శ్రీవేంకటాచలమాహాత్మ్యము
తృతీయాశ్వాసము
క. |
శ్రీకర! నిర్జరమౌనివ
శీకర! సద్భక్తహృదయశృంఖలయభవా !
రాకేందువదన! శుభకర!
ప్రాకటతఱికుండనృహరి! పాపవిదారీ!
| 1
|
సీ. |
ఓసూత మేము బ్రహోత్సవక్రమము న
త్యాశ్చర్యముగ వింటి మపుడు విష్ణు
చక్రంబు బహుచోరసంఘంబులను నిగ్ర
హించె నంటివి వారి నెట్లు ద్రుంచె
నారీతి విన వేడుకైనది దెల్పు నీ
వనిన సూతుండు సంయములఁ జూచి
మునులార వినుఁ డక్కథను వివరించెద
నాచక్రమహిమ విఖ్యాతిఁగాను
|
|
తే. |
చక్రరాజంబు మాధవాజ్ఞను వహించి
సంతసము మీఱ రాజవేషంబు దాల్చి
యరిగి జగములు భయమంద నమితశౌర్య
మును గడంగి దిశ ల్కీర్తి దనర నపుడు.
| 2
|
సీ. |
పటిమమీఱ సహస్రబాహుఁడై మకుటాది
రక్తభూషణములు రక్తవర్ణ
చేలంబులను దాల్చి కాలాగ్నిసదృశుఁడై
దంష్ట్రాకరాళవక్త్రంబు మెఱయ
వేడ్క రథంబెక్కి వివిధసాధనముల
ధరియించి వెడలి గంధర్వగణము
లలఘుముద్గరపట్టిసాద్యాయుధంబులు
గొని తనవెంబడి జనుచునుండఁ
|
|
తే. |
గుముదుఁడనువాఁడు జ్వాలాముఖుండు సకల
సైన్యములనెల్ల నడపింప సామజాశ్వ
వారములతోడ ఘనరణభేరి మొరయ
నిఖిలవాద్యరవంబులు నింగి కెగయ.
| 3
|
వ. |
ఇవ్విధంబున సంగరోన్ముఖుండై చక్రరాజశేఖరుండు శేషా
చలంబు మొదలు పూర్వసముద్రపర్వతంబున నాక్రమించి
కొని సాధుజనులను బాధించు చోరసమూహంబుల వెదకి
వారి కుటుంబములతోడ నశేషంబుగ సంహరించి దేశబాధ
నివారించిన, చక్రరాజు సాన్నిధ్యంబునకు వచ్చి తద్దేశవాసు
లగు సాధుజనులు వినుతించి యిట్లనిరి.
| 4
|
తే. |
ఓమహారాజ యీభూమి కొక్కప్రభువు
లేనికతముస నయ్యయో మానవులను
జాల వేధించుచోరులఁ జంపితీవు
బ్రోచితివి మమ్ము సుఖముగఁ బుణ్యపురుష.
| 5
|
క. |
యెక్కడనుండియొ యిచటికి
మక్కువతో వచ్చి నీవు మాజీవనముల్
|
|
|
దక్కించిన పుణ్యాత్ముఁడ
విక్కడ సంతసము నెగడ నెపు డుండుమయా.
| 6
|
సీ. |
అని పల్కుసుజనుల నాదరించుచుఁ జక్ర
రాజు తద్భూమికి రాజునొకని
వెదకి పట్టముఁగట్టి విప్రాదిజనులను
మించిన నెమ్మి రక్షించుమంచు
వానికి నియమించి శ్రీనివాసాద్రికి
మనుజులు రాఁదగు మార్గములను
దనర నేర్పఱచి యాదారులయందు ధ
ర్మాత్ముల నుంచి మహాద్భుతముగ
|
|
తే. |
నచట జయభేరి వేయించి యపుడు వెడలి
కరులు హయములు రథములు కాల్బలములు
మొనసి గొల్వఁగ వాద్యము ల్మొరయుచుండ
శౌర్యకార్యధురీణుఁడై చక్రరాజు.
| 7
|
సీ. |
సంతోషభరితుఁడై సరవిగ నందందు
వివిధదుర్మార్గుల వెదకికొనుచుఁ
బరఁగ నాగ్నేయదిగ్భాగంబునకు వచ్చి
చోరులు విన రణభేరి నచట
మొరయించుచును మున్ను మొఱకులై పాఱుల
బాధించుచున్నట్టి పాపమతుల
పై దాడివెడలి యార్భటముసేయఁగ వారు
దైత్యాంశజులు గాన ధైర్య మెసఁగ
|
|
తే. |
నాయుధంబులు పూని ఘోరాట్టహాస
కలితులై నిల్చి మార్కొని కయ్యమెసఁగఁ
|
|
|
జేయఁగా వారిపైఁ బడి వాయకుండఁ
బోరుచును రెండుబలములు ఘోరముగను.
| 8
|
వ. |
కలసికొని కడునబ్బురంబుగఁ గొంతవడిఁ బోరాడి.
| 9
|
క. |
జ్వాలాముఖకుముదాదులు
నాలో నెడఁ దాఁకి నట్టహాసముతోడన్
గాలాంతకుసన్నిభులై
యాలం బొనరించి త్రుంచి రసురాంశజులన్.
| 10
|
క. |
తక్కినయాదనుజాంశజు
లక్కడఁ బడియున్న శవము లటుద్రొక్కుచుఁ బో
నిక్కుచుఁ జని గంధర్వులఁ
గ్రక్కసపడి గొట్టి రమితగదలం దలలన్.
| 11
|
క. |
అప్పుడు గంధర్వులు గురి
దప్పక శస్త్రాస్త్రములను ధరియించి యిదో
దప్పించుకొనుఁ డటంచుం
జెప్పుచు రిపులడఁగునట్లు చేసిరి కడిమిన్.
| 12
|
వ. |
అప్పుడు హతశేషులైనచోరులు తమదొరలకుఁ దమబలం
బులుపడిన నికారక్రమంబు నుడువఁ చోరప్రభువులు స్థల
దుర్గ వనదుర్గంబులయందుండి త్రిపురంబులందున్న రాక్షస
బలంబుకైవడి వివిధమాయోపాయంబులు సేయుచు విడి
వడి యార్చుచుఁ గరవాల శూల ముద్గర భిండివాల పరశు
పట్టిస శరచాప పరిఘాద్యనేక సాధనంబులఁ గొని గం
ధర్వబలంబులపైఁబడి యాలం బొనరించుచుండి రప్పుడు భేరీ
ప్రముఖ భయంకర వాద్యఘోషంబులును, గంధేభఘీంకా
రంబులును, దురంగహేషారవంబులును, రథనేమిభీషణ
|
|
|
శబ్దంబులును దిక్కులు పిక్కటిల్ల భూతలంబున రక్తంబు
వెల్లువలై పాఱె. తత్సమయంబున జ్వాలాముఖుండు చక్ర
రాజేంద్రునకు జరుగుచుండు కయ్యం బెఱింగింప నాతఁ
డత్యంతకోపావేశుఁడై త్రిపురాంతకుండైన కాలరుద్రుం
బోలె నేనూఱుకరంబుల నేనూఱుకార్ముఖంబులు ధరించి
తక్కిన యేనూఱుకరంబులఁ జండకాండకాండంబులం గొని
ప్రత్యాలీఢపాదుఁడై నిలిచి ధనుర్జ్యాఘోషం బొనరించి
శాత్రవనికరంబునందుఁ బ్రయోగింపఁ గడుపులు చీలియు
నడుగులు తెగియుఁ దలలు పగిలియుఁ జేతులు తునిఁగియు
నిట్లు చిందఱవందఱ యగుటం జేసి చోరనాయకులు జడిసి
పఱతెంచి తమదుర్గంబుల డాఁగి రంత.
| 13
|
ఆ. |
చలము విడక యపుడు చక్రరాజేంద్రుఁ డా
గ్నేయనామ మొప్పు సాయకంబు
మింటఁ గూర్చి వైవ విపినంబులం గాల్చు
చరిగి చోరచయము నవనిఁ బడఁగ.
| 14
|
వ. |
కూల్చి భస్మంబు సేయం బుడమి నవ్వేఁడికిఁ బొగలుచుండె
నంత నమితవృష్టి గుఱియించి యాభూతలంబును శీతలంబును
గావించి ధర్మాధ్యక్షుండనువాని నమ్మహీస్థలికి రాజుగఁ జేసి
ధర్మమార్గంబున నెల్లజనులను బరిపాలించుమని యానతి
యిచ్చి యనంతరంబున.
| 15
|
సీ. |
చతురంగబలములు మితిమీఱఁ గొల్వఁగ
ధీరుఁడై దక్షిణదిక్కు కరిగి
వనదుర్గములయందు వారక వెదుకుచుఁ
జిక్కినచోరులఁ జక్కఁబఱచి
|
|
|
వచ్చుచునుండఁగ నచ్చటచ్చటఁ గల
సజ్జనులెల్లరు చక్రరాజు
నీక్షించి మాపాలి యీశ్వరుడై వచ్చి
రక్షింపఁబూనెనో కాంక్షఁ జేసి
|
|
తే. |
యనుచు ముదమందుచుండఁగ నపుడు మొనసి
చాలకుం డనువాఁడు బిడాలకుండు
ననెడువాఁడు పులిందులు తనరఁ జూచి
యాయుధంబులఁ బూని చక్రాధిపతిని.
| 16
|
వ. |
మార్కొన వచ్చి తమకుఁదా మిట్లనుకొనిరి.
| 17
|
సీ. |
ఈరీతి మన నెదిరించినశత్రుల
నదలించి నేఁ ద్రుంతు ననియె నొకఁడు
గంధేభములఁ దురంగంబులనెల్లను
మొనసి ధాత్రిని గూల్తు ననియె నొకఁడు
కాల్బలంబులఁ గూల్తు గములుగ వచ్చిన
నవనిపైఁ బడిపోవ ననియె నొకఁడు
రథముపైఁ గడుగొప్పరాజుగ వచ్చెడు
ఘనుని ద్రుంచెద నెంచ కనియె నొకఁడు
|
|
తే. |
కరుల హయముల మితిలేనికాల్బలముల
రథముపై వచ్చుమగవానిఁ బృథుబలాన
నేను సమయింతు నొక్కఁడ పూని లావు
మెఱయఁజేయంగ వచ్చినఁ గఱకుఁ జూపి.
| 18
|
వ. |
ఇట్లు పంచమహాపాతకు లైనయంగవంగపుళిందబిడాలచాల
కులు ప్రచండబలంబునఁ జక్రరాజజలంబున కెదురేగి హుంక
రించి స్ఫులింగాక్షుండును, బలాధ్యక్షుండును, జ్వాలాకేశుం
|
|
|
డును, కాలాంతకుండును, రణఘ్నుండును, చక్రరాజేంద్రు
నానతిరీతిఁ గరవాలాద్యాయుధంబులం బూని శత్రుబలం
బులపై బడి యప్పాతకులం జూచి యిట్లనిరి.
| 19
|
సీ. |
పాపాత్ములార సద్బ్రాహ్మణోత్తములను
జెఱచి యాచారము ల్జెలఁగ నడఁచి
బాధింపుచును ధర్మపథమును విడనాడి
జీవనంబులు లేక చెఱచినట్టి
క్రూరాత్ములార మీకుం గడుమేల్కాల
మిదివఱకుండె నిం కెందు డాఁగె
దరు రండు యమలోకదారిఁ జూతురు మిమ్ము
ఖండించి కాకులుగ్రద్దలకును
|
|
తే. |
విందుపెట్టెద మావల విప్రకోటి
కమితసౌఖ్యంబు గల్గింతు మాశ విడుఁడు
సారెసారెకు మాకంటె శౌర్యవంతు
లెందు లేరని వల్కంగ నేల యంచు.
| 20
|
వ. |
అతిభీషణాకారులై యస్త్రశస్త్రంబుల నద్దురాత్ముల నొప్పిం
చినఁ దలంగివోక యంగవంగాదిరాక్షసులు స్ఫులింగాక్షుల
మీఁదఁ బడి ఘోరయుద్ధంబు సలుప నాస్ఫులింగాక్షుండు
మార్కొని యంగుఁడనివానిం బరిమార్చె, బలాద్యక్షుండు
వంగుండనువాని ద్రుంచె, జ్వాలాకేశుండు పుళిందుం డను
వాని జక్కాడె, కాలాంతకుండు బిడాలుం డనువాని నేలం
గూల్చె, రణఘ్నుం డనువాఁడు చాలకుం డనుదుష్టుని
వధించె, నంత వారిభటు లాహాకారంబులు సేయుచుఁ జక్ర
రాజబలంబునంబడినఁ దచ్చక్రరాజాజ్ఞచేత హయశిరుండను
|
|
|
వాఁడు తద్దుష్టులపై నర్ధచంద్రబాణప్రయోగంబు చేసి
యందఱ రెండేసిఖండంబులు గావించె నంత హతశేషులైన
వారు కొందఱు వెఱచి పఱచి గుహారణ్యంబుల డాఁగినంజూచి
చక్రరాజేంద్రుఁడు చిత్రబాణప్రయోగంబు సేయ డాఁగిన
శాత్రవులఁ జక్కాడి వచ్చె నంత దక్షిణభూమి నిష్కంటకం
బయ్యె నంత దేవతలు చక్రరాజశీర్షంబునఁ బుష్పవర్షంబు గురి
యించి యనేకప్రకారంబుల వినుతించి యిట్లనిరి.
| 21
|
సీ. |
చక్రరాజోత్తమ సకలపాపాత్ముల
సమయించి యిచ్చట సాధువులను
రక్షించితివి నీపరాక్రమం బెంతయు
శేషునికైనను జెప్పఁదరమె
పరఁగ శేషాద్రికిఁ బశ్చిమోత్తరములఁ
జోరులు క్రూరులున్నారు నీవు
వారల సమయించి వసుధామరాదిస
జ్జనులను రక్షించు చక్రరాజ
|
|
తే. |
యనుచుఁ బ్రార్థించి దేవత లరిగి రట్లు
చక్ర మచ్చోట శత్రుశేషంబు లేక
యంతమొందింపఁగాఁ జూచి సంతసించి
బ్రాహ్మణులు వచ్చి యాచక్రరాజుఁ గాంచి.
| 22
|
సీ. |
వినుతించి పల్కిరి విమలాత్మ! యీ దేశ
మందు ధర్మాత్ముఁ డైనట్టిరాజు
గలుగనికతన దుష్కరులై చోరులు
బాధించుచుండిరి బ్రాహ్మణులను
|
|
|
నీవు మాపాలిటిదేవుఁడవై వచ్చి
సకలక్రూరాత్ముల సమయఁజేసి
మమ్ముఁ గాపాడితి విమ్మహిఁ బాలింపఁ
దగినట్టిరాజును దనర నిలుపు
|
|
తే. |
మనుచు వా రెల్లఁ బ్రార్థింప నపుడు చక్ర
రాజు తద్ధాత్రికిని తగురాజు నొకని
నిలిపి ధర్మంబు దప్పక నీవు జనులఁ
బాలనము సేయుమని చెప్పి బ్రాహ్మణులను.
| 23
|
తే. |
కాంచి యిట్లనె మీరు సత్కర్మనిష్ఠు
లగుచు జన్నము లొనరింపుఁడంచుఁ బ్రియముఁ
జెలఁగ నందఱు నప్పు డాశీర్వదించి
వీడుకొల్పఁగ నారాజవీరుఁ డపుడు.
| 24
|
వ. |
దక్షిణప్రాంతగహనంబులయందు వేంకటాద్రికి జనులు వచ్చు
టకుఁ ద్రోవ లేర్పఱచి యాత్రోవలయందు సజ్జనాగ్రేసరులం
బాలింపుమని యచటిసజ్జనునొకని రాజుం జేసి యనంతరంబు.
| 25
|
సీ. |
అందుండి సకలసైన్యావళులను గూడి
జయభేరి వేయించి సంతసించి
పైనమై నిఋరుతిప్రాంతదేశములందుఁ
గదలిపోవుచును దుర్గస్థలముల
శోధించి శోధించి చోరులనెల్లను
బరుగిడకయ చంపి పశ్చిమమున
కరిగి మహోన్నతుఁ డై నిజగంధర్వ
బలములతో నందు నిలిచి కదన
|
|
తే. |
భేరి వేయించి యప్పు డభేద్యవిపుల
విపినదుర్గస్థలంబుల వెదకి వెదకి
చోరులను ద్రుంపఁగాఁ జోరచారు లదిరి
చెదరి తమదొరయగువానిచెంతఁ జేరి.
| 26
|
క. |
మ్రొక్కుచు నిట్లని రధిపా
యెక్కడనుండియొ దళంబు లీప్రాంతములం
గ్రిక్కిరిసి చోరవీరులఁ
జక్కాడుచు నున్నవారు శౌర్యోన్నతులై.
| 27
|
వ. |
అనిన విని సమధికకోపావేశంబున.
| 28
|
సీ. |
శివునిగూర్చి తపంబుచేసి తానెవరిచేఁ
గూలనివరము గైకొనినవాఁడు
బహుచోరులంగూడి పర్వతాగ్రములందుఁ
జేరి సాధులను హింసించువాఁడు
పటుశక్తితోగూడి పాంథుల నెసఁగొట్టి
యమితవిత్తము గూర్చినట్టివాఁడు
కాలకింకరులనఁగాఁ దగినకిరాతు
లను గూడి గర్వంబు దనరువాఁడు
|
|
తే. |
వనములందు రిపుఘ్నుఁడన్వాఁడు గన్న
కొడుకు వనకర్తయనువాఁడు క్రోధమెసఁగ
నిక్క పొంగుచు నక్షౌహిణీబలములఁ
గూడి విడి వడివచ్చి దుర్గుణము మెఱయ.
| 29
|
క. |
కలకలు కొమ్ములు తుడుములు
బలముగ వాయించికొంచుఁ బ్రతివీరులపై
|
|
|
నులుకక పడి పోరుండని
సెలవియ్యఁగఁ దద్బలములు చెదఱక కడిమిన్.
| 30
|
వ. |
చక్రరాజబలంబులపై గదిసి యనేకసాధనంబుల ధరించి
యత్యంతభయంకర యుద్ధంబుచేసి రాచక్రరాజభటోత్తము
లాకిరాతబలంబుల నొకక్షణంబునఁ జంపి రంత రక్తంబు
వెల్లువలై పాఱుచున్నంజూచి వనకర్త క్రోధరక్తాక్షుండై నిజ
సేనాధిపతియైన జ్వాలాపాతుం డనువానింజూచి యిట్లనియె.
| 31
|
సీ. |
అసహాయశూరు లైనట్టియక్షౌహిణి
భటులను జంపిరి పరునిభటులు
కావున నీవేగి కరవాలశూలాది
సాధనంబుల వారిఁ జంపుమంచుఁ
దనదొరయైన కాననకర్త చెప్పఁగ
నపుడు జ్వాలాపాతుఁ డాయుధములు
గైకొని యుష్ట్రాళి గట్టినరథ మెక్కి
సక్రోధుఁడై వచ్చి చక్రరాజు
|
|
తే. |
బలముపయిఁ బడఁగా బడబాముఖాఖ్యుఁ
జూచి యోచక్రరాజ! యో శూరవర్య!
