శ్రీరంగమాహాత్మ్యము/ద్వితీయాశ్వాసము
శ్రీరస్తు
శ్రీరంగమాహాత్మ్యము
ద్వితీయాశ్వాసము
శ్రీకమలముఖీ ముఖకే
లీకమల మరందరస విలిక్షుభ్రమరా
ళీకలన కటాక్షాంచల
యాకల్పవిలాస వేంకటాచలవాసా.
వ. అవధరింపుము. ఇట్లు నాగదంతమహామునికి వ్యాసు లానతిచ్చినతెఱంగున సూ
తుఁడు శౌనకాదుల నుద్దేశించి.
సీ. మాధవాధీనమౌ మనుజకల్మియె కల్మి పరమేశుఁగూర్చిన పలుకు పలుకు
హరిగేహమున కేఁగు యడుగులె యడుగులు కేశవుఁ బూజించు కేలు కేలు
నారాయణా యను నాలుక నాలుక శ్రీనివాసున కిచ్చు మేను మేను
పంకజాతునిఁగూర్చు భావంబు భావంబు భక్తుఁడై మనువాని బ్రతుకు బ్రతుకు
దాసు లెందుండి రదియె తీర్థస్థలంబు, హరిపరాయణవసతి పుణ్యాశ్రమంబు
భాగవతకోటి శ్రీపాదపద్మరేణు, మిశ్రమంబు వియన్నదీమిశ్రమంబు.
గీ. కర్మపాశనిబద్ధులుఁ గలుషమతులు, గుణసహితు లట్టిమనుజుల గణనఁజేసి
పలికెదరటన్న శ్రుతిమాత్రకలుషనాశు, లయిన గరుకధ్వజునిదాసు లౌటఁ జూవె.
క. గంగానదికిన్ శ్రీహరి, మంగళకరచరణకమల మహానీయరజ
స్పంగతిఁ ద్రిలోకపావన, మాంగళ్యముఁ గలిగె నది ప్రమాణము గాదే.
శా. కావేరీనది మున్నుఁగా నదులంఖ్యల్ విశ్వవిశ్వంభరన్
వేవే లెవ్వరు గృదికనన్ దలఁచినన్ విన్నన్ మహాపాతక
గ్రావవ్రాతము వజ్రపాతహతి భగ్నంబౌగతిం బోవుటల్
శ్రీవిష్ణుస్థలవాససేవనుగదా సిద్ధాంత మీవాక్యముల్.
గీ. స్పర్శనముచేతఁ బూతులు స్మరణచేత, ముక్తులును ధ్యానమున భవమోచనులును
గారె హరిదాసులనుచు నాగమము లెల్లఁ, దెలుపుచున్నవి హరిభక్తి సులభులగుట.
సీ. నదులలో ముఖ్యమైనది విష్ణుపదపద్మసంభూతమైనట్టి జహ్నుకన్య
దత్తీరమున జగత్రయపూజ్యముఁ బ్రయాగ మట్టిదె యమునామహాస్రవంతి
యందు రాధానాథుఁడైన శ్రీకృష్ణుండు గోపాలబాలలఁగూడి యపుడు
రాసకేలీమహోల్లాసుఁడై తటవనశ్రేణుల నెపుడుఁ జరించుకతన
నెపుడు నన్నది గనవేడుటే తదీయ, సైకతస్థలమంజులజలజనయన
హలకులిశవజ్రపద్మరేఖాంచితంబు, లైన యడుగులుఁ జూడ భాగ్యంబుగాదె.
క. ఆతీరంబునఁదగు మథు, రాతీర్థముఁ గృష్ణపాదరాజీవరజో
వ్రాతసమాకులకలనా, పూతంబై జనులదురితముల వోనడచున్.
క. అచ్చట మూన్నాళ్ళెవ్వరు, వచ్చి కృతస్నానులగుచు వనమాలిజపం
బుచ్చరియింతుకు వారు వి, యచ్చరు లరుదంద గనుదు రచ్యుతు నందున్.
క. గోవర్ధనగిరిచెంగట, ధీవైభవుఁ బుండరీకతీర్థము మదిలో
పావనమై భవబంధపు, తీవలు దెగఁగోసి జనతతిక్ రక్షించున్.
క. ఆగోవర్థనతీర్థము, భాగవతులపాలి కల్పపాదప మచటన్
భోగాపాలకతీర్థము, నాగోమతితీర్థ మభిమతార్థము లిచ్చున్.
క. కాళిందీసరమున గో, పాలుఁడు చలిదారగించు పట్టగు నచటన్
మేలెంతురు పితృకర్మలి, కేలా యికరములుగాన మిహపరములకున్.
క. ఒకయెడ గూఢయు నొకయెడఁ, బ్రకటము నై దోఁచెఁ దా సరస్వతి గానన్
సకలార్థంబులు నిచ్చును, నికటామరతరువు మనుజనికరంబులకున్.
ఉ. ఏల తదీయతీర్థముల కేఁగ జనాళి సరస్వతీనదీ
కూలనికుంజమంజుతరుగుల్మలతావళిఁ దేఱిచూచినన్
బాలన కోటిజిహ్వలను భారతి తాండవమాడ బ్రహ్మయి
ల్లాలఁట యమ్మహానది ప్రియాశయముల్ దమ కీయఁజాలదే.
గీ. ఆదినుండియుఁ బరిశుద్ధులగు సరస్వ, తియును భాగీరథియు యమునయుఁ దలంపఁ
గారణము లపుడు నీతులు గడమనదులు, తలఁప నఘనాశ మిన్నదీత్రయమునందు.
గీ. పావనములైన బుణ్యసరోవరముల, యందులో రెండుముఖ్యంబులయ్యె దాన
నుత్తరమునకుఁ బుష్కరం బుత్తమంబుఁ, గడమ కాసారములు పెక్కు గలిగియున్న.
గీ. దక్షిణంబునగల్గు తీర్థములకెల్ల , వాసియగుఁ జంద్రపుష్కరిణీసరంబు
యిట్టి రెండును దలఁచిన నెందుకున్నఁ, బరమపద మెందుఁ గొంగుపసిండి గాదె.
శా. కావేరీ సరయూ నదీద్వయము వేగన్ బాననశ్రీలలో
భావించం జెలువొందె మున్నదియు నీభాగ్యస్థితుల్ గాంచెనే
దేవారాధ్యుఁ డయోధ్యలో దశముఖాదిక్రూరులం దంప రా
మావిర్భావము నొందె దాశరథియై యాదిత్యులం బ్రోవఁగన్.
క. శ్రీతరుణి తాను బుట్టదె, సీతానామమున వారు చేరుటగాదే
పూతత్వ మొందె సరయును, భూతలమున నాటనుండి బుధసేవితమై.
క. సాకేతనగరిలో యి, క్ష్వాకుఁడు మును దెచ్చినిలిపె సరయువు పొంతన్
శ్రీకర రంగవిమానము , కానున్న నదెట్లు వాపు కలుషము లెల్లన్.
శా. రంగన్మూల విమానశేషశయనప్రౌఢం బమేయంబు శ్రీ
రంగబ్రహ్మము వచ్చినిల్చుటఁగదా ప్రాపించె కావేరికిన్
భంగవ్రాతవిధూతశీకరపరిస్పందస్ఫురన్మారుతా
సంగత్ సంగనిరస్తపాదతతులౌ సౌభాగ్యగాథావళుల్.
క. శ్రీమద్రంగవిమాన, మ్మామహిమము తోడనెనసి యలరుటగాదే
భూమీజనులకు సహ్యజు, యీమేనుల భుక్తిముక్తు లియ్యఁగ నేర్పున్.
సీ. సర్వపాపప్రణాశనియయి బహుతీర్థకోటి రమ్యోభయకూలమగుచు
ఖచరచారణసిద్ధగంధర్వసేవ్యమై జలదిపర్యంతనిజప్రవాహ
పావనోభయపార్శ్వభాగనీరంధ్రరసాలచందననారికేళపనస
పూగరసాలజంబూప్లక్షఖర్జూరకదళీలనంగమాకందకుంద
పాటలీముఖ్యతరుపుష్పఫలసమృద్ధి, శుకపికాగివిహంగమప్రకరమధుర
కలకలారవభృంగఝంకారకలిత, యైన కావేరిమహిమ యేమనఁగవచ్చు.
మ. చిరకాలాగతప్రాణనాయకుని తాఁ జేదోయు నాలింగనా
దరణన్ మెచ్చఁగఁజేయు మానవతిచందం బొప్ప కావేరి తా
నిరువాగై కనగూడి యెన్నఁడును రంగేశున్ భజించెన్ దయా
పరుఁడై యచ్చోటు బాయకుండెను బరబ్రహ్మంబు రంగేశుఁడున్.
గీ. శ్రాద్ధయాగాదికర్మముల్ శ్రద్ధలేక, యైన మంత్రక్రియలు లేకయైన నరుఁడు
చంద్రపుష్కరిణీతీరజగతియందుఁ, జేసి తాను భగీరథి శ్రీవహించు.
