శశికళ/వసంత పూర్ణిమ

వసంత పూర్ణిమ


ఒక దివ్యకుసుమమ్ము వికసించినది నేడు
             నాడూ నేడూ రేపు
             నవ పరిమళాలలము.

ఒక దివ్యనాదమ్ము కకుబంతముల చరించు
             కోటి వీణల శ్రుతులు
             మీటుతూ పాడుతూ.

ఒక దివ్యవర్ణమ్ము సకల శూన్యాలలమె
             గంభీర చిత్రాలు
             గా రూపమెత్తుతూ.

ఓ పాల్గుణ పవిత్ర పరమ శోభాపూర్ణి
            మా రాత్రి నాదేవి
            మంగళాకృతి వచ్చె !

నాఎదుట నాదేవి నాశశికళే నిల్చె
            నాకు నూతన శక్తి
            నాకు నూతన రక్తి !