సాను
దేశప్రముఖ సిద్ధస్థలంబుల నీక్షించుచు వచ్చి యనంతరంబు.

38


సీ.

పద్మనీలోత్పలప్రముఖాంబుజశ్రేణు
        లందుఁ దుమ్మెద లింపుఁ జెంది పాడ
వనజనాళంబులు ఘనమరాళంబుల
        తుండంబులం దంటి తూలి యాడ
మత్స్య కచ్ఛప తతి మసల కాహారార్థ
        ముగ నీట నీఁదెడు వగలు మెఱయఁ
దఱలు తరంగము ల్దగి పైని మారుతం
        బల్లన వీవంగ నలరునట్టి


తే.

స్వామిపుష్కరిణిం గని సంతసించి
దశరథుం డప్పు డాతీర్థతటము సేరి
యచ్చ టచ్చట యోగంబులందు నుండు
మునులఁ గన్గొని వారికి మ్రొక్కి నిలచి.

39


వ.

మఱియు నత్తీరంబున ననేకజటాధారులును, సిద్ధాసన భద్రా
సన గోముఖాసన స్వస్తికాసన పద్మాసన దర్భకాసన కుర్కు
టాసన అర్భకాసన ప్రముఖాసనాసీనులై రేచక పూరక
కుంభక యుక్తప్రాణాయామంబులు సేయువారును, ఆధార
స్వాధిష్ఠానమణిపూర కానాహత విశుద్ధాజ్ఞాచక్రంబులయం

దున్న పంచాశద్వర్ణంబుల నవలోకించుచుం దత్త దధిష్టానదేవ
తల నజపవిధానంబున నర్చించుచు నాడీ శోధనం బొనర్చి
క్రమంబుగ షడాధారంబులు భేదించి సుషుమ్ననాడీమార్గం
బున నూర్ధ్వముఖంబుగ గమనించి సహస్రార కమలాంతర్గత
సుధా బిందుపానానుభవంబునఁ బరవశులై చొక్కుచుండు
వారును, హృదయకమలకర్ణికామధ్యంబున నంగుష్ఠమాత్రుం
డై ప్రకాశించుచున్న పరమపుర్షుని ధ్యానించి తదనుభవం
బున నానందించువారును, సాంఖ్యతారకామనస్కయోగా
భ్యాసపరవశులై యంతర్లక్ష్య మధ్యలక్ష్యావలోకనంబులు
సేయువారును, శ్రోత్రనేత్రనాసాపుటనిరోధం బొనర్చి
యాత్మ ప్రత్యయ ప్రకారంబు వీక్షించుచు దశవిధనాదంబు
లాలకించువారును, మఱియు నంతర్లక్ష్యంబున నుండి యఱ
గంటి చూడ్కిని స్వరూపధ్యానంబు సేయువారును,
కన్నులు మూసి శిరంబు వంచి యూర్ధ్వజ్ఞప్తిఁ గళా
మాత్రంబు నిల్చువారును, ఇద మిత్థ మనుట మఱచి
యెఱుకమాత్రంబై శేషించి కేవ లాత్మానుభావంబు సేయు
వారును, స్థూలజిహ్వాగ్రంబును దదుపరి సూక్ష్మజిహ్వా
గ్రంబుఁ దాకునట్టుగాఁ జొన్పుచుం దదేకనిష్ఠచే లంబికా
యోగం బొనర్చువారును, ఇవ్విధంబున ధ్యాన షణ్ముఖీ
శాంభవీ రాధాయంత్రఖేచరీ ముద్రాభ్యాసపరులై యనేక
పాదస్థులై సవితృ మండల మధ్యవర్తియైన నారాయణ
విగ్రహంబును జూచువారును, పంచాగ్ని మధ్యంబునందుఁ
గూర్చుండి మహాఘోర తపంబు సేయువారును, నృసిం
హానుష్ఠభంబును, రామతారకంబును, గోపాలమంత్రం

బును, వరాహమంత్రంబును, వాసుదేవ ద్వాదశాక్షరం
బును, నారాయణాష్టాక్షరంబును, శుద్ధప్రణవ మంత్రం
బును, బ్రశస్తసప్తకోటి మహామంత్రంబుల న్యాస ధ్యాన
పూర్వకంబులుగ నేకాగ్రచిత్తంబున జపంబులు సేయు
వారును, శ్రీమన్నారాయణ విగ్రహంబును బూజించుచుం
దన్మంత్రపారాయణులై యుండువారును, వ్యాఘ్రకృష్ణా
జినవల్కలాంబరులై వాతాంబు పర్ణకందమూల ఫలా
హారులై కర్మ జ్ఞాన భక్తి వైరాగ్య జప తప హోమాది
సకల సత్కర్మ నిష్ఠల నుండు మహామునిజన సమూహ
మధ్యంబున.

40


సీ.

అలఘుచతుర్భాహువులు చతుర్ముఖములు
        నెనిమిది కన్నులు ననలసదృశ
తనువు దీపింపఁగ ధ్యానయోగసునిష్ఠ
        నూని పద్మాసనాసీనుఁ డగుచు
ననుపమనారాయణాష్టాక్షరీ జప
        కలితుఁడై నాసికాగ్రమున దృష్టి
హత్తించి స్ఫటిక సదక్షమాలికఁ జేతఁ
        బట్టి చిత్తము బిగఁబట్టి చక్ర


తే.

పాణిపదములయం దుంచి పరమభక్తి
చే భరన్యాస యోగసంసిద్ధుఁ డగుచు
వనజసంభవుఁ డుండఁగాఁ గని వసిష్ఠ
సంయమీంద్రుఁడు విస్మయంబంది యపుడు.

41


తే.

దశరథేశ్వర యిమ్మహా తాపసులను
గూడి పద్మజుఁ డిచట నెక్కున తపంబు

సేయుచున్నాఁడు గావున శ్రీశుఁ డింక
నమరవరునకుఁ బ్రత్యక్ష మగుట నిజము.

42


వ.

మఱి యేను భవదీయపురోహితుండ నగుటం జేసి యిచ్చటి
కేతెంచితిఁ గావున.

43


తే.

ధన్యుఁ డగు సర్వలోకపితామహుండు
భక్తి మెఱయనివాతదీపంబు వోలెఁ
దాఁ జలింపకయున్నాఁడు దనర నజుని
మెచ్చి ప్రత్యక్షమగును లక్ష్మీవిభుండు.

44


ఉ.

కావున దివ్యపుష్కరిణి కామఫలప్రదయంచు నమ్మి యో
భూవర నీవు త్వరగఁ బుష్కరిణీజలమందుఁ గ్రుంకి స
త్పావన భక్తి మీఱఁగ జపం బొనరించుమటన్న నప్డు ధా
త్రీవిభుఁ డిట్లనెం బరమదేశిక తజ్జపమీవు చెప్పవే.

45


సీ.

అనిన శ్రీవేంకటేశాష్టాక్షరీమంత్ర
        మావసిష్ణుండు పుత్రార్థియైన
దశరథేశ్వరునకు దయ నుపదేశంబు
        సేయఁగా నృపతి వసిష్ఠమునిని
బూజించి కూర్చుండి పుత్రార్థియై మహా
        శిష్టుఁ డై జపమును జేయుచుండె
నపుడు వసిష్ఠుఁ డత్యంతనిర్మలచిత్తుఁ
        డగుచు నొక్కెడఁ దపం బాచరించు


తే.

చుండె నంత నభంబున నుఱిమినట్ల
కడుభయంకర నినదంబు గల్గె నాస్వ
నంబునకు బ్రహ్మ తనశరీరంబుఁ దెలిసి
కనుల నలువంకలం గనుంగొనుచు నుండ.

46

తే.

దశరథుఁడు లేచి వెఱగంది ధాతృముఖ్య
దేవతాళికి మునులకు భావ మలర
మ్రొక్కె నప్పుడు వా రెల్ల మొనసి నీకు
వంశ మభివృద్ధి యగునని వర మొసంగి.