శా. కావేరీమహిమంబుఁ దెల్పుటకు శక్యంబే జగత్పావనం
బీవిశ్వంభరపై మహామహుని రంగేశుం గృపాలోలు భ
క్త్యావేశంబున నవ్విభీషణుడు కళ్యాణార్థియై తెచ్చి తా
నావిర్భావము నొందఁజేయుట తదీయారాసీమంబునన్.
మ. కలనైనన్ నిముషంబు బాయనగునే కావేరికావేరికల
దళితోత్తుంగ శుభోత్తరంగ విలుఠత్కల్లోలమాలామిళ
న్నళినామోదిసమీరణాంకురవిభిన్నక్రూరపాపావళీ
కలనన్ సంగముద్వయీనిగమరేఖాశృంగమున్ రంగమున్.
గీ. తెచ్చిన విభీషణునిరేక తేరఁబనిచి, హారికావేరికాసైకతాంతరంబు
పుణ్యవననాటికలు చంద్రపుష్కరిణియు, నుల్లమున మెచ్చి తరలక యున్ననాఁడు
క. శ్రీరంగనాథువసతియు, సారసరిత్తీర్థరాజసహచరయును నై
యేరులనెల్లను తిరుకా, వేరిసమానంబులేని విశ్రుతి గాంచెన్.
చ. సనకసనందనాది మునిజాలము దేవతలున్ దదీయపా
వన వనభూములందుఁ దరుసర్గలతౌషధులై జనించినా
రనయము రంగనాయకసమాశ్రయ మాత్మలఁగోరి యట్టిచో
దునుమఁగ రాదు పూరియును తోడనె దోషములందుఁ గావునన్.
గీ. సహ్యపర్వతజలరాశి సందునందు, నుభయకావేరి తీరంబు లభినుతించి
ధరణిపైగల పుణ్యతీర్థంబులెల్ల, నెనసియున్నవి ములుమోప నెడము లేక.
క. స్వర్గద్వారంబనఁగ న, నర్గళమతిరంగమరుత నమరున్ స్థలనై
సర్గికబహుమహిమమునన్, స్వర్గాదిసుఖంబు లిచ్చు స్నాతలకెల్లన్.
క. అచ్చట దేవారాధన, లిచ్చిన దానములు కోట్లకిచ్చిన ఫలమై
వచ్చి పరలోకమునఁ దమ, యిచ్చల మెచ్చులనుగూడి యెదురుగవచ్చున్.
ఉ. రంగము లెన్నఁగా శుభతరంగము తీర్థము పుండరీక మ
చ్చెంగట నొక్కగట్టు విలసిల్లును దానిపయిం బుధాళికిం
గొంగుపసిండి శ్రీపతిదగుం గమలాక్షుఁడు బ్రహ్మహత్య వా
యంగఁ దపంబొనర్చి హరుఁ డిచ్చటఁ బావనుఁ డయ్యె గావునన్.
గీ. అట్టి తిరువళ్లలో నరు లెట్టివారు, పుండరీకాక్షు సేవించి పూజ్యమైన
యుభయలోకసుఖోన్నతి నొందఁగలరు, తత్స్థలాజ్ఞేయవకుళతీర్థంబు నటుల.
క. వకుళమహాతీర్థముచెం, తకు నింద్రుఁడు వచ్చి తా పదభ్రష్టుండై
యొకయేడు తపంబొనరిచి, యకలంకత మరలఁగాంచె నైశ్వర్యంబుల్.
గీ. అందు నాగ్నేయభాగంబునందు నమరు, మందరం బైన శ్రీరంగమందిరంబు
చెంత నింద్రవటంబు విశేషతీర్థ, మదిగదా కామగవియయ్యె నాశ్రితులకు.
శా. శ్రీరంగంబు విలోకనీయమగుటన్ జెన్నొందునందాక న
మ్మేరన్ లోఁగొను ధారుణీవలయసమ్మిశ్రంబులే చెట్లలో
పూరైనన్ గొనకొమ్మయైన దునుమన్ బుణ్యక్రియల్ దూరమౌ
చేరున్ దోడనె హత్య మౌనిసురలాచించాది భూజాతముల్.
సీ. మహిష మూషక ధేను మర్కట మార్జాల గజ వరాహ తురంగ కాసరములు
నురగ వృశ్చిక జంబు కోలూక కుక్కుట మీన పారావత మేషములును
కాక ఘూక శ్యేన కంక గృద్ధ్ర బలాహ కేకి శారీ భృంగ కోకిలములు
శుక తిత్తిరి పిపీలిక కుణ మత్కుణ మక్షిక మచ్ఛోద మశకములును
మొదలుగా జీవకోటి యమ్మునులు సురలు, యక్షగంధర్వసిద్ధవిద్యాధరాదు
లని యెఱుంగుము శ్రీరంగమున జనించి, పొల్చి కైవల్యమునకేఁగ నిల్చినారు.
సీ. పరమపుణ్యులు ధర్మపరు లతికారుణ్యశాలు లుత్తములు నిష్ఠాగరిష్ఠు
లాచారపరు లాగమాంతార్థవేదులు సర్వభూతహితులు శాంతమతులు
నిర్దోషు లానందనిరతు లీక్షణబంధరహితు లాత్మారాము లహితదూరు
లుత్తము లధ్యాత్మవేత్తలు నిర్జితేంద్రియులు ధన్యులు గుణాధికులు సములు
వీతరాగు లభిజ్ఞులు విష్ణుభక్తు, లాఢ్యు లన్యోన్యహితులు మహానుభావు
లాస లుడిగినవారు సత్యనిధు లౌర, రంగవాసుల మహిమ నెఱుంగవశమె.
క. పరతత్వమతులు వేదాం, తరముఖులును నుభయవేద నానార్థకళా
పరిణతులుగారె రంగా, వరణాంతర్వాసులైన వైష్ణవులెల్లన్.
సీ. అజ్ఞాని యున్మత్తుఁ డలసాత్ముఁ డవివేకి యప్రసిద్ధుఁ డపూజ్యుఁ డనృతవాది
నాస్తికుఁ డపకారి నాస్తివాదకుఁ డల్పుఁ డవ్యదూషకుఁడు జనాపవాది
గర్వాంధుఁడును మూర్ఖు కాముకుండు దురాత్ముఁ డధముఁడు వంచకుఁ డర్థలోభి
ద్రోహి పాషండుఁ డంధుఁడు మూక బధిరుండు మర్వ్యసనుఁడు సంగు దుష్టబుద్ధి
మలినుఁడును దుర్గుణుం డసమర్థకుండు, పాపి యన్యాయపరుఁడు దుర్భాషకుండు
కొండియుఁడు కోపి హింసకుం డుండరాదు, రంగపతియాజ్ఞచేత శ్రీరంగమునను.
గీ. మోక్షలక్ష్మీరతిశ్రమమ్మున జనించు, యలతకునుబోలె సహ్యకన్యాంతరమున
సోమరితనానఁ బవళించె జూడరమ్మ, రంగఁ డని కొల్తు రాదిత్యరాజముఖులు.
చ. విను మితిహాస మొక్కటి పవిత్రచరిత్రము నాగదంత స
జ్జనవినుతుల్ సుబోధనుఁడు సత్యుఁ డనంగ మునీంద్రు లర్షులి
వ్వనములఁ గందమూలఫలహారముచేత శరీరయాత్రగా
దినములు బుచ్చుచున్ సవిధదేవనివాసము రంగధామమున్.
క. సేవించి ప్రదక్షిణముగ, గావేరికి నఱిగి నిత్యకర్మానుష్ఠా
నావళి దీర్చుచుఁ ద్రోవన్, శ్రీవైష్ణవకోటిఁ గని భజింపుచు భక్తిన్.
శా. శ్రీరంగేశ్వర పాదపద్మయుగళిన్ సేవించి యాపజ్జనా
ధారున్ సన్నుతిఁజేసి యిచ్చిన ప్రసాదస్వీకృతిన్ గోపుర
ద్వారంబుల్ గని నిర్గమించి యొక కాంతారోటజావాసులై
వారల్ విష్ణుపురాణకీర్తనల వద్వారంబు వో ద్రోయుచున్.
క. మీరిరి పరాశరునకున్, వారలు ప్రియశిష్యులగుచు వర్తిలు గంగా
ద్వారమునఁ దప మొనర్పఁగ, వారితపం బింద్రుఁ డలిగి వారించుటయున్.
క. అచ్చోటు వాసి యమ్మును, లెచ్చటఁ దప మాచరించ నింద్రుఁడు దోడ్తో
నచ్చోటి కరిగి చక్కని, యచ్చరలును దాను విఘ్న మాపాదించున్.
క. ఆవెంబడి మునులిరువురు, కావేరీతటము జేర కలుషము లడఁగెన్
రావెఱచె సునాసీరుం, డావైష్ణవు లందు నహిత మాపాదించున్.
