శ్రీకృష్ణుడు చూపిన మార్గము/అధ్యాయము 9
అంతటను వ్యాపించియున్న యాకాశము సూక్ష్మమైన దగుటచేత నెట్లు దేనికి నంటక యుండునో, అట్లే అన్ని యెడలను నిలిచియున్న యాత్మ దేహములందు వాని నంటకయుండును. 13-33
యథా ప్రకాశయ త్యేకః కృత్స్నం లోక మిమం రవిః
క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత.
సూర్యుడొక్కడే యయినను లోకమంతటి నెట్లు
ప్రకాశింపచేయుచున్నాడో, అట్లే ఓ యర్జునా ! క్షేత్రి,
క్షేత్రమునంతటిని ప్రకాశింపజేయుచున్నాడు. 13-34
(9)
కర్మ విధి
(గీత - అధ్యాయము 15).
జీవునికిని పరమాత్మకును పరస్పరసంబంధ మేమి? దేహమునకును దేహములో రాజ్యముచేయు జీవునికిని సంబంధమేమి? వీనిని గూర్చి యిప్పుడు చెప్పబడును. దేహమునకు జీవాత్మ యెట్లో, అట్లే జీవాత్మకును పరతత్త్వము. దేహమును జీవుడెట్లు చేతనపదార్థముగ ప్రకాశింప జేసికొని దానిలో నంతర్భావమై యుండునో అదేమాదిరిగ జీవునిలో పరమాత్మ అంతర్భావమై నిలిచి, యాజీవునికాధారమై వచ్చుచున్నాడని చెప్పవచ్చును.
జీవుడెట్లొకదాని తరువాత నొకటిగ పలుదేహము లను ధరించుచున్నాడో, ఒక్కొక్కరూపమును ధరించి, ఆ రూపమే తానగుచున్నాడో, అదే రీతిగ పరమాత్మ పలు జీవుల రూపముల నేకకాలమున ధరించి నిలుచును. ఒకవస్తువే రాజుగనో బిక్షకుడుగనో ఎద్దుగనో పందిగనో మామిడి చెట్టుగనో పురుగుగనో రూపమును బొందునట్లు, పరబ్రహ్మ మును పలురూపముల ధరించి నిలిచియుండవచ్చును. కాని, ఆత్మయే రాజు కాలేదు. పురుగును కాలేదు. అట్లే పరమాత్మయు మనుష్యుడై యుండలేదు. ప్రత్యేకముగానే నిలిచి యుండును. ఏ దేహములోను, ఏవస్తువులోను పరవస్తువు నిలిచి, దానికాధారమై వచ్చుచున్నదనుట దీనితత్త్వము. అది భాగములగుటకు వీలులేదు. పలువస్తువులలో నిలిచినను దాని యేకత్వము చెదరిపోదు.
పరమాత్మకును జీవునికిని నున్న పరస్పరసంబంధము నికమీద విచారింప నారంభింతమన్న, ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతము, అను వాదములలోనికి పోవలసియున్నది. భగవద్గీతలో ద్వైతాద్వైతప్రశ్నను ఎత్తుకొనుటలేదు. మూడుసిద్ధాంతములకును గీతనే ప్రమాణముగా జేసికొని మతాచార్యులు భాష్యములు చేసియున్నారు. ఉపనిషత్తులను నిట్లే మూడువిధములగు సిద్ధాంతములకును నెడమిచ్చును.
జీవాత్మకును పరమేశ్వరునికి నేమి సంబంధమను విషయమున అభిప్రాయభేదములున్నను, మూడువిధములగు సంప్రదాయములందును కర్మవిధి యొప్పుకొనబడుచున్నది. అనగా జీవుడు కర్మవిధియందు బద్ధుడై నిలిచియున్నాడని యభిప్రాయము.
ఇంద్రియములును, ఇంద్రియములను నడపించు మనస్సును ఈ యారింటిని పొందినది దేహము. ఇదే జీవునికిల్లు. ఈయిల్లు అచేతనభూతప్రకృతిచే చేయబడినది. ఒక దేహమును ధరించునాత్మ యాదేహముతో విషయముల ననుభవించుచున్నది. చేష్టలన్నియు గుణములుగా మారగా నాగుణము లాత్మలోకలిసి నిలుచుచున్నవి. ఒక దేహమును విడిచి వేరు దేహమును ధరించునప్పుడు పూర్వజన్మమున పొందిన కర్మఫలములాత్మనంటిపెట్టుకొని నిలుచును. ఇదేక్రొత్త దేహపు మూలధనము, లేక గుణము. ఒక శరీరమును విడిచి, బయటికిపోవు నాత్మ యాదేహములో పొందిన గుణములను గొనిపోవుచున్నది. వానితో క్రొత్తదేహములో ప్రవేశించు చున్నది. గాలి యొకతోటమీదుగా వీచుచు నక్కడనుండు పరిమళమును గ్రహించుకొని పోవునట్లే, యాత్మయును తా నెత్తిన జన్మములో కర్మములను సూక్ష్మరూపమున కొనిపోవు
చుండును.
