ఆఱవకథ

తే. అనుచుఁ దెలుపఁ దొడంగె నోయంబుజాక్షి
మదన మనుపట్టనం బేలు మదవదరిస
మూహములఫాలతలముల మోడ్పుఁగేలుఁ
బెనఁచ నేర్పిననందనుం డనెడు రాజు. 5

క. ఆరాజశిఖామణి దే
వేరి శశిప్రభ యనంగ వెలయు న్మిగులం
బౌరందరమణిబృందము
దూఱం దరమైన నెఱుల దొరలెడు సిరులన్. 6

సీ. మగువసోయగపు నెమ్మొగ మెంచఁ గొలువున్న
వెలిదమ్మివానికిఁ దలము గాదు
పడఁతి నితంబబింబము నెంచఁ బుడమిమో
పరియైనవానికి దరము గాదు
కలికి నెన్నడు మెన్న ఖచరుల కొజ్జయై
వఱలెడువానికి వశము గాదు
నలినాయతాక్షి లేనడ లెంచ నంచవ
య్యాళికత్తెకు నైన నలవి గాదు
తే. భామినీమణి గబ్బినిబ్బరపుగుబ్బ
కవనుతింపంగ నల్లబంగారుకొండ
వింటివానికిఁ గూడ దవ్వెలఁదిమూర్తి
వర్ణన యొనర్ప నింక నెవ్వారు గలరు. 7

క. ఆపడఁతియు నందనధర
ణీపతియు న్నిజమనోజనితసంతోష

వ్యాపారాపారసుఖం
బేపార న్మెలఁగుచున్న యెడ నప్పురిలోన్. 8

క. దేవాలయంబు కలదు త
దావాసమున న్వసించు నంతర్లలిత
శ్రీవత్సునకు రథోత్సవ
మావిష్కృతమయ్యెఁ బశ్యదఖిలామరమై. 9

వ. ఇత్తెఱంగున నభంగనభోమధ్యరథ్యాధ్వనత్సముద్యధ్వజంబును నదభ్రమేరుభ్రమావలమానభానుకంబును నిజాంతరదంతురితమౌరజికపాణవికదుర్దమమర్దలధ్వాననృత్యమానవైమానికమానీనీనికరంబును నగరథోత్తమంబుపై మధువిరోధి యధివసించినం దదుత్సవాలోకనాయాతనానాజనపదవ్రాతంబులతో నదృష్టపూర్వం బగుట నొగలందగు దారుకల్పితదారకాకారంబునకు దేవతామనీషం జేసి గోరంటయంటునం గెంపుసొంపుగ్రమ్ముకొను కేలుదము లెత్తి మ్రొక్కునెడ నందులకుఁ గ్రొత్త గుమ్మలనియాతతాయు లొత్తుకాండ్రునుం దారును లేని జగడంబుల బహులంబు లగు తుములంబులు గల్పించి గుంపులు చేసిన నాసందునం దమతమ జనంబులం గానక కాందిశీకులైనవారల మీవారిం జూపెద మని తోడుకొనిపోయి విజనస్థలంబుల నొడంబడకుండినఁ బుడమిం బడవైచి యీలువుగొని విడిచినం గ్రమ్మరి తము నన్వేషించునత్తమామలం గలసికొని తేలుగుట్టినదొంగలంబోలె మెలంగు ముగ్ధాంగనలును బూర్వానుభూతలగునుపభర్తలం బ్రయత్నంబులం గాంచి కనుసన్నలఁ గొన్ని చిన్నెలు నెఱపిన నదిగని రోషకషాయితాక్షులై యాక్షేపించుచు స్వజనంబులు సొచ్చి సమ్మర్దబాహుళ్యంబునం బోలి వెలమచ్చెకంటుల నంటుగల్గుటం జేసి వారల నవ్వలకుం ద్రోసిచనినఁ జేయునది లేక యిచ్ఛావిహారవిరోధి యగు నిజకులాచారంబులం దలంచుకొని యుస్సురను విదగ్ధముగ్ధేందుముఖులును, బర పురుషభోగాయత్తచిత్త లగుటం గ్రందుకొను సందడిం బడి కంటికిం బ్రియంబైనవానిం గామించియు గోరంజీరియుఁ గొంత యాసతీర్చుకొని యంతట నతం డెఱిఁగినం గలంగి తొలంగి చన వెండియు నతండు వెంటంబడిన నదరంట జంకించు కామినులును, దైవనమస్కారంబులు దూరంబు చేసి పదుగురైదుగురు గుమిగూడుకొని కోడెకాండ్రరూపాధిక్యహైన్యంబు లుపన్యసించు సామాన్యకన్యకలును మఱియుఁ గటిఘటితార్ద్రవసనఖండంబులతోఁ బొర్లుదండంబు లిడువారలకు మార్గక్షుద్రశిలాకలాపంబు లవ్వలం ద్రోచివైచి యెండ మెండునం బెండుపడకుండ గడితంపుపచ్చడఁబు లుల్లెడలవడువుసంబట్టువారును నిట్టసిగలు మిట్టిపడ లలాటపట్టికలం బెట్టిన పట్టెవర్ధనంబులు వర్ధమానఘర్మజలంబులం గరంగ భక్తిపారవశ్యంబున నాయాసం బెఱుంగక వర్తించుభాగవతులకు వ్యజనవీజనంబుల దయాభాజనంబు లగుచు వీచువారును నాగంతులకు శీతలోదకంబులుం బానకంబులును నీరుమజ్జిగయుం దెచ్చి కైకొనుం డని ప్రార్థించి యిచ్చువారునుం గలుగు రాజవీధుల వేంచేయు నప్పుడు. 10

