శ్రీకృష్ణుడు చూపిన మార్గము/అధ్యాయము 19


యత్తదగ్రే విషమివ పరిణామే౽మృతోపమమ్
త త్సుఖం సాత్త్వికం ప్రోక్త మాత్మబుద్ధి ప్రసాదజం.


ఏది మనుష్యుని కభ్యాసమువలన మనస్సున సుఖము నిచ్చి దేనిలో దుఃఖము నిజముగా నంతమునొందునో. 18-36


ఏది మొదట విషమునుబోలునో, తుదకు అమృతమును బోలునో, ఆసుఖమే సాత్త్వికమైనది. ఆసుఖ మాత్మ జ్ఞానమందు నెలకొనియుండుటచేత గలుగును. 18-37


(19)

ధ్యానము.

(గీత: అధ్యాయములు 2, 5, 6, 12, 14.)


తాను చేయవలసిన కర్మములలో తన యింద్రియ సుఖములను కోరక, పనిని చేయుట కలవాటు పడినపిమ్మట నొకమెట్టు పైకి పోవచ్చును. కర్మమును చేయుటయే తన పనియు నధికారమునని తెలిసి, దాని పరిణామమునుగూర్చి కళవళింపక, దాని ఫలిత మేమైనను దానికై సంతోషించుట దుఃఖించుటయు మానుటకు ప్రయత్నింపవలెను. చేసినపనిలో జయమైనను, అపజయమైనను, మనస్సున కలత నొంద గూడదు. సుఖమును, దుఃఖమును, సమముగా భావింప వలెను, అనగా సుఖము నిచ్చుసందర్భము లేర్పడినను, దుఃఖము నిచ్చుసందర్భములు వచ్చినను మనస్సునకు స్థైర్యము గలుగున ట్లభ్యాసము చేసికొననవలెను. ఒకసుఖము కలుగకముందు దానికొరకు నిరీక్షించుచు మనస్సున పొంగుటయు, కలిగి అంతరించినపిదప దానిని దలచితలచి దుఃఖపడుటయు, ఇదియేసుఖదుఃఖముల రాకపోకల యడతెగని వ్యవహారము. సుఖమును దుఃఖమును నొకదానిని విడిచి మరియొకటి యుండ చాలదు. రెండును జతగనే యొకదానివెనుక రెండవది వచ్చు చుండును. దుఃఖమే లేకుండిన సుఖమే దుఃఖమగును. ఈ సుఖదుఃఖములు రెండును విషయములతోడి సంగమువలన గలుగుటచేత క్షణమాత్రముండి మరుచటిక్షణము పోవు మనోభావములేకాని వేరుకావు. ఇవి యాత్మను తాకజూలవు. బయటినుండి వచ్చు నేసుఖమును దుఃఖమును, నాత్మకొక భాగ్యము నివ్వజాలవు. తనలో జనించు కోరికలే, తాను చేయుచేతలే తనయాత్మ ముందుకు పోవుటకును, వెనుకకు తగ్గుటకును కారణములు ; వేరేదియు కాదు.


మాత్రాస్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణసుఖదుఃఖదాః
ఆగమాపాయినో౽నిత్యాస్తాం స్తితిక్షస్వభారత.


చలియు, వేడియు, సుఖమును, దుఃఖమును, కలిగించు అణువుల స్పర్శములవలన వచ్చుచుండును, పోవు చుండును; అవి యనిత్యములు. వానిని సహించుకొనుము. 2-14


యం హి నవ్యథయ న్త్యే తే వురుషం వురుషర్ష భ
సమదుఃఖ సుఖంధీరం సో౽మృత త్వాయకల్ప తే.


ఎవడు వీనిచే దుఃఖము నొందక, సుఖమును దుఃఖము నొక్కటిగ తలంచునో, ఆధీరు డమృతత్వమును పొందిన వాడని తలంపవచ్చును. 2-15


సుఖదుఃఖే సమేకృత్వా లాభాలాభౌ జయాజయౌ
తతో యుద్ధాయ యుజ్యస్వనైవం పాపమవాప్స్యసి.


సుఖము, దుఃఖము, లాభము, నష్టము, జయము, అపజయము, వీనిని సమముగాగొని యుద్ధమునకు తొడంగుము ఇట్లు కర్మమును చేసినయెడల పాపమును పొందవు. 2-38


యే హి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవతే
ఆద్యంతవంతః కౌంతేయ న తేషు రమతే బుధః.


