శివపురాణము/యుద్ధ ఖండము/త్రిపురాసుర సంహారగాథ
శౌనకాది మహర్షులంతా శ్రద్ధగా శివపురాణాంతర్గత ఘట్టాలను ఆలకిస్తున్నారు. కుమార ఖండము ముగించి, ఇంకా చాలా ప్రొద్దు ఉండుట చేత, తదుపరి ఖండమైన యుద్ధఖండమును ఆరంభించాడు సూతమహర్షి - మునిగణాల కోరిక మేరకు.
త్రిపురాసుర సంహారగాథ
గతంలో కుమారస్వామి చేతిలో హతుడైన తారకాసురునికి ముగ్గురు కుమారులు. తారకాక్ష్యుడు, విద్యున్మాలి, కమలాక్షుడు అనే ఈ ముగ్గురూ మహావీరులు, బలవంతులు. తండ్రిమరణంతో వారు తల్లడిల్లి పోయినప్పటికీ, దేవతలమీద పగతీర్చుకోవడానికి కమలాసనుడిని గురించి తపస్సుచేసి, ఆయనను మెప్పించారు. ప్రత్యక్ష మయ్యాడు బ్రహ్మ. వరాలు కోరుకోమన్నాడు.
అసురులు ముగ్గురూ ముక్త కంఠంతో ఒకే మాదిరి వరాలు కోరారు. వాటి ప్రకారం, అంతవరకు ఎవరికీ లేని విధంగా మూడు నగరాలు నిర్మించి ఇవ్వమనడమే గాక, ఆ నగరాలు ఎక్కడికి పడితే అక్కడికి సంచరించ గలగాలనీ, ఆ మూడూ ఒకే ప్రాంతంలోకి సంచారానికి వచ్చినప్పుడు, మిట్టమధ్యాహ్న వేళ, సర్వ దేవతా సార్వభౌముడు, అనితర సాధ్యమైన రథంతో వచ్చి, అపూర్వమైన బాణంతో మాత్రమే వధిస్తేనే, తాము మరణం పొందేలా వరం అనుగ్రహించమన్నారు.
తప్పనిసరై తథాస్తు అన్నాడు విధాత. తక్షణం వారు కోరిన మూడు నగరాలు, సంచారసహితంగా అమరాయి.
దేవతలను బాధించడంలో ఎంత నైచ్యం ప్రదర్శించినప్పటికీ - శ్రౌతకర్మలను, స్నార్తవిధులను పద్ధతిగా పాటించడం వల్ల, ఈశ్వరుడితో తమ బాధలు చెప్పుకున్న దేవతలకు ఊరడించడం తప్ప శివుడంతటి వాడే ఏమీ చేయలేకపోయాడు.
త్రిపురాసురుల వల్ల మాబాధలు పోగొట్టడానికి ఏదైనా ఉపాయం చెప్పవలసిందని దేవతలు కోరిన మీదట, వారిని వెళ్లి ఆ రాక్షసులు ధర్మం తప్పి ప్రవర్తించేలా చేసిరమ్మన్నాడు. రాక్షసులను ధర్మభ్రష్టులుగా చేసే ఉపాయం శ్రీహరితో కలిసి ఆలోచించడానికి దేవతలంతా వైకుంఠానికి పయనమైనారు.