47


వ.

దశరథుని దీవించిరి యనంతరంబు.

48


క.

ఆకాశంబునఁ బొడమిన
భీకరశబ్దంబు చెవుల భేదించిన దిం
దీకాల మభ్రఘోషం
బీకరణిం బుట్టఁదగిన హేతువదేమో.

49


క.

అని యందఱు గగనదిశం
గనుచుండ ననేకు లయిన కమలాప్తులు గూ
డి నయట్టుల దేజంబుగఁ
గనుపించెం దానిఁ జూడఁగాఁ జిత్రముగన్.

50


క.

జ్వలన గ్రహ నక్షత్రము
లలఘుతటిల్లత లనేకు లగు చంద్రులతోఁ
గలసిన గతి నమిత ద్యుతి
విలసితముగ నభము నిండె విస్మయ మారన్.

51


క.

ఎక్కడఁ జూచిన కాంతులు
క్రిక్కిఱిసినఁ జూడలేక గీర్వాణముఖుల్
చొక్కుచుఁ గన్నులు మూసిరి
నిక్కము దెలియంగ రాక నెఱి నామీదన్.

52


సీ.

అప్పుడు కోటిసహస్రమార్తాండప్ర
        భానిభంబైన విమాన మొండు

పొల్పుగ వివిధగోపురము లనేకంబు
        లైన ప్రాకారము ల్హర్మ్యములును
లలితంబు లైన నీలస్తంభములు బహు
        పటువజ్రసద్వారబంధనములు
భర్మకవాటము ల్భాసురవిద్రుమ
        మంటపంబులు దీర్ఘమందిరములు


తే.

కాంచ నోన్నత గోపురకలశములును
భూరి మరకతముల నొప్పు తోరణములు
ఘనతరధ్వజములు పతాకములు మెఱయ
పంచవర్ణద్యుతుల నొప్పు పట్టణమున.

53


తే.

పుష్ప మౌక్తిక హారము ల్బూరి
జాలముల నంటి గాలికిఁ దూలి యాడఁ
గలికి చిల్కలు శిఖి కలకంఠములును
దేనె లొల్కెడు పల్కులఁ బూని వల్క.

54


బ్రహ్మకు వేంకటేశ్వరుఁడు ప్రత్యక్షమగుట

వ.

న ట్లొప్పు విమానపట్టణమధ్యంబునం దనరు సభామంటపంబు
ను దన్మధ్యంబున సహస్రమణిస్తంభయుక్తంబైన క్రీడా
మంటపంబును దన్మధ్య నవరత్నస్థగితమంటపచతుర్ద్వా
రంబులయందు ద్వారపాలకులు నిలిచి యుండ, నామంటప
పరివృతరాజవీధుల నవయౌవనాలంకృత సుందరీజన
సమూహంబులును మెలంగ, విచిత్ర కలితంబగు నద్దివ్యవిమా
నంబు వీక్షించి డగ్గఱ నుండు వసిష్ఠాదిమునులం జూచి య
వ్విరించి యిట్లనియె.

55

చ.

మునివరులార! మజ్జనకు ముఖ్యవిమానలస త్ప్రకాశ మా
దినకర చంద్ర పావకుల దీధితులన్ హసియించుచు న్భువిన్
ఘనతరమై నభోదిశను గన్పడుచున్నది చూతమంచు న
య్యనిమిష తాపసోత్తముల నందఱఁ బిల్చి ప్రమోదచిత్తుఁడై.

56


సీ.

అంబరమార్గాన నరిగి విమానపూ
        ర్వద్వారముసఁ జొచ్చి వనజభవుఁడు
పోవుచుండఁగఁ జూచి పురుహూతముఖసుర
        సంయము ల్దశరథచక్రవర్తి
యజుఁడు వోయిన త్రోవ నావిమానమునందుఁ
        జేరి యచ్చట విష్ణుసేవ నెంచి
యంతరాంతరములం దరుదుగా వెదకుచు
        భయభక్తు లెసఁగ నాబ్రహ్మముఖులు


తే.

వాసుదేవుని వీక్షించి వాంఛ మీఱ
మనము లుప్పొంగ నాస్థానమంటపముల
లోఁ బ్రవేశించి రప్పుడా లోకకర్త
యైన నారాయణుండు దాయార్ద్రుడగుచు.

57


వ.

క్రీడామంటపమధ్యంబున నవరత్నస్థగితపద్మపీఠంబునందుఁ
బ్రాకృత ప్రకాశుండై మఱియును.

58


సీ.

మకుటకౌస్తుభరత్నమకరకుండలములు
        ఘన మేఖ లాంగద కంకణాలు
వర వనమాలికా వైజయంతులదీప్తి
        నలరు గ్రైవేయక హారములును
కనకాంబరం బొగిఁ గాంతుల నీను దే
        హమునందు వెలుఁగగా నభయదాన

కలితదక్షిణకకరకమలంబు పావన
        చరణంబు లర్చింప సరవిఁ జూప


తే.

వామ హస్తాంబుజము కటిసీమ నొప్పఁ
దక్కిన కరంబులను శుభద మగు శంఖ
చక్రములకాంతు లెసలార శస్తశాంతి
సర్వతోముఖుఁడై దయాస్వాంతుఁ డగుచు.

59


క.

హరి ముద మొందుచు నుండఁగ
వరవక్షమునందు సత్యవరభూషణ మై
సిరి దనరఁగ నిరుగడలను
ధరణియు నీళయు వసించి తద్దయు మెఱయన్.

60


సీ.

నీలమేఘమునందు నిలచిన క్రొక్కాఱు
        మెఱుపు రీతిగ సిరి యురమునందుఁ
గుడిభాగమున నీళ యెడమభాగంబున
        భూదేవి బహురత్న భూషణములు
బంగ రంచులు కుసుంబావస్త్రములు దాల్చి
        కుటిలాలకంబులు నిటలములను
లీలగఁ జాల మిళిందపఙ్క్తులవలెఁ
        జలియింపఁ గస్తూరితిలకములును


తే.

గనులఁ గాటుకగంధలేపనము లమర
వరకిరీటంబులను విరిసరులు గదలఁ
జంద్రబింబనిభాస్య లాచక్రధరుని
గొలిచి మెలంగుచు సంతోషకలిత లయిరి.

61


వ.

ఇవ్విధంబున నతికోమలతులసీదళచ్ఛాయ దేహకాంతి
నొప్పుచు దక్షిణహస్తంబున నీలోత్పలంబుఁ బూనిన

భూదేవియు విద్యుల్లతాసంకాశ యై ప్రకాశించి కరంబునం
గరంబు మెఱయు శ్వేతకమలంబు ధరించిన శ్రీదేవియుఁ
గమలకర్ణికాసన్నిభయై దీపించు వామకరంబున శోణాంబు
జంబుఁ దాల్చిననీళాదేవియు హరిం జేరి ఛత్రచామరం
బులు వట్టిన సుందరీమణులు గొలుచుచుండుసమయం
బున శ్రీనివాసుండు కరుణాకటాక్షవీక్షణుండై బ్రహ్మేంద్రా
దులకుఁ బ్రత్యక్షంబయ్యె. నప్పుడు కమలగర్భాధ్యగ
స్త్యవసిష్ఠమహామునులును సనకసనందనాదిమహాయోగు
లును బురుహూతాది గీర్వాణులును శ్రీహరికిం బునః పునః
ప్రణామంబు లొనర్చి పులకాంకితశరీరులై సంపూర్ణానందం
బున గద్గదకంఠులై బాష్పపూరితాక్షులై కరంబులు
మొగిడ్చి యిట్లు నుతించిరి.

62


దండకము.