విషయముల సంగముచే కలుగు సుఖములు, దుఃఖ ములకు కారణములే. ఆసుఖములకు మొదలును తుదియు కలవు. జ్ఞాని వానిలో రమింపడు. 5-22


శక్నో తీహైవ యస్సోఢుం ప్రాక్ఛరీర విమోక్షణాత్
కామక్రోధోద్భవం వేగం స యుక్త స్ససుఖీనరః.


శరీరమును విడుచుటకు ముందీ లోకములోనే కామ క్రోధములచే గలుగు వేగము నెవడు సహింప శక్తుడగునో వాడే యోగి; వాడే సుఖమును పొందతగినవాడు. 5-23


మనస్సున ప్రశాంతి నొందినచో నదియే పరమా నందము. పరమపదమున బొందదగిన సుఖమున కొకవేళ సమమని చెప్పతగినదియు నీలోకములోనే పొందదగినదియు ఈశాంతమే.


యోం౽తస్సుఖోం౽తరారామస్తధాం౽ర్జోతి రేవయః
సయోగీ బ్రహ్మనిర్వాణం బ్రహ్మభూతో౽ధిగచ్ఛతి.


బాహ్యవిషయములను తాకక, తనలోనే సుఖము గల వాడై తనలోనే శాంతిని పొందినవాడై, తనలోనే జ్యోతితో గూడినవాడైన యోగి బ్రహ్మపదమును బొంది, బ్రహ్మ నిర్వాణమును పొందుచున్నాడు. 5-24


కామక్రోధ వియుక్తానాం యతీనాం యతచేతసాం
అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం.


కామమును క్రోధమును విడిచి, చిత్తమును కట్టుబాటు చేసికొనిన యాత్మజ్ఞానులకు బ్రహ్మనిర్వాణము సమీపముననే యుండును. 5-26


యతేంద్రియ మనోబుద్ధి ర్ముని ర్మోక్షపరాయణః
విగతేచ్ఛాభయక్రోధో య స్సదా ముక్త యేవ సః.

ఇంద్రియములను మనస్సును బుద్ధిని కట్టి, మోక్షము

నలవాటుగా లక్ష్యమందుంచుకొని, ఆశ, భయము, క్రోధము వీనిని విడిచిన ముని ముక్తుడే యగును. 5-28


ఏకార్యము చేసినను దానిని స్వార్థములేక చేయుటను బాగుగ నభ్యసించి దానినే స్వభావముగ చేసికొనినయెడల పిదప మనస్సు పక్వమగును. ఆపై కర్మములేఫలము నిచ్చినను శాంతి చెడక నిలుచుటకుశక్తియుండును. ఆశను, ఆసక్తిని విడిచిన గాని యిది కుదురదు. నిజమైన సుఖ మంతరాత్మ యందుండు సుఖమే. ఇంద్రియములవలన కలుగు సుఖ భోగము లాత్మసుఖమును తేచాలవని బాగుగ గ్రహింప వలెను.


ఆరురుక్షో ర్మునే ర్యోగం కర్మ కారణ ముచ్యతే
యోగారూఢస్య తస్యైవ శమః కారణ ముచ్యతే.


యోగమార్గమున పైకి పోగోరుమునికి కర్మమే సాధన మని చెప్పబడినది. యోగమార్గమున పై కెక్కిన పిదప దాని వలన కలుగు శాంతము వానికి సాధనమగునని చెప్పబడినది. 6-3


యదా హి చేంద్రియార్థేషు నకర్మ స్వనుషజ్జతే
సర్వ సంకల్ప సన్న్యాసీ యోగారూఢ స్తదోచ్యతే.


ఒక డెల్లసంకల్పములను విడిచి యింద్రియ విషయము లందును, కర్మములందును, ఆసక్తి లేనివాడై యుండుటచేతనే వాడు యోగమార్గమున పై కెక్కినవా డనబడును. 6-4


ఉద్థరే దాత్మనా౽౽త్మానంనా౽త్మాన మవసాదయేత్
ఆత్మైవ హ్యాత్మనో బంధురాత్మైవ రివురాత్మనః.


తనయాత్మచేత తన్నుద్ధరించుకొనవలెను. ఆత్మను చెరుచుకొనగూడదు. తనకు తనయాత్మయే బంధువు. అత్మయే తనకు పగవాడును అగును. 6-5


బంధురాత్మా౽౽త్మన స్తస్యయేనా౽త్మైవా౽త్మనా జితః
అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతా౽త్మైవ శత్రువత్.


తన్ను తాగెలిచినవానికే తనయాత్మ బంధువగును. తన్ను తాగెలువని వానికి తనయాత్మయే పగవాడై చెరు చును. 6-6


జితాత్మనః ప్రశాన్తస్య పరమాత్మా సమాహితః
శీతోష్ణసుఖదుఃఖేషు తథా మానావమానయోః.