క. చెప్పెడి దేమిఁక నొకచో
దెప్పరమగు నుక్కుజీను దిగవైచిన వే

నెప్పుకొని కదలకుండెడు
కప్పలి తీరునను దేరు గదలక నిలిచెన్. 11

సీ. ఇఱుకుమ్రాఁకులవైచి యేలెల్ల యనుచుఁ దో
పించిన నింతైనఁ బెగలదయ్యెఁ
జూడవచ్చినవారిఁ బీడించి పెనుమోకుఁ
బట్టింప నింతైనఁ బాఱదయ్యెఁ
దమతమభక్తి యెంతయుఁ బురికొల్పఁగా
జనులు ప్రార్థించిన సాగదయ్యె
నిమ్నోన్నతక్షితిని సమంబుగాఁ జేసి
జన్నెలమీఁ దెత్త సడలదయ్యె
తే. భాగవతులెల్ల నుపవాసపరత స్రుక్కఁ
దెరలి చూపఱులెల్లఁ బందిళ్ళు నేర
నేగుదెంచిన నృపులెల్ల నిండ్ల కరుగఁ
జేరి యధికారులెల్లను జిన్నఁబోవ. 12

క. ఆకార్యము విని నందన
భూకాంతుం డేను మ్రొక్కఁబోకునికిఁ జుమీ
యీకొదవ గలిగె నని తన
రాకాచంద్రాస్య వెంటరా నరుదెంచెన్. 13

ఉ. అత్తఱి బాటదార్లపరపైన భువిం బడువారి నెత్తకు
న్మత్తగజంబుఁగన్న గరిమ న్మొలత్రాడని గట్టినట్టివా
రెత్తిరి త్రాణకొద్ది పరువెక్కడి వేడుకలంచు నంతను
ద్యత్తర మయ్యె వీథి ధవళాక్షులచే నవరోధముం బలెన్. 14

తే. వెంటనరుదెంచు తనమచ్చెకంటితీరు
సొట్లు శోధించి క్రీఁగంటఁ జూచికొనుచు
నీటువాటిల్ల నరిగలనీడఁ బెండ్లి
సడల నవ్వీథి కరిగె నప్పుడమిఱేఁడు. 15

క. ఆవేళ శశిప్రభ రే
ఖావిభవముఁ జూచి పౌరకమలేక్షణ లా
హా వుట్టిపడినయట్లన్
దేవునిఁ గన మఱచి యిట్లనిరి తమలోనన్. 16

తే. ఆఁడుఁదనమెల్ల నొక్కటే యట్టిపట్ల
నింతి యొప్పులకుప్పయై యెసఁగకున్న
నిమ్మహారాజు చేపట్టునేల యిట్టి
పడఁతి గల్గుట నీతఁడే భాగ్యశాలి. 17

క. అని పొగడుచుఁ గనుఁగొన న
వ్వనితలలో డాఁగి యాధవళలోచనఁ గ
న్గొనియె నొకవర్తకుని నం
దనుఁడు ప్రవీణుఁడనువాఁడు తత్సమయమునన్. 18

క. చూచినయంతనె మదనుం
డాచపలుని నడ్డంగిచె నాతరువాతన్
వాచాగోచరదుర్మద
వైచిత్రిం బొగడదండ వైచెం బెలుచన్. 19

