శ్రీరంగమాహాత్మ్యము/తృతీయాశ్వాసము

శ్రీరస్తు

శ్రీరంగమాహాత్మ్యము

తృతీయాశ్వాసము

      శ్రీచరణ కమల మకరం
      దోచిత సురవాహినీ మహోర్మినిచయ ము
      క్తాచయ విలసన్మంజీ
      రాచరితవిలాస వేంకటాచలవాసా.
వ. అవధరింపుము. నాగదంతమహామునికి వ్యాసు లానతిచ్చిన తెరంగున సూతుండు
      శౌనకాదుల నుద్దేశించి.
మ. అది యట్లుండెను నాగదంత విను మత్యాశ్చర్య మింకొక్క టు
      న్నది యాలింపుము చంద్రపుష్కరమహాత్మ్యం బొండు మున్నచ్యుతున్
      మదిలో నుంచి సనత్కుమారుఁ డతిభీమంబౌ తపం బుర్వియున్
      జదలున్ యోగదవానలార్పులఁ దపింపం జేసె ఘోరంబుగన్.
క. ఇంద్రుఁ డదియెఱిఁగి యితఁడీ, సాంద్రతపం బెద్దివేడి సల్పెడినో ని
      స్తంద్రుండై యని మాన్పఁగ, చంద్రాస్యల ననుప వారు సంయమియెదురన్.
సీ. చల్లనై వలపులు జల్లుచు నసియాడు మలయాగశీతలమారుతములు
      కలయంగ పండువెన్నెలనిండ మిన్నంది పొడచూపె పున్నమ కడలిపట్టి
      మాయఁ బూయక పూచెఁ గాయకకాచెనా కనిపించె పేరుటామని తుపాకి
      వెలచాగనిలు పువ్వులకోలలుం బూని దండుపూనిక మదనుండు నిలిచె
      శారికాకీరకేకిమయూరహంస, కోకిలమధువ్రతాదులుక్కోలుగలసె
      పూనినసనత్కుమారు తపోవనమున, నెందుఁ జూచిన శతమన్యుఁ డెచ్చరించె.
క. జిలిబిలి పాటలు నాటలు, కులుకులు కిలకిలలు ముద్దుగొనండు వలుకుల్
      కలికిమిఠారపుఁజూపులు, గలయచ్చర లింద్రహితముగా వనవీథిన్.

సీ. శ్రుతి గూర్చె వీణతంత్రులు గుమ్మనఁగ రంభ బిరుదుపెండేరంబు బెట్టెహరిణి
      జడపారిజాతపూసరులు జుట్టె ఘృతాచి కళుకుబంగరుకాసెగట్టె హేమ
      తిలకంబు మృగనాభితీర్చె తిలోత్తమ మణిభూష లొనరించె మంజుఘోష
      కులుకుచుఁ బసిఁడిగజ్జెలు దాల్చె నూర్వశి చలువకుంకుచుపూసె చంద్రరేఖ
      యితరసురకామినులు తమయిచ్చవచ్చు, జాడ గైసేసి యమ్మహాశ్రమముఁ జేరి
      దేవతానాథు కనుసన్నహావభావ, హారిసరణి సనత్కుమారాగ్రసరణి.
క. మేళమ్ముగూడి దండెలు, తాళములును చంగులును మృదంగములు స
      మ్మేళము చేసిన యొసపరి, యాలాపము లెత్తి పాడి యాడిరి వరుసన్.
మ. అది చిత్తంబున జీరికిం గొనకఁ దా నంతర్ముఖాలోకమౌ
      మది నయ్యోగివరుండు మూర్తమగు బ్రహ్మధ్యానపారీణుఁడై
      కదలుంజూపు నెఱుంగుటన్ నదలిరా కంబబు చందంబునన్
      బదిలుండై తపమాచరింప దివిషడ్భామామణుల్ సిగ్గునన్,
ఉ. ఇమ్ముని కిన్కచేత నొకయించుకఁ గన్నులువిచ్చి చూడలే
      దమ్మకచెల్ల యింద్రుపలు కౌదలనున్నది యీతఁ డల్కచే
      హుమ్మని శాపమిచ్చిన బయోజభవుండు మరల్పఁజాలునే
      యిమ్మెయి మాని రండనుచు నేగిరి వచ్చినత్రోవ నందఱున్.
క. భూగోళ మెల్ల నిండె ది, శాగగనము లాక్రమించె సముదగ్రతపో
      యోగంబున ననలం బ, య్యోగిశిరోగ్రమున బుట్టి యుత్కీలలతోన్.
శా. లోకంబుల్ తపియించి రూపఱఁగ నాలోకించి నానామరు
      ల్లోకంబుల్ వికలాత్ములై కొలిచి రాలోకేశుఁ జేరంగ త
      న్నాకేశుండు పినాకియుం జని విపన్నస్వాంతులై ధాతతో
      లోకాధీశ సనత్కుమారు తపమాలోకింప వింతేనియున్.
శా. నీరంబుల్ తపియించి యింకి జలధుల్ నిర్వారులయ్యెన్ దతా
      గారంబుల్ దరికొన్నమాడ్కి భసితాకారంబు లయ్యెన్ బనుల్
      తీరెన్ సర్వచరాచరాత్మక ధరిత్రీప్రాణసంఘంబు నీ
      వేరూపంబున సృష్టి చేయు దొకటే యీమీఁద పద్మాసనా.
గీ. బీజమాత్రంబు చిక్కక బేలపోవు, నెల్లధరణిను నింతట నెచ్చరిల్లి
      కాన నిది వేళ తగినమార్గంబుఁ జూడు, మనిన నెంతయు భీతిల్లి యజ్ఞభవుఁడు.
శా. వారుం దాను మునీంద్రకోటియును గీర్వాణావలింగూడి యా
      క్షీరాంభోనిధిఁ జేరనేగి యచటన్ శ్వేతాహ్వయద్వీపమున్

      నీరేజాక్షుని వాసముం గని హరిన్ విష్ణున్ దయాసాగరున్
      వారల్ భావన జేసి నమ్రులయి కైవారంబుఁ గావింపుచున్.
సీ. దండంబు మీనానతార విహారున కభివాదనము కచ్ఛపాత్మకునకు
      మాయావరాహరమ్యశరీరునకు మ్రొక్కు లంజలి స్వామి హర్యక్షమూర్తి
      కారాధనము వామనాంగసంపన్నున కర్బనల్ పరశురామాపనుమున
      కర్ఘ్యపాద్యములు రామాభిధానవిలాసి కలరు దోయిళ్ళు నీలాంబరునకుఁ
      గృష్ణునకుఁ గేలుమోడ్పు కల్కికి జొహారు, శరణు నారాయణునకు శ్రీహరికి జోత
      లిందిరామందిరునకు నానంద మాది, పురుషునకు మంగళుంబు లీశ్వర ముకుంద.
మ. అని బ్రహ్మేశసురేంద్రముఖ్యసుర లాధ్యాత్మానుసంధానులై
      వినతుల్ వారలు నేర్చినట్టి కొలఁదిన్ వేఱ్వేఱఁ గావించి యో
      వనజాతేక్షణ భక్తవత్సల జగద్వాస్తన్య లోకంబు లె
      ల్లను మాయించె సనత్కుమారుతప మేలా యి ట్లుపేక్షింపఁగన్.
క. రక్షింపు జగంబులు మము, వీక్షింపు కృపాకటాక్షవీక్షణములఁ బ్ర
      త్యక్షముగా నీమూర్తి స, మక్షమముగఁ జూపు నీరజాక్ష యనంతా.
ఉ. ఇంతకు సర్వలోకములు నేమగునొక్కొ సనత్కుమారు ని
      శ్చింతతపోదవానలవిజృంభితఘోరశిఖాముఖంబులన్
      గొంతకుఁగొంత యైన నిలకుం బ్రజ నిల్వఁగఁజేయు మిందిరా
      కాంత! యనంత! తల్పత్రిజగద్భరణా! మొర యాలకింపవే.
మ. అని జేజే ల్గుమిచూడి గూయిడఁగ క్షీరాంభోధిరంగత్తరం
      గనికాయంబున నల్లబట్టుతెరలో కాకున్న నీరాస వ
      చ్చిన నీలాంబుదమాలికాచయమొ నా చీఁకట్లు మిన్నెల్ల నిం
      డెను క్రొంజీఁకటి గట్టియై కరడుగట్టెన్ మూర్తివంతంబుగన్.
క. ఆదిత్యతేజమనయవి, యై, దివ్యాదివ్యమంగళాకారముతో
      వేదాంతవేద్యమహిమము, తో దృగ్గోచరవిభూతితోఁ గనిపించెన్.
సీ. శశియొ కాదిది పాంచజన్యంబు రవియేమొ కాదిది పరమచక్రంబు గాని
      తమ్ములో కావు నేత్రమ్ములు నీలోత్పలమ్ములో కాదు దేహమ్ము గాని
      కస్తూరిపట్టియో కాదు శ్రీవత్సంబు జిలుకుటో కాదు పసిండిచేల
      గ్రహతారకంబులో కావు హారంబులు కనకాచలము గాదు గజవరుండు
      మూపు కొనుముత్తియపుజగ ముంచుగొడుగు, కాదు బోగింపవిశదభోగములు గాని
      జననభేదంబు లడఁగించు మనల భాగ్య, రాశి యౌర నితండు నారాయణుండు.