రయమునం బోయి నీవు కిరాతవిభుని
దళపతిని గొట్టి గూల్పు మిద్ధరణియందు.
| 32
|
క. |
సరిగానినీచజనముల
సరిగానెంచుకొని పోరఁజనునే యిపుడీ
వరిగి జవంబునఁ గడిమిని
బరగింపుము పాపమతులపై సుచరిత్రా.
| 33
|
క. |
అని చక్రరాజు వల్కఁగ
వినియె న్బడబాముఖుండు వే సాధనముల్
గొని యాజ్వాలాపాతా
ఖ్యునిరథమును గొట్టి వానిఁ గూల్చెను ధాత్రిన్.
| 34
|
ఆ. |
తనరె విష్ణుచక్రమని యప్డు వేరొందె
గానఁ జక్రమెత్తి గహనకర్త
యనెడువానిమీఁద ననుపఁగ నాచక్ర
మతనిశిరము పుడమి నడఁగఁగొట్టె.
| 35
|
వ. |
ఇవ్విధంబు బడబానలంబు సముద్రోదకంబు నింకఁ జేసినచందం
బున వనకర్తసైన్యంబును జక్రరాజశస్త్రాస్త్రంబుల సంహరించెఁ
దద్భూమి నిష్కంటకంబై ప్రకాశించె నప్పుడు చక్రరా
జేంద్రుఁ డరణ్యకంటకవృక్షంబుల నఱికించి సర్వభక్తజనం
బులు శేషాద్రికి వచ్చుటకుఁ దగినమార్గంబుల నేర్పఱచి
తన్మార్గప్రాంతంబులఁ బుణ్యాత్ములైన జనంబుల నునిచి తజ్జనం
బులఁ బాలింపఁదగినరాజునకుఁ బట్టంబు గట్టి ధర్మపరిపాలనంబు
సేయుమని నియమించి యనంతరంబున.
| 36
|
సీ. |
చక్రరాజేంద్రుడు జయభేరి వేయించి
చతురంగబలములు సరవిఁ గొల్వ
ధీరుఁడై వాయవ్యదిశ నుండుచోరుల
సమయించుచును వచ్చి శౌర్య మెసఁగఁ
గంకణరాక్షసగాఢాంధకారంబు
దట్టమైనట్టి యుత్తరపుదిశకు
నప్పుడ మరలి సహస్రార్కకరముల
కరణి దీర్ఘసహస్రకరము లమరు
|
|
తే. |
చుండె రెండవచండమార్తాండుఁ డనఁగ
నొప్పుచును వేంకటాద్రికి నుత్తరముగ
నుండుకొండలనడుమ మహోగ్రుఁ డగుచు
సరభసంబున నిలిచె నాచక్రరాజు.
| 37
|
వ. |
అపు డాచక్రరాజు నీక్షించి భీతినొంది కొందఱు రాక్షసులు
తమదొరయగు భేరుండునిచెంతఁ జేరి యిట్లనిరి.
| 38
|
సీ. |
చండప్రతాపభేరుండ! మహాస్వామి!
విను మద్భతంబుగ వీరుఁ డొకఁడు
చతురంగబలముల జతఁగూడియున్నాఁడు
కాలాగ్నిరుద్రులఁ బోలినాఁడు
ఖ్యాతిగ నొకవేయిచేతులు గలవాఁడు
ఘనరక్తచేలము ల్గట్టినాఁడు
హారకిరీటకేయూరము ల్ధరియించి
యెక్కువతేరుపై నెక్కినాఁడు
|
|
తే. |
మించుభానునిగతి వాఁడు మించినాఁడు
వాఁడు భయదాంగుఁడగుచు నున్నాఁడు చూడ
నంచుఁ జెప్పంగ భేరుండుఁ డప్పుడటకు
రక్కసులతోడఁ జని కడురౌద్ర మెసఁగ.
| 39
|
క. |
ఆచక్రరాజుఁ గనుఁగొని
యాచోటికిఁ దాన రాజు ననుచున్ భేరుం
డేచినకింకను జూచి ని
శాచరుల న్మించి వల్కె శౌర్యోద్ధతుఁడై.
| 40
|
శా. |
ఓరక్షోవరులార చూచితిరె! వీఁ డుత్సాహము న్మించి న
న్నారూఢాహవమందుఁ గెల్చుటకు నేఁ డాసన్నుఁడై వచ్చినాఁ
|
|
|
డీరాజుం బరిమార్చి రావణునకే నిష్టంబు గావించి నా
భేరుండాఖ్య మహీతలంబునఁ గడుం బేర్మిం దగంజేసెదన్.
| 41
|
వ. |
అని యనేకవిధంబులఁ బ్రతాపోక్తులాడి తనబలంబులఁ జక్ర
రాజబలంబులపైఁ బురికొల్పె నప్పుడు చక్రరాజబలంబులు
రణభేరి మొరయించి యట్టహాసంబున నవ్వారల నట్టిట్టు
గదలనీక మిట్టిపడుచుఁ గొట్టవచ్చుభేరుండబలంబుపైఁ గవిసి
కరవాలాదిసాధనపాణులై నఱకుచుఁ బొడుచుచు హుంక
రించుచు బింకంబులు వల్కుచు మీసలు వడద్రిప్పుచుఁ
బండ్లు గొఱుకుచు నార్భటించుచుం గిలారించుచు దక్షి
ణోత్తరసముద్రంబు లుప్పొంగి ఘోషించుచు వచ్చుభంగి
పోరుచుండఁ దొడలు మెడలు గరంబులు శిరంబులు నడు
ములు దెగినవారును, భయంకరంబుగ నేడ్చువారును,
మొరలిడువారును, నేలంబడి పొరలువారును, ప్రాణంబులు
వోలేక మిట్టమిట్టిపడు మొండెంబులును గల్గి మోగచెట్ల
గుంపు పూఁచినతెఱంగుఁ దోచుచుండె. అప్పుడు రక్త
ప్రవాహంబు లేపాఱం బాఱె. నందుఁ దెగిపడిన కరంబులు
మీలును బదంబులు కర్కటంబులు పగిలిపడిన తలపుఱ్ఱెలు కమ
ఠంబులు చెదరిపడిన చర్మఖండంబులు భేకంబులు కూలిన
గజతురంగంబులు దీవులు భగ్నంబులై పడిన చామరంబులు
జలపక్షులు శ్వేతఛత్రంబులు డిండీరఖండంబులు తునిఁగిపడి
రక్తంబునం దేలుచున్న శిరోజంబులు శైవాలంబులుగాఁగ
నొప్పుచున్న రక్తప్రవాహంబును కాక గృధ్ర ఖగాదు లావ
రించి యున్నం జూచి యనేక భూత బేతాళ పిశాచంబులు
చక్రరాజుచేసిన సంతర్పణంబునకు రండు రండని యొండొరు
|
|
|
లను పిలుచుచుఁ బోయి తద్రణభూమి నీక్షించి సంతసించి
తమలోఁ దా మిట్లు చెప్పుకొనిరి.
| 42
|
సీ. |
చక్రరాజేంద్రుఁ డిండిక్క్రమంబున సమా
రాధన మొనరించె రండటంచుఁ
బిల్చుచుఁ గండలుం బ్రేవులు బాగుగ
భుజియించుచుండెడు భూతములును
బలుమాఱు రక్తంబుఁ దలపుఱ్ఱెలను ముంచి
పూని పానముసేయు భూతములును
గడుపులు నివురుచు గఱ్ఱునం ద్రేపుచుం
బొరలుచు లేచెడు భూతములును
|
|
తే. |
గలిగి రణభూమి యద్భతం బలరుచుండ
నప్పు డావిష్ణుచక్రరా జనఘుఁ డెలమి
నొందె భేరుండు దుఃఖంచి యొప్పమికిని
మఱల హతశేషులను గూడి మారుకొనఁగ.
| 43
|
వ. |
చక్రరాజేంద్రుండు కనుబొమలు ముళ్లువడం గినిసి భేరుండుని
జూచి హుంకరించి యుద్ధంబునకు సమకట్టు మనఁగ నాభేరుం
డుఁడు వేయిపిడుగులు పడినట్లు బాహాస్ఫాలనం బొనర్చి
మించుటం జేసి తత్సమయంబున.
| 44
|
సీ. |
ఆకాశ మగలె దిగంతముల్ గ్రుంగెను
ఘనశైలములు గడగడ వడంకెఁ
దపనచంద్రులగతు ల్దప్పె ఘోరాకారు
లైనదైత్యులగుండె లదరసాగె
బ్రహ్మాండభాండంబు పగిలినగతి నుండె
విపరీతవాయువు ల్విసరసాగె
|
|
|
నప్పుడు చక్రమహారాజు పావకుఁ
డనువానిఁ బుట్టించి యరులపైకి
|
|
తే. |
బంపెఁ దత్పావకుఁడు శత్రుబలముమీఁద
నతిరయంబున సమ్మోహనాస్త్ర మేసె
నపుడు మేనులు మఱచుచు నసురవరులు
తాము దమలోనఁ బోరాడి ధరణిఁ బడిరి.
| 45
|
తే. |
చక్ర రా జావిధము చూచి జాలినొంది
యిది యధర్మము గనుక నీ వీశరమును
మించనీయక యుపసంహరించుమనిన
పావకుఁడు దాని మరలించి పటిమ మెఱయ.
| 46
|
క. |
దనుజులపైఁ గ్లౌంచాంబక
మును విడువఁగ నదియు వారిముక్కులు చెవులన్
గొని తఱిగినఁ గోపము పెం
పెనుఁగొన భేరుం డపుడు విభీకరవృత్తిన్.
| 47
|
సీ. |
పావకుం డనువానిపైఁ బడవచ్చిన
నప్పావకుఁడు మారుతాస్త్ర మేసె
మూఁడుయోజనముల మొనయుదేహముతోడ
నాభేరునిం గొని యద్భుతపడ
వేంకటాద్రికిఁ జుట్టి వేడ్కమై మూఁడుమా
రులఁ ద్రిప్పి కడభూమితలమునందుఁ
బడవేసెఁ బెద్దగుమ్మడికాయ పడినట్లు
రాక్షసుఁ డరిగెఁ జక్రంబు మించి
|
|
తే. |
యరుల నందఱఁ ద్రుంచె నయ్యవసరమున
సురవరేణ్యులు మిక్కిలి సొంపుమీరఁ
|
|
|
జక్రరాజుశిరంబుపై సంతసమునఁ
బుష్పవృష్టియుఁ గురిసిరి పొగడి యనిరి.
| 48
|
తే. |
చక్రరాజేంద్ర నీ విప్డు సకలరిపుల
సమయఁజేసితి నవని సజ్జనులనెల్లఁ
గాచితివి కృపచిత్తుఁడై గానఁ జక్రి
సంతసించెను జయుఁడని శాంతిఁబొంది.
| 49
|
వ. |
శ్రీవేంకటేశ్వర సన్నిధానంబున కరుగుమని చెప్పి యమరులు
చనిరంతఁ జక్రరాజు యుద్ధంబున మడిసిన చతురంగబలంబుల
నిజప్రభావంబున గ్రమ్మఱ సజీవితులంజేసి కరుణాకటాక్ష
వీక్షణామృత విందు సందోహంబుల వారియందు నొలుక
చేసిన, వారును శాంతింబొంది పూర్వప్రకారంబునఁ జక్ర
రాజు ననువర్తించి కొలిచియుండి రప్పు డుత్తరదిగ్భాగంబు
నందు శ్రీవేంకటాద్రికి వచ్చుభక్తులకు మార్గంబు లేర్పరించి
తన్మార్గంబులయందుఁ బుణ్యాత్ము లైనజనుల నిల్పి వారలం
గాపాడుటకు నం దొక్కని రాజుగఁ జేసి యీశాన్యదిగ్భాగం
బునఁ జెదరియున్న చోరుల నిర్జించి యష్టదిక్కులయందు
నిష్కంటకంబులఁ జేసి దేశంబుల శాంతం బొందించి క్రమ్మఱ
సకలబలంబులతో వేంకటాద్రికి వచ్చి స్వస్వరూపంబున నంత
ర్విమానంబునం బ్రవేశించి శ్రీహరి దక్షిణకరంబున నిలిచి
యుండె నిట్లు దేశంబులు సురక్షితంబులైన వెన్నడి శ్రీస్వా
మికి మహోత్సవంబులు జరుగుచుండెనని చెప్పిన సూతుం
జూచి క్రమ్మఱ శౌనకాదు లిట్లనిరి.
| 50
|
సీ. |
శ్రీనివాసస్వామి చిత్రచారిత్రముల్
సలలితకర్ణరసాయనములు
|
|
|
గనుక మే మెంత విన్నను దృప్తి లేదు శ్రీ
వేంకటేశ్వరుఁ డిట్లు వెలసి శేష
గిరిమీఁదనుండి యేక్రియలందు నడిపించె
నెవ్వ రెవ్వరికి నేమేమి యొసఁగెఁ
దెలియఁగ కృతయుగత్రేతాయుగద్వాప
రములయం దంతట క్రమముగాను
|
|
తే. |
జెలఁగి వర్తించుచుండును గలియుగముల
నేవిధంబులనుండు నాయీశ్వరుండు
సల్పుచుండినచరితము ల్సమ్మతముగఁ
దెలుపవే సూతసత్సూత ధీసమేత.
| 51
|
తరళవృత్తము. |
అని ముదంబున శౌనకాదిమహామునీశ్వరు లందఱున్
వనజనేత్రుచరిత్రము ల్విను వాంఛతోడను బ్రశ్నచే
సిన ముదంబున సూతుఁ డిట్లనె శ్రీరమేశుఁ దలంచుచున్
వినుఁడు సంయములార చెప్పెద వేంకటేశువినోదముల్.
| 52
|
పంచచామరము. |
పరాపరస్వరూపుడైన పద్మనేత్రుఁ డాఢ్యుఁడై
యరాతివీరుల న్వధించి యద్భుతక్రమంబుగన్
సురేంద్రమౌనిముఖ్యులెల్లఁ జోద్యమంది చూడఁగన్
ధరామరాదిభక్తులన్ ముదంబుమీఱఁ గాచుచున్.
| 53
|
ఉ. |
భూతలమందు నిల్చి పరిపూర్ణుడు తానగుచుండియున్ జన
వ్రాతము చూడ శేషగిరివాసుఁ డనంగ జగంబులందు వి
ఖ్యాతిని బొంది భక్తజను లందఱు గొల్వఁగ వారి కెల్ల సం
ప్రీతి వరంబు లిచ్చి కడుపేర్మిగ నుండె రమాసమేతుఁడై.
| 54
|
సీ. |
ఆవేంకటేశ్వరుఁ డరుదుగఁ గలియుగం
బున ఘనమౌనముద్రను ధరించి
యచట నర్చావిగ్రహంబుకైవడిగాను
గర్మనేత్రములకుఁ గానవచ్చు
భక్తులతో నైనఁ బ్రత్యక్షమున మాట
లాడఁడు స్వప్నములందుఁ దగిన
మాటలొప్పుగఁ జెప్పు మఱి యదేమనువేళ
కవ్వలఁ జుణుఁగు మాయావి యగుచు
|
|
తే. |
మానవులకెల్లఁ దనయందు మరులు గలుగఁ
జేసి వారలవిత్త మార్జించుకొఱకు
వారి కొకభీతిఁ బుట్టించి వారిచేత
రూక లొప్పించికొని వారి బ్రోచు నవల.
| 55
|
క. |
మోక్షము గోరుచు దేహా
పేక్షను మది రోసి విడిచిపెట్టుచుఁ దనునే
వీక్షించుభక్తజనులకు
సాక్షాత్కారముగఁ జూపు సద్విగ్రహమున్.
| 56
|
సీ. |
వైకుంఠముననుండి వచ్చియున్నవిమాన
మెక్కువగా వారి కొక్కవేళ
దగఁ జూపు నప్పు డంతర్ధాన మొందించు
నానందనిలయంబునందు నిలిచి
మొనసి యున్నటువలె జనులకుఁ గనుపించు
నంతర్విమానంబునంద యుండు
నావిమానము దేవతావళులకుఁ జూపు
దీవించునరులకుఁ జూపకుండు
|
|
తే. |
పొసఁగ మనుజులచే బాహ్యపూజలందు
గుప్తముగ దేవపూజఁ గైకొనుచునుండు
పరులు తను జేరి కోరిన వరము లిచ్చి
మహిమఁ దనరారఁ జూపును మాధవుండు.
| 57
|
ఆ. |
అల్పదానమైన నధికంబుగను జూచి
స్వల్పపూజకైన సంతసించి
పుణ్యమోక్షములను బొందించు దాసుల
నెన్న వశమె వేంకటేశుమహిమ.
| 58
|
క. |
ఘనవేంకటగిరిమహిమన్
మనసారఁ దలంచునట్టి మానవులకు నె
మ్మనమునఁ గనిపించుచు దా
నెనసినదయతోడ వరము లిచ్చుచునుండున్.
| 59
|
సీ. |
అప్రాకృతుండు దానై ప్రాకృతునిరీతి
దేశప్రజలవెంటఁ దిరిగి తిరిగి
తనమీఁదమోహంబు జనియింపగాఁజేసి
ప్రేమఁ జూపుచు వారిఁ బిలిచి పిలిచి
నయభయంబులతోడ నాకొండ కిపుడు మీ
సొమ్ములు ముడుపులు దెమ్మటంచుఁ
బలుకుచు వారివెంబడి నంటి ముల్లెలు
దెప్పించుకొంచును ధీరుఁ డగుచు
|
|
తే. |
వారపుడు వచ్చి సకలోత్సవములు వేంక
టాద్రిమీఁదను జేయింతు రాఢ్యులగుచు
నపుడు వారిని మెచ్చి భాగ్యంబు లిచ్చి
మఱలఁ బంచుచునుండు సమ్ముదము నెపుడు.
| 60
|
తే. |
అట్టియుత్సవకాలంబులందు సకల
నిర్జరులు వచ్చి పుష్కరిణీజలమున
స్నానమును జేసి వేంకటేశ్వరుని నఖిల
పుష్పములఁ బూజసేతు రద్భుతము మీఱ.
| 61
|
ఆ. |
సొరిది భక్ష్యభోజ్యచోష్యలేహ్యజలంబు
లర్పణంబు సేయ ననుము దాన
నారగించు నెనరి కైనను గనుపింప
నియ్యఁ డాక్రమంబు నీశ్వరుండు.
| 62
|
తే. |
మానితం బగుమాయావిమానమందుఁ
దాను నిజరూపమున నుండి ధరను గృతక
కాంచనానందనిలయమం దంచితముగ
ఘనశిలావిగ్రహమురీతిఁ గానుపించు.