ఉ. వారిమరుద్దృఢావిమల నారిని స్నాన మొనర్పఁ జేరుచో
నీరము లేక వీడయిన నివ్వెఱనొంది యిదేమిచిత్రమో
వారి యవారిని న్నధికవారిగ కారణ మేమియంచు న
య్యేరుపయి న్విలోకనము లేగక దీరక చూచుచున్నెడన్.
సీ. ఉల్లోలకూలంకషోన్మూలికానేకభూరుహావర్తవిస్ఫురిత మగుచు
మళమళాయతవిశృంఖళమరుత్ప్రేరితాభంగురరంగానుభావ మగుచు
పార్శ్వోపవనతరుప్రకరపుష్పపరాగమాధ్వీరసప్లవమాన మగుచు
తివిరిసలహరికాదిబహుళోద్గారితపాండురడిండీరఖండ మగుచు
వచ్చె నాకస్మికముగ దేవస్రవంతి, సవతిజలరాశిరాణివాసంబు సహ్య
తనయ కావేరి శ్రీరంగధామవసతి, దికులుపడి తీరవానులు పగిలిపాఱ.
క. మునులు భయమంది యౌరా, పెనువెల్లువ వచ్చెననుచు బెదరుచు నవ్వా
హినిఁ దేరిచూచుచుండఁగ కనుపండువుచేసి సహ్యకన్యామణియున్.
సీ. వికసించి నెత్తమ్మివిరిమోము బాగుగా కలువలు కన్నులచెలువు గాఁగ
కప్పుమీరిననాచు విప్పు పెన్నెరులుగా జక్కవల్ గుబ్బలనిక్కు గాఁగ
పుప్పొడి నెమ్మేనిబూయు కుంకుమ గాఁగ తెల్లనితెరలు కుచ్చెళ్లు గాఁగ
బెళుకుబేడిసలు చూపుల మిటారంబుగా జవ్వాడునురుగులే నవ్వు గాఁగ
బహుళవిహగారావము మధుపానమత్త, కలకలాయతమధురవాక్యములు గాఁగ
మగనికౌఁగిలి యాశించి మగువ వచ్చు, తీరుఁ గనిపించి మించి కావేరి యపుడు.
క. దిగులుపడి సత్యుఁ డాత్మన్, సగుణబ్రహ్మంబు రంగశాయిని తలంచెన్
నగుమొగముతో సుబోధుఁడు, మగతనమున దలకఁడయ్యె మదినించుకయున్.
గీ. అమరవాహినిపై జహ్నుఁ డలిగినట్లు, మండి కోపించి దిక్కులు నిండివచ్చు
సహ్యజను జూచి యమ్ముని జాఠరాగ్ని, యడఁపఁగాఁబలె మ్రింగెదనని తలంచె.
మ. కలగెన్ పిండిలిపండుగా జలధు లాకంపించె ముల్లోకముల్
కులశైలంబులు సంచలించె నభ మాక్రోశించె భూచక్ర మ
ల్లలనాడెం దడబాటునొందె దిశలెల్లన్ మౌని నేత్రారుణాం
చలకోపానలజాయమాననిశిఖాసహ్యోద్భవన్ డాసినన్.
గీ. చిత్రమిది యౌర యంగుష్ఠమాత్రుఁడయ్యు, వార్థులాపోశనించె నూర్వశితనూజుఁ
డింతవాఁడను కావేరి యెంత నాకు, నంచు ద్రావుటకె తోయమంచునంత.
క. యేరెల్ల నడగి కాలువ, తీరై యొకమందకట్ట దిక్కులు నాహా
కారంబు నిండ ముని కర, వారిజముల పువ్వుఁదేని వడువున నిలిచెన్.
శా. ఆలోనంబరవీథివార్షికపయోధారావధీరంబుగా
యేలా చాలును మానుమాను తగునే యీయత్న మింతేహితం
బాలోకింపఁగ నాదుపల్కులని యత్యాశ్చర్యకందంబులౌ
నాలాపంబులు వీనుసోకిన నతండాలించి మేలెంచుచున్.
ఉ. చల్లనివై సుధామధురసౌష్టవశైలములై దయావిశే
షోల్లసనంబులైన చతురోక్తులు నానతి యెవ్వరిచ్చిరో
మెల్లనమాట యేలనిఁక మింగకమాస కవేకిక స్యక
దెల్లమిగాఁగ మానుమనుదేవుఁడు మాకుఁ బ్రసన్నుఁడౌటకున్.
క. వలసిన నాకున్ మ్రోల, న్నిలుచు న్నిలకున్న నైన నిష్ఠురమాయా
చల మీడేరుతునన్నన్, వలదను వాక్యంబు వినఁగవచ్చె న్మఱియున్.
శా. ఏమీ మౌనివరేణ్య మాకు నిదిభూయిష్టంబు కావేరియే
శ్రీమద్రంగశయానుమందిరము ధాత్రీలోకపూజ్యంబు ని
స్సీమానేకమహత్యరూపమసురాశిచ్ఛేదనం బన్నచో
నామాటల్ విని మౌనినాయకుఁ డమందానందకందాత్ముఁడై.
ఉ. ఈపలుకేలబోల నిఁక నెన్నిభవంతము లీవు చేసినన్
జూపుల కోర్కెదీర నినుఁ జూడక కోపము దీర దూరి కే
జూపులు జేసినమ్మనునె సహ్యజ నామతమిట్టిదన్న యా
లాపములిచ్చి మెచ్చి చదల న్మునివీనుల కొక్కవెండియున్.
గీ. విలసమునినాభ కావేరి యిసుకదీవి, పువ్వుఁదోటలనడును నపూర్వమైన
బలగరపుసెజ్జలోన శ్రీరంగధాముఁ, డిందిరయు దాను గ్రీడించు నెందు నెపుడు.
గీ. వాసుదేవుని పడకయిల్లయి సమస్త, బనులకును కామధేనువై సకలదురిత
హారిణియు నైన నదిమీఁద నలిగి నీవు, కట్టుకొనుటేమి యన నాతఁ డిట్టులనియె.
క. నీ వేమి గట్టుకొనియెదు, దేవా పొడచూపరాదె తీరనిపనికిం
కావేరికినగు నాకగు, చేవదలనటన్నమాట చెవిసోఁకుటయున్.
చ. అడుగుము నీకు నేవరమునైన నొసంగెదనన్న నెవ్వరం
చడగను నిన్నుఁ జూడక బయల్విని నావుడు నీశ్వరుండ నే
ర్పడ ననుఁ జూడ బ్రహ్మయు సుపర్వులు నోపరటన్న నీవు నా
యొడయుఁడవేను నీయడియ నోపుదు సన్నిధిగమ్ము నావుఁడున్.
సీ. శ్రీవత్స మనుమచ్చ జెలఁగు నెమ్మేనితో కౌస్తుభమణిపతాకంబుతోడ
మకరకుండలభాసమానకర్ణములతో డంబైన మణికిరీటంబుతోడ
శంఖచక్రాదిరాజద్భుజాగ్రములతో దయలీను నేత్రపద్మములతోడ
నొగపరివలువాటు పసిఁడిదువ్వలువతోఁ గమలగాపున్న వక్షంబుతోడ
హారమంజీరకటకకేయూరకంక, ణాంగదంబులతో మందహాసవదన
చంద్రబింబంబుతో గుణసాగరుండు, హరి సుబోధునియెదురఁ బ్రత్యక్షమయ్యె.
క. కలయో భ్రమనీతినొక్కో, నిలుకడయో యనుచు నలక నివ్వెఱగాంచెన్
తలకించున్ పులకించున్, దిలకించున్ దెలివి గాంచు భృతి వాటించున్.
గీ. తోడఁబ్రణమిల్లి లేచి చేదోయి మొగిచి, వామదేవాయ సద్బ్రహ్మనాచకాయ
శ్రీనివాసాయ! రంగవిమానశేష, శేషశయనాయతే నమస్తే నమోస్తు.
సీ. దేవ నీవదనంబు తేజోమయంబు చంద్రార్కులు నీలోచనాంబుజములు
దిక్కులునాల్గు మీచక్కనిభుజములు మీకు నాభిస్థలం బాకసంబు
పూనికగా కాష్ఠములు నీదువీనులు భూమీరుహమ్ములు రోమరాజి
పర్వతద్వీపరూపచరాచరము మేను పంచభూతస్వరూపంబు నీవ
మహదహంకారనామతన్మాత్ర వీవ, ప్రకృతిపురుషుండవును పరబ్రహ్మ వీవ
సృష్టినటనంబులెల్ల నీచేతనయ్యె, కొలుతు రెప్పుడు మిమ్ముఁ బుణ్యులు రమేశ.
క. నినుఁ గొలుచునట్టి సజ్జను, లనయంబును చేరసార మగుసంసారం
బననుమతులై తరింతురు, కనలే రీజాడ యెంతఘనులు ననంతా.
క. నీచక్కని ముఖచంద్రుని, జూచితి నీకరుకులైన చూపులచేతన్
నీచుఁడ నానేరమునకు, నీచరణమెగాక దిక్కు నెమకినగలదే.
