యుగ్మము


అతడు : నీవు నేనే సఖీ!
ఆమె : నీవు నేనే సఖా !
అతడు : వర్తన మహానదీ పంకజోద్భవులమై
ఆమె : పై కెగసి పుల్లమౌ పద్మయుగ్మము మనము

అతడు : నీవు నేనే సఖీ !
ఆమె : నీవు నేనే సఖా !
అతడు : సకల ప్రజారణ్య సంజాతులము ప్రత్యు
ఆమె : షాకాశ గాయకులు భరతపక్షులము మనము

అతడు : నీవు నేనే దేవి !
ఆమె : నీవు నేనే ప్రభూ !
అతడు : ఈ మహానంత విశ్వైక పధగాములము
ఆమె : స్వేచ్ఛాప్రకాశ తారాద్వయమ్మును మనము !