క. ఈరీతి నతఁడు బహుమో
హారూఢిం బొగులునంత నానృపతి నమ

స్కార మొనరించి పోవం
దేరొకనిమిషంబులోన నెలవున కరిగెన్. 20

క. ఆతరువాతఁ బ్రవీణుఁడు
జాతరవాతతమిళిందసమితికి సుమరే
ఖాతతవారికి నిజకర
కాతరవారిజమరీచికల కే దలఁగన్. 21

క. ఆందోళన మొందుచు న
య్యిందుముఖిం బొందకున్న నిందవుగద యీ
బొందికిఁ బ్రాణము లని య
మ్మందుం డొకనేర్పు తనదు మదికిం దోఁపన్. 22

క. ఆరూఢి యశోదయనం
బేరుపడిన పేదరాలి పెద్దమగృహముం
జేరం జని యాయవ్వయు
రారమ్మని ప్రియ మెలర్పఁ బ్రముదితుఁ డగుచున్. 23

చ. సడికొడిగట్టలేని కనుచాటుమెలంకువతీఁగబోండ్లకుం
గడుపులు దించ నింతులకుఁ గాంతవశీకరణార్థమంత్రముల్
నొడువఁగఁ బల్లవాళిగతి లోకపుపూఁతలు మేఁతలీయనే
కడమయు లేక నింటఁగడకట్టితి నిన్ గొనియాడశక్యమే. 24

క. నీ కీవఱ కెన్నఁడు వ
క్కాకున కీలేదు నిర్దయామతి నేలా
కోకొమ్మాయని పిడికెఁడు
రూక లొడింజల్లి యాతురుండై మఱియున్. 25

క. నందననృపాలుసుందరి
యందముఁ గనుగొంటి మొన్న నదిమొద లెదలోఁ
గందర్పదర్ప మార్ప మ
దిం దెఱకువ శరణుసొచ్చితి న్నీ కిచటన్. 26

క. అని దీనాలాపము లా
డిన నవ్వుచు నయ్యశోద డెప్పరమగు నీ
పని యైన నే నృపాంగన
నినుఁ గూర్చెదఁ జూడు నాదునేర్పని పనిచెన్. 27

క. రాకాశశాంకవదన ప
రాకా యిఁక నయ్యశోద రాజాంగనతో
నేకైవడిఁ గూర్పఁగవలె
నాకాముకుఁ దెలిసెనేని యానతియిమ్మా. 28

క. అని చిలుక తేనియలు బో
రనియెడు జడివాన వెలిసినటువలెఁ బలుకం
దనయంతనె తానిల్చిన
విని కోమటిచిటుకులాఁడి వెస నిట్లనియెన్. 29

క. ఓరామచిలుక మాకీ
మారాము ళ్ళెట్లు తేలియు మగవారమె నీ
దారిఁ బలుపోకలం గడి
దేఱం దరువాతిగాథఁ దెలియం జెపుమా. 30
చ. అనవుడుఁ జిల్కఱేఁడు విడియంపుదువారపుఁ గెంపుఁగన్న జ
వ్వని నునుదొండపంటి జిగివాతెఱజాఱన ముక్కునిగ్గు వా

సన నెడసేయఁ గుంకుమవసంతము సల్ల కథావిశేషమి
ట్లని తెలుపందొడంగె వసుధాధిపుదూతిక చిన్నఁబోవఁగన్. 31

సీ. నడునెత్తి మఱ్ఱిపాలిడి తాలిక లొనర్చి
కడలుకొల్పిన గొప్పజడలదిండు
నలికభాగమునఁ జింతాకు వెడల్పుగఁ
బొసఁగించుకొన్న విభూతిరేఖ
సందిట నిరువంక నొందుపైఁడి కుసుళ్ల
నందంబు నొందు రుద్రాక్షపూస
కటితటిఁ గాసెపై గట్టిగాఁ బిరుచుట్టు
గట్టినకుఱుమాపుఁగావికోక
తే. నాగబెత్తంబుఁ దామ్రపునందిముద్ర
యుంగరము జన్నిదపువాటు యోగపట్టె
యమరజంగమురా లయ్యె నఖిలపల్ల
వావళీకృతసమోద యయ్యశోద. 32

క. ఈలీలం గ్రొత్తజంగము
రాలై తనవెంట శిష్యుఁడై యొక్కఁడు రా
నాలలన యిల్లు వెడలెన్
గోలయుఁ బలె నొక్కపెట్టకుక్కం గొనుచున్. 33