| 63
|
సీ. |
స్వల్పదానమునకు సంతుష్టుఁడై వారి
కాయురారోగ్యభాగ్యాదివివిధ
వరముల నిచ్చుచు వారల రక్షించు
నతినీచజాతివారైనఁ గాని
భక్తిలో శరణని పర్వతంబును జూచి
నిలిచి మ్రొక్కినను మన్నించి బ్రోచు
కర్మాధికారులు గాని యోషిజ్జన
శూద్రులకును భక్తి సుస్థిరముగ
|
|
తే. |
వేంకటేశునిచరణారవిందయుగళ
మందు విస్తారముగఁ బట్టు నందువలన
మూఢభక్తులు గలియుగమున విశేష
కరుణ నేలుచునుండు వేంకటవిభుండు.
| 64
|
వ. |
కృతత్రేతాద్వాపరంబులయందుఁ బెక్కువేలయేండ్లు తపం
బులు చేసిన హరి ప్రసన్నుం డగుట దుర్లభంబు. కలియుగం
బున ముహూర్తమాత్రంబు నిశ్చలుండై ధ్యానించినం
బ్రసన్నుం డగుచుండు. కాబట్టి కలియుగంబున శ్రీవేంక
టేశుని సేవించు టుత్తమం బని ద్వీపాంతరముల నుండు
వారును, సకలదేశవాసులుసు, వేంకటేశుని తుల్యుం డగు
దేవుండు లేడనియుఁ బుష్కరణినిభం బగుతీర్థంబును లే
దనియు నిది సత్యం బనియు మఱియుఁ గృతయుగాది
మూఁడుయుగంబులయందు. వేంకటాద్రి కనకమయంబుగ
నుండి కలియుగంబున శిలామయంబుగ జనులకు గన్పట్టు
చుండు. తద్గిరియందు వసించియున్న శ్రీనివాసస్వామి లీలా
వినోదవిహారంబు లనంతంబులై యుండుం గావున మీకు
సంక్షేపంబుగ నుడివితి నట్టి వేంకటాద్రియందు నిల్చి
యాచార్యసమాశ్రయణంబు గల్గి విష్ణుభక్తులగు వైష్ణవులం
జూచి వైమానికులు సంతసించుచుండుదు రన్యమతానలంబ
జను లైనను వేంకటేశునియందు భక్తిసల్పుచు నుండుదు
రందు వారును గృతార్థు లగుదురు. కలియుగమునందు జను
లతిశయవిత్తార్జనపరులై యనేకదుర్గుణంబుల నాశ్రయింతురు
గాని హరిని సుస్థిరచిత్తులై ధ్యానింపజాలరు. ధ్యానించి
రేని యయ్యీశ్వరుండు ముక్తిధనం బిచ్చువాఁడు. సకల
పావనస్థానంబులకు మించినస్థానంబు వేంకటాద్రి యనిన
సూతుంజూచి శౌనకాదు లత్యద్భుతం బంది యిట్లనిరి.
| 65
|
వైష్ణవధర్మము
ఉ. |
ఖ్యాతిగ శ్రీనివాసుఁడతిగౌరవ మొప్పఁగ వేంకటాద్రిపై
భూతలవాసులం గృపను బ్రోచినసత్కథ వింటి మిందుచే
మాతపము ల్ఫలించినవి మంచిది వైష్ణవధర్మ మెట్టిదో
సూత తదీయధర్మములఁ జొప్పడఁ జెప్పుమొకింత యింపుగన్.
| 66
|
మ. |
అనినన్ సూతుఁడు సంతసించి మునివర్యాళిన్విలోకించి యి
ట్లనియెన్ ధాత్రిని శుభ్రఘోణిఘసదంష్ట్రాగ్రంబుతో నెత్తితె
చ్చినమీఁదన్ ధరణీసమేతుఁ డగుచున్ శేషాద్రియం దుండఁగా
నొనరం దత్కిటి చూచి భూమి యపు డత్యుత్సాహ ముప్పొంగఁగన్.
| 67
|
తే. |
ఇట్టు లనియెను గిటిరూప యీశ్వరేశ
నిర్మలము లైనవైష్ణవధర్మములను
జెప్పుమని వేఁడ భూమి నీక్షించి యజ్ఞ
పోత్రి యిట్లని పల్కె సంపూర్ణదయను.
| 68
|
సీ. |
వైష్ణనధర్మము ల్వరుసగ నన్నియుఁ
జెప్పవే యిపుడు సంక్షేపముగను
దయ ననఁగాఁ జెప్పెదను సంతసంబుగ
వైష్ణవాచారము ల్వసుధయందు
విశ్వాసహృదయులై వినినవారికిఁ బర
గతులు సిద్ధించు నిక్కంబుగాను
గురుఁడె ధర్మంబు సద్గురువే పరమగతి
గురుఁ డాత్మ యని నమ్మికొనినవారి
|
|
తే. |
భూరిదురితము నశియించిపోవు గనుక
యేవిధంబున గురుమర్మ మెఱిఁగి భక్తి
|
|
|
సలుపఁగాఁ దగువారు వైష్ణవులటంచుఁ
జెప్పఁ దగియుండు లోకప్రసిద్ధిగాను.
| 69
|
తే. |
ఎన్నిపాపము లొనరించి యున్నఁగాని
సద్గురుని జేరి శరణన్న సమయమునన
భూరిదురితము నశియించిపోవు గురుని
శిష్యుడై పాప మావలఁ జేయరాదు.
| 70
|
వ. |
అదెట్లనిన గురుకటాక్షంబు లేనియప్పుడు తెలియక చేసిన
పాపపుంజంబును గురువరేణ్యుడు సమయంప నేర్చు. నాచా
ర్యానుగ్రహంబు గల్గిన వెనుక తెలిసి చేసిన పాపంబు గురుండు
శమింపలేఁడు గావునఁ దత్పాపంబు గురుని బొందునని తెలిసి
బుద్ధిమంతు లైనవారు పాపభీతి గలవారై యుండవలయు,
నవ్విష్ణుండ గురుండని నిర్ణయించుకొనవలయు, మనుజమాత్రుం
డని గురుని నెంచిరేని యుత్తమగతి సిద్ధింపనేరదు, సంసార
సముద్రంబునం బడి మునింగిపోవుచున్న సమయంబున నుత్తమ
శాస్త్రధర్మం బను హస్తంబునఁ బట్టి వారి లేవనెత్తి మోక్ష
తీరంబున నిలిపి యుపకారం బొనర్చినగురువర్యునకుఁ దాను
బాపంబు సేయకుండుటయుఁ బ్రత్యుపకారం బగుచుండు.
నాచార్యులెట్టివా రనినఁ జెప్పెద విను మని వరాహస్వామి
భూదేవి నీక్షించి యిట్లనియె.
| 71
|
సీ. |
న్యాయమార్గమునంద నడువడి గలవార
లెలమి ధర్మ మధర్మ మెఱుఁగువారు
పుణ్యసత్కర్మతపోనిష్ఠు లగువార
లతిశాంతహృదయు లైనట్టివారు
|
|
|
మదియం దహంకార మమకార దంభద
ర్పాదిదుర్గుణముల నడఁచు వారు
ప్రారబ్ధకలితాఘఘోరసంసారదా
వానలకీలల కలుకువారు
|
|
తే. |
అవని నిందాస్తుతులకు మానావమాన
ములకుఁ దగ్గక హెచ్చక భూతదయయు
ముఖ్యగుణము సుహృద్భావమును బరోప
కారమును గల్గు గురువుల ఘనులటండ్రు.
| 72
|
సీ. |
అట్టియాచార్యుల కనుగుణు లగుశిష్యు
లెట్టివా రనిన నీ వింక వినుము
విశ్వాసమును భక్తి వినయంబు శాంతియుఁ
గమనీయగుణములు గలుగువారు
సకలమంత్రాంతరసాధనాంతరముల
యందు బరాఙ్ముఖు లైనవారు
సకలభారంబు లాచార్యులపాదంబు
లం దుంచి నిశ్చలు లైనవారు
|
|
తే. |
అనిశమును బాపభీతు లైనట్టివారు
గురువరేణ్యుని హరి యనుకొనినవారు
మాయ విడనాడి సేవను జేయువారు
ధాత్రి సచ్ఛిష్యులని చెప్పఁదగినవారు.
| 73
|
వ. |
ఎవ్వరేని ముముక్షువు లైనవారికి జ్ఞానం బనుసంసారబీజంబు
నశింపవలె. నయ్యది నశించినను నహంకార మమకారంబులు
విడువవు. విడిచినను దేహాభిమానంబు వదలదు. వదలినను
స్వస్వరూపజ్ఞానంబు పుట్టదు. పుట్టిన నైశ్వర్యభోగాపేక్ష
|
|
|
మానదు. మానిన నర్థకామ్యాదిరాగద్వేషాదులు వీడవు.
వీడినను బారతంత్య్ర ప్రకారంబు గలుగనేరదు. కలిగినను
శ్రీవైష్ణవత్వంబు చేకూఱదు.చేకూరినను సాత్వికపరి
గ్రహుండు కాఁడు. అయినను భాగవతపరిగ్రహుండు కానే
రఁడు. అట్లయిన ననన్యార్హప్రయోజకుఁడు కాఁడు. అయిన
ననన్యార్హశేషభూతుండు గానేరఁడు. అయిన ననన్యార్హ
శరణుండు కాజాలఁడు. అయిన నధికారపుర్షుండు గాఁడు.
అయిన నష్టాక్షరి కధికారి యగును.
| 74
|
సే. |
అట్టి సచ్ఛిష్యుల కాచార్యు లుపదేశ
మిచ్చి రక్షించుట యెట్టు లనిన
శ్రీవైష్ణవాచారచిహ్నానుసరణంబు
గా నుపదేశించి కరుణఁ బెంచి
యష్టాక్షరీమంత్ర మతిశయం బంతక
న్నను మంత్ర మెందు లేదనుచుఁ జెప్పి
నారాయణుఁడె మహోన్నతుఁ డతనికి మించి
నట్టి దేవుండు లేఁ డంచుఁ బలికి
|
|
తే. |
పట్టుగా ద్వయచరమప్రవృత్తి భక్తి
నిష్ఠలను జెప్పి హరిని ధ్యానించువిధము
చెప్పి యొప్పుభరన్యాసచిత్సుఖంబు
నందుఁ బొందింతు రాచార్యు లైనవారు.
| 75
|
సీ. |
చక్కఁగ నాచార్యసంశ్రయణం బైన
వెనుక గామాదుల విడిచిపెట్టి
తలఁపున నెపు డహంతామమతలు లేక
విజనస్థలములందు విమలు లగుచు
|
|
|
మితభోజనంబును మితసుషుప్తియు మిత
సంభాషణంబు లాచార్యభక్తి
యతిశాంతము పరిగ్రహంబు నారాయణ
విగ్రహధ్యానవివేకగుణము
|
|
తే. |
లభ్యసిపంగ మానసం బమల మగుచు
నిలుచు హరియంద మది యిట్లు నిలిచెనేని
యున్నతం బగువిష్ణుసాయుజ్యపదవి
నొందుదురు వైష్ణవశ్రేష్ఠు లుర్వియందు.
| 76
|
తే. |
వేంకటేశుఁడ నగునాకు వేడ్కమీఱ
వివిధపరిచర్య లొనరించి విశ్వసించి
చెలగి యాచార్యశుశ్రూష చేయునట్టి
నిర్మలశ్రద్ధ వైష్ణవధర్మ మవని.
| 77
|
సీ. |
వరగురువులఁ గన్న వస్త్రభూషణములు
బ్రీతి రెట్టింప నర్చించువారు
ఆసక్తితోఁ దదీయారాధనంబులు
నంచితంబుగ నడిపించువారు
దేశికశ్రీపాదతీర్థప్రసాదముల్
భక్తి గ్రహించి మేల్బడయువారు
పట్టైన శేషత్వపారతంత్య్రంబు జీ
వాత్మధర్మము లని యలరువారు
|
|
తే. |
తగనితామసరాజసద్వయము నడఁచి
యొనర సాత్వికనిష్ఠలై యుండువారు
శాంతియును భూతదయయును సత్యవాక్య
ములను గలవారు వైష్ణవు ల్మొనసి చూడ.
| 78
|
వ. |
అనిన విని భూదేవి వైష్ణవధర్మంబునకు సంతసించి జ్ఞానభక్తి
వైరాగ్యంబులు గలవారు కర్మంబులు గ్రమంబున నాచరింప
వలయు ననిన వరాహస్వామి యిట్లనియె.
| 79
|
సీ. |
భాసురవిజ్ఞానభక్తివైరాగ్యము
ల్గలిగినవారును గర్మములను
విడువఁగాఁ దగ దది వేదోక్తమార్గంబు
గాన సల్పం దగు కర్మములను
స్నానసంధ్యాదులు సవనము ల్నిజశక్తిఁ
గొలఁది సల్పం దగు గోర్కె విడచి
హరి కర్పితం బని యాచరించినయప్డు
సంతుష్టుఁ డగు నది సత్ఫలంబు
|
|
తే. |
గనుక విఫ్రులు వేదమార్గక్రమమున
జన్నములు చేసిరేని యీశ్వరుఁడు మెచ్చి
యిష్టఫలముల నవ్వారి కిచ్చుచుండు
నందు జన్నాలు సేయుదు రార్యు లెల్ల.
| 80
|
వ. |
ఇవ్విధంబున నిష్కామసత్కర్మంబు నాచరింపవలయు మదాజ్ఞో
ల్లంఘనంబు సేసినవారు దోషయుక్తు లగుదురు. గావున
సద్బ్రాహ్మణులు యజనాదిషట్కర్మంబు నాచరింపుదు రందుఁ
గొందఱు బ్రహచర్యాదిధర్మంబు లాచరించి తత్వజ్ఞులై
సన్యసించి కర్మముక్తులై ప్రణవోచ్చారణంబు సేయుచు
సన్యాసవిధిఁ గొన్నియజ్ఞంబు లాచరించి పూర్ణజ్ఞానోదయం
బైనపిదప విధియుతంబుగ దండకమండలువులు విడిచి యవ
ధూతాశ్రమంబు నంగీకరించి శీతోష్ణసుఖదుఃఖాది ద్వంద్వా
తీతుఁడై సచ్చిదానంద సత్యపరిపూర్ణబ్రహ్మానుసంధానంబు
|
|
|
సేయుచుండవలయు నట్లు చేసినవారు బ్రహ్మసాయుజ్యంబు
నొందుదురని చెప్పి వరాహస్వామి వెండియు నిట్లనియె.
| 81
|
జీవబ్రహ్మప్రశంస
సీ. |
వెలఁది బ్రహ్మము రెండువిధములై యుండుఁ బ
రాపరము లనంగఁ బ్రబలు నందుఁ
బర మక్షరంబును బరమేక్షరం బీక్ష
రంబు జీవుం డక్షరంబు విమల
కూటస్థుఁ డనఁబడు పాటింపఁ బరమాత్ము
డాతఁడ పరమేశుఁ డతఁడ గురువు
పురుషోత్తముఁడు సర్వపూర్ణుఁ డాబ్రహ్మాంశ
జుం డనఁదగిన జీవుండ విద్య
|
|
తే. |
అట్టి పరిమితి లేనిదేహంబునందుఁ
జొచ్చి వెడలుచుఁ గడుమోహశోకవార్ధు
లందు మునుఁగుచుఁ దేలుచు నహము పెంచి
భూరికర్మంబు లొనరించి పుట్టు గిట్టు.
| 82
|
వ. |
కాఁబట్టి యట్టిజీవుం డవిద్యోపాధిచేత భిన్నుండగు ననేక
దేహంబు లెత్తుచుండు నందుఁ గొన్నిదేహంబులయందుండి
యెక్కుడు పాపకర్మంబులు చేసి యధోగతి నొందుచు
నిష్కామపుణ్యకర్మంబులు చేసి యూర్ధ్వగతిఁ బొందుచుఁ
బుణ్యపాపమిశ్రకర్మంబులు చేసి సుఖదుఃఖంబు లనుభవిం
చుచు మర్త్యలోకంబునఁ బుట్టుచు గిట్టుచు నుండు నందుఁ
గొందఱు కామభోగసక్తులై యుందురు మఱియును.
| 83
|
ఉ. |
కామముచే గ్రతుప్రముఖకర్మము లొప్పఁగ నాచరించి సు
త్రామపురాదిలోకములఁ దక్కగ చేరి సుఖంబులొంది యం
|
|
|
దేమఱి యున్న పుణ్యతతు లెప్పుడు నాశము నొందునప్పుడే
భూమినిబుట్టి క్రమ్మఱును బోవుచు వచ్చుచునుందురెప్పుడున్.
| 84
|
వ. |
అందుఁ గొందఱు యోగాభ్యాసనిష్ఠులై సత్పదంబు నొందు
దురు గావున.
| 85
|
తే. |
ఘనతరము లైనయోగప్రకారములను
దేవ! సత్కృపతో నాకుఁ దెల్పవలయు
ననుచుఁ బ్రార్థింప ముదమంది యవ్వరాహ
దేవుఁ డిట్లనె నాభూమిదేవి కపుడు.
| 86
|
వ. |
యోగమార్గక్రమం బెట్లనిన గురూపదేశక్రమంబుగా యమ
నీయ మాసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యానధారణ
సమాధులనియెడి యష్టాంగయోగంబు లభ్యసింపవలయు.
నందు యమం బెట్టిదనిన.
| 87
|
అష్టాంగయోగంబులు
సీ. |
జగతి నహింసయ సత్య మస్తేయంబు
బ్రహచర్యం బార్జవంబు క్షమయు
నతిశయధృతిమితాహారముల్ శౌచంబు
నీపది యమముల నెట్టులనిన
సకలజీవులకుఁ గ్లేశంబు పుట్టింపకు
న్నట్టిచంద మహింస యనఁగఁ బరఁగు
నవని నందఱ కిష్టుఁడై దబ్బరాడకు
న్నట్టిచందము సత్యమన్న ధనము
|
|
తే. |
కోరి మాయలఁ బన్ని గైకొనఁదలంప
కుండు టస్తేయ మనఁబడు నొరులసతుల
|
|
|
మాతృభావంబుగాఁ జూచుమతము బ్రహ్మ
చర్యమన నొప్పుచుండు నోసరసిజాక్షి.
| 88
|
తే. |
సారదయ భూతమైత్రి యార్జన మనంగ
నకుటిలత్వ మగున్ క్షమయనఁగ నోర్పు
ధృతి యనఁగ ధైర్య మనఁదగు మితపుభుక్తి
యనఁగ మితభోజము శౌచ మనఁగ శుద్ధి.
| 89
|
వ. |
యమం బిప్పదివిధంబులం జెప్పందగు. నింక నియమంబు లెవ్వి
యనిన యోగశాస్త్రరతియు సత్పాత్రదానంబును సంతో
షంబును లజ్జయు వ్రతంబును మతియు నాస్తిక్యంబును
నీశ్వరార్చనంబును దపంబును జపంబు నననొప్పు నీదశవిధంబు
లైన నియమంబులయందు వాదాస్పదశాస్త్రంబు లుదర
పోషణార్థంబని నిరసించి మోక్షప్రదశాస్త్రంబు లభ్యసించుట
యోగశాస్త్రరతి యగుఁ దనకుఁ బ్రాప్తంబైన ధనంబు గురు
ద్విజార్థులకు సమర్పించుట పాత్రదానం బగు. లాభాలాభ
శుభాశుభ సంయోగవియోగ మానావమాన స్తుతినిందా
దుల మోదఖేదంబులు లేకయుండుట సంతోషం బనందగు.