శ్రీమత్పరాకాశ శేషాచలాధీశ మంగాముఖోల్లాస
మౌనీంద్రహృద్గేహ శృంగారసద్భక్తమందార మాధుర్య
వాగ్వ్రాత మాయాగుణాతీత సర్వార్థనిర్ణేత సన్మోక్ష
సంధాత శ్రీభూమి నీళాసమే తాంబుజాతాక్ష పాఠీన
కూర్మామితక్రోడరూపా నృకంఠీరవా వామనా రామ
రామా మహాసీరహస్తా యశోదార్భకా బుద్ధకల్కిప్రభావో
జ్వలాకార కాలానురూపప్రకారాద్భుతానంత లీలావతారా
నిరాకార వేదాంత సారాబ్ధిగంభీర హేమాద్రిధారా పకా
రాకరా పాదసంసారదూరా చిదాకార కారుణ్యపూ రాగ
మాగణ్యపుణ్యానుగుణ్యా సదాక్షిణ్య హైరణ్య నేత్రాది
దైత్యేశ్వరారణ్య దావానలజ్వాల దేవేంద్ర ముఖ్యామర
శ్రేణి పాలా సుశీలా సువర్ణాభచేలా రమాలోల విశ్వాది

మూలా మహాయోగి జాలాత్మ కంజాత రోలంబ బింబాధరా
కంబుకంఠా నిరాలంబ గోవింద నందాత్మజా గోప బృందా
వనా దివ్యబృందాటవీవాస కందర్పసౌందర్య మందస్మితాబ్జో
పమానా సదానంద నక్రాంతకా దీనమాతంగసంరక్షకా
ఖండచండప్రతాపా, లసత్కుండలాలంకృతాజాండభాండో
దరా నంతశాంతస్వరూపాఘనిర్లేప నిర్వాణమార్గప్రదీపా
రణోద్దామలోకాభిరామా ఘనశ్యామ సంపూర్ణకామా
మహాశత్రుభీమా జితశ్శౌర్యభౌమా మునిస్తోమ దేవో
త్తమా దేవతాసార్వభౌమా సదా మిమ్ము సేవించు మమ్మెల్ల
రక్షించు మీశా సుఖావాస శ్రీమ న్నృసింహా నమస్తే
నమస్తే నమః.

63


వ.

అని యివ్విధంబున నుతించి మ్రొక్కు లిడుచున్న బ్రహ్మేం
ద్రాదులం గరుణించి శ్రీహరి యిట్లనియె.

64


ఆ.

వనజగర్భ నీnవు వచ్చిన పని యేమి
దెలుపు మనిన బ్రహ్మదేవుఁ డెలమి
మది నెసంగఁ గనుల మధుసూదనుని జూచి
యిట్టు లనియె మోద మినుమడింప.

65


సీ.

దేవదేవ పరాత్మ దీనరక్షక విన్న
        వించెద మనవి యాలించి వినవె
వసుధ నిప్పుడు దశవదనుండు తప మాచ
        రించి గర్వోన్నతి మించినాఁడు
సుర యక్ష కిన్నర గరుడ గంధర్వప్ర
        ముఖులచే మడియని ముఖ్యవరము

లడిగె లేదన కూర కా వరంబులు వాని
        కిచ్చితి నందున హెచ్చి వాఁడు


తే.

లంకలో నుండి సుంతైన శంకలేక
భటులఁ బురికొల్పి శ్రీగిరి ప్రాంతదేశ
ములఁ జరించుచు మునిసాధువులకు హింస
చేయుచున్నాఁడు వాడు నశించిపోఁడు.

66


ఆ.

వరము లడుగువేళ వాఁడు మానవునిచే
మడియ కుండువరము నడుగలేదు
గానవాని కంతకాలంబు వచ్చిన
తఱిని ద్రుంచు నరుఁడ తథ్యమనుచు.

67


క.

సరసిజగర్భుఁడు వల్కిన
హరి దరహసితాస్యుఁ డగుచు నప్పు డగస్త్యుం
గరుణం గనుఁగొని మౌనీ
శ్వర నీ విపు డిచటి కేల వచ్చితి వనఁగన్.

68


ఉ.

అప్పు డగస్త్యమౌని గమలాక్షుని సన్నుతి చేసి యిట్లనెన్
ముప్పిరిఁగొన్నగర్వమునమూర్ఖు దశాస్యుఁడుమర్త్యకోటులం
దెప్పునఁ ద్రుంచుఁగాన జనదీనదశం గనలేక తత్క్రమం
బిప్పుడు మీకుఁ జెప్పఁ దగు హేతువు గల్గఁగ వచ్చితీశ్వరా.

69


ఆ.

రావణాఖ్యుఁ ద్రుంచి ప్రజలను రక్షించి
మమ్ముఁ గావుమంచు మౌనివరుఁడు
విన్నవింప నగుచు విని యప్డు సనకాది
యోగివరులఁ జూచి శ్రీగురుండు.

70


ఆ.

ఆదియోగు లగుచు నానందమున నుండు
వారు మీరు కోరి వచ్చినట్టి

హేతువేమొ తెల్పుఁ డిపుడన్న సనకాది
యోగు లిట్టులనిరి యో మహాత్మ.

71


క.

ఆంతర్య జ్ఞానాక్షుల
సంతతమును జూచుచున్న స ద్విగ్రహమున్
వింతగఁ గర్మాక్షులఁ గను
భ్రాంతిని వచ్చితిమి మేము ప్రవిమలహృదయా.

72


చ.

అని సనకాదియోగివరు లాత్మరహస్యవిచారలక్షణం
బెనసిన యోగమార్గరతి హెచ్చిన సూక్తుల విన్నవింపఁగా
విని ముదమొంది నవ్వుచును విష్ణుని జిష్ణుని జూచి నీవు వ
చ్చిన పనియేమి మాకిపుడ చెప్పుమటన్న సురేంద్రుఁ డిట్లనెన్.

73


సీ.

యజ్ఞేశ యజ్ఞాంగ యజ్ఞభావనయజ్ఞ
        కర్మఫలప్రద నిర్మలాత్మ
మాధవ మాపితామహుఁడు నగస్త్యుండు
        మనవిచేసినరీతి ననిశ మవని
యందు రావణుఁడు దురాత్మకుఁ డై మమ్ము
        బాధించు శ్రీనగప్రాంతములను
ముని మనుష్యాదుల మూర్ఖుఁడై వేధించు
        వాని మర్దింప నెవ్వాఁడు లేఁడు


తే.

దేవ రయమున వాని మర్దించి సకల
జనుల మౌనుల మమ్ము రక్షణము సేయు
శక్తియుక్తులు మీయందుఁ జాల గలవు
గాన మే మెల్ల దుగ్ధసాగరమునందు.

74


ఆ.

మిమ్ము వెదకి చూచి మీ రందు లేమికి
విపిన గిరులయందు వెదకి మూఁడు

లోకములను మఱియు వైకుంఠముఁ జూచి
కట్టకడకు నిటకుఁ బట్టువట్టి.

75


క.

మీపాదములను బడితిమి
తాపము సెడె వచ్చితిమి ముదంబున ధర నా
బాపాత్ముఁ డైన రావణు
నేపగిదిం జంపి మమ్ము నేలు ముకుందా.

76


వ.

అని యనేకవిధంబుల నుతింప నక్కమలాక్షుం డాబ్రహ్మాది
దేవతలం జూచి నగుచు నిట్లనియె.

77


చ.

జలజజముఖ్యులార మిము సత్కృప మీఱఁగ నేన గాచెదన్
ఖలుఁడగు రావణాసురుని ఖడ్గముపాలును జేయుదేను మీ
రలరఁగ నబ్ధి దాఁటి భయమందకుఁడింక సుఖంబు నుండుఁడం
చెలమిని బల్కుచుండ శివుఁడేగి నుతించి నయోక్తులారఁగన్.

78


సీ.

మర్త్యలోకమునకు మనుజాశనుల వేధ
        దప్పింప శేషభూధరమునందు
నిలిచి మానవులకు నీవు ప్రత్యక్ష మై
        యుండ రాక్షసులు రాకుందు రిటకు
నవల నెప్పుడు నిన్ను నందఱు సేవించు
        చుందురు నిర్భయ మొంది యిచటఁ
బొసఁగ నీ కీ గిరి భూలోక వైకుంఠ
        మగుచుండు నేను బాయక వసింతుఁ


ఆ.