క. చక్కని తామరలకు మొన, యెక్కుడుగల మీసదంబు లెక్కడ కెలనన్
మ్రొక్కఁగ జేరిన నా శిర, మెక్కడ యీమొక్కళమున డేమన నేర్తున్.
క. కావేరిమీఁద నూరక, యే వెఱ్ఱినిగాక యలుగనేల యలిగినన్
మీవాక్యము లౌ గాదని, నేవాదించుటకు నన్ను నేమందు హరీ.
చ. బలిమిని నిన్ను నాదుకనుపండువుసేయుట నీవు భక్తవ
త్సలుఁడవుగాన నాకనువు సాగఁగజేసితి వింతమీఁద మీ
తలఁపున నెంచినట్టి దయతప్పదు నాకు నభీష్ట మట్ల కా
దలఁచితినంచు గేల్వదలితాఁ బ్రవహింపగఁజేసె సహ్యజన్.
క. కరుణింపు మనుడు శ్రీహరి, వరమిచ్చెద వేడుమనిక వరమిదె నాకున్
ధరణిగల పుణ్యతీర్థము, లరసేయక నిమ్ము నీమహానదిలోనన్.
గీ. ఇచట మనుజులుగావించు నెట్టిదాన, మైన నొక్కటికొకటిగా నసుము లెల్ల
దూరమైపోవ వారు నీవారు గాఁగ, భుజగశయన యనుగ్రహబుద్ధి యనుపు.
గీ. అనుఁడు నట్టులవర మిచ్చి యాప్రథాన, పురుషుఁ డవ్యయుఁ డనియె సుబోధ నీకు
నిటుల సన్నుతిఁ జేసితి నేనెసుమ్ము, వాసుదేవుఁడ శ్రీరంగవల్లభుండ.
క. ఖగరాజయానసుఖముల, నగుదున్ బ్రత్యక్ష మచ్చటచ్చటగొని ప
న్నగరాజయానమున నా, లుగుమొగములవేల్పు నింటిలో వసియింతున్.
ఉ. అంతియకాని యెవ్వరు ననంతశయానుని నన్నుఁగాన రీ
నెంతటిభాగ్యశాలివికదే పొడకట్టితి నిట్టిమేన నా
చెంతన రంగమందిరము జేరి మదిన్ భజియింపుచుండు ని
శ్చింతతనన్న నమ్రుఁడయి చేతులు మోడ్చి సుబోధుఁ డిట్లనున్.
క. ఓకమలేక్షణ పరమద, యాకరమగు దివ్యమంగళాకారముతో
లోకేశు నింటిలోపల, నేకతమున నిల్పి తానతిమ్మని పలుకన్.
శా. ఏ నాచే సచరాచరాత్మకవిధం బీవిశ్వ ముత్పన్నమౌ
యే నాకన్యము లేదొకప్పుడు సమస్తేలాస్థితిం జూచుచో
నేనన్నన్ బరమాత్ముఁడంచు శ్రుతులే యేవేళ ఘోషించు నీ
వా నన్నున్ వినవేడిపల్కితివి నీకాద్యంతమున్ దెల్చెదన్.
ఉ. శ్రీయుతమై మదీయమగు క్షీరపయోనిధిలోన నాదినా
రాయణ ముఖ్యనామక మనంతములౌ నిజమూర్తినున్న న
న్నాయజుఁ డాత్మలో నిలిపి యబ్దసహస్రము లుగ్రతం దపం
బాయతభక్తి జేయుటయు నందుకు మెచ్చి కృపావిభూతితోన్.
లయవిభాతి. తొలుఁదొల్త నలుగెడల తొలుకరిమొగు ల్గములు
బలిసి యిల జీఁకటులు బలె బొదువు మేనన్
గలుములమిఠారి చెలువనుక వరభూషణము
లులియ మణికుండలపు టలవుగన జక్కుల్
జలజముఖసాధనము లలర గరముల్ దయను
చిలుకకును దామరలు చెలువులిడ హారం
బులు వెలుఁగ వేనములు చిలువ పెనుగద్దియను
నలువకును మ్రోలఁ దగ నిలువ నతిభక్తిన్.
సీ. శరణ మొందెదనయ్య వరమృగేంద్రాసన దాసుఁడనయ్య పద్మానివాస
సాష్టాంగమయ్య వేదాంతవేద్యపదాబ్జ యభయమీవయ్య పద్మాయతాక్ష
కరుణింపుమయ్య భక్తజనైకమందార తక్కితినయ్య ప్రధానపురుష
మనగంటినయ్య సమస్తలోకాధార, రక్షింపుమయ్య కారణశరీర
తపము లీడేరెనయ్య సత్యస్వరూప, పావనుఁడ నయితినయ్య కృపావిశాల
నన్ను మన్నింపుమయ్య యనాథనాథ, యరసి ననుఁ గావుమయ్య క్షీరాబ్ధిశయన.
క. అని నుతియించిన యేనా, వనజాసనుఁ జూచి యిత్తు వరమే మైనన్
నను వేడుమనిన వేడెద, మనసున గలకోర్కె సర్వమయ పరమేశా.
క. ఏనిట్లు నిన్నుఁ దపమున, ధ్యానము జేసితిని తదవతారంబున నా
చే నెపుడు పూజఁగొనుచు ర, మానాయక నిలువవలయు మద్గేహమునన్.
మ. అన నే గ్రక్కున శేషపీనమృదుశయ్యారీతిగా నుంచి యుం
డినయట్లన్ బవళించి యుక్తమగుమాడ్కిన్ సత్యమోంకారమున్
తనకున్ సజ్జగ జేసియిచ్చిన ప్రమోదంబంది యారంగమున్
తన మస్తంబుల దాల్చి ధాత పరమోత్సాహంబు సంధిల్లఁగన్.
గీ. సత్యలోకంబు జేరి పూజాగృహమున, ననుఁ బ్రతిష్ఠించి నిత్యంబు నలినభవుఁడు
సముచితారాధనోపచారములచేత, పంచరాత్రకసరణి పూజించు నంత.
క. ఇనసుతుఁడు మనువు ధాత్రికి, ననుఁదేనియ మించి యొక్క నాఁ డిక్ష్వాకున్
దనయు నయోధ్యాపురిలో, నునిచి వనంబునకుఁ జనియె నొక్కఁడు ధృతితోన్.
ఉ. పోయి వనప్రదేశమున భోరున వానలు గ్రుమ్మరింపఁగాఁ
గాయుచు ఘర్మకాలముల గాటపుయెండలు మించఁగా నన
న్యాయము ముంచి యీదు తనుసంధులు దూర హుతాశనార్చు లే
చాయలునిండ నన్నడుమ జల్పె తపంబు తదేకచిత్తుఁడై.
మ. తప మత్యుగ్రముగా నొనర్చి యతఁ డాత్మన్ నాకలోకంబుఁ దా
నిపుడే గైకొనఁ జూచెనంచు మదిలో నింద్రుండు గోపించి చే
తిపనింబంచిన ధారుణీవలయ ముత్కీలాపవళిం గప్పి రా
జుపయిందానతఁ డస్మదర్శితమనోబ్జుండై విరాజిల్లఁగన్.
గీ. చాల గరుణించి యే సుదర్శనముఁ బంప, నది సహస్రార్కసంకాశ మగుచు వచ్చి
కొట్టినం గాలకాష్ఠమై కులిశ మడఁగి, యల్లటువడంగ చక్రంబు నరిగె మఱల.
క. తా నదియెఱుఁగక యచలల, పోనిష్ఠుం డైన రాజపుంగవు చిత్తం
బే నరయుట జైవాత్రకుఁ, డైన ద్విజాకారమున హితాలాపములన్.
ఉ. ఏమిటికయ్య సర్వధరణీశ్వర మేను కడిందియెండలన్
సాముగ దావపానకవిశాలశిఖాళిచేతవంగి యూ
భీమవనంబునం దపము పేరిట గాసిల బుద్ధిచాలదే
నామదిలో నెఱింగితి వినన్ బని లేదు భవత్ప్రచారముల్.
శా. నీనా రుద్రముఖామరవ్రజశిరోనిత్యత్కనద్యన్మణి
శ్రీవిన్యాసపదాంబుజాతయుగళున్ జిన్మూర్తి నేతెంచి యీ
భావం బేల జనించె నీకు నకటా బ్రహ్మాదులుం గానరా
దేవుం జూడ నయోధ్య కేగుము విపత్తింబొంద నీకేటికిన్.
క. నామాటవినిన మేలగు, నామీఁద న్నీదుచిత్త మనవినిమను నా
భూమీసురుఁ గనుఁగొని నగు, మోమున నిట్లనియె డెందము వికాసింపన్.
ఉ. ఎచ్చటనుండి వచ్చితిరొ యెయ్యెడ కేఁగఁదలంచినారొ యీ
ముచ్చట లేల మీకు ద్విజముఖ్యులెసంజను డట్టివోటికిన్
బచ్చన మాటలేల పనిమానినపాట రమావిలాసి రా
డిచ్చటికంటి నవ్విభు మునీంద్రులు గానరటంటి రెందులన్.
