శశికళ/పూలబాలిక
పూల బాలిక
పూల వనమున కలిసినామూ
నారాణి నేనూ
పూల పరిమళములో మెలిసినామూ !
పూల .......
పూలలో ఉదయించి
పూవులా తానిలిచి
పూలజల్లుల నన్ను
సోలించె నాదేవి !
పూల......
తనకొరకు నే వెదికి
జనపధములే తిరిగి
వనరు నా బ్రతుకులో
వనల లక్ష్మియై వచ్చె !
పూల......
తనవనము తానంట
తన పూలు తానంట
తన పూలగంధముల
నన తేనియలె తాను !
పూల......
నాసందిటను ఒదిగి
నన్ను వనమున త్రిప్పి
పూల పుప్పొడులలో
సోలు తన్నే చూపె
పూల......
ఏపూవు తాల్చినా
నా పొందిటను తానె
ఏగంధ మలదినా
ఏకమటనేఁ దాను
పూలవనమున కలసినామూ
నారాణి నేనూ
పూలపరిమళములో మెలిసినామూ !