తన్ను తాగెలిచి ప్రశాంతి నొందినవాని యుత్తమమైన యాత్మశీతోష్ణములందును, సుఖదుఃఖములందును, మానావ మానములందును సమత్వమును బొంది వెలయును. 6-7


సుఖములందును దుఃఖములందును మనస్సు కలత నొందక సమత్వమును బొందుటకు ధ్యాన మావశ్యకము. కర్మయోగ మభ్యాసము చేయునపుడు అనగా తనకేర్పడ్డ పనులను స్వార్థమును విడిచి కర్మపరిణామమును గూర్చి చింత గొనక మనోవికారమునుబొందక యుండుటకు అలవాటు చేయునపుడు, ఏకాంతముననుండి చిత్తమాలిన్యములను విడిచి, ధ్యానములో నిలుచుటచే మనస్సునకు స్థిరత్వము గలుగును. ఇట్టిధ్యానమునభ్యసించుట క్రింద చూపిన శ్లోక ములలో 'యోగ' మని చెప్పబడుచున్నది.


యోగీ యుంజీత సతత మాత్మానం రహసిస్థితః
ఏకాకీ యతచిత్తాత్మా నిరాశీ రపరిగ్రహః.


నిర్జన ప్రదేశమున ఏకాంతముగనుండి, మనస్సును ఎల్లప్పుడు వశముచేసికొని ఆశను, వస్తువులను సంపాదింపవలెనను కోరికను విడిచి యోగము నభ్యసించుచుండవలెను. 6-10


శుచౌ దేశే ప్రతిష్ఠాప్య స్థిరమాసన మాత్మనః
నాత్యుచ్ఛ్రితం నాతినీచం చేలాజినకుశోత్తరమ్.


శుద్ధమైనస్థలములో నెక్కువ యెత్తుగ గాని, మిక్కిలి క్రిందుగగాని యుండని యొక స్థిరమైనయాసనము నేర్పరచు కొని బట్ట, జింకతోలు, దర్భ వీనిని పరచుకొని కూర్చుండ వలెను. 6-11


తత్రైకాగ్రం మనః కృత్వా యత చిత్తేంద్రియ క్రియః
ఉపవిశ్యాసనే యుంజ్యా ద్యోగ మాత్మ విశుద్ధయే.


మనస్సు నొక ముఖమునకు దెచ్చి, మనస్సును, నింద్రియములును చేయుపనులను స్వాధీనమునందుంచుకొని, యాసనమునందు గూర్చుండి, యాత్మశుద్ధి యగునట్లు యోగమునందే నిలువవలెను. 6-12


సమం కాయశిరోగ్రీవం ధారయ న్న చలం స్థిరః
సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశ శ్చా నవలోకయన్.


శరీరమును, తలను, కంఠమును సమముగా నుంచుకొని స్థిరత్వమునొందినవాడై, తన ముక్కు కొనయందు దృష్టిని నిలిపికొని, యిటునటు చుట్టును చూడకయుండవలెను. 6-13


ప్రశాన్తాత్మా విగత భీర్బ్రహ్మచారివ్రతే స్థితః
మన స్సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత మత్పరః.


ప్రశాంతముపొందినపిదప, భయమనుదానినిపొందక, బ్రహ్మచర్యవ్రతమున నెలకొని, మనస్సునడచి, నాయందు చిత్తమునునిలిపి, నన్ను బొందినయోగముననుండవలెను. 6-14


నాత్యశ్న తస్తు యోగో౽స్తినచైకాంత మనశ్నతః
న చాతిస్వప్న శీలస్య జాగ్రతో నైవ చార్జున.


ఎక్కువగా తినువానికి యోగములేదు. ఎక్కువగా ఉపవాసములు చేసినను ఫలములేదు. మిక్కిలిగ నిద్రపోవు వానికిని యోగము కలుగదు. అట్లే నిద్రను విడిచిననుఫలము లేదు. 6-16


యుక్తాహారవిహారస్య యుక్తచేష్టస్య కర్మసు
యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖహా.

నియమమునకు లోబడిన యాహారమును విహారమును

కర్మములచేయుటయందు నియమమునకు లోబడిన క్రమమున్ను నియతమైన నిద్రయును మెలకువయు గలవాడే దుఃఖ నాశకమగు యోగమార్గమును బొందును. 6-17


యథా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృతా
యోగినో యతచిత్తస్య యుంజతో యోగమాత్మనః.