గీ. వచ్చునని మీకుఁ దెల్పినవార లెవ్వ, రేపదము సేయరామి మీకేమి గొఱఁత
తను వనిత్యంబు యిరువది జననములకు, దినము లూరక జెల్లింపఁజనదు గాన.
గీ. భోగములచేతఁదనిసి యేప్రొద్దువోక, తపము చేసెద నెన్నివత్సరములైన
మేను దొఱఁగిన మఱియును మేనులెత్తి, యిటులనుండుదు సంకల్ప మిదియ నాకు.
క. విచ్చేయుఁడన్న మాయల, రచ్చ మృషాద్విజుఁడు కానరాక తొలఁగఁగా
నచ్చెరువున నితఁడే హరి, యెచ్చటితో బోవు బోయి యెఱుఁగమివచ్చెన్.
స్రగ్విణి. పోవునె కాండుగాఁబోలు రానట్టివాఁ
దేవర్ణవచ్చె మున్నేమి రమ్మంటినే
పావనంబై రూపంబుతో రాగ దా
దేవతారాఢ్యుఁ డీతీరుకన్ వ్రాటముల్.
తోటకం. రాదరిచూడక రారుగదా యీ
చోదలకేమది చూచెద రాడే
తాదనయిచ్చ వృధాతపమీడన్
చోదల పోడలు బోలునె నాకున్.
చ. అని పెడదంబుగా మొదటియట్లన ఘోరతపంబొనర్చుచుం
డిన మనుభూవరుం డిదిగణించి బలారిబలాబలాసురే
కుని శతకోటియట్లు పొగసూరునె రాజునకై యిదేల నా
కనిమిషరాజ్య మింక నని యంబుజగర్భునిఁ జేరి యిట్లనున్.
క. అంభోజగర్భ యొక వి, శ్వంభరపతిమీఁద ననుప వసుధాస్థలికిన్
జంభారి రిపుల దునిమిన, దంభోళికి యిపుడు యన్యధాత్వము వచ్చెన్.
క. నాకేటి కింద్రపట్టం, బాకడ నీమైలబాసినపు డయ్యెడు వే
రేకట్టడ నేయింపుము, నాకము మీమనసునచ్చిన సుపర్వునికిన్.
గీ. అనిన నింతటిపనివచ్చెనా సురేంద్ర, చింతిలఁగనేల నేఁగల్గ నింతపనికి
ననుచు నెందునకో తపమాచరింపు, చున్నవాఁడని భావించె యోగదృష్టి.
క. కాంచనజలము జారి వి, రించిబడియె వెజ్జు బొబ్బరించినరీతిన్
ముంచిన మూర్ఛన్ గని యిది, మంచిపనాయెనని నముచిమధనుం డల్కన్.
క. బారదునేల కమండల, నీరముచేఁ గమలభవుని నేత్రాంచలముల్
స్వారాజు దుడిచి మరలన్, సారసపీఠమున నునుప సభయుండగుచున్.
గీ. తపసునకు మెచ్చి నాయింట దలరడెపుడు, రంగపతి సర్వలోకశరణ్యుఁ డనుచు
నమ్మితి నిదేటి పైన మైనావు తండ్రి, పాయనేర్తునె నే నిన్ను న్యాయముగను.
క. అని నే నతిరువారాదన, ముననప్పుడు పైనమగుచు మూలవిమానం
బునుగూడి జతనమై యుం, డిన రంగస్వామివాకిటికి నడ్డముగన్.
క. పడిసన్నిధి బొరలుచు నీ, యడుగుందామరలు వాసి యరగడియైనం
గడనుండి తాళనేర్తునె, జడనిధిపర్యంక యింత జనునే నీకున్.
మ. నను మేరి యెడబాసిపోవనని నానాదైన్యవాక్యంబులన్
ననసాన్నిధ్యమునందు జింతిలు విధాతం జూచి రంగేశుఁ డి
ట్లను ప్రాభాతికపూజ చేసితివి మధ్యాహ్నంబు భూమండలం
బున నానాజనరక్షణెకభరమున్ బూనన్ విచారించితిన్.
క. సాయంసమయమునకు నీ, సేయుసపర్యలు వరింపఁ జేరుదు నీతో
నీయడ లేమిటికని ఫణి, నాయకశయనమున వచ్చి నరవరమౌళిన్.
క. నిలిచితిని కంటకంటం, గలిగెం శ్రీరంగనాయకనిధానము నా
తలఁపులు ఫలించి గెలిచితి, నలువన్ మనఁగంటి ననుచు వర్తించె వడిన్.
మ. తలపై నన్ను ధరించి భూవరుఁ డయోధ్యాప్రాగ్దిశాప్రాంగణ
స్థలియందున్ సరయూతటంబున బ్రతిష్ఠానంబు శ్రీరంగమున్
వెలిసారం బనఁగా నయోధ్యభవనావిర్భావముం గోపురం
బులు ప్రాకారము లాయతించె సురశిల్పుల్ వచ్చి నిర్మింపఁగన్.
మ. మను విక్ష్వాకున కిచ్చె నన్వెనుక నమ్మార్తాండువంశంబునన్
జననంబొందిన రాజులెల్ల బహుపూజాసంతతారాధనల్
దినమాహోత్సవముల్ ఘటించి మది నెంతం దృప్తిగావించి రా
మునిపర్యంతము నర్చఁజేసిరి జనంబుల్ గాంచి రిష్టార్థముల్.
మ. ధరణీభారముమాన్ప దాశరథియై తాఁబుట్టి కైకేయి యా
భరతున్ బట్టముగట్ట వేఁడువరముం బాటించి సౌమిత్రియున్
ధరణీజాతయు వెంటరా భయదకాంతారంబుల న్మౌనులం
బరిపాలించి ఖరాదిదైత్యుల ననిన్ మర్దించి శౌర్యోన్నతుల్.
గీ. దండకాటవినుండ సీతను హరించె, పంక్తికంధరుఁ డది రామభద్రుఁ డెఱిఁగి
యర్కతనయహనూమాన్నరాదులైన, కపులచే వార్ధికట్టి లంకకును జనియె.
చ. దురమున నింద్రజిత్ప్రముఖదుష్టనిశాటుల లక్మణుండు దు
స్తరశరలాఘవక్రియల శౌర్యమునన్ దశకంఠ కుంభక
ర్ణరణకలాకలాపము తృణంబుగ నెంచి వధించి రాఘవుం
డిరవుగఁ దా విభీషణున కిచ్చిన పూనిక నిర్వహింపఁగన్.
గీ. జలధితీరంబునందు లక్ష్మణునిచేత, కట్టెపట్టంబు మునుపె లంకకు నిజముగ
వెనుక పట్టంబు గట్టించె వెలఁదితోడ, రామచంద్రుఁ డయోధ్యాపురంబు జేరి.
ఉ. తా నభిషిక్తుఁడై రఘువతంసము చాలబహూకరింపుచున్
భానుతనూజవాలిసుతపావనిముఖ్యులఁ బంచి రాక్షసేం
ద్రానుజుఁ డవ్విభీషణు ప్రియంబున రమ్మని పొమ్ము లంకకున్
మానకు మెప్పుడున్ మమత మాయెడనంచు వచించి పంపినన్.
మ. భయమున్ దత్తరపాటు దైన్యమును దోఁపన్ స్వామి శ్రీరామ మీ
దయకుం బాత్రుఁడగానె యేమిటికి నిర్దాక్షిణ్యచిత్తుండవై
తి యథార్థస్థితి రాక్షసుండని భక్తింగొల్వలేదో హిత
క్రియలం మరియుంటినో పలుకులన్ రెంటాడి కానైతినో.
క. ఎక్కడి లంకాపుర మే, నేక్కడ నినుఁబాసి కడకు నేలా చనుదున్
రక్కసుఁడనైన నీవే, దిక్కనియున్నాఁడ తండి దిగవిడుతురటే.
క. పొమ్మనినప్పుడె మేనం, తమ్ముగదా యనుచు ననువితానము దొలఁగన్
సమ్మత మొందెను నాకిది, సమ్మతమే సభకు మీకు సమ్మత మైనన్.
గీ. కించుపగవాని నాజ్ఞ సేయించునటుల, వెడలిపొమ్మన్న నేనేల కడకు బోదు
పుణ్యమున కొడిగట్టి యీపొంతనున్న, వార లొకమాట యనరయ్య వాసి చెడదు.
క. అని పెదవులు దడపుచు నగ, తనుగనుఁగొని రిచ్చనున్న దానవవిభుపై
ననురాగము కరుణయు మరి, నినుమడిగా రామచంద్రుఁ డిట్లని పల్కెన్.
క. ఈబోలనట్టియర్థము, చేఁ బరమప్రీతి నిచ్చి సేయఁగవలయున్
నేబోవవలయు లంకకు , తాబోవం డితఁడు కడమతలపుల ననుచున్.