మమై వాంశో జీవలోకే జీవభూత స్సనాతనః
మన ష్షష్ఠా నీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి
నాకిరణ మొకటి జీవలోకమునచేరి యచ్చట జీవాత్మయై,
యైదింద్రియములను, ఆరోఇంద్రియమైన మనస్సును
కూడికొని నిలుచుచున్నది 15-7
శరీరం య దవాప్నోతి యచ్చా ప్యుత్క్రామ తీశ్వరః
గృహీ త్వైతాని సంయాతి వాయుర్గంధా నివాశయాత్.
అక్కడక్కడ నుండు పరిమళములను గ్రహించి గాలి
చలించునట్లు, యజమానుడైన యాత్మ యేదో యొకదేహ
మును బొందునప్పుడును, విడుచునప్పుడును పూర్వవాసనలను
గ్రహించుకొని తిరుగుచుండును. 15-8
శ్రోత్రం చక్షుః స్పర్శనం చ రసనం ఘ్రాణ మేవ చ
అధిష్ఠాయ మనశ్చాయం విషయా నుపసేవతే.
వినుట, చూచుట, తాకుట, రుచిచూచుట, మూచూ
చుట, వీనిని గూర్చిన ఇంద్రియములలోను, మనస్సులోను,
నెలకొని జీవుడు విషయముల ననుభవించుచున్నాడు. 15-9
ఒకజీవుని పరిణామమతనిచేతిలోనే యున్నది. మంచి కర్మమును చెడుకర్మమునుచేసి తనకు తానేమంచిని చెడుగును తెచ్చుకొనుచున్నాడు. ఆత్మ ఉత్తమాధమపదములకు పోవు మార్గమాతడేర్పరుచుకొన్నదే. ఈయాధారమును స్వాతంత్య్ర మును జీవునికి ముఖ్యగుణములు. ఒకదేహములో చేరినకాలమున తాను చేసినచేత లాదేహమును విడువగనే యాత్మను విడిచిపోవు. మరుజన్మములో లెక్కయారంభించునపుడు వెనుక జన్మములోని కర్మముల యాదాయనష్టములతోనే యారం భింపవలెను. ఇదే కర్మవిధి.
లోకములో కనబడు సుఖదుఃఖములకును గుణభేదము లకును కారణమును విచారించి చెప్పునట్టి యేమతమునకైనను ఆక్షేపణలను చూపవచ్చును. ఎట్టి సమాధానమునుచూపినను గొరవులుండనే యుండును. బుద్ధిపరిచ్ఛేదమునకు సంపూర్ణ ముగ లోబడియుండదు. ఇదియే పీఠికలో చెప్పిన యీశ్వర రహస్యము కావున కంటికగపడుదేహములో కనబడనిఒకఆత్మ యున్నది. దానికి చావులేదని యొప్పుకొన్నయెడల, సర్వభౌతికశాస్త్రానుభవములకును పొందికగల సిద్ధాంతము హిందూమతమునందు చెప్పబడు నీకర్మవిధి యొక్కటే. వేరు సిద్ధాంతమేదైనను దీనికంటె నెక్కువ యాక్షేపణల కెడ మిచ్చును. పదార్థశాస్త్రములో జడపదార్థమునకును జడమైన శక్తిని నవినాశిత్వము చెప్పబడుచున్నది. అనగా ఒకపదార్థ మునకో, శక్తికో, దానిరూపమును మార్పవచ్చునేకాని అది లేకుండ చేయవీలులేదు. ఈసిద్ధాంతము ననుసరించియే భౌతికశాస్త్రమంతయును విస్తరింపబడుచున్నది. జడపదార్థ ముల అవినాశిత్వమును చేతనమగు శక్తి ననుసంధించుటయే కర్మవిధి. హిందూధర్మమున నడగియున్న సిద్ధాంతమిది. కారణ కార్యముల నిరంతరసంబంధముమీదనేర్పడిన సిద్ధాంతమిది. కారణమునకు కార్యము సమము. కారణము ఫలమునివ్వక తప్పదు. కారణమునకు మరురూపమే ఫలము. కావున దేహ వియోగము తరువాతను నాత్మయున్నదనిన నది తాను చేసిన చేతలఫలమును గ్రహించియే యుండును. ఇదియే కర్మవిధి. 'ఇన్సాల్వెన్సీకోర్టు'లో అప్పులను రద్దుచేసి విడుచునట్లు కర్మ విధిలో పొసగదు. ప్రాతయప్పులను తీర్చియే తీరవలెను.
(10)
కర్మఫలము.
ఒకకొలనిలో నొక రాయివేసిన నది నీటిని కలతబెట్టి యలలను గలిగించును. ఎంతటి చిన్నరాయియయినను దాని వేగమునకును భారమునకును తగిన యలలను కలిగించును. ఆకలత కంటికి కనబడనంత చిన్నదైనను దానివేగముచే నలలేర్పడి యొడ్డును తాకును. ఒకయల మరియొకయలను విరుచును. ఒకదానితోనొకటి కలిసి పెరుగుటయు క్రుంగుటయు కలదు. కావున నెంతటి చిన్న చలనము వ్యర్థముకాదు. ఈవిధముగనే మనచేతలును ఆత్మకు చెందినంతమట్టుకు మన స్సున నుదయించు కోరికలును ఆశలును చేతలే యగును.