గాన నాకుఁ దగిన తానకం బొండిందుఁ
జూపు మిర్వురమును సురగణంబు
పొగడ నుంద మంచు నగజేశుఁ డనఁగ నా
చక్రి నగుచు ననియె శంకరునకు.

79

ఉ.

ఓపరమేశ నీ విచట నుండుట నిష్ట మెసంగె నాకు నీ
వీ పరమాద్రిక్రింద వసియించుము తీర్థము డగ్గఱం దగం
బ్రాపునఁ జేరి మానవులు భక్తి నినుం గొనియాడుచుంద్రు నీ
వీ పని సేయు టెంతయు మహీతలమందు నెసంగుఁ గీర్తియున్.

80


వ.

అని పల్కుటం జేసి యా యుమాకాంతుండు సంతసించిన
వాఁడయ్యె. నంత.

81


క.

హరిహరు లీభూతలమున
నిరవుగ నుండుటకు నజసురేంద్రాదిమునుల్'
పరమానందము నొందిరి
హరి యంతట దశరథేంద్రు నటు గని యనియెన్.

82


ఆ.

దశరథేశ నీవు తాపసులం గూడి
యిటకు వచ్చినట్టి హేతు వేమి
దెలుపు మనిన భక్తి దీపింపఁగాఁ గోస
లేశ్వరుండు శ్రీరమేశుఁ జూచి.

83


వ.

కరకమలంబులు ముకుళించి యిట్లు వినుతించె.

84


తే.

విశ్వకారణ విశ్వాత్మ విశ్వరూప
సంతతానంద విగ్రహ చక్రపాణి
మిమ్ము జూడంగ మది నెంచి మీకటాక్ష
మిపుడు గామించి వచ్చితి మిందిరేశ.

85


ఆ.

ఎవరికొఱకుఁ బద్మజేంద్రప్రముఖ్యులు
తప మొనర్తు రెవరి ధన్యసూక్తు
లెపుడు వినఁదలంతు రెవరి ప్రత్యక్షంబుఁ
గోఱుచుందు రట్టి గురుఁడ వీవ.

86

ఆ.

నాశరహితమై యనాదిప్రకాశమై
బట్టబయలనుండు పరమపదము
మానివాసమయ్యెఁ గానమీసర్వోన్న
తత్వ మెఱిఁగి వొగడఁ దరమె దేవ.

87


దశరథమహారాజు శ్రీస్వామిని స్తుతించుట

సీ.

దేవదేవ పరాత్మ దీనుఁడనై యొక్క-
        మనవి చేసెదను నెమ్మదిగ వినుఁడు
మీరిచ్చినటువంటి భూరిభాగ్యంబులు
        గలిగియున్నవి వంశగౌరవంబు
నిలుపఁగాఁ దగుపుత్త్రకులు లేరుగావునఁ
        జింత పుట్టినది నాచిత్తమునను
బుత్త్రహీనులకు సత్పుణ్యలోకములు లే
        వని వేదపూరుషుం డవనిఁ బల్కెఁ


తే.

దాపమొందుచు వచ్చి నే మీపదములు
నమ్మి సేవించితిని గాన నెమ్మిమీఱ
సత్యధర్మపరాక్రమశక్తిమతులు
గలుగు పుత్త్రుల నాకిమ్ము కమలనాభ.

88


క.

అని దశరథుఁ డిమ్మెయి నన
విని మనమున సంతసించి విష్ణుం డపు డి
ట్లనియెను జన్మాంతరమున
ఘనపాప మొనర్చినావు కావున నీకున్.

89


తే.

పుత్త్రకులు గల్గరైరి యోభూప యనిన
విని మనంబున లజ్జించి వేగ ధైర్య

కలితుఁడై శ్రీరమేశుని నెలమిఁ జూచి
యివ్విధంబున ననియె నరేంద్రుఁ డపుడు.

90


సీ.

నలినాయతేక్షణా నాపూర్వజన్మానఁ
        జేసినదురితంబు సేరియున్న
నర్కోదయంబుచే నంధకారము వాయు
        నట్లు మత్కలుషచయంబు సరగ
మిముఁ జూచినప్పుడ సమసె నింకేమి ధ
        న్యుఁడ నైతి నాతప్పు లెడఁద నిడక
పుత్త్రుల నొసఁగి సంపూర్ణసంతోషాత్ము
        జేయుము సత్కృప శ్రీనివాస


తే.

యనుచు నానావిధంబుల వినుతి చేసి
పావనాంఘ్రియుగంబులం బడిన నృపునిఁ
జూచి శ్రీచక్రి కృపనిట్లు శుభదవచన
ములను బల్కెను మునులెల్ల ముదమునొంద.

91


సీ.

దశరథేశ్వర నీకు భృశకలుషం బెల్లఁ
        దొలఁగెఁ జింతింపకు నెలమినుండు
బాహుబలాఢ్యులుఁ బరిపంథిగజయూథ
        కంఠీరవంబులుఁ గమలమిత్ర
తేజులు నగుచు ధాత్రీభారము వహించి
        వెలయుదు రాత్మజాతులు యశమునఁ
బొమ్ము నీపురిఁ జేరి పుత్రకామేష్టి గా
        వింపు శీఘ్రంబుగ వేడ్కఁ దనర


తే.

నినకులేశ్వర నీనుతి కేను సంత
సించినాఁడను విప్రులఁ జేరి యచల

చిత్తుఁ డై యొగి నప్పని జేయు మంచుఁ
బలుక నారాజవర్యుఁడు పరమభక్తి.

92


వ.

దండప్రణామంబు లాచరించి బ్రహ్మాదులకు మ్రొక్కి వారి
దీవన లంది నిజగురు వసిష్ఠసహితుఁడై పురంబు సేరి
పుత్రకామేష్టి సేయుచుండె.

93


ఆ.

అంత బ్రహ్మదేవుఁ డాహరికిని మ్రొక్కి
చక్రి! యేను మిమ్ము సరవి నొక్క
విషయ మడుగఁ దలఁతు వేడ్క నానతి యిండు
నేమనంగ వినుఁడు శ్రీమణీశ.

94


వ.

ఈకల్పాంతంబు వఱకు నే నిందుండి మనుజులు సేయుదురా
చారంబులకు యముండు దండించుటం జేసి వారి జనన మర
ణాదులకుఁ దగిన యేర్పాటు లొనర్పవలయు నందులకుఁ
దాము దోడ్పడి రక్షింపవలయు మఱియును.

95


సీ.

కలియుగంబున నింకఁ గల్గు మానవులు దు
        రాగ్రహుల్ దుష్కర్మకాదిరతులు
మలినాత్ము లల్పాయువులు లోభు లన్యాయ
        పరులు మూర్ఖులు నయవంచకులొగిఁ
బరధనకాంక్షులు పరభార్యగమనలీ
        లావినోదులు గర్వభావయుతులు
బ్రాహ్మణదూషణపరులు స్తోత్రప్రియు
        లాత్మపుత్త్రద్రోహు లాత్మహత్య


తే.

రతులు నిర్దయహృదయులు రాజభక్తి
విరహితులు ధర్మశాస్త్రసద్వేదనింద

కులు కులద్రోహు లెంచఁగ గురులదూఱు
వారు మాత్సర్యకలితులు వసుధ మఱియు.

96


వ.

జారచోరప్రవర్తకులు, స్వకన్యకావిక్రయాసక్తులు, దేవతా
రాధనాదులకు నయిష్టులు, సాధుజనుల బాధించువారలు
కావున వారివారికర్మవిధులం బరికించి రక్షింపవలయు ననిన
నాహరి విని కుమారుం జూచి నీయిష్టం బొక్కింత గొఱంత
సేయక యీ శేషగిరీంద్రంబునందు వసియింతు వైకుంఠపురం
బున నుండి సకలతీర్థంబులకు స్వామినియై వెలయు పుష్కరిణి
యీశైలమునందుండ నట్టిపాతకు లీపుష్కరిణియందు
నత్యంతభక్తి గ్రుంకు లిడిరేని వారి పురార్జితకలుషచయం
బెల్ల నశింపదె. వారి యభీష్టంబులు పరిపూర్ణంబు లగుచుండు
ననినం జక్రిం జూచి యజుం డిట్లనియె.