క. రమ్మని దనుజాధీశు క, రమ్ము కరమ్మున దగిల్చి రఘుపతి శ్రీరం
గమ్మునకుఁ దోడుకొని చని, సమ్ముఖమున నునిచి రంగశాయిం జూపెన్.
శా. సేవించందగు సంతతంబు సుజనుల్ శ్రీనర్తకీరంగమున్
భావాతీతపదాబ్జనీయమగు నప్పద్మాక్షు సారంగమున్
దావప్రాయభవాదితామృతసరిత్తారంగమున్ హాటక
గ్రావోత్తుంగమునాగ మత్ప్రకరరంగద్భృంగమున్ రంగమున్.
క. మాయిక్ష్వాకునివంశజు, లీయీశ్వరు రంగధాము నిలవేలుపు నా
దాయము నిక్షేపముగా, పాయకఁ గనికొల్తు రింతపర్యంతంబున్.
క. నాకన్న నధికమైనది, నీకున్ భువనముల లేదు నెమకిన నొసఁగున్
నాకారాధ్యుఁడు శ్రీపతి, నా కారాధ్యుం డితండె నాకధికుఁ డగున్.
క. ఈరంగస్వామిని నా, మారుగ గనికొల్వు మారుమాటాడకు మీ
యూరికె జను మొసఁగెదనని, శ్రీరంగవిమాన మతని చేతికి నిచ్చెన్.
ఉ. ఇచ్చిన మిన్నుముట్టి యతఁ డెంతయు సంతసమంది రాఘవున్
ముచ్చటదీర లేచి పదముల్ తన ఫాలముసోఁక మ్రొక్కి పై
నచ్చరదుందుభుల్ మొరయ నంబరవీథిని వచ్చి వచ్చినా
యిచ్చదలంచినట్లుగ మహీస్థలి గాంచె కవేరికన్యకన్.
గీ. కాల్యకరణీయములు దీర్పఁగాఁ దలంచి, మిట్టయైనట్టి కావేరి నట్టనడుమ
దనరు సికతామయద్వీపమున నతండు, మస్తకముమీఁది రంగధామంబు డించె.
క. తానును సమయార్హాను, ష్ఠానంబులు దీర్చి పురికిఁ జనువాఁడై నా
పూనిక దెలియక రంగవి, మానము తలవంచి మ్రొక్కి మది బొఁదలఁగన్.
గీ. మ్రొక్కి యెత్తెననని చేర మున్నెయదియు, శేషజిహ్వికలన ఫణిశ్రేణి దూర
నారసాతలముగ వ్రేళ్లువారి మేరు, పర్వతోపమై ధాత్రినిఁ బారుకొనియె.
క. చులకన నెత్తఁగఁ జూచెం, బలిమిం గదలించిచూచెపై పళ్లుగఱచి యౌ
తలనానియెత్తి చూచెన్, నలుగురుమంత్రులును గొని పెనంగియుఁ జూచెన్.
క. దానవపతి యీకరణి వి, మానము తాజుట్టుముట్టి మల్లాడి దిగుల్
పూని యిదియేమి రంగశ, యా నా యిఁక నేమి చేయునయ్యా యనుచున్.
సీ. కనలేక నీయందునునిచిన కావేరియమ్మ రంగస్వామి నంపవమ్మ
దీనునిపై పనీదేవకామినులార కరుణింపరమ్మ రంగవిభుఁ గూర్చి
యాకాశవాణి నీవైన రంగేశ్వరుహృదయ మిట్లని యానతియ్యవమ్మ
ధారుణీపతి రంగధాముఁ డేటికిరాడు కలయర్థ మీవైన బలుకవమ్మ
తండ్రి శ్రీరామ నీవు నీదాసునన్ను, యలమటలు దీర్చి రంగేశు ననుపవయ్య
స్వామి శ్రీరంగశయన నీచరణయుగళి, నమ్మి వచ్చితి రావయ్య నన్నుఁ గాన.
ఉ. హాయను నీవొసంగిన మహాధన మంకెకు రాదు రమ్ము రా
మాయను నోసమీరణకునూరక సజ్జదెమల్పఁ దోడుగా
వేయను తెచ్చి యూరక కవేరీజలో నిను డించి పోదు రం
గాయను నిక్కమో కలయొ కాయను నేరము నచ్చెఁగా యనున్.
క. ఈ తెఱఁగు చారజనముల, చేతన్విని నిచుళరాజశేఖరులకు నతి
ప్రీతుండై ధర్మవర్మపు, నీతుఁడు దా వచ్చెనని వినీతుండగుచున్.
సీ. కలిగెఁగా కృతతపఃఫలసారసామగ్రి చేకూరె సంకల్పసిద్ధి నాకు
పొందెగా దేవతా జాఫలుంబెల్ల నబ్బె ననంతపుణ్యాతిశయము
దొరికెగా బహుదానపరిలబ్ధభాగ్యంబు పరగశరీరసాఫల్యమహిమ
జతగూడెగా సమార్జితసుకృతవ్యక్తి నిండు కోరికలెల్ల పండెనిపుడు
నే గృతార్థుండ నన్నింట నేటిదినమె, దినము నాజన్మ మేజన్మ మనిన నిట్టి
రంగధామంబు లోకైకమంగళంబు, వెలసె కావేరి ననుమాట విన్నకతన.
మ. అని నానాహితబాంధవద్విజన్మపాలామాత్యవర్గంబు చెం
తనుగొల్వన్ దనుజేంద్రుఁ జేరఁజని నీదాసుండ శ్రీరంగధా
మునికిన్ దాసుఁడ వీవు నీపదయుగంబున్ బూజఁ గావింపఁగ
ల్గెను జాలింపు విచార మేల తనువీలీలన్ శ్రమం బొందఁగన్.
సీ. అని యూరడించి మహానుభావ విమాన మజహరేంద్రాదులకైన బలిమి
నెత్తరా దిదిమొద లుత్తరాఫల్గునినాటిపర్యంతంబు నలినభవుని
నియమంబును రోహిణీనామకామృతసిద్ధయోగంబున జేసినావు
రంగప్రతిష్ఠ తీరదు చేర నంతటవేగిరించిన నది విస్తరింతు
చల్లకై వచ్చి ముంత దాచంగనేల, యెదురుజూచుచునుండితి మిన్నినాళ్లు
నీకతన నాదుకోర్కెలన్నియు ఫలించె, ననఘము తదీయపూర్వాగమంబుకరణి.
గీ. దశరథుఁడు పుత్రకామేష్ఠి తానొనర్పఁ, బూని పిలిపించె రాజులఁ బుడమియెల్ల
నేలువాఁడౌట బోయిన నేను నట్టి, యుత్సవమునకుఁ బోరామి యున్న కతన.
క. నరపతి జన్నము దోడ్తో, నరివిరియలకించె నియతి ననబృధస్నానం
బిరువుగఁ జేసియు భూనా, థుల బహుమానముగ వేడ్కతో ననుపుతరిన్.
చ. ఉడుగరలేను నంది నతఁ డూరికి పొమ్మనిపంప నూరకే
వెడలక వారి గుప్తమగువిత్తము నేర్పున మోసపుచ్చి యె
ప్పుడు గొనిపోదు దీని కొకబుద్ధియుఁ దోఁచదు డించిపోవఁగా
నడుగులురావు రంగనిలయా నిను నెన్నఁడుఁ జూడఁగల్గునో.
మ. అని దాయాదివిరోధ మేరుపడ నే నాలోచనల్ జేసి రం
గనివాసుల్ గొనితేర నప్పటికి మార్గం బేమియున్ లేక న
చ్చినత్రోవ న్మరలంగవచ్చి మదిలో చింతింపుచు న్నాపురం
బున కాలూద నసహ్యమై యువతీసంభోగాదులున్ మానితిన్.
మ. అశనాదుల్ భుజియింపఁగా నరుచి భూషాదుల్ గనన్ వేపటల్
స్వశరీరాదిశరీరరక్షణవిధానసంసక్తిపై నొల్లమున్
పశులందున్ మొగమీఁక యుండుటయు చాలంగల్గి యేప్రొద్దు రం
గశయాను న్మదినిల్పి మౌని నియతిన్ గావేరితీరంబునన్.
మ. లవలీ లుంగ లవంగ వకులైలా నాగ పున్నాగ చూ
తవితానమ్ముల మంజులప్రసవగంధప్రాపకుంజాంతర
స్రవదుద్వేలమరందపూరితసరిత్సాహవ్యభాగంబులన్
భువనాధీశ్వరుఁగూర్చి చేసితి తపంబు న్మాసపర్యంతమున్.
క. ఈజాడనుండఁగా న, వ్యాజోపకృతిస్వభావు లచ్చట భార
ద్వాజాదిమునులు ననుఁగని, రాజ తపం బీవుసేయు క్రమ మెద్ది యనన్
చ. తెలిపిన వారలందుకు మతి న్సహియింపక ధాత్రి యేలుటో
చలమున శత్రుభూవరుల సంగరవీథిని గెల్చుటో జనా
వలి బరిరక్ష సేయుటయొ వచ్చినయర్థులకిచ్చుటో తపం
బులకును రాజుపుత్రులకు పొత్తగునే మనువంశభూషణా.
