శివపురాణము/యుద్ధ ఖండము/విష్ణుమాయలో అసురత్రయం
శివుడి ఆనతిని అర్థం చేసుకున్నాడు శ్రీహరి. వెంటనే పరిపూర్ణ హరి అంశకాకుండా, కొంతభాగం మాత్రమే తన అంశ ఉండేలా, ఒక ముండిత శిరస్కుడిని సృష్టించాడు విష్ణువు.
అతడిని అరిహంతుడని పిలిచి, "కుమారా! అరిహంతా! నీవు పుడుతూనే ధర్మం - ధర్మం అంటూ సణగడం నాకు ముచ్చటేస్తోంది. నా నుండి ఉద్భవించినందున, ప్రజలు నిన్ను కూడా పూజిస్తారు. కాని నీవల్ల ధర్మభ్రష్టంగా కొంత కార్యం జరగవల్సివుంది. శ్రౌత, స్నార్త ధర్మ విరుద్ధంగా, అపశబ్దయుతంగా, వర్ణాశ్రమ ధర్మాలకు వ్యతిరేకంగా, ద్వంద్వార్ధ స్ఫురణతో ఓ మతశాస్త్రం నువ్వు సృష్టించు! దాంతో అసురుల్ని దగాచేసి, నీ మతానుయాయులుగామార్చు! నిన్ను ఆరాధించడానికీ - పటాటోపం ప్రదర్శించడానికీ ఓ నలుగురు శిష్యుల్ని నువ్వు సృష్టించుకో! ప్రస్తుతం త్రిపురాలకు మాత్రమే పనికొచ్చే ఈ 'ధర్మం' కలియుగంలో మాత్రం, అసురధర్మం బాగా ప్రబలినపుడు అక్కర కొస్తుంది. కనుక నీవు నిమిత్త మాత్రుడవై - నా ఆజ్ఞాబద్ధుడవయి చేయు ఈ పని వల్ల పాపరహితుడివిగా ఉండెదవుగాక!" అని ఆదేశించాడు.
త్రిలోకసంచారి అయిన నారదుడు సైతం శ్రీ మన్నారాయణ ప్రేరితుడయ్యాడు. అరిహంతమతం అవలంబించిన వాడిలా, జటాజూటాలు విడిచి తలను బోడి చేసుకున్నాడు. శివారాధన - విష్ణు పూజ వ్యర్ధం అన్నాడు. తాను మతం మార్చుకుని అరిహంతుడు చెప్పినట్లే నడుచుకుంటున్నానన్నాడు.
నారదుడంతటివాడే ఇలా ప్రవర్తిస్తున్నప్పుడు, అరిహంతుడెవరో తెలుసుకోవా లనిపించడం అసురులకు మాత్రమే కాదు! అందరికీ సహజమే!
ఆ ఉత్సాహంతోనే వాళ్లు ముగ్గురూ ఆ వేషధారి దర్శనం చేసుకున్నారు. దర్శనం ఇలా జరిగిందో లేదో, విష్ణుమాయ ఆవరించేసింది ఆ ముగ్గురు అసురులనూ.
ఏదో దుష్టశక్తి ప్రేరేపించిన వాళ్లలా మహోత్సాహంతో "మహానుభావా! తమ మతమేదో కొత్తగానూ - వింతగానూ ఉంది. ఇంతకాలం మేమీ ప్రాతరోతమతాన్ని పట్టుకు ప్రాకులాడినందుకు చింతగానూ ఉన్నది. తాము దయచేసి మాకు ఈ కొత్త మతదీక్ష ఇచ్చి, నియమాలు వివరించగలరు" అని కోరారు.