చ. వెడలి పురంబునంగలుగు వీథులవీథుల సౌధయూథముల్
బడిబడిఁజుట్టి యాశునకభామఁ గనుంగొని యిట్టిపుట్టు వె
క్కడను లభించె నీకు మమకారము గానము మే ల్రహింపఁగా
దడఁబడ న న్నెఱుంగవుగదా యనుచుం జరియించి యెంతయున్. 34

క. ఆనందనాఖ్యధరణీ
జానియగారంబు బలుహజారముఁ జేరం

గా నరిగి కృత ప్రత్యు
త్థానత బహువిధములందుఁ దను సేవింపన్. 35

తే. వారితోఁ గాశికాకృతావాస ననియు
నిపుడు రామేశ్వరంబున కేగుచున్న
దాన ననియు ఫలాహారమాననీయ
ననియు వసియింప వైరాగ్య మౌర యనుచు. 36

తే. వారు చెట్టునఁ దనదాన యారఁబండి
నట్టి పరువంపురసదాడియరఁటిపంటి
గొలలు చక్కెర నెయ్యి మక్కువ నొసంగ
నన్నియును సన్నచే శిష్యుఁ డందుకొనియె. 37

క. చూపట్టఁగ గోమయమునం
జేప ట్టొనరించి జడలఁ జెక్కినలింగం
బాపోకలాఁడి గైకొని
వేపికడ న్నిలిపి భక్తివివశయపోలెన్. 38

క. ధూపంబు కడ్డివత్తులు
దీపంబు నొసంగి తనకుఁ దెచ్చినఫలముల్
చూపి యుపహార మిచ్చి ని
శాపతిధరుఁ గుక్కనొక్కసరిగాఁ గొలువన్. 39

చ. గుమిగొని పైలపైలఁబడికొంచు భటావళి చూడఁబోవ వె
చ్చము గొనిపోవుదాదులు నిజంబు గనుంగొని యాశశిప్రభా
రమణికిఁ దెల్ప నాయమ నిరంతర విస్మయమంది చూతమా
క్రమమని వారిచేఁ బిలువఁగాఁ బనుషం జని మ్రోల నిల్చినన్. 40

తే. ఆశశిప్రభ జంగమురాల యేమి
కారణం బిటు కుక్క లింగంబు నొక్క
సరిగఁ బూజింప నిది వింతసరణి గాఁగ
దోఁచుచున్నది తెల్పుమా దాఁచకనిన. 41

క. ఆమాయలాఁడి యపు డా
కోమలిమొగము గని గోడుగోడున నేడ్వం
గా మఱియు వెరవుదోపఁగ
నామంజులవాణి యనునయాలాపములన్. 42

క. ఊరార్చి యడుగ సమ్ముది
బేరజమిది విన్న నీకుఁ బెనుదుఃఖంబౌ
నేరీతినైన మఱి వినఁ
గోరిన నన్నొంటినడుగు కువలయనయనా. 43

క. అనుమాట విని వయస్యా
జనములు కడకరుగ నవ్విశాలేక్షణతో
మనకథ యవితధముగ విను
మని యంత న్మాయజోగురా లిట్లనియెన్. 44

చ. మునుపటిపుట్టున న్మనము మువ్వుర మొక్కతె కుద్భవింప నం
దనఘచరిత్రయైన మన కగ్రజనాథునిఁగాని తన్నుఁ గో
రినమగవారలం దననిరీక్షలకుం బ్రియులైనవారలం
దనివిదొరంగఁ గూడనికతంబున నీగతిఁ బుట్టెఁ గుక్కయై. 45

క. నీ వపుడు వీఁడు వాఁడని
భావింపక గుడిసె వైచి పరులంబొందన్
దేవేరి వైతివౌ వసు
థావల్లభమణికిఁ గేళితత్పరమతివై. 46

క. ఏ నపుడు కోరివచ్చిన
వాని న్రమియించుట న్భవానీపతినే
వానిరతియు జాతిస్మర
తానూనత్వంబుఁ గల్గి హర్షముఁగంటిన్. 47

క. కావున సహోదరీ మై
త్రీవిధి నీ వేపితోఁ జరింతున్ శివపూ
జావేళనైన నని యనఁ
గా విని యారాజముఖి వికాసోన్ముఖియై. 48

ఉ. గ్రక్కున మ్రొక్కి పూర్వజనికాలసహోదర లైనమిమ్ము నే
నక్కఱఁదీఱఁ గంటి నొక యక్కకు నిట్టియవస్థ వచ్చెనే
యక్కట నేననన్యరతనై యొకరాజును గూడియుంటి ని
ట్లెక్కడ వచ్చునొక్కొ యిఁకనెత్తుభవంబున నిట్టిదుర్దశల్. 49