చిత్తమునుకట్టి యాత్మయోగమున నిలిచినయోగికి గాలి లేనిచోట చలింపక నిలచు దీపము సమానమని వచించిరి. 6-19


ఏవిషయమందును మితిమీరిపోకూడదనిగీత దృఢము చేయుచున్నది. యోగసిద్ధికి ముఖ్యమైనసాధనము మనస్సును కాపాడుట. మనస్సు ఎప్పుడును పరుగెత్త చూచుచుండును. మనస్సున నుద్భవమగు తలపుల నడంచనియెడలనవి మనస్సు నావరించుకొని పరుగెత్తించును. ఎప్పుడును గట్టిగాపట్టుకొనియే యుండవలెను.


ఎంతప్రయత్నము చేసినను మరలమరల యోచనలు కలుగును. దానిని చూచి భయపడక అప్పుడప్పుడే మనస్సును స్థిరపరుచుకొని, పరమాత్మ చింతయందు నిలుపవలెను.


సంకల్ప ప్రభవాన్ కామాం స్త్యక్త్వా సర్వా నశేష్ఠతః
మనసై వేంద్రియగ్రామం వినియమ్య సమన్తతః

మనస్సుచేత తలపులనుండి జనించు ఆశల నన్నిటిని

పూర్తిగ విడిచి, విషయములనుండి యింద్రియములు దూరముగ నుండునట్లు కట్టియుంచి, 6-24


శనై శ్శనై రుపరమే ద్బుద్ధ్యాధృతి గృహీతయా
ఆత్మ సంస్థం మనః కృత్వా నకించిదపి చింతయేత్.


స్థిరబుద్ధితో మనస్సు ఆత్మయందు నిలిపి, రాను రాను దానియందే లీనమగునట్లభ్యాసము చేయవలెను. ఎట్టి చింతయులేక యుండవలెను. 6-25


యతో యతో నిశ్చరతి మనశ్చంచల మస్థిరమ్
తత స్తతో నియమ్యైత దాత్మ న్యేవ వశం నయేత్.


మనస్సు చంచలమై, స్థిరముగ నిలువక చలించునప్పు డెల్ల దాని నడచియుంచి, యాత్మకు వశమునం దుంచ వలెను. 6-26


ప్రశాన్తమనసం హ్యేనం యోగినం సుఖ ముత్తమమ్
ఉపైతి శాంతరజసం బ్రహ్మభూత మకల్మషమ్.


మనస్సు శాంతముగా, రజోగుణ మడగి, కల్మష మును విడిచి, బ్రహ్మపదము నొందిన యోగికి ఉత్తమసుఖము లభించును. 6-27


మనస్సు కుదిరికగొన్న వాడెట్లుండుననుదానిని క్రింద

చూడవచ్చును.


అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణఏవ చ
నిర్మమో నిరహంకార స్సమదుఃఖసుఖః క్షమీ.
సంతుష్ట స్సతతంయోగీ యతత్మా ధృఢనిశ్చయః
మయ్యర్పిత మనోబుద్ధి ర్యోమద్భక్త స్సమే ప్రియః.


ఏప్రాణియెడలను పగనువిడిచి, స్నేహమును కరుణయు గలవాడయి, నేననియు నాదనియు ఆనక, సుఖమును దుఃఖమును సమముగా చూచి, 12-13


ఎప్పుడును మనస్సంతోషము గలవాడై మనస్సును స్వాధీనమందుంచుకొన్నవాడై, దృఢనిశ్చయము గలవాడై, నాయందే మనస్సును బుద్ధిని అర్పణముచేసిన యోగి నా భక్తుడు నాకిష్టుడు. 12-14


యస్మాన్నోద్విజతే లోకో లోకాన్నోద్విజతేచ యః
హర్షామర్ష భయోద్వేగై ర్ముక్తో యస్సచ మేప్రియః.


ఎవనికి లోకులు వెరవరో, లోకుల కెవడు వెరవడో, హర్షము, మాత్సర్వము, భయము నను వేగములనుండి యెవడు విడబడియుండునో, వాడే నా కిష్టుడు. 12-15


అనపేక్ష శ్శుచిర్దక్ష ఉదాసీనో గతవ్యథః
సర్వారంభపరిత్యాగీ యోమద్భక్త స్స మేప్రియః.


దేనినైనను కోరి ఫలమునకు యెదురుచూడక, శుచియై, నేర్పరియై, పట్టుదలలేనివాడై, కలతను విడిచినవాడై, ఎల్ల కార్యముల యారంభమునందును ఫలాశనువిడిచి, నాయెడ భక్తిగలవాడే నా కిష్టుడు. 12-16


యో నహృష్యతి నద్వేష్టి నశోచతి నకాంక్షతి
శుభాశుభ పరిత్యాగీ భక్తిమాన్ యస్స మేప్రియః.