ధర్మచ్యుతుల్ని చేయడానికే ఆవిర్భవించిన ఆ మతం పుణ్యమా అని, నీతి నియమాలలోనూ - ఆచార వ్యవహారాలలోనూ పెను మార్పులు సంభవించాయి. సాక్షాత్తు ప్రభువులే మతదీక్ష పుచ్చుకొని, శ్రద్ధగా మతానువర్తులైతే మిగిలిన పరివారమంతా ప్రభువును అనుసరించడంలో ఆశ్చర్యంలేదు గదా! పొలోమంటూ అందరూ తలలు గొరిగించేసుకుని, అరిహంతుని మతంలో చేరిపోయారు. దాంతో ఆ మాయా మతం జనబాహుళ్యంలోకి కూడా బాగా వ్యాపించిపోయింది.
మూలమూలలకూ ప్రచారం పొందిన ఈ కొత్తమతంలో పాతివ్రత్యంతో పనిలేని అసుర స్త్రీలు, వర్ణసాంకర్యంపట్ల మోజున్న అసుర ప్రముఖులూ, కుహనామేధావులైన అసుర గురువులూ మతాచారాలకు అద్దం పట్టే రీతిలో ప్రవర్తించసాగారు.
అచిరకాలంలోనే త్రిపురాసురులకు తపోశక్తి యావత్తూ క్షీణించి పోయింది. దానవుల్లో శ్రేష్ఠుడైన శిల్పిమయుడితో సహా, ప్రముఖ దానవులందరూ ధర్మచ్యుతులై తేజోవిహీనులయ్యారు. వెంటనే దరిద్రదేవత, కరువు కాటకాలు, ఈతిబాధలూ త్రిపురాలను ఆక్రమించాయి.
ఈ శుభవార్త తెలియగానే ఈశుని దర్శించారు దేవతలు. ఆయనను స్తుతించి "దేవాధిదేవా! తమ ఆజ్ఞ చొప్పున త్రిపుర ప్రభువులను ధర్మచ్యుతుల్ని చేశాం! ఇక ఆ పై కార్యం తాము నిర్వర్తించవలసి ఉంది" అని మనవి చేశాడు శ్రీహరి.
"అయితే, వరంలో వారు కోరుకున్న రీతిగా అపూర్వరథం సిద్ధంచేయండి" అని ఆదేశించాడు పార్వతీవల్లభుడు.
అపూర్వరథంలో పార్వతీపతి :
అత్యద్భుత రథనిర్మాణ కార్యక్రమాన్ని దేవతలు విశ్వకర్మకు ఒప్పగించారు.
సర్వలోక సారాన్నీ ఆకర్షించి, దానితో రథం రూపొందించాడు దేవశిల్పి. ద్వాదశాదిత్యులూ రథానికి కమ్మీలుగా అమిరారు. సూర్య చంద్రాదులు రథచక్రాలయ్యారు. ఆరు ఋతువులూ అడ్డుకమ్ములు అయ్యాయి. రథం మందరగిరి.
ఉదయ అస్తాద్రి పర్వతాలు నొగలు. మేరుగిరి అధిష్ఠానం. కేసర పర్వతాలు ఆశ్రయాలు. సంవత్సరాలు రథవేగం. అయనాలు చక్రాల కూర్పులు. ముహుర్తాలు చక్ర నేముల క్రిందనుండే కర్రలు. కళలు శీలలు, కాష్ఠలు ఘోణములు. శ్రద్ధను గమనంగాను, న్యాయ పురాణ శాస్త్రాదులు అప్రధాన భూషణాలుగాను...ఈ ప్రకారమే సమస్త సృష్టినీ వినియోగించుకొని ఓ మహాద్భుత రథాన్ని తీర్చిదిద్ధాడు.
బ్రహ్మదేవుడు సారధి. దేవతలు పగ్గాలు పట్టగా, ప్రణవం కంచీ కర్ర అయింది. సద్యోజాతమైన శరంగా శ్రీమహావిష్ణువే అమిరాడు. అగ్నిహోత్రుడు శరానికి ములికిగా మారాడు.
దివ్యర్షులు వేద మంత్రాలు పఠిస్తుండగా రథారూఢుడయ్యాడు మహేశ్వరుడు.