97


క. దనుజులు భూలోకంబున
ననుపమ గర్వంబు మించి యటవుల గిరులం
దున నిల్చి బాధ పెట్టెద
రనఘా తద్బాధ మాన్పు మలజనములకున్.

98


తే.

అనిన నాచక్రపాణి నయంబు మెఱయఁ
జక్రమును జూచి యిట్లనెఁ జక్రరాజ
వివిధసాధనములతోడ వేగ ధాత్రి
కేగి రాక్షసులను ద్రుంచు మిపుడ కడఁగి.

99


సీ.

అన విని యాచక్ర మబ్జాక్షునకు మ్రొక్కి
        కుముదాది వీరులఁ గూడి వెడలి
ప్రళయకాలాభీల భానుబింబమురీతి
        సరభసంబునఁ బోయి సకలదుర్గ

దిగ్దేశములనుండు దేవకంటకులపైఁ
        గవిసి పోరాడి యాగ్రహము పెంచి
చంపి దేశములకు శస్తము గావించి
        శీఘ్రమ కంజాక్షుఁ జెంతఁ జేరి


తే.

మ్రొక్కి యోస్వామి దశకంఠుఁ ద్రుంచి వాని
బలము నేల్పాలు గావించి వచ్చితనినఁ
జక్రముం జేతఁ బూని యాజలజభవుని
జూచి యిట్లనె సంతోషచూడ్కి నపుడు.

100


ఆ.

అజుఁడ నీవు చెప్పినట్లు చక్రం బేగి
యమరరిఫుల నెల్ల నవని ద్రుళ్ల
నేసి వచ్చే నీవు పో సుఖంబుగ మనం
బుననొకింత వింతఁ బొంద కనఁగ.

101


వ.

విరించి యూరక నిలచియుండుటం జూచి చక్రి యిట్లనియె.

102


క.

వనజాసన నేఁ బొమ్మన
విని యూరక యుండ నేల వివరింపుము నీ
మనమునఁ గల వాంఛను వే
యనినం బంకజభవుండు హరి కిట్లనియెన్.

103


సీ.

దేవ మీరును రమాదేవి నావిన్నప
        మాలకింపఁగవలె నదియు వినుఁడు
వేంకటగిరిమీఁద విఖ్యాతినుండు మీ
        కున్నత మైన రథోత్సవంబు
సేయింపవలె నది చిత్తగింపుఁ డటంచు
        విన్నవించంగ నా వెన్నుఁ డలరి

యట్టుల సేయుమటంచుఁ జెప్పఁగ నజుం
        డంత మౌనుల నమరాది దేవ


తే.

బృందములఁ గూడి యప్డు గిరీంద్రమందు
విశ్వకర్మను రావించి వివిధచిత్ర
వీథులం దేజరిల్లగ వేడ్కఁ బురము
సరవి నిర్మింపుమనఁగ నాశ్చర్యమొంది.

104


చ.

అనఘుఁడు విశ్వకర్మ విపులాద్భుతచిత్రవిచిత్రరీతులన్
బెనుపుగఁ దప్తహేమపుటభేదనముల్ రచియించి పిమ్మటన్
ఘనతరమేరుతుల్యముగఁ గాంచనరత్నరథంబు దీర్చి యి
చ్చినఁగని బద్మజుండు నిజచిత్తమునందు ముదంబునొందుచున్.

105


క.

ఘనుఁడగు విఖనసుఁ డనుమునిఁ
గనుఁగొని వైఖానసప్రకారససూత్రం
బును విడక తగిన లగ్నం
బును గనుమని సంతసంబు పొంపిరివోవన్.

106


బ్రహ్మోత్సవము

సీ.

అజుఁ డప్డు వల్క నాయనఘుఁడౌ నిఖనస
        ముని యిట్టు లనియె నో వనజభవుఁడ
వినుము కన్యారాశి నినుఁ డుండు మాసానఁ
        జిత్రతారాన నుచితముగాను
శాస్త్రసమ్మతముగ శస్తముగాన నా
        రోహణాదులు చేసి రూఢి మెఱయ
నుత్తరాషాఢ రథోత్సవం బొనరించి
        రహిఁ దీర్థవారి నాశ్రవణమందుఁ

తే.

జేయు టుచితంబనఁగ సురజ్యేష్ఠుఁ డంత
సకలదేశాధిపతులను సంతసముగ
నుత్సవముఁ జూడ రావించి యుత్కటమగు
వేడుకలు మించఁ జేయించువేళ నటకు.

107


వ.

ద్రవిడ కర్ణాట కురు కుకుర కేరళ కేకయ కోసల మగధ
మాళవ శూరసేన చోశ నేపాళ మళయాళ బంగాళ పాం
డ్య పాంచాల కొంకణ టెంకణ విదర్భ సౌరాష్ట్ర శక సౌవీర
యుగంధ రాంధ్ర విదేహ మత్స్య పుళింద చేది త్రిగర్త
సింధు సింహల లాట కాంభోజ కాశ్మీర మహారాష్ట్ర దేశా
ధీశ్వరులు పరిజనంబులతోడను, బంధుమిత్రకళత్రపుత్రసహి
తహితంబుగ గోవిందేతినామంబులు స్మరించుచు నవ్వేంకటాచ
లారోహణంబుచేసి శ్రీపుష్కరిణియందు సభక్తిస్వాంతు లై
స్నానం బొనర్చి శుచివస్త్రధారు లై, శ్రీవరాహస్వామి
నీక్షించి పరమానంద మొదవ వినుతించి నమస్కరించి కాన్క
లర్పించి శ్రీనివాసుని మందిరంబున కేతెంచి యనేకవిధంబులం
బొగడుచు దండప్రణామంబు లాచరించి వివిధవస్త్రభూషణ
ఫలపుష్పతాంబూలము లర్పించి ధన్యులమైతి మని సంత
సించునెడ నజుండు విష్వక్సేనుం బిలిచి యిట్లనియె.

108


క.

విను సేనాధిప మజ్జన
కునకు మహోత్సవము లిచటఁ గొనియాడఁగ నె
మ్మనమున సమకూర్పఁగ వే
జను మందల మెక్కి యనఁగ సంతసమారన్.

109


సీ.

అపుడు సేనాపతి హరి కజునకు మ్రొక్కి
        యందలం బెక్కి సానందుఁ డగుచుఁ

దనపరివారంబులను గూడి వీథుల
        యందుఁ జరించుచు నందఱకును
దగుపను ల్నియమించి ధాతచెంతకు వచ్చి
        యంజలి గావించి యచటఁ జేయఁ
దగు పను ల్సేయింపఁ దా నాద్యుఁడై యుండె
        నా విఖనసుఁడు దా నంత వేడ్క


తే.

ననఘ మంత్రాలచేతఁ బుణ్యాహవాచ
నంబు గావించి వరశరావంబులందుఁ
బాలికెలనిడి ధాన్యాదు లోలి వైచి
యొప్పు నాగమవిహితమంత్రోక్తముగను.

110


వ.

హస్తయందు నంకురార్పణంబును, నైవేద్యాదికృత్యంబులు
నెఱవేర్చి, యమ్మఱునాఁ డుదయంబునఁ బుణ్యాహవాచన
వాస్తుహోమ గరుడప్రతిష్ఠా గరుడహోమ భేరీ తాళ తాడ
న కంకణ ధారణార్చక బహుమానాది కృత్యంబు లొనరించి
మఱియును.

111


సీ.