సుజనసాంగత్యంబువలనఁ దనదుర్గుణంబులఁ దాఁ దలచి
తన్నుఁ దా నిందించుకొని దుర్గుణంబుల మాని సుగుణంబు
లభ్యసించుట లజ్జ యగు. దానసంకల్పించి సేయు మోక్షసాధ
నంబు విడువక యాచరించుట వ్రతం బనఁదగు. తాఁ జేయు
యోగంబుసకు రోగదారిద్య్రసంశయశాస్త్రవాద రసవాద
దుష్టస్నేహాది విఘ్నంబులు వచ్చినను జలింపకుండుట బుద్ధి
యగు. మతభేదపురాణేతిహాసాది సద్గ్రంథంబులను శ్రద్ధం
గని సారార్థగ్రహణంబు సేయుట యాస్తిక్యం బగు. నతితేజో
|
|
|
మయంబై న యీశ్వరరూపంబును గురుముఖంబుగ నెఱిఁగి
హృత్కమలమునందు మనంబున ధ్యానించి పూజించుట
యీశ్వరార్చనంబగు. గురువాక్యంబు సత్యంబుగనమ్మి చెప్పిన
నియమంబు తప్పక కష్టంబున కోపినపుడు తపంబగు. జప్యా
జప్యంబులయందుఁ దనకు గురుండుపదేశించిన మంత్రంబు
నిశ్చలుండై విడువక జపంచుట జపంబగు. నీపదియు నియ
మంబులగు. నిట్టియమనియమంబు లిరువదియు నంతశ్శుద్ధి
ప్రదంబులగుం గావున వీనినభ్యసించి యంతశ్శుద్ధి నొంది
కీటాదిజంతువులు మెదలకుండునట్టి విజనస్థలంబునందుఁ
జేలాజిన కుశోత్తరంబుగ నాసనసుఖంబు నిర్మించి యందు
నాసనంబుల నభ్యాసంబు సేయవలయు. నవ్విధం బెట్లనిన.
| 90
|
సీ. |
పద్మాక్షి విను మేను పదినాల్గులక్షలై
నట్టియాసనములం దతిశయములు
లీలమై నెనుబదినాలుగాసనములం
దధికంబు లష్టాదశాసనంబు
లటువంటి యష్టాదశాసనంబులలోన
నతిశయించినవి సిద్ధాసనంబు
భద్రాసనంబును బద్మాసనంబును
సింహాససం బని చెప్పఁదగిన
|
|
తే. |
నాలుగాసనములయందుఁ జాలమేటి
యనఁగ నొప్పుచునుండు సిద్ధాసనంబు
పొలఁతి యష్టాదశాసనంబులవిధములు
వినుము వేర్వేఱఁ జెప్పెద విశదముగను.
| 91
|
వ. |
స్వస్తికాసన, గోముఖాసన, వీరాసన, కూర్మాసన, కుక్కుటాస
నోత్తాన కూర్మాసన, ధనురాసన, మత్స్యేంద్రాసన, పశ్చిమస్థా
ణ్వాసన, మయూరాసన, సిద్ధాసన, మతాంతరసిద్ధాసన, భద్రా
సన, పద్మాసన, మతాంతరపద్మాసన, బద్ధపద్మాసన, సింహాసన,
శవాసనంబు లనునీయష్టాదశాసనంబులందు స్వస్తికాసనం
బెట్లనఁగ.
| 92
|
తే. |
తరుణి విను జానుజంఘికాంతరములందు
బదము లొదికిలిగా నుంచి పదిలపఱచి
యున్న నది స్వస్తికాసనం బొప్పు గోము
ఖాసనం బెటులన్న పద్మాక్షి వినుము.
| 93
|
వ. |
ఎడమకాలిమడమ కుడివీఁపుప్రక్క కుడికాలిమడమ నెడమ
వీఁపుప్రక్కఁగ మోఁకాటిమీఁద మోఁకాలు కదియనుంచి
కూర్చున్న గోముఖాసనం బనంబడు. నొకపాదము తొడఁ
గ్రింద నొకపాదము తొడమీఁద నునిచి కూర్చున్న నది వీరా
సనం బనంబడు. నాధారమునకు నుభయపార్శ్వంబుల రెండు
కాళ్లమడమలు కదియ హత్తించి చక్కఁగఁ గూర్చుండ నది
కూర్మాసనం బగు. పద్మాసనంబుగ మోఁకాళ్ల మెడలసందులఁ
జేతుల దూర్చి హస్తముల నేలనూని పద్మాసనంబు పైకెగసి
నట్లుండుట కుక్కుటాసనం బగు. నిట్లు కుక్కటాసనస్థుఁడై
యుండి రెండుచేతులును మెడను పట్టుకొని కూర్మమువలె
వెలికిలఁ బడియున్న నది కూర్మాసనం బగు. పాదాంగుష్ఠంబుల
రెంటిని రెండుచేతుల ధనురాకృతిగ వీఁపువెనుకగఁ జెవులకు
సరిగఁ బెట్టియుండుట ధనురాసనం బగు. నెడమతొడ
మొదటికుడిపాదము వట్టుకుని పెడమఱలఁబడియున్న, దీని
|
|
|
వలన జఠరాగ్ని ప్రకాశించి కుక్షిరోగము నశించును. అభ్యా
సమువలనఁ గుండలిని మేలుకొల్పును. బురుషునకు దండస్థిర
త్వంబు కల్గు. నిదియ మత్స్యేంద్రాసనం బనంబడును. భూమి
నానునట్టుగ రెండుకాళ్లుఁ జక్కఁగ సాఁచి నడుము వంచి
మోఁకాళ్లమీఁద లలాట ముంచి రెండుచేతులు సాఁచి రెండు
కాళ్లవేళ్లు రెండుచేతులం బట్టియున్న దీనివలన వాయువు
పశ్చిమమార్గముగ నడుచును. జఠరాగ్ని పుట్టి కడుపు పలుచనై
రోగములు నశించును. ఇదియ పశ్చిమతాణువాసనం బగు. హస్త
ములు రెండు నేలం బూని, మోచేతులు రెండు నాభికిరు
ప్రక్కల నుంచి ముఖము పైకెత్తి రెండుకాళ్లు సాఁచి నెమలి
తోఁక పైకెత్తికొనినట్లున్న దీనివలన గుల్మాదిరోగములు
నశించి జఠరాగ్ని ప్రకాశించి విషమునైన జీర్ణము సేయునది.
యిదియ మయూరాసనం బగు. నెడమకాలిమడమ మూలా
ధారమునందును, కుడికాలిమడమ లింగస్థానంబునం దుంచి
యేకాగ్రచిత్తముగ శీర్షగ్రీవభుజంబులఁ జక్కఁగ నునిచి
నడుము నిక్కించి భ్రూమధ్యావలోకనంబు సేయుచున్న, దీని
వలన మోక్షద్వారకవాటభేదనం బగు. నిదియ సిద్ధాసనం బగు.
లింగాసనోపరి యెడమమడమ నునిచి దానిమీఁదఁ గుడిమడమ
నునిచిన నిదియ మతాంతర సిద్ధాసనంబగు. నిదియ వజ్రాస
సంబు, నిదియ ముక్తాసనంబు, నిదియ గుప్తాసనంబగు. మడ
మలు రెండు నండాధఃప్రదేశలింగపార్శ్వంబులనుండి రెండు
పార్శ్వములు రెండుచేతులంబట్టి కదలకుండిన దీనివలన విష
ములు సకలరోగములు హరించును. నిదియ భద్రాసనం బిదియ
గోరక్షాసనంబునగు. నెడమతొడమీఁదనున్న కుడిపాదము
|
|
|
కుడితొడమీఁద నెడమపాదము నునిచి వీఁపుగుండ కుడిచేత
నెడమతొడమీఁదనున్న కుడిపాదము బొటనవ్రేలిం బట్టి
యట్లన వీఁపుగుండ నెడమచేతఁ గుడితొడమీఁదనున్న
నెడమపాదము బొటనవ్రేలంబట్టి హృదయమునందుఁ జుబు
కంబు నునిచి నాసికాగ్రంబు చూచుచున్న దీనివలన వ్యాధులు
నశించు, నిదియ పద్మాసనంబగు. నెడమతొడనడుమ కుడి
పాదము వెలికలనునిచి కుడితొడనడుమ నెడమపాదము వెలి
కల నునిచి హస్తములురెండును రెండుతొడలమీఁద వెలిక
లగ నునిచి నాసాగ్రమునండు లక్ష్యంబుంచి దంతమూలమున
నాలుక హత్తించి వక్షమునందుఁ జుబుకంబు నుంచి మెల్లన
వాయువు నిల్పియున్న, దీనివలన సర్వరోగంబులు నశించు.
నిది మతాంతరపద్మాసనం, బిదియముక్తపద్మాసనంబగు. హస్త
ములు రెండు హత్తించి చిత్తమునందు ధ్యానంబు సేయుచు
నపాననాయువు నూర్థ్వముఖముగ నడుపఁగఁ గుండలిశక్తి
యుక్తమై నిల్పిన ప్రాణవాయువును విడువఁగ నతిశయంబగు,
జ్ఞానబోధ కల్గును, దీనివలన నాడిద్వారములయందు వాయువు
నిల్చును, ఈవిధమునన మరణమునొందిన ముక్తులగుదు రిది
బద్దపద్మాసనం బగు. లింగాండోభయపార్శ్వములయండు నెడ
మకాలిమడమ దక్షిణపార్శ్వము కుడికాలిమడమ నెడమపా
ర్శ్వంబున నునిచి చేతులు రెండు మోఁకాళ్లుమీఁదుగ సాఁచి
వికసింపఁబడినవ్రేళ్లుగ నునిచియున్న, దీనివలన మూలోడ్యా
ణజాలంధరబంధత్రయానుసంధానంబు కలుగు నిది శ్రేష్ఠమైన
సింహాసనంబగు. భూమియందు శవమువలె వెలికలుగఁ
గాళ్లురెండు బొటనవ్రేళ్లు సరిగఁగూర్చుండినయట్లుగ సాఁచు
|
|
|
కొని హస్తములు రెండు వక్షంబునందుఁ గదియ నుంచి
పండుకొనియున్న, దీనివలన సమస్తాసనములు వేసియున్న
బడలికలు తీఱు నిది చిత్తవిశ్రాంతిసాధనమై యుండు, నిది
శవాసనం బగు. క్రమంబుగ నాసనాభ్యాసంబులు చేసిన
నాడులు వశీకృతంబులై దేహంబునకు జవలఘుత్వంబులు
గల్గి సర్వరోగహరంబగు. గావున దీనిసాధించిన యనంతరంబు
ప్రాణాయామంబు సేయవలయు, నదెట్లన్నవినుము.
ప్రాణవాయువు నుద్దేశించి చంద్రనాడివలన హరించి యథా
శక్తిగ నిల్పి తిరుగ సూర్యనాడిచేత మెల్లఁగ నుదరము
పూరించి శాస్త్రప్రకారంబుగఁ గుంభకంబును ధరించి మఱలఁ
జంద్రనాడిచేత విడువవలెను. బాగుగ నేమార్గంబున విడు
చునో యామార్గంబునం బూరించి ధరింపవలెను. మొదటి
మార్గముకంటె రెండవమార్గమున త్వరపడక మెల్లఁగ విడువ
వలయును. మఱియు నిడయందుఁ బూరించి కుంభించి పింగళ
నాడిని విడచి మఱలఁ బింగళనాడిని బూరించి కుంభించి యిడ
యందు విడువవలయును. సూర్యచంద్రనాడు లీక్రమంబుగఁ
జేసి వాయువెంతయుక్తమో యంత నిలుపవలయు. నీక్ర
మంబునఁ జేయు రేచకపూరకకుంభకత్రయంబు నొక్కప్రాణా
యామంబగు. నుదయమధ్యాహ్నసాయంకాలార్ధరాత్రం
బులఁ గాలంబున కిరువై చొప్పునఁ గుంభకంబులు మెల్ల
మెల్లఁగ నెనుబదిగ, నొకదిన మభ్యసింపవలెను. ప్రాణనిరోధ
మగుచుండఁ జెమట పుట్టినట్టయ్యనేని కనిష్ఠం బగు, వడఁకుఁ
బుట్టినట్టాయెనేని మధ్యమం బగు, మాటిమాటికిఁ బద్మాసనం
బెగసినట్టాయెనా యుత్తమం బగు, నిట్టియభ్యాసమునఁ బుట్టిన
|
|
|
చెమట మర్ధనంబు సేయఁగఁ దనువునకు దృఢత్వలఘుత్వం
బులు పుట్టును. మఱి యీప్రాణాయామముచేత మూఁడు
నెలలు మీఁదట నాడిశుద్ధి గల్గును. నిదియ ప్రాణాయామం
బగు నింకఁ బ్రత్యాహారం బెట్లన్నను.
| 94
|
సీ. |
శ్రీగురుబోధ విశేషతగలబుద్ధి
చే మానసమును సుస్థిరము చేసి
యామదియం దింద్రియవ్యాప్తు లడఁగింప
నందొప్పుగానిల్చు ననిలగతులు
కమఠ మంగములను గదలనీయక కుక్షి
యందు డాఁచినరీతి నఖిలవిషయ
కరణానిలములఁ జక్కఁగఁబట్టి నిల్పఁగ
నదియ ప్రత్యాహార మనఁగఁబరగు
|
|
తే. |
దాన దేహంబు సుస్థిరత్త్వంబు నొందు
దీపితంబుగ నేకాగ్రదృష్టి నిలుచు
దీని సాధించి యటమీఁద ధ్యానయోగ
మెలమి సాధింపవలె నది యెట్టులనిన.
| 95
|
తే. |
రోషదుర్భావవైకల్యదోషములను
కపటవచనంబులను వీడి గర్వమడఁచి
సద్గురూక్తులు వించును శాంతుఁడగుచు
నెపుడు కరువలినూని సర్వేంద్రియముల.
| 96
|
చ. |
అపురుపుసంహరించి గురుఁడానతియిచ్చిన లక్ష్యముద్రలం
దుపముగ మానసంబునిడి యొండొకచింతనులేక చిత్తముం
జపలతఁ బొందనియ్యక నుషద్వసజంబులనూని లోనఁ దా
నెపుడు చలింపకున్న మదికింపొనరించెడి ధ్యానయోగియై.
| 97
|
వ. |
ఇది ధ్యానయోగంబు. నింక ధారణాయోగంబులఁ జెప్పెద
నెట్లనినఁ, జరణాదిజానుపర్యంతంబు పృథ్వితత్వం బగు. తదధి
దైవతం బైన బ్రహ్మను లకారయుక్తంబైన వాయుధారణా
భ్యాసంబున ధ్యానింపఁ బృథ్వీజయంబు గల్గు, జాన్వాదినాభి
పర్యంతంబు జలతత్వంబగు. తదధిదైవతంబైన విష్ణుని వకార
యుక్తంబైన వాయుధారణాభ్యాసంబున ధ్యానింప సలిల
జయంబుగల్గు, నాభ్యాదికంఠపర్యంతం బగ్నితత్వం బగు. తదధి
దైవతం బైనరుద్రుని రవర్ణయుక్తంబైన వాయుధారణా
భ్యాసంబున ధ్యానింప నగ్నిజయంబుగల్గు, కంఠాదిభ్రూమధ్య
పర్యంతంబు వాయుతత్వం బగు. తదధిదైవతం బైనమాహేశ్వ
రుని యకారయుక్తంబైన వాయుధారణాభ్యాసంబున
ధ్యానింపఁ బవనజయంబు గల్గు, భ్రూమధ్యాది బ్రహ్మరంధ్ర
పర్యంతం బాకాశతత్వంబగు. తదధిదైవతంబైన బిందుమయ
గగనశరీరుండైన సదాశివుని యకారయుక్తంబైనఁ బ్రాణా
నిలధారణాన్యాసంబున ధ్యానింపఁ దన్మయత్వంబును గగన
జయంబును గలుగు నిట్లు ధారుణియు, వారుణియు,
నాగ్నియు, మారుతవ్యోమంబులుపంచధారణాధ్యానాభ్యా
సంబునఁ బంచభూతజయంబు గల్గు నివ్విధంబున.
| 98
|
తే. |
ధ్యాన మభ్యాస మొనరింపఁ దలఁగకపుడు
మానసము నిల్చు మదినూని మతియు నిల్చు
బుద్ధి నిల్చిన నానందపూర్తి గలుగు
నదియధారుణయండ్రు యోగాఢ్యు లవని.
| 99
|
వ. |
ఇది ధారణయోగంబు. నిఁక సమాధి యెట్లనిన, నాసనజయం
బునం గుంభకసిద్ధిచేత నిర్మలంబైనజ్ఞానభాను ప్రకాశంబుచేత
|
|
|
మాయాంధకారంబు నడంచి ప్రకాశించుమానసంబు నాత్మా
కాశంబునందుఁ గూర్చి తన్మయత్వంబునొంది శాంతవర్తనుం
డైన సంయోగవియోగ సుఖదుఃఖంబుల మఱువ బ్రహ్మపద
ప్రాప్తభావనిశ్చలానందభరితంబైన స్వానుభవబోధయ సమా
ధియగు నియ్యష్టాంగయోగాభ్యాసంబుచేయువారికి నీసమాధి
ఫలితార్థంబగునట్టివారు బ్రహ్మపదంబు నొందుదు రివి స్థూలా
ష్టాంగయోగంబు లగు. నిఁక మంత్రలయహఠరాజయోగం
బులు గలవనిన వరాహస్వామికి మ్రొక్కి భూదేవి యిట్లనియె.
| 100
|
తే. |
దేవ! యష్టాంగయోగము ల్తెలియ వింటి
రమ్యతర మంత్ర లయ హఠ రాజయోగ
ములను నామీఁద దయయుంచి తెలుపుమనిన
శ్వేతకిటి భూమిదేవి నీక్షించి పలికె.
| 101
|
వ. |
దేవి విను మిఁక మంత్రయోగవిధానంబు చెప్పెద నదియును.
| 102
|
మంత్రయోగము
సీ. |
పూని విసర్జనస్థానంబునందుండు
నాధారకమలంబునందు వ శ ష
స లు నాలుగైన ఱేఁకులయందు దీపించు
విఘ్నేశుఁ డచ్చట వెలుఁగుచుండు
దానికి నంగుళద్వయముపై నుత్పత్తి
కైన స్వాధిష్ఠానమందు ప భ మ
య ర ల కావలనుండు నదియాఱుదళములం
దజుఁడుండు నుత్పత్తికాఢ్యుఁడగుచు
|
|
తే. |
మెఱసి యష్టాంగుళములకు మీఁద డాది
ఫాంతవర్ణావళిం గూడి పదిదళముల
|
|
|
నొప్పు మణిపూరకము నాభి నుండు విష్ణుఁ
డచటఁ దా స్థితికర్తయై యలరుచుండు.