సీ. అక్క నాకిచ్ఛావిహారంబు గూడ దీ
పట్టున దొరచెట్టఁబట్టియునికి
నింకొక్కజన్మమం దేనియు జాతీస్మ
రత్వవిఖ్యాతిచేఁ బ్రబలవలయు
నప్పటి కన్యవ్రతాభావజనీతమై
శునకత్వ మెడలించుకొనఁగవలయు
నటుగాన ననుఁగోరినట్టి చక్కనిచిన్న
వాని దోతెంచి నావాంఛ దీర్పు
తే. మాతఁ డవరోధగమన మె ట్లనుచు వెఱచి
యెడఁబడకయున్న నా ప్రాణ ముత్తరింతుఁ
దనకుఁ గానని యేనంటి ననుచు ధైర్య
మీచ్చి తోడ్కొని ర మ్మిప్పు డేగు మనిన. 50

చ. చని యది యొక్కనాఁ డరిదిజంగమురాలయి శిష్యుఁ గాఁగఁ గై
కొనుచుఁ బ్రవీణుఁ దెచ్చి యొనఁగూర్చినఁ బెచ్చుతమి న్శశిప్రభా
వనరుహపత్రనేత్రయును వాఁడును వేడుకమీఱఁ గేళికిం
బనుపడి సౌఖ్య మొందిరి ప్రభావతీ వింటె యశోద నైపుణిన్. 51

క. ఈరీతీ నేర్పుగలిగినఁ
బోరాదో మగనికన్నుఁ బొడిచినరీతిన్
రారాదో లోకములో
వారికి నీ కనుటగాదు వారిజనేత్రా. 52

మ.అని యూరీకృతమూకభావుఁడయి కీరాధ్యక్షుఁ డుండంగ వై
శ్యునియిల్లా లతివిస్మయాంబునిధియం దోలాడుచిత్తంబుతో
డ నిజంబౌనె యశోదవంటిది నిరూఢప్రౌఢ చేకూర్చినన్
జనితస్వైరవిహారధీరసురతేచ్ఛాకాముకశ్రేణికిన్. 53

క. అని తెల్లవాఱవచ్చుటఁ
గని నిద్దుకకరిగెఁ గీరకారణజన్ముం
డును నేఁటికిఁ దక్కెఁ గదా
కనకాంగికి మాన మని సుఖస్థితి నుండెన్. 54

ఉ. అంతటఁ జక్రవాకవరహప్రదమౌ సమయంబు వచ్చినం
గంతుఁడు రాజదూతి సతికన్నను మున్నుగ హెచ్చరింప సం
భ్రాంతమనోబ్జయై యలప్రభావతి యింద్రశిలావిభూషణా
నంతరుచిచ్ఛటల్ పెనకులై తనచూపులనంటి కొల్వఁగన్. 55

క. కలపంబు నలఁది కస్తురి
తిలకము పొలుపొంద రత్నదీపము లగుపా

వలు మెట్టి మేలిమిం గురు
వలు వమరం గట్టి వింతవగ గనుపట్టన్. 56

తే. రాజు తొలునాఁటిరేయి విరాళిగొనుటఁ
దెలుపుచును వెంటవచ్చుదూతికయుఁ దాను
సరస కేతేర నక్కీరసార్వభౌముఁ
డరిది యపరంజిపనులపంజరము వదలి. 57

క. చనువేళ నిలిచి పొమ్మని
యనరా దపశకున మనుట నైన న్నీపై
నెనరునఁ దెలిపెద నొకకథ
కనకాంగీ వినిన నేర్పుగలుగు న్నీకున్. 58

వ. అని పలికి యాభామినీమేదురావలోకనాధారంబునం దదీయాంగీకారంబు నెఱింగి యప్పతంగపుంగవుండు హాసంబుతో నితిహాసం బిట్లని చెప్పం దొడంగె. 59

ఏడవకథ

తే. అమరసౌవీరదేశంబునందు విటత
రంగితాభంగమోహాంబురాశి చం,
కార్యకృద్వారభామాప్రకాశమాన
లపనమండల మగువిశాలాపురంబు. 60

క. ఆపురము నరోత్తముఁ డను
భూపాలుం డేలు నతనిప్రోపున వైశ్యుం
డేపారు నొకఁడు ధర్మ
వ్యాపారం బలర విమలుఁ డనునామమునన్. 61