శ్రీకృష్ణుడు చూపిన మార్గము/అనుబంధము 3

అనుబంధము 3.

గీత: ధర్మభాండారము.

(పండిత మదనమోహన మాలవ్యా)


మానవచరిత్రలో నెల్ల నతిగంభీరమును, శ్రేష్ఠమును నైన జ్ఞానమును మానుషశక్తియు గల యుత్తమ వ్యక్తి శ్రీ కృష్ణుడని నానమ్మకము. ప్రపంచమందలి జీవద్భాష లన్నిటిలోను సత్యజ్ఞానసంపూర్ణమై యుండియు నంత సంగ్రహమైన గ్రంథము మరియొకటిలేదని నావిశ్వాసము.


పదునెనిమిది చిన్నయధ్యాయములుమాత్రముగల ఈ అద్భుతగ్రంథములో వేదములయునుపనిషత్తులయు సారమంతయు నిమిడియున్నది. ఇహపరములందు సంపూర్ణానందమును పడయుట కది సూటియైనమార్గమును చూపుచున్నది. ఉత్తమజ్ఞానమునకును, అకల్మషభక్తికిని, జ్యోతిర్మయమైన కర్మమునకును దారిచూపు జ్ఞాన, భక్తి, కర్మయోగముల నది బోధించుచున్నది. ఆత్మనిగ్రహము, త్రివిధతపస్సు, అహింస, సత్యము, దయ, నిష్కామకర్మనిరతి, అధర్మము నెదుర్కొనుట, అను విషయముల నది యుపదేశించు చున్నది.


జ్ఞానము, సత్యము, నీతిబోధనలతో నిండుకొనియుండి అజ్ఞానదుఃఖకూపములనుండి జనుల నుద్ధరించి శ్రేష్ఠమైనదివ్య విభూతిని చేకూర్చు శక్తి దానికి గలదు. నాకు తెలిసినంత మట్టుకు ప్రపంచవాఙ్మయములో నెక్కడను హిందువులకే కాక సమస్తమానవులకును ధర్మభాండాగారమై యుత్తమ స్థానము నధిష్టింపగల గ్రంథము గీతతప్ప మరియొకటి కాన రాదు. వివిధదేశముల విద్వాంసు లీగ్రంథమును పఠించి బ్రహ్మమునుగూర్చిన నిర్మల సంపూర్ణజ్ఞానమును పొంది, నిష్కలుషము, నిష్కామము, శ్రేష్ఠమునైన భగవద్భక్తిని సంపాదించినారు. ప్రపంచము నావరించియున్న యజ్ఞానాంధ కారమునుండి బయటికి దారిచూపుచు, అక్షయమైన ప్రేమ తైలాధారమున వెలుగుచున్న యీ చిన్నద్వీపము సహాయమును బొందుచున్న పురుషులును స్త్రీలును మిక్కిలి యదృష్టవంతులు. అంధకారమున దేవులాడుచున్న మానవ జాతికంతటికి నాదీపము సహాయమునుజూపుట యట్టివారికి కర్తవ్యముగా నున్నది.


ధనికుని హర్మ్యమునుండి, పేదవాని గుడిసెవరకు అన్ని హిందూగృహములలోను గీతాగ్రంథపు ప్రతియొకటియుండి, భగవదవతారమునకు చూపవలసిన భక్తితో జనులందరును దాని నారాధించుచుండుటను నా యాయుష్కాలములో చూడగల భాగ్యము నాకు ప్రసాదింపవలెనని యీశ్వరుని హృదయపూర్వకముగ ప్రార్థించుచున్నాను. జ్ఞానముతోను, భక్తితోను, నీదేశముననేకాక ప్రపంచమందంతటను నన్ని వర్ణములవారికిని శాఖలవారికిని గీత బోధింపబడుటకు ధనము మొదలయిన తృప్తికరములగు సదుపాయములు చేయబడిన వని నేను బ్రతికియుండగనే వినగోరుచున్నాను.


ఇది శ్రీకృష్ణునికి ప్రీతికర. మగుగాక!


____________


అనుబంధము 4.

గీత: జీవనమార్గము.

(డాక్టరు అనీబిసెంటు)


మహాభారతమను మహాకావ్యములో అమూల్యము లగు బోధనలలో భగవద్గీతవలె అరుదైనదియు నమూల్య మైనదియు మరియొకటి లేదు. యుద్ధభూమిలో శ్రీకృష్ణుని ముఖమున నది బయలువెడలి తన శిష్యుడును సఖుడునునగు నర్జునుని మనోద్వేగమును శాంతింపచేసినపిదప నెందరో క్షుబ్దహృదయుల కది శాంతినిచ్చి బలపరిచినది, క్లేశము ననుభవించు నెన్నియో యాత్మల నాతనిదరికి చేర్చినది. కేవల కర్మఫలత్యాగమను సాధారణావస్థనుండి, కామము