శివపురాణము/లీలా ఖండము/కృష్ణ - ఉపమన్యుల సమాగమం, గుణనిధి గాధ
కృష్ణ - ఉపమన్యుల సమాగమం
పూర్వం శ్రీ కృష్ణుడొకసారి పుత్రార్ధియై, కైలాసగిరిని చేరి, అక్కడ శివదీక్షాపరుడైవున్న ఉపమన్యమునిని చూసి "బాల్యం నుంచీ శివజ్ఞానం చక్కగా ఎరిగివున్న ఓ మహర్షీ! శివమహిమ వివరించగల సమర్ధులు గనుక, నాకు శివలీలలను వినిపింపగలందులకు వేడుచున్నాను" అని కోరాడు.
సమస్త శివలీలలను బోధించి, శివపంచాక్షరి ఉపదేశించి, నేటికి 16 మాసాల్లో నీకు పరమేశ సాక్షాత్కారం లభించుగాక! అని దీవించాడు.
కృష్ణునికి శివ సాక్షాత్కారం
ఆ విధంగానే శివపంచాక్షరి జపించిన శ్రీకృష్ణునికి పదహారో నెలలో పార్వతీపతి ప్రత్యక్షమయ్యాడు. ఎన్ని వరాలు కావాలో అవన్నీ కోరుకోమన్నాడు శివుడు. శివభక్తి తత్పరులైన పదిమంది పుత్రులను అనుగ్రహించమన్నాడు శ్రీ కృష్ణమూర్తి.
"కృష్ణా! శాపవశాన జన్మకై ఎదురుచూస్తున్న ఘోర సంవర్తకుడనే ఆదిత్యుడిని - సాంబుడనే మహావీరుని పేర నీకు పుత్రునిగా అనుగ్రహిస్తున్నాను. అంతేకాదు! నీవు మదియందు తలచిన ఏ కోరికైనా నీకు సాధ్యపడుతుంది" అని వరం ఇచ్చాడు కపర్ది.
గుణనిధి గాథ
కాంపిల్య నగరంలో యజ్ఞదత్తుడనే మహా శివదీక్షాపరుడైన బ్రాహ్మణుడుండేవాడు. ఆయనకు చాలా కాలానికి ఒక కుమారుడు కలగగా, గుణనిధి అనే పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకోసాగాడు. తల్లితండ్రుల అతిగారబం, ఆ పిల్లవాడిని అచిర కాలంలోనే చెడగొట్టింది.
చెడు సావాసాలపాలైన గుణనిధికి విద్య వొంటబట్టలేదు గాని, జూదం - వ్యభిచారం - సురాపానం వంటి సప్తవ్యసనాలూ చక్కగా పట్టుబడ్డాయి.
వ్యసనాలకు అవసరమైన ధనం కోసం అతడు ఇంటి దొంగగా కూడా మారి, యుక్తవయస్సొచ్చే నాటికి చిల్లరదొంగగా పరివర్తితుడైనాడు.
తల్లికి కొడుకు సంగతి పూర్తిగా తెలిసినా, గారాబంచేత భర్తకు తెలీనివ్వకుండా జాగ్రత్త పడుతూ వచ్చింది. మొక్కగా వంగనిది మ్రానుగా మారాక వంగదు కదా!
ఒకసారి యజ్ఞదత్తుడు, తనకు ఓ సన్మానసభలో రాజుగారు స్వయంగా వ్రేలికి తొడిగిన రత్నపుటుంగరం జాగ్రత్త చేయమని భార్యకు ఇవ్వగా, అది గుణనిధి తస్కరించాడు. జూదంలో దాన్ని ఓడిపోవడంతో అది ఓ జూదరిపాలబడింది.
రాచవీధిలో ఠీవీగా నడుచుకుంటూ రత్నపుటుంగరం ధరించిన చేతిని సవిలాసంగా ఊపుకుంటూ వెళ్తూన్న ఆ జూదుని యజ్ఞదత్తుడు చూడడం తటస్థించింది.
తనకెంతో ప్రియమైన అ రత్నపుటుంగరం ఆయన గుర్తుపట్టి, జూదుని ప్రశ్నించగా 'గుణనిధి అనే ఓ విప్రకుమారుడి వద్ద తాను జూదంలో గెల్చుకున్న వైనం' సవిస్తరంగా తెలిపాడతడు. అప్పటికే అటకమీది పాత్రసామాగ్రి యావత్తూ జూదాలకు తరలించేసిన కొడుకు వైఖరిని గురించి భార్యను నిలదీశాడు.