క. అనుచుం ప్రణవ నమోవా, కనిహితనారాయణాత్మక చతుర్ధ్యంతా
      భినుతి సమంచిత సాష్టాం, గనమస్కృతిపూర్వకంబుగా సురలెల్లన్.
క. సర్వమయ సర్వభావన , సర్వాత్మక సర్వసాక్షి సర్వశరణ్యా
      సర్వేశ సర్వ భావన, సర్వప్రద సర్వరూప సర్వారాధ్యా.
క. విశ్వనుత విశ్వానిర్మిత, విశ్వావన విక్వనిలయ విశ్వాధారా
      విశ్వేశ విశ్వరంజన, విశ్వాలయ విశ్వదూర విశ్వాకారా.
క. ఉరగాయుతేశ నత సు, స్థిరమూర్తి వచింత్యభుఁడవు చిరతరవిద్యా
      సురమూర్తివి పరమాత్మవు, పరమానందాత్మకుఁడవు బ్రహ్మమవు హరీ.
గీ. అనుచు నజహరముఖ్యులి ట్లభినుతించి, పల్కిరి సనత్కుమారు తపంబుచేత
      కమలిపోనున్న వెల్లలోకములుగాన, దెలియనిది మాన్చి మము కృపాదృష్టిఁ గనుము.
క. ఈయత్నమైనజాలున్, మాయందఱి పదవులెల్ల మన్ననతో మీ
      రాయోగివరున కిచ్చిన, యోయచ్యుత మాకు మిగులనుత్తమ మభవా!
ఉ. ఈతఁడు శూలి యీతఁ డజుఁ డీతఁ డితండు సురేశ్వరుండు మా
      చేతను గానికార్య మిది చిత్తములోఁ గృపయిచ్చి వేగ వి
      చ్చేతురు గాక యన్న నునుజైక్కులపై యెలనవ్వు మీఱ ల
      క్ష్మీతరుణీసహాయుఁడును జీవుల కానతి యిచ్చెఁ బ్రేమతోన్.
క. ఇపుడాసనత్కుమారుని, తప మే నెఱుఁగుదును వాని తలపొనగూర్తుం
      గృపచే మానుఁడు మీమీ, చపలత్వము లనుచుఁ బనిచె సకలామరులన్.
సీ. అత్యంతఖేదభయార్తులై వచ్చి శ్రీహరిఁ జూచి యలకొంటిరనుట యెంత
      యొదురు నారాయణస్మరణ పర్యవసానపావనంబును బూర్వభాషితంబు
      విన్నామెకామె యవ్వెన్నుఁ డింద్రాదుల ననిచి సనత్కుమారాశ్రముంబు
      తాజేరునపు డుపాధ్యాయుఁడై వెంట ననంతాహిరిపులు సేనాని పంచ
      సాధనమ్ములు శిష్యుల జాఢ కృష్ణ, మృగమహితచర్మపరిధానులగుచు దాను
      పలుక పాదార్థరుక్సామములను వరుస, నధ్యయన మొనరింపుచు ననుసరింప.
గీ. ఆగమాంతపురాణేతిహాసములు తి, రోహితాకారములను జేరుర భజింప
      నారదసనందనాదులు, బార్షదులును, భాగవతులును సురలు నప్పగిదిఁ గొలువ.
శా. చేరన్వచ్చి సనత్కుమారు నెదురన్ జిత్రంబుగా నిల్చు దే
      వారాధ్యుం గని లేచి యంజలిపుటీహస్తాబ్జుఁడై ధాతయో
      స్వారాజో హరుఁడో మరుండొ యితఁ డిచ్ఛారూపసంచారుఁడై
      యీరూపంబున నన్నుఁ బ్రోతునని లక్ష్మీశుండొ నిక్కంబుగన్.

మ. అన నయ్యోగ్యుఁడు చేరవచ్చి మునినాథా యీతపం బేల నీ
      కన నారాయణుఁ జూడ జనా నన్నమది నే యర్థంబు గామించినా
      వన మోక్షార్థిని మీఱ లెవ్వరన నే నాచార్యులందెల్ల పె
      ద్దను నీసేమముఁ గోరి వచ్చితిఁ జుమీ దైవానుకూలంబుగన్.
గీ. అనినవిని యస్మదభ్యుదయార్థి నగుచు, వచ్చితి నటన్న నీమాటవైపు జూడ
      మనుజుఁడవు కావు ననుఁ బ్రోతువనితలంతు, నాదినారాయణుఁడవు తథ్యంబు సుమ్ము.
క. వీరెవ్వ రాజినాంబర, ధారులు మీయాకృతికిని దగుశిష్యులు ని
      ట్లేరీతి గూర్చితిరి మీ , పేరును దలిదండ్రులెవరొ బేర్కొనుఁ డనుడున్.
సీ. ఎట్టిపేరనువాఁడ యెల్లపేరులు నావి గురుఁ డెవ్వ డందును గురుఁడ నేను
      యెందునుండుదునందు నెల్లచోటులనుందు నెవ్వారు తలిదండ్రు లెఱుఁగ నేను
      యిది జాతిపుట్టుక యిదియనఁగా లేదు నాకు జుట్టంబు లేనాట లేరు
      కాన నెన్నఁడు నార్తిగలయార్తులను బ్రోతు నేను నమ్మినవానిఁగాని జేర
      కారణము లేని శిష్యులు వీరు నాకు, జూతునని నన్ను నెవ్వరుఁ జూడలేరు
      కోరినను వారికిత్తును గోర్కెలెల్ల, వత్తు వలసినయెడ కిందు వచ్చినటుల.
క. నానాసుపర్వులందును, మౌనులను సనత్కుమారమౌనియు పరమ
      జ్ఞానాధికుఁ డుత్తముఁడన, నే నెప్పుడు వినుచు నునికి నిటు రావలసెన్.
గీ. నన్ను మీరెవ్వరని వేడినావు కొన్ని, యభ్యసించి యుపాధ్యాయులైనద్విజులు
      సకలమును నేర్తు గావున జగతి గురుల, కెల్లనుఁ బ్రధానగురుఁడని యెరుఁగు మనఘ.
క. దీనికి నిదర్శనంబుగ, మానసమున దెలియఁదగిన మర్మంబులు నీ
      చే నడిగి తెలుతుననుచు ర, మానాయకుఁ డా సనత్కుమారున కనియెన్.
సీ. జనులెల్ల జయపెట్టఁజను నర్థ మదియెద్ది మనుజులాడెడియట్టి మాటయెద్ది
      యందఱకును దృష్టియనియెడు పలుకెద్ది నొక్కటై బహుళమై యుండునెద్ది
      యాధారరూప మౌ నది యెద్ది విను పుట్టునెద్ది పుట్టకయుండునెద్ది తలఁప
      సత్తునసత్తునా జనియె నెద్ది జలంబు బహుజన్మమెద్ది నాప్రశ్న లెఱిఁగి
      వరుసగా నేర్పరుపుమన్న వాక్యములకు, నెరుసుగా ననుఁ బ్రోవఁగ నెంచి యిటకు
      జేరు నారాయణుఁడ వీవు వేరు సేయ, నేల మీ రానతిండన నిట్టులనియె.
క. నీతపముచేత నొగిలెన్, భూతలమని యెల్లవేలుపులు మొరయిడ నే
      నీతీరున వచ్చితి విను, నాతలఁచిన ప్రశ్నములకు నాయుత్తరముల్.
సీ. జనులు స్వధర్మానుసారంబు సేయుట యనృతంబు దొరలనియదియె మాట
      సూర్యుఁ డందఱకుఁ జక్షువునాగ విలసిల్లు ప్రకృతి యొక్కటియేని పలుకఁబడియె.