| 103
|
సీ. |
పదియంగుళములకుఁ బై హృదయస్థాన
మం దనాహతపద్మ మమరుచుండు
ఠాంతవర్ణంబు లుండఁగ పదిరెండైన
దళములచే నొప్పు దానియందు
నధికుఁడై లయకర్త యైనరుద్రుం డుండు
నావలఁ బదియు రెండంగుళముల
పై విశుద్ధంబుండు భావింప కంఠంబు
నందున నాల్గుపదాఱుదళము
|
|
తే. |
లందు వెలుఁగు సదాశివుం డచట నుండు
దానిమీఁదట నాజ్ఞాభిధానచక్ర
మున హకారక్షకారంబు లొనరు నచట
నున్నతంబుగఁ బరమాత్మ యొప్పుచుండు.
| 104
|
సీ. |
అట దానిపైన సహస్రారకమలంబు
శీర్షంబునందు భాసిల్లుచుండు
నది యమృతస్థాన మగు దేహవృక్షంబు
నకు మూలమై గురునకు నివాస
మగు నిడాపింగళలం దేకవింశతి
సాహస్రములు మఱి షట్ఛతంబు
లైనశ్వాసములు ప్రాణాపానకలితంబు
లై హంసలై యజపాఖ్యనొందు
|
|
తే. |
నట్టిశ్వాసలు గణపతి కాఱునూఱు
జలజసంభవ విష్ణురుద్రులకు సంఖ్య
|
|
|
దప్ప కాఱేసివేలు సదాశివునకు
నొగిఁ బరాత్మకు గురున కొక్కొక్కవేయి.
| 105
|
వ. |
ఈప్రకారంబు సప్తకమలంబులయందు హంసలు ద్రొక్కు
చున్నప్పుడు కాలఘటికాక్రమంబు నెఱుంగవలయు. నదెట్లన.
| 106
|
లయయోగము
సీ. |
ఆధారమున హంస లాఱునూ ఱర్పితం
బగువేళ కొకటి యాఱైనగడియ
పదివినాడులునగు పరఁగుస్వాధిష్ఠాన
మం దాఱువేలైన హంస లొనర
నర్పితంబగువేళ కగును పోడశఘటి
కలు నర్ధఘటిక విగడియలు పది
క్రమముగ మణిపూరకమున కార్వేలైన
హంస లర్పిత మగునపుడు పదియు
|
|
తే. |
నాఱు నరగడియ విగడియలును బదియు
నగు ననాహతమున హంస లాఱువేలు
నర్పితం బగుతఱి పదియాఱు నరయ
గడియ లొకపదియైన విగడియ లగును.
| 107
|
సీ. |
ప్రకటవిశుద్ధంబునకు వేయిహంసలు
నర్పితం బగువేళ కగును రెండు
గడియలు సగమైన గడియ పదాఱు వి
గడియలు హంస లక్కడికి నాల్గు
నాగ్నియందు సహస్రహంస లర్పితమగు
నపుడు రెం డఱగడియలు విగడియ
|
|
|
లును బదాఱును హంసలును నాలు గగు సహ
స్రారంబునందు సహస్రహంస
|
|
తే. |
లర్పణముగాఁగ రెండున్న ఱైనగడియ
లలవిగడియలు పదియాఱు హంస లొక్క
నాలు గగుచుండు నీరీతి ననుదినంబు
జరుగు నరువదిగడియలై జనుల కెల్ల.
| 108
|
వ. |
ఇవ్విధంబున నుదయాద్యుదయపర్యంతము నడచుచున్న నిరు
వదియొక్కవేయియు నాఱునూఱుహంసలు నజప యనందగు
నట్టి యజపగాయత్రిమహామంత్రంబు గురుముఖంబుగ నెఱింగి
యరుణోదయంబునఁ బరమశుచి యై పద్మాసనాసీనుఁ డై
కూర్చుండి నాసాగ్రావలోకనుండై సప్తకమలాధిదేవతలకు
న్యాసధ్యానపూర్వకంబుగ నర్పణంబు సేయుచుండుట మంత్ర
యోగం బగు. నింక లయయోగం బెట్లన్న, విజనస్థలంబున
భద్రాసనాసీనుఁడై గూరుచుండి దిగువ నాసికాగ్రంబును జూచు
చుం బైనున్నది సాధించుచుఁ బైనాసికాగ్రంబును జూచుచు
దిగువనున్నది సాధించుచు రెండుతర్జనులచేత రెండుకళ్ల
ద్వారంబులును రెండనామికలతో రెండునాసికద్వారంబు
లును బంధించి శిరంబు వంచి యేకాగ్రచిత్తుండై వివేకుఁడై
యూర్ధ్వంబుగఁ జూడ నది రాథాయంత్రం బనుముద్ర యగుఁ.
దన్ముద్రాభ్యాసంబుం జేయుచున్న బ్రహ్మరంధ్రంబునఁదుఁ
బ్రణవనాదంబు దశవిధంబుగ మ్రోయుచుండు. నది యెట్లన్న
మొదట శింజినీగతియు, రెండవది తరంగఘోషంబు, మూఁడ
వది ఘంటారవంబు, నాల్గవది వేణునాదంబు, నైదవది వీణాస్వ
సనంబు, నాఱవది భేరీధ్వనియు, నేడవది తాళధ్వని, యెనిమిద
|
|
|
వది శంఖారవంబును, దొమ్మిదవది మృదంగనాదంబును, పదియ
వది ప్రణవనాదంబును మేఘనాదంబుకరణి వినంబడు. నిట్లు
క్రమంబున నాదానుసంధానంబు సేయ నందు నవనాదంబులు
లయించి పదియవదైన మేఘనాదంబున శ్రవణసహితంబుగ.
మనంబు నునిచి నిర్వ్యాపారంబుగ నిల్పి బాహ్యంబు మఱచి
యున్న నమ్మానసంబుతోఁ బవనంబందు లీనం బగు. నిది నాద
లీలానందకరంబైన లయయోగం బగు. నింక హఠయోగం
బెట్టిదనిన, రాజపరిపాలితంబైన సుభిక్షరాజ్యంబునందు హఠ
యోగమండపంబు నిర్మించి యందుండి యభ్యాసంబు సేయ
వలయు నదెట్లన్న, సుగంధపుష్పఫలభరితంబునగు వన
మధ్యంబున గాలి చొరకుండ సూక్ష్మద్వారయుక్తంబైన మండ
పంబొండు నియమించుకొని దినదినంబును గోమయంబున
శుద్ధి సేయించుచు నందు వసియించి యతిశయించిన, నుప్పు,
పులుసు, కారము, చేదు, వగఱు వస్తువులను, పిదప
దిలతైలంబును, అజాదిమాంసమద్యమీనంబులును, రేఁగుపం
డ్లును, మిక్కిలిపసరాకుకూరలును, దధి, తక్ర, కుళుత్థములును
శర్కర మొదలైన సాత్వికాహారంబును గ్రహింపవలయు.
దాభుజింపఁదగిన యన్నంబు నాల్గుపాళ్లు చేసి యొకపాలు విడచి
మూఁడవపా లీశ్వరప్రీతిగ భుజించుచుఁ ద్రిఫలంబు లౌషధం
బుగ గ్రహించుచుఁ బ్రాతస్నానోపవాసవ్రతస్త్రీసాంప
త్యాదిదేహప్రయాసంబులు విడచి యనలార్కోదితంబు
లైన, కాఁకలం బడక శీతవాతంబులయందు నుండక, యోగష
ట్కర్మంబు లాచరింపవలయు. నది యెయ్యది యనిన, ధౌతికర్మ
|
|
|
వస్తికర్మ, నీతికర్మ, త్రాటకకర్మ, నుహుళీకర్మ, గఫాలభాతి
కర్మంబు నాఱు గల వందు ధౌతికర్మం బెట్లంటివేని.
| 109
|
తే. |
వినుము మృదువస్త్ర మొకనాల్గువ్రేళ్ళ వెడలు
పుగఁ బదేనగుచేతుల పొడవు గల్గి
నట్టివస్త్రంబు తేటనీళ్లందుఁ దడిపి
మెల్లమెల్లఁగ లోనికి మ్రింగవలయు.
| 110
|
సీ. |
అటు మ్రింగి యీవల నతివేగమునఁ దీసి
యటుమీఁద వింశతిహస్తసంఖ్య
గలవస్త్రమును మెల్లఁగా దిగమ్రింగుచుఁ
దీయుచునుండఁగ దీపనంబు
గలుగు నపానంబు గంఠనాళముగుండ
వెడలింపఁ బైత్యంబు వెడలిపోవు
నది యభ్యసింపఁగ నక్షిరోగములు కా
సశ్వాసముఖరోగచయము లడఁగు
|
|
తే. |
గురుముఖంబుగ నీఘర్మ మరసి ధౌతి
గజకరణి యన నొప్పు నీకర్మ మొనర
నభ్యసింపఁగ వాయువు లన్ని తనకు
వశములై నిల్చుచుండు నోవారిజాక్షి.
| 111
|
వ. |
ఇఁక వస్తికర్మం బెట్లన్న నాభిపర్యంతముగ నీటియందుఁ
జొచ్చి యధోద్వారమునందు క్రోలయుంచి కుక్కుటాస
నస్థుండై గూర్చుండి యపానవాయువుచేత జలమును మీఁదికి
నెగయం జేర్చి తిరుగ నధోద్వారంబున నాజలంబును విడువ,
దీన నధికశూలలు గడ్డలు మహోదరాలు వాతపిత్తశ్లేష్మం
బులచేఁ గల్గు సకలవ్యాధులును దొలంగు. సప్తధాతుచక్షు
|
|
|
దాదింద్రియాంతఃకరణప్రసన్నతయు, శాంతియు, క్షుత్తు
గలిగి, సర్వతోష మొనరించి వివిధభయంబులఁ బోఁగొట్టు. నిది
వస్తికర్మం బగు. నిఁక నీతికర్మం బెట్లన్న జానెడుపొడువు
సూత్రము మలినము లేని నేతియందుఁ దడిపి నాసికమునం
బీల్చి నోట వెడలదీయఁగఁ దివ్యదృష్టి గల్గు. నిఁకఁ ద్రాటక
కర్మంబు వచించెదఁ, గదలనిచూపువలన, సూక్ష్మంబైనగుడిని
యేకాగ్రచిత్తంబునఁ గన్నీరొల్కఁ జూడఁగ నేత్రరోగా
దులువోయి బంగరుపెట్టియవలె గోప్యము సేయందగినది.
ఇఁక నహుళికర్మంబును వక్కాణింతు వినుము, తీవ్రంబునం
గడుపును గుడియెడమగఁ ద్రిప్పఁగఁ గడుపులోని మందాగ్ని
విడచి దీపనంబు గల్గి పాచనాదులు గల్గుచు నానందమలరి
సమస్తనాగదోషంబులను బోఁగొట్టును. హఠయోగంబునకు
శ్రేష్ఠమైయుండు నిన్నహుళీకర్మం బిఁకఁ గపాలభాతికర్మం
బెట్టిదంటివేని వినుము. లోహకారకుఁడు కొలిమితిత్తి నూది
నట్లు రేచకపూరకంబులు చేయం గఫాదిరోగంబులు తలం
గును. దేహదార్థ్యము నాయురారోగ్యము గల్గుచుండు.
కాఁబట్టి యీషట్కర్మంబులు క్రమంబుగ నభ్యసించి రోగ
విరహితులైన నాడులు వశవృత్తులగుచుండునప్పుడు సిద్ధాస
నాసీనుఁడై, రేచకపూరకకుంభకాన్వితంబైన ప్రాణాయామ
పూర్వకంబుగ షణ్ముఖిముద్రాభ్యాసంబు సేయుచుండు. నావల
సుషుమ్ననాడికిం గారణంబైన మూలాధారాధికబ్రహ్మరం
ధ్రంబు గలదు. ఆరంధ్రంబును దత్వమనియుఁ ద్రిబింగళ
నాడులు ముఖంబనియుఁ జెప్పుదురు. తత్కారణంబున నమృ
తంబు స్రవించునట్లు స్రవించుటవలన మానవశరీరములకు
|
|
|
మృత్యువు గలుగును. తదమృతము నిల్పుటకై మడమచేత
యోనిస్థానంబును లెస్సగ నొక్కిపట్టి గుదము నూర్థ్వముఖ
ముగ నెగయనెత్తి యపానవాయువును మీఁది కాకర్షించి
బలవంతముగ నూర్థ్వంబుగ నాకుంచనంబు సేయ నది మూల
బంధం బగు. దానం జేసి ప్రాణాపానవాయువులును నాద
బిందువులును గూడి యైక్యమై యోగసిద్ధప్రదంబగు
నపానవాయువు మీఁది కెగసి యగ్నియందుఁ బొందుచుండ
నపు డగ్నిజ్వాల వాయువుతోఁ గూడి పొడువుగ వృద్ధియగు,
నపు డగ్ని పురుషవాయువులు ప్రాణవాయువును బొందు. నివ్వి
ధంబున దేహమునందుఁ బుట్టిన యగ్ని ప్రజ్వరిల్ల నందు నిద్రిం
చిన కుండలీశక్తి తపింపఁబడి మేల్కని కట్టెచేఁ గొట్టబడిన
భుజంగస్త్రీవలె నిశ్వాసంబు పుచ్చి చక్కఁగ సుషుమ్నద్వా
రాన బ్రవేశించి శాంతమై బ్రహ్మనాడినడుమఁ బొందు
గనుక తదభ్యాసంబు సేయుచున్న మూలశక్తి యాకుంచితం
బగు, మధ్యశక్తి మేల్కను, నూర్ధ్వశక్తి పాతంబు నొదవుఁ, బవ
నుండు మధ్యమార్గంబుగఁ జననోపు. నదియుంగాక మూలం
బాకుంచితంబై నాభినొత్తిన నది యొడ్డాణబంధం బగు. కం
ఠంబు సంకుచితంబై చుబుకంబు ఱొమ్మునొత్తిన నది జాలం
ధరబంధం బగు. మూలం బాకుంచితం బైనపు డపానవాయు
వెగయనంతన హృదయంబునం బ్రాణంబు దిగి నాభియం దపా
నునిం గలయనప్పుడు కుంచితం బైననాభిని వెనుక నొత్తిన,
ప్రాణాపానంబులు గలసి వెన్నంటిపోవునంతలోఁ గంఠనికుం
చనం బడఁచిన నమ్మారుతమునం బడ్డంబైన కుండలిం బడ
నూకి మధ్యబిలంబును జారఁబడి చిన్మయత్వంబు నొందినప్పు
|
|
|
డంతరాళనాళంబు నిశ్శబ్దం బగు. కంఠముద్రపవనంబున నాళి
నిల్పఁగ సర్వపరిపూర్ణ పరిభావన సిద్ధించు. నీప్రకారంబుగ
నాకుంచిత కంఠనిరోధం బొదవినప్పు డమృతం బగ్నియందుఁ
బడక స్వానుభూతికి లోకువై ప్రాణిని నిశ్చలానందంబు
నొందించు, నదియునుగాక.
| 112
|
సీ. |
వరయోగి యగువాఁడు వజ్రాసనమునుండి
నయ మొప్పగను వామనాడివలన
నాలోనఁ గుంభించినట్టి మారుతమును
మెల్లఁగ విడచి యామీఁద మఱల
దక్షిణనాడిచేతను వెలుపలివాయు
వును మెల్లఁగను లోని కొనరఁదీసి
యప్పుడు కేశనఖాగ్రపర్యంతంబు
నరికట్టి కుంభకం బచటఁ జేసి
|
|
తే. |
వామనాడిని విడువ నవ్వలఁ గపాల
శోధనం బగు శ్రమ వాతబాధ లడఁగు
గొమ్మ యిది సూర్యభేదనకుంభకంబు
కోరి వినుమింకఁ జెప్పెదఁ గుంభకంబు.
| 113
|
సీ. |
తగ నోరు బంధించి తసముక్కు క్రోవుల
నుంచి వాయువును బూరించి కంఠ
మున ధ్వని బుట్టించి మొనసి హృదబ్జంబు
దాఁక లోనికిఁ దీసి తనువునందుఁ
బ్రాణుని గుంభించి పరగ నిడానాడి
చేతను విడువఁగ శ్లేష్మహరము
|
|
|
నను జఠరాగ్ని మహావృద్ధియగు ధాతు
గతరోగములు సెడుఁ గ్రమముగాను
|
|
తే. |
నడచుచుండిన గూర్చుండి యనుదినంబు
గోప్యముగ నిట్టియజ్ఞాయు కుంభకంబు
క్రమముగను జేయఁదగును సీత్కార మనెడి
కుంభకం బేను జెప్పెదఁ గొమ్మ వినుము.
| 114
|
తే. |
వనిత నాసాపుటములచేఁ దనరుచుండఁ
బడినసీత్కార మనెడుకుంభకము ముఖము
నందుఁ జేయఁగ నిద్రయు నాఁకలియును
దెలియకుండును స్వచ్ఛందదేహుఁ డగుచు.
| 115
|
వ. |
అది యెట్లనిన నాడికచేతను జెక్కిళ్లచేతను వాయువును సదా
పానంబుసేయఁగ నతఁ డాఱునెలలకు రోగరహితుఁడై
యోగినీచక్రసమానశక్తిగలవాఁడై రెండవ వామదేవుం
డనఁదగియుండు నిది సీత్కారకుంభకం బగు నింక సీతళి
యనుగుంభకంబు చెప్పెద వినుము.
| 116
|
తే. |
యోగి రసనంబుచేత వాయువును మెల్లఁ
గాను బూరించి పూర్వప్రకారముగను
కుంభకము చేసి నాసికగోళములను
విడువ బహురోగబాధలు విడచిపోవు.
| 117
|
వ. |
ఇఁక భస్త్రికాకుంభకంబు చెప్పెదను. పద్మాసనాసీనుఁడై యుదర
గ్రీవంబు చక్కఁగ నిలిపి నోరు లెస్సఁగ మూసి ప్రాణవాయు
వును ముక్కుచేత వ్యాపింపఁజేసి వేగవిడిచి బ్రహ్మరంధ్ర
పర్యంతంబు వ్యాపించిన మేఘధ్వనితోడఁ గూడి వాయువును
హృదయపద్మపర్యంతం బించుకించుక నిండించి విడిచి మఱలఁ
|
|
|
బూరించి విడచి మఱియుఁ బూరించి రేచించుచుఁ గ్రమ్మఱఁ
గొలిమితిత్తు లూఁదినట్లు రేచించి పూరించుచు దేహమునం
దున్న వాయువును బుద్ధిచేతఁ జలింపఁజేయుచుండఁగ నెపు
డైన బడలిక పుట్టిన గాలిచేతఁ గడుపునిండిన సూర్యనాడివలన
వాయువును విడువఁగ బడలిక దీరును, గడుపును జులకనగు.