హరికి భూమికి నీళ కబ్ధికన్యకు నూత
        నాంబరాభరణంబు లర్పణములు
చేసి శృంగారము ల్సేసి హాటకరత్న
        దీధితు లొప్పిన తిరుచయందు
వేంచేపు సేయించి వివిధమంగళవాద్య
        ములు భూనభోంతరంబుల నెసంగ
మ్రోయుచు నుండఁగ ముందఱ దిగ్బలి
        తగఁ జల్లుచుండఁగ ధ్వజపటంబు

తే.

ప్రబలచక్రము సేనాధిపతియు నడువ
మునులు ససకాదియోగులు మొనసి వొగడ
ఛత్రచామరములఁ బూని సకలదేవ
గణములు న్గొల్వ వీథుల గడు ముదమున.

112


సీ.

అఖిలవైభవములు నానందనిలయంబు
        నకుఁ బ్రదక్షిణముగ నలినభవుఁడు
శ్రీహరి వేంచేపుఁ జేయించికొనిరాగ
        విఖనసుఁ డటు శాస్త్రవిహితముగను
వారక వేడ్క ధ్వజారోహణము చిత్త
        యందొనరిచి రాత్రియందుఁ బరఁగ
నావాహన మొనర్చి యానాఁటఁ గోలె దీ
        క్షను దగి యగ్నిని దనర నునిచి


తే.

సకలదైవత్య సార మాత్మికము లనఁగఁ
దగినహోమము లొనరించి తక్క కపుడు
నిత్యహోమంబులం జేసి నెమ్మిమీఱఁ
జక్రమును వాద్యములతోన వక్ర మలర.

113


వ.

దిగ్బలులతో వేంచేపు చేయించి రథము వెంట శేషవాహ
నంబుమీఁద శ్రీనివాసుని నాసీనుం జేసి విమానంబునకుఁ
బ్రదక్షిణంబుగ ననేకసేవకులతో నుత్సవం బొనరించి
యజుండు హరిని స్వస్థానంబునకుఁ జేర్చి యనంతరంబు నవకల
శపాలకారాధన నైవేద్య హోమచక్ర బలి ప్రముఖ
నిత్యకృత్యంబులు నిర్వర్తించి యలఘుశేషవాహనోత్స
వంబు గావించిన మరునాఁ డుదయంబున లఘుశేషవాహ
నోత్సవంబును, దద్రాత్రి హంసవాహనోత్సవంబును,

మూఁడవదినం బుదయంబున సర్వభూపాలకోత్సవంబును,
దద్రాత్రి కల్పవృక్షోత్సవంబును, దన్మఱునాఁడు మోహినీ
వేషధరుం డైనహరికి నాందోళికోత్సవంబు నాఱవదినం బుద
యమున హనుమద్వాహనసంచారోత్సవంబును, తత్సాయం
కాలము వసంతోత్సవానంతరము సప్తమదినోదయంబుస
సూర్యప్రభోత్సవంబును, దద్రాత్రి చంద్రప్రభోత్సవంబును,
నెనిమిదవదినంబుస షోడశమహాదానాది విహితకృత్యంబులు
నడపి మఱియును.

114


సీ.

ఘనతరోన్నతముగఁ గనకాద్రితుల్యమై
        రంగునిగ్గుల నొప్పు రథమునందు
నెలవుగ శ్రీభూమి నీళలతోఁ గూడ
        హరి నుంచి బ్రహ్మాదు లలఘురథము
సాగించుచుండగ సకలదిక్పాలకుల్
        గరుడ గంధర్వ కిన్నరగణములు
సిద్ధవిద్యాధరుల్ సేవింప వేదదుం
        దుభులు మ్రోయఁగ మహాద్భుతము దనరఁ


తే.

బారిజాతసుమంబు లా బ్రహ్మరథము
పైన రంభాదు లటఁ జల్లి పాడియాడి
కనులఁబండువగాఁ జూడఁగా ధరిత్రి
యందుఁగల మానవులు వేంకటాద్రిమీఁద.

115


సీ.

ధీరయుతుల్ వాసుదేవుని విజ్ఞాన
        సురుచిరభక్తులఁ జూడఁగాను
నుషనిషత్తులు చెప్పు చొగి స్మార్తు లాహరిం
        జిత్స్వరూపమును లక్షింపఁగాను

మొనసి వైష్ణవకోటి గని భక్తిఁ బాడుచుఁ
        బరవశత్వము మీరఁ బరగఁగాను
తత్వవాదులును భేదశ్రుతిసార మీ
        దేవతోత్తముఁడని తెలియఁగాను


తే.

జెలఁగి హరికీర్తనలు కవు ల్జెప్పఁగాను
పండితులు విని శ్లాఘించుచుండఁగాను
బ్రాహ్మణస్త్రీలు పాటలు పాడి హరికి
నెయ్యమున మంగళారతు లియ్యగాను.

116


సీ.

పరమభాగవతులు భక్తిమైఁ బాడుచు
        నుప్పొంగి యాడుచు నుండఁగాను
గరములు ద్రిప్పి భోగస్త్రీలు ముందఱ
        జతలుగ నృత్యము ల్సలుపఁగాను
గ్రమముగ వంది మాగధ సూతబృందము
        ల్పురుషోత్తమునికీర్తిఁ బొగడఁగాను
శిరములఁ గలశము ల్జేర్చి కొందఱు భక్తు
        లొక్కెడఁ బ్రేంఖణ ల్ద్రొక్కఁగాను


తే.

మొనసి కొందఱు గోవింద యనుచు భక్తి
పరవశత్వముచే మించి పలుకఁగాను
రథముపై నక్షతల ననురాగయుక్తి
సతులు మేడలపైనుండి చల్లఁగాను.

117


వ.

ఇట్లనేకు లనేకవిధంబులుగ వినోదించుచు వినుతించుచు
భక్తి మెఱయింపుచుండఁగఁ గనక కమల సుగంధ పుష్ప
మౌక్తిక హారంబులం దులతూగుచు మేరుసమానంబగు
తే రానంద నిలయంబునకుఁ బ్రదక్షిణంబుగ వచ్చి యథా

స్థానమునందు నిలిచె నంత శ్రీవేంకటాద్రీశుండు భూనీళా
సమేతంబుగ రథంబు డిగ్గి బ్రహ్మరుద్రాదులతోడఁ గల్యాణ
మంటపంబునందుఁ బ్రవేశించి నిత్యహోమాది కృత్యంబు
లొనర్చి సకల దేవగణంబులచేతఁ బూజితుం డై ధ్వజారోహ
ణంబు మొదలుకొని యారగించినరీతి నానావిధభక్ష్య
భోజ్యంబులం బరితృప్తి నొందినవాఁ డయ్యె. అంత బ్రహ్మా
దులు నారగించి పరితృప్తి నొంది హరిని యుచ్చైశ్శ్రవంబున
నుంచి విమానప్రదక్షిణంబు సేయించి కళ్యాణమంటపంబున
నునిచి వేడ్కల నలరించి యథాస్థానంబున నుంచి చూర్ణాభి
షేకంబు సేయించి క్రమ్మఱుఁ జక్రతాళ్వారును హరిని శ్రీ
భూమి నీళలను దిరుచయందు విమానప్రదక్షిణంబుగ
స్వామిపుష్కరిణీతీరంబున వేంచేపు సేయించి వరాహస్వామి
ముందట మంటపంబున నునిచి పంచామృతస్నానాది తిరు
మంజనంబును జక్రస్థాన నైవేద్య క్రమంబుల నాచరించి
బ్రహ్మాదు లవభృథస్నానంబులు సేసి రప్పుడు హరి వారలం
జూచి కరం బెత్తి యిట్లనియె.

118


సీ.

బ్రహ్మ రుద్రాది దిక్పాలకు లందఱు
        నామాట వినుఁడు నిర్ణయముగాను
శ్రవణోడునందుఁ జక్రంబుతోఁ గూడ నా
        స్వామిపుష్కరిణిలో స్నానములను
సల్పువారలు పూర్వజన్మంబులను జేయు
        పాపంబులను బాసి భాగ్యవంతు
లై యిహపరములయందు సుఖింతురు
        నామాట నిజముగ నమ్ముఁ డనిన

తే.