      బహుళంబు కార్య ప్రపంచవిధంబులు బహ్మ మాధారమై బరఁగుచుండు
      క్షరము పుట్టినది యక్షరము పుట్టనిదయ్యె సత్తీశ్వరుండు నసత్తు ప్రకృతి
      అజము పరమాత్మ బహుజన్ముఁ డతఁడె సుమ్ము, విష్ణుశక్తినె యంతయు విస్తరిల్లు
      నడుగు మిఁకయెద్ది సంశయంబనినఁ జూచి, వారిజాతాక్షునకు మునివర్యుఁ డనియె.
క. సందేహము లణఁగఁగ నీ, సందేశముఁ గోరియున్నఁ జాలదె మిగులన్
      సందేహంబులె నామది, సందడిగొనఁ బలికిలివి పొసంగదటన్నన్.
సీ. అనఘ సనత్కుమార నిజంబ పలికితి వనుమానములుఁ దీరు వినుము నీవు
      వేఱొక్కమార్గానువృత్తి ధర్మము హింస సోకకుండెడుమాట సూనృతంబు
      జ్ఞానదృష్టియె దృష్టిగా నెఱుంగుము కారణంబనియంటి బ్రహ్మంబె యొకటి
      కార్యకారణములగావె బహుత్వంబు విమలావతారభేదములచేత
      యతఁడె యాధారమును సత్తు నక్షరంబు, క్షరమున నసత్తు ప్రకృతియు జన్ముఁ డతఁడు
      తానె బహుజన్ముఁడయ్యు నింతయు నిజంబు, విష్ణుశక్తిని సర్వంలు విస్తరిల్లు.
క. కుణపప్రాయము నారా, యణశక్తిం బొదలదేని యఖిల మఖిలమౌ
      గణుతింపఁగఁ బవననభో, మణిహింపప్రముఖు లటుల మరిఁ బరికింపన్.
క. ఆరయ బరమవ్యోమా, కారంబున నిండియుండు కమలాక్షుఁడు శ్రీ
      నారాయణు నవ్విభునకు, వే ఱెందును లేదుసుమ్ము విశ్వమునందున్.
గీ. ఊర్జితంబును ముఖ్యమై నుండు నెద్ది, యందులను నిండియుండు నారాయణుండు
      సకలరూపచరాచరసంజ్ఞవలన, నడువగవలసిన నెద్ధియే నడుగవలయు.
క. అడిగితిరి మీరు నన్నని, యడిగిన యుత్తరములీ సమర్థుం డొకఁడే
      నుడివిడిరి మీరె మదిలో, విడువని సందేహలతలు విడివడిపోవన్.
సీ. సంశ్రితాశాపాశ శైవాలజాలంబు కామమోహాది నక్రవ్రజంబు
      ప్రతికూలతాపత్రయతరంగజాలంబు నిరత దుర్విషయవార్నిబిడితంబు
      క్రోధలోభాదిసంకులమీనజాలంబు బాంధనబడబాగ్ని బరిచయంబు
      రమణితనూజనిర్వర్తనిరంతరమాత్సర్యమదతమోమానితంబు
      నైన సంసారవారాశి నలసి మునిఁగి, యీది దరిఁజేర నేరక యేదు లొత్తు
      వానిగతియన మెఱుఁగనివాని నన్ను, గాతునని వచ్చినావు నిష్కారణముగ.
గీ. పెక్కుజన్మములను బుట్టిపెరిగియడఁగి, ఖేదమోదవియోగయోగాదిశయము
      భీషణాదికము లపార మెఱుఁగనట్టి, నన్ను నేరీతిఁ బ్రోచెదనన్న నలరి.
క. కమలాక్షుఁ డిట్టులనియెం, దిమిరము కన్నులను గప్పు తెరఁగున నజ్ఞా
      నము మదిఁ గప్పిన విజ్ఞా, నము దీపమురీతి వెలిగినన్ దమమడఁగున్.

క. జ్ఞానంబె హృదయసిద్ధయు, జ్ఞానమె శుభకారణమును జ్ఞానమె యానం
      దానుభవహితమగుటన్, జ్ఞానంబగు నావగడుపు సంసారాబ్ధిన్.
గీ. ఆత్మయనియెడు బుద్ధిని నాత్మయందు, ననుప సంసారభూరుహంబునకు నదియె
      హేతునగుఁగాన విజ్ఞానహేతిచేత , యది మొదల్గొని తెగఁగోయ నతఁడ యోగి.
క. ఓయాచార్యోత్తమ నిను, డాయుట మది నే నినిష్టుఁడనఁగా నలతున్
      మీయడుగులు జేరుటకయి, యే యత్నముఁ జేసినాఁడ హృదయములోనన్.
శా. కారుణ్యామృతసాగరుంవు మనఃకాలుష్యముల్ దీర్ప నీ
      వేరూపంబున బల్క నేర్తువన లక్ష్మీశుండు యోగీంద్ర నీ
      ప్రారంభించిన యాత్మయోగ మతిగోస్యం బేరికిం దెల్పరా
      దీరూపంబునఁ గూడ దెవ్వరికి నే నీ యొక్కడన్ దక్కఁగన్.
సీ. అదియెట్టులన్న యౌ నాశచే బయలుగా నఱకు సంసారకాననము నీవు
      శాస్త్రంబులందు నిశ్చయబుద్ధినునిచి యాప్రకృతిని విడనాడి పలుకునపుడు
      స్వస్తికామినయి యాసనములలో నొక్క యాసనంబంది లఘ్వాసివగుము
      పోనీక యింద్రియంబులవెంటఁ చిత్తంబు మగుడింపు నీవశంబగుచునుండు
      పొరయు మహదాదులెల్ల నబ్బురముఁజేసి, తోఁచినవియెల్ల మిథ్యగాఁ ద్రోచియపుడు
      నిలకడైయెద్ది నిలచి నీ నెమ్మనంబు, దానదవిలించి పొందు మాత్మానుభవము.
గీ. నిర్వికారంబు నిత్యంబు నిష్కళంక, మఖిలకర్మవిదూరమౌ నాత్మ నెఱిఁగి
      నాత్మ నానందసౌఖ్యరసానుభవము, నొంది సుఖియై రమింపు మేమున్నయటుల.
క. నీ వైదును రెండై తగు, నావరణము లుత్తరింప నది బ్రహ్మంబౌ
      కైవల్యము ముక్తియు నది, యావల మఱి లేదు నీకు యన్యము పలుకన్.
గీ. అనుభవైకవేద్య మగునది విశ్వాస, హీనులకును భక్తి లేనివారి
      కెందు నాస్తికులకు నిది యుపదేశింప, వలువ దనిన మౌనివర్యుఁ డలరి.
ఉ. విచ్చెను సంశయంబులు పవిత్రగుణాకర దాపశక్తి దా
      నెచ్చటనుండు పొంద నది యెక్కడ నున్నది బ్రహ్మ మెట్లు నా
      యిచ్చఁ దదాత్మతం బొరయనీయక యించుక చిక్కుఁదీర్ప నీ
      వచ్చినరాక నా సుకృతవాసనయున్ ఫలియింపఁ జేయదే.
గీ. అనిన నీక్రియ శ్రీమంతులైనవారు, నితరవిజ్ఞానపరతత్వ నిర్మలాత్యు
      లింద్రియీతీతప లడుగరే రిట్టిదనుచు, నెవ్వఁ డెఱిగించునని గురుఁ డిట్టులనియె.
క. మౌనీంద్ర మునుపు వింటివి, వీనుల నిది యనుభవైకవేద్యం బనఁగా
      జ్ఞానాధికు లెవరందురు, మానసమున బ్రహ్మమనెడు మహితార్థంబుల్.

