శ్రీకృష్ణుడు చూపిన మార్గము/అధ్యాయము 16

నన్నే యాశ్రయముగ గొన్నవా డెల్లపనులను నెప్పుడును జేసికొనుచున్నను తరుగని నిత్యపదవిని నాయనుగ్రహముచే పొందగలడు. 18-56


చేతసా సర్వకర్మాణి మయి సన్న్యస్య మత్పరః
బుద్ధియోగ ముపాశ్రిత్య మచ్చిత్త స్సతతం భవ.


చేయుచేతలనెల్ల నాకే యర్పణచేసి, నన్నే పర మావధిగ నెంచి బుద్ధియోగము నాశ్రయించి యెప్పుడును నన్ను చిత్తములో నిలిపియుండుము. 18-57


సుఖములేని త్యాగము.

(గీత: అధ్యాయము 3.)


మనస్సు సుఖముగానుండుట కడుగడుగునకునుధ్యానము చేయుట యావశ్యకము. ఆత్మ, లోకము, దైవము, వీని స్వరూపము నెల్లప్పుడు చింతించు చుండుటవలన మనస్సున గలుగు నుద్వేగము లడగిపోవును. కాని ధ్యానముమాత్రము చాలదు. దానితో బాటు తన కేర్పడియుండిన పనులను జేయుటయు నట్లే కర్మము నాచరించుటయందు స్వార్థమును, నాశయు విడిచి చేయుటయు మనస్సౌఖ్యమున కుత్తమమైన మార్గమగును. యోగమనిధ్యాసమునకు పేరు సాంప్రదాయి కముగావచ్చుచున్నది. కర్మయోగమనునది సంగమువీడి జ్ఞానముతో గూడ కర్మమును చేయుట. సరిగ చేసినయెడల రెండును నొక్కటే యని తెలియగలము. వానిలో నొకదానిని విడిచి మరియొకదానిని చేయజొచ్చుటవలన ఫలములేదని కనుగొనగలము.

పక్వముకాని మనస్సుతో త్యాగి కాజూచుటవలన ఫలములేదు. దానివలన మనస్సునకుసౌఖ్యముకలుగజాలదు. త్యాగపుగొప్పదనమును, ముఖ్యాంశమును, ఆశలను విడుచుటయే. ఆశలను విడిచి కర్మలను చేయవచ్చునుగదా! అట్లు చేయుటయు త్యాగమే. కావున సన్న్యాసమును కర్మయోగ మును నొక్కటే యని గీత చెప్పుచున్నది.


లోకేస్మిన్ ద్వివిధానిష్ఠా పురా ప్రోక్తా మయానఘ
జ్ఞానయోగేనసాంఖ్యానాం, కర్మ యోగేనా యోగినాం.


ఈలోకములో రెండు విధములైన నిష్ఠలు ముందే నాచే చెప్పబడినవి. సాంఖ్యులుచెప్పు సాంఖ్యయోగమార్గ మును, యోగులుచెప్పు కర్మయోగ మార్గమును. 3-3


న కర్మణా మ నారంభా న్నైష్కర్మ్యం పురుషోశ్ను తే
నచ సన్న్యసనా దేవ సిద్ధిం సమధిగచ్ఛతి.


పనుల నారంభింపక యుండుటచేతనే మనుష్యుడు కర్మములను చేయనివాడు కాజాలడు. సన్న్యాసమును

పూనిన మాత్రముననే మనుష్యుడు సిద్ధిని పొందచాలడు. 3-4


నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠ త్యకర్మకృత్
కార్య తే హ్యవశః కర్మ సర్వః ప్రకృతి జైర్గుణైః.


ఎవ్వడు నొక్కక్షణమైనను కర్మను చేయక నిలువ చాలడు. ప్రకృతివలన గలిగిన గుణములచేత నెల్లప్రాణులును తమకు తెలియకుండగనే కర్మము చేయుటకు పురికొల్ప బడుచున్నవి. 3-5


కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్
ఇంద్రియార్థాన్ విమూఢాత్మా, మిధ్యాచారస్సఉచ్యతే.