గీ. ఉరళ చేకూడుపనులకు నుప్పువేసి, పొత్తు గలయగ నీకేల భూవరేణ్య
సులభమే రంగధామనివాసుఁ గనఁగ, కలిగియున్నని మనల భాగ్యంబుఁ జేసి.
క. రానున్నవాఁడు శ్రీపతి, కానున్నది గాకపోదు కావేరీ మే
లానందమేనితపములుఁ బూనికఁ గావించి రవ్విభుని దెచ్చుటకున్.
క. ఇచ్చట వసింప నానతి, యిచ్చెను శ్రీరంగధాముఁ డీరఘురాముం
డిచ్చిన విభీషణుఁడు గొని, వచ్చుం గవేరి జనుడించు వాలాయముగన్.
క. వరమిది తగుదినములలో, పరమశ్రేయోసమృద్ధి ప్రాప్తముగా నీ
వెఱుఁగక తపంబు సేయఁగ, నెఱిఁగినవారలము గాన నిటులనవలసెన్.
క. చాలింపు తపము నిజముగ, నాలింపుము మాహితోక్తు లౌ గా దనకీ
మేలెంచుచు మదిలో మహి, పాలింపుము లేచిరమ్ము పార్థివముఖ్యా.
గీ. వారిమాటలు మదినమ్మి వదలి తపము, మారుపలుకకయే నోర యూరు జేరి
కాచి యేవాళ యెదురులు చూచి చూచి, యిన్నినాళ్లకు ననఘాత్మ నిన్నుఁగంటి.
క. నోములు ఫలించె రంగ, స్వామిపదాబ్జములు గంటి చాలదె భాగ్యం
బే మంచిదినము నేడు ధ, రామరులం బిలిచి జేయు మర్యాద విధుల్.
క. ఇవి మొదలుగాగ యొకతొ, మ్మిదినాళ్లకు బహ్మపేర మించినతిరునా
ళ్లది మాయుభయంబులఁ గని, మది నోరిచి నిలిచి మమ్ము మన్నింపు దగన్.
గీ. యుత్సవదినంబు లగుట నీయున్న నెలవు, తరలకున్నాడు శ్రీరంగధాముఁ డిపుడు
తొమ్మిదిదినంబు లస్మదాదులకు నెల్ల, సేవ లొసఁగినవెనుక విచ్చేయగలడు.
ఉ. లంకకు వెంటవచ్చు నకలంకమణిం గొనిపొమ్ము నేఁడు మా
యంకెకురమ్ము నీ పదములాన యదార్థము విన్నవించితిన్
బొంకిన నాజ్ఞ సేయుము విభుండవు నీవు ధరిత్రికెల్ల ని
ష్వంకగుణాఢ్య నామనవి పాలనసేయుము మీఁద మేలగున్.
చ. అనవిని తత్ప్రధానవరు లట్టయొనర్పుడు మంచిమాట తీ
రనిపనికెట్టులైన సుకరమ్ములు నా నడపింపఁగావలెన్
జనవరుఁ డీతఁ డాడినది సత్యము నావుడు నవ్విభీషణుం
డును మదిసమ్మతించె విభుఁడున్ సవరించె యధోచితక్రియల్.
గీ. తననగరిలోన దనుజేంద్రు నునిచి తత్ప్ర, ధానజనులకు వివిధోపధావిధాన
పూర్ణగృహము లొనర్చి యపూర్వమహిమ, నడపె శ్రీరంగవిభుతిరునాళ్ళు నతఁడు.
చ. అతిశయభక్తి గోపురమహావరణాదుల విశ్వకర్మ ని
ర్మితి యొనరించి యచ్చదలు మించు పురంబు కరంబమర్చి యు
న్నతమును రత్నకాంచనసనాధమునైన రథంబుమీఁద నా
క్షితిపతి రంగధాముని వసింపఁగఁజేసె మహోత్సవంబునన్.
గీ. ఉత్తరను తేరునడపిన యుత్తరక్ష, ణంబ శ్రీరంగవిభు విమానంబుఁ జేర్చి
ధర్మనర్మయుఁ దనరాజధాని కరిగెఁ, బ్రీతి దనుజేంద్రుచే ననుజ్ఞాతుఁ డగుచు.
సీ. క్షేమంబు శ్రీరంగధామంబు భువనాభిరామంబు నుతసురస్తోమ మనఁగ
సారంబు దివ్యావతారంబు శోభనాగారంబు సజ్జనాధార మగుచు
నాద్యంబు వేదాంతవేద్యంబు నిరతానవద్యంబు చిన్మయాపాద్య మీశ
గానంబు కృతమునిధ్యానంబు మునివరాధీనంబు శ్రీవధూస్వాన మఖిల
శేషశేషిత్వ మశ్రాంతశేషతల్ప , ముభయకావేరికావాస ముత్ఫలాభ
మైన రంగేశ్వరబ్రహ మమురు సజ్జఁ, బేరుకొని జేరి మ్రొక్కి విభీషణుండు.
క. ఆలంకాపురి కరుగఁగ, నాలోచనఁ జేసి మొదట యల్లనశుచియై
మూలవిమానము నెత్తఁగ, కేలం గదిలించి చూచె గెంటకయున్నన్
శా. దిక్కుల్ జూచుచు చూచి రంగరమణా దిక్కెవ్వరేయంచు తా
దృక్కోణంబుల నశ్రుబిందువులు వర్షించున్ ...........లక్ష్మణా
చక్కంజుడనదేమి సంగరములోఁ జాకుండ రక్షించి యా
శంకం గారణమేమి యేమరితి వీస్వామీ ప్రసాదింపవే.
శా. రంగా యేటికి లేచిరావు రఘువీరా నావిధంబెట్టి నీ
యంగీకారమె కాక యిత్తెఱఁగు లేలా కల్గునో జానకిన్
భంగించీక్రియ నీతనూజునకు సంప్రాప్తంబుగా నిట్లుపే
క్షంగా బ్రేమదలంతు రమ్ము యిఁక లంకారాజ్య మేమౌనొకో.
క. శ్రీరంగధామ నన్నీ, మేరందయఁ జూడవేని మీఁదటి కిఁక నీ
పేరైన విన్న నమ్మరు, ధారుణిఁ గలజనులు నీకుఁ దగ నీతలఁపుల్.
ఉ. నాకిక నేదిబుద్ధి కరుణామతి నిట్లని యానతీయవే
నాకడమాట నీనెకనెదాడుకొనన్ బనిలేదు రంగనా
థా కమలేక్షణా తగునె తండ్రి యనాథశరణ్య లేచిరా
వే కడతేర్పవే యని మహింబొరలాడుచు నశ్రు లొల్కఁగన్.
గీ. ధూళిధూసరితాంగుఁడై చాలనడలి, బడలి వాపోవఁ జూచి కృపావిభూతి
నేల చింతల దనుజేంద్ర యిచటనున్న, నేమి నీవాఁడ విను మది నీహితంబు.
సీ. కడకేగవచ్చునె కావేరి కావేరి లహరికాల్లోకనోల్లాసములను
తొలఁగిపోవుదమన్న తలఁపుపుట్టించునె యీసైకతద్వీపవాసమహిమ
యెడబాయవచ్చునె యీదృకోభయకూల రమణీయశోభనారామవసతి
యెంత లేదనవచ్చునే సప్తకాల విశాలపట్టణ మహైశ్వర్యగరిమ
కాన నిత్యనివాసయోగ్యంబు మాకు, నిచ్చట నివసింప వరము లేనిచ్చినాఁడ
కోరి కావేరి మున్నగువారి కెల్ల, మాకు హితమైన నీకు సమ్మతము గాదె.
శా. రక్షోరాజ్యము లంక మాకు నిలువన్ రాదచ్చట న్నీపయిం
బక్షం బెప్పుడునుండి నిన్నెకనుచున్ బాటించి నీరాకలన్
బ్రేక్షామాలికలుంచి నీయభిమత శ్రీలిత్తు రామాయణం
బీక్షోణిం గలయంతకాలమును నిన్నేలింతు సామ్రాజ్యమున్.
గీ. విననియు రాముఁ డని భేద మింత లేదు, కొలిచితివి మమ్ము నీకింత కలుగనేల
లంకకును బొమ్ము వలయువేళైన వచ్చి, రాకపోకలు నడుపు శ్రీరంగమునకు.
క. మానసపూజావేళల, యే నచటికి వచ్చి నీదు హృదయమునందున్
ధ్యానించినట్ల నిలుతు న, నూనదయామహిమ ననుచు నుపదేశింపన్.
మ. అనుమానంబులు మాని భేదములు మాయంజేసి యానందవా
రినిధిన్ దేలుచు నేకృతార్థుఁడను చేరెన్ నాదభీష్టంబులున్
నినుఁ గానేదిప్రతిష్ట చేసె ననుటింతే చాలదే నాకు వే
రనఁగా నెవ్వరు నీకృపామహిమచే నేగంటి నిష్టార్థముల్.