క. పరమవ్యోమాకారము, పరిపూర్ణము నిత్య మనుచుఁ బలికిన మాటల్
      తెరఁగునఁ బోనిచ్చితి మీ, యెరుఁగమిఁ జాలించి కనుము హృదయములోనన్.
గీ. అనుచు నుపదేశమిచ్చి మాయాగురుండు, శిష్యులును దాను కనుమాయ జేసినట్లు
      యింద్రజాలకురీతి నదృశ్యుఁడైన, యబ్బురము నొంది ఖేదమోదాత్ముఁడగుచు.
మ. ఇతఁడే నాదుతపఃఫలం బితఁడే నాయిష్టార్థ మీతండె శ్రీ
      పతి యే నేల నెఱుంగనైతి యిక నాపాలింట రాకుండునే
      శ్రితసంరక్షణజాగరూకమతి లక్ష్మీజాని యందాక నే
      నతినిష్ఠం దపమాచరింతునని బ్రహ్మధ్యానపారీణుఁడై.
గీ. మోక్షమునకాదు సరణి ముముక్షుఘోర, కలుషజలరాశితరణి సౌఖ్యముల భరణి
      పుణ్యములకు సరణి చంద్రపుష్కరిణి స, మీపధరణి వసించె నమ్ముృడుని కరణి.
శా. ఏదేవుండు మహాశ్రమంబునకు నేఁ డెమ్మేనితో వచ్చెనో
      నేదేవుండు హితోపదేశమున తా నీడేర్చె నాచార్యుఁడై
      యేదేవుం గనలేక చింతిలిద నే నేప్రొద్దు నిచ్చో తపం
      బాదేవుం గురుతించి చేతునని యాత్మాలోలుఁడై యున్నచోన్.
మాలిని. కాంచనపక్షయుగంబు విదిర్చిన గందని బంగరుటొళ్ళె దిశల్
      మించి వసంతములాడు తురంగముమీఁద సురల్ ప్రణతాస్మయటం
      చంచల రానిగమావళి వందిచయం బయి మ్రోల నుతుల్ సలుపన్
      కాంచనగర్భుఁడు సన్నిధిఁ జేసిన గాంచి మునీందుఁ డెదుర్కొనియెన్.
క. కొనియర్ఘ్యపాద్యముఖ్యము, లొనరించి యుచితాసనమున నునిచి విరించిన్
      గని యాచార్యునిరాకయుఁ, దనకానతి యిచ్చుతెరఁగుఁ దగఁదెల్పుటయున్.
చ. వెరగున సంతసంబు నొదవించిన యాపలుకాలకించి యో
      పరమమునీంద్ర భక్తి సులభంబగు బ్రహ్మము రంగనుందిరాం
      తరనిలయంబు నీకుఁ బరతత్వముఁ దెల్పెఁ బ్రసన్నమూర్తియై
      హరి యతఁ డాత్మసాధనము లాశ్రితకోటియు శిష్యవర్గముల్.
ఉ. నీను కృతార్థచిత్తుఁడవు నీయెడ శౌరి ప్రసన్నమయ్యె నా
      శ్రీవరు మాదృశుల్ మునులు సిద్ధులుఁ గానఁగలేరు కొల్వు మ
      ద్దేవుని జంద్రపుష్కరిణి తీర్థములాడుము ముఖ్యసంపదల్
      కైవసమౌ నటన్న మదిఁ గ్రమ్మఱ ధాతను గాంచి యిట్లనున్.
క. ఈతీర్థమహిమ యెట్టిది , యీతీర్థములాడ ముక్తి కేఁగఁగవచ్చున్
      జీతఁకళంక మడఁగఁగ, నాతో వివరింపుమనిన నలినజుఁ డంతన్.

క. మానసతీర్థమె తీర్థము, గాని వృథా నీటమునుఁగఁ గల్గునె కైవ
      ల్యానందసుఖము గావున, జ్ఞానమె తీర్థంబు నిగమజాలము పలుకన్.
క. జ్ఞాన మపు డాత్మయగు న, జ్ఞానము జీవులకుఁ బ్రకృతిసంగతి గలిగెన్
      గాన త్రిగుణాత్మకము జడ, మా నది పుట్టువుల బీజ మరుదుఁగ బోల్పన్.
గీ. విత్తుచే చెట్టు చెట్టున విత్తు గలిగె, కడ యెఱుంగనిచందాన గర్మవశ్య
      జీవులకు నాదివాసన జెడదు గాన, వదలి కర్మంబు జ్ఞానిగావలయు సుమ్ము.
మ. తపముం దానము ధర్మముల్ వ్రతము తీర్థస్నానముల్ యజ్ఞముల్
      జపముల్ సత్యపరోపకారములు పూజల్ సప్తసంతానముల్
      నిపుణు ల్జేతురు మాధవార్పణముగా నిర్వాణలోభాత్ములై
      విపరీతంబుగ గోరిసేతు రథము ల్వీనిం బదిం గోరుటన్.
గీ. జ్ఞానశక్తికి నిదియెల్ల సాధనములు, జ్ఞాన మీశ్వరరూప మసంశయంబు
      జ్ఞానమే తీర్థమగు వెండి చంద్రపుష్క, రిణియె తీర్థంబు ముక్తికిఁ గారణమ్ము.
క. అయకారణమనుచు జితం, తయతిమనూక్తమగుఁ జేయుస్నానము దానన్
      లయమగుచు మహాపాతక, చయ మాకల్పంబుగాఁగ సంచితమయ్యెన్.
సీ. పాలనులై శుక్లపక్షపంచమినాఁడు సతిఁగూడి యందున స్నానమాడి
      తిలలు దాన మొనర్పఁ గలుగు సంతానంబు ఘృతదానమునఁ గల్గు సుతసమృద్ధి
      హేమప్రతిమ పర్కయెత్తు దానముసేయ మానును రాజయక్ష్మయును ధేను
      దానంబు తనజన్మతారలోఁ జేసిన జ్వరకుష్ఠుగుల్మరుజలు దొలఁగు
      పాపియుఁ గృతఘ్నుఁడును మద్యపాయి ద్రోహి, యందు మునిఁగిన యతఁడు కృతార్థుఁ డనుచు
      పుష్కరాక్షుండు కుముదుండు పుష్కరుండు, గాలుడును ప్రతీశుండు గాచువారు.
క. ఈయేవురు హరిదూతలు, పాయక యొకయోజనార్థపర్యంతము ర
      క్షాయుక్తి గాతురచ్చట, నీయయ్యల కెరగి గృంకు లిడుదురు నిపుణుల్.
గీ. సర్వమును సీతభానుఁ డచ్చటగృంక, పొలిచె పేరు చంద్రపుష్కరిణికి
      దానిమునిఁగి రంగధాముని సేవింపు, చుండుమనుచుఁ బద్మజుండు చనియె.
గీ. నాఁడునాటికి పోయి సనత్కుమారుఁ, డట్లు గావించె నీయితిహాస మెందు
      వినిన వ్రాసిన జదివిన మనుజులకును, మొదట ధర్మార్థపురుషార్థములు వసించు.
మ. విను మింకొక్క మహేతిహాసము జగద్విఖ్యాతమౌ దేవతా
      మునికంఠీరవ నాగదంత శ్రవణంబు ల్సంతసం బొందఁగా
      మును శూద్రుం డొక డెందు జీవనవిధంబుం గానఁగాలేక చౌ
      ర్యనిరూఢిం దరవాట్లుగొట్టుచు నహోరాత్రంబు లేజాడలన్.