శంకరుం డజుఁ డియ్యది సత్యమంచు
బల్కి రటుమీఁద సకలవైభవము లెసఁగ
శ్రీనివాసుడు కోవెలఁ జెంది యచటఁ
బొసఁగఁ గల్యాణమంటపంబున వసించె.

119


వ.

మఱియు విఖనసప్రముఖులు ప్రసూనయాగ నిత్యకృత్యంబు
లొనరించి పత్నీసమేతంబుగ శ్రీపతిని విమానప్రదక్షిణంబు
సేయించి క్రమ్మఱ నిజస్థానంబునం దుంచి బ్రహ్మాది దిగ్దేవతా
బలియు నుద్వాసనంబును ధ్వజారోహణంబు నంకురాక్షతా
రోపణంబును సంపూర్ణహోమంబును గలశోద్వాసనంబును
శ్రీస్వామియందుఁ బ్రధానకలశావాహనంబును గావించి
రప్పుడు, శ్రీనివాసుండు విఖనసునకు బహుమానం బొసంగి
కసకరత్నమయం బగు సభామంటపంబునందు శ్రీభూ నీళా
సమేతంబుగ సకల దివ్యభూషణ కనకాంబర గంధోపేత
కుసుమదామాలంకృతుఁడై బ్రహ్మరుద్రేంద్ర ముని యోగీ
శ్వరప్రముఖులును సకలదేశాధీశ్వరు లైన రాజులును పరి
వేష్టించి కొలువ సకల వైభవంబు లంగీకరించుచుఁ గర
దీపికా సహస్రంబులు ప్రకాశింప హేమసింహాసనాసీనుం డై
కొలువుండి బ్రహ్మను జూచి సంతసంబున నిట్లనియె.

120


క.

కమలజ నీసంకల్పము
క్రమముగ ఫలియించె మోదకలితుఁడ నైతిన్
సుమహితముగ నీయుత్సవ
మమరఁగ బ్రహోత్సవాఖ్య మవని న్వెలయున్.

121


చ.

స్థిరమతితోడ నీవిచటఁ జేసినయట్టి రథోత్సవంబు భా
స్వరమగు భక్తి నిచ్చటికి వచ్చుచుఁ జూచుచు నుండువారు దు

స్తరభసఘోరవారినిధి దాఁటి సుఖంతురు వారి నెల్ల నేఁ
గరుణను బ్రోచుచుండుదును గంజభవా యిది నమ్ము నీమదిన్.

122


శా.

నారూపంబు మనంబునం దలంచుచు న్నానామము ల్బాడుచున్
వేరేచింతలు లేక నాయెడఁ గడు న్విశ్వాసము న్నిల్పుచున్
శ్రీరమ్యం బగుభక్తిఁ జేసి నను నర్చింపంగ శాస్త్రోక్తిచే
నారూఢిం దగు పూజ సేయుజనులం దాసక్తి నే నుండెదన్.

123


సీ.

వారి యాపదలెల్ల వారించి ప్రియముగ
        వారు కోరినయట్లు వరము లిత్తు
ధనవస్తుసంతాన ధాన్యరత్నాదుల
        ననుపమభోగభాగ్యముల నిత్తు
నాయందు ననిశంబుఁ బాయని భక్తులౌ
        జనులకుఁ దోడ్పడి గనుచునుందు
నెంతనమ్మినవారి కంతఫలం బిత్తు
        నమ్మనివారికి నెమ్మి నొసఁగ


తే.

ననిశమును నన్ను మది నిల్పి యాడుజనుల
కిత్తు మోక్షంబు మఱి యెవరేని యిందు
నఖిలదానంబు లతిభక్తి నరసి పేద
వాండ్ర కిచ్చినచో వారి వఱలఁ గాతు.

124


వ.

అని పల్కి రుద్రేంద్రాదులం జూచి యిట్లనియె.

125


సీ.

అరయఁ గన్యారాశి కర్కుండు వచ్చిన
        యదను శ్రీయుత్సవం బాచరింప
వలయు మీ రెల్లరు వచ్చి వేడుక మీఱఁ
        బ్రతివత్సరంబును బాగుమెఱయ

నని రాజులం జూచి యవనీశులార! మీ
        రేఁడాది కొకసారి యిచటఁ జేరి
బంధుమిత్రులతోడ వైభవంబులతోడ
        సేవల నొనరించి చిత్తవృత్తి


తే.

 దార్ఢ్యముగ మీకుఁ గల్గిన ధనమునందు
నాలుగవపాలు గొనితెచ్చి నాకు నొసఁగి
వేడుకలు సేయుచుండుఁడు విభవ మొంద
నిరతమును మీ రటంచును నెమ్మిఁ బల్కె.

126


వ.

అని యిట్లు చాతుర్వర్జ్యములవారికిం దగినధర్మంబు లుపదే
శించి వస్త్రభూషణాదులు సన్నిధానంబుననుండి పారితోషి
కంబు లిప్పించి స్వస్థలంబులకుఁ బోనియమించిన వారంద
ఱాహరిచరణారవిందంబులకుఁ బ్రణమిల్లి యవ్వేంకటా
చలంబు డిగ్గి తమ నెలవులకుం జనిరి. అనంతరం బాబ్రహ్మాది
దేవతలం జూచి శ్రీహరి వెండియు నిట్లనియె.

127


సీ.

బ్రహ్మాదులార! నా పల్కులు మఱికొన్ని
        యాలకింపుఁడు వేంకటాద్రియందు
ధరణీసురుల కన్నదానంబు చేసిన
        నేఁ దృప్తిఁ బొంది మన్నింతు వారి
నదిగాక సకలవిద్యాదానములు చేయు
        వారును మఱి వారివంశజులును
వారివంశజులును వారివంశజులును
        బుణ్యలోకంబును బొందుచుంద్రు


తే.

తులసివనములు నిర్మించి తొడరి తద్ద
ళముల నాకర్పణముసేయ లలితసౌఖ్య

పదవి నిచ్చెద మఱియు సద్భక్తిఁ దులసి
నెలమి బృందావనమునందు నిడినజనుల.

128


వ.

కరుణంజూచి స్వర్గసామ్రాజ్య మిత్తు నిదియునుంగాక ప్రతి
దినంబున భక్తిమై షడ్రసోపేతాన్నంబు యథోచితంబుగ
నాకు సమర్పించినవారికి శాశ్వతైశ్వర్యంబు నొసంగుదు నని
యనేకప్రకారంబులఁ గర్మజ్ఞానభక్తిధర్మసూక్ష్మంబులు బ్రహ్మా
దుల కానతిచ్చి బ్రహ్మకు వేఱుగ నిట్లనియె.

129


సీ.

జలజసంభవ! నీవు సత్యలోకము వాసి
        నాకొఱ కిచట నిన్నాళ్లు నిలిచి
బ్రహోత్సవాఖ్యచేఁ బ్రబలు మహోత్సవం
        బిచటఁ జేయించితి విందువలన
వనధిజాభూనీళలును నేను సంతోష
        భరితుల మైతిమి ఫణినగమున
నిలిచియుండెద మింక నీకు వరంబు లే
        మిత్తు నన్నను భారతీశుఁ డనియె


తే.

జనక నను మున్న మన్నించి సద్వరంబు
లిచ్చియున్నారు నా కిపు డేమిగొదువ
యిఁకఁ దిరోధానమొందక యిచట నెపుడు
నిలిచియుండుఁడు నెలమిగ జలజనయన.

130


క.

నరకములం బడనీయక
నరులను మీచరణరక్షణము చేసినదే
వర మింతకన్న వేఱొక
వరమేలా నాకుఁ దండ్రి వరద ముకుందా.

131

సీ.