నపు డంగుష్ఠానామికలుచేత నాసికము బిగఁబట్టి వాయువును
గుంభించి యిడానాడిని విడచిన వాతపిత్తశ్లేష్మాదులు నశిం
పఁగ జఠరాగ్ని ప్రకాశించుచు సకలనాడులు విమోచనం
బగును. బ్రహ్మ విష్ణు రుద్ర గ్రంథులను భేదింపఁబడు. నిది
సుఖప్రదం బగు భస్త్రికాకుంభకం బిఁక భ్రమరికాకుంభకంబు
చెప్పెద వినుము.
| 118
|
క. |
పురుషమిళిందధ్వనివలె
నఱిముఱిఁ బూరించి భృంగి యానందముతో
నరుదుగఁ జేసిననాదము
కరణిని రేచింపవలయుఁ గ్రమముగ నెపుడున్.
| 119
|
క. |
ఈరీతి నభ్యసించిన
వారల కానందమూర్ఛ వరచిత్తమునన్
దారూఢిగ జనియించును
గౌరవమగు నిదియ భ్రమరికాకుంభకమౌ.
| 120
|
వ. |
ఇంక మూర్ఛాకుంభకంబును వివరించెద వినుము.
| 121
|
తే. |
రహిని బూరించి జాలంధరంబు నొలయఁ
బెట్టియుండ రసద్బోధ పుట్టిలోన
నిలిచి జీవుని బొక్కంచి నిండుచుండు
నది మనోమూర్ఛ యనుకుంభకాఖ్య వింటె.
| 122
|
వ. |
ఇంకఁ గేవల కుంభకవివరంబు వివరింతు వినుము. రేచక
పూరక కుంభకంబులు విడిచి స్వభావంబుగ మారుతధారణం
బొనర్చి నిజబోధానందమగ్నుఁడై చొక్కుటయ కేవల
కుభకం బగు. నీకుంభకం బభ్యసించుసిద్ధుఁ డైనవారికి
ద్రిలోకంబులయందు దుర్లభం బగుకార్యంబు లేదు. సర్వ
స్వతంత్రుఁ డై యుండు, నిట్టి హఠయోగంబు యమనియ
మాసనప్రాణాయామాద్యష్టాంగయోగ త్రిబంధాష్టకుంభక
ముద్రాది సాధనంబులచేత నీయోగంబు ద్వాదశాబ్దంబు
లభ్యసింప సిద్ధి యగు. నది యెట్లన, ప్రథమాబ్దంబునందు రోగ
రహితుండగు, ద్వితీయాబ్దంబునఁ గవిత్వంబు సెప్పుఁ, దృతీ
యాబ్దంబున విషజయుండగు, చతుర్థాబ్దంబున క్షుత్తృష్ణా
నిద్రాలస్యంబుల జయించు, పంచమాబ్దంబున వాక్సిద్ధి నొందు,
షష్ఠాబ్దంబున ఖడ్గాభేద్యుండగు, సప్తమాబ్దంబుస భూమి
నంటకుండు, నష్టమాబ్దంబున నణిమాద్యష్టైశ్వర్యసంపన్నుం
డగు, నవమాబ్దంబున నభోగమనుండగు, దశమాబ్దంబున
మనోవేగమునొందువాఁడగు, నేకాదశాబ్దంబున విశ్వవశ
త్వము గలవాఁడగు, ద్వాదశాబ్దమున సాక్షాదీశత్వంబు
నొందు, నిఁక హఠయోగంబు సూక్ష్మాంగయోగపూర్వకం
బుగ నభ్యసింపవలయు నదెట్లంటివేని వినుము.
| 123
|
సీ. |
ఆహారనిద్రాదు లాశేంద్రియవ్యాప్తు
లడఁచి శాంతతనొంద నది యమంబు
నిశ్చలగురుభక్తి నిస్సంశయము సుయో
గాసక్తి తృప్తి యేకాంతవాస
|
|
|
పరతయు వైరాగ్యభావంబుకరణ ని
గ్రహమును నియమంబు సహజసుఖము
నొసఁగు నాసనమందు నుండుట నిస్పృహ
త్వంబు నొందుటయు నాత్మను మనంబు
|
|
తే. |
నదిమి కుదిరించి నిల్పుట యాసనంబు
ప్రకటరేచకపూరకుంభకసమేత
మైసశ్వాసలలోనఁ బ్రయత్నముగను
గుదురఁ జేసిన యది రుద్ధగుంభక మగు.
| 124
|
వ. |
ప్రాణుని సుస్థిరంబుగ నిల్పి ప్రపంచం బనిత్యంబని తలంచు
టయు ప్రాణాయామం బగు. నంతర్ముఖం బైన నిర్మలచిత్తం
బునఃఁ జైతస్యజాలంబుల నడచుటయు బహుప్రకారంబులై
జనియించు మనోవికారంబుల నేర్పరించి ద్వికారగ్రాసనంబు
చేసి మనంబును నిర్వ్యాపారంబుగ నిల్పుటయు, ప్రత్యా
హారం బగుస్వస్వరూపానుసంధానభావంబుచే, ద్వితీయ
తారహతాత్మానుభవంబున సర్వప్రపంచంబు నాత్మగ నెఱింగి
సకలభూతదయాసమత్వంబున, నిత్యతృప్తిం జెందియుండుట
ధ్యానం బగు. నంతర్బాహ్యప్రకారం బేకంబుగ స్వతేజో
మయంబుగఁ బరత్వంబు నుద్దేశించి తదీయధారణంబుం
జేయుచుఁ జిత్తంబును జునిఁగిపోనీక నిల్పుటయ ధారణం
బగు. తద్ధారణాభ్యాసంబునఁ జిత్తం బేకాగ్రం బగునప్పుడు
జీవాత్మ పరమాత్మయందు జలశర్కరన్యాయంబుగఁ గలసి '
యఖండబోధ నొందుటయ సమాధి యగు. నిట్టి సూక్ష్మాష్టాం
గంబులం బ్రకాశించు నారాజయోగంబునకు లక్షణంబు
సందేశంబుగఁ జెప్పెద. నది హంసాక్షరసిద్ధాసనకేవలకుంభక
|
|
|
వాదములను నీనాల్గింటివలన రాజయోగం బొప్పు. నందు
సాంఖ్యతారకామసస్కము లనం ద్రివిధంబులు. నందు సాంఖ్య
యోగంబును వివరింతు.
| 125
|
సీ. |
పంచతన్మాత్రలు పంచభూతంబులు
పంచీకృతంబులై పరఁగుచుండు
సకలేంద్రియంబులు సర్వవిషయజాల
ములు గుణత్రయకామముఖవికార
ములుగాను దనువులు మూఁడునుగా నవ
స్థలుగాను దగనన్నుఁ దలఁచి యెఱుఁగు
నటువంటియెఱుక నేనని నిశ్చయించి వి
క్షేపావరణములఁ జిదిమివైచి
|
|
తే. |
తాను దనలోనఁ దనుదాను దఱచితఱచి
యన్నిటకు మీఁద శేషించి యచలవృత్తి
నుండుటది సాంఖ్యయోగమై యొప్పుచుండు
గురుముఖంబున నీయోగ మఱయవలయు.
| 126
|
వ. |
ఇఁకఁ దారకంబనునది యెఱింగింతు వినుము.
| 127
|
క. |
అఱగన్నులతో నైనను
మురువుగ నొగి రెండుకనులు మూసియు నైనన్
బరమాత్మను లోఁజూపున
గుఱిగా నీక్షింపవచ్చు గురుభక్తుండై.
| 128
|
తే. |
చంద్రసూర్యాంతరములందు సహజముగను
వెలుఁగుతారకములయందు విమలబిందు
వమరఁ గూర్పఁగ నది తారకాఖ్యయోగ
మై ప్రకాశించు లక్ష్యత్రయంబు నగుచు.
| 129
|
వ. |
అది బాహ్యమధ్యాంతర్లక్ష్యంబు లననొప్పు. నందు బాహ్య
లక్ష్యం బెట్లన బహిర్నాసికాగ్రావలోకనంబు మనోమారు
తంబులంగూడి స్థిరంబుగ నిల్ప నందుఁ జతురంగుళప్రమాణ
మున నైల్యమును, షడంగుళప్రమాణమున ధూమ్రమును,
నష్టాంగుళప్రమాణమున రక్తిమంబును, దశాంగుళప్రమాణ
మునఁ దనరంగ ప్రభయును, ద్వాదశాంగుళప్రమాణమునఁ
బీతప్రకాశంబు నగు. నీయైదుఁ బంచభూతవర్ణంబులై
యెదుటం దోచునప్పు డపాంగదృష్టుల వెనుకగూర్చి శీర్షము
మీఁదఁ జొనుపుచు నిశ్చలచిత్తుఁడై చూడ నందుఁ జంధ్ర
ప్రభ గానవచ్చు. నదియుంగాక.
| 130
|
తే. |
కర్ణనాసాపుటాక్షిమార్గముల వ్రేళ్ల
నమరఁ బీడించి చిత్తంబు నచట నిల్పఁ
బ్రణవనాదంబు వినవచ్చు ప్రకటదీప
కళలు నవరత్నకాంతులఁ గానవచ్చు.
| 131
|
వ. |
ఇది యాత్మప్రత్యయప్రకాశంబైన బహిర్లక్ష్యంబు నగు. నింక
మధ్యలక్ష్యవిధం బెట్లన.
| 132
|
తే. |
కంటిపాపల రెంటిని గదలనీక
మానసముతోడ భ్రూయుగమధ్యమునను
జొన్పి తన్మధ్యముననుండు సూక్ష్మబిలము
లోఁ బ్రవేశించి చూడ నాలోన నపుడు.
| 133
|
క. |
మెఱపులు నక్షత్రంబులు
తరణి శశిప్రభలు భూతతతి వర్ణములున్
గరువలి నెనయుచు లోపలఁ
బరిపరివిధములుగ మెఱయు భావములోనన్.
| 134
|
వ. |
మఱియు నిరవధికం బగునాకాశంబును గాఢాంధకారం
బైనమహాకాశంబును కాలాగ్నినిభం బైన పరాకాశంబును
నధికప్రకాశం బైన తత్వాకాశంబును గోటిభానుసంకాశం
జైన సూర్యాకాశంబును నగు నియ్యాకాశపంచకంబు
నవలోకించు నతండు తన్మయుండై నిరవకాశాకాశసదృశుం
డగు. నిది మధ్యలక్ష్యం బగు. నిఁక నంతర్లక్ష్యం బెట్లనిన.
| 135
|
క. |
ఆపావకచంద్రార్క
వ్యాపకమై పంచభూతవర్ణకలితమై
యాపోజ్యోతిరసం బిల
రూపాశ్రయ మగుచునుండు రూఢప్రజ్ఞన్.
| 136
|
క. |
చక్షుర్మధ్యంబునఁ బర
మాక్షరహైరణ్యసచ్చిదమృతకణంబుల్
సాక్షిగ బాహ్యాంతరముల
నీక్షించుచు నిత్యసుఖము నెనయుచునుండున్.
| 137
|
క. |
ఆయమృతాంకురయుగళము
నాయకమై స్ఫటికరుచుల నైల్యంబుగ సు
ఛ్ఛాయల మెఱయుచుఁ బవన
స్థాయిని నెలవగుచు జీవతారక మయ్యెన్.
| 138
|
వ. |
ఈరహస్యంబు సద్గురూపదేశక్రమంబుగ నెఱిఁగి బాహ్యాంత
రంబులకు నడిమి శృంగాటకంబునం దాకారదీపితరగ్రనీవార
శూకాణు వగు సగుణపంచకంబు నీక్షించుట తారకాంత
ర్లక్ష్యుం బగు. నదియును గాక సరస్వతీనాడి చంద్రప్రభానిభం
బై మూలకందంబునం దుండి దీర్ఘాస్థిమధ్యంబున బిసతంతు
కైవడి విద్యుత్కోటిసంకాశంబై బ్రహ్మరంధ్రపర్యంతంబు
|
|
|
వ్యాపించి యూర్ధ్వగామినియై సర్వసిద్ధిప్రదయగు తత్స్వ
రూపంబు నాత్మయందు భావించుచు ఫాలోర్ధ్వకోల్లాట
మండలంబున స్వస్వరూపమునందు లక్ష్యం బుంచి చూచుట
పరమాంతర్లక్ష్యం బగు. నివ్విధంబున.
| 139
|
మ. |
అనిశంబున్ భవతారకాఖ్య వరయోగాభ్యాసముం జేయఁగా
మనము న్మారుత మంతరంగమున మర్మజ్ఞత్వముం బొందు నం
దనుకూలం బగు నంతరాత్మ పరమాత్మానందముం బొందు నిం
కొనరంగా నమనస్కయోగవిధము న్నుత్సాహియై చెప్పెదన్.
| 140
|
సీ. |
ఆత్మాశ్రయములగు నలహంసమార్గంబు
లకుఁ గుడియెడమల లలితనీల
కాంతులగు నుదకద్యోతులందు భా
స్వతరదర్పణచ్ఛాయ లమర
వెలుఁగఁగఁ దన్మధ్యములయందు సూక్ష్మత
సూక్ష్మంబు లైనట్టి సుషిరములను
మానసంబున నిల్ప మాని యంతర్లక్ష్య
మును బాహ్యదృష్టు లమ్ముల ఘటించు
|
|
తే. |
నదియ ఘనశాంభవీముద్ర యగుచునుండు
రెండుజాములదనుక కూర్చుండి దీని
నభ్యసింపంగ మానసం బనిలగతుల
నిలుచు నేకాగ్రభావము నిలుచునపుడు.
| 141
|
సీ. |
వినుకుల బలుకుల న్వివిధచిత్రములైన
తలఁపులు తనయంద నిలుపుకొంచు
నట పరమాత్మయం దంతరాత్మను గూర్చి
తా నంద లీనమై తనరి వాత
|
|
|
దీపంబుకైవడిఁ దేజరిల్లుచు నిస్త
రంగాబ్ధివలె నంతరంగమందు
గనఁ డొకరూపంబు వినఁ డొకశబ్దంబు
మొనసిన ఖేచరిముద్ర నంటి
|
|
తే. |
యచలితానందరసమగ్నుఁ డగుచుఁ జొక్కి
వరమనోన్మణియు న్మధ్యవస్థ లొంది
చలనరహితామనస్కంబజాడ్యనిద్ర
యోగనిద్రయు నారాజయోగి పొందు.
| 142
|
వ. |
అట్టి రాజయోగికి జాగ్రత్స్వప్నసుషుప్తితుర్యాతుర్యాతీ
తంబులను పంచావస్థలు గలవు. చతుర్వింశతితత్వాత్మకంబైన
దేహంబు తాఁగానని పంచవింశకుం డైనదేహి తానని తెలిసి
నది జాగ్రత్త యగు. మనంబు నింద్రియబృందంబుతో నాత్మ
యందుఁ బొందించి ధ్యానింప నమ్మనంబు సర్వవిషయవాసనా
సంగరహితమై బాహ్యాంతరంబుల మెలఁగు. కేవలబహిర్ము
ఖంబుగాక తన్నుఁ దాను దనరుచుండుట స్వప్నం బగు. నిది
యభ్యసించుచున్న మనంబు బాహ్యమునందు విస్తరిల్లక
సుస్థిరంబై మాయాజాలం బనిత్యం బని సత్యవస్తువందుఁ
బొందుచున్నప్డు బహిర్జ్ఞప్తి వచ్చినం దెప్పున నంతర్ముఖంబై జగం
బనిత్యంబుగ నాత్మ సత్యంబుగ నెఱింగి నిత్యబోధ నొంది
యుండుట సుషుప్తి యగు. జీవేశ్వరభావంబుల నొందునాత్మ
యందు నిల్చిన మనంబు బాహ్యభావనారహితంబై పరంబును
భావించు. నిట్లు పురుషపురుషోత్తమభావంబు లన, నుభ
యాత్మకం బైన చైతన్యంబునం బొంది యమ్మనంబు విషయవాస
నావిముఖంబై సర్వేంద్రియవ్యాప్తులతోడ దేహాభిమా
|
|
|
నంబు విడిచి ముక్తిమార్గంబున సంసారబంధవిముక్తమై
యాత్మానుభవామృతపానంబునం జొక్కి తన్మయంబై స్వతం
త్రతఁ బాసి యాత్మ పరతంత్రం బగుచుండు. నంత జీవుం డస్వ
తంత్రుఁడై యీశ్వరాధీనుం డగుచు నుండఁగ నీశ్వరభావంబు
సత్యం బగునప్పుడు సర్వమయుండైన పరమేశ్వరునియందు
మనం బుపరతం బగుచుండునపు డాత్మ యెందాక మనో
దృశ్యం బగు నందాక మనోన్మని యగునప్పుడు ద్రష్టృదృశ్యం
బులు లేక తాను దానై ధ్యానవిరహితంబై చిన్మాత్రం బైన
యెఱుక తాన సత్తామాత్రం బగుచుండు. నప్పుడు మనంబు
కలదు లే దనరాకుండు, నది యున్మన్యవస్థ యైనతుర్యం బగు.
నది స్వరాట్టనుపరమపదంబు నగుచుండు, నందు సహజంబుగ
మానసంబు సకలేంద్రియప్రాణానిలంబులతోడ లీనం బగు.