గీ. కట్టి నానాట జీవులఁ గొట్టికొట్టి, గోద్విజశ్రీవధాదులు కోట్లకొలఁది
      సేయుచును మీ రెఱుంగక జీవనంబు, నడుపుచుండఁగ నొక పురాణద్విజుండు.
క. త్రోవనురా నెటుపోయెదు, పోవగనిత్తునె తెగించి పొలియింపక నా
      చేవాలున ననఁబరువున, రావెఱచి భయార్తుఁ డగుచు బ్రాహ్మణుఁ డనియెన్.
శా. చేతన్ బైకము లేదు వస్త్రము శతచ్ఛిద్రంబు భిక్షాశన
      వ్రాతం బాత్మ శరీర మేమిటికి నాప్రాణంబులాశింప నా
      యాతాయాతము లేమి నీ వెఱుఁగవే యశ్రాంతహింసాస్యమ
      జ్జాత్తాశంబై భవత్ప్రచార మతివిశ్వాసంబు మోసంబకో.
క. వలదని చోరుండింతటి, చులకని బాపడవు హేతుశూన్యుఁడవయ్యుం
      బలుకార్యములున్న గతినె, తలఁపున నెటుఁబోయెదనిన ధాత్రీసురుఁడున్.
ఉ. పోయెదఁ జంద్రపుష్కరిణిపొంతను స్నాన మొనర్ప దేవతా
      ధ్యేయుని శేషశాయిని రమేశుని రంగనిఁ గొల్చి ఖేదముల్
      మాయగఁజేయు నన్న నిజమా యిది నమ్ముకు నీదుమాట వి
      చ్చేయుము చంద్రపుష్కరిణి జేరువనున్నది యో ద్విజోత్తమా.
క. రంగమను మాట వినినఁ, గఱంగు న్నామనను దగ్గఱనెయున్నది యే
      నెంగలినై యిన్నాళ్లును, దొంగిలిసాకితిని పక్షి డక్కె మహాత్మా.
క. ఈమాట విన్నయప్పుడె, నామతిఁ గడు భీతిపుచ్చి నానడకలకై
      యే మీవెంటనె వచ్చెద, సామీ కడతేర్పుమనుచు జాగిలి మ్రొక్కెన్.
ఉ. మ్రొక్కిన భీతియేమిటికి ముందర నున్నది రంగమందిరం
      బిక్కడి కామదాసరసు నీపగ లింటికిఁజేరవచ్చు ర
      మ్మక్కడి కేల పాపభయమం దెడవంచు ద్విజుండు బోయినం
      దెక్కలికాడు జేరె మహి దేనలలామము రంగధామమున్.
గీ. చంద్రపుష్కరిణినామ సరసిఁ జేరి, పాపములు వోయి యున్నాడె ప్రాణములును
      వాసి పంచత్వ మొందిన వచ్చిరపుడె, జమునిదూతలు కట్టుకుచనిరి వాని.
క. యాతనలం బొదలించుచు, చేతులు బిగఁబట్టి కొట్టి సేనిబాధ
      ల్పాతాళింపఁగఁజేయుచు, దూతలు చనజూచి విష్ణుదూతలు కరుణన్.
మ. కరుణాలోకులు విష్ణుసాధనకరు ల్కంజాతపత్రేక్షణుల్
      శరణాభ్యాతరక్షలక్షములు రాజత్కాంచనచ్ఛాదనుల్
      వరకేయూరకిరీటకుండలు లలాటాక్షోర్ధ్వపుండ్రాంకు లు
      త్కరులై మాత్రవతీశు యానతిని వక్కాణింపుచున్ వ్రేల్మిడిన్.

ఉ. పోకుడు పోకు డెక్కడికిఁబోయెదు రోరి దురాత్ములార మీ
      రాకడ పొట్టకొవ్వులను రంగము చెంగట సాగనిత్తుమే
      యాకడ మిమ్మునంపిన మదాంధురి కన్సులనీళ్లు రావలెన్
      మీకును బుద్ధి రావలెను మీఁదటి కైనఁ దలంచుకోవలెన్.
మ. అనుచుం గాంచనకింకిణీరవము తో నాబద్ధమాల్యాసితో
      మినుకుల్ దట్టపుఁ బట్టెనామములతో మేలుక్కునన్ బోసితె
      చ్చిన దుడ్లు గుదికోలలుం దరుముచున్ జేకొల్దలన్ మోది యొ
      క్కనిఁ బోనీయక సుంకురాలిచిన రక్తస్రావగాత్రంబులన్.
గీ. తలలు పగిలియు నెమ్ములు నలిగి పండ్లు, డుల్లి మొగములు జెదరి మూర్చిల్లి యముని
      కింకరులువద్ద చోరునికెలకుఁ జేరి, కట్లు విడిచి హితాలాపకలన దేర్చి.
క. ఉపలాలన మొనరింస, నపు డయ్యమభటులు మీర లందఱు నెవ్వా
      రిపుడును మీనెల వెక్కడ, నిపుడును దండనముఁ జేయ నేటికి మమ్మున్.
గీ. ధరణిఁ గల జీవులకు నెల్ల దండధరుఁడు, కర మాస్వామి యితఁడు లోకమునఁ గలుగు
      సుకృతదుష్కృతకర్మవశ్యులు మదీయ, శాసనములకు లోఁగాకఁ జనుట లేదు
గీ. మంచివారికి మేమును మంచివార, మనుచుఁ బుణ్యపునెలవుల కనుపుచుందు
      మేము పాపాత్ములకు నతిభీమమైన, తనువులను నుంతు మెల్లయాతనల వారి.
క. అనయము హింసాకారుని, పెనుబాముల గొనుచుబోవ పిడుగులవలెఁ బి
      ల్వని పేరంటము మీరిట, లనిమిత్తము వచ్చి మమ్ము నరికట్టునుదురే.
క. ఊరకపొమ్మని పోవక, చోరునిఁ బడవైచి మమ్ముఁ జుట్టుకు మోదం
      గారణ మెయ్యది, మీకన, పారిషదుల్ యమభటులఁ బలికిరి కినుకన్.
సీ. విను దండధరుని శమనుని దూతలమన్న పలుకు విష్వక్సేన భటుల మేము
      శ్రీమహితాష్టాక్షరీ మహామంత్రంబు సర్వార్థములు మాకు సాధనంబు
      మీరన్న కెమ్మది మిగుల కాలుండును కాలాదిగతి నొంది కాలవశ్యు
      లైనవారికిఁ గర్తకాని కాలాత్ముఁడౌ హరికింకరులలోన నతఁడు యుండు
      గాని హరియున్నవాఁడు పుష్కరిణి చెంత, రంగధామాఖ్యమగు శరీరంబుదాల్చి
      యగనియనుమతిచే సూత్రపతిమగండు, కావుమనినాఁడు చంద్రపుష్కరిణి ముమ్ము.
క. ఎనిమిదిదిక్కుల నుండుదు, మెనిమిది మేల్ సైన్యనాథుఁ డిటుభటులము దు
      ర్గమక్షేత్రపాలు గణపతి, ననిచినవాఁ డతని నిపుడు యాలమునందున్.
క. శ్రీలింగరాజు తేజం బేరికినిం జూడనిట్లు . . . . . . . . . . . . గు తిరుకా
      వేరీ లహరీ శీకర, పూరితపవనములు వొలయ భూవలయమునన్.