ఆ మహా ఇల్లాలు, కేవలం పుత్రప్రేమ మితిమీరగా - భర్తకు ఇంకా అసత్యాలు చెప్పబోయింది. తక్షణం ఆ తల్లీ కొడుకులను విడనాడి యజ్ఞదత్తుడు తన పరువు నిలుపుకున్నాడు.
గుణనిధికి శివపూజ అసంకల్పితంగా తటస్థపడుట :
జూదశాలలో వున్న గుణనిధికి, తన తండ్రి తనపై కారాలు మిరియాలు నూరుతున్నాడన్న వార్త తెలిసి, ఇంటికెళ్తే తనకు శిక్ష తప్పదని అట్నుంచి అటే అడవిలోకి పారిపోయాడు.
ఆనాడు శివరాత్రి. అడవిదాపున ఉన్న శివాలయంలో విశేషంగా అర్చనలూ - పూజలూ - శివారాధనలూ జరుగుతున్నాయి. భక్తులు నైవేద్యాలతో కుడిన బంగారు పళ్లెరాలతో బారులుతీరి వెళ్తున్నారు. ఆ దృశ్యం గుణనిధి కడుపులో ఆకలిని మేల్కొలిపింది.
అది అర్ధరాత్రి. అందరూ నివేదనలుచేసి, పళ్లెములలో రకరకాల భక్ష్యభోజ్యాలు నివేదించి ఉపవాస, జాగరణ బడలికచేత ఇంచుక విశ్రమించారు. అదంతా దాపుననే పొంచి చూస్తూవున్న గుణనిథి, గర్భగుడిలోనికి జొరబడ్డాడు. ఇక తన క్షద్భాధ ముందు చల్లార్చుకుందామని ఆత్రపడబోగా, రివ్వున వీచిన ఓ గాలితెర వల్ల దీపం ఆరిపోయింది.
ఏనాడూ శివనామం ఉచ్చరించని ఆ నోట - ఆ పూట - అంతవరకూ విన్న శివనామస్మరణ ప్రభావం వల్ల శివశివా అనేమాట వెలివడింది. ఆ చీకట్లో తడుముకుంటూనే, తన అంగవస్త్రం చింపి వత్తిచేసి, బైటకొచ్చి యజ్ఞవాటిక నుంచి అగ్ని తీసుకెళ్ళి దీపం వెలిగించి నివేదించిన ప్రసాదం ఆవురావుమంటూ ఆరగించాక, చక్కని నారికేళ ఫల తీర్థం త్రాగి తృప్తిగా బైటకొచ్చి బ్రేవ్‌మంటూ త్రేంచాడు గుణనిధి.
అ శబ్దానికి చటుక్కున మెలకువ వచ్చిన ఓ భక్తునికి గుణనిధి రూపం - వైఖరి, దొంగను స్ఫురింపజేయగా అతడు అందర్నీ లేపి 'దొంగ-దొంగ' అని అరిచాడు.
చీకట్లోకి పరుగెత్తాడు గుణనిధి. దాని వల్ల అందరికీ అనుమానం మరింత బలపడి, ఆ అడవిలోనే గుణనిధిని వెంబడించి, అంతా కలిసి చీకట్లో తలొక దెబ్బవేసే సరికి గుణనిధి మరణించాడు.
అతడ్ని తీసుకుపోవడానికి యమదూతలు - మరొక వైపు శివదూతలు వచ్చి నిలిచారు. గుణనిధి పాపాలన్నీ ఏకరువుపెట్టి ఇతడిని నరకవాసం అన్నివిధాలా ప్రాప్తం అన్నారు.
మహా ఘోరపాపి అయినా, శివరాత్రి నాటి రాత్రి ఉపవాసం - జాగరణ చేసి దీపారాధన చేసి ప్రసాద భక్షణం కూడా కానివ్వడం వల్ల - అఖండమైన పుణ్యం సంప్రాప్తించిందనీ, కనుక గుణనిధికి శివసాయుజ్యం తప్పదనీ; అసంకల్పితంగానే అయినా ఇవన్నీ అతడికి సంఘటిత పడ్డాయనీ చెప్పి శివదూతలు గుణనిధిని శివసాయుజ్యం చేర్చారు.
అంతే కాదు! అతడు కాలాతరంలో, ఒక రాజకుమారుడిగా పుట్టి - మరింత శ్రద్ధా భక్తులతో శివారాధన చేసి, శివునికి అత్యంత ప్రీతిపాత్రుడై యక్ష కిన్నెర, పుణ్యజనుల నివాసమైన అలకాపురి అనే దివ్యపట్టణానికి కుబేరుడనే పేర ప్రభువు కూడా అయి, దిక్పాలురలో ఒకడిగా వెలుగొందాడు.