నది యమనస్కంబైన తుర్యాతీతం బగుచుండు. కలదు లే దన
రానిదై ఘటాకాశంబు మహాకాశంబునం బొందిన ట్లేకంబై
దేశకాలకార్యకర్తృకారణగురుత్వలఘుత్వాద్యవస్థలు
తోఁపకుండునది సహజామనస్కం బగు. పట్టు విడుపు లేనిదై
చెప్పఁజూపరాక సహజభావంబైయున్నయదియ జాడ్యనిద్ర
యగు. కడఁ గనరాని నిస్తరంగసముద్రంబుతెఱంగున నాద్యం
తరహితంబైన నభంబుకరణి నింతంతనరాక యంతయు నిండి
మలయజగంధంబును, వృక్షంబునం దనలంబును, నిక్షుదండంబు
నందు మాధుర్యంబును, క్షీరంబునందు ఘృతంబును, దిలల
యందుఁ దైలంబు నెట్లుండు నట్లు చరాచరప్రపంచంబునందుఁ
బరమాత్మ పరిపూర్ణంబై, యిదమిత్థ మనరాకుండు టది
యోగనిద్ర యగు. నిది యెంతంత సాధనకు ననుభవంబుగ
|
|
|
ననుభవించినయోగికి ననుభవైకవేద్యం బగుంగాని వాక్కునఁ
జెప్పఁగూడ దది యెట్లంటివేని.
| 143
|
శా. |
బ్రహ్మం బద్వయవస్తువౌ ననెడుశాస్త్రం బెప్పుడుం బల్కుచున్
బ్రహ్మాహ మ్మనునంతమాత్రముననే బ్రహ్మంబు గానేర్చునే
బ్రహ్మంబైన గురుస్వరూపము మదిన్ భావించి భావించి తా
బ్రహ్మం బైనటువంటికాలముననే బ్రహ్మం బనంగూడునే.
| 144
|
వ. |
ఇ ట్లవాఙ్మానసగోచరం బైనబ్రహ్మానుభవంబు రాజయోగం
బగు. ముందు చెప్పిన మంత్రలయాదియోగంబుల యనుభవ
క్రమం బెట్లనిన.
| 145
|
సీ. |
మంత్రయోగంబుచే మారుతసంచార
దేహమర్మంబులఁ దెలియవచ్చు
లయముచేఁ దనలోని లలితప్రణవనాద
సూత్రంబు మది నూని చొక్కవచ్చు
హఠముచే జ్వరజరత్వాదిరోగంబులు
మృత్యువుం గెలిచి మేల్మించవచ్చు
సాంఖ్యయోగంబుచే సకలేంద్రియవ్యాప్తు
లరయుచుఁ దన్ను దా నరయవచ్చు
|
|
తే. |
తారకముచేతఁ దనువునఁ దాను వెలుఁగు
చున్నరీతిని గనవచ్చు నుచితమైన
రాజయోగంబుచేఁ బరబ్రహ్మమందుఁ
బొంది యుండఁగవచ్చు సంపూర్ణుఁ డగుచు.
| 146
|
సీ. |
విను మంత్రయోగికన్నను గొప్ప లయయోగి
లయయోగి కధికుఁ డుల్లాసియైన
|
|
|
హఠయోగి యగుచుండు హఠయోగికన్నను
సరసమానసుఁడైన సాంఖ్యయోగి
యధికుఁడ యగు వానికన్నఁ దారకయోగి
యధికుండు నగు వానికన్న నెంచ
సాంఖ్యతారకముల సంగ్రహించుకొని వై
రాగ్యభావన నొప్పు రాజయోగి
|
|
తే. |
యుత్తమోత్తముఁడని చెప్ప నొప్పు నతని
కన్న గొప్పైనయోగి లేఁ డవనియందు
నతఁడు సంసారమున నున్న నడని నున్న
సకలనిర్లేపుఁ డగుచుండు శాంతుఁ డగుచు.
| 147
|
వ. |
ఆరాజయోగివరునిలక్షణంబు లెవ్వి యనిన.
| 148
|
సీ. |
తనుకాంతియును మృదుత్వంబు వాఙ్మాధుర్య
మును మితభాషణంబులును భూత
దయయు వివేకశాంతములు మితాహార
మును నిశ్చలమనంబు ముఖ్యమైత్రి
గలవాఁడు రాజయోగసునిష్ఠుఁ డంబర
మధ్యస్థకలశంబుమాడ్కి లోన
వెలి నెందు నంటక వెల్గు నంబుధిమధ్య
గతకలశమురీతిగాను లోను
|
|
తే. |
వెలిని బరిపూర్ణుఁడై నిండి వెలుఁగుచుండు
వాఁడు నొకవేళ సంసారివలె నటించు
నొనరు నొకవేళ వైరాగ్య మొందుచుండు
వానియనుభవ మెఱుఁగ రెవ్వారు ధరణి.
| 149
|
క. |
ధర్మాధర్మము లొల్లక
కళాసక్తుండు గాక కా దౌ ననకన్
నిర్మలభావుం డగుచును
మర్మజ్ఞత నతఁడు మెలఁగు మనుజులలోనన్.
| 150
|
క. |
ప్రాజ్ఞుండై దేహముతో
నజ్ఞానులయందు మెలఁగు నందున నాయో
గజ్ఞుని మదిఁ దెలియకఁ గని
యజ్ఞానులు నిందఁ జేతు రాగతి నోలిన్.
| 151
|
తే. |
దూషణము సేయువారికిఁ దొల్లి యతఁడు
చేసియుండిన పాపము చెందుచుండు
భూషణము సేయువారికి బుణ్యఫలము
నపుడు పొందఁగ నిర్లేపుఁ డగుచు నతఁడు.
| 152
|
సీ. |
పెద్దవన్న నహంబుఁ బెంచి వల్కఁడు చిన్న
వనినఁ దగ్గఁడు భాగ్య మతిశయముగఁ
గల్గిన నుప్పొంగి గర్వింపఁ డొకవేళ
దనకు లేవడియైనఁ దగ్గిపోఁడు
ప్రారబ్ధ మనుభవింపక తీరదని యస
హ్యముగ దుఃఖసుఖంబు లనుభవించు
నమ్రపత్రంబున నంటనిజలబిందు
వట్ల సంసారము నంటకుండు
|
|
తే. |
జగతిగల బంధమూలంబు దెగినదాని
వచ్చి కొన్నాళ్లు నిలిచినపగిది దేహ
మూలమగుగారణావిద్య మొదలుతెగిన
నాయు వనుపచ్చియున్ననా ళ్లంగముండు.
| 153
|
చ. |
అటువలెఁ గారణంబు తెగినప్పటికైనను గార్యజాలవి
స్ఫుటతనుయుగ్మముండు పరిపూర్ణచిదాత్ము వికారిగాక త
ద్ఘటముల నాశ్రయించి గుణకర్మములం దెపు డంటియంటకన్
నటలని రోసి యెన్నటికి సాక్షిగ నుండు సుఖస్వరూపమై.
| 164
|
సీ. |
అలబుద్ధియును జిత్త మాయహంకృతి మాన
సంబును ఋత్విగ్గణంబు గాఁగఁ
బ్రణవవర్ణంబు యూపస్తంభమును గాఁగఁ
బ్రాణదశేంద్రియపంక్తి యచట
పశుసమూహము గాఁగ భాసురానాహత
నాదంబు మంత్రముగాఁ దనరఁగఁ
బొసఁగఁ దత్పశువుల బోధాగ్నిలో వ్రేల్చి
జ్ఞానామృతము సోమపానముగను
|
|
తే. |
ద్రావి చొక్కుచు మోక్షకాంతాసమేతుఁ
డగుచు వేదాంతసూత్రంబు లనెడుకర్ణ
కుండలంబులు వెలుఁగఁ ద్రికూటమార్గ
మందు శాంతప్రముఖమిత్రు లలరి కొలువ.
| 155
|
సీ. |
ప్రకటితాచారము ల్బండికమ్ములు గాఁగ
శమదమాదులు సుచక్రములు గాఁగఁ
బ్రాణపంచకము నేర్పడ గాడి గాఁగ న
నూనహృద్వచనంబు నొగయుఁ గాఁగ
వరకర్ణనేత్రము ల్వాహనంబులు గాఁగఁ
రహి వివేకంబు సారథియుఁ గాఁగఁ
దగు నిష్క్రయత్వమే త్యాగధ్వజము గాఁగఁ
బ్రబలయోగరథంబుపైన నెక్కి
|
|
తే. |
పోయి నడిమి సరస్వతిం బొంది గంగ
యమునయును నిల్చు నాల్గుమార్గములనడుమ
నవబృథస్నాన మొనరించి యాత్మ సోమ
యాజి యన నొప్పుచుండు నీయవనిమీఁద.
| 156
|
ఉ. |
ఇంతటి యోగపూరుషుఁడు హెచ్చఁడు తగ్గఁడు సంతసంబు నే
కాంతమున న్వసించుఁ దనయందుఁ బరాత్మను జూచుచుండు వి
బ్రాంతులు దన్నుఁ దిట్టినను బక్కునఁ దిట్టఁడు నాలి నెప్పు డీ
శాంతుఁడు రాజయోగి సుఖసద్గురుఁ డంచు వచింపఁగాఁదగున్.
| 157
|
సీ. |
అటువంటి దేశికుం డిటువంటి యోగంబు
నింతింత శిష్యుస కీయరాదు
శిక్షించి కాంతిఁ బరీక్షించి తనశిక్ష
కొప్పినవారికిఁ జెప్పవలయుఁ
దనశిక్ష కొప్పని తామసాత్మునకుఁ ద
త్వంబు చెప్పినవాఁడు దంభుఁ డగుచు
వేషభాషలచేత విఱ్ఱవీఁగుట గాని
వాఁడు తత్వజ్ఞుఁడు గాఁడు గనుక
|
|
తే. |
తొలుతనే శిష్యుఁడగువానిదుర్గుణములఁ
జూచి తిట్టుచుఁ గొట్టుచు సుగుణములను
జెప్పఁగావలెఁ దనశిక్ష కొప్పుకొన్న
నూరకయ శాంతిఁ బొంది తా నుండవలెను.
| 158
|
తే. |
అంతియే కాని దుర్గుణుండైనవానిఁ
దాఁ బరీక్షింప శిక్షింపఁదలఁచెనేని
వానిదుర్మార్గములు తనమానసమున
నిలిచి కోపము పుట్టించి నిక్కముగను.
| 159
|
క. |
కోపం బెవ్వనికైనను
దాపము పుట్టించుఁ గనుక దామసశిష్యుం
బ్రాపునకుఁ జేర్పఁదగ దొగిఁ
దాపత్రయహేతు వగును దనశాంతి సెడున్.
| 160
|
క. |
దుర్గుణములు విడువక ష
డ్వర్గంబును గూడినట్టివాఁ డతిశయదు
ర్మార్గుం డగు వైరాగ్యము
భర్గుఁడు సెప్పినను వాఁడు పట్టుగ వినునే.
| 161
|
వ. |
ఇంక సచ్ఛిష్యుఁ డెవ్వడనిన సాధనచతుష్టయసంపన్నుఁడై
వంచన లేక జారచోరక్రూరగుణంబులు విడచి పరమశాంతి
గలవాఁడై మోక్షాసక్తుఁడై గురుసేవఁ జేసి తగ్గురువను
గ్రహంబునకుఁ బాత్రుఁ డైనవాఁడు దేహాభిమానంబు విడచి
ప్రణవపూర్వకంబుగ వేంకటేశానుస్మరణంబు సేయుచు నిజ
యోగబలంబున సుషుమ్నద్వారంబు భేదించుకొని యర్చాది
మార్గంబునం జని పరంబును జెందునట్టి యోగాభ్యాసంబు
సేయలేకున్న నత్యంకగురుభక్తి గలవాఁడై తత్కటాక్షం
బున భక్తిజ్ఞానవైరాగ్యమున నభ్యసించి యుపశాంతిఁ బొంది
జ్ఞానినని యహంకారంబు నొందక యుండవలయు నదెట్లన.
| 162
|
క. |
జ్ఞానాహంకారంబే
మానవులను జెఱుచుఁగాన మతిమంతులు తత్
జ్ఞానాహంకారంబును
మానుచు నుపశాంతు లగుట మంచిది కాదే.
| 163
|
క. |
ఉపశాంతి లేనిమనుజుల
జపతపములు యోగవిధులు సవనాదు లొగిం
|
|
|
గపటములై సెడుఁ గావున
నుపశాంతియ పరమధర్మ ముర్వీస్థలిలోన్.
| 164
|
వ. |
ఇట్టి జ్ఞానభక్తివైరాగ్యయోగంబులకు ననేకవిఘ్నంబులు
గలుగుచుండు. తద్విఘ్ననివారణంబగుట కొక్కయుపా
యాంతరంబు గల. దదెట్లనిన. "వేంకటాద్రియందు సనకసనం
దనతీర్థం బతిగోప్యంబు, నరులకుఁ దెలియరాకుండు, తత్స
మీపంబునఁ బాపవినాశతీర్థతీరంబు సిద్ధస్థలం బైయుండు,
మార్గశీర్షశుద్ధద్వాదశిదినం బరుణోదయకాలంబున స్వామి
పుష్కరిణీస్నానంబు సేయుచుం ద్రయోదశిదినంబు మొదలు
కొని సనకసనందనతీర్థంబునం గ్రుంకుచు శ్రీ వేంకటేశ్వరుని
దర్శనంబు సేయుచు శ్రీమదష్టాక్షరిమంత్రజపంబుఁ జేయుచు
యోగాభ్యాసంబు సేయుచున్న నెట్టివిఘ్నంబులు రానోపవు,
యోగంబులు సిద్ధించు. పాపవినాశతీర్థసమీపంబున నతి
గుప్తంబైన కాయరసాయనం బనుపుణ్యతీర్థంబు గలదు.
తత్తీర్థంబు పానంబు చేసిన దేహంబు దృఢత్వంబు నొందు.
శ్రీ వేంకటేశ్వరుని కైంకర్యంబు సేయుట పురుషార్ధం బగు. నట్టి
కైంకర్యంబు శక్తివంచకుండై సేయకుండిన స్వామిద్రోహి
యనందగుం గావున ననిశంబు వేంకటేశుని నారాధింపవలయు
నని వరాహస్వామి భూదేవి కుపదేశించినక్రమంబు వ్యాస
మునీంద్రుడు తెలిసి తదుపదేశక్రమంబు నానతిచ్చె. నారీతి
మీకుం జెప్పితి, ననిన సూతుం జూచి శౌనకాదు లిట్లనిరి.
| 165
|
ఉ. |
సూత మహానుభావ పరిశుద్ధములై తగుయోగమర్మముల్
ఖ్యాతిగ భూమిదేవికి నఖండకృపం గిటి సెప్పఁగా నతి
|
|
|
ప్రీతిని బాదరాయణుఁడు పెంపు వహించి గ్రహించినట్టి వా
గ్వ్రాతము నీకుఁ జెప్పుటను వాసిగఁ జెప్పితి వీవు మాకొగిన్.
| 166
|
సీ. |
సంతోషమయ్యె వేదాంతవేద్యుండైన
వేంకటేశార్చనావిభవములను
మాకుఁ దెల్పుమటన్న మది సంతసించి యా
సూతుఁ డిట్లనియె సంప్రీతి మెఱయ
ననఘాత్ములార మీ రడిగినవిధముగ
ఘనుఁడైన శేషుని కపిలగురుఁడు
ముదముమై నడుగ నిమ్ముగ శేషుఁ డనె నిట్లు
మునినాథ విను మది మోదమునను
|
|
తే. |
గురుతరంబు హరిప్రీతికరము పరమ
కోపదూరము పరితాపపాపహరము
రమ్య మష్టోత్తరశతంబు కామ్యఫలద
మగుచు దీపించు నది యెట్టులనిన వినుఁడు.
| 167
|
తే. |
స్వర్ణనదిఁ బుట్టినట్టి సువర్ణకమల
జాలమును దెచ్చి వేంకటేశ్వరుని బ్రహ్మ
దేవుఁ డష్టోత్తరశతంబు నై వెలుంగ
నామములఁ బూజచేసె సానందుఁ డగుచు.
| 168
|
తే. |
స్వామిచే సర్వలోకపితామహుండు
సకలకామ్యార్థముల నంది సంతసించె
నట్టి యష్టోత్తరశతంబు నైన నామ
ములఁ బఠించుట కెవరైన ముందుగాను.
| 169
|
వ. |
ప్రణవపూర్వకంబుగ శ్రీ వేంకటేశాష్టాక్షరీమంత్రరాజంబు
న్యాసయుక్తంబుగ జపంబొనర్చి హరికి సమర్పించి తదనంత
|
|
|
రంబు ధ్యానావాహనార్ఘ్యపాద్యాచమనస్నానవస్త్రయజ్ఞోప
వీతగంధాక్షతపుష్పాదులు సమర్పించి, వేంకటేశాష్టాక్షరి
మంత్రంబు జపించి యష్టోత్తరశతనామంబుల నర్చించుచుఁ
బాదాదిశీర్షపర్యంతంబుగ సర్వాంగార్చనంబు సేసి ధూపదీప
నైవేద్యతాంబూలసువర్ణపుష్పకర్పూరనీరాజనమంత్రపుష్ప
ప్రదక్షిణనమస్కా రంబులు సమర్పించుచుఁ దదైశధ్యాననిష్ఠుం
డైనభక్తునకు నావేంకటేశ్వరుండు ప్రసన్నుండై యైహికా
ముష్మికఫలంబుల నిచ్చు. నీయష్టోత్తరశతం బత్యంతగోప్యంబు
నగు శ్రద్ధాభక్తులు గలవాఁడై గురువిశ్వాసంబు గల్గి తద్గురు
ముఖంబుగఁ దెలిసి పఠించినవాఁడు కృతార్థుం డగు నంచుఁ
జెప్పెనని సూతుండు శౌనకాదులతో వెండియు సంతోషా
యత్తచిత్తంబు మెఱయ నిట్లనియె.
| 170
|
చ. |
కపిలమునీశ్వరుం డడుగఁగా మును శేషుఁడు సమ్మతించి ని
ష్కపటముగాను దత్క్రమము కర్దమపుత్త్రున కొప్పఁ జెప్పె నా
కపరిమితప్రభావుఁ డగు నాకపిలుం డుపదేశ మిచ్చె మీ
కిపు డెఱిఁగించితిన్ వరమునీశ్వరులార తదీయగోప్యమున్.
| 171
|
క. |
ఈయష్టోత్తరశతమును
బాయని సద్భక్తితోడఁ బారాయణముం
జేయు సుసాత్వికులకు వే
యా యహిగిరివాసుఁ డిచ్చు నవ్యయపదమున్.
| 172
|
నైమిశారణ్యమునుండి మునులు వేంకటాద్రికి వచ్చుట
చ. |
అన విని శౌనకాదులు మహాద్భుత మందుచు వేంకటేశ్వరుం
గనుఁగొన నిశ్చయించుచు నఖండతరం బగుభక్తిచేత నే
|
|
|
మనుటకుఁ దోఁపకున్న విధ మప్పుడు సూతుఁడు చూచి యిట్లనెన్
మునివరులార మీ కిపుడు ముఖ్యముగా నిఁక నేమి చెప్పుదున్.
| 173
|
వ. |
మీరెల్ల రావేంకటగిరి కరిగి యం దుండుట జన్మపావనంబు
లనిన నమ్మునులు.
| 174
|
క. |
విని మాశ్రవణంబులు తృ
ప్తిని బొందెను సూత నీవు ప్రియమున శేషా
ద్రినిగూర్చి చెప్పినందునఁ
గనుఁగొనఁ బోయెదను వేడ్కఁ గదలి దయాలా.
| 175
|
మ. |
అని యమ్మౌనులు వల్క సూతుఁడు మునీంద్రాళి న్విలోకించి యి
ట్లనియెం దాపసులార! మీ రిచట నిం కాలస్యము జేయకన్
జని యా వేంకటశైలశృంగముల నాశ్చర్యంబుగాఁ జూచి యం
దొనరన్ శేషగిరీశ్వరుం గనుఁడు పొం డుత్సాహ ముప్పొంగఁగన్.
| 176
|
మ. |
అని యాసూతుఁడు వేంకటాద్రివిభవం బాశ్రీనివాసోన్నతం
బును స్వామిత్వము నొందుతీర్థమహిమంబుల్ భూవరాహాఖ్య నొం
దిన నారాయణచిహ్నము ల్మఱియుఁ దద్దివ్యప్రభావంబులున్
వినికింప న్విని సంయము ల్చెలఁగి యవ్వేళం బ్రయాణం బొగిన్.