సీ. కదలునే పూరికులదరి తేనెలు చింద తనయిచ్చఁ బవనకందళచయంబు
      మొదలువచ్చునే మంచు గదియించి కల్వలు మొగుడింప జక్కవ బగరకైన
      కాయునే పేరెండ కామినీవనముల్ చమరింప వేసవి కుముదవైరి
      కురియునే సస్యవిస్ఫురణకై తగినట్టి వానమాత్రమె కాక వారిదములు
      మినుకవత్తువె ప్రజ లుర్విమీఁద నిచటి, కిమ్మనఁగవచ్చునే యమకింకరులకు
      నెపుడు మదనుగ్రహము లేక యిహపరైక, మంగళప్రదమైన శ్రీరంగమందు.
క. ఆదేవుని సేవకు బ్ర, హ్మాదులు మాయాజ్ఞ మీఱి యడుగిడగలరే
      వేదాంతవేద్యుఁ గని మధు, సూధనుఁ డిల భక్తులకును సులభుం డయ్యెన్.
క. అరయ కల్పాంతంబులు, శ్రీరంగము కట్ట కబ్ధిజీవనములలో
      నారూఢి సర్వశక్తుల, తో రంగస్వామి కెపుడు తోడైయుండున్.
క. అందున్నవారు కాలుని, సందడికిం బోరు వీరు చనియెడిమార్గం
      బందమయి వేఱె యున్నది, యందిన ఫలమగుచు వైష్ణవావళి కెల్లన్.
మ. ఇతఁడీతీర్థముఁ జూడఁగోరియెకదా యిచ్చోటికిన్ వచ్చి తా
      మృతుఁడయ్యెం గడుకల్మషంబులను నేమీ వీడు పోరామియే
      కృతపుణ్యుం డీతఁ డెత్తనుండియును రంగేశాధివాసంబు మీ
      బ్రతుకుల్ వేడిన తేరిచూడకుడు రాఁ బాటిల్ల దిచ్చోటికిన్.
క. అనివారిఁ దరిమి చోరుని, ననురాగము మీర మేను హస్తమ్ములచే
      తనిమిరి యంతట వృషభము, పెనురొంపిని దేరి లేచు వేగిర వారల్.
క. పరిశుద్ధశరీరుండగు, పురుషుని గొనివచ్చి చంద్రపుష్కరిణీ పు
      ష్కరములను ముంచి రంగే, శ్వరులను సేవింపఁజేయ సైన్యాధిపుడున్.
గీ. తనదుచిహ్నంబు లిచ్చి యాతని తదీయ, పార్శ్వచరులందు నొకనిగా పదవి నొసఁగి
      యునుప నిత్యుఁడు ముక్తుఁడై యుండె నతఁడు, తిరిగిజూచుచు యమునికింకరులు జనిరి.
మ. చని నిట్టూర్పులుతోడ నంతకుని నాస్థానంబులోఁ గూయిడన్
      వినియే మే మనిదండపాణియను తద్వృత్తాంత మాద్యంతమున్
      తనదూతల్ వినుపించి కాయములు గందన్ మోదుకో గా యముం
      డును సత్యాగ్రహవృత్తి కన్నుగొనలందు న్నీరముల్ గారఁగన్.
మ. భృకుటీపాశమహాభుజంగరమణీఫూత్కారమోహామయా
      ధికనిశ్వాససమీరుఁడై భయరసస్ఫీతోగ్రదంష్ట్రావళీ
      శకనీభూతనిజోష్ఠశోణితతతస్రావప్రభాపుంజభీ
      మకటాక్షుండయి కాలుఁ డాగ్రహము దుర్మానం బనూనంబుగన్.

క. నాయాజ్ఞ దాటి యంతలు, సేయఁగ నెవ్వారు గలరు శ్రీసృష్టిని వా
      రేయెడ దాగన్నేరుతు, రీయత్నముఁ జేసి కాచు నెవ్వరు వారిన్.
మ. అని యాలోచనఁ జేసి కాకనుచు మీ రాసహ్యజాతీరభూ
      మిని శ్రీపుష్కరతీర్థ మున్నదియ యమ్మేరం జుమీ రంగధా
      ముని తాఁ దెచ్చి విభీషణుం డునిచె నమ్ముద్రాధికారుల్ మిముం
      గినుకంగొట్టిరె మోసమయ్యెనని తా కేల్మోడ్చి కన్మూయుచున్.
క. భావించి పసిఁడిగుదియలతో నవమాలికలతో చతుర్భుజములతో
      శ్రీవరులు ముచ్చుదాసరి, తో వైష్ణవు లచటనుండ దోఁచె న్మదికిన్.
చ. తరణితనూజుఁ డిట్లు హరిదాసుల చంద మెఱింగి యక్కటా
      యెఱుఁగక పోతి రచ్చటికి నెన్నటికిం గఱిగట్టి మీరలా
      తెరఁగున మెల్గఁగావలదు తెల్పితిఁ దెల్పితి రంగధాముఁ డా
      పొరుగున నిల్లుగట్టుకొనె పుష్కరతీర్థముఁ జేరవచ్చునే.
క. శ్రీరంగయోజనార్థము, చేరకు డెన్నటికి నచటిజనులున్ జ్ఞానా
      ధారు లిఁక బ్రతుకవలసిన, మీరెఱుఁగకఁ బోయెదరుసుమీ యని పలుకన్.
గీ. వారలును గొల్వులో నున్నవారు వెరచి, అయ్య తలవట్టి చూచుకొన్నట్టులాయె
      వార లెటు వోయె రేమి శ్రీవైష్ణవులును, డాయవలసిన మీరాజ్ఞ సేయుఁ డెపుడు.
క. వీటికి సహ్యజలోపల, నాటె విభీషణుడు రంగధాముని సరసుల్
      కోటులుగల్గియు పుష్కర, మేటికి నుతిగాంచె నానతిండని పలుకన్.
క. తెలిపెదను తాళుఁడని కర, ములు కన్నులు మొగిచి రంగమును రంగేశున్
      దలఁచి తలంబున తా సా, గిలి మ్రొక్కి యథావిధి స్వకీయుల కనియెన్.
ఉ. మా కేిది సర్వశోభనకరంబు వినుం డుపనీతిఁ బల్కినా
      రీకథ యవ్విభీషణుఁ డనేకులు మౌనులు వేడునట్లనన్
      లోకములన్నియుం దనదులోనిడి యొక్కఁడు నిల్చి దుగ్ధనీ
      రాకచలోలవీచికలయందు భుజంగమతల్పశాయియై.
గీ. ఆదినారాయణుఁడు పరమాత్ముఁ డవ్య
      యుండు సకలాత్మకుఁడు చిన్మయుఁడు మొదలు
      సృష్టి కుద్యుక్తుఁడైన రాజీవ మొకటి
      నాభియం దుదయించె సనాతనముగ.
మ. కలిగెం దత్కమలంబులో కనకభృంగప్రాయుఁడై వింతగా
      నలుమోము ల్గల వేల్పుపెద్ద యతఁ డన్నాళీకగర్భంబునన్

      బొలుపౌ గర్ణికఁ గూరుచుండి దిశలంభోరాశియుం జూచి యీ
      జలజం బెచ్చటనుండి పుట్టెనొకొ నాజన్మంబు తీరెట్టిదో.
క. తోడెవ్వరులే రీక్రియ, నేఁడు బొడమి యమితభయము నియతి గనియె నిం
      దేడ మొదల్కొని మొలచెనొ, జూడఁగవలెననుచు శరధిఁ జొచ్చె విశంకన్.
ఉ. తామరతూఁడుఁ బట్టుకొని ధాత యధోముఖుఁడై చనంజనన్
      సోమరిపాటు భీతియును జూచెనెకాని సరోజమూలమీ
      దీమున నున్నదంచు గను తేకువజాలక నాళ మూఁతగాఁ
      దా మొదలింటియట్ల నిజధామసరోజము చేరెఁ జింతతోన్.
క. ది క్కెవ్వ రేమి సేయుదు
      నెక్కడ చనువాఁడ ననుచు నిలయు గగనమున్
      దిక్కులుఁ జూచుచు భయమున
      నొక్కఁడు దిగులుపడియుండియు నుపాయమునన్.
క. అపు డంబరభాగంబున, 'దప' యను వాక్యములు విశ్రుతంబరుడు తనుం
      దపమొనరింప నెవ్వరొ, యిపు డానతియిచ్చిరనుచు దృహిణుం డంతన్.
గీ. తపము బహుదివ్యవర్షశతంబు లతఁడు, సేయు మిన్నున మఱియును చిత్రలీల
      హంసమొక్కటి పొడచూపి యాద్యమైన , ప్రణవ ముపదేశ మిచ్చి కన్పడక దొలఁగె.
క. అది యుచ్చరింపుచును దా, వదలక తపమాచరించె ననజాసనుఁడున్
      మొదటిగతి హంసము హితం, బొదవగ వ్యాహృతులు మూడు నువదేశించెన్.
క. మౌనివర హంస మంత, ర్ధానము నొందిన విరించి తపమొనరించెన్
      బూనుకొని మఱియు నిగమము, పైనాలుగు వ్యాహృతులు సమంచితమయ్యెన్.
క. వెట్టుకొని యజుఁడు పూనిక , గట్టిగ తపమాచరింపఁగా శ్రీపతి స్వా
      రాట్టన.................సా, మ్రాట్టన బొడచూపె బహుతరవ్యూహములన్.
గీ. కడలితెరలెల్లఁ దెరలుగా కపటనాట, కముల వివిధరూపముల..........వచ్చు
      జాడ సాక్షాత్కరింపుచో జలజగర్భుఁ, డుల్లమున కొల్లములుజేసి యూరకున్న.
క. ఆవెనుక నీవిమానము, నీవిషధరరాజతల్ప మీశయనవిధం
      శ్రీవాసుదేవవిగ్రహ, మీ విమలువిభూతి మెరయ నిశకోటిరుచిన్.
క. కడకట్టినట్టి యాకృతి, బొడకట్టిన రంగవిభుని సొలుపు మనమునన్
      గడకట్టిన కమలజుడున్, పెడకట్టుతనంబు లేక ప్రియభయములతోన్.
ఉ. సాగిలిమ్రొక్కి దేరికను సాగిలిమ్రొక్కును చిందులాడుచున్
      సాగిలిమ్రొక్కు బిట్టగొను సాగిలిమ్రొక్కును నవ్వు నూరకే