గీ. అనుచు వలగొని మ్రొక్కిపోయెను విభీష, ణుండు లంకకు తనవారలండఁ గొలువ
నాటనుండియు నేను కావేరినడుము, లోకరక్షణతా జాగరూకమహిమ.
క. ఉన్నాఁడగాన నీకు ప్ర, సన్నుఁనైతిని మదీయచరితము నాచే
విన్నట్టికతన నెవ్వరు, నిన్నుఁ దలంచినను వారి నేరక్షింతున్.
సీ. వినుము సుబోధ నా వినుపించు మత్కథ వినిన వ్రాసిన జదివిన జనంబు
సకలకల్యాణముల్ సంగ్రామవిజయంబు పుత్రలాభము సర్వభోగములును
కామినీమణులు సంకల్పఫలంబులు ధనధాన్యవస్తువాహనసమృద్ధి
ఆరోగ్యభాగ్యంబు హతకల్మషంబును దీర్ఘాయువును పితృదేవహితము
దివ్యభూషణవస్త్రముల్ భవ్యకీర్తు, లతులసంతోషములు సుఖస్థితుల నొంది
వెనుక కైవల్యసౌభాగ్యమున వసింతు, రింతయును సత్యమని యానతిచ్చె గాన.
క. గారుడసంహితలోపల, శ్రీరంగమహాత్మ్య మిది ధరిత్రిజను లె
వ్వారు పఠించిన వినినన్, వారి యభీష్టార్థములు ధృవంబుగ గలుగున్.
రగడ. శ్రీవిరజానంతర కావేరీతరళతరంగము శ్రీరంగము
పావనమగు మణికాంచన సప్తప్రాకారమయాంగము శ్రీరంగము
తీరనినివస న్మల్లీజాతిలతా నారంగము శ్రీరంగము
సారస నీహార సరళరసాస్వాదన సారంగము శ్రీరంగము
నరజనులార్జితపుణ్యఫలవిదామ్నాయ చతుశ్రుంగము శ్రీరంగము
తరుణమహత్తూలమహాతల్పితధన్యాది భుజంగము శ్రీరంగము
సకలధరాదివ్యస్థలబహువిలసన్మహిమోత్తుంగము శ్రీరంగము
మకరధ్వజతోరణకేతనచామరకముఖరాభంగము శ్రీరంగము
మోహనలీలాస్యకళాకులముక్తినదీరంగము శ్రీరంగము
మోహింపఁగఁజేయును సజ్జనుల ముముక్షసమాగము మా శ్రీరంగము
మధ్యద్భాసిత ముఖమంటపరుచి మద్గరుడతురంగము శ్రీరంగము
మధ్యమ భువనసమంచిత శోభనమహిమాదిపతంగము శ్రీరంగము
దనుజవరానుజభాగధేయమౌ ధర్మశరనిషంగము శ్రీరంగము
తనరు మహాశార్ఙ్గగదాయతనందకశంఖరథాంగము శ్రీరంగము
రామానుజముని తనమహిమము వర్ణన సేయఁగ మెచ్చెను శ్రీరంగము
తామసజనులకు దనదర్శనమందఁగ నీయఁ డొకప్పుడు శ్రీరంగము
గోపురమును మించిన మణికాంచనగోపురములు మించును శ్రీరంగము
నూపురమై లక్ష్మికి గణికాపదనూపురములు జెన్నగు శ్రీరంగము
నిచ్చలు నచ్చరవంశము కొమ్మల నెలనై జెన్నొందును శ్రీరంగము
ముచ్చటలను తనుదలఁచినవారల ముక్తులుఁగాఁజేయును శ్రీరంగము
రంగరంగరంగం బని తలఁచ గరంగంజేయును చిత్తము శ్రీరంగము
రంగరంగా యనుభక్తులకుఁ జెరంగుల బంగారము శ్రీరంగము
మరికలడాతిరుపతులను బ్రతి భూమండలి ననవెలసెను శ్రీరంగము
పురుషార్థంబులు నాలుగు దమలో బ్రోదిగ నెలయించును శ్రీరంగము
చేసిన పుణ్యము కోటిగణితమై చేకురు ఫలమిచ్చును శ్రీరంగము
వాసిగ తలఁపగరానిమహత్వము వర్ణింపందగినది శ్రీరంగము
దుర్గాగణపతిభైరవులను జోదోడుగఁ గాపుంచును శ్రీరంగము
వర్గత్రయముల గీరిగడువల యపవర్గమునకు నిచ్చును శ్రీరంగము
బ్రహ్మేంద్రలలాటేక్షణసురదిక్పాలనివాసంబగు శ్రీరంగము
బ్రహ్మధ్యానపరాయణ నానాభాగవతానందము శ్రీరంగము
కోరి హరుఁడు దెల్పఁగ విను గౌరికి కోరిక లీడేరును శ్రీరంగము
కూరిమితనలో చంద్రపుష్కరిణీఁ గ్రుంకిన జయమిచ్చును శ్రీరంగము
కల్పకచింతామణికరధేనూత్కరములఁ గరమొప్పును శ్రీరంగము
కల్పాదిని మును ధాతకు పూజగారంబై దనరును శ్రీరంగము
దాసుల వేషముఁబూనిన సురలను దలగద్రోయరానిది శ్రీరంగము
దాసోహం బను వైష్ణవకోటుల తావకమై మించును శ్రీరంగము
చూచినవారికి నపవర్గము మదిఁ జూపఁగఁ జేయిచ్చును శ్రీరంగము
వాచంయములకు నేకాంగంబులకు నివాసంబై తనరును శ్రీరంగము
యేటికిఁబోవఁగ తపములాడఁగా నిదుగో సేవింపుము శ్రీరంగము
యేటికి నొకనాఁడైన తలంచినను నిహపరము లొసంగును శ్రీరంగము
కంటిమి కన్నులకరువెల్లను బో కామితము లొసంగెడు శ్రీరంగము
కంటిమి జన్మాంతరముల సుకృతంబుల కళ్యాణఫలంబగు శ్రీరంగము
అపగతకల్మషమగు శ్రీరంగము అపవర్గాంజనమగు శ్రీరంగము
జనసిద్ధిప్రదమగు శ్రీరంగము జటిలాస్పదమగు శ్రీరంగము
శ్రీరంగము నాచారనివాసము శ్రీరంగము దివ్యమహోల్లాసము
శ్రీరంగము హనుమత్పరిచర్యము శ్రీరంగము నుతసన్మునివర్యము
శ్రీరంగము సజ్జనగుణసేవధి శ్రీరంగము సద్గుణమణినీరధి
శ్రీరంగము శోభననిభవారిణి శ్రీరంగము సీనకచింతామణి
శ్రీరంగము శ్రీరంగము శ్రీరంగము శ్రీరంగము.
క. శ్రీరంగ రగడ విద్యా, పారంగతు లగుచు జనులు భక్తిఁ బఠింపన్
గోరిన కోరిక లిచ్చున్, శ్రీరంగస్వామి యిది ప్రసిద్ధం బయ్యెన్.
క. ఈజలధి కామినీనది, నీజనములు వినఁగఁ జూచిరే మునిఁగిరియే
నీజలముఁ ద్రావిరేనియు, బూజించిరయేని ముక్తిఁ బొందుదు రెందున్.
క. అని యానతిచ్చి శ్రీపతి, యును నంతర్ధాన మొంద నుల్లంబున న
మ్ముని యలరి రంగధామము, గని కొలుచుచునుండె ముక్తి కైవసమగుటన్.
శా. పుణ్యాపేతకథాసుధారసరసాంభోమూల్యసృష్టిక్రియా
గణ్యత్రాణవిలోపకారణరణాగ్రన్యగ్రచక్రానలా
రణ్యానీభవరుగ్రదానసనవారంభక్రమోదార హై
రణ్యశ్రీలసదంశకోజ్వలకటీరన్యస్తహస్తోజ్వలా.
క. శ్రీనీలాధరణీ మహి, ళానందనిధాన చందనారామవనీ
మానిత వేంకటభూధర, సానునసత్కాలమేఘ సరసగుణౌఘా.
పంచచామరము. కలాకలాప సింధుకన్యకా కహలపాళికా
విలాస దర్పణావలోక విభ్రమైకలాలసా
ద్గళద్గళత్ స్ఫలత్ స్ఫలత్ ప్రకామనిష్పతత్పత
చ్చలచ్చల న్మహానిశాట నక్రచక్రసాధనా.
గద్య
ఇది శ్రీవేంకటేశ్వరవరప్రసాదాసాదిత చాటుధారానిరాఘాట సరస చతుర్విధ
కవిత్వరచనాచమత్కార సకలవిద్వజ్జనాధార కట్ట హరిదాసరాజగర్భాబ్ధి
చంద్ర వరదరాజేందప్రణీతంబైన గారుడపురాణశతాధ్యాయి
శ్రీరంగమాహాత్మ్యంబను మహాప్రబంధంబునందుఁ
ద్వితీయాశ్వాసము.