అన విని హరి యిట్టు లనియె నీమాట స
        మ్మతమ నా కింకొకమతము గలదు
విను మది నాయందు విశ్వసించుచు భక్తి
        సల్పుచు నున్నట్టి సాధువులను
బాధించువారు మద్బాహుసమానులై
        యెసఁగిన వారికి నెగ్గుచేతు
నన్నెవ రేమి యన్నను నే సహింతును
        భక్తుల నన్న నోపను జగాన


తే.

జయుఁడు విజయుండు సనకాదిసంయములకు
మించి చేసిన యపకృతి కొంచెమేని
గొప్ప యై వారలను నేలఁ గూల్చినట్టి
సరణి నే నన్నమాటకు సాక్షి గాదె.

132


ఉ.

భాగవతాపచార మతిపాపము గావున నట్టిద్రోహమున్
లోఁగక చేయువాని యమలోకమునం బడఁద్రోతు వాని నే
నేగతి బ్రోతు నింక మఱి యెన్నియఘంబులఁ జేసివచ్చి నీ
వేగతి యంచు న న్నిచట వేఁడినదీనుని గాతుఁ బద్మజా.

133


క.

వరభక్తుల నిందించిన
నరులను గురుదూషకులను నమ్మినవారిం
బరమాపదలకుఁ ద్రోసిన
నరకంబులఁ ద్రోతుఁ గాని నయపద మియ్యన్.

134


సీ.

అతిశయదంభ దర్పాద్యభిమాన దు
        రాచార ఘోరదురాగ్రహముల
నలరుచుండెడు మర్త్యు లాసురాంశజులు గా
        వున సురాంశజు లైన జనులనెల్ల

బాధింతు రట్టిపాపాత్ముల శిక్షింతు
        దుష్టుల మర్దింతు శిష్టజనుల
రక్షించుకొఱ కీధరాధరమున నుందు
        నిఁక నీవు పోయి యింపెసఁగ సత్య


తే.

లోకమున కేగు నిన్నెప్డు శ్రీకరముగ
బ్రోచుచుండెద సకలముఁ బొందుగాను
సృష్టిసేయుచు నుండుము దృష్టివిడక
యనుచుఁ బల్కుచు శక్రుని కనియె నిట్లు.

135


ఉ.

పాకవిరోధి! నీవు సురవర్యులఁ గూర్మిగఁ గూడి వేడ్కతో
నాకముచేరి యచ్చట ఘనం బగుబాహుబలంబు పెంచి ము
ల్లోకము లేలు దైత్యులకు లోగి చరింపకు మింక ధీరుఁడై
యేకలుషంబు లేక జయ మేడ్తెఱ నొందుచునుండుమెప్పుడున్.

136


ఆ.

అనుచు శ్రీనివాసుఁ డనిమిషపతి కిట్టు
లానతిచ్చి నెయ్య మలర శివుని
గాంచి మందహాసకలితాస్యుఁడై చూచి
యిట్టు లనియెఁ బ్రీతి యెసఁగ నపుడు.

137


శా.

గౌరీనాయక నామహోత్సవములు గల్పించి సానందులై
యారూఢంబుగఁ జేరి చూచితిరి నే నానందముం బొందితిన్
శ్రీరమ్యంబగువెండికొండపయి సుప్రీతిం దగన్ భక్తులన్
గారుణ్యంబున బ్రోచుచుండు మిఁకఁ బోకందర్పవైరీతగన్.

138


సీ.

వైకుంఠమునకంటె వరసుధాంబుధికంటె
        లలి దివాకరమండలమునకంటె
ధన్యమైనట్టి శ్వేతద్వీపమునకంటె
        శేషాచలంబు విశేషమగుచు

వఱలును భూలోకవైకుంఠమన నేను
        నిలిచితి గావున నెలమి నిటకుఁ
దూర్పున నలరెడు దురితఘ్న యౌ సువ
        ర్ణముఖరీతీరంబు రహిఁ జెలంగఁ


తే.

బ్రబల భూలోకకైలాసరాజ మనఁగ
నలరు పుణ్యస్థలంబునం దెలమి నుండు
మని వచించి యగస్త్యుని గని ముదంబు
దనర నిమ్మెయి ననియె దైత్యారి యపుడు.

139


తే.

పరమపావన కుంభసంభవమునీంద్ర!
నీకుఁ దగినట్టి యెడఁ జేరి నిష్ఠ మెఱయఁ
జిరతరంబుగఁ దపమొప్పఁజేయుమనుచుఁ
జెప్పి సనకాదిమునుల వీక్షించి వల్కె.

140


తే.

యోగివరులార మీరు విరాగమహిమ
నరసి జ్ఞానామృతము గ్రోలి పరమతృప్తి
నొంది యిష్టావిహారులై యుండుఁ డంచు
సంతసంబందఁ బల్కె నాచక్రధరుఁడు.

141


వ.

అనంతర మాబ్రహ్మరుద్రేంద్రాది కుంభసంభవ సనకాదుల
కివ్విధంబున నానతిచ్చి శ్రీభూనీళా సమేతంబుగ నంతర్విమా
నంబునందుఁ బ్రవేశించె. నావల బ్రహ్మ మరాళ వాహనం
బెక్కి సత్యలోకంబుస కేగె. నింద్రుఁ డైరావతంబు నెక్కి
దివంబునకుం బోయె. నందిని గూర్చుండి రుద్రుండు కైలా
సంబున కరిగె. నగస్త్యప్రముఖులైన మునులుసు సనకాదు
లును స్వామిపుష్కరిణికి నుత్తరభాగంబున నుండుపాపవినాశ

తీర్థోత్తరభాగంబునందుఁ గొందఱు మునులు తపంబు లొన
రింప నేగిరి. యియ్యుత్సవక్రమం బెవరేని చదివిన వీనుల
వినిన నాయురారోగ్యభాగ్యంబులు చేకూరునని చెప్పిన
సూతుంజూచి శౌనకాది నీంద్రు లిట్లనిరి.

142


క.

సుందరవిగ్రహ ఘనతర
మందరగిరిధర సమస్తమౌనిహృదజ్జా
నందకర వేంకటాచల
మందిన సురరాజవినుత మాయాతీతా.

143


మాలిని.

సురుచిరగుణహారా శుభ్రకీర్తిప్రచారా
వరజలధిగభీరా వాసవారిప్రహారా
దురితచయవిదారా దుఃఖసంసారదూరా
గురుతరగిరిధీరా క్రూరగర్వాపహారా.

144


గద్యము.

ఇది శ్రీతఱికుండ నృసింహ కరుణాకటాక్షకలిత కవితా
విచిత్ర కృష్ణయామాత్యతనూభవ వేంకమాంబాప్రణీతం
బైన శ్రీవేంకటాచలమాహాత్మ్యంబునందు వరాహపురా
ణంబున దేవేంద్రాదులు క్షీరాబ్ధిప్రముఖస్థలంబులయందు
హరిని వెదకుటయు, నారదప్రేరితులయి బ్రహ్మలోకంబున
కరుగుటయు, బ్రహ్మతోడ దేవేంద్రాదులు హరిని వెదకుటకు
వేంకటాచలారోహణంబు సేయుటయు, దశరథుండు వసిష్ఠ
యుక్తుండై వేంకటాద్రికి వచ్చుటయుఁ, బుష్కరిణీతీరంబున
బ్రహ్మాదులు తపంబు సేయుటయు, శ్రీవేంకటేశ్వరుండు విమా

నంబుతోడ బ్రహ్మాదులకు ప్రసన్నుం డగుటయు, స్వామిని
బ్రహ్మాదులు వినుతించుటయు, బ్రహ్మాదులకు హరి ప్రసన్నుండై
భాషించుటయు, దశరథుఁడు హరిని స్తోత్రంబు సేయుటయు,
శ్రీనివాసుండు దశరథునకు వరమిచ్చి యయోధ్యకుఁ బంపు
టయు, బ్రహోత్సవప్రకారంబును నను కథలంగల ద్వితీ
యాశ్వాసము.


____________________