      సాగిలిమ్రొక్కు మేన్మరచు సాగిలిమ్రొక్కిన దృశ్యనేత్రుఁడై
      సాగిలిమ్రొక్కుచున్ బొగడు సాగిలిమ్రొక్కు నెఱుంగడేమియున్.
గీ. అలసి రంగేశకరుణాకటాక్షమహిమ, తుందుడుకుమాని యానందమంది యలరి
      రంగ రంగనివాస శ్రీరంగశయన, రంగనాయక రంగేశ రంగధామ.
చ. కుదురు సమస్తలోకములకుఁ జఠరంబని జీర్ణశంకచే
      బదిలముగాఁగ నుంచి వలప్రక్కగ కంటికి నిద్రలేక నీ
      వొదికిలి యింతయెచ్చరిక నుండగ నోర్తుమె తండ్రి నీలనీ
      రదనిభమైన గాత్రమున నునే రంగవిహార భుజంగతల్పకా.
గీ. ఎన్నితల లెన్నివదనంబు లెన్నికన్ను , లెన్నికా ళ్ళెన్నిచేతులు నెన్నివ్రేళ్ళు
      నాకుఁ బ్రత్యక్షమైనట్టి మీకు నేను, మెత్తునే జూచి యెటులైన మెత్తుగాక.
గీ. శ్రీమహితమైన శ్రీరంగధామమునకు, ప్రియతమంబైన మీశేషశయనమునకు
      దివ్యమంగళమైన మీదేహమునకు, మంగళము మంగళము నిత్యమంగళంబు.
క. అందము నానందాదిమ, కందము నర్థితకటాక్షకలితామృతవా
      క్స్యందమునగు నీయాకృతి, చందము మీకె తగుగాక సామ్యము గలదే.
ఉ. ఏ నెడబాసి మిమ్ము క్షణమేనియుఁ దాళఁగఁజాలనయ్య మీ
      ధ్యానమెకాని యేనిముషమైన తదన్యము నొల్లనయ్య మీ
      మానితమూర్తిఁ జూచి కడమంబు సహింతునటయ్య జూడ భో
      గానుశయాన రంగపతి యిట్లనె యుండగదయ్య నాకడన్.
గీ. అనిన రంగావతార నారాయణుండు, భక్తసులభుండు తానొడఁబడి విరించి
      రమ్ము నీయింట వసియింతు నమ్ము పూజ, లిమ్ము గావింపు మిది సమ్మతమ్ము మాకు.
క. అని తను నిల్చిన ధాతయు, జని నిజనిర్మాణమైన సత్యాఖ్యంబౌ
      తనలోకము నారాధనమును చేయుచు నెమ్మతములు మున్నొలయంగన్.
మ. జగముల్ తా పదునాల్గు వేరువరుసన్ స్రష్టృత్వమున్ వైష్ణవం
      బగు శ్రీమంత్రమహానుభావమున లోకారాధ్యతం జెందె నా
      సగుణబ్రహ్మము రంగధాముఁడె సుమీ సహ్యోద్భవ న్నిల్చె నీ
      భగవద్భక్తుల దేరచూడనగునే బ్రహ్మాదిదేవాళికిన్.
క. అన వారందఱు వోయిన, తనయ యిదేమిటికి రంగధామము కావే
      రిని బాదుకొనియె రంగముఁ, దనుజుం డేకరణిఁ దెచ్చె ననియడుగుటయున్.
క. ఆకథ నే వినిపించెద, మీకు విభీషణుఁడు తథ్య మీహితకావే
      రీకూలవనీనిలయా, నేకములును గంధపుష్పనిచయాపహతిన్.

లయగ్రాహి. చందన కురంట కుజ చందన కుమార హరి
                  చందన కుట న్నట ముకుంద కదళీ మా
      కంద కరవీర పిచుమంద ఫలపూర ముచు
                  ళింద మనసార కురువింద వట పూగ హరి
      కుంద వకుళా మలక బృంద సుకుమార మక
                  రంద మహనీయరస తుందిల విలాసా
      దిందిరనినాదములు మందగతి వీనులకు
                  విందులుగ నవ్వనములందుఁ జను చోటన్.
క. కడువిరియక నెరవాసన, లుడివోవక పువ్వుతేనె లురులక తేటుల్
      నుడియక పసిదేరక కను, ముడుపుం బువ్వులు ప్రధానముఖ్యులు దానున్.
గీ. స్నానము లొనర్చి శుభ్రవస్త్రములు గట్టి, వలువలిడు నారికెడపుగూడలును గంద
      నునములు ముక్కునూర్పులు సోకకుండ, పావగట్టి కోయించుచుఁ బరుకులిడుచు
క. ఆయాశ్రమములు తపములు, సేయుచునున్నట్టి మౌనిశేఖరులకుఁ దా
      చేయెత్తి మ్రొక్కి నిలిచిన, నాయోగివరేణ్యులకు నయాలాపములన్.
క. ఎవ్వాఁడవు పేరెయ్యది, పువ్వులతోటలె మునీంద్ర పుణ్యాశ్రమముల్
      నవ్వులకునైన నిచ్చటి, క్రొవ్విరు లందినను వెనక గొడవలు వచ్చున్.
క. పావనమూర్తివి నీవే, రావణతమ్ముఁడవొ మున్నె రఘురామునిచే
      నీవృత్తాంతము వింటిని, దీవెన లీవలయుఁ బలుకు తెలివిడిగాఁగన్.
ఉ. తప్పదు నీవె రావణునితమ్ముడవైన విభీషణుండ వీ
      విప్పని కేల వచ్చితివి నిక్కము పల్కుమటన్న రాముచే
      నప్పుడు నాదువృత్తము దశాశనుచైదియు సీతచంద మా
      తప్పునకై మదగ్రజువధక్రియయున్ వినియున్నవారుగన్.
క. ఈ తెరఁగు మీరు రఘువరు, చేత న్వినినట్టికతన జెప్పఁగ పనిలే
      దీతలవృత్తాంతము నా, చేత న్వినుఁడయ్య పూజ సేయఁగవలయున్.
సీ. అనిన నమ్మౌను లోయనఘ యేదెల్ప నారాధించి దేవు శ్రీరంగవిభుని
      యిపు డయోధ్యకుఁ బోయి తేలేదు తెచ్చితి వేరీతి రఘురాముఁ డిచ్చె నీకు
      నేమిటికై నిన్ను నెడబాయువేనన్న నెందుబోయెదు లంక కేగవలయు
      నెందునుంచితివి రంగేశ్వరు కావేరినడుచక్కి, నిప్పు డున్నాఁడు చూడ
      దేటి మాతపములపంటలేటి భక్త, పారిజాతంబు నీవెంత భాగ్యశాలి
      వజుని మన్వాదులైన రామాన్వయులను, కడచి నీవారిభాగ్యంబు కైవసంబు.