| 177
|
సీ. |
గౌతమజాబాలికశ్యపాంగీరస
శ్రీవత్సకౌత్సమైత్రేయపులహ
కణ్వగార్గేయమృకండుభరద్వాజ
కౌశికదేవలక్రతుపులస్త్య
ముఖ్యులైనట్టి సన్మునులంద రానైమి
శాటవి వదలి మేలైన గంగ
|
|
|
సాన్నిధ్యముం జేరి స్నానంబు లొనరించి
యటఁ జని గౌతమియందుఁ గృష్ణ
|
|
తే. |
వేణియందును గ్రుంకి యావిమలపథము
నందుఁ గల పుణ్యతీర్థములందుఁ గ్రుంకు
లిడుచు సద్భక్తితో వేంకటేశుఁ జూచు
వాంఛతో వచ్చి రమ్మునివర్యు లెల్ల.
| 178
|
వ. |
శ్రీమద్వేంకటగిరికి ప్రదక్షిణంబుగఁ గపిలతీర్థంబునకు వచ్చి
తత్ప్రముఖంబులైన పుణ్యతీర్థంబులయందు స్నానాదు లొనర్చి
వేంకటాచలారోహణంబు చేసి మేరుగిరితుల్యంబులై సువర్ణ
ప్రభ లొప్పుచున్న శృంగసమూహంబులును, నవరత్నప్రభా
భాసితంబైన సానుదేశంబులును, ఫలపుష్పభరితంబులైన
పావనవృక్షసందోహవిరాజితంబును, గంగానిభంబులైన
నైర్మల్యతీర్థంబులును, శుకపికకలకంఠమరాళమయూర
ప్రముఖనిహంగనికరకోలాహలంబును, కంఠీరవవ్యాఘ్ర
వరాహమదేభభల్లూకమహిషోరగప్రముఖనానాసత్వసంతా
నంబును గరుడగంధర్వకిన్నరాదిదేవగణనివాసంబును
గన్నులపండువుగం జూచుచు సామగానంబు లొనరించుచు
వచ్చి యప్రాకృతజలపూరితంబును, కనకకమలకల్హారకైరవ
నిచయవిరాజితం బగు స్వామిపుష్కరిణిని దర్శనం బొనర్చి
సభామండపంబున నిలిచి శ్రీ వేంకటేశ్వరుదర్శనంబు సేసి
మ్రొక్కులిడి పులకాంకితశరీరులై యానందబాష్పధారాపరి
పూరితనేత్రంబులు గలవారై గద్గదకంఠంబుల ననేకవిధంబు
నుతించి యనంతరంబున.
| 179
|
సీ. |
శ్రీనివాసుని జూచి యానందపరవశు
లై జడ ల్జీరాడ నాడియాడి
యిదమిత్థ మననేర కెనలేనిముదమున
నిందిరేశునిచెంత నెగిరియెగిరి
భక్తియుక్తావేశభరితాత్ములై యప్డు
చక్కఁగఁ జిందులు త్రొక్కిత్రొక్కి
ఘనపదక్రమజటకలితస్వరంబుల
సకలవేదంబులఁ జదివిచదివి
|
|
తే. |
నిలిచి యానందదుగ్ధాబ్ది నెమ్మి మునిఁగి
శ్రీనివాసునిరూపంబుఁ బ్రియము గదురఁ
గనులఁబండువుగం జూచి మనము లచట
మగ్నము లొనర్చి రెంతయు మౌనివరులు.
| 180
|
క. |
అష్టోత్తరశతనామము
లిష్టంబుల నుచ్చరించి హేమాబ్జములన్
సృష్టిస్థితికారణు నా
శిష్టులు పూజించి రమలచిత్తము లలరన్.
| 181
|
సీ. |
అప్పుడు కోటీసూర్యప్రకాశుండును
నాజానుబాహుండు నచ్యుతుండు
పరిపూర్ణచంద్రబింబసమానవదనుండు
మందస్మితాస్యుండు మాధవుండు
లలితమౌ మకరకుండలకర్ణయుగళుండు
మణికిరీటోజ్జ్వలమస్తకుండు
శ్రీవత్సలాంఛనాంచితభవ్యవక్షుండు
లలితపీతాంబరాలంకృతుండు
|
|
తే. |
శంఖచక్రధరుండు సజ్జలజపత్ర
లోచనుండు పరాత్ముండు లోకకర్త
యైన నారాయణుండు దయాంతరంగుఁ
డగుచు నమ్మునులను జూచి యనియె నిట్లు.
| 182
|
చ. |
మునివరులార! మీ రిటకు మోదముతో నను జూడవచ్చి నం
దునఁ గడుభక్తిపూర్ణులని తోఁచిన దిప్డు వరంబు లేమి యి
త్తును దగఁ దెల్పుఁ డర్థిమెయి దూరము వచ్చితి రంచు బల్కఁగా
విని మునిపుంగవు ల్గనుచు వేంకటనాథుని వేఁడు చొప్పుచున్.
| 183
|
సీ. |
పలికి రిట్లని పరబ్రహ్మస్వరూప వా
ఙ్మానసాతీతుఁడ వైననీవు
వైకుంఠముననుండి వచ్చి వేంకటగిరి
యందున్న నిన్ను మే మనిశ మాత్మ
లను జూచుచుందుము తనత నాదివ్యమం
గళవిగ్రహం బిప్డు గంటి మిందు
నలరు చర్మాక్షుల నంతియఁ జాలు మా
కొక్కవరం బేల నిక్కముగను
|
|
తే. |
గరుణమై మోక్షమార్గంబు గాంచి యిమ్ము
వేయివరములు మాకేల వేంకటేశ
యనఁగ నా శ్రీనివాసుఁ డమ్మునులఁ జూచి
దహసితాననుఁడై వల్కె దయ యెసంగ.
| 184
|
మ. |
మునులారా! పరిపూర్ణకాములు మహాముఖ్యు ల్జగత్పావనుల్
తనర న్మీరు వరంబు లొల్లమని నిత్యానందముం బొందినం
దున సంతోషము నొందితిం బరమశాంతు ల్మీకుఁ గామ్యార్థముల్
|
|
|
పనిలే దాత్మల మద్గుణానుభవమే పాటింపుఁ డశ్రాంతమున్.
| 185
|
క. |
మీమనముల నేఁ దెలియుట
కై మేటివరంబు లడుగుఁ డంటిని మీని
ష్కామత్వము గంటిని మీ
కీమీదట మత్పదంబు నిచ్చెద ప్రీతిన్.
| 186
|
క. |
ఘనతరకామ్యార్థములను
మనుజుల కొసఁగుచును విపులమహిమాఢ్యుఁడ నై
యనుపమఘనబ్రహ్మోత్సవ
మొనరఁగ నంగీకరించుచుండెద నిచటన్.
| 187
|
సీ. |
మొనసి కన్యామాసమున మహోత్సవ మందు
నాకజుఁ డొనరించినాఁడు గనుక
వానిసంకల్పంబుఁ బూనికతో వృద్ధి
బొందింపఁదలఁచి యీభూప్రజలను
గొండకు రప్పించి కోరిక ల్వెస నిచ్చి
యఖిలవైభవము లిం దనుభవింతు
నిట్టి నాలీలలఁ బట్టుగఁ దలఁచుచు
భజన సేయుచునుండు భక్తజనులు
|
|
తే. |
దూరమున నున్న దగ్గఱఁ జేరియున్న
వారి కిష్టార్థముల నిచ్చి వారివాఁడ
నగుచు రక్షించుచుండుదు సంతమునను
బుణ్యగతి నిత్తు నిశ్చయంబుగను వినుఁడు.
| 188
|
క. |
అని హరి పల్కినపల్కులు
విని ముదమును మీరి మౌనివీరులు చక్రిన్
|
|
|
వినుతించుచుఁ బంచాబ్దము
లొనరఁగ శేషాద్రియందు నుండిరి వేడ్కన్.
| 189
|
క. |
అటుపిమ్మట మౌనుల వేం
కటగిరినాథుండు చూచి కమణను మీ రి
చ్చట నుండ నేల దడయక
పటుతర మగునాశ్రమములఁ బడయుఁడు చనుఁడీ.
| 190
|
సీ. |
అని యప్పు డానతిచ్చిన వేంకటేశ్వరు
నకు శ్రీకి భూనీళలకును మ్రొక్కి
వదలిపోవుటకును మదిరాక హరిమోము
లోచనోత్సవముగఁ జూచి చూచి
యానందబాష్పంబు లక్షుల వెడలంగ
నిగమాంతసూక్తులఁ బొగడి పొగడి
తనియ కాస్వామి సుందరరూపమును జిత్త
నీరజాతములను నిల్పి నిల్పి
|
|
తే. |
తన్మయత్వంబు నొంది యాతపసు లప్పు
డాయనంతుని విశ్వమోహనుని బాయఁ
జాల కందుండి యందఱు సనకయుండఁ
జూచి యిట్లనె యప్పద్మలోచనుండు.
| 191
|
తే. |
పరమమునులార నిర్గుణబ్రహ్మమైన
నేను సగుణవిలాసము ల్మానవులకు
జూపి రక్షింపఁదలంచి యిచ్చోట నిలిచి
యుండ నిట్లుందు నంతట నిండియుందు.
| 192
|
ఉ. |
కావున మద్వియోగ మొగిఁ గల్గదు పూర్ణవివేకి కంతటన్
నావిమలస్వరూపమును నాటఁగఁజూపుచు నుందుఁగాన స
|
|
|
బ్భావనచేత వాఁడు ననుబట్టుగనంతటఁ జూచుచుండు మీ
రావిధమున్ గ్రహించి చనుఁ డక్కడనిక్కడ నుందు నెంచఁగన్.
| 193
|
తే. |
పుణ్యతమమైన నైమిశారణ్యభూమి
కరుగుఁడని మౌనివర్యుల కానతిచ్చి
మౌనముద్ర ధరించి యాశ్రీనివాసుఁ
డప్పు డర్చాకృతిం దాల్చె నద్భుతముగ.
| 194
|
తే. |
అప్పు డందు శిలావిగ్రహంబుకరణి
నమరియుండిన శ్రీవేంకటాద్రివిభుని
చూచి మునిపుంగవులు కడుచోద్య మంది
పూర్ణభావనచే హరిం బొగడి రిట్లు.
| 195
|
శ్లో. |
సరోజపత్రలోచనం సుసాధులోకపావనం
చరాచరాత్మకప్రపంచసాక్షిభూతమవ్యయమ్,
పురారిపద్మజామరేంద్రపూజితాంఘ్రిపంకజం
స్మరామి వేంకటేశ్వరం చ సాగరాత్మజేశ్వరమ్.
పురాణపూరుషం సమస్తపుణ్యకర్మరక్షణం
మురాసురాదిదానవేంద్రమూర్ఖదర్పభంజనమ్,
ధరాధరోద్ధరం ప్రశాంతతాపసాత్మవీక్షణం
స్మరామి వేంకటేశ్వరం చ సాగరాత్మజేశ్వరమ్.
శరాసనాదిశస్త్రబృందసాధనం శుభాకరం
ఖరాఖ్యరాక్షసేంద్రగర్వకాసనోగ్రపానకమ్,
నరాధినాథవందితం నగాత్మజాత్మసన్నుతం
స్మరామి వేంకటేశ్వరం చ సాగరాత్మజేశ్వరమ్.
సురారిశౌర్యనిగ్రహం సుపక్వరాట్పరిగ్రహం
పరాత్పరం మునీంద్రచంద్రభావగమ్ విగ్రహమ్,
|
|
|
ధరామరాఘశోషణం సుధాతరంగభూషణం
స్మరామి వేంకటేశ్వరం చ సాగరాత్మజేశ్వరమ్.
|
|
వ. |
అని యివ్విధంబున సంస్తుతించి పుసఃపునఃప్రణామంబులు చేసి
వేంకటాచలంబును డిగి కపిలతీర్థమార్గంబున నిర్ణమించి యగ్గిరి
కిం బ్రదక్షిణపూర్వకంబుగ నరుగుచుం దలకోనాఖ్యస్థానం
బున ననేకవత్సరంబులు తపంబుననుండి యందుండి లేచి సురా
ఘటక్షేత్రంబున కరిగి యందుఁ గొన్నిమాసంబు లుండి యందుండి
గోదావరీతీరంబునం గొన్నిదినంబు లుండి యందుండి నైమిశా
టవి కరిగి యచ్చట దమయుచితస్థానంబులం జేరి సూతుం జూచి
వెండియు నిట్లనిరి.
| 196
|
క. |
సూతా నీకరుణను వి
ఖ్యాతిం దగు వేంకటాద్రి కరిగితి మచటన్
బ్రీతిగ నీ వెఱిఁగించిన
రీతుల మే మెల్లి దద్గిరిం గంటి మొగిన్.
| 197
|
శా. |
ఆహా నీసకలజ్ఞవాక్కులకు మాకానందము బుట్టె నీ
మాహాత్మ్యం బధికంబు చూడఁగను సామాన్యుండవే సూత మా
తో హెచ్చై తగినట్టిచిత్రములు సంతోషంబుగాఁ జెప్పిన
ట్లా హైరణ్యగిరీంద్రమందుఁ గల వీ వం దెట్లు గన్గొంటివో.
| 198
|
మునులు సూతుని నుతించుట
సీ. |
భర్మాద్రికరణి నప్పర్వతం బున్నది
చైత్రరథమురీతి సద్వనంబు
గన్పట్టుచున్నది ఖగమృగాదులు జాతి
వైరము ల్విడిచి యవ్వనమునందుఁ
|
|
|
జరియించుచున్నవి స్వామిపుష్కరిణీ సం
పూర్ణమైయున్నది భూవరాహ
దేవుఁ డాపడమట దీపించుచున్నాఁడు
తద్దక్షిణంబునఁ దప్తహేమ
|
|
తే. |
కుంభముల నొప్పుచుండెడు గోపురములు
మణులచే నొప్పు ప్రాకారమంటపములు
నమఱియున్నవి తన్మధ్యమందు దివ్య
కాంతి నొప్పు విమానంబుఁ గంటిమయ్య.
| 199
|
శా. |
మే మాదివ్యనిమానమధ్యమున లక్ష్మీకాంతు నీక్షించి త
త్సామీప్యంబుప నిల్చి మ్రొక్కుతఱి నాశ్చర్యంబుగా నంతలో
నేమో మేము శరీరము ల్మఱచి యందింతైన లజ్జింప కా
స్వామిం జూచుచు నాడుచుండితిమయా సంతోష ముప్పొంగఁగన్.
| 200
|
క. |
అటువలె నాడితి మాపి
మ్మట హరి నర్చించితిమి సమాధానమునం
గుటిలత లేకయ శ్రీవేం
కటపతి మాటాడె జలధిగంభీరముగన్.
| 201
|
క. |
ఆమధురోక్తులు వించును
మే మచ్చట నుండ మాకు మిత్రునిరీతిన్
నైమిశమున కరుగుండని
యామాధవుఁ డానతిచ్చి యర్చాకృతియై.
| 202
|
తే. |
మౌనముద్ర ధరించి తా మఱల మాట
లాడకుండిన చక్రమాహాత్మ్య మచటఁ
జూచి గిరి డిగ్గి యెలమి నిచ్చోటి కిపుడు
వచ్చితిమి మేము సద్గుణవ్రాత సూత.
| 203
|
క. |
నీ వెఱిఁగించిన చిహ్నము
లావేంకటగిరిని గంటి మహహా యని నీ
భావమునకుఁ గన్పించెనొ
నీవే చూచితివొ సూత నిజవిఖ్యాతా.
| 204
|
సీ. |
అని తాపసోత్తము లందఱు ప్రీతిగ
నడుగ నాసూతుఁ డిట్లనియె నపుడు
మునులార మావ్యాసమునికటాక్షము గల్గి
నది మొదలుగ సకలార్థములును
దోఁచు నామదికి నాదొడ్డతనము గాదు
బాదరాయణునిప్రభావ మంత
గావున నను గొప్పగాఁ జూడఁ బనిలేదు
మీరు ధన్యాత్ము లిమ్మెయిని నన్నుఁ
|
|
తే. |
గరుణ మీరంగ నడిగినకతన నేను
చిత్తమున నిట్లు భావించి చెప్పినాఁడ
నంతియేకాని శ్రీవేంకటాద్రియందుఁ
జూచి చెప్పితినని మీకుఁ దోచవలదు.
| 205
|
తే. |
తారశీకరసికతావితానములను
గణుతి సేయఁగ వచ్చు వేంకటగిరీంద్ర
నాయకునిలీల లన్ని నిర్ణయముగాను
శేషుఁడైనను లెక్కించి చెప్పఁగలఁడె?
| 206
|
క. |
శ్రీకరవేంకటనాథుని ప్రాకటచరితంబులెల్ల భవహరములుగా
నాకుం దోఁచెడిరీతిగ మీకుం జెప్పితిని సంయమీంద్రులు వినరే.
| 207
|
క. |
అని సూతుఁడు సద్భక్తిని
మన మలరఁగ వేంకటాద్రిమాహాత్మ్యంబున్
|
|
|
వినఁగోరిన శౌనకముఖ
మునివరులకుఁ జెప్పె మోదముం దనరంగన్.
| 208
|
క. |
శ్రీవిభ్రాజితచరిత మ
హావిభవోన్నతజగత్రయప్రఖ్యాతా
శ్రీవేంకటగిరినాయక
పావన తఱికుండనృహరి భద్రయశోధీ.
| 209
|
మాలినీవృత్తము. |
సరసిజదళనేత్రా సన్మునిస్తోత్రపాత్రా
సురవనవరచైత్రాశోకవల్లీలవిత్రా
సురుచికఘనగాత్రా సూరిచిత్తాబ్జమిత్రా
దరహసితసువక్త్రా ధాత్రిసచ్ఛీకళత్రా.
| 210
|
గద్యము. |
ఇది శ్రీతఱికుండనృసింహకరుణాకటాక్షకలిత కవితా
విచిత్ర కృష్ణయామాత్యతనూభవ వేంకమాంబాప్రణీతం
బైన శ్రీవేంకటాచలమాహాత్మ్యం బను వరాహపురాణంబు
నందుఁ జగ్రరాజదిగ్విజయంబును, శ్రీవైష్ణవధర్మప్రసక్తియు,
విహితసత్కర్మప్రకారంబును, యమనియమాదియోగాభ్యాస
క్రమంబును, శ్రీవేంకటేశాష్టోత్తరశతనామప్రభావంబును,
నైమిశారణ్యనివాసు లగుమునులు వేంకటాద్రికి వచ్చుటయు,
వేంకటేశ్వరుం డామునులకు దర్శనం బిచ్చి సంభావించు
టయు, నంత నమ్మునులు వేంకటేశ్వరునానతిం బడసి నైమి
శారణ్యంబున కేగుటయు, నందు సూతుం గనుంగొని మునులు
విసుతించుటయు, మునిసహితంబుగ శ్రీవేంకటేశ్వరస్వామికి
మంగళాశాసనంబు సేయుటయు ననుకథలం గల తృతీయా
శ్వాసము.
|
|