కర్మేంద్రియముల నడచికొనియు నింద్రియ విషయములను మనస్సులో స్మరించు కొనుచుండువాడు మూఢుడు. వాని నడవడి మిథ్యయని చెప్పబడును. 3-6


యస్త్వింద్రియాణి మనసా నియమ్యా రభతే౽ర్జున
కర్మేంద్రియైః కర్మయోగ మసక్త స్సవిశిష్య తే॥


ఎవడింద్రియములను మనస్సుచే అరికట్టి కర్మయోగ మార్గమున కర్మేంద్రియములను నడుపుచుండునో, వాడే యుత్తముడు. 3-7


నియతం కురుకర్మత్వం కర్మజ్యాయో హ్యకర్మణః,
శరీరయాత్రా౽ పి చ తే నప్రసిధ్యే దకర్మణః॥


విధింపబడిన పనులను చేయుము. పనులను చేయకుండుటకంటె చేయుటయే యుత్తమము. కర్మమును

చేయకుండిన నీశరీరయాత్రయు నీకు సులభము కాచాలదు. 3-8


యజ్ఞార్ధాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధనః.
తదర్ధం కర్మకౌంతేయ ముక్తసంగ స్సమాచర॥


యజ్ఞముకొరకు చేయబడు కర్మముతప్ప తక్కిన పనులు మనుష్యులకు బంధనకారులగును. కావున, సంగమును విడిచి, కర్మమును చేసికొనుచుండుము. 3-9


మనస్సున వైరాగ్యబుద్ధి చొచ్చినతోడనే లోకవ్యవహారమును విడుచుటయే మంచిదను మనోభావమున్నది. పురాతనోపదేశము లనేకము లిట్టివియే. కాని, గీత మనస్సు పరిపక్వముగా లేని సన్యాసమును ఖండించి, వేరుమార్గము జూపుచున్నది. ఇదియే గీత గొప్పతనము.


పూర్వకర్మఫలమువలనకొన్నిగుణములతో పుట్టినాము. ఆగుణములను బలాత్కారముగ నడగించుటవలన నుపయోగములేదు. మనస్సుపక్వము కాకుండునపుడు సహజగుణములను వెలిపుచ్చక యడచుట కారంభించినయెడల, అవి లోపలనే తమకార్యము నాచరించుకొనుచునే యుండును. కామ క్రోధాది వేగములు మనస్సును కలత పెట్టుచునే యుండును. పైకి శుద్ధముగను, లోపల అశుద్ధముగను నుండినయెడల నెట్టి ప్రయోజనమును లేదు. ఇది యితరులను మోసగించుటయే కాక తన్నును మోసము చేసికొనుటయే యగును. స్వార్థ మును విడిచి నిష్కామముగ పనిచేయుమార్గమే జన్మాంతర కర్మముచేత కలిగిన స్వభావగుణములచే జీవుని విడిపించుకొను మార్గమగును.


ప్రకృతేః క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః.
అహంకార విమూఢాత్మా కర్తా హ మితి మన్య తే.


ప్రకృతివలనబుట్టిన గుణములు అన్ని కర్మలకు కారణము. ుతె అహంకారభావముచే గలిగిన మోహము చేత తానే చేయువాడ ననుకొనును. 3-27


తత్త్వవిత్తు మహాబాహో గుణకర్మవిభాగయోః,
గుణా గుణేషు వర్తంత ఇతి మత్వా న సజ్జ తే.


గుణము, కర్మము, వీని విభాగములను దెలిసినవాడు గుణములు గుణములలో తిరుగుచున్నవని తెలిసి, వానినుండి ప్రత్యేకముగ నుండును. 3-28


సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతే ర్జ్ఞానవానపి,
ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యతి.


జ్ఞానవంతుడుకూడ తన ప్రకృతి ననుసరించియే నడచు కొనును. ప్రాణులన్నియు ప్రకృతిని వెంబడించి నడచు చున్నవి. నిగ్రహమువలన ప్రయోజనము లేదు. 3-33