ఎక్కువ సంతోషము నొందక, పగ బూనక, దుఃఖింపక, ఆశగొనక, మేలును, కీడునుగూడ విడిచి, భక్తిగలవాడే నాకిష్టుడు. 12-17


సమ శ్శత్రౌచ మిత్రేచ తథా మానావమానయోః
శీతోష్ణసుఖదుఃఖేషు సమ స్సంగవివర్జితః.
తుల్యనిందాస్తుతి ర్మౌనీ సంతుష్టో యేన కేనచిత్
అని కేత స్థ్సిరమతిర్ భక్తిమాన్ మేప్రియో నరః.


పగవానియందును నేస్తగానియందును, మానమునందును అవమానమునందును, చలియందును వేడియందును, సుఖమునందును, దుఃఖమునందును, సమముగా నుండి, సంగమును విడిచి, 12-18


పొగడ్తయు నిందయు సమముగా చూచి మాటాడక, యేమివచ్చినను దానితో సంతోషపడి, తన యిల్లిదియనక, స్థిరబుద్ధితో నుండుభక్తుడు నా కిష్టుడు. 14-19


ఇట్లింద్రియ నిగ్రహమువలనను, నియమములచేతను, ధ్యానముచేతను, పొందిన శాంతినిగూడి పూర్వకర్మఫలముగ దేహముతో గూడివచ్చు ప్రకృతిగుణములు. దానితోకలిసియే యుండును. జ్ఞానమునొందినపిదపను ఈ చాంచల్యముండును. దానినిగని దుఃఖింప పనిలేదు. అది స్వభావమని తెలిసి, యడుగడుగునకు నిజతత్త్వమును స్మరించి శాంతిని విడువక కాచుకొనవలెను. గుణములను దాటినవా రెవరన:-


ప్రకాశంచ ప్రవృత్తించ మోహ మేవ చ పాండవ
నద్వేష్టి సంప్రవృత్తానిన నివృత్తాని కాంక్షతి.


మనఃప్రకాశము, పనులను చేయవలెను ఆసక్తి, మోహము, ఇవిప్రాప్తించినప్పుడు వీనిని చూచి భయపడక, యాస్థితులు తొలగగనే వానిని కోరకయుండువాడు. 14-22


ఉదాసీనవ దాసినో గుణైర్యో నవిచాల్య తే
గుణా వర్తన్త ఇత్యేవ యో౽ వతిష్టతి నేంగతే.


స్వీయ స్వభావగుణములచేత మనస్సు కలతనొందక యుదాసీనముగా నుండి, 'గుణములు వర్తించుచున్నవి' అని తలచి, యాశను విడిచి నిలుచువాడు. 14-23


సమదుఃఖ సుఖస్స్వస్థ స్సమలోష్టాశ్మ కాంచనః
తుల్యప్రియాప్రియోధీర స్తుల్యనిందాత్మసంస్తుతిః.


దుఃఖమును సుఖమును సమముగా గొని, యాత్మ యందు నిలుచువాడు, మంటిబెడ్డనురాతిని బంగారమును సమముగా చూచువాడు, ప్రియము చేయువారియెడలను నప్రియ ముచేయువారియెడలను సమముగనే నడచువాడు, నిందను పొగడ్తను సమముగా గొను ధీరుడు. 14-24


మానవమానయోస్తుల్య స్తుల్యోమిత్రారిపక్షయోః
సర్వారంభ పరిత్యాగీ గుణాతీత స్సఉచ్య తే.


గౌరవమును అవమానమును సమముగ తలచువాడు, మిత్రులయందును పగవారియందును సమభాగమును పూనువాడు, తనకొరకు పనుల నారంభింపనివాడును, ఇట్టివాడే గుణములనుగడచినవాడని త్రిగుణాతీతుడనిచెప్పబడును. 14-25


(20)

స్వభావగుణములు

(గీత : అధ్యాయములు 4, 13, 14, 18)


మనుష్యుడు తప్పుదారి నేలపోవు ననుదానికి కారణము అడుగడుగునకు జ్ఞాపకమునకు తెచ్చికొనవలెను. చెడు పనులను చేయువారిని చూచి శాంతమును విడువక, వారియెడల విశ్వాసము చూపుటయు, మనస్సును కలతనొందింపక దానిని స్థిమితముగ చేసికొనుటయు, మిగుల మంచిది.


తన్ను తా నడచుకొనలేక, మనస్సు నజాగ్రత్తగ విడిచినయెడల జన్మతోడ స్వాభావికముగ వచ్చు గుణముల