క. లోకైకకంటకుండు త్రి, లోకభయకరుఁ డధర్మలోలుఁడు బహుదో
      షాకలితుఁడు రావణున కీ, వేకరణిం దోడబుట్టితివి పుణ్యుఁడవై.
గీ. అకట నాభియు నిర్విషం బొకటఁ బుట్టి, నటుల హాలాహలమమృత మబ్ధిఁ బుట్టి
      నటుల పౌలస్త్యు లైతిరి ట్లన్నదమ్ము, లిట్టివారౌట గాన మేపుట్టువులను.
క. శ్రీరాముఁడు కనికని నీ, కేరీతిని రంగధాము నిచ్చెఁ గలతెరం
      గెరుపఱచి మరిపొమ్మని, నారలు కౌఁగిటను గ్రుచ్చి వలగొని భక్తిన్.
గీ. రంగధామంబు ఇచ్చి నీయంగ మెట్ల, పావనతఁ గాంచె నేమును పావనులము
      నిన్ను నాలింగనముఁ జేసి నీకు నెట్లు, పరుసవేదిని సరియంచుఁ బలుకవచ్చు.
సీ. నావుఁడు నోమౌనినాయకులార మిమ్మందఱ రాము పట్టాభిషేక
      వేళ జూచినవాఁడ విన్నారెకాదె తత్పూర్వరామాయణ పుణ్యచరిత
      తరువాత కథ నయోధ్యాపట్టణంబులో నడచిన తెరఁగు విన్నపము చేతు
      భానుసూనుఁడు వసిష్ఠానుమతంబు పట్టంబు రఘుపతి గట్టబనిచె
      ననశనవ్రతసంకల్పు నపగతాత్ము
      నింద్రు నజు రక్షణోన్మేష జాగ
      రూకున సుఖోపతుల్యుగాత్రుని సుమిత్ర
      తనయు లక్ష్మణుఁ జూచి సీతావరుండు.
క. మము నెల్లఁ బ్రేరకులుగా, సమకట్టి బ్రియోక్తు లాడి సముచితయువరా
      జ్యమునకు పట్టముఁ గట్టన్, సుమహాప్రార్థనలు సేయ సుస్థిరమతియై.
క. తా నొల్లనని సుమిత్రా, సూనునికడ కోరసిల్ల శుభమతి భరతుం
      బూనించిరి మౌనులు రా, మానుమతిం దదనుసారి యగురాజ్యంబున్.
ఉ. వాలితనూజభానుజుల వారిప్రధానుల నున్నవారలన్
      మేలగు కట్టువర్గము లమేయవిభూషణగంధమానతాం
      బూలము లిచ్చి పంచినను బూర్ణమయం బగుదృష్టిఁ జూచి మీ
      ప్రోలున కేగుమన్న నగఁబొంది తనుం బెడబాయజాలమిన్.
ఉ. ఇచ్చితి నాదుసొమ్ము లివి యిందఱికిన్ మును బ్రహ్మపాలిటన్
      వచ్చిన భాగ్యరాశి పరవస్తువు దెచ్చి మనుప్రభుండు తా
      మెచ్చఁగఁజేసె నిప్పురికి మిత్రకులీనుఁడు మామనీనువీ
      లచ్చలలీలఁ గల్మి నగలాసల పెన్నిధి దాచి రందఱున్.
క. నా కిది కులవనమై తగు, నా కిది ప్రాణాధికంబు నా కిది సకల
      శ్రీకారణ మే నిచ్చితి, నీకుం గొనిచనుము పురికి నెమ్మది ననుచున్.

క. తనహస్తసరసిజంబున, పెనుసజ్జఁ దెమల్చి తెచ్చి పెట్టిన నే గ్ర
      క్కున మౌళిఁ దాల్చి రాముని, యనుమతమున గగనవీథి నరుదేరంగన్.
మ. ఒకచే తుంబురునారదాస్యతరగానోత్తానరావంబు వే
      రొకచో దేవవిలాసినీచతురభావోన్మేషలాస్యక్రమం
      బొకచో దివ్యమృదంగదుందుభిరవం బొండొక్కచో మారుత
      ప్రకరామోదము లొక్కచోట సుమవర్షంబు ల్విరాజిల్లఁగన్.
క. ఈచాయఁ గవేరాత్మజ, నీచలుపలకలికితోపు లిమ్మౌనిచయం
      బీచంద మేమొకోయని, యీచక్కని యిసుకదీవు లేఁ గనుఁగొంటిన్.
గీ. చూచి పో గాళ్ళురాక యిచ్చోట డిగ్గి
      రంగపతి నొక్కయిసుకయరంగుమీఁద
      నుంచి కావేటమునిఁగి పూజించు కొఱకు
      పువ్వులకు వచ్చి మిముఁ జూచి పోవఁ దలఁచి.
క. వచ్చితి ననవుడు వారలు, మచ్చికతో రంగధాముమారుగ నతని
      న్ముచ్చటలు జూచి కౌఁగిట, గ్రుచ్చుచు దనుజేంద్రు గ్రుచ్చుకొని భయభక్తిన్.
క. అందఱును గూడి కన్నుల, విందులుగా రంగధామ విగ్రహ మత్యా
      నందముతో సేవింపఁగ, క్రొందలిరుల పూజకేసి కొలిచి యతండున్.
ఉ. లంకకుఁ బోవ నెంచి తనలావున దివ్యవిమానశేఖరం
      బంకెకు రాకయున్న కడునార్తి వహించు విభీషణున్ రమా
      లంకరణంబుఁ జూచి కడులావున జూచి వరంబులిచ్చి పొ
      మ్మంకిలిలేక యుండుమని యానతినిచ్చి కృపావిభూతితోన్.
గీ. దానవేంద్రుని నిజరాజధాని కనిచి, యచట వసియించె నాదినారాయణుండు
      గాన మనయాజ్ఞ లచట సాగవు తలంప, వలదు శ్రీరంగవాసుల వర్తనములు.
క. అని రంగాభిముఖంబుగ, తనకరములు మగుడనెత్తి దండంబిడిన
      న్వినునారందఱు నట్లన, వినయంబున జాగి మ్రొక్కి విశ్వాసములన్.
క. వెలయుటను జేసి యీకథ, యిల నెవ్వరు వినినవార లినతనయునిచే
      నలజడినొందక యిహపర, విలసనశోభనము లొంది నెలముదు రెందున్.
శా. సాంఖ్యాతీరగుణైకసంశ్రయసమంచద్యోగవేదాంతవా
      క్సంఖ్యాదిప్రభమారశాస్త్రవిదితస్వాభావ్యభవ్యాత్మకా
      సంఖ్యాక్ష్మాతలఖండితాసురచమూస్వాయప్రతాపోదయా
      సంఖ్యాతజ్జనతావిపద్దననిరాసప్రావృషాఖ్యాంబుదా.

క. నవనీతచోర పావన, భవనా కరుణాపయోధి భాసురచరణా
      దివికేశవంద్య సత్య, ప్రవణావర యోగివినుత పరమాభరణా.
పంచచామరము. శ్రీకథాత్మ సత్కథాతిహృష్టవరద నారదా
      శ్రీకరాతి లాలితాంఘ్రిసేన నిఖిల పారదా
      లోకరక్షణైకచరణ లోకన ప్రచారగా
      ద్వికరతాతిరాడహార్య శృంగ సంగ నీరదా.

గద్య
ఇది శ్రీవేంకటేశ్వర వరప్రసాదాసాదిత చాటుధారానిరాఘాట సరస చతుర్విధ
కవిత్వరచనాచమత్కార సకల విద్వజ్జనాధార కట్టహరిదాసరాజగర్భాబ్ధి
చంద్రవరదరాజేంద్రప్రణీతంబైన గారుడపురాణశతాధ్యాయి
శ్రీరంగమాహాత్మ్యం బను మహాప్రబంధంబునందుఁ
దృతీయాశ్వాసము.