శివపురాణము/లీలా ఖండము/శ్రీహరి సుదర్శన చక్రం పొందుట, ఉపమన్యుచరితం

శ్రీహరి సుదర్శన చక్రం పొందట

"శివలీలలో అతి ముఖ్యమైనది - విష్ణువు సుదర్శన చక్రం పొందడానికి శివారాధనే కారణమంటారు! ఆ లీల వినిపింపుడు" అని శౌనకాది ఋషులంతా అడగ్గా సూతుడు ఇలా చెప్తున్నాడు.

"ఒకానొక సమయంలో దానవమూకలు మహా బలవంతులైరి. త్రిలోకాల్లో వున్న సౌమ్యులందర్నీ ముని - దేవ - మానవులన్న విచక్షణ లేకండా హింసిస్తూ ఉండిరి.

దేవతలంతా విష్ణువు చెంత చేరి దానవులను అణచి వేయవలసిందిగా ప్రార్థించారు.

"ఇదంతా కాల వైపరీత్యం! ఇందుకు పరమ శివారాధనమే శరణ్యం" అని వారిని ఊరడించి పంపి అఖండ శివదీక్షలో మునిగిపోయాడు.

ఒక గొప్ప అలోచన స్ఫురించి వెయ్యికమలాలతో శివ సహస్ర నామాలను అర్చించాలని నిర్ణయించుకున్నాడు. వెయ్యి పువ్వులూ కోసి తెచ్చి పెట్టుకున్నాడు. నామానికొక పుష్పం అర్పిస్తున్నాడు.

పరిక్షార్ధం శివుడు ఓ పుష్ఫాన్ని కాజేశాడు, మాయమైన పుష్పం సంగతి తొమ్మిది వందల తొంబై తొమ్మిది సంఖ్యకు చేరుకున్నాక గాని (శివునికి ఓ పుష్పం లోటు ఏర్పడిందని) శ్రీహరికి తెలియలేదు.

వెంటనే - లోకులంతా కమలాక్షుడని తనను పిలవడం సంగతి గుర్తొచ్చి, ఆ వెయ్యోనామం అర్చించడానికి తన నేత్రాన్ని పెకలించాలని ఉధ్యుక్తుడవుతూండగా పరమశివుడు వారిస్తూ ప్రత్యక్షమయ్యాడు.

వాస్తవంగా విష్ణువు అర్పించిన వెయ్యి పువ్వులూ అందాయి అని చెప్పి కరుణించాడు.

దేవతల సంరక్షణార్ధం ఇంత దుస్సాహసానికి వొడిగట్టిన శ్రీహరిని మనస్ఫూర్తిగా దీవించి తనచే నిర్మితమైన సుదర్శనం అనే చక్రాన్ని ప్రసాదించి, 'దీనికి ఎదురులేదు! ఎంత మందిని నిర్జించినా - తిరిగి నీవద్దకు చేరుకుంటుంది' అని అనుగ్రహించాడు.

అందువల్లనే ఆయనకు చక్రి అనీ - చక్రధరుడని - చక్రపాణి అనీ పేర్లు వచ్చాయి" అని వివరించాడు సూత పౌరాణికుడు.

ఉపమన్యుచరితం

వ్యాఘ్రపాదుడనే ముని సత్తముని కొడుకే ఉపమన్యుడు. పసితనంలోనే తండ్రికి దూరమైన ఈ బాలుడు తల్లి - మేనమామల అండతో పెరిగాడు.

బాల్యంలో అందరూ గోక్షీరం గ్రోలుతూంటే , కనీసం తల్లిపాలకైనా నోచుకోని ఉపమన్యుడు బాల్యచాపల్యం కొద్దీ పాలకోసం తల్లిని వేధించసాగాడు. ఆమెకు మార్గాంతరంతోచక, ఉన్న ఒకే్ ఒక్క అన్నగారి అండనీ (తనయుని కోరికలు చెప్పి విసిగించి) పోగొట్టుకోలేక, ఒక ఉపాయం ఆలోచించింది.

పేలపిండిని చిక్కగా నీళ్లలో పిసికి, అవే పాలు అని చెప్పి మరపింపచూసింది...బాలుడు ఆమోఘ మేధా సంపన్నుడు కావడంతో అది ఇట్టే పసిగట్టేశాడు.

ఆ తల్లి, తన అవస్థను చెప్పుకుంది కొడుకుతోనే! శివధ్యానం చేసి ఏకంగా పాలసముద్రాన్నే పొందుతానన్నాడు ఉపమన్యుడు. అతడికి అంత పట్టుదల కూడా ఉన్నదని ఆ తల్లికి తెలుసు!

ఓంకార పరబ్రహ్మమైన శివముర్తిని ప్రసన్నం చేసుకోడానికి 'నమః శివాయ' అనే పంచాక్షరినే తోడుగా చేసుకొని తపోనిష్ఠకు బయల్దేరాడు ఉపమన్యుడు.

క్రమంగా ఉపమన్యుడి తపో తీవ్రత పెరిగి, లోకాలను హడలెత్తించ సాగింది. ఉపమన్యుడి దీక్షను పరీక్షించబోయాడు శివుడు.

ఇంద్రుడి వేషములో వెళ్లి భోగభాగ్యాదులు ఇస్తానని ఆశ చూపించాడు. బూడిద తప్ప ఏమి ఇవ్వలేని శివుడినేం అడుగుతావు? ఆయన ఏమిస్తాడు? అని ఎద్దేవ చేశాడు.

శివనింద భరించజాలక చెవులు మూసుకుని తక్షణం అక్కడి నుంచి ఆ ఇంద్ర వేషధారిని కదలమని హెచ్చరించాడు ఉపమన్యుడు.

ఇంకా తాత్సారం చేస్తున్న అతడ్ని వెళ్లగొట్టాలని తల్లి తనకు రక్షగా ఇచ్చిన భస్మం పిడికిట్లో పట్టుకుని అఘోరాస్త్రం మది తలచి ప్రయోగించబోగా అప్పుడు ప్రత్యక్షమయ్యాడు శూలి - పార్వతీ సహితుడై.

"ఇదంతా నీ లీలేనా శూలీ?" అని పరిపరి విధాల ప్రార్థించి, శివుని కరుణకు పాత్రుడయ్యాడు. ఇష్ట కామ్యసిద్ధి పొందాడు.